match sticks
-
ప్రాణం తీసిన అగ్గిపుల్ల, చూస్తుండగానే ఘోరం
నిజాంసాగర్(జుక్కల్): బీడీ కాల్చేందుకు వెలిగించిన అగ్గిపుల్ల ప్రాణాలనే తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రానికి చెందిన తాటివార్ బాలరాజ్ (35) శనివారం మధ్యాహ్నం తన చెల్లెలు సోని కిరాణా దుకాణానికి వెళ్లాడు. దుకాణంలో ముగ్గురు చిన్నపిల్లలు ఉండటంతో బాలరాజ్ పెట్రోల్ డబ్బాల పక్కన కింద కూర్చున్నాడు. అనంతరం అగ్గిపుల్ల వెలిగించి బీడీ అంటించుకున్నాడు. ఆ తర్వాత అగ్గిపుల్లను పారవేసే క్రమంలో అది పెట్రోల్ డబ్బాలపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బాలరాజ్‌కు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న బాలరాజ్ హాహాకారాలు చేస్తూ కింద పడిపోయాడు. చుట్టుపక్కల వారు, అటు వైపు వచ్చిన వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అందరూ చూస్తుండగానే బాలరాజ్ సజీవదహనం అయ్యాడు. ప్రమాద సమయంలో కిరాణా దుకాణంలో ఉన్న పిల్లలు భయంతో బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్.ఐ దత్తాత్రిగౌడ్ తెలిపారు. చదవండి: యువతి కిడ్నాప్; ఆపై అత్యాచారం -
అగ్గి పుల్లలతో రథం తయారీ
భువనేశ్వర్/ఖుర్దారోడ్ : స్వామి పట్ల భక్తి శ్రద్ధల్ని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ప్రదర్శిస్తున్నారు. జగన్నాథుని రథయాత్ర అంటే విశ్వ వ్యాప్త భక్తులందరికీ పండగే. ఈ పంథాలో ఖుర్దారోడ్ గోపీనాథ్‌పూర్ ప్రాంతంలో ఉంటున్న లింగాల ఈశ్వర రావు అగ్గి పుల్లలతో చూడ చక్కని రథాన్ని ఆవిష్కరించాడు. ఆ రథానికి తగినంత పరిమాణంలో కనులకు ఆకట్టుకునే జగన్నాథుని విగ్రహం కూడా అగ్గి పుల్లలతోనే తయారు చేసి అమర్చాడు. మహరణ సేవకులు నిర్మించే రథాల తరహాలో ఈ అగ్గి పుల్లల రథానికి సమ పరిమాణంలో చక్రాల్ని కూడా అమర్చాడు. దీంతో ఈ బుల్లి అగ్గి పుల్లల రథం చకచకా అటు ఇటు తిరుగుతోంది. ఈ రథం ఎత్తు 4.5 అంగుళాలు కాగా విగ్రహం 0.5 అంగుళాలు ఎత్తు ఉందని ఆవిష్కర్త పేర్కొన్నాడు. ఈ బుల్లి రథం, విగ్రహం తయారీలో మొత్తం 387 అగ్గి పుల్లలను వినియోగించాడు. రథం, విగ్రహాన్ని ఫ్యాబ్రిక్ రంగులతో చిత్రీకరించాడు. ఈశ్వరరావు కళకు అబ్బురపడిన స్థానికులు అభినందిస్తున్నారు. -
అగ్గిపుల్లలతో ఐఎస్ ఉగ్రవాదుల బాంబులు!
ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఉగ్రవాదులు గత ఏడు నెలలుగా అగ్గిపుల్లల్లోను, దీపావళి టపాసుల్లోను ఉపయోగించే రసాయనాలు సేకరించి.. వాటితో బాంబులు తయారుచేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు వీటిని వాడాలని వాళ్లు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. వాళ్ల వద్ద స్వాధీనం చేసుకున్న బాంబుల్లో పొటాషియం క్లోరేట్, పొటాషియం నైట్రేట్ లాంటి రసాయనాలు ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. పొటాషియం క్లోరేట్‌ను అగ్గిపుల్లల చివర ఉండే మందులో వాడతారు. పొటాషియం నైట్రేట్‌ను దీపావళి సామగ్రి తయారీలో విరివిగా వాడతారు. ఆన్లైన్ నియామకాల ద్వారా ఐఎస్ఐఎస్లో చేరినట్లు అనుమానించిన 16 మందిని ఎన్ఐఏ ఇటీవలే అరెస్టు చేసింది. వాళ్ల వద్ద స్వాధీనం చేసుకున్న బాంబుల్లో ఈ రెండూ ఉన్నాయి. అంతకుముందు అమోనియం నైట్రేట్‌ను ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. తర్వాతి కాలంలో దాని అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణలు విధించింది. దాంతో ఇప్పుడు ఈ పదార్థాలపై ఉగ్రవాదుల కన్నుపడింది. ఐఎస్ మాడ్యూలుకు నాయకత్వం వహిస్తున్న ముదాబిర్ ముష్తాక్ షేక్.. తన అనుచరులకు అగ్గిపెట్టెలు, దీపావళి మందులు భారీ మొత్తంలో సేకరించాలని చెప్పాడు. వాటి నుంచి బాంబులు ఎలా చేయాలో అతడే నేర్పించాడని అంటున్నారు. ముంబై, హైదరాబాద్ నగరాల్లో అరెస్టుచేసిన వాళ్ల నుంచి ఐడీడీలు తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలు, టైమర్లను కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. అల్ కాయిదాకు చెందిన 'ఇన్స్పైర్' అనే ఆన్లైన్ పత్రికలో నాటు బాంబుల నుంచి ఐఈడీల వరకు ఎలా తయారుచేయాలో నేర్పిస్తున్నారు.