పెనుకోత సర్జరీలకు చిరుగాటు చాలు
ప్రతి మహిళకూ జీవితంలోని ఏదో ఒక దశలో గైనిక్ సమస్యలతో డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి. అయితే ఇప్పటికీ మన సమాజంలో స్త్రీ సంబంధితమైన తమ అత్యంత సహజ సమస్యలనూ చెప్పుకోవడానికి వెనకాడుతుంటారు మహిళలు. గైనిక్ విభాగంలో శస్త్రచికిత్సలకు సంబంధించిన అనేక అంశాల్లో వచ్చిన పురోగతి గురించి తెలిసిందీ అంతంతమాత్రమే. మామూలు సమస్యలను దాచిపెట్టుకోవడం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. తమలో ఉండే జంకును కొద్దికొద్దిగా అధిగమిస్తున్నారు. ఈ సందర్భంగా అనేక గైనిక్ సమస్యలకు చేసే శస్త్రచికిత్సల్లో వచ్చిన పురోగతి గురించి తెలుసుకోవడం కోసం ఈ ప్రత్యేక కథనం.
మహిళల్లో కొన్ని సమస్యలకు సాధారణంగా శస్త్రచికిత్స అవసరమవుతుంది. అయితే లాపరోస్కోపీ విధానంలో శస్త్రచికిత్స చేసినప్పుడు సంప్రదాయ శస్త్రచికిత్స కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అవి... కోత పెట్టాల్సిన చోట కేవలం చిన్న గాటు మాత్రమే పెడతారు. పైగా ఆ గాటు 0.5 సెం.మీ. నుంచి 1 సెం.మీ మేరకే ఉంటుంది. కాబట్టి కడుపుపై ఆ కోతకు బదులు చిన్న గాటు మాత్రమే ఉంటుంది. కోత కంటే గాటు నయమయ్యే వ్యవధి కూడా తక్కువ కాబట్టి హాస్పిటల్‌లో ఉండాల్సిన టైమ్ తగ్గుతుంది. పైగా రక్తస్రావం కూడా చాలా తక్కువ. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు సైతం గణనీయంగా తగ్గుతాయి. అందుకే ఇటీవల ఈ కింద పేర్కొన్న సమస్యలకు సంప్రదాయ శస్త్రచికిత్సల కంటే లాపరోస్కోపిక్ (కీహోల్) విధానాలనే ఎక్కువగా అనుసరిస్తున్నారు. అయితే దీనికి ఖరీదైన ఉపకరణాలు అంటే కెమెరాకు జత చేసిన టెలిస్కోపు వంటి వాటితో పాటు... శస్త్రచికిత్సకు మరింత సునిశితమైన సామర్థ్యం కావాలి. లాపరోస్కోపీ ప్రక్రియకు కూడా సాధారణంగా ఇచ్చే మత్తు (అనస్థీషియా) అవసరం. అయితే చాలా సందర్భాల్లో దీనికి ఆసుపత్రిలో రెండు మూడు రోజులు ఉండటానికి బదులుగా అదే రోజు చేరి, అదే రోజు డిశ్చార్జి అయ్యేలా(డే కేర్ ప్రొసిజర్)గా చేయడం సాధ్యమవుతుంది. దీనివల్ల గతంలో రోగిని రోజుల తరబడి హాస్పిటల్‌లో ఉంచాల్సి వచ్చే గర్భసంచి తొలగించడం (హిస్టరెక్టమీ), ఫైబ్రాయిడ్ వంటి గడ్డలను తొలగించడం (మయోమెక్టమీ), ఎండోమెట్రియాసిస్ వంటి కేసుల్లో గర్భాశయంలో ఉండే అదనపు పొరను తొలగించడం వంటి శస్త్రచికిత్స ప్రక్రియలు తప్పనిసరి. అయితే కీహోల్ సర్జరీ ద్వారా వాటిని తొలగించడం మరింత తేలిక అవుతుంది. అంతేకాదు... ప్రక్రియ తర్వాత ఉండే నొప్పి తగ్గుతుంది. రోగి వేగంగా కోలుకుంటాడు. శస్త్రచికిత్స తర్వాత సాధారణంగా కోత పెట్టిన గీత వెంబడే కండ పెరగడం, అది మందంగా మారడం వంటివి జరుగుతాయి. ఇలా మారే కండను అడ్హెషన్స్ అంటారు. ల్యాపరోస్కోపిక్ విధానంలో శస్త్రచికిత్స చేస్తే ఈ తరహా కండ (అడ్హెషన్) పెరగడం కూడా నివారితమవుతుంది. ఈ అధునాతన శస్త్రచికిత్స ఉపయుక్తంగా ఉండే కొన్ని ప్రొసిజర్లు...
తరచూ అబార్షన్లు అవుతున్నవారికి: కొందరు మహిళల్లో గర్భధారణ సమస్య కాకపోయినా... పండిన కడుపు కాస్తా పడిపోతూ ఉంటుంది. గర్భాశయ ముఖద్వారం బలహీనంగా ఉండటం వల్ల ఈ పరిణామం జరుగుతుంది. ఇది మూడో నెల లోపు జరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి వారిలో శస్త్రచికిత్స కొన్ని కుట్లు వేయడం ద్వారా ఆ బలహీన కండరాలను ఒకచోట చేర్చి బలం చేకూరుస్తారు. ఇలాంటి కేసుల్లో విజయావకాశాలు 90 శాతం ఉంటాయి. వీళ్లకు ఆ తర్వాత సీజేరియన్ చేయాల్సి ఉంటుంది.
సంతానరహిత్యం (ఇన్‌ఫెర్టిలిటీ): ఇలాంటి సందర్భాల్లో సంతానరాహిత్యానికి కారణమైన అంశాలు ఉదాహరణకు పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలు ఉంటే వాటికి అనుగుణంగా అవసరమైన శస్త్రచికిత్స చేస్తారు.
ట్యూబల్ బ్లాక్: ఫెలోపియన్ ట్యూబ్‌లలో ఒకవేళ అడ్డంకి ఉండటం వల్ల పురుషుడి వీర్యం అండాన్ని చేరలేకపోతుంది. దాంతో అండం... పిండంగా మారలేదు. ట్యూబ్‌లలోని ఆ అడ్డంకిని తొలగిస్తే ఫలదీకరణం నిరాటంకంగా జరుగుతుంది.
ఒవేరియన్ సిస్ట్: అండాశయాల్లో ఉండే నీటితిత్తులు (సిస్ట్‌లను తొలగించడం ద్వారా సంతాన సాఫల్యం కలిగేలా చూడవచ్చు. అయితే తొలగించాల్సిన సిస్ట్ ఏ రకానికి చెందినది అన్న అంశాన్ని బట్టి శస్త్రచికిత్స మారుతుంది.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ: దాదాపు ఒక శాతం మందిలో గర్భధారణ యుటెరస్‌లో కాకుండా ఫెలోపియన్ ట్యూబ్‌లలో జరుగుతుంది. ఇలా జరిగే గర్భధారణను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు.
ఇలాంటి సందర్భాల్లో శస్త్రచికిత్స... అందునా ప్రధానంగా లాపరోస్కోపిక్ మార్గంలోనే శస్త్రచికిత్స చేసి పరిస్థితిని చక్కదిద్దుతారు. ఇలా అనేక గైనిక్ శస్త్రచికిత్సలకు లాపరోస్కోపిక్ మార్గం బాగా ఉపయోగపడుతుంది.