ధృతరాష్ట్రుడు | Dhritarashtra spl story | Sakshi
Sakshi News home page

ధృతరాష్ట్రుడు

Published Sun, Jun 21 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM

ధృతరాష్ట్రుడు

ధృతరాష్ట్రుడు

ఐదోవేదం: మహాభారత పాత్రలు - 5
రాష్ట్రమంటే ప్రాంతమూ దేశమూ అనే అర్థాలే వాడుకలో ఉన్నాయి. అయితే, దీనికి ఉపద్రవమూ ఉత్పాతమూ ఎప్పుడొస్తుందో తెలియకుండా మీదికి విరుచుకొనిపడే విపరీతమైన కష్టమూ అనే అర్థం కూడా ఉంది. అటువంటి ఉపద్రవాన్ని ధరించి పోషించేవాడు మన ధృతరాష్ట్రుడు. అతను రాష్ట్రాన్ని తన పట్టులో ఉంచుకొని పోషించాలని చూస్తూ ఉండేవాడు. కానీ అతను పుట్టుగుడ్డి. పుట్టుగుడ్డివాడు రాజ్యాన్ని ఏవిధంగా పరిపాలించగలడు? దాన్ని తన పట్టులో ఎలాగ ఉంచుకోగలడు?

‘చక్షుర్వై సత్యం’ అని అంటారు: కంటితో చూసినదే సత్యం. కళ్లులేని కబోదికి, ఇక సత్యమనేది ఏవిధంగా అవుపిస్తుంది? అందుకనే పెద్దవాడైనా సరే, ఇతన్ని కాదని, అంబాలిక కొడుకైన పాండురాజునే రాజుగా చేశారు.

పాండురాజు విలువిద్యలో మేటిగాడు; ధృతరాష్ట్రుడేమో పదివేల ఏనుగుల బలమున్నవాడు; విదురుడు, యముడి అవతారం గనక, మహాధర్మిష్ఠుడు. పాండురాజు పెళ్లైన ఒక మాసానికే దిగ్విజయానికి వెళ్లి, రాజ్యాన్ని బాగా పెంపొందించాడు; సుస్థిరంగా కూడా చేశాడు. అయినా, ఇలాగ గుడ్డితనం ‘సాకు’తో తన పెద్దరికాన్ని పక్కుకు పెట్టారని, పైకి గంభీరంగా ఉన్నా, ధృతరాష్ట్రుడికి మొదటి నుంచీ లోపల పీకుడే. తనకు కళ్లు లేకపోతే లేకపోనీ, భార్యకైనా ఉంటే ఒక పక్షంగా బాగానే ఉండేది. కానీ, గాంధారి తనను పుట్టుగుడ్డి అయిన ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లిచేస్తారని వినగానే మగాడిలో తప్పుల్ని చూడకూడదన్న కృతనిశ్చయంతో ఆమె తన నిక్షేపమైన కళ్లకు బట్టను పట్టీగా కట్టుకొంది. మొగుడు పుడుతూనే గుడ్డివాడైతే, పెళ్లాం తెచ్చిపెట్టుకొన్న గుడ్డితనం కలదైంది.

ఈ రెండు గుడ్డితనాలూ కలిసి కన్న వందమంది పిల్లలూ మరోరకం గుడ్డివాళ్లయ్యారు. వాళ్లల్లో పెద్దవాడికి అసూయ అనే గుడ్డితనం. రెండోవాడికి మన్నూమిన్నూ కానని కావరమనే గుడ్డితనం. పెద్దాడు దుర్యోధనుడు పుడుతూనే గాడిదల ఓండ్రింపు లాంటి కర్ణకఠోరమైన ధ్వనిచేశాడు; అప్పుడు దిక్కులు కాలిపోతాయా అన్నట్టు వడగాలులు వీచాయి. ఇదంతా చూసి ధృతరాష్ట్రుడు ‘యుధిష్ఠరుడు మన కులంలో పెద్దబ్బాయి. అంచేత అతనికి రాజ్యం దక్కుతుంది. సరే. ఇదుగో ఈ దుర్యోధనుడు తరువాత పుట్టాడు. వీడు నా పెద్దకొడుకు గదా! వీడు కూడా రాజవుతాడా కాడా?’ అని భీష్ముడూ విదురుడూ మొదలైనవాళ్లను అడిగాడు.

ఆ మాట అడగ్గానే క్రూరజంతువులు గర్జించాయి; నక్కలు అమంగళంగా ఊళలు వేశాయి. అప్పుడు విదురుడు ‘చూస్తున్నావుగా అన్నయ్యా ఈ అపశకునాలు! వీడు కులాంతకుడవుతాడు. వీణ్ని విడిచిపెడితే శాంతిగా ఉంటుంది రాజ్యం. వీణ్ని రక్షిస్తే మాత్రం చాలా ఉపద్రవమే వచ్చిపడుతుంది. ఈ ఒక్కణ్నీ వదిలిపెట్టి, కులానికే గాదు, జగత్తుకి కూడా క్షేమాన్ని కలిగించు. కులం మంచికోసం ఒకణ్ని (దుర్మార్గుణ్ని) విడిచిపెట్టాలి; గ్రామం మంచికోసం కులజంజాటాన్ని వదలాలి; జనపదం హితంకోసం గ్రామమనే సంకుచితత్వాన్ని విడిచిపెట్టాలి; విస్తారమైన సుఖం కోసం భూమి అనే ఇంతపాటి పరిధిని విడిచిపెట్టాలి’ అన్నాడు. పుత్రుడి మీది మోహం కొద్దీ విదురుడు చెప్పిన మంచి మాటల్ని పెడచెవిని పెట్టాడు ధృతరాష్ట్రుడు.
 
పాండురాజు జింకల రూపంలో ఉన్న మునిదంపతుల్ని బాణం వేసి చంపడంతో శాపగ్రస్తుడై కామక్రీడకు దూరంగా ఉండవలసిన దగ్గర్నుంచీ వనంలోనే తపస్సు చేసుకొంటూ ఉండేవాడు. అప్పణ్నించీ రాజ్యాన్ని ధృతరాష్ట్రుడే పరిపాలిస్తున్నాడు. దూర్వాసుడు కుంతికిచ్చిన వరం సాయంతో కుంతికీ మాద్రికీ యుధిష్ఠరుడూ భీముడూ అర్జునుడూ నకులుడూ సహదేవుడూ పుట్టారు. ఓ రోజున మాద్రితోబాటు వనంలోకి షికారుకు వెళ్లిన పాండురాజుకు పట్టరాని కామం ఆవహించింది. వద్దన్నా వినకుండా మాద్రిని కావలించుకోబోయాడు. అంతే, అతను చనిపోయాడు. ‘నా వల్లనే పోయాడు గనక, నేనూ ఆయనతో బాటే వెళ్లిపోతాను’ అని మాద్రి అతని చితిలోనే కాలిపోయింది. కుంతినీ చిన్నపిల్లల్ని ఐదుగుర్నీ వెంటబెట్టుకొని, వనంలోని రుషులు హస్తినాపురానికి వచ్చి, జరిగింది చెప్పి, వాళ్లను విడిచిపెట్టి వెళ్లారు.
 
కుర్రాళ్లు పెద్దవాళ్లవుతున్నారు. చదువులూ సంస్కారాలూ ఆయుధ విద్యలూ అబ్బాయి. అన్నిట్లోనూ పాండవులదే పైచేయిగా ఉండేది.  ధర్మరాజు పెద్దవాడు గనక అతన్ని యువరాజుగా చేశాడు ధృతరాష్ట్రుడు. పౌరులందరూ ధృతరాష్ట్రుణ్ని, భీష్ముణ్ని కూడా కాదని, ధర్మరాజునే రాజుగా కోరుకోడాన్ని చూసి దుర్యోధనుడు విలవిల్లాడిపోయాడు. ‘ఈ రాజ్యం పాండురాజుది గనక, అతని పిల్లలకే చెందుతుంది. ఇక మేమూ మా పిల్లలూ రాజ్యానికెప్పుడూ దూరంగా ఉండవలసిందేనా? ఎప్పుడూ ఇతరులు వేసే కూడు తినవలసినవాళ్లమేనా? నీకే గనక మొదట రాజ్యం వచ్చి ఉంటే, మాకీ  దుర్దశ ఉండేది కాదు’ అని తండ్రి ఎదుట తన బాధ వెళ్లగక్కాడు.

పాండవుల్ని వారణావతమనే ఊరుకి పంపించడానికి ప్రయత్నం చేసి, ప్రజలందరూ తన అధీనంలోకి వచ్చిన తరవాత, తిరిగి వాళ్లు వచ్చేలాగ చేద్దామని ఒక ప్రణాళికను తయారుచేశాడు. అంతకుముందు కణికుడనే మంత్రి, శత్రువులు బలవంతులైతే ఉపాయంతో వాళ్లను బలహీనులుగా జేసి చంపాలనీనూ త్వరగా మట్టుబెట్టాలంటే వాళ్ల ఇంటిని తగలబెట్టాలనీనూ ధృతరాష్ట్రుడికి ఉపదేశించాడు. దీనితోనే లక్కింటి పథకానికి బీజం పడింది.

నమ్మకస్తులైన మంత్రుల చేత వారణావతం ‘ఏం అందమైన నగరమండీ!’ అని పాండవుల ముందు పొగిడించాడు ధృతరాష్ట్రుడు. వాళ్లు వెళ్లడానికి సుముఖంగా ఉన్నారన్నప్పుడు ‘మీరు వారణావతం వెళ్దామనుకొంటున్నారుగా! శుభం. వెళ్లిరండి’ అని అడక్కుండానే పచ్చజెండా ఊపేశాడు. ధర్మరాజుకు ధృతరాష్ట్రుడి మనస్సు తెలియకపోలేదు కానీ పెద్దవాడి మాటకు ఎదురు ఎలాగ చెప్పగలడు?
 
వారణావతానికి పాండవులు వెళ్తూంటే, నిర్భయులైన కొంతమంది ‘రాజు పాండవుల్నీ తన పుత్రుల్నీ సమంగా చూడటం లేదు. ధర్మాన్ని పట్టించుకోవడం లేదు. ఇంత అధర్మాన్ని భీష్ముడెలాగ ఒప్పుకొంటున్నాడో’ అని బాహాటంగానే అన్నప్పటికీ ధృతరాష్ట్రుడికి చీమకుట్టినట్టుగా కూడా లేదు. లక్క ఇంటిలో కాలిపోయారని తెలిసినప్పుడు మొసలి కన్నీళ్లు కార్చి స్నానాలు కూడా చేశాడు ధృతరాష్ట్రుడు.
 
ద్రౌపదితో వివాహమైన తరవాత, ఇక ఈ తగాదాల్లేకుండా అర్ధరాజ్యమిచ్చేస్తానని చెప్పి పాండవుల్ని ఖాండవ ప్రస్థానికి పంపాడు. భీముడూ అర్జునుడూ నకులుడూ సహదేవుడూ నాలుగు దిక్కుల్నీ జయించుకొని వచ్చి ధర్మరాజు రాజసూయయాగం చేయడానికి అనువు కల్పించారు. అక్కడికి వెళ్లిన దుర్యోధనుడికి ధర్మరాజుకున్న సిరిని చూసి కన్నుకుట్టింది. తిండి సయించడం మానేసింది; కృశించుకొనిపోయాడు. ‘ఏమిటిలా నీరసించుకొనిపోతున్నావు?’ అని అడిగాడు తండ్రి.

‘పాండవులసిరి అంతా నన్నుజేరితేనే నాకు కంటినిండా నిద్రపడుతుంది నాన్నా! శకుని మామయ్య వాళ్లతో కపట జూదమాడి ఆ సిరిని నాకు అప్పగిస్తానంటున్నాడు. నువ్వు ఊ అంటే చాలు!’ అని పెద్ద పుత్రరత్నం గునిశాడు. ‘వాళ్ల ధనమూ నీదేగదరా! బాహువుల్లాటి వాళ్లను తెగ్గొట్టుకోకు. ద్వేషాన్ని పెట్టుకోకు’ అని నెత్తీనోరూ మొత్తుకొని చెప్పినా వినలేదు. ‘సరే, విదురుడితో మాట్లాడి నిశ్చయిద్దాంలే’ అనగానే... ‘అయినట్టే! విదురుడు బాబాయి దీన్ని పడనివ్వడు. అప్పుడింక నాకు చావే శరణ్యం’ అన్నాడు.
 
ఎంత పుత్రమోహం ఉన్నా, విదురుణ్ని అడక్కుండా ఒక్కపనీ చేయలేడు ధృతరాష్ట్రుడు. ‘జూదం వల్ల కొడుకుల మధ్య భేదం రాకుండా చూడు అన్నయ్యా!’ అన్న విదురుడికి ‘అహ, ఇది వట్టి సుహృద్ద్యూతం మాత్రమే. అయినా నేనూ ద్రోణుడూ భీష్ముడూ నువ్వూ ఉండగా అన్యాయం ఎందుకు జరుగుతుంది?’ అని సన్నాయి నొక్కులు నొక్కుతూ పాండవుల్ని పిలిపించాడు.
 జూదం జరుగుతుంటే మాటిమాటికీ ‘ఇప్పుడేం గెలిచారు, ఇప్పుడేం గెలిచారు?’ అని అడుగుతూనే ఉన్నాడు. తన గుడ్డిముఖంలో తాండవిస్తూన్న ఆనందాన్నిదాచుకోలేకపోయాడు. కోడలికి అవమానం జరిగిపోయిన తరవాతనే, పెద్దలందరూ ఏమీ అనకుండా ఉండటం కోసం, ఆమెకు వరాలనిచ్చి పాండవుల దాస్యాన్ని తీర్చాడు.

‘ఇంతా సాధించిన తరవాత ముసిలోడు అంతా పాడుచేసేశాడు’ అని దుశ్శాసనుడు మెటికలు విరిచాడు. మళ్లీ జూదానికి పిలిపించమని దుర్యోధనుడు మంకుపట్టు పట్టాడు. అప్పుడు తల్లి గాంధారి కూడా ‘నీ అదుపులో వాడు ఉండనంటే, కులానికి చిచ్చులాంటివాణ్ని వదిలిపెట్టెయ్’ అని చెప్పింది. ‘కులం అంతమైపోతే పోనీ నేను మాత్రం దుర్యోధనుణ్ని ఆపలేను’ అని ధృతరాష్ట్రుడు చేతులెత్తేశాడు. ‘పద్నాలుగో ఏడాది తిరిగివచ్చినప్పుడు, వాళ్ల రాజ్యం వాళ్లకు ఇవ్వకపోతే భీమార్జునులు నిశ్శేషంగా అందర్నీ చంపేస్తారు.

అందుకని అహితం చేస్తూన్న నీ కొడుకును విడిచిపెట్టు’ అని విదురుడు అనేసరికి కోపాన్ని పట్టలేక ‘నిజమే, పాండవులూ నా పుత్రులే. కానీ, దుర్యోధనుడేమో నా శరీరం నుంచి పుట్టాడు. నా దేహాన్ని నేనెలాగ వదిలిపెట్టాలి? నీకెప్పుడూ పాండవులంటేనే ఇష్టం. నీ ఇష్టమొచ్చిన చోటికి వెళ్లవచ్చు’ అని ధృతరాష్ట్రుడు నోరుజారాడు. విదురుడు వెళ్లిన మీదట, తాను చేసిన తప్పు స్పృహకు వచ్చి, వెంటనే సారథి సంజయుణ్ని పంపి, అతన్ని తిరిగి వచ్చేలా చేసుకొన్నాడు.
 
యుద్ధం వచ్చి పడబోతోందన్న దగ్గర్నుంచీ నిద్ర కరువైపోయింది. విదురుడూ సనత్సుజాతుడూ ఎంతమంది చెప్పినా ఊరట కలగలేదు. సంజయుడు యుద్ధ విషయాలను చెబుతూంటే కుమిలి కుమిలిపోయాడు. శ్రీకృష్ణుడు చెప్పిన గీతను విన్నా కోపం ఏమాత్రమూ తగ్గలేదు. వందమంది పిల్లల్నీ చంపినవాడు భీముడు గనక అతన్ని తన కౌగిలిలో చంపేద్దామని అనుకొన్నాడు. శ్రీకృష్ణుడు ఇనుప విగ్రహాన్ని ధృతరాష్ట్ర కౌగిలిలోకి పంపాడు. మొదటినుంచి చివరిదాకా ధృతరాష్ట్రుడిది ఒకటే తీరు: పుత్రమోహంతో అజాగ్రత్తగా వ్యవహరించడం. ‘అజాగ్రత్తే మృత్యువు’ అని ఎంతమంది చెప్పినా తెలుసుకోలేక పోయాడు. మనిషి మనస్సు కూడా ఇలాగే అజాగ్రత్తగా ప్రవర్తిస్తూ శరీర రాష్ట్రానికి ‘రాష్ట్రాన్ని’ అంటే ఉపద్రవాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది.
 - డాక్టర్ ముంజులూరి నరసింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement