సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా వాసికెక్కిన ఢిల్లీ నగరంలో దీపావళిని దృష్టిలో పెట్టుకొని కాలుష్యాన్ని నివారించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. నగర పరిధిలో బాణాసంచా అమ్మకాలను సుప్రీం కోర్టు నిషేధించింది. డీజిల్ వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే వాహనాల రాకపోకల సంఖ్యను నియంత్రించింది. బుధ, గురువారాల్లో నగరంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిలిపివేసింది. డీజిల్‌తో నడిచే జనరేటర్ల వాడకంపై నిషేధం విధించారు. వీటికి తోడు టపాసులను కాల్చవద్దంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేశాయి. ఈ చర్యల ఫలితం ఉందా? నగర కాలుష్యం ఏ మేరకు తగ్గిందా?
ప్రభుత్వ చర్యలు పాక్షికంగానే ఫలితాలనిచ్చాయని చెప్పవచ్చు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నగరంలో కాలుష్యం సగానికి సగం తగ్గింది. గతేడాది వాతావరణంలో ‘పీఎం–2.5’ స్థాయి గతేడాది 778 పాయింట్లకు చేరుకోవడంతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కాలుష్య నగరంగా ఢిల్లీని గుర్తించారు. ఈ పరిస్థితిపై పర్యావరణ పరిరక్షకవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం వాహనాల రాకపోకలను నియంత్రించడం, డీజిల్ వాహనాలను నిషేధించడం తదితర చర్యల వల్ల కొంతమేరకు కాలుష్యం తగ్గింది. ఈసారి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని భావించిన ప్రభుత్వం సకాలం తీసుకున్న చర్యల వల్ల వాతావరణంలో కాలుష్యం 200 పాయింట్ల స్థాయికి దిగివచ్చింది.
అయినప్పటికీ ఇది క్షేమదాయకం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల ప్రకారం వాతావరణంలో కాలుష్యం స్థాయి 25 పాయింట్లకు మించకూడదు. 200 పాయింట్లకు చేరిందంటే ఎనిమిది రెట్లు ఎక్కువ ఉన్నట్లే. భారత దేశంలో ఈ పాయింట్లు 300–500 పాయింట్ల మధ్యనుంచే అత్యంత ప్రమాదకర స్థాయిగా పేర్కొంటున్నారు. 500 పాయింట్లకు మించితే అది ఎంత ప్రమాదకరమో పేర్కొనే పద్ధతే లేదు. 500 పాయింట్లకు మించి పోదన్నతి గతంలో శాస్త్రవేత్తలు వేసిన అంచనా. ఇప్పుడు అనేక సార్లు ఢిల్లీ కాలుష్యం 500 పాయింట్లను దాటింది. ఈసారి బాణాసంచా కాల్పులను నగరంలో నియంత్రించినా పెద్దగా కాలుష్యం తగ్గలేదు. అందుకు కారణం నగరానికి సమీపంలోఉన్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట దుబ్బలను విరివిగా కాల్చివేయడం.
అధికారిక లెక్కల ప్రకారం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రతిఏటా 3.50 కోట్ల టన్నుల పంట దుబ్బలను తగులబెడతారు. ఇలా తగులబెట్టడంపై 2015 సంవత్సరం నుంచే దేశవ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ ఈ రెండు రాష్ట్రాల రైతులు వినిపించుకోవడం లేదు. ‘పంట దుబ్బలను మంటపెట్టకుండా వాటి రీసైక్లింగ్ కోసమో, మరో అవసరానికి ఉపయోగించేందుకు వాటిని మేము ఎక్కడికి తీసుకపోగలం? ఏం చేయగలం ? దుబ్బను తరలించేందుకు కూడా డబ్బులు ఖర్చుగావా?’ అని చివరి పేరును మాత్రమే చెప్పడానికి ఇష్టపడిని దేవి తెలిపారు. ఆమెది నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోనిపట్ గ్రామం. అంత దూరం నుంచే కాదు, ఉత్తరాది నుంచి వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా దుబ్బ తగులబెట్టిన కాలుష్యం నగరానకి వస్తోందని నాసా ఉపగ్రహం ఇటీవల తీసిన ఫొటోలు బయటపెట్టాయి. కాలుష్యం కారణంగా భారత్‌లో ఏటా పది లక్షల మంది మరణిస్తున్నారని అమెరికా గత ఫ్రిబవరిలో జరిపిన ఓ అధ్యయనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment