జుట్టూ... టెంక మీద పీచు... ఏమిటీ లంకె? | Fun of the week: Why Coconet oil apply to head ? | Sakshi
Sakshi News home page

జుట్టూ... టెంక మీద పీచు... ఏమిటీ లంకె?

Published Sun, Jul 20 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

జుట్టూ... టెంక మీద పీచు... ఏమిటీ లంకె?

జుట్టూ... టెంక మీద పీచు... ఏమిటీ లంకె?

నవ్వింత: పొద్దున్నే మా బుజ్జిగాణ్ణి స్కూలుకు తయారు చేస్తూ వాడి తలకు కొబ్బరినూనె  రాస్తుంటే వాడు నన్ను ఓ ప్రశ్న అడిగాడు.
 ‘‘నానా... తలకు కొబ్బరినూనే ఎందుకు రాస్తారు? మిగతా నూనెలు ఎందుకు రాయరు?’’ అని వాడి సందేహం.  నేను జవాబిచ్చేలోపే మళ్లీ వాడే సమాధానం కూడా చెప్పాడు.  ‘‘నానా... జాగ్రత్తగా చూడు. పీచు ఊడదీసిన కొబ్బరి టెంక అచ్చం గుండులాగే ఉంటుంది. అలాగే దాని మీద పీచు అచ్చం చిందరవందరగా ఉన్నప్పటి నా  జుత్తులాగే ఉంటుంది. కాబట్టి కొబ్బరిలో పీచును పెంచే గుణమేదో ఉండొచ్చు. పీచులాగే మన జుట్టూ దట్టంగా గట్టిగా రావాలనే ఉద్దేశంతోనే కొబ్బరినూనే తలకు రాస్తారేమో నానా’’ అన్నాడు. కాస్తంత ఆలోచిస్తే వాడి లాజిక్ కూడా కరక్టేనేమో అనిపించింది. అయితే ఈలోపే మళ్లీ మరో ప్రశ్న వేశాడు వాడు. ‘‘అవునూ... పిసికి తినే రసాల మామిడి టెంక మీద కూడా పీచుంటుంది కదా. మరి మామిడికి సంబంధించినదేదీ తలకు రాయరెందుకు?’’ అంటూ మరో సంశయం వ్యక్తం చేశాడు వాడు.
 
 నేను బుర్రగోక్కుంటుండగానే మళ్లీ వాడే సమాధానం చెప్పాడు. ‘‘బహుశా... మామిడిలో రసాల రకాన్ని తిన్న తర్వాత కనిపించే పీచు ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశావా? అచ్చం బట్టతల మీద అక్కడక్కడా వేలాడే కాసిన్ని పోచల్లాగే ఉంటుంది. అందుకే మామిడి రసాలో లేదా అందులోంచి తీసిన ప్రోడక్టునో రాస్తే జుట్టు ఒత్తుగా రాదని కావచ్చు. ఒకవేళ అది బంగినపల్లి వెరైటీ మామిడి అయితే అసలు పీచే ఉండదు కదా. అందుకే కొబ్బరితోనూ, మామిడితోనూ... ఈ రెండింటితోనూ పచ్చడి చేసినా కొబ్బరినూనె తీసి ఎగస్ట్రాగా తలకు రాసుకుంటారన్నమాట’’ అంటూ వాడే వివరించాడు.
 
 ఏదేమైనా వాడి ఆలోచన ధోరణికీ, లాజిక్ పవర్‌కూ కాస్తంత ఆశ్చర్యపోయా. మహా రచయిత పతంజలి చెప్పినట్టు వాడి తలలో జ్ఞానమన్నది. కొబ్బరిబొండాంలో నీళ్లూరినట్టుగా ఊరుతోంది. కానీ అది కొబ్బరిబొచ్చెలో ఉన్నట్లు పదిలంగా ఉండాలన్నది నా కోరిక. కానీ అదే జ్ఞానం నూనెలో వేసిన పూరీలో ప్యాక్ చేసిన గ్యాస్‌లా ఉండొద్దన్నది నా అభిలాష. అదే విషయాన్ని తల దువ్వుతూ మావాడికి కాస్త తేలిక పదాలతో చెప్పా. ‘‘నానా... జ్ఞానమంటే కొబ్బరిబొండాంలో ఊరిన నీళ్లలాగో... నూనెలో వేసిన పూరీలో ఉబ్బిన గ్యాసులాగో పదిలంగా ఉండటం కాదు. నువ్వు అభిమానించే రచయిత చెప్పినట్టు అది అలా పదిలంగా ఉన్నా ప్రయోజనం లేదు నాన్నా’’ అన్నాడు. ‘‘మరేమిట్రా? వేలెడంత లేవు. నీకు జ్ఞానం, దాని ప్రయోజనం అన్నీ తెలుసా?’’ అంటూ మరోసారి ఆశ్చర్యపోతూ అడిగా. ‘‘ఎందుకు తెలియదూ... ఇప్పటి వరకూ నేనే కారణాలు ఆలోచించి, నేనే సమాధానాలూ వెతుక్కోలేదూ. అలాగే జ్ఞానం కొబ్బరిబొండాంలో నీళ్లలా ఒక ఊటలా ఊరుతుందని నువ్వు చెప్పగానే దాని ప్రయోజనం ఏమిటో నాకు అర్థమైపోయింది’’ అన్నాడు వాడు.
 ఇంతటి తాత్విక విషయాలపై నాకే ఒక అవగాహన రావడం లేదు. అలాంటిది పెద్ద పెద్ద విషయాలను చాలా తేలిగ్గా పరిష్కరిస్తున్న వాడి లాజిక్కు పట్ల నాకు అబ్బురం కలిగింది. కాస్తంత అహం అడ్డు వచ్చినా తెగించి అడిగా మరి జ్ఞాన ప్రయోజనం ఏమిట్రా అని. ‘‘నానా... జ్ఞానం కొబ్బరికాయలో నీళ్లలా ఊరితే దాన్ని స్ట్రాతో తాగేయాలి. పూరీలో గ్యాసులా ప్యాకయితే ఆ ఉబ్బు ఎప్పుడూ పదిలంగా ఉండాలని కోరుకోకూడదు. ఇలా జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఖాళీ చేసేస్తూ ఉండాలి.
 
 వేలితో జ్ఞానం ప్యాక్‌ను పొడిచేసి అటు పూరీనీ, ఇటు కొబ్బరికాయలోని కొబ్బరితో పచ్చడి చేసేసుకుని ఆ పచ్చడినీ... ఈ రెండింటినీ కలుపుకుని తినడమే అసలైన జ్ఞానం. అదే ఇప్పుడు అమ్మ నాతో ప్రాక్టికల్‌గా చేయించబోయే పని’’ అంటూ కొబ్బరి చెట్నీతో పూరీ తినేసి బ్యాగు వీపున వేసుకుని స్కూల్‌కు బయల్దేరాడు. ఆ టైమ్‌లో వాణ్ని చూస్తే వాడి తల మీద జుట్టంతా కొబ్బరిమట్టల్లా, వాడి మాటలన్నీ మామిడిముక్కల్లా అనిపించాయి. వాడి ఆలోచనల పట్ల నాలో గర్వం నూనెలో వేసిన పూరీలోని గాలిలా పొంగింది. కానీ... నా దిష్టే తగులుతుందేమోనని సదరు పూరీని వేలితో పొడిచేసుకుని, పూరీల, కొబ్బరి పచ్చళ్ల ప్రయోజనాన్ని తెలుసుకుని, ఈ రెంటినీ కలుపుకుని గబుక్కున నోట్లో పెట్టుకున్నా.
 - యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement