Dr. B. Chandrasekhar Reddy
-
ఎవ్రీ నైట్... స్లీప్ రైట్!
మంచి ఆరోగ్యానికి మూడు మూలస్తంభాలు అవసరం. అవి... మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి నిద్ర. ఈ మూడింటి వల్ల జీవననాణ్యత పెరుగుతుంది. కానీ మంచి నిద్ర లేకపోవడం వల్ల అనేక శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా జీవనోపాధి కోసం చేసే వృత్తిపై ప్రభావం పడటం వల్ల జీవితమే అస్తవ్యస్తమవుతుంది. అందుకే నిద్రలేమి సమస్యను అధిగమించి, మంచి నాణ్యమైన నిద్రకోసం ప్రయత్నించాలి. ఇలా నాణ్యమైన గాఢనిద్ర కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మూడు. అవి... 1. నిద్రకు సంబంధించిన ఆరోగ్యం (స్లీప్ హైజీన్ పాటించడం) 2. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ 3. కాగ్నిటివ్ కంట్రోల్. ఈ మూడూ పాటించాక కూడా నిద్రలేకపోతే అప్పుడు నిద్ర కోసం డాక్టర్‌ను సంప్రదించి మందుల కోసం ప్రయత్నించాలి. నాణ్యమైన నిద్ర... నిద్రకు సంబంధించిన ఆరోగ్యం (స్లీప్ హైజీన్) : నిద్రలోని నాణ్యతను పెంచడం, నిద్రకు ఉపక్రమించాక ఎంత వీలైతే అంత వేగంగా నిద్రలోకి వెళ్లిపోవడం కోసం మనం అనుసరించే అలవాట్లు, సంప్రదాయాలను స్లీప్హైజీన్గా పేర్కొన్నవచ్చు. ఇందులోని అంశాలు... ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకేవేళకు నిద్రకు ఉపక్రమించాలి. అంటే ఒక స్లీప్ షెడ్యూల్‌ను అనుసరించాల న్నమాట. అలాగే ప్రతిరోజూ నిద్ర తర్వాత నిర్ణీతమైన ఒకేవేళకు నిద్రలేవాలి. అది సెలవు రోజైనా, తీరికగా గడిపే మరే రోజైనా సరే... నిద్రవేళలలో ఎలాంటి మార్పులూ ఉండకూడదు. కనీసం ఏడు గంటలు నిద్రపోవడానికి వీలుగా ఉండేలా ఒక నిర్దిష్టమైన వేళను నిర్ణయించుకొని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ సమయానికి బెడ్‌పై ఉండి నిద్రకు ప్రయత్నించాలి. ఒకవేళ పక్కమీదికి ఒరిగాక 20 నిమిషాలకూ నిద్రలోకి వెళ్లకపోతే పక్క మీది నుంచి లేచి, మరింత సాంత్వన పొందే ప్రక్రియలను (రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను) అనుసరించాలి. పడకను కేవలం నిద్రపోవడా నికి, దంపతులైతే నిద్రతోపాటు సెక్స్ కోసం మాత్రమే ఉపయోగించాలి. అంతేగానీ, దాన్ని భోజనం చేసే ప్రదేశంగా, చిరుతిండ్లు తినే చోటుగా లేదా మరే ఇతర కార్యకలాపాలకు వాడకూడదు. మీ పడకగదిని చాలా రిలాక్స్ అయ్యే ప్రదేశంగా తీర్చిదిద్దుకోవాలి. అక్కడ నిశ్శబ్దంగా, రణగొణధ్వనులు లేకుండా ఉండాలి. పడకగది తగినంత చల్లగా, సౌకర్యవంతంగా ఉండాలి. పడకగది లోకి నిద్రపోయే సమయంలో ధారాళంగా వెలుతురు రాకూడదు. పడకకు ఉపక్రమించే ముందు కడుపునిండుగా భోజనం చేయకూడదు. పొట్టను కాస్తంత ఖాళీగానే ఉంచాలి. పడకకు ఉపక్రమించే ముందు ఆల్కహాల్ తీసుకోకూడదు. అంతేకాదు... కెఫీన్ ఉండే పానీయాలను సాయంత్రం వేళ నుంచి రాత్రి వేళ వరకు ఉపయోగించకూడదు. రాత్రి పడక మీదికి వెళ్లబోయే ముందు అతిగా ద్రవాహారం తీసుకోకూడదు. పొగతాగ డాన్నీ, మాదకద్రవ్యాలను (నార్కోటిక్స్‌ను) పడక మీదికి వెళ్లే ముందు అస్సలు వాడకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే నిద్రకు ఉపక్రమించే ముందు వ్యాయామం చేయకూడదు. మీకూ, మీ భాగస్వామికి నిద్రలో గురకపెట్టే అలవాటూ, అలాగే నిద్రలో మరీ ఎక్కువగా కదిలే అలవాటు ఉంటే అది అవతలివారి నిద్రాభంగానికి దారితీయవచ్చు. ఈ పరిస్థితి ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) సీబీటీ అనే ఈ తరహా వైద్య ప్రక్రియను అనుసరించడం వల్ల బాగా నిద్రపోయే సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు గాఢనిద్ర కూడా సాధ్యమవుతుంది. దీన్ని అనుసరించడం చాలా సులభం కూడా. దీనికోసం చేయాల్సినవి... పడకను కేవలం నిద్రకోసమే ఉపయోగించాలని తెలుసుకున్నాం కదా. అందుకే పడక మీద పడుకొని చదవడం, టీవీ చూడటం, మరే ఇరత కార్యకలాపాలనైనా చేయడం పూర్తిగా నిషిద్ధం. పడకమీదికి చేరిన 20 నిమిషాల తర్వాత కూడా మీరు మెలకువతోనే ఉంటే మళ్లీ మరింత రిలాక్స్ అయ్యే ప్రక్రియలైన ధ్యానం వంటి టెక్నిక్స్ అవలంబించండి. మీకు నిద్రవచ్చినట్లు అనిపించినప్పుడే మళ్లీ పడక మీదికి వెళ్లండి. ఈ పద్ధతులను అనుసరిస్తున్న సమయంలో ఒక దశ తర్వాత మీరు పక్క మీదికి చేరగానే నిద్రపోయే పరిస్థితి తప్పక వస్తుంది. పడక మీదికి చేరిన ఎంతసేపటికీ నిద్రరాకుండా ఉన్న పరిస్థితుల్లో మనిషి అస్థిమితంగా (రెస్ట్‌లెస్‌గా) అయిపోతాడు. నిస్పృహ (ఫ్రస్టేషన్)కు లోనవుతాడు. మనం ఏడుగంటలు పక్క మీద ఉంటున్నా వాస్తవంగా నిద్రపోయే వ్యవధి ఐదుగంటలే అనుకుందాం. అప్పుడు ఆ మర్నాటి నుంచి ఆ ఐదు గంటలే పక్కమీద నిద్రకోసం గడపాలి. అలాంటి సమయాల్లో మొదట్లో ఆ మర్నాడు కాస్త అలసటగా అనిపించవచ్చు. కానీ క్రమేణా... ఆ ఐదుగంటలే మంచి నిద్ర వచ్చి, క్రమేణా ఆ నిద్ర నాణ్యమైనదిగా మారుతుంది. క్రమంగా అది ఐదు నుంచి ఆరు... ఏడు గంటలుగా... ఇలా నిద్రావ్యవధి పెరుగుతుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్ అయిన ధ్యానం, ప్రాణాయామం వంటివి మీరు బాగా గాఢంగా, నాణ్యమైన నిద్రపోవడానికి ఉపకరించే మార్గాలు. కాగ్నిటివ్ కంట్రోల్: మీకు నిద్రపట్టకపోవడానికి వెతుక్కునే కారణాల్లో ప్రతికూలమైన కారణాలనూ, ప్రతికూలమైన ఆలోచనలనూ నియంత్రించుకోండి. నిద్రపట్టని సమయంలో ఆలోచనలన్నీ సానుకూల దృక్పథంతో ఉండేలా ఆలోచించడం అలవాటు చేసుకోండి. నిద్రవేళకు మీ వృత్తిపరమైన ఆలోచనలనూ, మీ టెన్షన్లనూ, మీ విచారాలను వదిలించుకోండి. రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇందుకు బాగా పనికివస్తాయి. దాంతో మీ ఆలోచనలు స్థిమితపడి మీకు తేలిగ్గా నిద్ర వస్తుంది. నిద్రపట్టని వేళల్లో ఆహ్లాదకరమైన ఊహలను పెంచుకోవడం అనే ప్రక్రియను అనుసరించండి. మీకు ఆనందం కలిగించే ఊహలనూ, ఉదంతాలనూ ఒక కథలా అల్లుకుంటూ ఆలోచిస్తూపొండి. మీకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు. మందులు ఎప్పుడు అవసరం: పై మార్గాలన్నీ మీరు ప్రయత్నపూర్వకంగా అనుసరించి, ఎంతగా ప్రయత్నించినా నిద్రపట్టనప్పుడు డాక్టర్‌ను సంప్రదించండి. ఎందుకంటే యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉన్నప్పుడు ఎంతగా ప్రయత్నించినా నిద్ర పట్టకపోవచ్చు. అప్పుడు డాక్టర్లు మీకు నిద్రపట్టకపోవడానికి అసలు కారణాన్ని అన్వేషించి, దానికి చికిత్స చేస్తారు. దాంతో చికిత్స తర్వాత మీకు ఎలాంటి నిద్రమాత్రా అవసరం లేకుండానే నిద్రపడుతుంది. అంతేగానీ... మీ ప్రతి నిద్రలేమి సమస్యకూ నిద్రమాత్రే పరిష్కారం కాదు. అందుకే నిద్రలేమి సమస్య ఉన్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించండి. ప్రతి రాత్రీ మీకు మంచి సుఖనిద్ర రాత్రి అవుతుంది. డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి చీఫ్ న్యూరో ఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ -
కాఫీ, చాక్లెట్స్ మెదడుకు చేసేదేమిటీ!
కొందరికి టీ కాఫీలు మంచినీళ్ల ప్రాయం. అలా తాగడం వల్ల ఒనగూరే లాభాలు, నష్టాలు తెలియకపోయినా అదేపనిగా వాటిని తాగేస్తుంటారు. నాలుగు కప్పులకు మించకుండా తాగే టీ... కనీసం 20 శాతం పక్షవాతాలను నివారిస్తుంది. చాక్లెట్ల తీరూ అంతే. కానీ మూడు కప్పులు మించిన కాఫీతో మాత్రం ఇబ్బందులు తప్పవు. పరిమితంగా తినే చాక్లెట్లు మెదడుకు తియ్యటి నేస్తాలై మతిమరపు రానివ్వకుండా చేస్తాయి. అలాగని మస్తీ చేస్తే మళ్లీ డేంజరే. కాఫీ, టీ, చాక్లెట్ల వల్ల మెదడుపై ప్రభావాల వివరాల సమాహారమే ఈ కథనం. మనకు సంబంధించినంత వరకు కాఫీ చూడటానికి ఆకర్షణీయంగా, చిక్కటి రంగుతో, పొగలుకక్కుతూ, రుచికరమైన సువాసనను వెలువరుస్తూ చూడగానే తాగాలనిపిస్తుంది. అంతవరకే మనకు తెలిసింది. కానీ అదెంతో సంక్లిష్టమైన పానీయం. ఒక కప్పు కాఫీలో వందలకొద్దీ జీవసంబంధమైన పదార్థాలున్నాయి. అందులో కొన్ని చురుకైనవి. ఉదాహరణకు కెఫిన్, డైటర్‌పిన్స్, డైఫీనాల్స్ వంటివి. ఒక కప్పు కాఫీ తాగగానే హృదయ స్పందనల విషయంలో దాని ప్రభావం ఉంటుంది. అయితే ఆ ప్రభావం ఏమేరకు అన్నది... వ్యక్తిగతంగా తాగేవారికి ఉన్న కొన్ని వ్యాధులు, లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే కాఫీ ఎలా తయారుచేశారు అనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే... అది ఫిల్టర్ కాఫీయా లేక సాధారణ కాఫీయా అన్న అంశంపైన అన్నమాట. కెఫిన్ ప్రభావం: కాఫీలో ఉండే కెఫిన్ చాలా ప్రధానమైన ఉత్ప్రేరకం. మనం కాఫీ తాగగానే ఏమవుతుందో చూద్దాం. కాఫీ ఒంట్లోకి ఇంకగానే దాని ప్రభావం శరీరంపై, ఆరోగ్యంపై కనిపిస్తుంది. కాఫీ తాగిన కాసేపట్లో రక్తపోటు (ప్రధానంగా సిస్టోల్ బ్లడ్‌ప్రెషర్) పెరుగుతుంది. బీపీని కొలిచే సాధనంతో చూస్తే, అది సాధారణం కంటే 8 ఎంఎం/హెచ్‌జీ ఎక్కువవుతుంది. డయాస్టోలిక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అయితే అది 6 ఎంఎం/హెచ్‌జీ పెరుగుతుంది. ఈ రెండు పెరుగుదలలూ కాఫీతాగిన తర్వాత సుమారు గంట నుంచి మూడు గంటల పాటు అలాగే ఉంటాయి. ఈ కొలతల్లో పెరుగుదల అన్నది సాధారణ వ్యక్తుల కంటే రక్తపోటుతో బాధపడేవారిలో ఎక్కువ. అందుకే హైబీపీతో బాధపడేవారు కాఫీ తాగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అంతగా తాగాలనిపిస్తే కొద్ది మోతాదులో మాత్రమే తమ జిహ్వను సంతృప్తిపరచడానికి తీసుకోవాలి. ఎందుకంటే... ఇలా కాఫీ ఎక్కువగా తాగుతూ బీపీని పెంచుకోవడం వల్ల దీర్ఘకాలికంగా దాని దుష్ర్పభావాలు ఉంటాయి. ఎందుకంటే కాఫీ తాగిన ప్రతిసారీ కెఫిన్ విషయంలో కొంత నిరోధకత (టాలరెన్స్) పెరుగుతూ ఉంటుంది. అంటే మొదటిసారి కాఫీ తాగినప్పుడు కలిగే ఉత్తేజం, రెండో కాఫీకి తగ్గుతుందన్నమాట. అందుకే రెండోసారి కూడా అంత ఉత్తేజం పొందాలనుకుంటే రెండోసారి కాస్త ఎక్కువ తాగాలన్నమాట. ఇలా కాఫీ ఇచ్చే ఉత్తేజానికి అలవాటుపడ్డప్పుడు క్రమంగా మోతాదును పెంచుకుంటా రు. ప్రధానంగా పరీక్షల కోసం చదివే పిల్లలు రాత్రుళ్లు చురుగ్గా ఉండటం కోసం, నిద్రమత్తును దూరం చేసుకోవడం కోసం దీనిపై ఆధారపడతారు. కాఫీని కేవలం పానీయంగానే పరిగణించకూడదు. ఎందుకంటే ఇందులో మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే ‘యాంటీ మైగ్రేన్’ ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగాక రెండోదానికి వ్యవధి ఇవ్వాలి. లేకపోతే అవసరం లేని మందును/మాత్రను వేసుకుని దాని సైడ్‌ఎఫెక్ట్స్‌ను పొందడమేనని గుర్తుంచుకోవాలి. అలాగే కాఫీ... యాంగ్జైటీని పెంచుతుంది. కొందరిలో వణుకును కూడా పెంచుతుంది. అందుకే యాంగ్జైటీతో బాధపడేవారు కాఫీని తాగకపోవడమే మంచిది. ఇక ఎస్ప్రెస్సో కాఫీతో ఆరోగ్యానికి జరిగే హాని అంతా ఇంతా కాదు. డైటర్‌పీన్ ప్రభావం: కాఫీలో ఉండే డైటర్‌పీన్ ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో చూద్దాం. కాఫీలో ఉండే ఈ జీవరసాయనం శరీరంలోకి ప్రవేశించగానే అది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) పాళ్లను, హానికరమైన ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను అకస్మాత్తుగా పెంచేస్తుంది. ఇక ఫిల్టర్ కాఫీలో డైటర్పీన్స్ పెద్దగా ఉండవు. ఎందుకంటే వడపోత ప్రక్రియలో ఇవి కాఫీలోకి వెళ్లకుండా, ఫిల్టర్ కాగితంపైనే ఉండిపోతాయి. కానీ ఫిల్టర్ చేయని కాఫీలో మాత్రం డైటర్‌పీన్ పాళ్లు అధికంగా ఉంటాయి. అందుకే కేవలం హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లు మాత్రమేగాక... శరీరంలో కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండే హైపర్లిపిడేమియాతో బాధపడే రోగులు సైతం కాఫీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు మామూలు కాఫీకి బదులుగా ఫిల్టర్ కాఫీని ఒక కప్పు మాత్రం తీసుకోవచ్చు. మంచి గుణాలు లేవా?: కాఫీ ఎప్పుడూ హానికరమేనా? ఇందులో మంచి గుణాలు లేవా? కాఫీ ప్రియులు అంతగా నిరాశ పడనక్కర్లేదు. ఎందుకంటే కాఫీని పరిమిత మోతాదులో తీసుకుంటే అది పక్షవాతాన్ని (స్ట్రోక్‌ని) నివారిస్తుంది. కాఫీలోని డైఫినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఈ పని చేస్తుంది. ఐదులక్షల మంది కాఫీ ప్రియులపై విస్తృతంగా చేసిన అధ్యయనాలలో ఈ విషయం తెలిసింది. అయితే ఈ ప్రయోజనాన్ని పొందడానికి కాఫీని కేవలం రోజుకు రెండు కప్పులకు మాత్రమే పరిమితం చేసుకోవాలి. గ్రీన్ టీ - బ్లాక్ టీ ల ప్రభావాలు: టీ గురించి పూర్వం నుంచే తెలుసు. ప్రధానంగా చైనా వారికి టీ గురించి 4,700 సంవత్సరాల క్రితం నుంచీ అవగాహన ఉంది. మంచినీళ్ల తర్వాత మానవాళి అత్యధికంగా తాగేది టీనే. ఇందులోనూ అనేక రకాలున్నాయి. అయితే మనం తీసుకునే టీ ఎంతోకొంత పులిసే తత్వం ఉన్న పానీయం. కానీ గ్రీన్ టీలో పులిసే తత్వం లేదు. ఇక అన్నిరకాల టీలలో కాటేచిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనే జీవరసాయనాలు ప్రధానంగా ఉంటాయి. ఇవి రెండూ ప్రభావపూర్వకమైన యాంటీ ఆక్సిడెంట్స్. అయితే టీలో... ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు... వంటివేవీ ఉండవు. టీ తాగగానే అందులోని ఫ్లేవనాయిడ్స్ హానికరమైన కొలెస్ట్రాల్ అయిన ఎల్‌డీఎల్‌ను, కొవ్వుపదార్థాలైన ట్రైగ్లిజరాయిడ్స్‌ను సైతం తగ్గిస్తాయి. కానీ శరీరానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) ను మాత్రం పెంచలేవు. టీ తాగడం వల్ల కొవ్వు పేరుకునే ప్రక్రియకు కాస్త అడ్డుకట్ట పడుతుంది. అయితే ఈ సుగుణం ఉంది కదా అని మోతాదుకు మించకుండా పరిమితంగా మాత్రమే తాగాలి. అంటే రోజుకు నాలుగు కప్పులకు మించనివ్వకూడదు. ఇలా పరిమితంగా టీ తాగడం పక్షవాతాన్ని నివారిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని రక్తప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల వచ్చే ఇస్కిమిక్ స్ట్రోక్, రక్తనాళాలు చిట్లడం వల్ల వచ్చే హేమరేజిక్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్‌ల నివారణకు తోడ్పడతాయి. ఇలా స్ట్రోక్‌ను నివారించే గుణం సాధారణ టీ కంటే గ్రీన్ టీ లో ఎక్కువగా ఉంది. వివిధరకాల పక్షవాతాల్లో కనీసం 20 శాతం పక్షవాతాలను టీ నివారిస్తుంది. తాగిన వెంటనే శరీరంలో కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించడం, నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లను పెంచడం వంటి గుణాలు ఉన్నందున ఈ ప్రయోజనం చేకూరుతుంది. రక్తనాళాల్లోని లోపలి పొర అయిన ఎండోథీలియం... రక్తాన్ని సాఫీగా ప్రవహించేలా చేస్తుంది. ఈ గుణాన్ని టీ మరింత మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. టీలోనూ కొంత మేరకు కెఫిన్ పాళ్లు టీలో ఉన్నప్పటికీ వాటి ప్రభావం చాలా తక్కువ. ఆరోగ్యానికి మేలు చేకూరేలా టీ తాగడం ఎలా: టీలో కాచెటిన్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు కాచిన టీలోనే అవి ఎక్కువగా లభిస్తాయి. అందుకే టీని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తయారుచేసుకుని తాగాలి. ఇన్స్టాంట్ టీ/ఐస్ టీలలో కాచెటిన్, ఫ్లేవనాయిడ్స్ పాళ్లు చాలా తక్కువ. టీ లో ప్రతికూల అంశాలు... మేలు గుణాలతో పాటు, టీ లో కొన్ని ప్రతికూల గుణాలూ ఉన్నాయి. ఉదాహరణకు మనం తీసుకున్న ఆహారం, పండ్లు, కూరగాయల నుంచి శరీరానికి అందాల్సిన ఐరన్‌ను టీ శరీరంలోకి ఇంకకుండా నిరోధిస్తుంది. అందుకే ఆహారం తీసుకునే సమయంలో టీని పూర్తిగా దూరంగా ఉంచాలి. తినే ముందు, తిన్న తర్వాత కూడా చాలాసేపటి వరకు టీ తాగకూడదు. అలాగే టీ ఎక్కువగా తాగే అలవాటు (అంటే రోజుకు ఒక లీటర్ కంటే ఎక్కువగా తాగుతూ, అలా ఏళ్ల తరబడి తాగేవారికి) దీర్ఘకాలంలో ‘ఫ్లోరోసిస్’ కు దారితీసే ప్రమాదం ఉంది. పైన పేర్కొన్న అధ్యయనాలతో తేలిన విషయం ఏమిటంటే... గ్రీన్ టీ లేదా సాధారణ టీ తాగే అలవాటును కొనసాగించవచ్చు. కాకపోతే రోజుకు నాలుగు కప్పులకు మించి తాగవద్దు. ఆ పరిమితుల్లో టీ తాగడం వల్ల భవిష్యత్తులో పక్షవాతాన్ని చాలావరకు, గుండెజబ్బులను కొద్దిమేరకు నివారించుకోవచ్చు. ఇక చాక్లెట్ కూడా ఒకటికి మించి తినవద్దు. అయితే కాఫీ అలవాటు ఉన్నవారు మాత్రం రోజుకు రెండు కప్పులకు మించి తాగకూడదు. ఆ మోతాదు మించితే అది హానికరమని గ్రహించండి. కాఫీ, టీలలో వేసుకునే చక్కెర పాళ్లను గణనీయంగా తగ్గించాలని గుర్తుపెట్టుకోండి. పరిమితికి మించిన చక్కెర వేసుకుంటుంటే అది క్రమంగా రక్తంలో చక్కెరపాళ్లను పెంచడం, బరువును పెంచి స్థూలకాయం వచ్చేలా చేయడం జరుగుతుందని మర్చిపోకూడదు. -నిర్వహణ: యాసీన్ చాక్లెట్ ప్రభావాలు ఒకప్పుడు చాక్లెట్ చాలా ప్రియం (ఎక్స్పెన్సివ్) గా ఉండేది. అది చాలా అరుదైన పదార్థంగా మాత్రమే లభ్యమయ్యేది. కేవలం ధనవంతులకే అందుబాటులో ఉండేది. అప్పట్లో దాని లభ్యత చాలా తక్కువ కావడం, పైగా అది సెక్స్ ఉద్దీపించే పదార్థంగా ప్రాచుర్యం పొందడంతో వాటి ధర మరీ ఎక్కువగా ఉండేది. చాక్లెట్లో ఉపయోగించే కోకాలో... ఫ్లేవనాయిడ్స్ అని పిలిచే చాలా ప్రభావపూర్వకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అంతేకాదు... చాలా పరిమితంగా తీసుకున్నప్పుడు చాక్లెట్స్ హైబీపీని కొద్దిమేర నియంత్రిస్తుంటాయి. అయితే కొలెస్ట్రాల్‌పై మాత్రం దీని ప్రభావం అంతగా ఉండదు. పరిమితంగా చాక్లెట్ తినే గుణం ఉన్నవారిలో అది పక్షవాతం రిస్క్‌ను 19 శాతం తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు... పరిమితంగా చాక్లెట్ తినేవారిలో జ్ఞాపకశక్తి మందగించడం వల్ల వచ్చే ‘డిమెన్షియా’ కూడా తక్కువే. ఈ గుణం కారణంగా అది భవిష్యత్తులో ‘అల్జైమర్స్ డిసీజ్’ రిస్క్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. చాక్లెట్ల ద్వారా లభ్యమయ్యే ఈ ప్రయోజనాలు కేవలం డార్క్ చాక్లెట్లు లేదా కోకో ఉన్న చాక్లెట్లకు మాత్రమే పరిమితం. అయితే పరిమితికి మించి చాక్లెట్లు తీసుకోవడం స్థూలకాయం వంటి అనేక అనర్థాలకు దారితీస్తుందని గ్రహించాలి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి చీఫ్ న్యూరోఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
ఫిట్స్... మూర్ఛాభిప్రాయాల నుంచి తేరుకోండి!
