నవ్వింత: ఒక ఐడియా అడవినే మార్చేస్తుంది! | One idea can be changed entire forest | Sakshi
Sakshi News home page

నవ్వింత: ఒక ఐడియా అడవినే మార్చేస్తుంది!

Published Sun, May 25 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

నవ్వింత: ఒక ఐడియా అడవినే మార్చేస్తుంది!

నవ్వింత: ఒక ఐడియా అడవినే మార్చేస్తుంది!

మా బుజ్జిగాణ్ణి ఎలాగైనా డాక్టరును చేయాలన్న పట్టుదల నాది. ఏయే స్పెషలిస్టు ఎలాంటి చికిత్సలు చేయడానికి పనికొస్తాడో వాడికి ఉగ్గుపాలతోనే చెప్పేస్తే... నిగ్గు తేలిపోయి అన్నింటా నిష్ణాతుడైపోతాడన్నది నా ఆశ. అందుకే బోల్డంత తెలివిగా, అతి చాకచక్యంగా వాడికి తెలియకుండానే బయాలజీలూ, జువాలజీలూ వాడి మెదడులోకి ఇంకిపోయేలా చేస్తున్నా. యానిమల్ ప్లానెట్లూ, డిస్కవరీ ఛానెళ్లూ వాడికి తెలియకుండానే విరివిగా చూపిస్తున్నా. నేను పన్నుతున్న ఈ కుట్రను చూసుకుని నా తెలివితేటలకు నేనే ముచ్చటపడిపోతున్నా. పైగా ఇప్పుడున్న రొటీన్ కోర్సులు కాకుండా మెడిసిన్‌లోనే ఫ్యూచర్లో డిమాండ్ ఉంటే సరికొత్త కోర్సు ఏదైనా చేస్తే బాగుంటుందన్నది నా కోరిక. కానీ వాడు వైద్య, జంతు, వృక్ష ఇత్యాది పరిజ్ఞానాలు సంపాదించడం ఎలా ఉన్నా బోల్డన్ని సందేహాలతో నన్ను వేపుకు తినెయ్యడం పరిపాటిగా మారింది.  ‘‘మొసలిని అర్జెంటుగా కంటి స్పెషలిస్టుకూ, పనిలో పనిగా సైకియాట్రిస్టుకూ చూపిస్తే మంచిది నాన్నా’’ అంటూ ఉన్నట్టుండి అన్నాడు.
 
 ‘‘ఎందుకురా?’’ అయోమయంగా అడిగా. ‘‘ఎందుకంటే... మొసలి కన్నీళ్ల గురించి నువ్వేగా చెప్పావు. అయినా అది కన్నీళ్లు కారుస్తూ నటిస్తోందని నువ్వెలా చెప్పగలవు? ఏమో... దానికీ నిజంగా ఏమైనా దుఃఖమూ, బాధా ఉన్నాయేమో? అసలలా మొసలికి ఏడుపెందుకు వస్తుందో తెలుసుకుంటే దానికి తెలియకుండానే లోపల బాధ ఏదైనా ఉంటే దాన్ని దూరం చేయవచ్చు కదా అని నా అభిప్రాయం’’ అన్నాడు. మొసలి కళ్ల మాట ఎలా ఉన్నా మొదట నా కళ్లు బైర్లుగమ్మాయి. ఆ తర్వాత మసకలు గమ్మాయి. వాడి కళ్లకు అతితెలివి పొరలు గమ్మినట్లుగా తోచించి నాకు.
   
 మరికొన్నాళ్లకే ఇంకో షాక్ తగిలింది నాకు. ‘‘మాంసాహారం తింటే ఒళ్లు కొవ్వెక్కుతుందనే అభిప్రాయం తప్పని అనిపిస్తోంది నాన్నా. మటన్‌తో ఫ్యాట్ పెరగడం కేవలం అపోహే.’’ ‘‘ఛ...ఛ... మటన్ తింటే శరీరంలో కొవ్వులు పేరుకుపోతాయని ఎన్నెన్నో పరిశోధనల్లో ప్రూవ్ అయిందిరా. అయినా నీకెందుకిలా అనిపిస్తోంది?’’ ‘‘ఎందుకంటే... ఏనుగు చూడు. ప్యూర్ వెజిటేరియన్. ఎప్పుడూ ఆకులూ అలములూ తింటూ ఉంటుంది. అడవి దున్నలు చూడు... గడ్డీ గాదం తప్ప మరేవీ ముట్టవు. ఇక  ఖడ్గమృగాలంటావా... నెత్తిన కత్తి ఉండి కూడా దాంతో కత్తికో కండ కోయకుండా కేవలం గరికా పరిగా మేస్తాయి. పీచూ గీచూ తింటాయి. అయితే... శాకాహారం తినే ఆ జీవులే టన్నులకొద్దీ బరువు తూగుతాయి. కానీ... మాంసం తప్ప మరేదీ ముట్టని పులీ, సింహం, నక్కా, గిక్కా... బక్కగా ఉంటాయి.
 
 దీన్ని బట్టి తెలిసేదేమిటి? ఒబేసిటీ పెంచే పదార్థాలన్నీ వెజిటేరియన్ ఫుడ్డులోనే ఉన్నాయని అర్థం కావడం లేదూ? అందుకే నన్నడిగితే ఏనుగులన్నీ ఒకసారి ఏ ప్లాస్టిక్ సర్జన్‌నో కలిసి లైపోసక్షన్  చేయించుకుంటే మంచిది నాన్నా. లేదా ఏ బేరియాట్రిక్ సర్జన్‌నో కలిసి ఆకలి తగ్గే సర్జరీ చేయించుకున్నా బెటరే. అప్పుడవి కాస్త చురుగ్గా కదులుతూ, ఫాస్టుగా తిరుగుతూ ఆహారాన్ని ఇంకా చులాగ్గా, తేలిగ్గా సంపాదించుకోగలవు కదా. ఇక అడవులు తగ్గిపోతున్న ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న ఆ ఆహారమే అన్ని ఏనుగులకూ సరిపోయి వాటి సంఖ్యా పెరుగుతుంది. పైగా అవి జనావాసాల్లోకి వచ్చి అందర్నీ బాధపెట్టే దుర్ఘటనలూ తగ్గుతాయి. ఎలా ఉందీ ఐడియా. మన ఐడియా ఒక అడవినే మార్చేస్తుంది నాన్నా.’’
 
 ‘‘ఒరేయ్.. నీ ఆలోచన సరికాదురా. మాంసం ఎక్కువగా తింటేనే ఒబేసిటీ వస్తుంది. నువ్వు చెప్పే ఎగ్జాంపుల్స్ కరెక్టే అనిపిస్తున్నా... కరెక్ట్ కాదని కూడా అనిపిస్తోందిరా!’’ ‘‘మరి ఆరోగ్య ప్రవచనాలు చేసేవారంతా వెజిటేరియన్ ఫుడ్ తినేవే ఆరోగ్యంగా ఉంటాయనీ, మాంసాహారం తినేవి అనారోగ్యంగా ఉంటాయనీ అడవి జంతువులను ఉదాహరణలుగా చూపించి ఉద్బోధలు చేస్తుంటారు కదా. అది కరెక్ట్ అయినప్పుడు ఇదీ కరెక్ట్ కావాలి కదా!’’ వాడికి ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో నాకేమీ తోచలేదు.
   
 మా బుజ్జిగాడి థాట్స్ అన్నీ ఆలోచనకు లాజిగ్గానే ఉన్నా ప్రాక్టికాలిటీకి మాత్రం ట్రాజిగ్గా అనిపించే సరికి కాస్త అయోమయానికి గురయ్యాన్నేను. ఏ స్పెషలిస్టులు ఏ చికిత్స చేస్తారన్నది చెప్పడం తాత్కాలికంగా ఆపేసి, వాణ్ణి పట్టుకుని అర్జెంటుగా సైకియాట్రిస్టును కలవక తప్పలేదు. మా వాడి ఆలోచన ధోరణినంతా సాలోచనగా విన్న ఆయన ఒకే ఒక మాట అన్నాడు. ‘‘కంగ్రాట్స్ గురూ... మీ వాడు సరికొత్త కోర్సును వాడే సొంతంగా ఫామ్ చేసి, దాన్ని చదవేసి బీస్ట్ సైకియాట్రిస్టూ కమ్ యానిమల్ న్యూట్రిషనిస్టూ కాబోతున్నాడు. ఈ బీస్టియాట్రిస్ట్రీ అనే స్పెషాలిటికీ మృగయాట్రీషియనిస్టు అంటూ మనమే కొత్త పేరు కాయిన్ చేద్దామా? ఏమైతేనేం... నీ కోరిక తీరబోతోంది. ఇంకేం...  బీ హ్యాపీ’’ అంటూ నా భుజం చరిచాడు.  
 - యాసీన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement