Bheemudu
-
అన్నలు.. అజ్ఞాతం.. అలజడి..!
పీడిత–తాడిత జనోద్ధరణ లక్ష్యంతో అడవి బాట పట్టి, అజ్ఞాతం నుంచి ఉద్యమం సాగిస్తున్న న్యూడెమోక్రసీ ‘అన్న’లు ఒకరొక్కరుగా పోలీసులకు చిక్కుతున్నారు. కొన్నాళ్ల నుంచి తమ సహచరులను పోలీసులు పట్టుకోవడం, తాజాగా, ఎన్డీ(చంద్రన్న) గుండాల ఏరియా దళ నేత భీముడిని కూసుమంచి మండలం చౌటుపల్లిలో అరెస్ట్ చేయడంతో అజ్ఞాత ఉద్యమ నేతల్లో సహజంగానే అలజడి పుడుతోంది. ఇల్లెందు : న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ నేతలను కొన్ని నెలల కిందట పోలీసులు వరుసబెట్టి అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఇవి ఆగిపోయాయి. ఈ వరుస అరెస్టుల పర్వం ముగిసిందని ఎన్డీ శ్రేణు లు, అభిమానులు అనుకుంటున్న తరుణంలో.. తాజాగా, ఎన్డీ చంద్రన్న వర్గం గుండాల ఏరియా దళ నేత భీముడు అలియాస్ సుధాకర్‌ను కూసుమంచి మండలం చౌటుపల్లి తండాలో పోలీసులు శనివారం తెల్లారుజామున అరెస్ట్ చేశారు. అడివిని వదిలి, అజ్ఞాతాన్ని వీడిన నేతలు.. పోలీసుల వలలో చిక్కుకుంటున్నారు. ఎందుకిలా జరుగుతోంది..? న్యూడెమోక్రసీ అభిమానులు ఆవేదనా పూరిత స్వరంతో అడుగుతున్న ఈ ప్రశ్నపు... ‘‘అనారోగ్యంతో బాధపడుతున్న దళ నేతలు వైద్యం, విశ్రాంతి కోసం అడవి/అజ్ఞాతం నుంచి అనివార్యంగా బయటకు రావడమే ఈ పరిస్థితికి కారణమవుతోంది’’ అని, నాయకులు సమాధానంగా చెబుతున్నారు. ఈ భీముడు ఎవరు...? గుండాల మండలం నర్సాపురం తండాకు చెందిన భీముడు(సుధాకర్), గుండాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఉమ్మడి ఎన్డీలో లీగల్ కార్యకర్తగా పనిచేశారు. గుండాల ఏరియాలో పీపీజీతో ఎన్డీకి తీవ్ర వైరం నెలకొన్న నేపథ్యంలో అజ్ఞాత దళంలోకి భీముడు వెళ్లారు. గుండాల, నర్సంపేట, కొత్తగూడ ఏరియాలో సుదీర్ఘ కాలంపాటు దళ నేతగా పనిచేశారు. 2011లో ఎన్డీ రెండు(రాయల–చంద్రన్న) వర్గాలుగా చీలింది. చంద్రన్న వర్గంలోకి వెళ్లిన భీముడు.. పాకాల కొత్తగూడ, ఇల్లెందు, గుండాల ఏరియాలో దళ నేతగా పని చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ను వైద్యం కోసం నాయకత్వం ఖమ్మం తరలించింది. పార్టీ కామ్రేడ్ ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న భీముడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్డీ దళ కమాండర్ బోడ భీముడు అరెస్ట్ కూసుమంచి : న్యూడెమోక్రసీ (చంద్రన్న) గుండాల ఏరియా దళ కమాండర్ బోడ భీముడు అలియాస్ సుధాకరన్నను శనివారం తెల్లవారుజామున మండలంలోని చౌటపల్లి గ్రామ శివారు బండమీదతండాలోని ఓ ఇంటిలో పోలీసులు అరెస్ట్ చేశారు. కూసుమంచి సీఐ ఆధ్వర్యంలో కూసుమంచి, ఖమ్మం పోలీసులు ఆ ఇంటిని చుట్టిముట్టి, అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీ సానుభూతిపరుడు, భీముడుకు ఆశ్రయమిచ్చిన భూక్యా మచ్చూ నాయక్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. భీముడు వద్ద పోలీసులకు రివాల్వర్ దొరికినట్టు సమాచారం. కూసుమంచి మండలంలో చంద్రన్న వర్గం బలంగా ఉంది. దీంతో, అజ్ఞాత దళ నేతలు ఇక్కడకు రావచ్చునన్న అనుమానంతో పోలీసులు నిఘా వేశారు. భీముడు వచ్చాడన్న సమాచారంతో అరెస్ట్ చేశారు. ఇతడిని భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు తీసుకెళ్లినట్టు, మచ్చూ నాయక్‌ను మాత్రం కూసుమంచి పోలీసుల అదుపులోనే ఉన్నట్టు తెలిసింది. భీముడు అరెస్టును పోలీసులు అధికారకంగా ధ్రువీకరించలేదు. భీముడు ఎందుకొచ్చాడు..? బండమీదితండాకు భీముడు ఎందుకు వచ్చాడన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరకలేదు. గూడ నొప్పితో బాధపడుతున్నాడని, విశ్రాంతి తీసుకునేందుకు పార్టీ సానుభూతిపరుడైన... తన దగ్గరి బంధువైనన మచ్చు నాయక్ ఇంటికి మూడు రోజుల క్రితం వచ్చినట్టు తెలిసింది. మచ్చూ నాయక్‌కు పసర వైద్యం తెలిసుండడం, మండల కేంద్రానికి మారుమూలన ఈ తండా ఉండడంతో, అన్ని విధాలుగా ఈ తండానే అనువుగా ఉంటుందని భీముడు భావించి ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. దళాన్ని పటిష్టపరిచే, విస్తృతపరిచే లక్ష్యంతోనే భీముడు ఇక్కడకు వచ్చాడన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పక్కా సమాచారంతో... బండమీదితండాలో భీముడు ఉన్నాడని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో పోలీసు లు అప్రమత్తమయ్యారని తెలిసింది. తప్పిపో యిన గేదెలను వెతుకున్నట్టు కాపరులు/యజమానుల మాదిరిగా పోలీసులు 3రోజుల నుంచి తండాలో తిరిగినట్టు సమాచారం. -
నారావారబ్బాయి కూడా భయపెడుతున్నాడు
టాలీవుడ్ యంగ్ జనరేషన్లో అందరికంటే బిజీగా ఉన్న హీరో నారా రోహిత్. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలను రిలీజ్ చేసిన రోహిత్ మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే, జ్యో అచ్యుతానంద సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రోహిత్, శంకర, అప్పట్లో ఒకడుండే వాడు, పండగలా వచ్చాడు, కథలో రాజకుమారి సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే తాజాగా మరో సినిమాకు ఓకె చెప్పాడు నారా రోహిత్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న రోహిత్, ఈ సారి మరో కొత్త జానర్లో సినిమాకు రెడీ అవుతున్నాడు. భీముడు పేరుతో హార్రర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దసరా రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకుడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
ధృతరాష్ట్ర కౌగిలి
నానుడి కురుసార్వభౌముడైన ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అయినా, వేదవ్యాసుడి వరం వల్ల అతడికి పదివేల ఏనుగుల బలం ఉంది. కురుక్షేత్ర సంగ్రామంలో వందమంది కొడుకులనూ పోగొట్టుకున్నాడు. నిండుసభలో చేసిన ప్రతిజ్ఞ మేరకు వందమందినీ భీముడే మట్టుబెట్టాడు. కొడుకులు మరణించినందుకు దుఃఖంతో, వాళ్లందరినీ పొట్టన పెట్టుకున్న భీముడిపై కోపంతో రగిలిపోసాగాడు. అలాంటి సమయంలో పట్టాభిషేకానికి ముందు పెదనాన్న ఆశీస్సుల కోసం ధర్మరాజు సపరివార సోదర సమేతంగా ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. వారితో కృష్ణుడు కూడా ఉన్నాడు. ఆశీస్సులు తీసుకుంటున్న ఒక్కొక్కరినీ ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటూ, భీముడి వద్దకు ‘రా నాయనా.. భీమసేనా..’ అంటూ వచ్చాడు ధృతరాష్ట్రుడు. అతడి పగను, పన్నాగాన్ని ఎరిగిన కృష్ణుడు ముందే ఏర్పాటు చేసిన ఇనుప విగ్రహాన్ని ముందుకు నెట్టమని భీముడికి సైగ చేశాడు. భీముడు అలాగే చేశాడు. విగ్రహాన్ని భీముడనుకున్న ధృతరాష్ట్రుడు తన బిగికౌగిలిలో బంధించాడు. అతడి బలానికి ఆ విగ్రహం పిండి పిండిగా రాలిపోయింది. అందుకే పాత పగలు మనసులో పెట్టుకుని, ఆప్యాయంగా చేరదీసి, కదల్లేని పరిస్థితులు కల్పించి నాశనం చేయడాన్ని ధృతరాష్ట్ర కౌగిలిగా అభివర్ణిస్తారు. -
ఆ పాస్కల్‌ది ఏం గొప్ప... మన జంతికల్‌దే ఘనత!
