Dhritarashtra
-
శతక నీతి – సుమతి ‘‘..సతాం సంగో...’’ పాటించండి
ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు. దుర్యోధనుడికన్నా ప్రమాదకారి. అంత పరమదుర్మార్గుడయిన ధృతరాష్ట్రుడికి శ్రీ కృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా దృష్టినిచ్చి నిండు సభలో తన విశ్వరూప దర్శనానికి అవకాశం ఇచ్చాడు. అలా ఎందుకిచ్చాడంటే... ఆయనకున్న ఒకే ఒక అర్హత చూసి. ఆ ఒక్క సుగుణం ఏమిటి! ప్రతిరోజూ రాత్రి పరమ ధర్మాత్ముడయిన విదురుడిని పక్కన కూర్చోబెట్టుకుని మంచి మాటలు వింటాడు.. పాటించడు. కానీ విదురుడు లేకపోతే విలవిల్లాడిపోతాడు. ఆయన చెప్పేవన్నీ వింటాడు. ‘ఒక మహాత్ముడిని చేరదీసావు, ఆయనతో కలిసి ఉన్నావు, ఆయన చెప్పినవన్నీ వింటున్నావు.. ఈ ఒక్క కారణానికి నీకు విశ్వరూప సందర్శనకు అవకాశం ఇస్తున్నాను’ అన్నాడు కృష్ణ పరమాత్మ. సత్పురుషులతో సహవాసం అంత మేలు చేస్తుంది. మంచివారితో ప్రయత్నపూర్వకంగా స్నేహం చేస్తుండాలి. వారు నిన్ను పేరు పెట్టి పిలిచినా, బంధుత్వంతో పిలిచినా, నీవు వారింటికి వెళ్ళగలిగినా, వారు తరచుగా నీతో మాట్లాడుతున్నా నీవు చాలా అదృష్ట్టవంతుడివని జ్ఞాపకం పెట్టుకో... ఎందుకని అంటే... భగవంతుడు బాగా ఇష్టపడేది తనని పూజించే వాళ్లని కాదు, తాను చెప్పిన మాటలను ఆచరించేవారిని. మంచి వారితో కలిసుండే వారినే ఇష్టపడతాడు.. భాగవతంలో అజామిళోపాఖ్యానం– అనే అద్భుతమైన ఘట్టం ఒకటి ఉంది. ఎప్పుడూ మంచి పనులు చేసేవారిని.. వారినే కాదు.. వారి వారి వారి తాలూకు వారి జోలికి కూడా వెళ్ళవద్దు, వారినెవరినీ నా దగ్గరకు తీసుకుని రావద్దు–అంటాడు యమధర్మరాజు తన భటులతో...అందులో. అందుకే లోకంలో ఒక సామెత ఉంది... ‘‘అసారే ఖలు సంసారే సారమేతచ్చతుష్టయం కాశ్యం వాసః సతాం సంగో గంగభః శంభుసేవనమ్’’. ఈ నాలుగు విషయాలు చాలా గొప్పవని తెలుసుకుని బతుకు..అని బోధిస్తారు. ఇవి తెలుసుకోకపోతే అసారమైన జీవితంలో ఉండిపోతావు. అసారం..అంటే నీవెంట వచ్చేది కాదు, నీ ఆత్మోద్ధరణకు వచ్చేది కాదు, నీ జీవితాన్ని చక్కదిద్దేది కాదు. ఏవి చాలా గొప్పవి.. అంటే.. కాశీపట్టణానికి వెళ్ళి ఉండడం, సతాంసంగో–సత్పురుషులతో స్నేహం, గంగానదిలోస్నానం చేయడం, శంభుసేవనమ్–శివార్చన చేయడం. ఈ నాలుగింటికన్నా సారవంతమయినవి జీవితంలో ఉండవు. సతాంసంగో.. సత్పురుషులతో సహవాసం చాలా గొప్పది. ‘‘గంగాపాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపం చ దైన్యం చ ఘ్నన్నిత్ సంతో మహాశయః’’ అంటారు. గంగలో స్నానం చేస్తే పాపాలు మాత్రమే పోతాయి, ఎంత వేసవికాలంలో అయినా శరీరంలో ఎంత తాపం కలిగినా, ఒక్కసారి చంద్రుడిని చూసి వెన్నెలలోకి చేరారనుకోండి కేవలం తాపం మాత్రం పోతుంది. కల్పవృక్షం దగ్గరకు చేరితే దరిద్రం మాత్రమే పోతుంది. అదే సత్పురుషులతో కలిసి ఉంటే పాపాలు, తాపాలు, దరిద్రం అన్నీ పోతాయి. తమ కష్టాలను పక్కనబెట్టి ఇతరుల కష్టాలను తమవిగా పరిగణిస్తారు సజ్జనులు. మీ దగ్గర ఏవో ఆశించి అలా చేయరు. అది వారి సహజ లక్షణం. దీనుల విషయంలో వారి మనసు కరిగిపోతుంది. బద్దెన గారు సుమతీ శతకంద్వారా ఇస్తున్న సందేశం కూడా ఇదే .. ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ ...’’.. దుర్జనులతో స్నేహం చేయవద్దు అని. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
2016 ఆరు శత్రువులపై గెలుపు మొదలెట్టండి!
బాహ్యశత్రువులను జయించాలంటే అంగబలం, అర్థబలం ఉంటే చాలు. కానీ, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అంతఃశత్రువులను జయించడం ఆషామాషీ కాదు. ఈ ఆరు అంతఃశత్రువుల ప్రభావంలో పడి పతనమైన ఆరుగురు పురాణ పురుషుల గురించి సోదాహరణంగా తెలుసుకుందాం... హిరణ్యకశిపుడు- క్రోధం సాక్షాత్తు శ్రీమహావిష్ణువు మీద ద్వేషంతో అనవసర క్రోధాన్ని పెంచుకున్న హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుడు నిరంతర హరినామ స్మరణలో మునిగి తేలుతూండటంతో అతడి క్రోధం అదుపు తప్పింది. కొడుకును ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలనే పిచ్చికోపంతో ప్రహ్లాదుడికి క్రూరమైన శిక్షలు విధిస్తాడు. విష్ణువు అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడికి ఆ శిక్షల వల్ల ఎలాంటి బాధ కలుగదు సరికదా, అతడి భక్తిపారవశ్యం రెట్టింపవుతుంది. ఇదంతా హిరణ్యకశిపుడికి మరింత క్రోధ కారణమవుతుంది. ‘ఎక్కడుంటాడురా నీ శ్రీహరి? ఈ స్తంభంలో ఉంటాడా..?’ అంటూ ఎదుటనే ఉన్న స్తంభాన్ని గదతో మోదుతాడు. స్తంభాన్ని చీల్చుకుని వచ్చిన నరసింహుడి చేతిలో అంతమైపోతాడు. దుర్యోధనుడు- లోభం అతి లోభం వల్ల నాశనమైన వాళ్లకు దుర్యోధనుడే పెద్ద ఉదాహరణ. రాజ్యమంతా తనకే దక్కాలనేది దురాశ. పాండవుల బలపరాక్రమాలు, కీర్తిప్రతిష్టలపై అమితంగా ఈర్ష్య చెందేవాడు. తమ్ముడు దుశ్శాసనుడు, మామ శకుని, మిత్రుడు కర్ణుడి అండతో అతడి లోభం పాండవులకు సూదిమొన మోపినంత నేలనైనా ఇవ్వబోనని తెగేసి చెప్పేటంతగా ముదిరి, యుద్ధానికి తెగిస్తాడు. యుద్ధంలో భీముడి చేతిలో దుర్యోధనుడి తొంభైతొమ్మిది మంది సోదరులూ నిహతులవుతారు. ప్రాణభీతితో మడుగులో దాగిన దుర్యోధనుడిని కవ్వించి, యుద్ధానికి పిలిచి భీముడితో తలపడేలా చేస్తాడు కృష్ణుడు. భీముడి గదాఘాతాలకు తొడలు విరిగి, నిస్సహాయంగా మరణిస్తాడు. ధృతరాష్ట్రుడు- మోహం కొడుకుల మీద మితిమీరిన మోహంతో ధృతరాష్ట్రుడు నాశనమయ్యాడు. దుర్యోధనుడు సహా తన వందమంది కొడుకుల మీద వల్లమాలిన వ్యామోహం ఆ గుడ్డిమహారాజుది. పాండవుల పట్ల తన కొడుకులు సాగించే అకృత్యాలను ఏనాడూ అతడు అరికట్టలేదు. దుర్యోధనుడిని ఎలాగైనా రాజ్యాభిషిక్తుడిని చేయాలనే కోరికతో కొడుకులను అదుపులో ఉంచే ప్రయత్నాలు చేయలేదు. కురుసభలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు విశ్వరూప ప్రదర్శన చేసినా, ధోరణి మార్చుకోలేదు. పాండవుల సంధి ప్రతిపాదనను తన కొడుకు దుర్యోధనుడు తోసిపుచ్చినప్పుడు అడ్డుచెప్పలేదు. నిండుసభలో దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణానికి తెగబడితే మందలించకపోవడం కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది. కురుక్షేత్ర రణరంగంలోని యుద్ధ విశేషాలను సంజయుడి ద్వారా తెలుసుకుంటూ, తన కొడుకుల మరణ వార్తలు వింటూ వగచి వగచి కుములుతాడు మోహపీడితుడైన ధృతరాష్ట్రుడు. రావణుడు- మదం రావణుడు సకల వేదశాస్త్ర పారంగతుడు. అయితే, శివుడి వల్ల పొందిన వరాల బలం వల్ల పూర్తిగా మదాంధుడయ్యాడు. అనవసరపు మదాంధతతోనే సీతను అపహరించి తన లంకలోని అశోకవనంలో బంధిస్తాడు. సముద్రాన్ని లంఘించి, సీత జాడను కనుగొన్న హనుమంతుడు హితవు చెప్పబోతే, మదంతో అతడి తోకకు నిప్పంటిస్తాడు. రామభక్తుడైన హనుమ లంకాదహనం చేసి మరీ హెచ్చరించినా పెడచెవిన పెడతాడు. హితబోధ చేసిన తమ్ముడు విభీషణుడిని తరిమేస్తాడు. వానరసేనతో రామలక్ష్మణులు లంకను చుట్టుముట్టినా, బుద్ధితెచ్చుకోక యుద్ధానికి సిద్ధపడతాడు. చివరకు రామబాణానికి నేలకూలతాడు రావణ బ్రహ్మ. విశ్వామిత్రుడు- మాత్సర్యం బ్రహ్మర్షి అయిన వశిష్టుడి పట్ల ఎనలేని మాత్సర్యం విశ్వామిత్రుడిది. ఆ మాత్సర్యంతోనే అతడికి పోటీగా బ్రహ్మర్షి కావాలనే సంకల్పంతో తపోదీక్షలో ఉన్న విశ్వామిత్రుడి వద్దకు మేనకను పంపుతాడు ఇంద్రుడు. మేనకపై మోహంలో మునిగిపోవడంతో తపోభ్రష్టుడవుతాడు. విశ్వామిత్రుడు మళ్లీ తపస్సు మొదలుపెడతాడు. ఇంద్రుడు ఈసారి రంభను పంపుతాడు. తపోభంగానికి వచ్చిన రంభను చూసి విశ్వామిత్రుడు కోపం పట్టలేక వెయ్యేళ్లు రాయిగా పడి ఉండాలంటూ ఆమెను శపిస్తాడు. ఆగ్రహాన్ని అణచుకోలేకపోవడం వల్ల మళ్లీ తపోభ్రష్టుడవడంతో మరోసారి తపోదీక్ష పడతాడు. పరీక్షలన్నింటినీ తట్టుకుని తపస్సు కొనసాగిస్తాడు. చివరకు బ్రహ్మ స్వయంగా విశ్వామిత్రుడిని బ్రహ్మర్షిగా ప్రకటిస్తాడు. మాత్సర్యం వల్ల భంగపాటు ఎదుర్కొన్న విశ్వామిత్రుడు, ఆ అవలక్షణాన్ని విడనాడిన తర్వాతే తన లక్ష్యాన్ని సాధించగలిగాడు. కీచకుడు- కామం కామం వల్ల కీచకుడు నాశనాన్ని కొనితెచ్చుకున్నాడు. కీచకుడు విరాటరాజుకు బావమరిది. రాజ్యం విరాటరాజుదే అయినా, పెత్తనం మాత్రం సేనాధిపతి అయిన కీచకుడిదే. రాజుకు సైతం తనను నియంత్రించే శక్తి లేకపోవడంతో కీచకుడు సాగించిన అకృత్యాలకు, అరాచకాలకు అంతులేదు. కీచకుడి ఆగడాలు అలా కొనసాగుతుండగానే, కుంజరయూధం దోమ కుత్తుక జొచ్చినట్లుగా పంచపాండవులు ద్రౌపదీ సమేతంగా అజ్ఞాతవాసం కోసం విరాటరాజు కొలువులో వివిధ మారువేషాల్లో చేరుతారు. ద్రౌపది సైరంధ్రిగా అంతఃపురం చేరి, రాణి సుధేష్ణకు సేవలు చేస్తూ ఉండేది. కన్నూమిన్నూ కానని కామంతో కీచకుడు ద్రౌపదిని వేధిస్తాడు. చివరకు నిండు కొలువులోనే ఆమెను చెరబట్టేందుకు బరితెగిస్తాడు. ద్రౌపది తెలివిగా అతడిని నర్తనశాలకు రప్పిస్తుంది. కీచకుడు వచ్చేవేళకు అప్పటికే అక్కడ చీకటిలో కాచుకుని ఉన్న భీముడు అతడిని చప్పుడు కాకుండా మట్టుబెడతాడు. -
గాంధారి
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 6 గాంధార రాజు సుబలుడి కూతురు గాంధారి. ధృతరాష్ట్రుడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లిచేయమని భీష్ముడు వర్తమానం పంపినప్పుడు ‘అతను కళ్లులేనివాడు గదా’ అనే శంక పీడించింది సుబలుణ్ని. కానీ పౌరవకులం ఖ్యాతీ సదాచార సంపన్నతా పరాక్రమమూ మొదలైన అనుకూల విషయాలు చాలా అవుపించడం వల్ల, ప్రతికూలమైన గుడ్డితనాన్ని వెనక్కి నెట్టి, పిల్లనిద్దామని నిశ్చయించుకొన్నారు సుబల దంపతులు. ధృతరాష్ట్రుడికి తనను ఇవ్వబోతున్నారని తెలిసిన గాంధారి ‘నేను ఎదురుగా అతన్ని చూస్తే గుడ్డితనం పెద్దదోషంగా అవుపిస్తుంది. అదీగాక, ఇతరులతో పోల్చడాలూ పోల్చుకోడాలూ వచ్చి మనసు చెదురుతుంది’ అని ఆలోచించి, గట్టి నిశ్చయంతో తన రెండు కళ్లనూ చాలా మడతలు పెట్టిన బట్ట పట్టీతో బంధించుకొంది. నిజానికి, ఉన్న కళ్లను కూడా మూసేసుకొని, కావాలని గుడ్డిగా ఉండటం అంత ప్రశస్తమేమీ కాదు. అయితే, ఆవిడ తర్కమూ తప్పేమీ కాదు. ప్రతిక్షణమూ తల్లిదండ్రుల్ని తప్పుపట్టుకొంటూ, జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం కన్నా తానూ గుడ్డిగా ఉండటమే మంచిదని అనుకొంది ఆవిడ. పిల్లను అడిగి సంబంధం ఖరారు చేయాలిగదా అనిపిస్తుంది గానీ రాజకీయ వివాదాల్లో ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. శాంతనుడికి సత్యవతి వల్ల పుట్టిన పిల్లలు త్వరగా చనిపోవడం వల్ల, రాజవంశానికి పెద్ద సమస్యే వచ్చిపడింది. అందుకోసమనే వంద మంది సంతానం కనగలిగే వరాన్ని శివుణ్నించి పొందిన గాంధారిని భీష్ముడూ సత్యవతీ ఎన్నుకొన్నారు. ఒకరోజున వ్యాసుడు చాలా ఆకలితో గాంధారి ఇంటికి వచ్చాడు. ఆవిడ ఆయనకు భోజనం పెట్టి, విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది. దానికి సంతోషించి ఆయన వరం కోరుకోమన్నాడు. ‘నా భర్తకు దీటైన నూరుమంది కొడుకులు పుట్టాల’ని ఆవిడ కోరుకొంది. శివుడిచ్చిన వరాన్ని వ్యాసుడి వరం బలపరిచినట్టయింది. ధృతరాష్ట్రుడి వల్ల కలిగిన గర్భాన్ని ఆవిడ నిండా రెండేళ్లు మోసింది. అక్కడ వనంలో ఉన్న తోటికోడలు కుంతికి యుధిష్ఠిరుడు అప్పుడే పుట్టేశాడు. గాంధారికి అసూయ పుట్టింది. భర్తకు తెలియకుండా ఆవిడ తన కడుపును తొందర కొద్దీ పొడుచుకొంది. చాలా గింజలున్న పెద్దపండు లాంటి ఒక గట్టి మాంస పిండం బయటపడింది. ఆవిడ అవాక్కయింది. వందమంది కొడుకుల వరం అబద్ధమేనా అనిపించింది. వందలూ వేలుగా పిల్లలు పుట్టడాలు జంతువుల్లో కద్దు. పేడలో కులకులలాడుతూ పురుగులు ఎక్కణ్నించి వస్తున్నాయో తెలియకుండా పుట్టుకొస్తాయి. పాములూ మొసళ్లూ మొదలైన జంతువులూ ఎక్కువ గుడ్లను పెట్టి పొదుగుతూ ఉంటాయి. సాధారణ పద్ధతిలో మనుషుల్లో ఒక్కొక్కడూ పుట్టుకొని వస్తూ వందమంది పుట్టాలంటే కనీసం వందేళ్లైనా పడుతుంది. ఇంతకుముందు సగరుడనే రాజుకు ఒక భార్య వల్ల అరవై వేల మంది కొడుకులు పుట్టారని చెబుతారు. వందకు ఆరువందలింతల మంది పుట్టడం ఇంకా కష్టమైనదే. అప్పుడూ ఇప్పుడూ కూడా ఆవునేతి కుండల్లో ఆ గర్భాలను పెంచినట్టు చెప్పారు. అందుచేత, ఎక్కువమందిని కనే ప్రక్రియ ఆయా కాలాల్లో వాళ్లకు తెలుసునని అర్థమవుతుంది. ఇప్పటివాళ్లకే ఇంక్యుబేటర్లలో పిల్లల్ని పెంచే విద్య వచ్చుననీ అప్పటివాళ్లకు ఏమీరాదని అనుకోవడం శుద్ధ అవివేకమవుతుంది. నాగరికత ఎన్నిసార్లో చాలా ఉచ్ఛస్థాయిలకు చేరి, పెద్ద పెద్ద దుర్ఘటనల వల్లనో భూకంపాలూ సునామీలూ భారీ ఉల్కాపాతాలూ మొదలైన అతిఘోరమైన విపత్తుల వల్లనో కనుమరుగైపోతూ వచ్చింది. ఇది తెలియని మనం, ఇప్పటికాలంలో తెలిసినది మునపటి కాలంలో తెలియదని పొరబాటుగా అనుకొంటూ ఉంటాం. సుశ్రుతుడు వెంట్రుకను నిలువుగా చీల్చగలిగిన నేర్పుగల సర్జన్‌గా మనం వింటూ ఉంటాం. క్షయ రోగానికి మేక మాంసం తినడమూ మేకల మందలో పడుకోవడమూ విరుగుడన్న సంగతి పూర్వీకులు ఎరుగుదురు. కానీ ఇప్పటికాలంలో ఆ రోగానికి మందులను కనుక్కోడానికి చాలాకాలమే పట్టింది. కణాదుడనే ఒక శాస్త్రజ్ఞుడు తన ‘వైశేషిక సిద్ధాంతం’లో పరమాణువుల గురించి చెప్పాడన్న సంగతి చాలామందికి తెలియనే తెలియదు. ఈ శాస్త్రాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఆ భాష మనకు ‘మెకాలే ఎఫెక్టు’ ద్వారా దూరమైపోయింది. అదీగాక సంస్కృతంలో శాస్త్రాలన్నీ సూత్ర రూపాల్లో ఉంటాయి. సూత్రాలనేవి చిన్న చిన్న వాక్యాలే కానీ చాలా అర్థంతో కూడుకొని ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడానికి విశ్లేషణా వివరణా కావలసివస్తాయి. పెద్ద పెద్ద అంగలేసిందని చెప్పుకొనే ఇప్పటి సైన్సుకు ఇప్పటికీ అర్థంకాని ప్రాకృతికమైన దృగ్విషయాలెన్నో ఉన్నాయి. మన గ్రహం మీదనే జీవం ఉందనీ, అదే చాలా పురోగతిని పొందినదనీ అనుకొంటూ ఉంటాం. ఇతర గ్రహాల మీద జీవం ఉండే అవకాశాన్ని మనం వట్టినే కొట్టిపారేయలేం. ఫ్లైయింగ్ సాసర్లు వస్తున్నాయంటారు; అవేమిటో తెలియదు. వాటిలో వచ్చే ఆగంతకులెవరో ఎంతటి శాస్త్రజ్ఞానం గలవాళ్లో మనకు అంతుపట్టదు. ఈ నేపథ్యంలో మరోచోట జీవం లేదనుకోవడం ఒక విధంగా అహంకారమే. ఎక్కువ ఉష్ణోగ్రతలున్నచోట జీవాలుండవని సాధారణంగా అనుకొంటాం. కానీ కొన్ని రాక్షస తొండలు అగ్నిపర్వతాల నుంచి వెలువడిన లావాల ప్రాంతాల్లో గుడ్లను పెడుతూ ఉంటాయి. ఒక కణం తాలూకు శక్తి ఫలానా సమయంలో ‘ఇంత’ అని మనం స్పష్టంగా చెప్పనేలేం.. వీటన్నింటినీ పోల్చి చూసుకోకపోతే వందమంది పుట్టడమనేది మనకు అసాధారణంగా తోస్తుంది; అబద్ధమనిపిస్తుంది; కట్టుకథ అనిపిస్తుంది. ఇక ఆ గర్భపిండాలను పెంచడమన్నదీ అలాగే అబద్ధమనిపిస్తుంది. వ్యాసుడి పక్కకు చేరి ‘ఆడపిల్ల ఒకత్తె ఉంటే బాగుంటుంది’ అని గాంధారి అంటే దాన్ని కూడా ఆ మాంసపిండం నుంచే తీశాడు. అదే సైంధవుడికి పెళ్లామైన దుస్సల. మన ప్రస్తుత జ్ఞానాన్ని ఆధారంగా తీసుకొని, ఏదైనా సత్యమూ అసత్యమూ అని చెప్పడం ఎంత అసమంజసమో పైన చెప్పిన వాక్యాలను కుదురుగా చదివితే క్షుణ్ణంగా అర్థమవుతుంది. అంత కష్టపడి కన్న ఆ వందమందీ మొగుడి నిర్వాకంకొద్దీ చనిపోతే ఎంత బాధగా ఉంటుందో చెప్పవలసిన పనిలేదు. తనతోబాటే వచ్చి స్థిరపడిపోయిన తన అన్న శకుని మోసపు జూదంతో పాండవుల్ని దాసులుగా చేసినప్పుడు, ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాల పేరిట ఆ దాస్యాన్ని పోగొట్టి సర్ది చెప్పి పంపించేశాడు. అయితే, రెండోసారి జూదమాడటానికి పాండవుల్ని దారి మధ్యలోంచే పిలిపించాలని దుర్యోధనుడు మంకుపట్టు పట్టినప్పుడు, గాంధారి ధృతరాష్ట్రుడితో ‘నీ మాట విననివాణ్ని విడిచిపెట్టడమే మంచిది. ధర్మపూర్వకంగా గెలవని డబ్బు తరవాత తరాలవాళ్లను నాశనం చేస్తుంది’ అని అంది. కొడుకంటే ఆవిడకు ధృతరాష్ట్రుడికున్నంత మోహం లేదు. యుద్ధమంతా అయిపోయిన తరవాత, దగ్గరికి వచ్చిన పాండవుల్ని శపిద్దామన్నంత బాధా కోపమూ ఆవిణ్ని చుట్టుముట్టాయి. అప్పుడు వ్యాసుడు ఆవిడకు ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చాడు: ‘‘యుద్ధం జరిగిన పద్దెనిమిది రోజుల్లోనూ ప్రతిరోజూ నీ పెద్దకొడుకు నీ దగ్గరికి వచ్చి, ‘జయించేలాగ దీవించమ’ని అడుగుతూ ఉండేవాడు గదా. నువ్వేమో ఎప్పుడూ ‘యతో ధర్మస్తతో జయః’ అని చెపుతూ వచ్చావే తప్ప ఒక్కసారి గూడా ‘నువ్వు గెలుస్తావు’ అని అనలేదు. నువ్వు ముందరి నుంచీ చాలా ఓర్పు ఉన్నదానివి. అధర్మాన్ని వదిలిపెట్టు. నువ్వన్నట్టే ధర్మమున్న వైపే జయించింది’ అని. అప్పుడు ఆవిడ పాండవుల్ని శపించకుండా ఉన్నా శ్రీకృష్ణుణ్ని మాత్రం శపించింది: ‘జ్ఞాతులైన కౌరవ పాండవులు పరస్పరమూ కొట్టుకొంటూ చచ్చిపోతూ ఉంటే వాళ్లను ఆపకుండా ఉపేక్షించావు గనక, నీ జ్ఞాతుల్ని నువ్వే చంపుతావు. ఈ రోజు నుంచి ముప్ఫై ఆరేళ్ల తరవాత నీవాళ్లందరూ ఒకళ్లతో ఒకళ్లు దెబ్బలాడుకొంటూ చనిపోతారు. నువ్వు కూడా ఒక అనాథుడి మాదిరిగా ఎవరికీ తెలియకుండా కుచ్చితమైన ఉపాయంతో చచ్చిపోతావు’ అని. సంస్కృతంలో శతమూ సహస్రమూ అనే మాటలు వందా వేయీ అనేగాక అనేకమనే అర్థాన్ని కూడా ఇస్తాయి. మనిషిలో అటు దైవీశక్తులూ ఇటు ఆసురీశక్తులూ రెండూ ఉన్నాయి. ఆ మంచీ చెడూ శక్తులు ఎప్పుడూ దెబ్బలాడుకొంటూనే ఉంటాయి. పురాణాల్లో తరచుగా వర్ణిస్తూ ఉండే దేవాసుర యుద్ధమంటే ఇదే. ఆ రెండు శక్తుల్లోనూ మంచివి ఎప్పుడూ తక్కువే. అందుచేతనే ధర్మపరులూ జ్ఞానవంతులూ అయిన పాండవులు ఐదుగురు మాత్రమే. అధర్మం కొమ్ముకాసేవాళ్లూ పాపప్పనులూ అజ్ఞానమూ గొప్ప అనుకొనేవాళ్లూ చాలామందే ఉంటారు. అందుకనే కౌరవులూ వాళ్లవైపు ఉండి యుద్ధం చేసినవాళ్లూ అనేకులు. ‘గాంధారి’ అనే మాటలోని ‘గాం’ అనే మాట కదలికను సూచిస్తుంది. కదలికకు మరోపేరే సృష్టి. అంతా ఒకే వస్తువున్నప్పుడు కదలిక ఎక్కడ ఉంటుంది? అది వేరు పేరైనప్పుడే కదలికలూ స్పందనలూ పుడతాయి. ఆ కదలికను ధరించేది ‘గాంధారి’ - అంటే, సృష్టిని ధరించి పోషించేది ‘గాంధారి’. సృష్టిని ధరించి పోషించేది కోరికల బలం, వాసనల శక్తి, మునపటి కర్మఫల గంధాల శక్తి. ధృతరాష్ట్రుడు ఇంద్రియ సంబంధమైన గుడ్డి మనస్సు; అతని ‘భార్య’ గాంధారి కోరికల శక్తి. మనస్సు ఇంద్రియాల ద్వారానే చూస్తుంది గనక అది పుట్టుగుడ్డిదే; మనను అందర్నీ కోరికల శక్తి, అంటే, మునుపటి వాసనల శక్తి దళసరి పట్టీతో కళ్లకు గంతలు కట్టుకొన్నట్టుగా ప్రవర్తింపజేస్తూ ఉంటుంది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
ధృతరాష్ట్రుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 5 రాష్ట్రమంటే ప్రాంతమూ దేశమూ అనే అర్థాలే వాడుకలో ఉన్నాయి. అయితే, దీనికి ఉపద్రవమూ ఉత్పాతమూ ఎప్పుడొస్తుందో తెలియకుండా మీదికి విరుచుకొనిపడే విపరీతమైన కష్టమూ అనే అర్థం కూడా ఉంది. అటువంటి ఉపద్రవాన్ని ధరించి పోషించేవాడు మన ధృతరాష్ట్రుడు. అతను రాష్ట్రాన్ని తన పట్టులో ఉంచుకొని పోషించాలని చూస్తూ ఉండేవాడు. కానీ అతను పుట్టుగుడ్డి. పుట్టుగుడ్డివాడు రాజ్యాన్ని ఏవిధంగా పరిపాలించగలడు? దాన్ని తన పట్టులో ఎలాగ ఉంచుకోగలడు? ‘చక్షుర్వై సత్యం’ అని అంటారు: కంటితో చూసినదే సత్యం. కళ్లులేని కబోదికి, ఇక సత్యమనేది ఏవిధంగా అవుపిస్తుంది? అందుకనే పెద్దవాడైనా సరే, ఇతన్ని కాదని, అంబాలిక కొడుకైన పాండురాజునే రాజుగా చేశారు. పాండురాజు విలువిద్యలో మేటిగాడు; ధృతరాష్ట్రుడేమో పదివేల ఏనుగుల బలమున్నవాడు; విదురుడు, యముడి అవతారం గనక, మహాధర్మిష్ఠుడు. పాండురాజు పెళ్లైన ఒక మాసానికే దిగ్విజయానికి వెళ్లి, రాజ్యాన్ని బాగా పెంపొందించాడు; సుస్థిరంగా కూడా చేశాడు. అయినా, ఇలాగ గుడ్డితనం ‘సాకు’తో తన పెద్దరికాన్ని పక్కుకు పెట్టారని, పైకి గంభీరంగా ఉన్నా, ధృతరాష్ట్రుడికి మొదటి నుంచీ లోపల పీకుడే. తనకు కళ్లు లేకపోతే లేకపోనీ, భార్యకైనా ఉంటే ఒక పక్షంగా బాగానే ఉండేది. కానీ, గాంధారి తనను పుట్టుగుడ్డి అయిన ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లిచేస్తారని వినగానే మగాడిలో తప్పుల్ని చూడకూడదన్న కృతనిశ్చయంతో ఆమె తన నిక్షేపమైన కళ్లకు బట్టను పట్టీగా కట్టుకొంది. మొగుడు పుడుతూనే గుడ్డివాడైతే, పెళ్లాం తెచ్చిపెట్టుకొన్న గుడ్డితనం కలదైంది. ఈ రెండు గుడ్డితనాలూ కలిసి కన్న వందమంది పిల్లలూ మరోరకం గుడ్డివాళ్లయ్యారు. వాళ్లల్లో పెద్దవాడికి అసూయ అనే గుడ్డితనం. రెండోవాడికి మన్నూమిన్నూ కానని కావరమనే గుడ్డితనం. పెద్దాడు దుర్యోధనుడు పుడుతూనే గాడిదల ఓండ్రింపు లాంటి కర్ణకఠోరమైన ధ్వనిచేశాడు; అప్పుడు దిక్కులు కాలిపోతాయా అన్నట్టు వడగాలులు వీచాయి. ఇదంతా చూసి ధృతరాష్ట్రుడు ‘యుధిష్ఠరుడు మన కులంలో పెద్దబ్బాయి. అంచేత అతనికి రాజ్యం దక్కుతుంది. సరే. ఇదుగో ఈ దుర్యోధనుడు తరువాత పుట్టాడు. వీడు నా పెద్దకొడుకు గదా! వీడు కూడా రాజవుతాడా కాడా?’ అని భీష్ముడూ విదురుడూ మొదలైనవాళ్లను అడిగాడు. ఆ మాట అడగ్గానే క్రూరజంతువులు గర్జించాయి; నక్కలు అమంగళంగా ఊళలు వేశాయి. అప్పుడు విదురుడు ‘చూస్తున్నావుగా అన్నయ్యా ఈ అపశకునాలు! వీడు కులాంతకుడవుతాడు. వీణ్ని విడిచిపెడితే శాంతిగా ఉంటుంది రాజ్యం. వీణ్ని రక్షిస్తే మాత్రం చాలా ఉపద్రవమే వచ్చిపడుతుంది. ఈ ఒక్కణ్నీ వదిలిపెట్టి, కులానికే గాదు, జగత్తుకి కూడా క్షేమాన్ని కలిగించు. కులం మంచికోసం ఒకణ్ని (దుర్మార్గుణ్ని) విడిచిపెట్టాలి; గ్రామం మంచికోసం కులజంజాటాన్ని వదలాలి; జనపదం హితంకోసం గ్రామమనే సంకుచితత్వాన్ని విడిచిపెట్టాలి; విస్తారమైన సుఖం కోసం భూమి అనే ఇంతపాటి పరిధిని విడిచిపెట్టాలి’ అన్నాడు. పుత్రుడి మీది మోహం కొద్దీ విదురుడు చెప్పిన మంచి మాటల్ని పెడచెవిని పెట్టాడు ధృతరాష్ట్రుడు. పాండురాజు జింకల రూపంలో ఉన్న మునిదంపతుల్ని బాణం వేసి చంపడంతో శాపగ్రస్తుడై కామక్రీడకు దూరంగా ఉండవలసిన దగ్గర్నుంచీ వనంలోనే తపస్సు చేసుకొంటూ ఉండేవాడు. అప్పణ్నించీ రాజ్యాన్ని ధృతరాష్ట్రుడే పరిపాలిస్తున్నాడు. దూర్వాసుడు కుంతికిచ్చిన వరం సాయంతో కుంతికీ మాద్రికీ యుధిష్ఠరుడూ భీముడూ అర్జునుడూ నకులుడూ సహదేవుడూ పుట్టారు. ఓ రోజున మాద్రితోబాటు వనంలోకి షికారుకు వెళ్లిన పాండురాజుకు పట్టరాని కామం ఆవహించింది. వద్దన్నా వినకుండా మాద్రిని కావలించుకోబోయాడు. అంతే, అతను చనిపోయాడు. ‘నా వల్లనే పోయాడు గనక, నేనూ ఆయనతో బాటే వెళ్లిపోతాను’ అని మాద్రి అతని చితిలోనే కాలిపోయింది. కుంతినీ చిన్నపిల్లల్ని ఐదుగుర్నీ వెంటబెట్టుకొని, వనంలోని రుషులు హస్తినాపురానికి వచ్చి, జరిగింది చెప్పి, వాళ్లను విడిచిపెట్టి వెళ్లారు. కుర్రాళ్లు పెద్దవాళ్లవుతున్నారు. చదువులూ సంస్కారాలూ ఆయుధ విద్యలూ అబ్బాయి. అన్నిట్లోనూ పాండవులదే పైచేయిగా ఉండేది. ధర్మరాజు పెద్దవాడు గనక అతన్ని యువరాజుగా చేశాడు ధృతరాష్ట్రుడు. పౌరులందరూ ధృతరాష్ట్రుణ్ని, భీష్ముణ్ని కూడా కాదని, ధర్మరాజునే రాజుగా కోరుకోడాన్ని చూసి దుర్యోధనుడు విలవిల్లాడిపోయాడు. ‘ఈ రాజ్యం పాండురాజుది గనక, అతని పిల్లలకే చెందుతుంది. ఇక మేమూ మా పిల్లలూ రాజ్యానికెప్పుడూ దూరంగా ఉండవలసిందేనా? ఎప్పుడూ ఇతరులు వేసే కూడు తినవలసినవాళ్లమేనా? నీకే గనక మొదట రాజ్యం వచ్చి ఉంటే, మాకీ దుర్దశ ఉండేది కాదు’ అని తండ్రి ఎదుట తన బాధ వెళ్లగక్కాడు. పాండవుల్ని వారణావతమనే ఊరుకి పంపించడానికి ప్రయత్నం చేసి, ప్రజలందరూ తన అధీనంలోకి వచ్చిన తరవాత, తిరిగి వాళ్లు వచ్చేలాగ చేద్దామని ఒక ప్రణాళికను తయారుచేశాడు. అంతకుముందు కణికుడనే మంత్రి, శత్రువులు బలవంతులైతే ఉపాయంతో వాళ్లను బలహీనులుగా జేసి చంపాలనీనూ త్వరగా మట్టుబెట్టాలంటే వాళ్ల ఇంటిని తగలబెట్టాలనీనూ ధృతరాష్ట్రుడికి ఉపదేశించాడు. దీనితోనే లక్కింటి పథకానికి బీజం పడింది. నమ్మకస్తులైన మంత్రుల చేత వారణావతం ‘ఏం అందమైన నగరమండీ!’ అని పాండవుల ముందు పొగిడించాడు ధృతరాష్ట్రుడు. వాళ్లు వెళ్లడానికి సుముఖంగా ఉన్నారన్నప్పుడు ‘మీరు వారణావతం వెళ్దామనుకొంటున్నారుగా! శుభం. వెళ్లిరండి’ అని అడక్కుండానే పచ్చజెండా ఊపేశాడు. ధర్మరాజుకు ధృతరాష్ట్రుడి మనస్సు తెలియకపోలేదు కానీ పెద్దవాడి మాటకు ఎదురు ఎలాగ చెప్పగలడు? వారణావతానికి పాండవులు వెళ్తూంటే, నిర్భయులైన కొంతమంది ‘రాజు పాండవుల్నీ తన పుత్రుల్నీ సమంగా చూడటం లేదు. ధర్మాన్ని పట్టించుకోవడం లేదు. ఇంత అధర్మాన్ని భీష్ముడెలాగ ఒప్పుకొంటున్నాడో’ అని బాహాటంగానే అన్నప్పటికీ ధృతరాష్ట్రుడికి చీమకుట్టినట్టుగా కూడా లేదు. లక్క ఇంటిలో కాలిపోయారని తెలిసినప్పుడు మొసలి కన్నీళ్లు కార్చి స్నానాలు కూడా చేశాడు ధృతరాష్ట్రుడు. ద్రౌపదితో వివాహమైన తరవాత, ఇక ఈ తగాదాల్లేకుండా అర్ధరాజ్యమిచ్చేస్తానని చెప్పి పాండవుల్ని ఖాండవ ప్రస్థానికి పంపాడు. భీముడూ అర్జునుడూ నకులుడూ సహదేవుడూ నాలుగు దిక్కుల్నీ జయించుకొని వచ్చి ధర్మరాజు రాజసూయయాగం చేయడానికి అనువు కల్పించారు. అక్కడికి వెళ్లిన దుర్యోధనుడికి ధర్మరాజుకున్న సిరిని చూసి కన్నుకుట్టింది. తిండి సయించడం మానేసింది; కృశించుకొనిపోయాడు. ‘ఏమిటిలా నీరసించుకొనిపోతున్నావు?’ అని అడిగాడు తండ్రి. ‘పాండవులసిరి అంతా నన్నుజేరితేనే నాకు కంటినిండా నిద్రపడుతుంది నాన్నా! శకుని మామయ్య వాళ్లతో కపట జూదమాడి ఆ సిరిని నాకు అప్పగిస్తానంటున్నాడు. నువ్వు ఊ అంటే చాలు!’ అని పెద్ద పుత్రరత్నం గునిశాడు. ‘వాళ్ల ధనమూ నీదేగదరా! బాహువుల్లాటి వాళ్లను తెగ్గొట్టుకోకు. ద్వేషాన్ని పెట్టుకోకు’ అని నెత్తీనోరూ మొత్తుకొని చెప్పినా వినలేదు. ‘సరే, విదురుడితో మాట్లాడి నిశ్చయిద్దాంలే’ అనగానే... ‘అయినట్టే! విదురుడు బాబాయి దీన్ని పడనివ్వడు. అప్పుడింక నాకు చావే శరణ్యం’ అన్నాడు. ఎంత పుత్రమోహం ఉన్నా, విదురుణ్ని అడక్కుండా ఒక్కపనీ చేయలేడు ధృతరాష్ట్రుడు. ‘జూదం వల్ల కొడుకుల మధ్య భేదం రాకుండా చూడు అన్నయ్యా!’ అన్న విదురుడికి ‘అహ, ఇది వట్టి సుహృద్ద్యూతం మాత్రమే. అయినా నేనూ ద్రోణుడూ భీష్ముడూ నువ్వూ ఉండగా అన్యాయం ఎందుకు జరుగుతుంది?’ అని సన్నాయి నొక్కులు నొక్కుతూ పాండవుల్ని పిలిపించాడు. జూదం జరుగుతుంటే మాటిమాటికీ ‘ఇప్పుడేం గెలిచారు, ఇప్పుడేం గెలిచారు?’ అని అడుగుతూనే ఉన్నాడు. తన గుడ్డిముఖంలో తాండవిస్తూన్న ఆనందాన్నిదాచుకోలేకపోయాడు. కోడలికి అవమానం జరిగిపోయిన తరవాతనే, పెద్దలందరూ ఏమీ అనకుండా ఉండటం కోసం, ఆమెకు వరాలనిచ్చి పాండవుల దాస్యాన్ని తీర్చాడు. ‘ఇంతా సాధించిన తరవాత ముసిలోడు అంతా పాడుచేసేశాడు’ అని దుశ్శాసనుడు మెటికలు విరిచాడు. మళ్లీ జూదానికి పిలిపించమని దుర్యోధనుడు మంకుపట్టు పట్టాడు. అప్పుడు తల్లి గాంధారి కూడా ‘నీ అదుపులో వాడు ఉండనంటే, కులానికి చిచ్చులాంటివాణ్ని వదిలిపెట్టెయ్’ అని చెప్పింది. ‘కులం అంతమైపోతే పోనీ నేను మాత్రం దుర్యోధనుణ్ని ఆపలేను’ అని ధృతరాష్ట్రుడు చేతులెత్తేశాడు. ‘పద్నాలుగో ఏడాది తిరిగివచ్చినప్పుడు, వాళ్ల రాజ్యం వాళ్లకు ఇవ్వకపోతే భీమార్జునులు నిశ్శేషంగా అందర్నీ చంపేస్తారు. అందుకని అహితం చేస్తూన్న నీ కొడుకును విడిచిపెట్టు’ అని విదురుడు అనేసరికి కోపాన్ని పట్టలేక ‘నిజమే, పాండవులూ నా పుత్రులే. కానీ, దుర్యోధనుడేమో నా శరీరం నుంచి పుట్టాడు. నా దేహాన్ని నేనెలాగ వదిలిపెట్టాలి? నీకెప్పుడూ పాండవులంటేనే ఇష్టం. నీ ఇష్టమొచ్చిన చోటికి వెళ్లవచ్చు’ అని ధృతరాష్ట్రుడు నోరుజారాడు. విదురుడు వెళ్లిన మీదట, తాను చేసిన తప్పు స్పృహకు వచ్చి, వెంటనే సారథి సంజయుణ్ని పంపి, అతన్ని తిరిగి వచ్చేలా చేసుకొన్నాడు. యుద్ధం వచ్చి పడబోతోందన్న దగ్గర్నుంచీ నిద్ర కరువైపోయింది. విదురుడూ సనత్సుజాతుడూ ఎంతమంది చెప్పినా ఊరట కలగలేదు. సంజయుడు యుద్ధ విషయాలను చెబుతూంటే కుమిలి కుమిలిపోయాడు. శ్రీకృష్ణుడు చెప్పిన గీతను విన్నా కోపం ఏమాత్రమూ తగ్గలేదు. వందమంది పిల్లల్నీ చంపినవాడు భీముడు గనక అతన్ని తన కౌగిలిలో చంపేద్దామని అనుకొన్నాడు. శ్రీకృష్ణుడు ఇనుప విగ్రహాన్ని ధృతరాష్ట్ర కౌగిలిలోకి పంపాడు. మొదటినుంచి చివరిదాకా ధృతరాష్ట్రుడిది ఒకటే తీరు: పుత్రమోహంతో అజాగ్రత్తగా వ్యవహరించడం. ‘అజాగ్రత్తే మృత్యువు’ అని ఎంతమంది చెప్పినా తెలుసుకోలేక పోయాడు. మనిషి మనస్సు కూడా ఇలాగే అజాగ్రత్తగా ప్రవర్తిస్తూ శరీర రాష్ట్రానికి ‘రాష్ట్రాన్ని’ అంటే ఉపద్రవాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
ధృతరాష్ట్ర కౌగిలి
నానుడి కురుసార్వభౌముడైన ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అయినా, వేదవ్యాసుడి వరం వల్ల అతడికి పదివేల ఏనుగుల బలం ఉంది. కురుక్షేత్ర సంగ్రామంలో వందమంది కొడుకులనూ పోగొట్టుకున్నాడు. నిండుసభలో చేసిన ప్రతిజ్ఞ మేరకు వందమందినీ భీముడే మట్టుబెట్టాడు. కొడుకులు మరణించినందుకు దుఃఖంతో, వాళ్లందరినీ పొట్టన పెట్టుకున్న భీముడిపై కోపంతో రగిలిపోసాగాడు. అలాంటి సమయంలో పట్టాభిషేకానికి ముందు పెదనాన్న ఆశీస్సుల కోసం ధర్మరాజు సపరివార సోదర సమేతంగా ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. వారితో కృష్ణుడు కూడా ఉన్నాడు. ఆశీస్సులు తీసుకుంటున్న ఒక్కొక్కరినీ ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటూ, భీముడి వద్దకు ‘రా నాయనా.. భీమసేనా..’ అంటూ వచ్చాడు ధృతరాష్ట్రుడు. అతడి పగను, పన్నాగాన్ని ఎరిగిన కృష్ణుడు ముందే ఏర్పాటు చేసిన ఇనుప విగ్రహాన్ని ముందుకు నెట్టమని భీముడికి సైగ చేశాడు. భీముడు అలాగే చేశాడు. విగ్రహాన్ని భీముడనుకున్న ధృతరాష్ట్రుడు తన బిగికౌగిలిలో బంధించాడు. అతడి బలానికి ఆ విగ్రహం పిండి పిండిగా రాలిపోయింది. అందుకే పాత పగలు మనసులో పెట్టుకుని, ఆప్యాయంగా చేరదీసి, కదల్లేని పరిస్థితులు కల్పించి నాశనం చేయడాన్ని ధృతరాష్ట్ర కౌగిలిగా అభివర్ణిస్తారు.