సత్యవతీ శాంతనులు | Doctor Munjuluri Narasimha Rao special story | Sakshi
Sakshi News home page

సత్యవతీ శాంతనులు

Published Sun, Jun 7 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

సత్యవతీ శాంతనులు

సత్యవతీ శాంతనులు

ఐదోవేదం: మహాభారత పాత్రలు - 3
గంగాదేవి విడిచిపెట్టి వెళ్లిపోయిన తరువాత శాంతనుడు ముప్పై ఆరేళ్ల పాటు పెళ్లి గురించే ఆలోచించకుండా అడవుల్లో ఉన్నట్టుగా ఉంటూ రాజ్యాన్ని పాలించేవాడు. గంగాదేవి తానుకన్న ఎనిమిదో వసువును ముందు శాంతనుడి వద్దే ఉంచి వెళ్లినప్పటికీ, ఇంటిపట్టున ఉండి పిల్లవాణ్ని పట్టించుకోవడం లేదని ఆ తర్వాత వచ్చి తిరిగి తనతో తీసుకొని వెళ్లిపోయింది.

తండ్రిపోలికలు బాగా ఉన్న ఆ గంగాదత్తుడి పేరు దేవవ్రతుడు. వ్రతమంటే దీక్షగా పనిచేయడం. దేవవ్రతుడంటే ఏ పనినైనా దేవుడి పనిగానే దీక్షగా చేసేవాడని అర్థం.

ఒకరోజున శాంతనుడు ఒక క్రూరమైన పశువును వేటాడుతూ గంగ ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డున నడుస్తూండగా అతనికి ఆ నదిలో నీళ్లు తగ్గినట్టుగా అనిపించాయి. ఈ దేవనది మునుపటిలాగా కాకుండా ఇలా బక్కచిక్కినట్టు ఉండటానికి కారణమేమిటబ్బా అని చోద్యంగా చూశాడు. అక్కడ ఒక అందమైన కుర్రాడు దివ్యాస్త్రాలను వేస్తూ గంగనీటికి అడ్డుకట్ట వేస్తున్నాడు. ఆ పిల్లవాడు తన పోలికలతోనే ఉన్నా, తన కొడుకేనని అతను గుర్తుపట్టలేకపోయాడు.

ఆ కుర్రాడూ తండ్రిని చూసి, ఎవడో కొత్తవాడని అనుకొంటూ, అతన్ని మాయలో పడేసి, తానూ మాయమైపోయాడు. కనిపిస్తూనే అంతర్థానమైన పిల్లవాడిలో తన పోలికలే ఉన్నాయని తలచుకొంటూ ఉన్న శాంతనుడికి ‘అతను మూడొంతులు నా కొడుకే అయ్యుంటా’డనే అనుమానం వేసింది. తక్షణమే గంగను తలుచుకొన్నాడు. గంగాదేవి ఆ పిల్లవాణ్ని చేతబట్టుకొని ఎదురుగుండా వచ్చింది.
 
‘నేను నీవల్ల కన్న ఎనిమిదో కొడుకే ఈ సర్వాస్త్రవేత్త. ఇక వీణ్ని నువ్వు తీసుకో. వశిష్ఠుణ్నించి వేదాలూ పరశురాముణ్నించి ధనుర్విద్యా క్షుణ్ణంగా నేర్చుకొన్నాడు ఈ మన అబ్బాయి’ అంటూ ఆ అబ్బాయిని తండ్రికి అప్పగించి గంగాదేవి తిరిగి వెళ్లిపోయింది.
 
ఆ వీరపుత్రుణ్ని చూసుకొంటూ ఇట్టే నాలుగేళ్లు గిర్రున గడచిపోయాయి. ఒకరోజున యమునానది పక్కనున్న వనంలోకి వెళ్లాడు శాంతనుడు. అక్కడ అతనికి ‘ఇదీ’ అని చెప్పడానికి వీలులేని ఒక సువాసన గాలితెర మీదుగా వచ్చింది. ఆ సుగంధం ఎక్కణ్నించి వస్తోందా అని దాని దిక్కుగా ముందుకు నడిచాడు అతను. ఎదురుగా అక్కడ దేవకన్యలాగా ఉన్న ఒక బెస్తపిల్లని చూశాడు. ‘ఎవరిదానివి? ఎవత్తెవి? ఏం చేద్దామని ఇక్కడున్నావు?’ అంటూ వరసగా ప్రశ్నల వర్షం కురిపించాడు.

‘నేను బెస్తలదొర దాశరాజు కూతుర్ని. నాన్నగారి ఆజ్ఞ మేరకు యమునానది మీద పడవను నడుపుతూ ఉంటాను’ అని ఆమె జవాబు చెప్పింది. శాంతనుడు ఆమె రూపానికీ సుగంధమోడుతూన్న ఆమె శరీరానికీ ముగ్ధుడై ఆమెను పెళ్లిచేసుకొందామని అనుకొన్నాడు. అనుకోవడమే తడవు, ఆమె తండ్రి దగ్గరికిపోయి ఆ మాటనే చెప్పాడు. ‘ఆడపిల్ల పుట్టగానే ఎవరికో ఒకరికి ఇవ్వవలసినదే అవుతుంది. అందులోనూ మీరేమో సాక్షాత్తూ రాజుగారు. ఇక నాకు కావలసినదేముంటుంది? అయితే, నాకో కోరిక ఉంది. ఆ వరం ఇస్తే, నేను మీకు మా అమ్మాయినిస్తాను’ అన్న దాశరాజు మాటను విని, ‘అది ఇవ్వగలిగినదైతే తప్పకుండా ఇస్తాను; ఇవ్వరానిదైతే మాత్రం ఏమైనా ఇవ్వను’ అని రాజు దృఢంగానే అన్నాడు.
 
‘నా కూతురికి పుట్టినవాడే మీ రాజ్యానికి యువరాజు కావాలి; మరెవ్వడూ కాకూడదు’ అన్నమాటను విని శాంతనుడు మనసు చిన్నబుచ్చుకొని, ముఖం ముడుచుకొని మారుమాట మాటాడకుండా హస్తినాపురానికి వెళ్లిపోయాడు. ఆ అమ్మాయినే తలచుకొంటూ లోలోపల కుములుతూ ఉండటం చూసి, నాన్న దగ్గరికి చేరాడు దేవవ్రతుడు. అసలు కారణమేమిటా అని గుచ్చి గుచ్చి అడిగాడు. ‘అవునురా అబ్బాయీ నాకు కొంత చింతగానే ఉంది.

నువ్వొక్కడివే ఈ వంశానికి మొలకవు. ఆ నువ్వేమో ఎప్పుడూ అస్త్ర శస్త్రాలతో క్రీడిస్తూ యుద్ధాలు చేస్తూ ఉంటావు. నీకేమైనా విపత్తు వస్తే, ఈ కులం ఏంగాను? అవును, నువ్వు ఒక్కడివే వందమంది పుత్రులపెట్టు అన్నమాట నిజమే. అయితే, నేను వృథాగా పెళ్లిచేసుకొందామని అనుకోవటం లేదు. మన వంశం ఎక్కడ లోపిస్తుందోనని మాత్రమే రెండోపెళ్లి చేసుకొందామని అనుకొంటున్నాను. ఒక్క పుత్రుడే ఉండటం అపుత్రత్వంతో సమానమే’ అని ముక్తాయించాడు శాంతనుడు. కానీ అసలు మాట మాత్రం బయటపెట్టలేదు.
 
ఆలోచనాపరుడైన దేవవ్రతుడు తండ్రిగారికి బాగా కావలసిన మంత్రి దగ్గరికి వెళ్లి అసలు విషయాన్ని వాకబు చేశాడు. అతను యోజనగంధి అయిన సత్యవతిని గురించీ ఆమె తండ్రి పెట్టిన షరతు గురించీ చెప్పాడు. ఆమీద కొంతమంది కులపెద్దల్నీ సామంతుల్నీ తీసుకొని దాశరాజు దగ్గరికి వెళ్లాడు దేవవ్రతుడు.

వెళ్లి, ‘ఈవిడకు పుట్టినవాడే రాజవుతాడు’ అని రాజులందరి ముందూ దాశరాజుకు మాటిచ్చాడు. ‘నువ్వన్నది బాగుంది కానీ నీ కొడుకులు దీనికి అడ్డం రావచ్చు గదా’ అని మరో మెలిక పెట్టాడు దాశరాజు. దానికి బదులుగా ‘నేను ఈ రోజు నుంచీ బ్రహ్మచారిగానే ఉంటాను’ అని భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు. అప్పణ్నించే దేవవ్రతుడు భీష్ముడయ్యాడు.
 
సత్యవతిని రథం ఎక్కించుకొని తీసుకొనిపోయి శాంతనుడికి అప్పగించాడు. కొడుకుతో సహా వచ్చిన సత్యవతిని చూడగానే శాంతనుడికి నోటమాట రాలేదు. సంతోషమూ వేసింది, బాధా కలిగింది. ‘నీ ఇష్టం ఉంటేనే గాని నిన్ను మరణం తాకలేదు’ అని కొడుక్కి వరం ఇచ్చాడు.
 సత్యవతీ శాంతనుల దాంపత్యం ఫలించి మొదట చిత్రాంగదుడనే కొడుకు పుట్టాడు. ఆమీద విచిత్రవీర్యుడనే మరో కొడుకు కూడా పుట్టాడు. రెండోవాడు ఇంకా పసివాడుగా ఉన్నప్పుడే శాంతన మహారాజు చనిపోయాడు.

సత్యవతికీ ఆమె తండ్రికీ ఇచ్చిన మాట ప్రకారమే చిత్రాంగదుణ్ణి రాజుగా చేశాడు భీష్ముడు. ఆ చిత్రాంగదుడు మనుషుల్లో తనకు సరిజోడైనవాడు లేడని విర్రవీగేవాడు. ఒక్క మనుషుల్నే కాదు, దేవతల్నీ అసురుల్నీ కూడా ఎదిరించడం మొదలెట్టాడు. దాన్ని సహించలేకపోయాడు అదే పేరున్న ఒక గంధర్వుడు. గంధర్వులు మాయల్లో మేటివాళ్లు కదా! చిత్రాంగద మహారాజును చిత్రాంగదుడనే గంధర్వుడు చంపేశాడు. అయితే ఆ యుద్ధం మాత్రం నిండా మూడేళ్లు కొనసాగింది. మళ్లీ సత్యవతితో మాట్లాడి చిన్నవాడైన విచిత్రవీర్యుణ్ని రాజుగా చేసి, తానే అతనిపేర అన్ని కార్యాలూ నిర్వహించేవాడు భీష్ముడు.
 
దేవవ్రతుడు అచ్చూ మచ్చూ శాంతనుణ్ణే పోలి ఉండేవాడు. అంటే, శాంతను చైతన్యం దేవవ్రతుడిలో ప్రతిబింబమైందన్నమాట. ఈ ప్రతిబింబితమైన చైతన్యం అద్దంలోని బొమ్మలాగా ‘అనిపించే’ చైతన్యం మాత్రమే. అనిపించడాన్ని ‘ఆభాస’ అని అంటారు. తన ఆభాసవిద్యాబాణాలతో అడ్డుకట్ట కట్టి, మహాగంగాప్రవాహమనే జ్ఞానమయమైన తల్లి ప్రకృతిని అతను సన్నగిల్లి పోయేలాగ చేశాడు.

దీనివల్ల రెండు రకాల పరిస్థితులు తారసిల్లవచ్చు: ఒకటి, సాపేక్షకతను పుట్టించే ప్రకృతే లేకుండాపోయే పరిస్థితి. రెండోది, ఆభాస చైతన్యానికి ఏ రకంగానూ ప్రభావితం కాని మరో ప్రకృతి ఎదురుగావడం. మొదటి పరిస్థితేమో సృష్టినే ఆపుజేస్తుంది. సృష్టితో తాను ‘చాలా’గా అవుదామనుకొన్న భగవంతుడి కోరిక దీనితో తీరకుండానే ఉండిపోతుంది. అతని కోరిక తీరాలీ అంటే, రెండోది జరగాలి. రెండోదే సృష్టిని ముందుకు నడిపించగలదు.
 
సరిగ్గా అదే సమయంలో నల్లగా ఉండే యమునానది దగ్గర సత్యవత్తుగా తోచే పదార్థమైన మలిన ప్రకృతి ఎదురుపడి, శాంతను చైతన్యాన్ని మోహంలోకి దించింది. ఆభాసచైతన్యం తాలూకు ప్రభావం లేకుండా ఉండటమే, దేవవ్రతుడు భీష్ముడిగా మారి, రాజ్యాధికారాన్ని విడిచిపెట్టి, పెళ్లి చేసుకోనని ఒట్టుపెట్టుకోవడం.
 
సృష్టి అనే చలనచిత్ర రంగానికి సిద్ధంచేసే చిత్రాంగదత్వమే సృష్టికి అంకురం లాంటి ‘మహత్తత్త్వం’. చిత్రం అంటే చూపును ఆకట్టుకొనేది. చూపును ఆకట్టుకొనే చిత్రరంగాన్ని ప్రదానం చేసేదే మహత్తరమైన చిత్రాంగదత్వం. మొదట్లో ప్రకృతికున్న మూడు గుణాలూ, అంటే, జ్ఞానసుఖంతో కలిపే సత్త్వమూ, కర్మలతో సంగాన్ని కల్పించే రజస్సూ, అలసభావాన్నీ నిద్ర ముంపునీ కలగజేసే తమస్సూ అనే మూడూ సరిసమానంగా ఉండటంతో ఏ తేడానూ అవుపించేది కాదు.

తేడా ఉంటేనే ఇంతకుముందు పరిస్థితితో ఇప్పటి పరిస్థితిని పోల్చే సాపేక్షత ఏర్పడుతుంది. అదే సృష్టికి నాంది కాగలదు. ఈ గుణాలు కలగలిసి ఎక్కువ తక్కువలు గావడమే సాపేక్షకతకు అంకురం. గుణాల మిశ్రమాన్నే ‘కాలశక్తి’ అంటారు. కాలమంటే గుణాల్లో మార్పును తీసుకొనివచ్చే భావం. చిత్రాంగదుడు చిత్రాంగదుడి చేతిలో మూడేళ్లపాటు పోరాడి చనిపోయాడంటే, ప్రకృతి మూడుగుణాల సమానత్వమూ నశించి క్షోభ కలగడమే. గుణాల కలగలుపునే మహాతత్త్వమనీ చిత్తమనీ అంటారు.

ఆ చిత్తం మీద మహాచైతన్య ప్రకాశం పడి ‘నేను వేరుగా ఉన్నాన’ నే విచిత్రమైన వీర్యం ప్రకటితమవుతుంది. ఇదే దివ్యమైన అహంకారం.
 అహంకార రూపమే అయిన ఆభాస చైతన్యం ఈ దివ్యమైన అహంకారం కోసం అన్ని పనుల్నీ చేస్తూ ఉంటుంది. భీష్ముడు విచిత్రవీర్యుణ్ని సింహాసనమెక్కించి తానే రాజ్యభారాన్నీ పాలనాభారాన్నీ మోయడమంటే ఇదే.            
- డాక్టర్ ముంజులూరి నరసింహారావు
 9000765972

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement