నక్షత్రం నుంచి ఎగసిపడుతున్న ఫిరంగి జ్వాలలు
వాషింగ్టన్: దాదాపు అంగారక గ్రహం సైజులో ఓ గుర్తుతెలియని నక్షత్రం నుంచి ఫిరంగి గుండ్ల మాదిరి జ్వాలలు ఎగసిపడుతున్నాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ గుర్తించింది. మరణిస్తున్న ఆ నక్షత్రం నుంచి అతి వేగంగా జ్వాలలు వెలువడుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్లాస్మా బంతుల రూపంలో వెలువడుతున్న ఇవి ఎంత వేగంగా శూన్యం గుండా ప్రయాణిస్తున్నాయంటే.. భూమి నుంచి చంద్రుడి వరకు ఉన్న దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో వెళ్లగలుగుతాయి.
దాదాపు 400 సంవత్సరాల నుంచి ప్రతి ఎనిమిదిన్నర ఏళ్లకోసారి ఇలాంటి జ్వాలలు ఎగసిపడుతాయని పరిశోధకులు చెప్పారు. అయితే ఈ ఫిరంగుల వంటి మంటల విషయం ఇప్పటికీ ఖగోళ శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు. ఈ నక్షత్రం ఎర్రని రంగులో ఉబ్బినట్లుగా ఉండి, దాదాపు 1200ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరణిస్తున్న సమయంలో నక్షత్రాలు వాటిలోని దాదాపు సగం ద్రవ్యరాశి పదార్థాలను అంతరిక్షంలోకి వెదజల్లుతాయని గుర్తించారు.