Astronomer
-
ఖగోళ రహస్యాలను చేధించిన ఎడ్విన్ హబుల్.. టెలిస్కోప్‌తో ఎన్నో ఆవిష్కరణలు
ఖగోళ వింతలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు? టెలిస్కోప్ ఆవిష్కణలతో ఆకాశ వింతల్ని దగ్గరన్నుంచి చూసి విశ్వం రసహ్యాలను తెలుసుకోవచన్న సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే చాలా టెలిస్కోప్‌లు ఉన్నాయి. కానీ చరిత్రలో కొన్ని టెలిస్కోపులకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. అందులో ఒకటి హబుల్ టెలిస్కోప్. విశ్వ రహస్యాలను మన కళ్లముందు ఉంచడంతో పాటు అంతరిక్షంలో బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. . ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ గౌరవార్థం హబుల్ స్పేస్ టెలిస్కోప్‌కు ఆ పేరు పెట్టారు. ఇవాళ(సోమవారం)ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ. అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త అయిన ఎడ్విన్ హబుల్ నవంబర్ 20, 1889లో మిస్సౌరీలోని మార్ష్‌ఫీల్డ్‌లో జన్మించాడు. 1910లో అతను చికాగో విశ్వవిద్యాలయం నుంచి చదువు పూర్తిచేశాడు.ఖగోళ శాస్త్రంలో అనేక అధ్యయనాలు చేసి విశేష గుర్తింపు పొందాడు. గెలాక్సీలను అధ్యయనం చేయడంలో హబుల్ ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడ్డాయి. 1923లో నెబ్యులాలో సెఫీడ్ వేరియబుల్స్ అని పిలువబడే ఒక రకమైన నక్షత్రాన్ని కనుగొన్నాడు, నెబ్యులా అనేక వందల వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని (పాలపుంత గెలాక్సీ వెలుపల) ఇది మరొక గెలాక్సీ అని హబుల్ నిర్ధారించాడు. విశ్వంలో అనేక గెలాక్సీలు ఉన్నాయని తన పరిశోధనల ద్వారా కనుగొన్నాడు. గెలాక్సీల రెడ్‌షిఫ్ట్, దూరం మధ్య స్థిరమైన సంబంధాన్ని కనుగొనడం ద్వారా విశ్వం విస్తరిస్తోంది అని నిరూపించాడు. ఇక హబుల్ పేరుమీద హబుల్ స్పేస్ టెలిస్కోప్ అని పేరు పెట్టారు. ఇది హబుల్ స్పేస్ టెలిస్కోప్..ఇది అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి ప్రధాన ఆప్టికల్ టెలిస్కోప్. 1990లో దీన్ని ప్రయోగించారు. ఎడ్విన్ హబుల్ గౌరవార్థం టెలిస్కోప్‌కు ఆ పేరు పెట్టారు. విశ్వం పరిమాణమెంతో అంచనా కట్టేందుకు మొదలుకొని,నక్షత్రాలు, గ్రహాల పుట్టుక వంటివెన్నో విషయాలను అంచనా వేయడానికి హబుల్ టెలిస్కోపు పరిశోధనలు కీలకపాత్ర వహించాయి. సౌరకుటుంబం అవతల ఉన్న గ్రహాల రూపురేఖలు, వాటిల్లో ఉండే రసాయనాల వివరాలు తెలిసింది కూడా హబుల్ తీసిన ఫొటోల ఆధారంగానే. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం వరకూ చూడగల సామర్థ్యమున్న హబుల్ టెలిస్కోపు నక్షత్రాలు ఎంత వేగంగా కదులుతున్నాయో కూడా ఫోటోలు తీసి పంపించింది. వీటి ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విశ్వం వయసు 1300 నుంచి 1400 కోట్ల సంవత్సరాల వరకూ ఉంటుందని అంచనా కట్టగలిగారు.ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని తొలిసారి నేరుగా ఫొటో తీయగలిగింది కూడా ఈ టెలిస్కోప్ ద్వారానే. -
‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ అంటే ఏమిటి? సూర్యుని కన్నా ఎంత శక్తివంతమైనది?
అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం 800 కోట్ల క్రితం విశ్వంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన విస్ఫోటనాన్ని గుర్తించింది. ఈ విస్ఫోటనం ఇన్ని వందల కోట్ల ఏళ్లకు భూమికి చేరుకుందని వారు తెలిపారు. ఈ పేలుడును ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ (ఎఫ్ఆర్బీ) అని అంటారు. కొత్తగా గుర్తించిన ఈ విస్ఫోటనానికి ఎఫ్ఆర్బీ-20220610ఏ అని పేరు పెట్టారు. గత ఏడాది జూన్ 10న రేడియో టెలిస్కోప్ సాయంతో దీనిని గుర్తించారు. ఈ విస్ఫోటనం ఎక్కడ నుండి ఉద్భవించిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చిలీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ, వెరీ లార్జ్ టెలిస్కోప్‌ను ఉపయోగించారు. ఈ ఎఫ్ఆర్బీ ఇప్పటివరకూ కనుగొన్న అన్ని ఎఫ్ఆర్బీల కంటే పురాతనమైనదని, అత్యంత దూరం కలిగినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’లనేవి రేడియో తరంగాల ప్రకాశవంతమైన పేలుళ్లు. వీటి వ్యవధి మిల్లీసెకండ్ స్కేల్లో ఉంటుంది. ఈ కారణంగానే వాటి మూలాన్ని గుర్తించడం, అంతరిక్షంలో వాటి స్థానాన్ని కనుగొనడం అత్యంత కష్టమైన పని. ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ను మొదటిసారిగా 2007 సంవత్సరంలో కనుగొన్నారు. నాటి నుండి శాస్త్రవేత్తలు దాని మూలాన్ని కనుగొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యుడు ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసేంత శక్తిని ఈ పేలుళ్లు సెకనులో వెయ్యి వంతులో ఉత్పత్తి చేస్తాయి. ఎఫ్ఆర్బీ పేలుళ్లు ఎందుకు సంభవిస్తాయో శాస్త్రవేత్తలు నేటికీ గుర్తించలేకపోయారు. అయితే ఎఫ్ఆర్బీలు విశ్వంలో జరిగే సాధారణ దృగ్విషయం అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. శాస్త్రవేత్తల అభిప్రాయంలో ఈ దృగ్విషయాలను అధ్యయనం చేయడం వలన విశ్వం ఎలా ఏర్పడిందనేది తెలుసుకునేందుకు సహాయపడుతుంది. అత్యంత వేగవంతమైన ఈ రేడియో పేలుళ్లు అనూహ్యంగా ఉంటాయి. వాటిని గమనించడం కష్టం. కెనడాలోని డొమినియన్ రేడియో ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ ఎఫ్ఆర్బీలను ట్రాక్ చేసే అబ్జర్వేటరీలలో ఒకటి. శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఎఫ్ఆర్బీలపై మరింత అవగాహన కలిగేందుకు దోహదపడనుంది. కాగా ఈ అధ్యయనం వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇది కూడా చదవండి: యూదుడైన్ ఐన్‌స్టీన్ హిట్లర్ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? -
Nicole Oliveira: ఎనిమిదేళ్ల స్పేస్ సైంటిస్ట్.. నాసాతో కలిసి పనిచేస్తోంది
నికోల్ ఒలివెరా.. వయసు ఎనిమిదేళ్లు.. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసే వయసు.. కానీ ఆమె ఏం చేస్తోందో తెలుసా..? అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలిసి పనిచేస్తోంది. ఇది నిజమే.. అంతరిక్షంలో గ్రహశకలాల (ఆస్టరాయిడ్ల)ను గుర్తించే ‘ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సెర్చ్ కొలాబరేషన్’ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 18 ఖగోళ వస్తువుల (స్పేస్ ఆబ్జెక్ట్స్)ను గుర్తించింది కూడా. ప్రస్తుతం ప్రపంచంలోనే చిన్న వయసు ఆస్ట్రోనమర్‌గా నికోల్ నిలిచింది. బ్రెజిల్‌లోని ఫోర్టాలెజా ప్రాంతానికి చెందిన నికోల్ ఒలివెరాకు చిన్నప్పటి నుంచే అంతరిక్షం అంటే ఇష్టమట. నడక నేర్చుకునే వయసులోనే ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు అంటూ పాఠాలు నేర్చుకుందట. నాసా స్పెషల్ ప్రాజెక్టుతో.. పిల్లలు, టీనేజీ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి కలిగించడం, వారే సొంతంగా కొత్త అంశాలను గుర్తించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా కొన్నేళ్ల కింద నాసా ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థుల్లో ప్రత్యేక ఆసక్తి, నైపుణ్యాలు ఉన్నవారిని ఎంపిక చేసి అందులో భాగస్వామ్యం చేసింది. దీనిలో నికోల్ ఒలివెరా ‘ఆస్టరాయిడ్ హంటర్’ బాధ్యతలకు ఎంపికైంది. రెండు పెద్ద స్క్రీన్లు ఉన్న కంప్యూటర్‌పై నాసా ఇచ్చే స్పేస్ మ్యాప్‌లను పరిశీలిస్తూ.. టెలిస్కోప్‌తో అంతరిక్షాన్ని జల్లెడపడుతూ.. 18 స్పేస్ ఆబ్జెక్ట్స్‌ను గుర్తించింది. నాసా శాస్త్రవేత్తలు మరోసారి వాటిని పరిశీలించి, ఆస్టరాయిడ్లుగా సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఆ ఆస్టరాయిడ్లకు బ్రెజిల్ శాస్త్రవేత్తల పేర్లు పెడతానని నికోల్ చెప్తోంది. అంతేకాదు.. పెద్దయ్యాక ఏరోస్పేస్ ఇంజనీర్ అయి రాకెట్లను తయారు చేయాలని ఉందని పేర్కొంది. -
రాకెట్ ప్రమాదంలో ‘మ్యాడ్ మైక్’ దుర్మరణం
లాస్ఏంజెలెస్ : భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని చెప్పిన ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త మైఖేల్ ‘మ్యాడ్ మైక్’హ్యూస్.. ఈ నెల 22న ఓ రాకెట్ ప్రమాదంలో మరణించారు. తాను సొంతంగా తయారు చేసుకున్న రాకెట్‌ను పరీక్షించే ప్రయోగం విఫలం చెందడంతో మరణించారు. భూమి గుండ్రంగా లేదని నిరూపించేందుకు తన స్టీమ్ రాకెట్‌తో అంతరిక్షంలోకి వెళ్లారు. ప్రయోగించిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విఫలమైంది. దాదాపు భూమికి 1,500 మీటర్ల ఎత్తుకు వెళ్లాలన్నది తన కోరిక అని చెప్పారు. అక్కడికి వెళ్లి భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగా, గుండ్రటి డిస్క్ మాదిరిగా ఉంటుందని నిరూపిస్తానని పేర్కొన్నారు. కానీ కిందకు దిగకుండానే ఆయన ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. -
భారతీయుడి నమ్మకమే ‘పార్కర్‌కు’ పునాది
న్యూఢిల్లీ: 60 ఏళ్ల క్రితం సౌర గాలులు ఉన్నాయంటూ పార్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని భారత సంతతి ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ గుర్తించకుం టే తాజా ప్రయోగం సాకారమయ్యేదే కాదు. సూర్యుడి నుంచి ఆవేశపూరిత కణాలు నిరంతరం అంతరిక్షంలోకి ప్రసారమవుతూ.. అక్కడి ప్రాంతాన్ని నింపుతున్నాయని 1958లో పార్కర్ గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి విశ్లేషణలతో కూడిన థియరీ పేపర్‌ను ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌కు సమర్పించారు. అయితే, ఇద్దరు పరిశోధకులు దీనిని తిరస్కరించారు. దీనికి కారణం అంతరిక్షాన్ని కేవలం శూన్య ప్రదేశంగా భావించే రోజులవి. అయితే ఆ సమయంలో జర్నల్‌కు సీనియర్ ఎడిటర్‌గా ఉన్న చంద్రశేఖర్.. పార్కర్ సిద్ధాంతాన్ని పబ్లిష్ చేయాలని నిర్ణయించారు. చంద్రశేఖర్ ఆ నిర్ణయం తీసుకోకుంటే ఈ ప్రయోగం జరిగేది కాదని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ సోలార్ స్టెల్లార్ ఎన్విరాన్మెంట్కు చైర్మన్‌గా పనిచేస్తున్న నంది వెల్లడించారు. నక్షత్రాల నిర్మాణ, పరిమాణ క్రమంలో భౌతిక ప్రక్రియల ప్రాముఖ్యతపై చేసిన పరిశోధనలకు గాను 1983లో ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతిని విలియమ్ ఏ ఫోలర్తో కలసి సంయుక్తంగా ఆయన అందుకున్నారు. అలాగే చంద్రశేఖర్ సేవలకు గుర్తుగా 1999లో చంద్రశేఖర్ పేరుతోనే ‘చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీ’అనే అంతరిక్ష ప్రయోగాన్ని నాసా చేపట్టింది. -
ప్రజా సందర్శనకు హాకింగ్ కుర్చీ, కంప్యూటర్
లండన్: ఇటీవల కన్నుమూసిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌కు చెందిన చక్రాల కుర్చీని, ఆయన సంభాషించేందుకు వాడిన ప్రత్యేక కంప్యూటర్ను ప్రజా సందర్శనకు ఉంచే అవకాశముందని బ్రిటన్‌కు చెందిన ‘ది సండే టైమ్స్’ పత్రిక తెలిపింది. హాకింగ్ స్మృతుల్ని సజీవంగా ఉంచేందుకు వీలుగా ఈ రెండింటిని ఏదైనా మ్యూజియానికి ఇచ్చే అంశాన్ని ఆయన కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారని వెల్లడించింది. లండన్‌లోని సైన్స్ మ్యూజియంలో హాకింగ్ జీవితచరిత్ర, ఉపన్యాసాల వీడియోలతో పాటు చక్రాల కుర్చీ, కంప్యూటర్ను ప్రదర్శనకు ఉంచే అవకాశముందని పేర్కొంది. హాకింగ్ వాడిన చక్రాల కుర్చీ స్వీడన్లో తయారైందనీ, ఓసారి చార్జింగ్ పెడితే ఇది గంటకు 13 కి.మీ వేగంతో 32 కి.మీ దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు. -
ఆరిపోతూ.. వెలుగునిచ్చింది!
అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని కలలుకన్న ప్రియాంక శ్రీహరికోటకు వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదం బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన వైద్యులు జీవన్‌దాన్ సహకారంతో చెన్నై ఫోర్టిస్‌కు గుండె తరలింపు ‘యశోద’కు కాలేయం, ఒక కిడ్నీ.. నిమ్స్‌కు రెండో కిడ్నీ తరలింపు సాక్షి, హైదరాబాద్: అంతరిక్ష శాస్త్రవేత్త కావాలనేది ఆ బాలిక కల. దానిని నిజం చేసుకునేందుకు చిన్నతనం నుంచే ఎంతో శ్రమించింది. అంతరిక్షం గురించి ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటూ తన ఆశయ సాధన దిశగా ముందుకు సాగింది. అంతరిక్ష ప్రయోగాల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఈ నెల 17న తోటి విద్యార్థులతో కలసి శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం సందర్శనకు వెళ్లింది. అయితే అంతలోనే విధి వక్రీకరించింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను వెంటాడింది. వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించడంతో.. తను కన్నుమూస్తూ మరో నలుగురి జీవితాల్లో అవయవదానంతో వెలుగులు నింపింది. స్టడీ టూర్‌కు వెళ్లి వస్తూ.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం శెట్టిగూడెం పరిధిలోని అస్లా తండాకు చెందిన భీమా, మంగమ్మ దంపతుల కుమార్తె ప్రియాంక(15) సూర్యాపేటలోని సాహితి హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి ప్రియాంక చాలా చురుగ్గా ఉండేది. చదువులోనూ అందరికంటే ముందుండేది. అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని కలలు కనేది. తరగతి గదిలో చదువుకున్న అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని స్వయంగా సందర్శించి, పరిశోధనలకు సంబంధించిన అనేక అంశాలు తెలుసుకోవాలని భావించింది. ఈ నెల 17న స్టడీ టూర్లో భాగంగా తోటి విద్యార్థులతో కలసి శ్రీహరికోటలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ను సందర్శించింది. మరుసటి రోజు అక్కడి నుంచి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలోని దామరచర్ల వద్ద రాత్రి 10.30 గంటలకు డిన్నర్ కోసం స్కూల్ ప్రిన్సిపాల్ శాంత, తోటి విద్యార్థిని ప్రాణేశ్వరితో కలసి ప్రియాంక బస్సు దిగింది. హోటల్‌కు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ వాహనం వీరిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ శాంత, సహ విద్యార్థిని ప్రాణేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, తలకు తీవ్ర గాయాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రియాంకను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక విమానంలో చెన్నైకి గుండె.. ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం అదే రోజు మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి ప్రియాంకను తరలించారు. చికిత్సకు ఆమె స్పందించక పోవడంతో గురువారం రాత్రి బ్రెయిన్‌డెడ్‌గా డిక్లేర్ చేశారు. అవయవ దానం గురించి ప్రియాంక తల్లిదండ్రులకు వివరించగా.. కుమార్తె అవయవాలను దానం చేసేందుకు వారు అంగీకరించడంతో జీవన్‌దాన్‌కు సమాచారం ఇచ్చారు. ఆమె నుంచి గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాలు సేకరించారు. జీవన్‌దాన్ సహకారంతో చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ హృద్రోగికి గుండెను అందించారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో గుండెను శంషాబాద్ నుంచి చెన్నై తీసుకెళ్లారు. గ్రీన్ చానల్ సహాయంతో 20 నిమిషాల్లోనే గుండెను ఆస్పత్రి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. కాగా, కాలేయం దెబ్బతిని కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో బాధితుడికి కాలేయాన్ని, మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడికి ఓ కిడ్నీని దానం చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మరో బాధితుడికి రెండో కిడ్నీని ఇచ్చారు. రెండు కార్నియాలను ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థకు అందజేశారు. -
మానవాళి మనుగడ వెయ్యేళ్లే!
శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జోస్యం లండన్: జీవనానికి అనువైన మరో గ్రహాన్ని అన్వేషించకుంటే.. భూమిపై మానవజీవనం మరో వెయ్యేళ్లకు మించి ఉండదని ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. ‘భౌతికశాస్త్రంలో పరిశోధనలకు ఈ ఏడాది అత్యంత యోగ్యమైన సంవత్సరం. పరిశోధనా కోణంలో విశ్వముఖచిత్రం50ఏళ్లలో చాలా మారింది. ఇందులో నా పాత్రా ఉన్నందుకు ఆనందంగా ఉంది. ప్రకృతి సూత్రాలను అర్ధంచేసుకోగలిగితే విశ్వ రహస్యాలను ఛేదించడంలో విజయం సాధిస్తాం’ అని శాస్త్రపరిశోధనల చర్చావేదిక అరుున ‘ఆక్స్ఫర్డ్ యూనియన్’లో సోమవారం వ్యాఖ్యానించినట్లు ‘ది ఇండిపెండెంట్’ వెల్లడించింది. -
నక్షత్రం నుంచి ఎగసిపడుతున్న ఫిరంగి జ్వాలలు
వాషింగ్టన్: దాదాపు అంగారక గ్రహం సైజులో ఓ గుర్తుతెలియని నక్షత్రం నుంచి ఫిరంగి గుండ్ల మాదిరి జ్వాలలు ఎగసిపడుతున్నాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ గుర్తించింది. మరణిస్తున్న ఆ నక్షత్రం నుంచి అతి వేగంగా జ్వాలలు వెలువడుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్లాస్మా బంతుల రూపంలో వెలువడుతున్న ఇవి ఎంత వేగంగా శూన్యం గుండా ప్రయాణిస్తున్నాయంటే.. భూమి నుంచి చంద్రుడి వరకు ఉన్న దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో వెళ్లగలుగుతాయి. దాదాపు 400 సంవత్సరాల నుంచి ప్రతి ఎనిమిదిన్నర ఏళ్లకోసారి ఇలాంటి జ్వాలలు ఎగసిపడుతాయని పరిశోధకులు చెప్పారు. అయితే ఈ ఫిరంగుల వంటి మంటల విషయం ఇప్పటికీ ఖగోళ శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు. ఈ నక్షత్రం ఎర్రని రంగులో ఉబ్బినట్లుగా ఉండి, దాదాపు 1200ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరణిస్తున్న సమయంలో నక్షత్రాలు వాటిలోని దాదాపు సగం ద్రవ్యరాశి పదార్థాలను అంతరిక్షంలోకి వెదజల్లుతాయని గుర్తించారు. -
మొరటు మాటల మొగుళ్లూ... అందుకే ఈ విరుగుళ్లూ!
ఉత్త(మ)పురుష ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త కోపర్నికస్సు కస్సూబుస్సూమంటూ కోపంతో ఎప్పుడూ ఆకాశంలోకి చూస్తూ ఉండేవాడంటారు మా శ్రీవారు. ఆయన నమ్మకం ఏమిటంటే... అలనాడు పెళ్లాం మీద అలిగినప్పుడల్లా కోపర్నికస్సు... తన ఖర్మకొద్దీ ఇలా జరుగుతోందంటూ అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయేవాడట. అలా చూస్తూ చూస్తూ ఉండే క్రమంలో అలా టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అన్న ఆలోచన ఆయనలో బయల్దేరిందట. తన బతుకూ ఆకాశం లాగే శూన్యమైపోయింది కాబట్టి, తన జీవితంలో ఆనందం గగనమైపోయిందట. కాబట్టి ఆ గగనంలోనే ఆయన ఏదో వెతుక్కునే క్రమంలో సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదనీ, భూమే సూర్యుని చుట్టూ తిరుగుతోందని కనిపెట్టాడన్నది మా ఆయన ఉవాచ. పైగా ఇందులో కాస్త పురుషాధిపత్యం కూడా ఉంది. సూర్యుడు పుంలింగం. భూమి స్త్రీలింగం. అలాంటప్పుడు సూర్యుడి చుట్టూ భూమి తిరగాలి గానీ... భూమి చుట్టూ సూర్యుడు తిరగడమేమిటి నాన్సెన్స్ అన్న భావనే ఇందులో ఉంది, ఆ తర్వాత యాదృచ్ఛికంగానూ, కోపర్నికస్సు అదృష్టం కొద్దీనూ సైన్సు ప్రకారం కూడా అదే నిజమని ఆ తర్వాత తేలిందన్నది ఆయన వాదన. భార్యల మీద కోపం కొద్దీ ఇలాంటి పిచ్చివాదనలు చాలా చేస్తుంటారాయన. నా మీద అలిగి, తానూ శూన్యంలోకి చూస్తూ, చుక్కలు లెక్కిస్తూ కోపర్నికస్సును గుర్తు తెచ్చుకున్నారు మా శ్రీవారు. ఈసారి తన కోపానికి కారణం మా తరఫు బంధువులట. భార్యలనూ, ఆమె తరఫు చుట్టాలనూ ఇలా ఆడిపోసుకోవడం చాలామంది భర్తలకు మామూలే కదా. ఈ క్రమంలో ఆ రోజున మా పేరెంట్స్ కూడా ఆయన బారిన పడ్డారు. మాది మాటమీద నిలబడే వంశం కాదట. మావాళ్లంతా మాట తప్పారట. అనుకున్నట్టుగా లాంఛనాలేమీ పెట్టలేదనీ, పెళ్లికి అనుకున్నవన్నీ ఇవ్వలేదనీ అన్నారాయన. ఈ జాడ్యం చాలా మంది మొగుళ్లకూ ఉంటుంది. కానీ మావారి విషయంలో ఈ మధ్య ఇది మరీ పెచ్చుమీరి పోయింది. ఇక ఓ హద్దు వరకూ సహించి, ఆ తర్వాత ఊరుకోలేక నేనూ ఓ మాట అన్నా. మీరు అనుకున్నట్టు మాదీ, మా పేరెంట్స్‌దీ మాట తప్పే వంశం కాదు. మాట మీద నిలబడే వంశం. మీకో విషయం తెలుసా? నాకు ఐదేళ్లున్నప్పుడు ఇచ్చిన మాటను మా అమ్మ సరిగ్గా పదిహేనేళ్ల తర్వాత గుర్తుపెట్టుకుని నిలబెట్టుకుంది తెలుసా?’’ అన్నాను. ‘‘ఏమిటా మాట’’ అడిగారు ఆయన ఆసక్తిగా. ‘‘అప్పట్లో నేను చిన్నదాన్ని. తెగ అల్లరి చేసేదాన్నట. అలా బువ్వ తిననంటూ నేను తెగ మారాం చేస్తూ ఉంటే, నా అల్లరి భరించలేక మా అమ్మ నాకో హెచ్చరిక లాంటి వాగ్దానం చేసింది. ఆ తర్వాత అది పట్టుబట్టి నెరవేర్చింది.’’ ‘‘ఊరించకు. తొందరగా చెప్పు’’ అన్నారాయన. ‘‘అప్పుడూ... ఇలాగే అల్లరి చేస్తూ ఉంటే బూచోడికి పట్టిస్తా అంది. నాకు మీతో పెళ్లి చేసి తన మాట నిలబెట్టుకుంది’’ అన్నాన్నేను. అంతే... అప్పట్నుంచి మాది ఆడి తప్పే వంశమని మా శ్రీవారు మళ్లీ అంటే ఒట్టు! - యాసీన్ -
నేలకు చేరువగా నెలరాజు.. 31న కనిపించనున్న దృశ్యం
31న కనిపించనున్న దృశ్యం ఈ నెలలో ఇది రెండోసారి బెంగళూరు: నేలకు చేరువగా శుక్రవారం రాత్రి నెలరాజు కనువిందు చేయనున్నాడు. చంద్రుడు తన కక్ష్యలో భూమికి చేరువగా వచ్చే సమయంలో అరుదుగా ఇలా కనిపిస్తాడు. అయితే, జనవరి నెలలోనే వరుసగా రెండోసారి ఇలా కనిపించనుండటం విశేషం. జనవరి 1న కూడా చందమామ భూమికి చేరువగా కనువిందు చేశాడు. ఈ ఏడాది మరో మూడుసార్లు... జూలై 12, ఆగస్టు 10, సెప్టెంబర్ 9 తేదీల్లో చంద్రుడు భూమికి చేరువగా కనిపించనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు తన కక్ష్యలో భూమికి చేరువగా వచ్చే సమయంలో సాధారణం కంటే 14 శాతం ఎక్కువ పెద్దగా, 30 శాతం ఎక్కువ వెలుగుతో కనిపిస్తాడని స్పేస్ ఫౌండేషన్ అధ్యక్షుడు సీబీ దేవ్‌గణ్ చెప్పారు. ఇలా కనిపించే చంద్రుడికి 1979లో ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్ నోలే ‘సూపర్‌మూన్’గా నామకరణం చేసినట్లు వివరించారు.