శ్రీకృష్ణుడు | Story About of Sri krishna | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణుడు

Published Sun, Sep 6 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

శ్రీకృష్ణుడు

శ్రీకృష్ణుడు

ఐదోవేదం : మహాభారత పాత్రలు - 15
(గతవారం తరువాయి)
శ్రీకృష్ణుడికి రెండువైపులవాళ్లూ ఒకటే. పాండవులకేమో అమ్మకు సాక్షాత్తూ మేనల్లుడు; దుర్యోధనాదులకేమో చిన్నమ్మకు మేనల్లుడు. అంతే తేడా. ‘సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యో స్తి  న ప్రియః! యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషుచాప్యహమ్!!’’ (భగవద్గీత 9-29): అతనికి అందరూ సమానులే. ఒకడు పగవాడూ మరొకడు ప్రేమించ దగినవాడూ అంటూ లేరతనికి. భక్తితో సేవించేవాళ్ల దృష్టిలో తాను ఉంటాడు, అలాగే తన దృష్టిలోనూ వాళ్లుంటారు.

కల్పవృక్షానికి పక్ష పాతం ఉండదు. దాని దగ్గర చేరిన వాళ్లకూ దూరంగా ఉన్నవాళ్లకూ మధ్య తేడా ఉండటంలో ఆశ్చర్యమేముంటుంది? కావలసినవాళ్లూ కొట్టుకోవలసివచ్చిందే అన్న బెంగ అతనికీ ఉంది. అందుకనే పాండవుల వైపున్నాడు గనక అక్కణ్నించి రాయబారానికి వెళ్లాడు. అప్పుడు దుర్యోధనుడు ‘మా ఇంట్లో వచ్చి ఉండు బావా’ అని పిలిచాడు. కానీ అతను దానికి ఇష్టపడలేదు. భక్తుడైన విదురుడింట్లో ఉన్నాడు.

మర్నాడు సభలో వాళ్లు చేద్దామనుకొన్న ఘనకార్యం మనందరికీ తెలుసును: కృష్ణుణ్ని కట్టిపడేస్తే పనై పోతుందన్న దుర్భ్రమలో పడ్డాడు దుర్యోధనుడు. విశ్వమంతా అతని చైతన్యం నిండి ఉందని తెలియక, ఆ పని చెయ్యబోతే దుర్యోధనుడి కళ్లే చెదిరి పోయాయి. అయినా బుద్ధిరాలేదు. రాయబారమెప్పుడూ వైమనస్యాల్ని నివారించడానికే జరుగుతుంది. కానీ దూతనే బంధిద్దామని ప్రయత్నించడం క్షమించరాని నేరం. రావణుడు ఇలాగే దూత అయిన హనుమంతుణ్ని బంధించి భంగపడ్డాడు.

జరగబోయే యుద్ధంలో భీమార్జునులు ఏ స్థాయిలో చెలరేగుతారో చెబితే ఏమన్నా మెత్తబడి లొంగుతాడేమో అనుకొన్నాడు కృష్ణుడు. కానీ దుర్యో ధనుడు మూర్ఖుడు. మూర్ఖుల మనస్సును రంజింపజేయడం అసంభవమే. కర్ణుడు దుర్యోధనుడితో జట్టుగట్టి చెడిపోయాడని, అతగాడి పుట్టు పూర్వోత్తరాలు చెప్పి, మంచిదారి పట్టిద్దా మనుకొని కర్ణుణ్ని తన రథమెక్కించుకొని కొంత చెప్పిచూశాడు. దుష్టచతుష్టయంలో ముఖ్యుడైన ఆ ‘అంగ’దేశం రాజు, శరీరంతో ఒకటై, రాజరికపు లోభంలో పడ్డవాడు ఏవిధంగా వింటాడు?
 
ద్రోణుడు అతిగా విజృంభించి బాధపెడుతూ ఉంటే, యుధిష్ఠిరుడికి ‘అశ్వత్థామ పోయాడ’ని చెప్పమనడం అందరికీ సమానుడైన కృష్ణుడికెలాగ నప్పుతుందని అనుమానం వేస్తుంది. కానీ ధర్మం తెలిసుండీ కూడా తిండి పెట్టారన్న మోహం కొద్దీ అధర్మానికి కొమ్ముకాసేవాళ్లను ఉపాయాలతోనే నాశనం చేయాలి. ఈ ఉపాయం అటు అబద్ధంతో బయలుదేరి నిజంలో అంత మవుతుంది: ‘అశ్వతా మో హతః హతః కుంజరః’లో అబద్ధమైన ‘అశ్వత్థామ చచ్చి పోయాడు’ అన్నమాటను గట్టిగానూ నిజమైన ‘అశ్వత్థామ అనే ఏనుగు చచ్చి పోయింది’ అన్నమాటను నెమ్మదిగానూ అన్నాడు ధర్మరాజు.

ద్రోణుడంటే మన పూర్వ సంస్కారాలు; అశ్వత్థామ ఇంకా బయటకురాని స్థితిలో ఆశయ రూపంలో, లోపల ఉండే కోరిక. ఈ లోపలి కోరికలే లేకపోతే సంస్కారాలు కృశించి పోతాయి. నిజానికి ఆశయాలు లేకపోవడం చాలా అరుదు. అదే జరిగితే, వాసనలు సన్నబడిపోయి ముక్తి అరచేతిలో ఉంటుంది. ఇదే పైన చెప్పిన అబద్ధ నిజాల కలగలుపు. కృష్ణుడు దిగివచ్చిందే అధర్మాన్ని అంతమొందించడానికి. అధర్మమంటే అయోగం. అయోగమంటే, ధర్మరూపుడైన భగవంతుడికి విముఖమై అతన్నుంచి విడిపోవడం. యోగాన్ని పునరుద్ధరించాలంటే, యోగాలు అవసరం. యోగాలంటే ఉపాయాలు.

అందుకనే కృష్ణుణ్ని యోగేశ్వరేశ్వరుడని అంటారు: అందరికీ యోగాన్ని సాధించ డానికి యోగాలను తయారుచేసేవాడు ఇతను. ‘అసంయ తాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః! వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః!!’ (భగవద్గీత 6-36). అదుపులో ఉన్న మనస్సుతో ప్రయత్నం చేస్తే ఉపాయంతో యోగాన్ని, అంటే, ధర్మాన్ని సాధించ వచ్చు. అధర్మపరులైన జరాసంధుణ్నీ శిశుపాలుణ్నీ మహాయుద్ధానికి ముందే యమలోకానికి పంపడానికి కారణం, వాళ్లే గనక బతికి ఉంటే, కౌరవుల వైపుజేరి ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమనే.

జరాసంధుడు ఇరవై వేల మంది రాజుల్ని తాను చేయబోయే భైరవయజ్ఞంలో బలి చెయ్యాలని జైల్లోపెట్టి ఉంచాడు. తమను ఆ చెర నుంచి విడిపించమని వాళ్లు మొర పెట్టుకొన్నారు; అదే సమయంలో ధర్మ రాజు రాజసూయ యాగానికి రావాలని కబురుపంపాడు. ఆ యాగం చేయాలంటే, రాజులనందర్నీ జయించాలి. ఆ రాజు లందరిలోనూ ఈ జరాసంధుడు అతి బలిష్ఠుడు. అతన్ని జయిస్తే రాజసూయం అయిపోయినట్టే.

అందుకని ఈ యోగేశ్వ రుడు అర్జునుణ్నీ భీముణ్నీ తీసుకొని మారువేషాల్లో మగధకు వెళ్లాడు. అక్కడ భీముడితో జరాసంధుణ్ని నాశనం చేయిం చాడు. ఏకలవ్యుడి కుడి బొటనవేలు కనక ఉంటే, అతగాడూ అజేయుడే అవుతాడని ముందుగానే అర్జునుణ్నీ ద్రోణుణ్నీ నిమిత్తంగా చేసుకొని వాడి బొటనవేలును లేకుండా చూశాడు. కర్ణుడు తన కవచ కుండలాలకు బదులుగా ఇంద్రుణ్నించి పొందిన శక్తి నుంచి భక్తుడైన అర్జునుణ్ని రక్షించడం కూడా అయోగాన్ని శిక్షించ డానికే. ఘటోత్కచుడు పాండవ పక్షంవాడే అయినా బ్రాహ్మణద్వేషీ యజ్ఞద్వేషీను.

