సాక్షి, హైదరాబాద్: కాలుష్య కాసారంగా మారిన గంగానదిని ప్రక్షాళన చేసేందుకు కేంద్రం నడుం బిగించినట్లే.. దక్షిణ గంగగా పేరున్న గోదావరిని పవిత్రం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్ర పరీవాహకంలో కాలుష్య కోరల్లో చిక్కుకున్న గోదావరికి పునరుజ్జీవం పోసి కొత్త ఊపిరిలూదే కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేసింది. బాసర మొదలు భద్రాచలం వరకు 500 కిలోమీటర్ల మేర నదిని శుద్ధి చేసి, దాన్ని మున్ముందు పవిత్రంగా ఉంచేలా పకడ్బందీ కార్యాచరణ రూపొందించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలు, కేంద్ర సూచనల నేపథ్యంలో గోదావరిని కలుషితం చేస్తున్న మురుగు, పరిశ్రమల కాలుష్యం, ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్‌పెట్టి పునరుజ్జీవం చేయనుంది.
నీటి నాణ్యత దయనీయం..
గోదావరి నది తీరం పొడవు 1,495 కిలోమీటర్లు కాగా, దీని పరీవాహకం 3.12లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో బాసర నుంచి భద్రాచలం వరకు 500 కి.మీ.ల మేర ప్రయాణిస్తున్న గోదావరిలో 4 ఉప నదులు, 54 నాలాలు కలుస్తున్నాయి. నది పరీవాహక ప్రాంతంలో ఉన్న 19 ప్రధాన పట్టణాల నుంచి గోదావరిలో అవ్యవస్థీకృత వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం భద్రాచలంలో మురుగునీటి శుద్ధి కేంద్రం లేకపోవడంతో ఆ నీరంతా బూర్గంపహాడ్ వద్ద నదిలో కలుస్తోంది. ఐటీసీ కాగితపరిశ్రమ నుంచీ కలుషిత జలాలు వస్తున్నాయి. మంచిర్యాల పట్టణ మురుగునీరు రాళ్లవాగు ద్వారా గోదావరిలో చేరుతోంది. నీటిలో కరిగిఉన్న ఆక్సిజన్ (డీఓ) పరిమాణం క్రమంగా తగ్గుతోంది. డీఓ పరిణామం లీటర్‌కు కనీసం 4 మిల్లీగ్రాములు ఉండాలి. కానీ ఇది క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక నీటిలో బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) లీటర్‌కు 3 గ్రా. మించొద్దని నిబంధనలు ఉన్నా.. ప్రస్తుతం నదిలో బీవోడీ స్థాయి 4 నుంచి 9 గ్రాములు/లీ. వరకు ఉంది. దీంతో నదిలోని నీటిని తాగేందుకు కానీ, స్నానాలకు కానీ వాడేందుకు పనికి రావు. డీవో తగ్గేకొద్దీ బీఓడీ పెరుగుతూ వస్తోంది. ఇవే పరిస్థితులు కొనసాగితే మున్ముందు జలచరాలకు తీవ్ర గడ్డు పరిస్థితులు తలెత్తడంతో పాటు సాగు అవసరాలను తీర్చడం గగనంగా మారనుంది.
మురుగు ముంచేస్తోంది..
నది పరీవాహకంలోని 54 మురుగు కాల్వల ద్వారా మురుగు గోదావరిలోకి ప్రధానంగా వచ్చి చేరుతోంది. మొత్తం పరీవాహక ప్రాంతంలో 54 ప్రధాన పట్టణాల్లో 22.57 లక్షల మేర జనాభా ఉండగా ఇక్కడ రోజుకు 249.81 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ పర్ డే) మేర నీరు వినియోగిస్తున్నారు. అందులో 199.96 ఎంఎల్‌డీ మురుగు నదిలో చేరుతోంది. ఇందులో 10 ఎంఎల్‌డీ కన్నా ఎక్కువగా తుంగిని (34.58 ఎంఎల్‌డీ), మంచిర్యాల (25.22 ఎంఎల్‌డీ), సింగారెడ్డిపల్లి (25.02ఎంఎల్‌డీ), బొర్నాపల్లి(16.83 ఎంఎల్‌డీ), బూర్గంపాడ్ (16.9 ఎంఎల్‌డీ), కోటిలింగాల (11.59 ఎంఎల్‌డీ) వంటి నాలాల ద్వారా నదిలోకి పెద్ద ఎత్తున మురుగునీరు చేరుతోంది. రోజుకు 6,75,586 కేజీల ఘన వ్యర్థాలు నదిలో చేరుతుండటం మరింత సమస్యగా మారుతోంది. దీనికి తోడు పరీవాహకం వెంబడి ఉన్న 244 పరిశ్రమల ద్వారా 8,825 కేఎల్‌డీల వ్యర్థాలు నదిలో చేరుతున్నాయి.
మార్గం చూపిన కేంద్రం..
దేశవ్యాప్తంగా కాలుష్యం బారిన పడుతున్న నదులు 351 వరకు ఉండగా అందులో గోదావరి ఒకటని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గుర్తించింది. ఈ నదిలో ప్రమాణాలకు అనుగుణంగా నీటి నాణ్యత లేదని, ఈ దృష్ట్యా శుద్ధి చేయని వ్యర్ధాలు, ఘన వ్యర్థాలు రాకుండా చూడాలని, పరీవాహకంలో అక్రమాలను నిరోధించి, అక్రమ మైనింగ్‌ను అడ్డకుని నదికి పునరుజ్జీవం పోయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, నీటి పారుదల శాఖ, పర్యావరణ, అటవీ శాఖలు సంయుక్తంగా గోదావరి పునరుజ్జీవనానికి ప్రణాళికలు రూపొందించాయి. బాసర దగ్గరలోని కందుకుర్తి నుంచి భద్రాచలం దగ్గరున్న బూర్గంపహాడ్ వరకు నది తీర ప్రాంతాన్ని శుద్ధి చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా మొదటి దశలో నది కాలుష్య కారకాల గుర్తింపు, రెండో దశలో సమస్యకు తగిన పరిష్కారం చూపడం, దాన్ని అమలుచేయాలని, మూడో దశలో నది సంరక్షణ చర్యలు చేపట్టి, దాని అభివృద్ధికి చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రచించాయి.
ప్రస్తుతం పరీవాహక పట్టణాల్లో మొత్తం 73 ఎంఎల్‌డీ సామర్థ్యమున్న మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) ఉండగా, మరో 19 చోట్ల కొత్తగా ఎస్టీపీలు నిర్మించాలని నిర్ణయించాయి. వీటితో పాటు కాలుష్య నియంత్రణకు కొన్ని నిబంధనలను రూపొందించి, వాటిని కచ్చితంగా పాటించేలా మార్గదర్శకాలు తయారుచేశాయి. వీటిని కచ్చితంగా అమలు చేసేలా ఆయా శాఖలు బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించాయి.
రూపొందించిన మార్గదర్శకాలు
- పారిశ్రామిక, గృహ సంబంధ వ్యర్థాలను నియంత్రించడంతో పాటు, శుద్ధి చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- పారిశ్రామిక వ్యర్థాలను తీవ్రత ఆధారంగా వర్గీకరించి, శుద్ధి చేయాలి.
- నది పరీవాహక ప్రాంతాలను గుర్తించి గృహ వ్యర్థాల పరిమాణాన్ని అంచనా వేయాలి. బహిరంగ మల విసర్జనతో పాటు,బహిరంగ చెత్త వేయడాన్ని నివారించాలి.
- ఎక్కువగా మురుగు ఉత్పత్తికి కారణమవుతున్న పట్టణాలు,గ్రామాలను గుర్తించి ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి.
- నది వ్యర్థాలు కలిసే చోట ఈటీపీలు ఏర్పాటు చేయాలి.
- ఎన్టీపీసీ, టీఎస్‌జెన్‌కోలు ఉన్న ప్రాంతాల్లో కర్మాగారాల నుంచి వెలువడే బూడిద నియంత్రణకు సరైన యాంత్రీకరణ ఉండాలి.
- ప్రతి ఆస్పత్రిలో తక్కువ వ్యయంతో వారి పరిసరాల్లో ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి. ఇలా శుద్ధి చేసిన నీళ్లను పూల తోటల పెంపకానికి పునర్వినియోగించాలి.
- గోదావరి పరీవాహకంలోని పరిశ్రమలన్నీ భూగర్భ జల వనరుల శాఖ అనుమతిలేనిదే యథేచ్ఛగా వ్యర్థాలు విడుదల చేయొద్దు.
- పట్టణాలు, గ్రామాల నుంచి ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింVŠ æచేయాలి. లేదంటే సమీపంలోని పవర్‌ప్లాంట్‌లకు లేదా బట్టీలకు పంపాలి.
- నది పరీవాహకం వెంబడి ఎస్టీపీల పనితీరును, సరస్సుల పునరుజ్జీవనాన్ని పర్యవేక్షించాలి. ప్రతి విద్యా సంస్థ విద్యార్థులకు నది కాలుష్యంపై బోధించాలి.
- వరద జలాలు శుద్ధి జరిగాకే నదుల్లో కలిసేలా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment