అమ్మ కడుపే ఆపరేషన్ టేబుల్! | Mother stomach is a operation table! | Sakshi
Sakshi News home page

అమ్మ కడుపే ఆపరేషన్ టేబుల్!

Published Sun, Jan 11 2015 9:14 AM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM

అమ్మ కడుపే ఆపరేషన్ టేబుల్! - Sakshi

అమ్మ కడుపే ఆపరేషన్ టేబుల్!

మెడికల్ వండర్
కాబోయే ఆ తల్లి గుండె గతుక్కుమంది. కడుపులో ఉన్న చిన్నారి గుండె బాగాలేదని తెలిసింది. శిరీష కడుపులోని నలుసు వయసు  23 వారాలే! అయితే, శిరీషకు అప్పటికే ఓ గైనిక్ సమస్య వచ్చింది. అబార్షన్ జరగకుండా గర్భాన్ని నిలపడానికి శస్త్రచికిత్స జరిగింది. గండం గడిచిందనుకుంటే మళ్లీ పిండానికి గుండెజబ్బు!


పాతికేళ్ల శిరీష రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ గ్రామంలో సైన్స్ టీచర్. గర్భవతి కాబట్టి రొటీన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంది. ‘ఆయోర్టిక్’ కవాటంలో లోపం వల్ల పిండం గుండె ఎడమవైపు కింది గదిలోని రక్తం పంప్ కావడం లేదని తేలింది. సమస్య అక్కడితో ఆగిపోలేదు. మైట్రల్ వాల్వ్ కూడా లీకవుతోంది. వీటివల్ల గుండె ఎడమవైపున ఉండే గదులు కుంచించుకుపోతున్నాయి. బిడ్డ హృదయం విశాలం చేయమంటున్న తల్లి వేదన డాక్టర్ల హృదయాలను కదిలించింది. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రి హృద్రోగ నిపుణులు సోమరాజు, చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల స్పెషలిస్ట్ కె.నాగేశ్వరరావు ప్రత్యేక ఆపరేషన్‌కు సంకల్పించారు.
 
చిన్న కత్తెర్లు కావాలి
కడుపులో ఉండగానే చిన్నారికి చికిత్స చేద్దామన్నది డాక్టర్ల ఆలోచన. శస్త్రచికిత్సకు మామూలుగా వాడే ఉపకరణాలు సరిపోవు. చిన్నారి పిండానికి గాటు పెట్టేంత చిన్ని చిన్ని కత్తెర్లు కావాలి. అంత చిన్న గుండెలోకి ప్రవేశపెట్టేంత అతి సన్నటి నాళాలు తేవాలి. అక్కడికి వెళ్లాక అడ్డంకులను వెడల్పు చేసే ప్రత్యేక బెలూన్లు సమకూర్చుకోవాలి. ఇవి ప్రత్యేకంగా రూపొందించుకోవడం ఒక ఎత్తై, ఆర్థిక వనరులను సమీకరించుకోవడం మరో సవాలు. వాటన్నింటినీ కలగలుపుకొని తమ నైపుణ్యాలను అత్యంత శిఖరాగ్ర స్థాయిలో ప్రదర్శించడం మరో ఎత్తు! డాక్టర్లకు ఆపరేషన్ థియేటర్‌లో సహాయం చేయడానికి అవసరమైన సిబ్బందికి అదనపు శిక్షణ అవసరం.
 
తొలి ప్రయత్నం విఫలం
ఆపరేషన్ చేస్తున్న నాగేశ్వరరావుకు బాసటగా డాక్టర్లు మాల్జినీ, కామశ్రీ, సాయిలీల, జగదీశ్, టీవీఎస్ గోపాలు, విద్యాసాగర్, కమల, ఇతర సాంకేతిక సిబ్బందితో పాటు మరో పన్నెండు మంది డాక్టర్ల బృందమూ ముందుకొచ్చింది. పిండం 26 వారాల వయసున్నప్పుడు ఒక ప్రయత్నం చేశారు. పిండం అనుకూల దిశలో తిరిగి లేనందువల్ల ఆ ప్రయత్నం విఫలమైంది. కాబోయే తల్లిదండ్రులు నిరాశపడ్డా, డాక్టర్ల సంకల్పం సడలలేదు.
 
వారం తర్వాత శిరీషను మళ్లీ ఆసుపత్రికి పిలిపించారు. ఈ సారి వ్యూహం మార్చారు. తొలుత తల్లికి మత్తు ఇచ్చారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టుగా... అమ్మ కడుపుకోతను ఆపడానికి అవసరమైన కోతను మొదట పెట్టారు. తర్వాత పిండాన్ని చేరారు. బిడ్డ కదులుతూ ఉంటుంది కాబట్టి అనుకూల దిశకు రాగానే ఆగేందుకు దాని తొడకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ‘ఫీటల్ అనస్థీషియా’తో  కదలికలు ఆగగానే డాక్టర్ల చేతుల కదలికలు మొదలయ్యాయి. ఒక సూది ద్వారా ఒక నాళం తల్లి కడుపు నుంచి బిడ్డ ఛాతీకీ, ఆ ఛాతీలోని గుండె ఎడమవైపు కింది గదికీ చేరింది. నాళం చివరి బెలూన్ ఉబ్బింది. గది తలుపును తెరిచినట్లుగా బెలూన్ ఆయోర్టిక్ వాల్వ్‌ను తెరిచింది. అడ్డంకిని తొలగించింది. ఆపరేషన్ సక్సెస్!
 
రెండ్రోజుల తర్వాత, పిండం గుండె స్పందనల తీరును ఫీటల్ హార్ట్ స్కాన్‌తో తెలుసుకున్నారు. అంతా సవ్యం. తల్లీ బిడ్డా క్షేమం. దేశంలోనే ఈ తరహా శస్త్రచికిత్సల్లో ఇది మొదటిది. అమ్మ కడుపులోనే ఆపరేషన్ చేయించుకున్న ఆ బిడ్డ తన తొమ్మిది నెలల గడువు ముగించుకుని, భూమ్మీదకు వచ్చి, డాక్టర్ అంకుల్స్‌కు థాంక్స్ చెప్పడానికి ఎదురుచూస్తూ ఉంది!
- యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement