ధృతరాష్ట్ర కౌగిలి
నానుడి
కురుసార్వభౌముడైన ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అయినా, వేదవ్యాసుడి వరం వల్ల అతడికి పదివేల ఏనుగుల బలం ఉంది. కురుక్షేత్ర సంగ్రామంలో వందమంది కొడుకులనూ పోగొట్టుకున్నాడు. నిండుసభలో చేసిన ప్రతిజ్ఞ మేరకు వందమందినీ భీముడే మట్టుబెట్టాడు. కొడుకులు మరణించినందుకు దుఃఖంతో, వాళ్లందరినీ పొట్టన పెట్టుకున్న భీముడిపై కోపంతో రగిలిపోసాగాడు. అలాంటి సమయంలో పట్టాభిషేకానికి ముందు పెదనాన్న ఆశీస్సుల కోసం ధర్మరాజు సపరివార సోదర సమేతంగా ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు.
వారితో కృష్ణుడు కూడా ఉన్నాడు. ఆశీస్సులు తీసుకుంటున్న ఒక్కొక్కరినీ ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటూ, భీముడి వద్దకు ‘రా నాయనా.. భీమసేనా..’ అంటూ వచ్చాడు ధృతరాష్ట్రుడు. అతడి పగను, పన్నాగాన్ని ఎరిగిన కృష్ణుడు ముందే ఏర్పాటు చేసిన ఇనుప విగ్రహాన్ని ముందుకు నెట్టమని భీముడికి సైగ చేశాడు. భీముడు అలాగే చేశాడు. విగ్రహాన్ని భీముడనుకున్న ధృతరాష్ట్రుడు తన బిగికౌగిలిలో బంధించాడు. అతడి బలానికి ఆ విగ్రహం పిండి పిండిగా రాలిపోయింది. అందుకే పాత పగలు మనసులో పెట్టుకుని, ఆప్యాయంగా చేరదీసి, కదల్లేని పరిస్థితులు కల్పించి నాశనం చేయడాన్ని ధృతరాష్ట్ర కౌగిలిగా అభివర్ణిస్తారు.