‘మగ పురుగు’కూ జై!
మగపురుగు... ఇటీవల ప్రతివారూ విరివిగా వాడుతున్న మాట ఇది. కానీ... ఓ మగవాణ్ణి పురుగు అన్నప్పుడల్లా ఎంత నిజమో కదా అనిపిస్తుంటుంది. ఓ మగపురుగుకు అంజలి ఘటిస్తూ, నివాళులర్పిస్తూ... తనను మగపురుగుగా అభివర్ణిస్తున్నందుకు నిజంగా ప్రతి మగవాడూ గర్వించాల్సిన మాట అది.
పురుగు అంటే కీటకమని అర్థం. నిజమే... యదార్థ అర్థంలో తీసుకుంటే మగవాడు ఒక పురుగే. ఈ లోకంలోని చాలా మంది మగవాళ్లు మ్యాంటిస్ అనే కీటకంతో పోల్చదగ్గవారే. ఆడవాళ్ల తిట్లభాషలో చెప్పాలంటే పురుగుపుంగవులే.
ఆడపురుగు కోసం అపరిమితంగా తాపత్రయ పడే బతుకు ఆ మగపురుగుది. ఆ పురుగే... మ్యాంటీస్ మగపురుగు. ఆడదాని కోసం పడి చచ్చిపోయే ప్రేమ ఆ పురుగుది. దాని ప్రేమ ఎంత తీవ్రమంటే... దానితో కలిసి ఉన్న ఆ కొద్ది క్షణాలే తనకు నూరేళ్లనుకునే తృప్తి దానిది. ఆడదాని ఒక్క అనుగ్రహపు చూపు కోసం నూరేళ్లూ నిండుకునేలా చేసుకునే బతుకు దానిది. అంతటి నిస్వార్థపుది ఆ పురుగు!
తాను ముద్దిస్తే... తననే ముద్దగా మార్చుకొని ఆడపురుగు తినేస్తుంటే లెక్కచేయక తనను తాను ఆహారంగా అర్పించుకునే త్యాగ పురుగు... మా మ్యాంటీస్ మగ పురుగు. పైగా ‘ఆడదాని-ఆహారార్థం ఇదం శరీరం’ అంటూ తన ఒంటినే బిర్యానీగా ఆడపురుగుకు నైవేద్యం పెట్టే నిజమైన పురుగు... మా మంచి మగపురుగు!
ఆడదాన్ని చూస్తే మగాళ్లకు మతిపోతుంది అంటారు. నిజమే మతినీ, మెదడునూ పోగొట్టుకునే జాతి మగపురుగులది. దాంట్లోనూ ఎంత పరోపకారం అంటే... తనను తింటే తిన్నదిగానీ సృష్టికార్యం కాస్తా మధ్యలోనే దెబ్బతింటే ఎలాగన్న ఆదుర్దా మగపురుగుది. ఇలాగైతే భవిష్యత్తులో తన జాతి ఎక్కడ అంతరించిపోతుందో అన్న ఆందోళనతో మెదడును తల నుంచి మొలకు దిగజార్చుకున్న ఆ త్యాగ పురుగు... నిజంగానే నికార్సైన మగమహాపురుగు!!
వాస్తవం చెప్పాలంటే మానవ జన్మ ఎత్తాక, మగపుటక పుట్టాక మ్యాంటీస్‌లా బతికే పురుగులే ఈ లోకంలో ఎక్కువ. ఆ విషయం గ్రహించక... గ్రహించినా అంగీకరించక... మగాళ్లని పురుగులంటూ తిట్టే ఈ లోకంలోని పక్ష‘పాతకు’లందరికీ మా దండాలు.
- యాసీన్