నవ్వింత: నలుడు, భీముడు ఇద్దరూ మంచి సైంటిస్టులన్నది మా రాంబాబుగాడి మాట. ‘‘అదేంట్రా అలా అంటావ్? ఒకరు గొప్ప చక్రవర్తీ, మరొకరు మంచి పోరాటయోధుడూ అయితే’’ అన్నాన్నేను. అందుకు వాడు చెప్పిన మాటల సారాంశమిది. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని కనుగొనకముందే... అలాంటి చాలా పరిశోధనలను మన పూర్వీకులు వంటిల్లు అనే ల్యాబ్‌లో నిర్వహించారన్నది రాంబాబుగాడి థియరీ. అయితే ఆ ఆవిరి శక్తిని మనవాళ్లు గొట్టాల్లోకీ, చక్రాల్లోకీ ఎక్కించకుండా... కేవలం ఇడ్లీల్లోకి ఎక్కించారన్నది వాడి హైపోథెసిస్. పవర్‌ను ఇడ్లీల్లో నిక్షిప్తం చేసి, దాన్ని శరీర అవసరాలకు వాడుకున్నారన్నది వాడి అబ్జర్వేషన్. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికే మనవాళ్లకు ఆవిరి శక్తి తెలిసినా, దాన్ని శారీరక అవసరాలకు మాత్రమే వాడుకుంటూ ఉండటం వల్ల జేమ్స్ వాట్‌కు ఆ అదృష్టం దక్కిందంటాడు వాడు. అయితే, శారీరక స్థాయి నుంచి సమాజానికి విస్తరించిన చిరు ఘనత మాత్రమే జేమ్స్వాట్దని చెబుతాడు. దీనిపై ఎవరైనా విభేదిస్తే... మూతపెట్టిన గిన్నెనుంచి ఆవిరులు ఎగజిమ్మినట్లుగా వాడు కస్సుబుస్సుమంటూ శరీరంలోంచి వేడిపొగలు వెలువరిస్తాడు. అనాదిగా మన సమాజంలో ఇడ్లీల తయారీ అన్నది క్రీస్తుపూర్వం నుంచీ ఉందన్న విషయాన్ని మన పొరుగువారైన తమిళులు ఎలాగూ చెబుతారు. చెప్పడం ఏమిటి, సాధికారంగా రుజువులూ ఇస్తారు. కాబట్టి ఈ తార్కాణంలోని తార్కికత ఆధారంగా దేహాత్మకమైన ఆవిరి శక్తులను యాంత్రికం చేసే అవకాశాన్ని వాట్గారికే వాటంగా వదిలేశామన్నది వాడి వాదన. అందుకే రైల్వేఇంజన్లో బొగ్గు వేయగానే ఖయ్యని కూత కూసి శక్తిపుంజుకుని బయల్దేరినట్టే , ఖాయిలా పడ్డవాడు ఇడ్లీతో పథ్యం ప్రారంభించగానే ఎవరిదైనా సరే... చెడిపోయిన ఆరోగ్యం కాస్తా బాగుపడుతూ పట్టాలపైకి వచ్చేస్తుందన్నది రాంబాబుగాడి శాస్త్రోక్తమైన వాదన. ప్రధానమైన మన పరిశోధనలకు కాకుండా, ఆనుషంగిమైన జేమ్స్వాట్గారి అనుబంధ అంశాలకు సైన్స్‌పరమైన గుర్తింపు రావడం సరికాదన్నది వాడి మేలి పలుకు. వంటిల్లు అనే ఈ ల్యాబ్‌లో మన పూర్వీకులు అనేక సైన్సు పరిశోధనలు చేశారని వాడు ఇప్పటికీ మా అందరికీ ఏదో ఒక ఐటమ్ తయారు చూస్తూ, వడ్డిస్తూ చెబుతుంటాడు. అయితే, తిండి అనే దాన్ని, అది తినే అవకాశాలనూ వదిలిపెట్టకూడదనే థియరీ మాకూ తెలిసినందున మేం కూడా యథాశక్తి వాడి వాదనలు నమ్మినట్లు నటిస్తూ, ఒక్కోసారి ఎదిరిస్తూ, కుదరనప్పుడు మౌనంగా ఉండిపోతూ, చాలా కొద్దిసార్లు కుములిపోతూ ఉండిపోతాం. అవకాశాన్ని బట్టి సావకాశంగా రుచులను ఆస్వాదిస్తూ ఉంటాం. జిహ్వచాపల్యం కోసం ఈ మాత్రం రిస్క్ అయినా తీసుకోకపోతే ఇక జీవితంలో థ్రిల్లేముంది! ఇక, వాన చినుకులు పైనుంచి పడ్డప్పుడు చిన్న చినుకులైతే పూర్తిగా గోళాకారంగా... అదే చినుకు సైజు కాస్త పెరిగితే... ఉల్లిగడ్డలాంటి ఆకృతిని పొందుతుందన్నది కూడా మన వాళ్లు ఎప్పుడో వంట సమయంలో నిరూపించారన్నది రాంబాబు గాడి మరో వాదన. కాస్త ఎక్కువ పైనుంచి పిండిని జారవిడవగానే... సర్ఫేస్టెన్షన్ థియరీ ఆధారంగా ‘బోండాలు’ గోళాకృతిని పొందుతాయనీ.. కాస్త సైజ్ పెరిగితే పైన ఉల్లిగడ్డ చివరిలాగా చిన్న పిలక ఆవిర్భవించినా, కింద మాత్రం గోళాకృతిని కలిగి ఉంటాయన్నది వాడు చెప్పే మాట. అలాగే... నూనె ఉపరితలానికి దగ్గర్నుంచి జారవిడుస్తుండటం వల్ల పకోడీలు గోళాకృతిని పొందక దేనికదే స్వతంత్ర ఆకృతితో ఉంటాయట! ఇక జంతికల తయారీ కోసం రెండు స్తూపాకార ఉపకరణాలను కనిపెట్టి, వాటిని ఒకదానిలోకి మరొకటి దూర్చి, పీడనమూ, ఒత్తిడీ అనే అంశాల ఆధారంగా పిండిని ధారాపాతంగా చిల్లుల నుంచి పడేలా చేస్తామట. మన కిచెన్ల్యాబ్కు తగినట్లుగా ఉపకరణాలను గాజుకుప్పెల్లా కాకుండా, లోహపాత్రల్లా తయారు చేశామట. ఈ పీడనం, ఒత్తిడి వంటి సైన్సు సూత్రాలను పాస్కల్ కనిపెట్టాడంటారుగానీ, పాస్కల్కంటే ముందే ఆ గొట్టాల్ని ‘జంతికల్’అనే వ్యక్తి కనిపెట్టాడనీ, ఆయన సూత్రం ఆధారంగా చేస్తాం కాబట్టి వాటిని ‘జంతికలు’ అంటున్నామనీ వాడు అంటాడు. మనలో తిండి ప్రియత్వం ఎక్కువైపోయి... పరిశోధకుడిని మరచిపోయే తత్వం కారణంగా వాటికి కారప్పూస అంటూ మరో పేరు పెట్టడంవల్ల ‘జంతికల్’కు పాస్కల్ అంత కీర్తి రాలేదట. తిండిని కేవలం ఒక దినచర్యగా మాత్రమే పాటిస్తున్న తుచ్ఛులైన మ్లేచ్ఛులైన పాశ్చాత్యులు... మనలా ఆస్వాదించడానికి బదులు వర్గీకరణలూ, శాస్త్రీకరణల పేరుతో సూత్రాల్ని వంటింటి గడప దాటించారని అంటుంటాడు వాడు. నలుడూ, భీముడూ వంటివాళ్లు గొప్ప పోరాటయోధులని అంటారుగానీ వాళ్లు ఆ నాటి సైంటిస్టులన్నది చివరగా మా రాంబాబుగాడు తేల్చిన విషయం! - యాసీన్