శ్రీవారి సామెతలు | Hot Numbers | Sakshi
Sakshi News home page

శ్రీవారి సామెతలు

Published Tue, Mar 4 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

శ్రీవారి సామెతలు

శ్రీవారి సామెతలు

మొన్న మా బుజ్జిగాడు ఏదో కొనివ్వమని అడుగుతుంటే ‘‘ఏరా? డబ్బులంటే ఏం చెట్లకు కాస్తున్నాయా’’ అంటూ కాస్త కోప్పడుతూ విసురుగా డబ్బులిచ్చారు మా వారు. అదేరోజున వాళ్ల ఫ్రెండ్ ఏదో పార్టీ అడిగితే..

ఆ రాత్రి నాలుగు వేలు ఖర్చుపెట్టి మరీ ట్రీట్ ఇచ్చారు. అలా ఇస్తున్న సమయంలో ఒక దశలో ‘‘డబ్బులదేముంది గురూ! కుక్కను కొడితే రాలతాయి’’ అన్నారు.  ఆ రోజు పొద్దున్న మా బుజ్జిగాడు అడిగినందుకు... చెట్లకు కాసిన కాసుల్ని బోల్డంత కష్టపడి, తెంపి ఆయన గారు ఇచ్చిన మొత్తం నలభై రూపాయలు. అదే రాత్రి కుక్కను తన్నినంత తేలిగ్గా మా ఆయనగారు ఖర్చు పెట్టిన మొత్తం నాలుగు వేలు! ఎప్పుడు మారతారో ఈ మగాళ్లు?
 

వాళ్లు మాట్లాడేమాటలూ, వాళ్లు ఉపయోగించే సామెతలు అన్నీ తప్పే. కానీ ఆ మాటంటే మాత్రం ఒప్పుకోరు. నిజంగానే డబ్బు చెట్లకు కాస్తే దాని విలువ తెలిసేది. పాదు చేసి, పంటవేసి, నారు పోసి, నీరు పెట్టి, అంకురం కోసం వేచి చూసి, ఎరువు వేసి, కలుపు తీసి, కంచె కట్టి, కాయ కాచేదాకా కళ్లూ కాయలయ్యేలా ఎదురు చూసి, పంట కోసి, కాసులను దోసిట్లో పట్టుకుని చూస్తే... అప్పుడు ‘డబ్బు చెట్లకు కాస్తుందనుకున్నావా?’ అనే సామెతను ఎవరూ వాడరు. ఆ మాటకొస్తే కాసు సేద్యంలో కష్టం తెలుస్తుంది. ద్రవ్యోల్బణం అనే మాట ఉనికి కోల్పోయేది.
 

 ఇక మా శ్రీవారి మరోమాట...
 ‘ఆదాయం సరిపోవడం లేదురా మగడా’ అంటే... సంపాదన మానేసి మావారు సందుల్లో కుక్కల కోసం వెతుకుతున్నారు. ‘ఎందుకురా మగడా’ అంటే తన్నడానికట. ‘అదేమిటీ’ అని అడిగితే... ‘కుక్కను తంతే డబ్బులు రాలతాయట’ అంటూ సామెత చెబుతున్నారు. మొన్నే రాత్రి డ్యూటీ తర్వాత కుక్కతో కరిపించుకుని వచ్చారు.

 నాకు ఒళ్లుమండి ‘చూడక తొక్కారా? డబ్బు కోసం చూసే తన్నారా?’ అని అడిగా. ‘ఏ సందులో ఏ కుక్కుందో ఎవరికి తెలుసు’ అని తాత్వికంగా అన్నారు.

 నేను మాత్రం ‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’ అనే సామెతను మాటలకూ, చేతలకూ సరిపెట్టకుండా... ‘బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లకైనా దుడ్డు కావాలి కదా’ అంటూ కొత్త సామెత చెప్పి... ఆయనకు తననే ఓ ఉదాహరణగా చూపించా.
 యన మాత్రం ‘ప్రతి కుక్కకూ ఓ రోజొస్తుంది, చూస్తూ ఉండు’ అంటూ నా మాట పూర్తిగా వినకుండానే వెళ్లిపోయారు. ఆ రోజు ఎప్పుడొస్తుందోనంటూ ఉసూరుమంటూ... మా పెరట్లోని చెట్లకు డబ్బు కాసే రోజు కోసం ఓపిగ్గా
 ‘కాసు’క్కూర్చున్నాను.       - యాసీన్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement