దీపావళి మోతలు తగ్గాయి!
దీపావళి మోతలు తగ్గాయి!
Published Mon, Oct 31 2016 12:31 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM
దీపావళికి టపాసులు కాలుస్తుంటే విషవాయువులు వెలువడతాయని, అందువల్ల దీపాల పండుగలాగే దీపావళిని చేసుకోవాలని ఈసారి విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికితోడు చైనాలో తయారైన టపాసులకు మేడిన్ ఇండియా అనే స్టాంపు తగిలించి అమ్మేస్తున్నారని, వాటిలో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నారని కూడా వాట్సప్ లాంటి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. వాటన్నింటి ఫలితమో ఏమోగానీ ఈసారి చాలావరకు దీపావళి టపాసుల మోతలు తగ్గాయట. ప్రధానంగా ముంబై నగరం గురించే చెప్పినా.. హైదరాబాద్‌లో కూడా చాలావరకు ఈ ప్రభావం కనిపించింది. ఏవో కొన్ని ప్రాంతాల్లో తప్ప చాలావరకు నగరంలో మోతలు గణనీయంగా తగ్గాయి. ఇంతకుముందు అర్ధరాత్రి వరకు టపాసుల మోతలు వినిపిస్తూనే ఉండేవని, చుట్టుపక్కల అంతా పొగమేఘం కమ్ముకునేదని, కానీ ఈసారి రాత్రి 10 గంటలలోపే మొత్తం ఆగిపోయాయని ఎల్బీనగర్, హయత్‌నగర్ పరిసర ప్రాంతాల వాసులు తెలిపారు.
ముంబై మహానగరంలో అధిక శబ్దాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సుమైరా అబ్దులాలీ కూడా ఇదే మాట చెప్పారు. గత కొన్నేళ్లుగా.. అర్ధరాత్రి వరకు టపాసుల మోతలతో నరకం అనుభవించామంటూ నగర పౌరుల నుంచి తనకు లెక్కలేనన్ని ఫిర్యాదులు వచ్చేవని, కానీ ఈసారి మాత్రం కేవలం ఐదారు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు. పిల్లల్లో అవగాహన పెరగడం వల్ల కూడా ఈసారి దీపావళికి మందుల మోతలు తగ్గాయని చెబుతున్నారు. ముంబైవాసులు అధిక శబ్దాల వల్ల ఆరోగ్యానికి జరిగే ప్రమాదాన్ని తెలుసుకున్నారని ఆమె ఆనందంగా చెప్పారు.
హీరో చెప్పాడని..
ఇటీవల విడుదలైన జనతా గ్యారేజ్ సినిమాలో కూడా.. హీరో ఎన్టీఆర్ దీపావళి మందులు కాల్చొద్దని, దీన్ని దీపాల పండుగలాగే చేసుకోవాలని నిత్యామీనన్, ఆమె స్నేహితురాళ్లకు చెబుతాడు. దాని ప్రభావం కూడా కొంతవరకు కనిపించినట్లే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి దీపావళి టపాసుల అమ్మకాలు కూడా చాలావరకు తగ్గాయని వ్యాపారవేత్తలు చెబుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 40-50 శాతం మాత్రమే అమ్మకాలు జరిగినట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెరగడం, పిల్లలు కూడా ఇంతకుముందులా ఎక్కువ మొత్తంలో టపాసులు కావాలని మారాం చేయకపోవడం లాంటి కారణాల వల్ల కాలుష్యం తగ్గినట్లు చెబుతున్నారు.
వర్షం చేసిన పుణ్యం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం, రాత్రి వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి కొన్ని ప్రాంతాల్లోను, రాత్రి 9 గంటల నుంచి మరికొన్ని ప్రాంతాల్లోను వర్షం పడింది. అప్పటివరకు టపాసులు కాల్చిన పొగ మొత్తం ఆకాశంలో కమ్ముకుంటున్న తరుణంలో సరిగ్గా ఈ వర్షం కురవడంతో.. కాలుష్యం మొత్తం వర్షపు నీళ్లలో కొట్టుకుపోయింది. దానివల్ల కలుషిత వాయు ప్రభావం కూడా చాలావరకు తగ్గిందని చెబుతున్నారు.
Advertisement