ఆ పాస్కల్‌ది ఏం గొప్ప... మన జంతికల్‌దే ఘనత! | jantikalu are great not to that paskal credit | Sakshi
Sakshi News home page

ఆ పాస్కల్‌ది ఏం గొప్ప... మన జంతికల్‌దే ఘనత!

Published Sun, Nov 2 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

ఆ పాస్కల్‌ది ఏం గొప్ప... మన జంతికల్‌దే ఘనత!

ఆ పాస్కల్‌ది ఏం గొప్ప... మన జంతికల్‌దే ఘనత!

నవ్వింత: నలుడు, భీముడు ఇద్దరూ మంచి సైంటిస్టులన్నది మా రాంబాబుగాడి మాట. ‘‘అదేంట్రా అలా అంటావ్? ఒకరు గొప్ప చక్రవర్తీ, మరొకరు మంచి పోరాటయోధుడూ అయితే’’ అన్నాన్నేను. అందుకు వాడు చెప్పిన మాటల సారాంశమిది. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని కనుగొనకముందే... అలాంటి చాలా పరిశోధనలను మన పూర్వీకులు వంటిల్లు అనే ల్యాబ్‌లో నిర్వహించారన్నది రాంబాబుగాడి థియరీ.
 
 అయితే ఆ ఆవిరి శక్తిని మనవాళ్లు గొట్టాల్లోకీ, చక్రాల్లోకీ ఎక్కించకుండా... కేవలం ఇడ్లీల్లోకి ఎక్కించారన్నది వాడి హైపోథెసిస్. పవర్‌ను ఇడ్లీల్లో నిక్షిప్తం చేసి, దాన్ని శరీర అవసరాలకు వాడుకున్నారన్నది వాడి అబ్జర్వేషన్. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికే మనవాళ్లకు ఆవిరి శక్తి తెలిసినా, దాన్ని శారీరక అవసరాలకు మాత్రమే వాడుకుంటూ ఉండటం వల్ల జేమ్స్ వాట్‌కు ఆ అదృష్టం దక్కిందంటాడు వాడు. అయితే, శారీరక స్థాయి నుంచి సమాజానికి విస్తరించిన చిరు ఘనత మాత్రమే జేమ్స్‌వాట్‌దని చెబుతాడు. దీనిపై ఎవరైనా విభేదిస్తే... మూతపెట్టిన గిన్నెనుంచి ఆవిరులు ఎగజిమ్మినట్లుగా వాడు కస్సుబుస్సుమంటూ శరీరంలోంచి వేడిపొగలు వెలువరిస్తాడు.
 
 అనాదిగా మన సమాజంలో ఇడ్లీల తయారీ అన్నది క్రీస్తుపూర్వం నుంచీ ఉందన్న విషయాన్ని మన పొరుగువారైన తమిళులు ఎలాగూ చెబుతారు. చెప్పడం ఏమిటి, సాధికారంగా రుజువులూ ఇస్తారు. కాబట్టి ఈ తార్కాణంలోని తార్కికత ఆధారంగా దేహాత్మకమైన ఆవిరి శక్తులను యాంత్రికం చేసే అవకాశాన్ని వాట్‌గారికే వాటంగా వదిలేశామన్నది వాడి వాదన. అందుకే రైల్వేఇంజన్‌లో బొగ్గు వేయగానే ఖయ్యని కూత కూసి శక్తిపుంజుకుని బయల్దేరినట్టే , ఖాయిలా పడ్డవాడు ఇడ్లీతో పథ్యం ప్రారంభించగానే ఎవరిదైనా సరే... చెడిపోయిన ఆరోగ్యం కాస్తా బాగుపడుతూ పట్టాలపైకి వచ్చేస్తుందన్నది రాంబాబుగాడి శాస్త్రోక్తమైన వాదన. ప్రధానమైన మన పరిశోధనలకు కాకుండా, ఆనుషంగిమైన జేమ్స్‌వాట్‌గారి అనుబంధ అంశాలకు సైన్స్‌పరమైన గుర్తింపు రావడం సరికాదన్నది వాడి మేలి పలుకు.
 
 వంటిల్లు అనే ఈ ల్యాబ్‌లో మన పూర్వీకులు అనేక సైన్సు పరిశోధనలు చేశారని వాడు ఇప్పటికీ మా అందరికీ ఏదో ఒక ఐటమ్ తయారు చూస్తూ, వడ్డిస్తూ చెబుతుంటాడు. అయితే, తిండి అనే దాన్ని, అది తినే అవకాశాలనూ వదిలిపెట్టకూడదనే థియరీ మాకూ తెలిసినందున మేం కూడా యథాశక్తి వాడి వాదనలు నమ్మినట్లు నటిస్తూ, ఒక్కోసారి ఎదిరిస్తూ, కుదరనప్పుడు మౌనంగా ఉండిపోతూ, చాలా కొద్దిసార్లు కుములిపోతూ ఉండిపోతాం. అవకాశాన్ని బట్టి సావకాశంగా రుచులను ఆస్వాదిస్తూ ఉంటాం. జిహ్వచాపల్యం కోసం ఈ మాత్రం రిస్క్ అయినా తీసుకోకపోతే ఇక జీవితంలో థ్రిల్లేముంది!
 
 ఇక, వాన చినుకులు పైనుంచి పడ్డప్పుడు చిన్న చినుకులైతే పూర్తిగా గోళాకారంగా... అదే చినుకు సైజు కాస్త పెరిగితే... ఉల్లిగడ్డలాంటి ఆకృతిని పొందుతుందన్నది కూడా మన వాళ్లు ఎప్పుడో వంట సమయంలో నిరూపించారన్నది రాంబాబు గాడి మరో వాదన. కాస్త ఎక్కువ పైనుంచి పిండిని జారవిడవగానే... సర్ఫేస్‌టెన్షన్ థియరీ ఆధారంగా ‘బోండాలు’ గోళాకృతిని పొందుతాయనీ.. కాస్త సైజ్ పెరిగితే పైన ఉల్లిగడ్డ చివరిలాగా చిన్న పిలక ఆవిర్భవించినా, కింద మాత్రం గోళాకృతిని కలిగి ఉంటాయన్నది వాడు చెప్పే మాట. అలాగే... నూనె ఉపరితలానికి దగ్గర్నుంచి జారవిడుస్తుండటం వల్ల పకోడీలు గోళాకృతిని పొందక దేనికదే స్వతంత్ర ఆకృతితో ఉంటాయట!
 
 ఇక జంతికల తయారీ కోసం రెండు స్తూపాకార ఉపకరణాలను కనిపెట్టి, వాటిని ఒకదానిలోకి మరొకటి దూర్చి, పీడనమూ, ఒత్తిడీ అనే అంశాల ఆధారంగా పిండిని ధారాపాతంగా చిల్లుల నుంచి పడేలా చేస్తామట. మన కిచెన్‌ల్యాబ్‌కు తగినట్లుగా ఉపకరణాలను గాజుకుప్పెల్లా కాకుండా, లోహపాత్రల్లా తయారు చేశామట. ఈ పీడనం, ఒత్తిడి వంటి సైన్సు సూత్రాలను పాస్కల్ కనిపెట్టాడంటారుగానీ, పాస్కల్‌కంటే ముందే ఆ గొట్టాల్ని ‘జంతికల్’అనే వ్యక్తి కనిపెట్టాడనీ, ఆయన సూత్రం ఆధారంగా చేస్తాం కాబట్టి వాటిని ‘జంతికలు’ అంటున్నామనీ వాడు అంటాడు.
 
 మనలో తిండి ప్రియత్వం ఎక్కువైపోయి... పరిశోధకుడిని మరచిపోయే తత్వం కారణంగా  వాటికి కారప్పూస అంటూ మరో పేరు పెట్టడంవల్ల ‘జంతికల్’కు పాస్కల్ అంత కీర్తి రాలేదట. తిండిని కేవలం ఒక దినచర్యగా మాత్రమే పాటిస్తున్న తుచ్ఛులైన మ్లేచ్ఛులైన పాశ్చాత్యులు... మనలా ఆస్వాదించడానికి బదులు వర్గీకరణలూ, శాస్త్రీకరణల పేరుతో సూత్రాల్ని వంటింటి గడప దాటించారని అంటుంటాడు వాడు. నలుడూ, భీముడూ వంటివాళ్లు గొప్ప పోరాటయోధులని అంటారుగానీ వాళ్లు ఆ నాటి సైంటిస్టులన్నది చివరగా మా రాంబాబుగాడు తేల్చిన విషయం!
 - యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement