అగ్గిపుల్లలతో ఐఎస్ ఉగ్రవాదుల బాంబులు!
ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఉగ్రవాదులు గత ఏడు నెలలుగా అగ్గిపుల్లల్లోను, దీపావళి టపాసుల్లోను ఉపయోగించే రసాయనాలు సేకరించి.. వాటితో బాంబులు తయారుచేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు వీటిని వాడాలని వాళ్లు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. వాళ్ల వద్ద స్వాధీనం చేసుకున్న బాంబుల్లో పొటాషియం క్లోరేట్, పొటాషియం నైట్రేట్ లాంటి రసాయనాలు ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. పొటాషియం క్లోరేట్‌ను అగ్గిపుల్లల చివర ఉండే మందులో వాడతారు. పొటాషియం నైట్రేట్‌ను దీపావళి సామగ్రి తయారీలో విరివిగా వాడతారు. ఆన్‌లైన్ నియామకాల ద్వారా ఐఎస్ఐఎస్‌లో చేరినట్లు అనుమానించిన 16 మందిని ఎన్ఐఏ ఇటీవలే అరెస్టు చేసింది. వాళ్ల వద్ద స్వాధీనం చేసుకున్న బాంబుల్లో ఈ రెండూ ఉన్నాయి.
అంతకుముందు అమోనియం నైట్రేట్‌ను ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. తర్వాతి కాలంలో దాని అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణలు విధించింది. దాంతో ఇప్పుడు ఈ పదార్థాలపై ఉగ్రవాదుల కన్నుపడింది. ఐఎస్ మాడ్యూలుకు నాయకత్వం వహిస్తున్న ముదాబిర్ ముష్తాక్ షేక్.. తన అనుచరులకు అగ్గిపెట్టెలు, దీపావళి మందులు భారీ మొత్తంలో సేకరించాలని చెప్పాడు. వాటి నుంచి బాంబులు ఎలా చేయాలో అతడే నేర్పించాడని అంటున్నారు. ముంబై, హైదరాబాద్ నగరాల్లో అరెస్టుచేసిన వాళ్ల నుంచి ఐడీడీలు తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలు, టైమర్లను కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. అల్ కాయిదాకు చెందిన 'ఇన్‌స్పైర్' అనే ఆన్‌లైన్ పత్రికలో నాటు బాంబుల నుంచి ఐఈడీల వరకు ఎలా తయారుచేయాలో నేర్పిస్తున్నారు.