మనం మూర్ఛ అని పిలుచుకునే ఫిట్స్ అంటే అందరికీ భయమే. వ్యాధిగా అది ప్రాణాంతకం కాకపోయినా... ప్రమాదానికి గురిచేసే పరిస్థితులకు దారి తీస్తుంది. ఉదాహరణకు ఫిట్స్ రోగి ఏ రైలు పట్టాలు దాటే సమయంలోనో, ఏ ఈతకొట్టే సమయంలోనో మూర్ఛకు గురైతే అది ప్రాణాంతకమే కదా. అయితే నిర్దిష్టంగా నిర్ణీతకాలం పాటు చికిత్స తీసుకుంటే పూర్తిగా అదుపులో ఉండే వ్యాధి ఇది. అందుకే ఫిట్స్, సీజర్స్, ఎపిలెప్సీ అని పిలిచే మూర్ఛపై అవగాహన పెంచుకోవాలి. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. మీకు తెలుసా? పుట్టిన ప్రతి ఒక్కరికీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతివారిలోనూ ఫిట్స్ రాకుండా అడ్డుకునే ఒక యంత్రాంగం ఉంటుంది. దీన్నే థ్రెష్‌హోల్డ్ అని డాక్టర్లు అభివర్ణిస్తుంటారు. మనకు ఫిట్స్ రావడం లేదంటే అందుకు అడ్డుపడుతున్న మన గడప (థ్రెష్‌హోల్డ్) ఎత్తు ఎక్కువగా ఉందన్నమాట. ఎవరిలోనైతే ఈ థ్రెష్‌హోల్డ్ తక్కువగా ఉందో, వారికి ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఫిట్స్ అన్నది పుట్టిన నాటినుంచి మరణం వరకు ఏ దశలోనైనా కనిపించవచ్చు. ప్రధానంగా పల్లెప్రాంతాల్లో ఎక్కు వ. ఫిట్స్ గురించి విన్నా, చూసినా భయంకరంగా అనిపిస్తుంది గాని, నిజానికి ఇదేమీ భయంకరమైన వ్యాధి కాదు. మానసిక వ్యాధి అంతకంటే కాదు. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అంటువ్యాధి కాదు. కాకపోతే దీనిగురించి అనేక అపోహలు ఉండటంతో చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా తక్కువే. ఒక అంచనా ప్రకారం 60 శాతం మంది రోగులు చికిత్సకు దూరంగా ఉన్నారు. ఈ వ్యాధి పట్ల వివక్ష కూడా ఇందుకు ఒక కారణం. ఫిట్స్‌కు కారణాలు : ఫిట్స్‌కు గురైనవారిలో 70 శాతం మందికి నిర్దిష్టంగా కారణం ఏమిటన్నది తెలియదు. కేవలం 30 శాతం మందిలోనే కారణాన్ని కనుగొనవచ్చు. అనువంశీకంగా కనిపించడం, పక్షవాతం, తలకు దెబ్బతగలడం, మెదడులో గడ్డలు, ఏదైనా ఇన్ఫెక్షన్కు గురికావడం వంటివి ఫిట్స్‌కు ప్రధాన కారణాలు. ఫిట్స్‌ను ప్రేరేపించే అంశాలు: మితిమీరి ఆల్కహాల్ సేవిం చడం, అకస్మాత్తుగా ఆల్కహాల్ మానేయడం, నిద్రసరిగా లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, వెలుగుతూ, ఆరుతూ ఉండే లైట్ల మధ్య ఉండాల్సి రావడం, రుతుక్రమం... వంటివి ఫిట్స్‌ను ప్రేరేపించవచ్చు. ఫిట్స్‌లో రకాలు: మూర్ఛలో దాదాపు 40 రకాలున్నాయి. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, కాళ్లు, చేతులు కొట్టుకుంటూ ఉండటం, కనుపాపలు పైవైపునకు తిరుగుతూ ఉండటం వంటి లక్షణాలుండే ఫిట్స్ ఐదు నిమిషాల కంటే తక్కువసేపు ఉంటుంది. కొందరిలో కేవలం స్పృహ కోల్పోవడం మాత్రమే జరుగుతుంది. కొందరిలో కేవలం చేతులు మాత్రమే ఉలిక్కిపడ్డట్లు (ఒక జర్క్)గా కదులుతాయి. ఆ తర్వాత మళ్లీ వాళ్లు మామూలైపోతారు. కొందరు స్పృహ కోల్పోరు గాని, కాసేపు అచేతనంగా ఉండిపోతారు. ఇక కొందరిలోనైతే వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఫిట్స్ ఐదు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో వస్తే అవి మెదడుకు హానిచేయవు గానీ ఆ పరిస్థితిలో కొందరు నాలుకను బలం గా కొరుక్కుంటారు. మరికొందరిలో పంటివరసకు గాయాలు కావడం, భుజం ఎముక స్థానం తప్పడం లేదా విరగడం, తలకు గాయం కావడం వంటివి కూడా జరగవచ్చు. నిర్ధారణ పరీక్షలివి: ఫిట్స్‌ను గుర్తించి, నిర్ధారణ చేయడం ఎంతో ప్రధానం. ఎందుకంటే కొన్నిసార్లు రక్తంలో చక్కెరపాళ్లు, సోడియం, క్యాల్షియమ్ వంటివి తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ఫిట్స్ వస్తాయి. ఇలాంటి రోగులకు చాలాకాలం పాటు మందులు వాడవలసిన అవసరం ఉండదు. కానీ ఫిట్స్ మళ్లీ రాకుండా ఉండటానికి చికిత్స తీసుకోవాలి. ఇక ఫిట్స్‌కు కారణం, నిర్ధారణ కోసం సీటీ స్కాన్ లేదా ఎమ్మారై బ్రెయిన్, ఈఈజీ వంటి పరీక్షలు చేయించాలి. చికిత్స: ప్రస్తుతం ఫిట్స్ కోసం దాదాపు 15 రకాల మందులు అందుబాటులో ఉన్నా యి. రోగి శరీరం బరువు ఆధారంగా వీటి మోతాదును నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకసారి ఫిట్స్ కనిపించాక ఇక అతడు కనీసం రెండేళ్లపాటు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరిలో కొంతకాలం మందులు వాడాక కొంతకాలం పాటు ఫిట్స్ కనిపించవు. దాంతో చాలామంది మందులు ఆపేస్తుంటారు. ఫలితంగా ఫిట్స్ మళ్లీ కనిపించే అవకాశముంది. ఇలా మాటిమాటికీ ఫిట్స్ కనిపించకుండా ఉండాలంటే పూర్తికోర్సు మందులు వాడాల్సిందే. ఇక తీవ్రత ఆధారంగా మందును, మోతాదును నిర్ణయించే ఈ రోగుల్లో దాదాపు 70 శాతం మందిలో కేవలం ఒకే ఒక మందుతో ఇవి నియంత్రణలోకి వస్తాయి. కొద్దిమందిలోనే... అంటే మరో 10 శాతం మంది రోగుల్లో రెండు మందులు, ఇంకో 10 శాతం మందిలో మూడు మందులను వాడాల్సి ఉంటుంది. 70 శాతం రోగుల్లో రెండేళ్ల తర్వాత మందును ఆపేయవచ్చు. అయితే దీనికోసం డాక్టర్లు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వస్తారు. ఇక మరో 10 శాతం మంది రోగుల్లో నాలుగు రకాల మందులు వాడినా ఫిట్స్ పునరావృతమవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఈ ఫిట్స్‌కు కారణం ఏమిటి, అవి మెదడులో ఎక్కడ ఆవిర్భవిస్తున్నాయి వంటి అంశాలను ఎమ్మారై బ్రెయిన్ ఎపిలెప్సీ ప్రోటోకాల్, వీడియో ఈఈజీ, స్పెక్ట్, పెట్ వంటి పరీక్షలతో నిర్ధారణ చేసి, ఆ ప్రాంతాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడంతో వాటిని అరికట్టవచ్చు లేదా వాటి తీవ్రతను, వచ్చే ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు. ఇలాంటి పది శాతం మినహాయిస్తే ఫిట్స్ రోగులందరిలోనూ దాదాపు ఇవి పూర్తిగా అదుపులో ఉంటాయి. ఫిట్స్‌ను నియంత్రించేందుకు ఇప్పుడు కొత్తగా మరికొన్ని మార్గా లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ ద్వారా ఫిట్స్‌ను నియంత్రించవచ్చు. కొందరు చిన్నపిల్లలకు కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం (కీటోజెనిక్ డైట్) ఇవ్వడం ద్వారా ఫిట్స్‌ను అదుపు చేస్తున్నారు. ఇక మరికొందరిలో ‘వేగస్ నర్వ్’ అనే నరాన్ని ప్రేరేపించడం ద్వారా కూడా చికిత్స చేస్తున్నారు. మూర్ఛ... వివాహబంధంపై దాని ప్రభావం: ఫిట్స్ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు... అంటే స్పృహకోల్పోవడం, కాళ్లుచేతులు కొట్టుకోవడం, నోట్లోంచి లాలాజలం కారడం, ఎక్కడ పడుతున్నారో అన్న ధ్యాస లేకుండా పడిపోవడం వంటి లక్షణాల కారణంగా ఈ వ్యాధి వచ్చిన వారిపట్ల మన సమాజంలో చాలా వివక్ష ఉంటుంది. కానీ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉందని, ఎవరూ ఇందుకు అతీతులు కారనీ, కేవలం అదృష్టవశాత్తు మన థ్రెష్‌హోల్డ్ అనుమతించకపోవడంతోనే మనకింకా ఫిట్స్ రాలేదని గుర్తిస్తే, ఫిట్స్ రోగుల పట్ల మన వివక్ష తగ్గుతుంది. ఈ సామాజిక వివక్ష కారణంగానే ఫిట్స్ వచ్చిన వారిని వివాహం చేసుకోవడం అనే విషయంలోనూ వివక్ష కొనసాగుతోంది. ఇక పెళ్లయ్యాక మహిళకు ఫిట్స్ వచ్చిన సందర్భాల్లో ఆ వివాహం విచ్ఛిన్నమైన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఫిట్స్ రావడం అన్నది చాలా సాధారణంగా జరిగేదే. ఇది ప్రమాదకరమైన వ్యాధి కానే కాదు. పైగా మందులతో పూర్తిగా అదుపులో ఉంటుంది. ఇది అంటువ్యాధి కాదు... అనే భావనలు అందరిలోనూ కలిగితే ఈ వ్యాధి పట్ల ఉన్న అపోహలు తొలగిపోతాయి. దాంతో వివాహానికి ఇది ప్రతిబంధకం కానేకాదని అర్థమవుతుంది. ఫిట్స్ వచ్చిన మహిళను పెళ్లి చేసుకుంటే వాళ్లకు పిల్లలు పుట్టరనే అపోహ చాలామందిలో ఉంది. ఇది అపోహ మాత్రమే. అలాగే ఫిట్స్ వచ్చే మహిళలు మందులు వాడుతూ ఉన్నప్పుడు గర్భధారణకు ప్లాన్ చేసుకున్నా లేదా గర్భం ధరించాలని అనుకుంటున్నా, వారి డాక్టర్‌ను సంప్రదించి, ఒకవేళ వారు వాల్‌ప్రోయేట్ అనే మందును వాడుతుంటే, దానికి బదులు మరో మందు మార్పించుకోవాలంతే. ఒకవేళ వారు ఆ మందు వాడకుండా ఇతర రకాలు వాడుతుంటే ఇక కేవలం మిగతా అందరు గర్భధారణ కోరుతుండే మహిళల్లాగానే ఫోలిక్ యాసిడ్- 5ఎం.జీ. మాత్రలు వాడాలి. దీనివల్ల గర్భధారణ సమయంలో పిండదశలో కలిగే అనేక అనర్థాలను నివారించినట్లవుతుంది. అందుకే గతంలో ఫిట్స్ వచ్చిన మహిళలు లేదా ఫిట్స్ వచ్చి మందులు వాడుతున్న యువతులు గర్భధారణను కోరుకుంటున్నప్పుడు తమ డాక్టర్‌ను కలిసి తప్పనిసరిగా తగు సలహా, అవసరాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి. డ్రైవింగ్‌పై ఫిట్స్ ప్రభావం: ఫిట్స్ వచ్చినవారు అవి పూర్తిగా అదుపులోకి వచ్చాయనే నిర్ధారణ జరిగేవరకు వాహనాన్ని నడపకపోవడం అన్నివిధాలా మేలు. దీనివల్ల రోగుల ప్రాణాలతో పాటు, ఎదుటివారి ప్రాణాలనూ కాపాడినవారవుతారు. అలాగే ఈత నుంచి కూడా దూరంగా ఉండాలి. ప్రమాదభరితంగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. వైద్యశాస్త్రవిజ్ఞానం ఇంతగా పురోగమించిన ఈ రోజుల్లోై ఫిట్స్‌పై దురభిప్రాయాలు తొలగిపోవడం ఎంతో అవసరం. - నిర్వహణ: యాసీన్ ఫిట్స్ రోగిని చూడగానే చేయవలసిన సహాయం మన సమాజంలో ఫిట్స్ రోగిని చూసినప్పుడు చాలామంది వాళ్లకు తాళంచెవులు అందించడం, చేతిలో ఏదైనా లోహపు వస్తువు పెట్టడం వంటివి చేస్తుంటారు. నిజానికి ఇలాంటిపనులు చేయకూడదు. ఫిట్స్ వచ్చిన రోగిని చూసినప్పుడు చేయాల్సినవి... అతడిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. కానీ ఎక్కువగా కదిలించకూడదు నోటిలోగాని చేతిలోగాని బలమైన లోహపు వస్తువులను ఉంచకూడదు రోగి ఒక పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి రోగి కాళ్లు, చేతులు కొట్టుకుంటున్నప్పుడు దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా ఫిట్స్ వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో రోగి తనంతట తానే మామూలు స్థితిలోకి వస్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా లేదా మళ్లీ వెంటనే ఫిట్స్ రావడం ప్రారంభమైనా వీలైనంత త్వరగా అతడిని ఆసుపత్రికి తరలించాలి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి చీఫ్ న్యూరోఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
శరీరానికే వైకల్యం... చెదరనివ్వకు మనోబలం
పక్షవాతం ఎంత ప్రమాదకరమైనదంటే... ఇది వచ్చిన ప్రతి ముగ్గురిలో ఒకరు శాశ్వతంగా అంగవైకల్యం బారిన పడుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు పక్షవాతం బారిన పడుతున్నారు. ఇవీ పక్షవాతం తీవ్రతకు అద్దం పట్టే అంకెలు. ఒకసారి పక్షవాతం బారిన పడితే ఇక వారు జీవితాంతం పక్క మీద పడీ, పక్కవాళ్ల మీద ఆధారపడీ జీవించాల్సిన దుస్థితి అనుకుంటారందరూ. అందుకే గుండెపోటుకూ భయపడనివారు, పక్షవాతం అంటే వణికిపోతుంటారు. అయితే మనోబలం చెడనివ్వకపోవడం, చిరునవ్వు చెరగనివ్వకపోవడాలే దీనికి అసలైన చికిత్సలు. అంతకంటే పెద్ద చికిత్స, సమర్థమైన చికిత్స నివారణే. పైగా ఈ నివారణ చాలా సులభం కూడా. ఈ నెల 29న ప్రపంచ పక్షవాత దినం (వరల్డ్ స్ట్రోక్ డే) సందర్భంగా పై అంశాలపై అవగాహన కలిగించడం కోసమే ఈ కథనం. పక్షవాతం వస్తే శాశ్వతంగా అంగవైకల్యం కలగడానికి ఒక కారణం ఉంది. ఏదైనా కణం దెబ్బతిన్నా లేదా చనిపోయినా ఆ కణం స్థానంలో కొత్త కణాలు పెరిగే అవకాశం ఉంది. కానీ మెదడు కణాలు మాత్రం అలా కాదు. అవి ఒకసారి నశించాయంటే ఇక ఆ నష్టం శాశ్వతం. అందుకే పక్షవాతం వచ్చి, కాళ్లూ చేతులు చచ్చుబడిపోతే అవి సాధారణ స్థితికి రావడం ఒక పట్టాన అసాధ్యం. అందుకే పక్షవాతం లక్షణాలు కనిపించగానే రోగిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. ఒక కుటుంబంలో ఎవరైనా, ఏదైనా వ్యాధికి గురైతే అది వారిని మాత్రమే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కానీ పక్షవాతానికి గురైతే మాత్రం అది మొత్తం కుటుంబ సభ్యులనందరినీ ప్రభావితం చేస్తుంది. అందరికీ ఇక్కట్లను కలగజేస్తుంది. గతంలో ఒక వయసు దాటినవారు పక్షవాతానికి గురయ్యేవారు. కానీ ఇప్పుడు యుక్తవయసులోని వారు కూడా దీని బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, జన్యుపరమైన అంశాలు ఇందుకు కారణం. పక్షవాతానికి కారణాలు: మన శరీరంలోని ప్రతి అవయవానికీ రక్తం నిరంతరం సరఫరా అవుతుండాలి. ఇక మెదడు విషయంలోనైతే అది మరింత అవసరం. ఏదైనా కారణం వల్ల మెదడుకు రక్తసరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే అక్కడి కణాలు మరణించడం జరుగుతుంటుంది. రక్తసరఫరాలో అంతరాయానికి ప్రధానంగా రెండు రకాల కారణాలున్నాయి. మొదటిది... రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టి అది ప్రవాహానికి అడ్డుపడటం. దాదాపు 80 శాతం పక్షవాతం కేసుల్లో ఇదే కారణం. ఇక ఒక్కోసారి రక్తనాళాలు చిట్లడం వల్ల రక్తం బయటకు ప్రవహించడంతో మెదడులోని కొన్ని కణాలకు రక్తసరఫరా అందకపోవడం. దాదాపు 20 శాతం కేసుల్లో పక్షవాతానికి ఈ కండిషన్ కారణమవుతుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా మెదడులోని ఆ రక్తనాళాలు సరఫరా చేసే భాగానికి తగినపోషకాలు, ఆక్సిజన్ అందక ఆ ప్రాంతంలోని కణాలు నశిస్తాయి. దాంతో అవి నియంత్రించే శరీర భాగాలు చచ్చుబడిపోతాయి. లక్షణాలు: పక్షవాతంలోని లక్షణాలు మెదడులో రక్తసరఫరా ఆగిన చోటుపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మెదడులోని కాళ్లూ, చేతులను నియంత్రించే భాగాలకు రక్తసరఫరా ఆగితే ఆ భాగాలు చచ్చుబడతాయి. అలాగే ముఖం, నోరు, కన్ను, ఒక్కోసారి శరీరానికి ఇరువైపులా ఉన్న భాగాలు ప్రభావితం కావచ్చు. దీనివల్ల మాట పడిపోవడం, నిలకడగా/స్థిమితంగా నిలవలేకపోవడం, చూపుకోల్పోవడం, స్పృహకోల్పోవడం కూడా జరగవచ్చు. దాదాపు 90 శాతం కేసుల్లో అకస్మాత్తుగా శరీరంలోని ఒకవైపు సగభాగంపై నియంత్రణ కోల్పోవడం ద్వారా దీని లక్షణాలు బయటపడతాయి. దాంతో పక్షవాతం సోకిన వ్యక్తుల్లో ఒకవైపు శరీర భాగాలు చచ్చుబడిపోవడం మామూలే. అకస్మాత్తుగా ఇలా జరగడాన్ని తప్పనిసరిగా ‘పక్షవాతం’ (స్ట్రోక్)గానే పరిగణించాలి. (నిర్దిష్టంగా అది పక్షవాతం కాదని కచ్చితంగా తెలిసే వరకూ అది పక్షవాతమేనని వైద్యశాస్త్రం పేర్కొంటోంది). మనిషిలో ఒకవైపు శరీర భాగాలు చచ్చుబడిపోవడం వల్ల అతడు నిరాశ, నిస్పృహల్లోకి కూరుకపోవడం, ఫిట్స్ రావడం, కొన్ని శరీరభాగాల్లో నొప్పి, మూత్రం/మలంపై నియంత్రణ కోల్పోవడం, ఎదుటివారితో కమ్యూకేషన్కు అంతరాయం కలగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అయోమయం వంటి లక్షణాలూ ఉంటాయి. ఫలితంగా కుటుంబ సభ్యుల సంబంధాలూ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. దారితేసే అంశాలు: భారతదేశంలో పక్షవాతానికి దారితీసే పరిస్థితుల్లో హైబీపీ (రక్తపోటు) చాలా సాధారణమైనది / ప్రధానమైనది. ఈ పరిస్థితికి పొగతాగడం, స్థూలకాయం, డయాబెటిస్, ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, గుండెజబ్బులు, మితిమీరిన ఆల్కహాల్ అలవాటు, మానసిక ఒత్తిడి, శారీరకంగా తగినంత వ్యాయామం లేకపోవడం, కొద్దిమేరకు కుటుంబ చరిత్ర వంటివి పక్షవాతానికి దారితీసే పరిస్థితుల్లో ముఖ్యమైనవి. నిర్ధారణ: పక్షవాతాన్ని సీటీ స్కాన్ పరీక్ష లేదా ఎమ్మారై (బ్రెయిన్) ద్వారా నిర్ధారణ చేయవచ్చు. సీటీ స్కాన్, ఎమ్మారై ద్వారా పక్షవాతం వల్ల ప్రభావితమైన మెదడులోని ప్రాంతాలను గుర్తించవచ్చు. అలాగే రక్తస్రావం జరిగినా లేదా రక్తనాళాల్లో రక్తపు గడ్డలు అడ్డుపడినా ఆ పరీక్షలో తెలుస్తుంది. దాన్ని బట్టే చేయాల్సిన చికిత్స/కోలుకోగలిగే అవకాశాల (ప్రోగ్నోసిస్)ను నిర్ధారణ చేయవచ్చు. ఒకసారి పక్షవాతం వచ్చిందని నిర్ధారణ అయ్యాక, దానికి కారణాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం సీబీపీ, రక్తంలో చక్కెర పాళ్లు (బ్లడ్ షుగర్), క్రియాటినిన్ వంటి రక్షపరీక్షలు, ఈసీజీ, టూ డి ఎకో వంటి గుండె పరీక్షలు, డాప్లర్ నెక్ వెసెల్స్, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలు, మూత్ర పరీక్ష వంటివి చేయాల్సి ఉంటుంది. రక్తంలో ఒక రకం ప్రొటీన్లయిన హోమోసిస్టిన్ వంటి వాటిని అంచనా వేసే పరీక్ష, ప్రో-కోయాగ్యులెంట్ ఫాక్టర్స్ (రక్తం గడ్డకట్టడానికి దోహదపడే అంశాల) పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది. ఇలా నిర్దిష్టంగా పక్షవాతానికి కారణాన్ని కనుగొంటే దాన్ని బట్టి చికిత్స చేయడం సులభం. ఒక్కోసారి పక్షవాతానికి సంబంధించిన కొన్ని లక్షణాలు తాత్కాలికంగా కనబడితే... త్వరలోనే మరింత తీవ్రస్థాయిలో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని తెలుసుకోడానికి అది సూచనగా పనిచేస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన వారిలో 30 శాతం కంటే ఎక్కువమందిలో ఏడాదిలోపే మరింత తీవ్రంగా మళ్లీ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. చికిత్స: పక్షవాతం వచ్చిన వారికి థ్రాంబోలైటిక్ థెరపీ అనే చికిత్సను అందజేస్తారు. ఈ చికిత్సప్రక్రియలో టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ (టీపీఏ) అనే ఇంజెక్షన్ ఇస్తారు. అది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ఉన్న చోట ఆ రక్తపు గడ్డను విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో రక్తపు గడ్డ అడ్డుతొలగి, మళ్లీ మెదడులోని ఆ భాగానికి రక్త సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. అయితే పక్షవాతం లక్షణాలు కనిపించాక ఎంత త్వరగా ఈ ఇంజెక్షన్ ఇస్తే నష్టం అంత తక్కువగా ఉంటుంది. పక్షవాతం లక్షణాలు కనిపించాక కనీసం నాలుగున్నర గంటలలోపే ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. కోలుకోవడం వేగంగా జరగడంతో పాటు, దుష్ర్పభావాలు తక్కువగా ఉంటాయి. అయితే ఒకసారి పక్షవాతం రావడం అంటూ జరిగితే ఇక రెండోసారి రాకుండా నివారించడమే దీనికి చికిత్సగా పరిగణించవచ్చు. (మొదటిసారి వచ్చిన పక్షవాతం నష్టనివారణ కోసం చేయాల్సిన చికిత్స అంటూ పెద్దగా ఉండదు). ఇందులో భాగంగా రక్తాన్ని పలచబార్చే మందులైన ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటివి ఇవ్వడం, రక్తంలో కొవ్వులు పేరుకోకుండా వాడే స్టాటిన్స్ వంటి మందులు వాడటం... చికిత్సలో భాగంగా ఇస్తారు. ఒకసారి పక్షవాతం కనిపిస్తే పైన పేర్కొన్న మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. అయితే రోగికి హైబీపీ, డయాబెటిస్ వంటివి ఉంటే ఆ మందులు కూడా వాడటం అవసరం. ఒకసారి గుండె సమస్యలు లేదా మెదడుకు రక్తాన్ని చేర్చే కెరోటిడ్ లేదా వర్టిబ్రల్ రక్తనాళాల్లో ఏదైనా సమస్యలు గుర్తిస్తే... పక్షవాతాన్ని నివారించేందుకు వీలుగా మందులు వాడాల్సింది. ఒకవేళ ఆ రక్తనాళాల్లో 70 శాతం కంటే ఎక్కువ అడ్డంకి (బ్లాక్) ఉంటే స్టెంటింగ్ లేదా శస్త్రచికిత్స అవసరమవుతుంది. పక్షవాతం బాధితుల పరిస్థితిని మెరుగుపరచడానికి ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ వంటివి చాలావరకు ఉపయోగపడతాయి. నివారణ: పక్షవాతం విషయంలో చికిత్స గురించి ఆలోచించడం కంటే నివారణ ఎంతో మేలు. ఇది చిన్నప్పట్నుంచే మొదలు కావాలి. నివారణ మార్గాలు కూడా చాలా సులభం. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఆహారంలో కొవ్వులు/ నూనెలు /మసాలాలు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. ఒకసారి అన్నం పెట్టుకున్న తర్వాత పైనుంచి ఉప్పు వేసుకోవడం అలవాటును మానుకోవాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు వంటి పోషకాహారాలను తీసుకోవాలి. కూరల్లో పసుపు ఎక్కువగా వాడటం పక్షవాతం నివారణకు బాగా మేలు చేస్తుంది. శరీరానికి తగినంత శ్రమ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి. తాజా అధ్యయనాల ప్రకారం వంటకు ఆలివ్ ఆయిల్ వాడటం, ముదురు రంగులో ఉండే చాక్లెట్లు పక్షవాతం నివారణకు ఉపయోగపడతాయని తేలింది. ఒకసారి పక్షవాతం వచ్చాక దాన్ని నయం చేసుకునేందుకు అనేక ప్రత్యామ్నాయ వైద్యవిధానాలను అనుసరించడం మన దేశంలో చాలా ఎక్కువ. అయితే అవేవి పెద్దగా సత్ఫలితాలను ఇవ్వవు. గుండెజబ్బుల వంటివి ఉన్నప్పుడు మొదట్నుంచీ రక్తాన్ని పలుచబార్చే మందుల్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల పక్షవాతాన్ని చాలావరకు సమర్థంగా నివారించుకోవచ్చని గుర్తుంచుకోవాలి. పక్షవాతానికి గురైన తర్వాత ఆ శరీర భాగానికి మసాజ్ వంటివి మన దేశంలో ఎక్కువ. అయితే వాటి వల్ల ఉండే ఉపయోగం పరిమితమే అని గుర్తుంచుకొని, నిరాశకు గురికాకుండా/మానసికంగా కుంగిపోకుండా ఉండాలి. ఒకసారి పక్షవాతానికి గురయ్యాక కోలుకోవడం లేదా నయం కావడం మెదడులో దెబ్బతిన్న భాగం ఏ మేరకు కోలుకుంటుందన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక వయసు దాటాక గుండెజబ్బులు, రక్తపోటు వంటి వ్యాధులు ఉన్న పెద్దవారు ఆ మందుల్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే నివారణ సాధ్యం. - నిర్వహణ: యాసీన్ ఈ పరిస్థితి మారడమే ఇప్పటి అవసరం... రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి దాదాపు 40,000 మంది బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురవుతున్నారు. అయితే దురదృష్టవశాత్తు కేవలం వంద మందికి లోపే టీపీఏ చికిత్స తీసుకోగలుగుతున్నారు. అందులోనూ 80 శాతంమందికి పైగా కేవలం హైదరాబాద్‌లోనే ఈ చికిత్స పొందగలుగుతున్నారు. ఇక మిగతా ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతిలో అడపాదడపా మాత్రమే ఈ చికిత్స అందుతోంది. దీనికి ప్రధాన కారణం బ్రెయిన్‌స్ట్రోక్‌కు ఇవ్వాల్సిన ఈ చికిత్సపై పెద్దగా అవగాహన లేకపోవడమే. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి చీఫ్ న్యూరోఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
మెదడుకు మేత...
మెదడుకు మేత అనగానే బ్రెయిన్‌ను చురుగ్గా ఉంచేందుకు గళ్ల నుడికట్లూ, ప్రహేళికలూ అని అనుకోవద్దు. ఇది నోటి ద్వారా తీసుకునే ఆహారమే. కాకపోతే ఏ ఆహారపదార్థాలు మెదడును మందకొడిగా లేకుండా చేస్తాయో, ఏవి చురుగ్గా ఆలోచించేలా చూస్తాయో, ఏవి ఒక వయసు దాటాక మనిషిలో పెరిగే మతిమరపు లాంటి మెదడుకు సంబంధించిన రుగ్మతలను మరింత ఆలస్యం అయ్యేలా దూరంగా నెడతాయో ఆ ఆహారం అన్నమాట. ఆ ఆహారపదార్థాలను గురించి తెలుసుకుంటే ముందునుంచీ వాటిని తీసుకుంటూ వృద్ధాప్యంలో మెదడుకు వచ్చే అనేక సమస్యల నుంచి దాన్ని దూరంగా ఉంచవచ్చు. ఆ అవగాహన కోసమే ఈ కథనం. మీకు తెలుసా... మన మొత్తం శరీర బరువులో మెదడు బరువు కేవలం 2 శాతమే. కానీ గుండె నుంచి పంప్ అయిన రక్తంలో 15 శాతం దానికి విధిగా వెళ్లాల్సిందే! మనం పీల్చే ఆక్సిజన్‌లో 20 శాతం అది స్వీకరించాల్సిందే. అంతేకాదు... మనకోసం తయారయ్యే శక్తిలో ఐదోవంతు అది వినియోగించాల్సిందే. తాను సక్రమంగా పనిచేయాలంటే అవసరమైన భాగమది! పంపకాల్లో ఎక్కువమొత్తాన్ని ‘సింహభాగం’ అంటుంటారు కదా... అలాగే శరీరంలో ఏయే భాగాలు ఎంతెంత తీసుకుంటాయన్న ప్రాతిపదికన దీన్ని ‘మేధభాగం’ అనవచ్చు. ఆరోగ్యకరమైన వ్యక్తి మొత్తం బరువు 60 నుంచి 70 కిలోలు అనుకుంటే, అందులో మెదడు బరువు కేవలం 1400 గ్రాములు. అయినప్పటికీ, మెదడు ఇంత పెద్దమొత్తంలో ఆక్సిజన్, రక్తం, శక్తి ఎందుకు తీసుకుంటుంది? ఎందుకంటే... బరువు ప్రకారం చూస్తే ఇంత చిన్నదైనప్పటికీ, తాను నిర్వహించే విధుల ప్రకారం చూస్తే మాత్రం మన ప్రతి కదలికా, మన ప్రతి ఆలోచనా, మన ప్రతి పనీ లెక్కప్రకారం అన్నీ దానివే! అందుకే మన ఆహారంలో అంతటి భాగాన్ని అది డిమాండ్ చేస్తుంది. అలాంటి మెదడు చురుగ్గా ఉండటానికి, పదికాలాలపాటు హాయిగా పనిచేయడానికి, దీర్ఘకాలం పాటు దాని ఆరోగ్యం చక్కగా ఉంచడానికి తీసుకోవాల్సిన ఆహారపదార్థాలేమిటో తెలుసుకుందాం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ : మెదడు చురుగ్గా సక్రమంగా పనిచేస్తూ దాని పనిలో సునిశితత్వం, వేగం ఉండాలంటే తొలుత దానికి శక్తినిచ్చే గ్లూకోజ్ సరిగా అందాలి. అంటే గ్లూకోజ్ దానికి తొలి ఇంధనం అన్నమాట. అయితే మనం వాడే పెట్రోల్‌లో కలుషిత పదార్థాలుంటే అది మళ్లీ వాహనం పై ప్రభావం చూపినట్లే... దానికి అందే ఫ్యూయల్లోనూ వీలైనంత తక్కువ కాలుష్యాలు ఉండి, ఎక్కువ ప్యూర్‌గా ఉండాలి. అందుకోసం మనం తీసుకోవాల్సిన ఆహారపదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇవి మనకు పొట్టుతీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదాహరణకు దంపుడుబియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి పట్టించిన గోధుమలు వంటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లలో మనం తీసుకోదగ్గ వాటిలో ప్రధానమైనవి. పాస్తా వంటివీ ఇందులో భాగంగా పేర్కొనదగినప్పటికీ మన ప్రాంతంలో వాటివాడకం పెద్దగా ఉండదు. పొట్టుతీయకపోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే... పొట్టుతీసిన ఆహారం నుంచి వచ్చిన గ్లూకోజ్ తక్షణం వినియోగితమైపోతుంది. ఆ తర్వాత మళ్లీ గ్లూకోజ్ అవసరమవుతుంది. కానీ పొట్టుతీయని ఆహారం ద్వారా అందిన గ్లూకోజ్ ఒక క్రమమైన పద్ధతిలో దీర్ఘకాలం పాటు మెదడుకు అందుతూ ఉంటుంది. ఇక తీపి ఎక్కువగా ఉండే పదార్థాలు, చక్కెరతో చేసిన మిఠాయిల నుంచి కూడా గ్లూకోజ్ అందుతుంది. కానీ అది మెదడుకు అందాల్సిన ఆరోగ్యకరమైన గ్లూకోజ్ రూపంలో మాత్రం కాదు. అందుకే దాన్ని కేవలం మన రుచి కోసమే తప్ప... మెదడు కోసం కాదని గుర్తుంచుకోవాలి. ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ (అత్యవసరమైన కొవ్వులు) : కొవ్వులు పరిమిత మోతాదుకు మించితే ఒంటికీ, ఆరోగ్యానికీ మంచిది కాదన్న విషయం తెలిసిందే. మెదడు చురుగ్గా పనిచేయడానికి మాత్రం పరిమిత స్థాయిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కావాల్సిందే. అందుకే మెదడుకు అవసరమైన కొవ్వులను ‘ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్’ అంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... సాంకేతికంగా చూస్తే మెదడు కణాలన్నీ ‘కొవ్వు’పదార్థాలే! మెదడు బరువులో 60 శాతం పూర్తిగా కొవ్వే. ఇక మిగతా దానిలోనూ మరో 20 శాతం ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ నుంచి తయారైన పదార్థాలే. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్‌ను శరీరం తయారుచేసుకోలేదు. కాబట్టి వాటిని విధిగా ఆహారం నుంచి స్వీకరించాల్సిందే. ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అంటే... మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి వాటితో పాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అనుకోవచ్చు. అవి మనకు మాంసాహారం (ప్రధానంగా కోడి మాంసం), గుడ్లు, చేపలు, నట్స్, అవిసెనూనె నుంచి లభ్యమవుతాయి. ఏ కొవ్వులు మంచివి కావంటే... మెదడు సక్రమంగా, చురుగ్గా పనిచేయడానికి కొవ్వులు కావలసినా, మళ్లీ అన్ని కొవ్వులూ మెదడుకు మంచిది కాదు. కొన్ని కొవ్వులు దాన్ని మందకొడిగా చేస్తాయి. సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే ట్రాన్స్‌ఫ్యాట్స్ అని పిలిచే హైడ్రోజనేటెడ్ కొవ్వులు మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవి మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన (పైన పేర్కొన్న) మంచి కొవ్వులను (అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్‌ను) అడ్డుకుంటాయి. ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ కృత్రిమంగా తయారుచేసే డాల్డావంటి పదార్థాలలో ఉంటాయి. వీటిద్వారా తయారుచేసే కేక్‌లు, బిస్కెట్లు మెదడును చురుగ్గా ఉంచలేవు. కాబట్టి మనం కొనే పదార్థాలపై ఉండే పదార్థాల జాబితా (ఇన్‌గ్రెడియెంట్స్ లిస్ట్)ను పరిశీలిస్తే అందులో హైడ్రేజనేటెడ్ ఫ్యాట్స్/ఆయిల్స్ ఉంటే వాటిని కేవలం రుచికోసం పరిమితంగానే తీసుకోవాలన్నమాట. అమైనో ఆసిడ్స్: మెదడులోని అనేక కణాల్లో ఒకదాని నుంచి మరోదానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే వాటిని న్యూరోట్రాన్స్మిటర్స్ అంటారు. ఇదెంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తున్నట్లు లెక్క. ఇందుకు దోహదపడేవే ‘అమైనోఆసిడ్స్’. ఈ అమైనో ఆసిడ్స్ అన్నవి ప్రోటీన్స్ నుంచి లభ్యమవుతాయి. ఇక ఈ న్యూరోట్రాన్స్మిటర్స్ పైనే మన ధోరణులు (మూడ్స్) కూడా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు నిద్ర బాగా పట్టాలంటే సెరటోనిన్ అనే జీవరసాయనం కావాలి. దానికి ట్రిప్టొఫాన్ అనే అమైనో ఆసిడ్ అవసరం. ఈ ట్రిప్టొఫాన్ పాలలో పుష్కలంగా ఉంటుంది. అందుకే మంచినిద్రపట్టాలంటే నిద్రకు ఉపక్రమించేముందు గోరువెచ్చని పాలు తాగాలని సలహా ఇస్తుంటారు డాక్టర్లు. దీనితో పాటు ‘ఓట్స్’లో కూడా ట్రిప్టొఫాన్ ఎక్కువ. విటమిన్లు / మినరల్స్ (ఖనిజాలు): మన మెదడు పనితీరు చురుగ్గా ఉండటానికి అవసరమైన పోషకాల్లో ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజాలు. ఇవి అమైనోఆసిడ్స్ను న్యూరోట్రాన్స్మిటర్లుగా మార్చడంలోనూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మార్చడంలోనూ విశేషంగా తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి బీకాంప్లెక్స్‌లోని బి1, బి6, బి12 ప్రధానంగా అవసరమవుతాయి. ఇవి ప్రధానంగా తాజా కూరగాయల్లో, ఆకుపచ్చని ఆకుకూరల్లో, పాలలో పుష్కలంగా ఉంటాయి. అయితే వీటన్నింటిలోనూ మెదడు చురుకుదనానికి దోహదం చేసే బి12 మాంసాహారంలోనే ఎక్కువ. స్ట్రిక్ట్ వెజిటేరియన్స్‌లోనూ, ఎండకు సోకని వారిలో విటమిన్ ‘డి’, బి12 .. ఈ రెండింటి లోపం వల్ల మెదడు, నరాలు, కండరాలు అంత చురుగ్గా పనిచేయవు. ఇటీవల ఈ కండిషన్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటివారు విధిగా విటమిన్ డి తోపాటు విటమిన్ బి12 పాళ్లను పెంచే సప్లిమెంట్లను బయటి నుంచి తీసుకోవాలి. నీళ్లు: మెదడులోని ఘనపదార్థమంతా కొవ్వులే అయితే... మొత్తం మెదడును తీసుకుంటే అందులో ఉండేది 80 శాతం నీళ్లే. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం. మీకు తెలుసా...? మనం మన మూత్రం ద్వారా, ఉచ్ఛాస్వనిశ్వాసల ద్వారా ఒక రోజులో కనీసం 1.5 నుంచి 2.5 లీటర్ల నీటిని బయటకు విసర్జిస్తుంటాం. నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం అవసరం. దీనికోసం అంత నీటినీ తీసుకోవాలి. ఇక ఎంతగా తక్కువ మోతాదులో నీళ్లు తీసుకునే వారైనా కనీసం 1.5 లీటర్లను తీసుకోవాలి. మిగతాది మనం తీసుకునే ఘనాహారంలోంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల్లో విడుదలయ్యే నీటి నుంచి భర్తీ అవుతుంది. ఒకరు తాము రోజువారీ తీసుకునే నీళ్లు 1.5 లీటర్ల కంటే తగ్గాయంటే వాళ్ల మెదడు పనితీరులో చురుకుదనం ఎంతోకొంత తగ్గుతుందని గుర్తుంచుకోండి. ఆ మేరకు నీరు తగ్గిందంటే అది మీ మూడ్స్‌పై కూడా ప్రభావం చూపుతుందని తెలుసుకోండి. అందుకే రోజూ 6-8 గ్లాసుల నీళ్లతో పాటు... పాలు, మజ్జిగ, పండ్లరసాలు, రాగి జావ వంటివి మెదడును చురుగ్గా ఉంచే ద్రవాహారాలని గుర్తుపెట్టుకోండి. ఇక టీ, కాఫీ అనే ద్రవాహారం చాలా పరిమితంగా (రోజుకు రెండు కప్పులు) ఉంటే పరవాలేదు. అంతకు మించితే అది మెదడును తొలుత చురుగ్గా చేసినా, వేగంగా అలసిపోయేలా చేస్తుంది. చక్కెర కలిపిన పానీయాలతోనూ అదే జరుగుతుంది. పై జాగ్రత్తలతో ఆహారం తీసుకుంటే మెదడు కలకాలం చురుగ్గా పనిచేస్తుంది. -నిర్వహణ: యాసీన్ మేలు చేసే ఆహారాలు మీ మెదడు చురుగ్గా పనిచేయాలనుకుంటే ఈ కిందివి మీరు తినేవాటిల్లో ఉండేలా చూసుకోండి. చేపల్లో : పండు చేప / పండు గప్ప, వంజరం, కనగర్తలు (మాకరెల్) ... వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ. నూనెల్లో : ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్, కొవ్వులను అరికడుతుంది. కాబట్టి మెదడుకు వచ్చే పక్షవాతం, అల్జైమర్స్ వ్యాధులను నివారిస్తుంది. నట్స్: అక్రోట్ (వాల్నట్) మెదడుకు చాలా మేలు. ఇది అచ్చం మెదడు ఆకృతిలో ఉండటం ఒక విశేషం. పండ్లలో: మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీలు మంచివి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటివి మెదడుకు మంచివి. ఆకుకూరలు, కూరగాయల్లో : పాలకూర మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇక బీట్రూట్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచి, అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. డార్క్చాకొలెట్ (కోకో), గ్రీన్ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి. హాని చేసే ఆహారాలు నిల్వ ఉంచిన ఉప్పటి పదార్థాలైన చిప్స్, టిన్డ్ సూప్స్ మెదడుకు హానికరంగా పరిణమిస్తాయి. కాబట్టి వాటిని పరిమితంగా తీసుకోవాలి. ఉప్పు రోజుకు 6 గ్రాములకు మించితే అది ఆరోగ్యంతో పాటు మెదడుకూ కీడే. ద్రవాహారాల్లో : కోలా డ్రింక్స్, తీపి ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్, అన్నిరకాల శీతల పానీయాలు త్వరితంగా శక్తినిచ్చినా, మెదడును అలిసిపోయేలా చేసి ఆ తర్వాత చాలాసేపు మందకొడిగా మారుస్తాయి. కొవ్వుల్లో డాల్డా, మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు అంత మంచిది కాదు. మాంసాహారం తినేవారు కొవ్వు తక్కువగా ఉండే స్కిన్లెస్ చికెన్, చేపలే తీసుకోవాలి. బటర్, క్రీమ్ కూడా పరిమితంగా వాడాలి. ఆల్కహాల్ మెదడుకు హాని చేస్తుంది. ఇది తీసుకున్నప్పుడు తక్షణ ప్రభావంగా మెదడును చురుగ్గా ఉన్నట్లు చేసినా... దీర్ఘకాలంలో డిమెన్షియా (మతిమరపు) వంటి మెదడు సమస్యలకు దోహదం చేస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మానేయాలి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి చీఫ్ న్యూరో ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.