ఆరిపోతూ.. వెలుగునిచ్చింది!
- అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని కలలుకన్న ప్రియాంక
- శ్రీహరికోటకు వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదం
- బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన వైద్యులు
- జీవన్‌దాన్ సహకారంతో చెన్నై ఫోర్టిస్‌కు గుండె తరలింపు
- ‘యశోద’కు కాలేయం, ఒక కిడ్నీ.. నిమ్స్‌కు రెండో కిడ్నీ తరలింపు
సాక్షి, హైదరాబాద్: అంతరిక్ష శాస్త్రవేత్త కావాలనేది ఆ బాలిక కల. దానిని నిజం చేసుకునేందుకు చిన్నతనం నుంచే ఎంతో శ్రమించింది. అంతరిక్షం గురించి ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటూ తన ఆశయ సాధన దిశగా ముందుకు సాగింది. అంతరిక్ష ప్రయోగాల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఈ నెల 17న తోటి విద్యార్థులతో కలసి శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం సందర్శనకు వెళ్లింది. అయితే అంతలోనే విధి వక్రీకరించింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను వెంటాడింది. వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించడంతో.. తను కన్నుమూస్తూ మరో నలుగురి జీవితాల్లో అవయవదానంతో వెలుగులు నింపింది.
స్టడీ టూర్‌కు వెళ్లి వస్తూ..
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం శెట్టిగూడెం పరిధిలోని అస్లా తండాకు చెందిన భీమా, మంగమ్మ దంపతుల కుమార్తె ప్రియాంక(15) సూర్యాపేటలోని సాహితి హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి ప్రియాంక చాలా చురుగ్గా ఉండేది. చదువులోనూ అందరికంటే ముందుండేది. అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని కలలు కనేది. తరగతి గదిలో చదువుకున్న అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని స్వయంగా సందర్శించి, పరిశోధనలకు సంబంధించిన అనేక అంశాలు తెలుసుకోవాలని భావించింది.
ఈ నెల 17న స్టడీ టూర్‌లో భాగంగా తోటి విద్యార్థులతో కలసి శ్రీహరికోటలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ను సందర్శించింది. మరుసటి రోజు అక్కడి నుంచి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలోని దామరచర్ల వద్ద రాత్రి 10.30 గంటలకు డిన్నర్ కోసం స్కూల్ ప్రిన్సిపాల్ శాంత, తోటి విద్యార్థిని ప్రాణేశ్వరితో కలసి ప్రియాంక బస్సు దిగింది. హోటల్‌కు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ వాహనం వీరిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ శాంత, సహ విద్యార్థిని ప్రాణేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, తలకు తీవ్ర గాయాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రియాంకను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ప్రత్యేక విమానంలో చెన్నైకి గుండె..
ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం అదే రోజు మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి ప్రియాంకను తరలించారు. చికిత్సకు ఆమె స్పందించక పోవడంతో గురువారం రాత్రి బ్రెయిన్‌డెడ్‌గా డిక్లేర్ చేశారు. అవయవ దానం గురించి ప్రియాంక తల్లిదండ్రులకు వివరించగా.. కుమార్తె అవయవాలను దానం చేసేందుకు వారు అంగీకరించడంతో జీవన్‌దాన్‌కు సమాచారం ఇచ్చారు. ఆమె నుంచి గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాలు సేకరించారు. జీవన్‌దాన్ సహకారంతో చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ హృద్రోగికి గుండెను అందించారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో గుండెను శంషాబాద్ నుంచి చెన్నై తీసుకెళ్లారు.
గ్రీన్ చానల్ సహాయంతో 20 నిమిషాల్లోనే గుండెను ఆస్పత్రి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. కాగా, కాలేయం దెబ్బతిని కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో బాధితుడికి కాలేయాన్ని, మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడికి ఓ కిడ్నీని దానం చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మరో బాధితుడికి రెండో కిడ్నీని ఇచ్చారు. రెండు కార్నియాలను ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థకు అందజేశారు.