Gainik problem
-
పెనుకోత సర్జరీలకు చిరుగాటు చాలు
ప్రతి మహిళకూ జీవితంలోని ఏదో ఒక దశలో గైనిక్ సమస్యలతో డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి. అయితే ఇప్పటికీ మన సమాజంలో స్త్రీ సంబంధితమైన తమ అత్యంత సహజ సమస్యలనూ చెప్పుకోవడానికి వెనకాడుతుంటారు మహిళలు. గైనిక్ విభాగంలో శస్త్రచికిత్సలకు సంబంధించిన అనేక అంశాల్లో వచ్చిన పురోగతి గురించి తెలిసిందీ అంతంతమాత్రమే. మామూలు సమస్యలను దాచిపెట్టుకోవడం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. తమలో ఉండే జంకును కొద్దికొద్దిగా అధిగమిస్తున్నారు. ఈ సందర్భంగా అనేక గైనిక్ సమస్యలకు చేసే శస్త్రచికిత్సల్లో వచ్చిన పురోగతి గురించి తెలుసుకోవడం కోసం ఈ ప్రత్యేక కథనం. మహిళల్లో కొన్ని సమస్యలకు సాధారణంగా శస్త్రచికిత్స అవసరమవుతుంది. అయితే లాపరోస్కోపీ విధానంలో శస్త్రచికిత్స చేసినప్పుడు సంప్రదాయ శస్త్రచికిత్స కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అవి... కోత పెట్టాల్సిన చోట కేవలం చిన్న గాటు మాత్రమే పెడతారు. పైగా ఆ గాటు 0.5 సెం.మీ. నుంచి 1 సెం.మీ మేరకే ఉంటుంది. కాబట్టి కడుపుపై ఆ కోతకు బదులు చిన్న గాటు మాత్రమే ఉంటుంది. కోత కంటే గాటు నయమయ్యే వ్యవధి కూడా తక్కువ కాబట్టి హాస్పిటల్లో ఉండాల్సిన టైమ్ తగ్గుతుంది. పైగా రక్తస్రావం కూడా చాలా తక్కువ. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు సైతం గణనీయంగా తగ్గుతాయి. అందుకే ఇటీవల ఈ కింద పేర్కొన్న సమస్యలకు సంప్రదాయ శస్త్రచికిత్సల కంటే లాపరోస్కోపిక్ (కీహోల్) విధానాలనే ఎక్కువగా అనుసరిస్తున్నారు. అయితే దీనికి ఖరీదైన ఉపకరణాలు అంటే కెమెరాకు జత చేసిన టెలిస్కోపు వంటి వాటితో పాటు... శస్త్రచికిత్సకు మరింత సునిశితమైన సామర్థ్యం కావాలి. లాపరోస్కోపీ ప్రక్రియకు కూడా సాధారణంగా ఇచ్చే మత్తు (అనస్థీషియా) అవసరం. అయితే చాలా సందర్భాల్లో దీనికి ఆసుపత్రిలో రెండు మూడు రోజులు ఉండటానికి బదులుగా అదే రోజు చేరి, అదే రోజు డిశ్చార్జి అయ్యేలా(డే కేర్ ప్రొసిజర్)గా చేయడం సాధ్యమవుతుంది. దీనివల్ల గతంలో రోగిని రోజుల తరబడి హాస్పిటల్లో ఉంచాల్సి వచ్చే గర్భసంచి తొలగించడం (హిస్టరెక్టమీ), ఫైబ్రాయిడ్ వంటి గడ్డలను తొలగించడం (మయోమెక్టమీ), ఎండోమెట్రియాసిస్ వంటి కేసుల్లో గర్భాశయంలో ఉండే అదనపు పొరను తొలగించడం వంటి శస్త్రచికిత్స ప్రక్రియలు తప్పనిసరి. అయితే కీహోల్ సర్జరీ ద్వారా వాటిని తొలగించడం మరింత తేలిక అవుతుంది. అంతేకాదు... ప్రక్రియ తర్వాత ఉండే నొప్పి తగ్గుతుంది. రోగి వేగంగా కోలుకుంటాడు. శస్త్రచికిత్స తర్వాత సాధారణంగా కోత పెట్టిన గీత వెంబడే కండ పెరగడం, అది మందంగా మారడం వంటివి జరుగుతాయి. ఇలా మారే కండను అడ్హెషన్స్ అంటారు. ల్యాపరోస్కోపిక్ విధానంలో శస్త్రచికిత్స చేస్తే ఈ తరహా కండ (అడ్హెషన్) పెరగడం కూడా నివారితమవుతుంది. ఈ అధునాతన శస్త్రచికిత్స ఉపయుక్తంగా ఉండే కొన్ని ప్రొసిజర్లు... తరచూ అబార్షన్లు అవుతున్నవారికి: కొందరు మహిళల్లో గర్భధారణ సమస్య కాకపోయినా... పండిన కడుపు కాస్తా పడిపోతూ ఉంటుంది. గర్భాశయ ముఖద్వారం బలహీనంగా ఉండటం వల్ల ఈ పరిణామం జరుగుతుంది. ఇది మూడో నెల లోపు జరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి వారిలో శస్త్రచికిత్స కొన్ని కుట్లు వేయడం ద్వారా ఆ బలహీన కండరాలను ఒకచోట చేర్చి బలం చేకూరుస్తారు. ఇలాంటి కేసుల్లో విజయావకాశాలు 90 శాతం ఉంటాయి. వీళ్లకు ఆ తర్వాత సీజేరియన్ చేయాల్సి ఉంటుంది. సంతానరహిత్యం (ఇన్ఫెర్టిలిటీ): ఇలాంటి సందర్భాల్లో సంతానరాహిత్యానికి కారణమైన అంశాలు ఉదాహరణకు పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలు ఉంటే వాటికి అనుగుణంగా అవసరమైన శస్త్రచికిత్స చేస్తారు. ట్యూబల్ బ్లాక్: ఫెలోపియన్ ట్యూబ్లలో ఒకవేళ అడ్డంకి ఉండటం వల్ల పురుషుడి వీర్యం అండాన్ని చేరలేకపోతుంది. దాంతో అండం... పిండంగా మారలేదు. ట్యూబ్‌లలోని ఆ అడ్డంకిని తొలగిస్తే ఫలదీకరణం నిరాటంకంగా జరుగుతుంది. ఒవేరియన్ సిస్ట్: అండాశయాల్లో ఉండే నీటితిత్తులు (సిస్ట్‌లను తొలగించడం ద్వారా సంతాన సాఫల్యం కలిగేలా చూడవచ్చు. అయితే తొలగించాల్సిన సిస్ట్ ఏ రకానికి చెందినది అన్న అంశాన్ని బట్టి శస్త్రచికిత్స మారుతుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ: దాదాపు ఒక శాతం మందిలో గర్భధారణ యుటెరస్‌లో కాకుండా ఫెలోపియన్ ట్యూబ్లలో జరుగుతుంది. ఇలా జరిగే గర్భధారణను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇలాంటి సందర్భాల్లో శస్త్రచికిత్స... అందునా ప్రధానంగా లాపరోస్కోపిక్ మార్గంలోనే శస్త్రచికిత్స చేసి పరిస్థితిని చక్కదిద్దుతారు. ఇలా అనేక గైనిక్ శస్త్రచికిత్సలకు లాపరోస్కోపిక్ మార్గం బాగా ఉపయోగపడుతుంది. -
అమ్మ కడుపే ఆపరేషన్ టేబుల్!
మెడికల్ వండర్ కాబోయే ఆ తల్లి గుండె గతుక్కుమంది. కడుపులో ఉన్న చిన్నారి గుండె బాగాలేదని తెలిసింది. శిరీష కడుపులోని నలుసు వయసు 23 వారాలే! అయితే, శిరీషకు అప్పటికే ఓ గైనిక్ సమస్య వచ్చింది. అబార్షన్ జరగకుండా గర్భాన్ని నిలపడానికి శస్త్రచికిత్స జరిగింది. గండం గడిచిందనుకుంటే మళ్లీ పిండానికి గుండెజబ్బు! పాతికేళ్ల శిరీష రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ గ్రామంలో సైన్స్ టీచర్. గర్భవతి కాబట్టి రొటీన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంది. ‘ఆయోర్టిక్’ కవాటంలో లోపం వల్ల పిండం గుండె ఎడమవైపు కింది గదిలోని రక్తం పంప్ కావడం లేదని తేలింది. సమస్య అక్కడితో ఆగిపోలేదు. మైట్రల్ వాల్వ్ కూడా లీకవుతోంది. వీటివల్ల గుండె ఎడమవైపున ఉండే గదులు కుంచించుకుపోతున్నాయి. బిడ్డ హృదయం విశాలం చేయమంటున్న తల్లి వేదన డాక్టర్ల హృదయాలను కదిలించింది. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రి హృద్రోగ నిపుణులు సోమరాజు, చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల స్పెషలిస్ట్ కె.నాగేశ్వరరావు ప్రత్యేక ఆపరేషన్‌కు సంకల్పించారు. చిన్న కత్తెర్లు కావాలి కడుపులో ఉండగానే చిన్నారికి చికిత్స చేద్దామన్నది డాక్టర్ల ఆలోచన. శస్త్రచికిత్సకు మామూలుగా వాడే ఉపకరణాలు సరిపోవు. చిన్నారి పిండానికి గాటు పెట్టేంత చిన్ని చిన్ని కత్తెర్లు కావాలి. అంత చిన్న గుండెలోకి ప్రవేశపెట్టేంత అతి సన్నటి నాళాలు తేవాలి. అక్కడికి వెళ్లాక అడ్డంకులను వెడల్పు చేసే ప్రత్యేక బెలూన్లు సమకూర్చుకోవాలి. ఇవి ప్రత్యేకంగా రూపొందించుకోవడం ఒక ఎత్తై, ఆర్థిక వనరులను సమీకరించుకోవడం మరో సవాలు. వాటన్నింటినీ కలగలుపుకొని తమ నైపుణ్యాలను అత్యంత శిఖరాగ్ర స్థాయిలో ప్రదర్శించడం మరో ఎత్తు! డాక్టర్లకు ఆపరేషన్ థియేటర్లో సహాయం చేయడానికి అవసరమైన సిబ్బందికి అదనపు శిక్షణ అవసరం. తొలి ప్రయత్నం విఫలం ఆపరేషన్ చేస్తున్న నాగేశ్వరరావుకు బాసటగా డాక్టర్లు మాల్జినీ, కామశ్రీ, సాయిలీల, జగదీశ్, టీవీఎస్ గోపాలు, విద్యాసాగర్, కమల, ఇతర సాంకేతిక సిబ్బందితో పాటు మరో పన్నెండు మంది డాక్టర్ల బృందమూ ముందుకొచ్చింది. పిండం 26 వారాల వయసున్నప్పుడు ఒక ప్రయత్నం చేశారు. పిండం అనుకూల దిశలో తిరిగి లేనందువల్ల ఆ ప్రయత్నం విఫలమైంది. కాబోయే తల్లిదండ్రులు నిరాశపడ్డా, డాక్టర్ల సంకల్పం సడలలేదు. వారం తర్వాత శిరీషను మళ్లీ ఆసుపత్రికి పిలిపించారు. ఈ సారి వ్యూహం మార్చారు. తొలుత తల్లికి మత్తు ఇచ్చారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టుగా... అమ్మ కడుపుకోతను ఆపడానికి అవసరమైన కోతను మొదట పెట్టారు. తర్వాత పిండాన్ని చేరారు. బిడ్డ కదులుతూ ఉంటుంది కాబట్టి అనుకూల దిశకు రాగానే ఆగేందుకు దాని తొడకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ‘ఫీటల్ అనస్థీషియా’తో కదలికలు ఆగగానే డాక్టర్ల చేతుల కదలికలు మొదలయ్యాయి. ఒక సూది ద్వారా ఒక నాళం తల్లి కడుపు నుంచి బిడ్డ ఛాతీకీ, ఆ ఛాతీలోని గుండె ఎడమవైపు కింది గదికీ చేరింది. నాళం చివరి బెలూన్ ఉబ్బింది. గది తలుపును తెరిచినట్లుగా బెలూన్ ఆయోర్టిక్ వాల్వ్‌ను తెరిచింది. అడ్డంకిని తొలగించింది. ఆపరేషన్ సక్సెస్! రెండ్రోజుల తర్వాత, పిండం గుండె స్పందనల తీరును ఫీటల్ హార్ట్ స్కాన్‌తో తెలుసుకున్నారు. అంతా సవ్యం. తల్లీ బిడ్డా క్షేమం. దేశంలోనే ఈ తరహా శస్త్రచికిత్సల్లో ఇది మొదటిది. అమ్మ కడుపులోనే ఆపరేషన్ చేయించుకున్న ఆ బిడ్డ తన తొమ్మిది నెలల గడువు ముగించుకుని, భూమ్మీదకు వచ్చి, డాక్టర్ అంకుల్స్‌కు థాంక్స్ చెప్పడానికి ఎదురుచూస్తూ ఉంది! - యాసీన్