అర్జునుణ్ని రక్షించడానికి ఘటోత్కచుణ్ని శిక్షించడానికీ కర్ణుడి శక్తిని ఘటోత్కచుడి మీద ప్రయోగింపజేశాడు కృష్ణుడు. ప్రతిరోజూ రాత్రి దుర్యోధనుడూ శకునీ దుశ్శాసనుడూ సంజయుడూ కూడా కర్ణుడికి ‘రేపు నువ్వు అర్జునుడిమీద శక్తివేసి యుద్ధాన్ని అంతంచెయ్యి’ అని చెబుతూనే వచ్చారు. అయినా సరే, పొద్దున్న రణ క్షేత్రంలోకి రాగానే అతన్ని మోహం కమ్మేది. ఎన్నెన్ని వరాలను కవచాలుగా ధరించినా హిరణ్యకశిపుడు కూడా చచ్చి పోయాడు; దేవతలందర్నీ గడగడలాడిం చిన రావణుడు మనుషుల చేతుల్లోనూ కోతుల చేతుల్లోనూ చావవలసివచ్చింది.

ఈవిధంగా కర్ణుడు శక్తిని మరిచిపోవడం ఘటోత్కచుడు వచ్చేంతదాకా జరిగింది. అశ్వసేనుడు తక్షకుడి కొడుకు. ఆ రోజున ఖాండవ దహనంలో అశ్వసేనుణ్ని వాళ్లమ్మ నోట్లో పెట్టుకొని ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటే, అర్జునుడు ఆ తల్లి పాము తలను తెగేశాడు. అశ్వసేనుడు  ఏదో విధంగా తప్పించుకొన్నాడు. అతను కర్ణుణ్ని చేరి, ‘నన్ను ప్రయోగించ’మని ప్రేరేపించాడు. సరిగ్గా ప్రయోగం చేసిన సమయంలో కృష్ణుడు అర్జున రథాన్ని రెండంగుళాలు కిందికి దిగేలాగ ఒక తొక్కు తొక్కాడు. సైంధవుణ్ని చంపడానికీ సూర్యుణ్ని మాటు చేయడమనే యోగాన్ని ఉపయోగించాడు కృష్ణుడు.

మళ్లీ దీని తోనూ భక్తుడైన అర్జునుణ్ని కాపాడాడు. చివరికి తనవాళ్లే అయిన యాదవుల్ని కూడా మట్టుబెట్టడానికి శాపమనే యోగాన్ని ఉపయోగించాడు. మహాభారత యుద్ధంతో అధర్మమూ అయోగమూ నాశనమైపోయాయనుకోడానికి వీలులేదు. ఎందుకంటే, మహాశూరులైన యాదవులు రేప్పొద్దున మేకులై కూర్చొంటారు. తన కొడుకు సాంబుణ్నే ఈ శాపానికి పావుగా వాడాడు.

కడుపుతో ఉన్న ఒక స్త్రీగా వేషం వేసి ఆటగా పిల్లలు, రుషుల దగ్గరికి పోయి, ‘ఇది మగపిల్లవాణ్ని కంటుందా ఆడపిల్లనా?’ అంటూ అడిగారు. ‘మీ వంశాన్ని అంతం చేసే ముసలం పుడుతుంది’ అని మునుల నోట ఆ శాపం వెలువడింది. ఆ శాపంలో తాను కూడా చనిపోవడాన్ని ఇమిడ్చేశాడు కృష్ణుడు. ఇదీ అతని సమానత్వం తాలూకు పరాకాష్ఠ.
 శ్రీకృష్ణుడికి వేలకు వేలమంది పెళ్లాలూ వాళ్లలో ఒక్కొక్కళ్లకూ పది పదేసి మంది పిల్లలూ అని వింటూ ఉంటాం.

మహాచైతన్యానికి ఈ కుటుంబాలతోనూ పనిలేదు, మందీ మార్బలంతోగానీ గదలూ చక్రాలూ విల్లులూ బాణాలూ అనే ఆయుధాలతో గానీ పనిలేదు. లోకంలో పుట్టినప్పుడు ఇతరుల్లాగే కనిపించడానికే పెళ్లాలూ సంభోగాలూ పిల్లలూ అనే ఈ తతంగాలన్నీను. ఒక్క ఆకును నోట్లో వేసుకొని ముల్లోకాల్లో ఉన్నవాళ్లందరికీ తృప్తినిచ్చినవాడు, ఏదైనా అలవోకగానే చేస్తాడు, లీలగానే చేస్తాడు మరి. మనం అన్నీ మన మర్త్య దృష్టితో చూడ్డం వల్లనే, అందరూ మనలాగే ఉండాలని అనుకోడం వల్లనే, కొందరు మనకన్నా వేరుగా ఉండ వచ్చుననే ఊహ లేకపోవడం వల్లనే ఇన్ని అనుమానాలు మన కడుపునిండా ఉండి ఉబ్బరిస్తూ ఉంటాయి.

మనుషుల్లోనే చాలామంది మనకన్నా గొప్పగానూ విశిష్టంగానూ అవుపిస్తూ ఉంటారు. అటు వంటప్పుడు శ్రీకృష్ణుడిలాంటి మహాను భావులు అత్యంత విశిష్టంగా ఉండటంలో అద్భుతమేముంటుంది? అతన్ని అస్కలిత బ్రహ్మచారి అని అంటారు కూడాను. అతన్ని ఏ పనులూ అంటవు. ‘న మాం కర్మాణి లిమ్సన్తి న మే కర్మఫలే స్పృహా’ (భగవద్గీత 4-14): అతనికి కర్మల ఫలాలమీద కోరిక ఉండదు.

అటువంటి పనులను చేసేది మనలాంటి వాళ్లకు పాఠం చెప్పడానికే. ఎలాగ పనిని చేస్తే అది మనను తన ఫలంతో నిర్బంధ పెట్టకుండా ఉంటుందో ఆ వైనాన్ని చెప్ప డానికే అటువంటివాళ్లు పుడతారు, పనుల్ని చేస్తారు. మనలాగే పనుల్ని చేస్తున్నా వాటిని మనకన్నా చాలా వేరుగా చేస్తారు వాళ్లు. ఈ తేడా తెలియకనే కృష్ణుడి గురించి నోటికొచ్చినట్టల్లా చెప్పుకొంటూ ఉంటాం. అందుకనే అర్జునుడు తాను చేసిన పొరపాట్లను వల్లిస్తూ బాధపడ్డాడు: ‘సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి! అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి!!
 
యచ్చాపహాసార్థమసత్కృతో సి విహారశయ్యాసనభోజనేషు! ఏకోథ వాప్య చ్యుత తత్సమక్షం తత్ క్షామయే త్వామ హమప్రమేయమ్!!’ (భగవద్గీత 11-41, 42): అర్జునుడు బావగా అతన్ని హేళన చేసేవాడు. యాదవుడా అని సంబోధించే వాడు. ఒంటరిగా ఉన్నప్పుడే కాదు, నలు గురిలోనూ కూడా ఇదే తరహాలో అగౌరవ పరిచేవాడు. శ్రీకృష్ణుడి కూటస్థ చైతన్య ప్రభావాన్ని కనుక్కొన్న తరవాత చాలా బాధపడ్డాడు.

మనమూ అంతే. అతని మహా చైతన్యాన్ని తెలుసుకోలేని దుఃస్థితిలో ఉన్నంతసేపూ అర్జునుడిలాగే అతన్ని హీన పరుస్తూనే మాట్లాడుతూ ఉంటాం. ఈ విషయంలో శిశుపాలుడి కన్నా మనమేమీ తీసిపోం. తత్త్వాన్ని తెలుసుకోడానికి అందుకనే ప్రయత్నం చేయాలి.         - -
- డా॥ముంజులూరి నరసింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement