ఫిట్స్... మూర్ఛాభిప్రాయాల నుంచి తేరుకోండి! | Fits/Epilepsy (Seizure Disorder) Causes, Symptoms, Diagnosis | Sakshi
Sakshi News home page

ఫిట్స్... మూర్ఛాభిప్రాయాల నుంచి తేరుకోండి!

Published Sun, Nov 17 2013 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM

Fits/Epilepsy (Seizure Disorder) Causes, Symptoms, Diagnosis

మనం మూర్ఛ అని పిలుచుకునే ఫిట్స్ అంటే అందరికీ భయమే. వ్యాధిగా అది ప్రాణాంతకం కాకపోయినా... ప్రమాదానికి గురిచేసే పరిస్థితులకు దారి తీస్తుంది. ఉదాహరణకు ఫిట్స్ రోగి ఏ రైలు పట్టాలు దాటే సమయంలోనో, ఏ ఈతకొట్టే సమయంలోనో మూర్ఛకు గురైతే అది ప్రాణాంతకమే కదా. అయితే నిర్దిష్టంగా నిర్ణీతకాలం పాటు చికిత్స తీసుకుంటే పూర్తిగా అదుపులో ఉండే వ్యాధి ఇది. అందుకే ఫిట్స్, సీజర్స్, ఎపిలెప్సీ అని పిలిచే మూర్ఛపై అవగాహన పెంచుకోవాలి. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం.
 
 మీకు తెలుసా? పుట్టిన ప్రతి ఒక్కరికీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతివారిలోనూ ఫిట్స్ రాకుండా అడ్డుకునే ఒక యంత్రాంగం ఉంటుంది. దీన్నే థ్రెష్‌హోల్డ్ అని డాక్టర్లు అభివర్ణిస్తుంటారు. మనకు ఫిట్స్ రావడం లేదంటే అందుకు అడ్డుపడుతున్న మన గడప (థ్రెష్‌హోల్డ్) ఎత్తు ఎక్కువగా ఉందన్నమాట. ఎవరిలోనైతే ఈ థ్రెష్‌హోల్డ్ తక్కువగా ఉందో, వారికి ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ.
 
 ఫిట్స్ అన్నది పుట్టిన నాటినుంచి మరణం వరకు ఏ దశలోనైనా కనిపించవచ్చు. ప్రధానంగా పల్లెప్రాంతాల్లో ఎక్కు వ. ఫిట్స్ గురించి విన్నా, చూసినా భయంకరంగా అనిపిస్తుంది గాని, నిజానికి ఇదేమీ భయంకరమైన వ్యాధి కాదు. మానసిక వ్యాధి అంతకంటే కాదు. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అంటువ్యాధి కాదు. కాకపోతే దీనిగురించి అనేక అపోహలు ఉండటంతో చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా తక్కువే. ఒక అంచనా ప్రకారం 60 శాతం మంది రోగులు చికిత్సకు దూరంగా ఉన్నారు. ఈ వ్యాధి పట్ల వివక్ష కూడా ఇందుకు ఒక కారణం.  
 
 ఫిట్స్‌కు కారణాలు : ఫిట్స్‌కు గురైనవారిలో 70 శాతం మందికి నిర్దిష్టంగా కారణం ఏమిటన్నది తెలియదు. కేవలం 30 శాతం మందిలోనే కారణాన్ని కనుగొనవచ్చు. అనువంశీకంగా కనిపించడం, పక్షవాతం, తలకు దెబ్బతగలడం, మెదడులో గడ్డలు, ఏదైనా ఇన్ఫెక్షన్‌కు గురికావడం వంటివి ఫిట్స్‌కు ప్రధాన కారణాలు.
 
 ఫిట్స్‌ను ప్రేరేపించే అంశాలు:
మితిమీరి ఆల్కహాల్ సేవిం చడం, అకస్మాత్తుగా ఆల్కహాల్ మానేయడం, నిద్రసరిగా లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, వెలుగుతూ, ఆరుతూ ఉండే లైట్ల మధ్య ఉండాల్సి రావడం, రుతుక్రమం... వంటివి ఫిట్స్‌ను ప్రేరేపించవచ్చు.
 
 ఫిట్స్‌లో రకాలు: మూర్ఛలో దాదాపు 40 రకాలున్నాయి. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, కాళ్లు, చేతులు కొట్టుకుంటూ ఉండటం, కనుపాపలు పైవైపునకు తిరుగుతూ ఉండటం వంటి లక్షణాలుండే ఫిట్స్ ఐదు నిమిషాల కంటే తక్కువసేపు ఉంటుంది. కొందరిలో కేవలం స్పృహ కోల్పోవడం మాత్రమే జరుగుతుంది. కొందరిలో కేవలం చేతులు మాత్రమే ఉలిక్కిపడ్డట్లు (ఒక జర్క్)గా కదులుతాయి. ఆ తర్వాత మళ్లీ వాళ్లు మామూలైపోతారు. కొందరు స్పృహ కోల్పోరు గాని, కాసేపు అచేతనంగా ఉండిపోతారు. ఇక కొందరిలోనైతే వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఫిట్స్ ఐదు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో వస్తే అవి మెదడుకు హానిచేయవు గానీ ఆ పరిస్థితిలో కొందరు నాలుకను బలం గా కొరుక్కుంటారు. మరికొందరిలో పంటివరసకు గాయాలు కావడం, భుజం ఎముక స్థానం తప్పడం లేదా విరగడం, తలకు గాయం కావడం వంటివి కూడా జరగవచ్చు.
 
 నిర్ధారణ పరీక్షలివి: 
ఫిట్స్‌ను గుర్తించి, నిర్ధారణ చేయడం ఎంతో ప్రధానం. ఎందుకంటే కొన్నిసార్లు రక్తంలో చక్కెరపాళ్లు, సోడియం, క్యాల్షియమ్ వంటివి తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ఫిట్స్ వస్తాయి. ఇలాంటి రోగులకు చాలాకాలం పాటు మందులు వాడవలసిన అవసరం ఉండదు. కానీ ఫిట్స్ మళ్లీ రాకుండా ఉండటానికి  చికిత్స తీసుకోవాలి. ఇక ఫిట్స్‌కు కారణం, నిర్ధారణ కోసం సీటీ స్కాన్ లేదా ఎమ్మారై బ్రెయిన్, ఈఈజీ వంటి పరీక్షలు చేయించాలి.
 
 చికిత్స: ప్రస్తుతం ఫిట్స్ కోసం దాదాపు 15 రకాల మందులు అందుబాటులో ఉన్నా యి. రోగి శరీరం బరువు ఆధారంగా వీటి మోతాదును నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకసారి ఫిట్స్ కనిపించాక ఇక అతడు కనీసం రెండేళ్లపాటు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరిలో కొంతకాలం మందులు వాడాక కొంతకాలం పాటు ఫిట్స్ కనిపించవు. దాంతో చాలామంది మందులు ఆపేస్తుంటారు. ఫలితంగా ఫిట్స్ మళ్లీ కనిపించే అవకాశముంది.

ఇలా మాటిమాటికీ ఫిట్స్ కనిపించకుండా ఉండాలంటే పూర్తికోర్సు మందులు వాడాల్సిందే. ఇక తీవ్రత ఆధారంగా మందును, మోతాదును నిర్ణయించే ఈ రోగుల్లో దాదాపు 70 శాతం మందిలో కేవలం ఒకే ఒక మందుతో ఇవి నియంత్రణలోకి వస్తాయి. కొద్దిమందిలోనే... అంటే మరో 10 శాతం మంది రోగుల్లో రెండు మందులు, ఇంకో 10 శాతం మందిలో మూడు మందులను వాడాల్సి ఉంటుంది. 70 శాతం రోగుల్లో రెండేళ్ల తర్వాత మందును ఆపేయవచ్చు. అయితే దీనికోసం డాక్టర్లు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వస్తారు.

ఇక మరో 10 శాతం మంది రోగుల్లో నాలుగు రకాల మందులు వాడినా ఫిట్స్ పునరావృతమవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఈ ఫిట్స్‌కు కారణం ఏమిటి, అవి మెదడులో ఎక్కడ ఆవిర్భవిస్తున్నాయి వంటి అంశాలను ఎమ్మారై బ్రెయిన్ ఎపిలెప్సీ ప్రోటోకాల్, వీడియో ఈఈజీ, స్పెక్ట్, పెట్ వంటి పరీక్షలతో నిర్ధారణ చేసి, ఆ ప్రాంతాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడంతో వాటిని అరికట్టవచ్చు లేదా వాటి తీవ్రతను, వచ్చే ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు. ఇలాంటి పది శాతం మినహాయిస్తే ఫిట్స్ రోగులందరిలోనూ దాదాపు ఇవి పూర్తిగా అదుపులో ఉంటాయి.
 
ఫిట్స్‌ను నియంత్రించేందుకు ఇప్పుడు కొత్తగా మరికొన్ని మార్గా లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ ద్వారా ఫిట్స్‌ను నియంత్రించవచ్చు. కొందరు చిన్నపిల్లలకు కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం (కీటోజెనిక్ డైట్) ఇవ్వడం ద్వారా ఫిట్స్‌ను అదుపు చేస్తున్నారు. ఇక మరికొందరిలో ‘వేగస్ నర్వ్’ అనే నరాన్ని ప్రేరేపించడం ద్వారా కూడా చికిత్స చేస్తున్నారు.
 
 మూర్ఛ... వివాహబంధంపై దాని ప్రభావం: ఫిట్స్ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు... అంటే స్పృహకోల్పోవడం, కాళ్లుచేతులు కొట్టుకోవడం, నోట్లోంచి లాలాజలం కారడం, ఎక్కడ పడుతున్నారో అన్న ధ్యాస లేకుండా పడిపోవడం వంటి లక్షణాల కారణంగా ఈ వ్యాధి వచ్చిన వారిపట్ల మన సమాజంలో చాలా వివక్ష ఉంటుంది. కానీ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉందని, ఎవరూ ఇందుకు అతీతులు కారనీ, కేవలం అదృష్టవశాత్తు మన థ్రెష్‌హోల్డ్ అనుమతించకపోవడంతోనే మనకింకా ఫిట్స్ రాలేదని గుర్తిస్తే, ఫిట్స్ రోగుల పట్ల మన వివక్ష తగ్గుతుంది.

ఈ సామాజిక వివక్ష కారణంగానే ఫిట్స్ వచ్చిన వారిని వివాహం చేసుకోవడం అనే విషయంలోనూ వివక్ష కొనసాగుతోంది. ఇక పెళ్లయ్యాక మహిళకు ఫిట్స్ వచ్చిన సందర్భాల్లో ఆ వివాహం విచ్ఛిన్నమైన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఫిట్స్ రావడం అన్నది చాలా సాధారణంగా జరిగేదే. ఇది ప్రమాదకరమైన వ్యాధి కానే కాదు. పైగా మందులతో పూర్తిగా అదుపులో ఉంటుంది. ఇది అంటువ్యాధి కాదు... అనే భావనలు అందరిలోనూ కలిగితే ఈ వ్యాధి పట్ల ఉన్న అపోహలు తొలగిపోతాయి. దాంతో వివాహానికి ఇది ప్రతిబంధకం కానేకాదని అర్థమవుతుంది. ఫిట్స్ వచ్చిన మహిళను పెళ్లి చేసుకుంటే వాళ్లకు పిల్లలు పుట్టరనే అపోహ చాలామందిలో ఉంది.  ఇది అపోహ మాత్రమే.
 
 అలాగే ఫిట్స్ వచ్చే మహిళలు మందులు వాడుతూ ఉన్నప్పుడు గర్భధారణకు ప్లాన్ చేసుకున్నా లేదా గర్భం ధరించాలని అనుకుంటున్నా, వారి డాక్టర్‌ను సంప్రదించి, ఒకవేళ వారు వాల్‌ప్రోయేట్ అనే మందును వాడుతుంటే, దానికి బదులు మరో మందు మార్పించుకోవాలంతే. ఒకవేళ వారు ఆ మందు వాడకుండా ఇతర రకాలు వాడుతుంటే ఇక కేవలం మిగతా అందరు గర్భధారణ కోరుతుండే మహిళల్లాగానే ఫోలిక్ యాసిడ్- 5ఎం.జీ. మాత్రలు వాడాలి. దీనివల్ల గర్భధారణ సమయంలో పిండదశలో కలిగే అనేక అనర్థాలను నివారించినట్లవుతుంది. అందుకే గతంలో ఫిట్స్ వచ్చిన మహిళలు లేదా ఫిట్స్ వచ్చి మందులు వాడుతున్న యువతులు గర్భధారణను కోరుకుంటున్నప్పుడు తమ డాక్టర్‌ను కలిసి తప్పనిసరిగా తగు సలహా, అవసరాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి.
 
 డ్రైవింగ్‌పై ఫిట్స్ ప్రభావం: ఫిట్స్ వచ్చినవారు అవి పూర్తిగా అదుపులోకి వచ్చాయనే నిర్ధారణ జరిగేవరకు వాహనాన్ని నడపకపోవడం అన్నివిధాలా మేలు. దీనివల్ల రోగుల ప్రాణాలతో పాటు, ఎదుటివారి ప్రాణాలనూ కాపాడినవారవుతారు. అలాగే ఈత నుంచి కూడా దూరంగా ఉండాలి. ప్రమాదభరితంగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిది.
 
 వైద్యశాస్త్రవిజ్ఞానం ఇంతగా పురోగమించిన ఈ రోజుల్లోై ఫిట్స్‌పై దురభిప్రాయాలు తొలగిపోవడం ఎంతో అవసరం.
 
 - నిర్వహణ: యాసీన్
 
 ఫిట్స్ రోగిని చూడగానే చేయవలసిన సహాయం  

 మన సమాజంలో ఫిట్స్ రోగిని చూసినప్పుడు చాలామంది వాళ్లకు తాళంచెవులు అందించడం, చేతిలో ఏదైనా లోహపు వస్తువు పెట్టడం వంటివి చేస్తుంటారు. నిజానికి ఇలాంటిపనులు చేయకూడదు. ఫిట్స్ వచ్చిన రోగిని చూసినప్పుడు చేయాల్సినవి...  అతడిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. కానీ ఎక్కువగా కదిలించకూడదు
 
 నోటిలోగాని చేతిలోగాని బలమైన లోహపు వస్తువులను ఉంచకూడదు  
 
 రోగి ఒక పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి
 
 రోగి కాళ్లు, చేతులు కొట్టుకుంటున్నప్పుడు దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు.
 
 సాధారణంగా ఫిట్స్ వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో రోగి తనంతట తానే మామూలు స్థితిలోకి వస్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా లేదా మళ్లీ వెంటనే ఫిట్స్ రావడం ప్రారంభమైనా వీలైనంత త్వరగా అతడిని ఆసుపత్రికి తరలించాలి.

డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి
 చీఫ్ న్యూరోఫిజీషియన్,
 కేర్ హాస్పిటల్స్,
 బంజారాహిల్స్, హైదరాబాద్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement