మొరటు మాటల మొగుళ్లూ... అందుకే ఈ విరుగుళ్లూ!
ఉత్త(మ)పురుష
ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త కోపర్నికస్సు కస్సూబుస్సూమంటూ కోపంతో ఎప్పుడూ ఆకాశంలోకి చూస్తూ ఉండేవాడంటారు మా శ్రీవారు. ఆయన నమ్మకం ఏమిటంటే... అలనాడు పెళ్లాం మీద అలిగినప్పుడల్లా కోపర్నికస్సు... తన ఖర్మకొద్దీ ఇలా జరుగుతోందంటూ అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయేవాడట.
అలా చూస్తూ చూస్తూ ఉండే క్రమంలో అలా టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అన్న ఆలోచన ఆయనలో బయల్దేరిందట. తన బతుకూ ఆకాశం లాగే శూన్యమైపోయింది కాబట్టి, తన జీవితంలో ఆనందం గగనమైపోయిందట.
కాబట్టి ఆ గగనంలోనే ఆయన ఏదో వెతుక్కునే క్రమంలో సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదనీ, భూమే సూర్యుని చుట్టూ తిరుగుతోందని కనిపెట్టాడన్నది మా ఆయన ఉవాచ. పైగా ఇందులో కాస్త పురుషాధిపత్యం కూడా ఉంది. సూర్యుడు పుంలింగం. భూమి స్త్రీలింగం.
అలాంటప్పుడు సూర్యుడి చుట్టూ భూమి తిరగాలి గానీ... భూమి చుట్టూ సూర్యుడు తిరగడమేమిటి నాన్సెన్స్ అన్న భావనే ఇందులో ఉంది, ఆ తర్వాత యాదృచ్ఛికంగానూ, కోపర్నికస్సు అదృష్టం కొద్దీనూ సైన్సు ప్రకారం కూడా అదే నిజమని ఆ తర్వాత తేలిందన్నది ఆయన వాదన.
భార్యల మీద కోపం కొద్దీ ఇలాంటి పిచ్చివాదనలు చాలా చేస్తుంటారాయన. నా మీద అలిగి, తానూ శూన్యంలోకి చూస్తూ, చుక్కలు లెక్కిస్తూ కోపర్నికస్సును గుర్తు తెచ్చుకున్నారు మా శ్రీవారు. ఈసారి తన కోపానికి కారణం మా తరఫు బంధువులట. భార్యలనూ, ఆమె తరఫు చుట్టాలనూ ఇలా ఆడిపోసుకోవడం చాలామంది భర్తలకు మామూలే కదా.
ఈ క్రమంలో ఆ రోజున మా పేరెంట్స్ కూడా ఆయన బారిన పడ్డారు. మాది మాటమీద నిలబడే వంశం కాదట. మావాళ్లంతా మాట తప్పారట. అనుకున్నట్టుగా లాంఛనాలేమీ పెట్టలేదనీ, పెళ్లికి అనుకున్నవన్నీ ఇవ్వలేదనీ అన్నారాయన. ఈ జాడ్యం చాలా మంది మొగుళ్లకూ ఉంటుంది. కానీ మావారి విషయంలో ఈ మధ్య ఇది మరీ పెచ్చుమీరి పోయింది.
ఇక ఓ హద్దు వరకూ సహించి, ఆ తర్వాత ఊరుకోలేక నేనూ ఓ మాట అన్నా. మీరు అనుకున్నట్టు మాదీ, మా పేరెంట్స్‌దీ మాట తప్పే వంశం కాదు. మాట మీద నిలబడే వంశం. మీకో విషయం తెలుసా? నాకు ఐదేళ్లున్నప్పుడు ఇచ్చిన మాటను మా అమ్మ సరిగ్గా పదిహేనేళ్ల తర్వాత గుర్తుపెట్టుకుని నిలబెట్టుకుంది తెలుసా?’’ అన్నాను.
‘‘ఏమిటా మాట’’ అడిగారు ఆయన ఆసక్తిగా. ‘‘అప్పట్లో నేను చిన్నదాన్ని. తెగ అల్లరి చేసేదాన్నట. అలా బువ్వ తిననంటూ నేను తెగ మారాం చేస్తూ ఉంటే, నా అల్లరి భరించలేక మా అమ్మ నాకో హెచ్చరిక లాంటి వాగ్దానం చేసింది. ఆ తర్వాత అది పట్టుబట్టి నెరవేర్చింది.’’
‘‘ఊరించకు. తొందరగా చెప్పు’’ అన్నారాయన.
‘‘అప్పుడూ... ఇలాగే అల్లరి చేస్తూ ఉంటే బూచోడికి పట్టిస్తా అంది. నాకు మీతో పెళ్లి చేసి తన మాట నిలబెట్టుకుంది’’ అన్నాన్నేను. అంతే... అప్పట్నుంచి మాది ఆడి తప్పే వంశమని మా శ్రీవారు మళ్లీ అంటే ఒట్టు!
- యాసీన్