కాలుష్యానికి కళ్లెం ఎక్కడ? | SC, NGT launch probe into Delhi's air pollution problem | Sakshi
Sakshi News home page

కాలుష్యానికి కళ్లెం ఎక్కడ?

Published Wed, Nov 9 2016 2:44 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

కాలుష్యానికి కళ్లెం ఎక్కడ? - Sakshi

కాలుష్యానికి కళ్లెం ఎక్కడ?

కేంద్రంతోపాటు ఢిల్లీ, చుట్టుపక్కల రాష్ట్రాలపై ఎన్జీటీ ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని, చుట్టుపక్కల రాష్ట్రాల్లో నెలకొన్న కాలుష్యంతో కూడిన పొగమంచు నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే ఎలా? అని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మండిపడింది. వాతావరణ కాలుష్యాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారని ప్రశ్నించింది. ఢిల్లీని విషపు పొగమంచు చుట్టుముట్టి 5 రోజులవుతున్నా దాని నివారణకు కేంద్రం ఏ చర్యలూ తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. అసలు కాలుష్య నివారణకు తామిచ్చిన ఆదేశాలనే ఎవరూ చదవలేదంది. బుధవారం నాటికి వాతావరణ కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.  

ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని బెంచ్ పంట దహనంపై తామిచ్చిన ఆదేశాలను అమలు చేయనందుకు ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ పర్యావరణ, పట్టణాభివృద్ధి శాఖల కార్యదర్శులను తప్పుబట్టింది. తామిచ్చిన తీర్పులన్నింటినీ చదివి, విశ్లేషించి వాటిని అమలు చేయడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని వారిని ఆదేశించింది. ‘దీపావళి, పంటల దహనం వల్ల కాలుష్యం పెరుగుతుందని తెలుసు కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్‌లలో ఏమైనా సమావేశాలు నిర్వహించారా? ధూళిని తగ్గించేందుకు హెలికాప్టర్ల ద్వారా కాకుండా క్రేన్లతో ఎందుకు నీళ్లు చల్లుతున్నారు?’ అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పంటల దహనంపై చర్యలు తీసుకోనందుకు ఢిల్లీ, పొరుగు రాష్ట్రాలపై  విరుచుకుపడింది.  కాగా, కాలుష్య నివారణకు తాత్కాలిక చర్యగా ఢిల్లీ, రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో నిర్మాణపు పనులపై ఎన్జీటీ వారం పాటు నిషేధం విధించింది.
 
48 గంటల్లో చెప్పండి: సుప్రీం
ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో 48 గంటల్లో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎకే సిక్రి, జస్టిస్ ఎస్‌ఏ బోడేల బెంచ్ ఢిల్లీలో నెలకొన్న కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టింది.  ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని 48 గంటల్లో తమకు తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement