rain in hyderabad
-
వణికిస్తున్న చలి.. పలుకరించిన చిరుజల్లులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మబ్బులు కమ్మి ఉండటంతో పలు ప్రాంతాల్లో సూర్యుడి దర్శనం కనిపించలేదు. దీంతో చలి తీవ్రత పెరిగింది. దీనికి తోడు చిరుజల్లులు పలుకరించాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్‌లో చిరుజల్లులు కురిశాయి. అటు అంబర్పేట్, నాగోల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, తదితర ప్రాంతాల్లోనూ చిరుజల్లులు పడ్డాయి. చలికితోడు చిరుజల్లులు పలుకరించడంతో నగరవాసులు మరింతగా చలికి వణికిపోయారు. -
కుండపోత వర్షం.. జీహెచ్ఎంసీ భారీ చర్యలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. సహాయక చర్యలకోసం ఏకంగా 384 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఇందులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందిన 13 ప్రత్యేక డిజాస్టర్ రెస్క్యూ బృందాలు కూడా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా వర్ష ప్రభావాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్లు మంగళవారం రాత్రి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బందికి సూచనలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ నెంబర్ 040- 21111111 ఫోన్ చేయాలని ప్రజలకు విజ్జప్తి చేశారు. మరోవైపు జోనల్ కమిషనర్లతో కమిషనర్ లోకేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారిని అప్రమత్తం చేశారు. (చదవండి : హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం) భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ చేపట్టిన చర్యలు మినీ మొబైల్ ఎమర్జెన్సీ బృందాలు (120): టాటాఏస్, లేదా ఓమ్నీ వ్యాన్, జీప్తో నలుగురు లేబర్లు ట్రీ కట్టర్, పంప్, గొడ్డళ్లు, క్రోబార్స్ తదితర పరికరాలతో ఉంటారు. మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు(38): ప్రతి ఇంజనీరింగ్ డివిజన్‌కు ఒక మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాన్ని కేటాయించారు. దీనిలో డి.సి.ఎం వ్యాన్‌లో ఐదుగురు లేబర్లు, ఒక జనరేటర్, నీటిని తొలగించే పంపులు, చెట్లను కట్‌చేసే మిషన్లు ఇతర పరికరాలతో సిద్దంగా ఉంటారు. సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలు (15): సెంట్రల్ కంట్రోల్ రూంలో 15 ఎమర్జెన్సీ బృందాలను అందుబాటులో ఉంచారు. ప్రతి బృందంలో డి.సి.ఎం వ్యాన్, ఐదుగురు లేబర్లు, ఒక జనరేటర్, నీటిని తొలగించే పంపులు, చెట్లను కట్‌చేసే మిషన్లు ఇతర పరికరాలతో సిద్దంగా ఉంటారు. స్థానిక ఎమర్జెన్సీ బృందాలు (132): నగరంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ బృందాలను స్థానికంగా నియమించారు. నలుగురు కార్మికులు, పలు పరికరాలతో ఉండి నాలాల్లో నీటి ప్రవాహాన్ని నిలువరించే ప్లాస్టిక్ కవర్లను తొలగించడం చేపడుతారు. వీటితో పాటు నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించడానికి 255 పంపులను సిద్దంగా ఉంచారు. -
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం..
సాక్షి, హైదరాబాద్ : నగరాన్ని భారీ వర్షం వణికిస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం కాస్తా తెరపి ఇచ్చినా.. సాయంత్రానికి మళ్లీ భారీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాలలో వాన దంచి కొడుతోంది. ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, అబిడ్స్, కోఠీ, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, మీర్పేట్, వనస్థలిపురం, ఎల్బీనగరలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు గంటల పాటు బయటకు రావొద్దు .. జీహెచ్ఎంసీ హెచ్చరిక వర్షాలపై అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు.. ప్రజలకు పలు సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. నగరంలో మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారుల తెలిపారు.రానున్న రెండు గంటల పాటు ఉద్యోగులు కార్యాలయాల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 13 డిజాస్టర్ రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేశామన్నారు. నీటి నిల్వలు ఎప్పటికప్పుడు తొలగించేందుకు 255 పంపలు సిద్ధం చేశామన్నారు. జీహెచ్ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ఏమైన సమస్యలు ఉంటే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-21111111, ఎమర్జెన్సీ 100 కి కాల్ చేయాలని సూచించారు. -
హైదరాబాద్‌లో కుండపోత.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌ను కుండపోత వర్షం ముంచెత్తింది. నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మధ్య మధ్యలో కాసేపు విరామం ఇచ్చిన రాత్రి వరకు వర్షం పడుతూనే ఉంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా నీరు చేరడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓ వైపు ట్రాఫిక్ జామ్, మరోవైపు వర్షం పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోడ్లను వరద ముంచెత్తడంతో.. కొన్ని చోట్ల టువీలర్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షం కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే రోడ్లపై చేరిన నీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న మేయర్ బొంతు రామ్మోహన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లోతట్టు ప్రాంతాల పరిస్థితులను పరిశీలిస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు కవాడిగూడలో 7.4, నాంపల్లిలో 7, బంజారాహిల్స్‌లో 6.7, ఖైరతాబాద్‌లో 6.6, తిరుమలగిరిలో 6.2, కాప్రాలో 5.9, సికింద్రాబాద్‌లో 5.8 సెం.మీల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి వాహనదారులకు పలు సూచనలు చేశారు. రోడ్లపై భారీగా నీరు ఉన్నందున.. వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వారికి ఏదైనా సమస్య తలెత్తితే 100కి ఫోన్ చేసి సమాచారమివ్వాలని సూచించారు. అలాగే వాహనదారులు తమ ఇళ్లకు క్షేమంగా చేరుకోవడానికి పోలీసులు తగిన సహాయం అందించాలని ఆదేశించారు. (హైదరాబాద్ ను కుదిపేసిన జడివాన.. దృశ్యాల కోసం... క్లిక్ చేయండి) -
మెరుపొచ్చె.. వానొచ్చె..
-
జలదిగ్బంధనంలో సిటీ, రంగంలోకి కేటీఆర్
హైదరాబాద్: జంట నగరాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలో భారీగా వర్షం పడుతుండటంతో రోడ్లపై వరదనీరు పెద్ద ఎత్తున నిలిచింది. దీంతో పలుచోట్ల రోడ్లపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. నగరంలోని వర్షబీభత్సం నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు వెంటనే రంగంలోకి దిగారు. నగరంలోని పరిస్థితిపై అధికారులతో ఆయన చర్చించారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముంచెత్తిన వాన.. నగరంలోని పలు ప్రాంతాలను వరుణుడు గురువారం ఉదయం ముంచెత్తాడు. వర్షం కారణంగా అంబర్పేట్ 6 నంబర్ రోడ్, తాజ్ ఐలాండ్, బేగంబజార్ పీఎస్, పుత్లిబౌలి, సీబీఎస్ బస్ స్టేషన్, అమీర్‌పేట్, ఇమేజ్ హాస్పిటల్ రోడ్డు, కేసీపీ జంక్షన్, నిమ్స్, తార్నాక, గోల్నాక, పాత గాంధీ ఆస్పత్రి, నింబోలి అడ్డా, మలక్‌పేట్ యశోద ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. హయత్‌నగర్‌లోని కోర్టులోకి, ఫైర్స్టేషన్లోకి వర్షపునీరు చేరుకుంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. సింకింద్రాబాద్, పంజాగుట్ట, ఉప్పల్, ఎల్బీనగర్, జుబ్లీహిల్స్, అబిడ్స్, మాదాపూర్, శేరిలింగంపల్లి, మియాపూర్, దిల్సుఖ్నగర్, పాతబస్తీ, ఖైరతాబాద్, చైతన్యపురి, కొత్తపేటలోని పలు ప్రాంతాలు వర్షం ధాటికి జలమయమయ్యాయి. సరూర్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్, గచ్చిబౌలి, కొండాపూర్, కుత్బుల్లాపూర్, కోఠి, గోషామహల్, పాతబస్తీ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. దీంతో పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు బిక్కుబిక్కు! భారీ వర్షం కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం గురువారం పలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఇక వనస్థలిపురంలో ప్రహారి గోడ కూలి ఒక మహిళకు తీవ్రగాయాలయ్యాయి. -
భగభగల మధ్య హైదరాబాద్‌లో భారీ వర్షం!
హైదరాబాద్: భానుడి భగభగలతో అల్లాడుతున్న నగరవాసులకు అనుకోనిరీతిలో ఊరట లభించింది. అనూహ్యరీతిలో మంగళవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం ముంచెత్తింది. సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌లో వడగళ్ల వాన కురిసింది. కూకట్పల్లి, బాలానగర్, భరత్‌నగర్, సనత్‌నగర్, ఎస్సార్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. కూకట్పల్లి కేపీహెచ్బీలో వడగళ్ల వాన కురిసింది. ఈదురుగాలులు దుమారం రేపాయి. అనుకోకుండా పలుకరించిన వానతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు ఎండ, ఉక్కపోతతో అల్లాడిన నగర వాసులు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో కాస్తా సేదదీరారు. పాతబస్తీలోని పలు చోట్ల, రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు మండలలోనూ వర్షం కురిసింది. -
దీపావళి మోతలు తగ్గాయి!
దీపావళికి టపాసులు కాలుస్తుంటే విషవాయువులు వెలువడతాయని, అందువల్ల దీపాల పండుగలాగే దీపావళిని చేసుకోవాలని ఈసారి విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికితోడు చైనాలో తయారైన టపాసులకు మేడిన్ ఇండియా అనే స్టాంపు తగిలించి అమ్మేస్తున్నారని, వాటిలో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నారని కూడా వాట్సప్ లాంటి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. వాటన్నింటి ఫలితమో ఏమోగానీ ఈసారి చాలావరకు దీపావళి టపాసుల మోతలు తగ్గాయట. ప్రధానంగా ముంబై నగరం గురించే చెప్పినా.. హైదరాబాద్‌లో కూడా చాలావరకు ఈ ప్రభావం కనిపించింది. ఏవో కొన్ని ప్రాంతాల్లో తప్ప చాలావరకు నగరంలో మోతలు గణనీయంగా తగ్గాయి. ఇంతకుముందు అర్ధరాత్రి వరకు టపాసుల మోతలు వినిపిస్తూనే ఉండేవని, చుట్టుపక్కల అంతా పొగమేఘం కమ్ముకునేదని, కానీ ఈసారి రాత్రి 10 గంటలలోపే మొత్తం ఆగిపోయాయని ఎల్బీనగర్, హయత్‌నగర్ పరిసర ప్రాంతాల వాసులు తెలిపారు. ముంబై మహానగరంలో అధిక శబ్దాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సుమైరా అబ్దులాలీ కూడా ఇదే మాట చెప్పారు. గత కొన్నేళ్లుగా.. అర్ధరాత్రి వరకు టపాసుల మోతలతో నరకం అనుభవించామంటూ నగర పౌరుల నుంచి తనకు లెక్కలేనన్ని ఫిర్యాదులు వచ్చేవని, కానీ ఈసారి మాత్రం కేవలం ఐదారు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు. పిల్లల్లో అవగాహన పెరగడం వల్ల కూడా ఈసారి దీపావళికి మందుల మోతలు తగ్గాయని చెబుతున్నారు. ముంబైవాసులు అధిక శబ్దాల వల్ల ఆరోగ్యానికి జరిగే ప్రమాదాన్ని తెలుసుకున్నారని ఆమె ఆనందంగా చెప్పారు. హీరో చెప్పాడని.. ఇటీవల విడుదలైన జనతా గ్యారేజ్ సినిమాలో కూడా.. హీరో ఎన్టీఆర్ దీపావళి మందులు కాల్చొద్దని, దీన్ని దీపాల పండుగలాగే చేసుకోవాలని నిత్యామీనన్, ఆమె స్నేహితురాళ్లకు చెబుతాడు. దాని ప్రభావం కూడా కొంతవరకు కనిపించినట్లే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి దీపావళి టపాసుల అమ్మకాలు కూడా చాలావరకు తగ్గాయని వ్యాపారవేత్తలు చెబుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 40-50 శాతం మాత్రమే అమ్మకాలు జరిగినట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెరగడం, పిల్లలు కూడా ఇంతకుముందులా ఎక్కువ మొత్తంలో టపాసులు కావాలని మారాం చేయకపోవడం లాంటి కారణాల వల్ల కాలుష్యం తగ్గినట్లు చెబుతున్నారు. వర్షం చేసిన పుణ్యం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం, రాత్రి వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి కొన్ని ప్రాంతాల్లోను, రాత్రి 9 గంటల నుంచి మరికొన్ని ప్రాంతాల్లోను వర్షం పడింది. అప్పటివరకు టపాసులు కాల్చిన పొగ మొత్తం ఆకాశంలో కమ్ముకుంటున్న తరుణంలో సరిగ్గా ఈ వర్షం కురవడంతో.. కాలుష్యం మొత్తం వర్షపు నీళ్లలో కొట్టుకుపోయింది. దానివల్ల కలుషిత వాయు ప్రభావం కూడా చాలావరకు తగ్గిందని చెబుతున్నారు.