అర్జునుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 13
అర్జునుడు కుంతి సంతానంలో మూడో వాడు. ‘అరజ్జు’ అంటే జైలని ఒక అర్థం. రజ్జువంటే తాడు. అంచేత ‘అ-రజ్జు’ అని విడదీస్తే, బంధనం లేనివాడన్న అర్థం వస్తుంది. ఎవడైనా ఈ శరీరమనే జైల్లో ఉన్నవాడే. ఆ బంధనాన్ని వదిలించు కోవాలంటే అదుపు కావాలి. శరీరమనే జైల్లో ఉంటూ కూడా నిగ్రహంతో బంధనానికి లోబడకుండా ఉండగలిగే సాధకుడు అర్జునుడు. వేయించిన (ఋజి-భర్జనే) విత్తనాలు మొలకెత్తవు. ‘ఋజ’ అనే ధాతువులో ముందు ముందుకు నడవడమూ మంచి స్థానాన్నే సంపాయించడమూ దాగి ఉన్నాయి.
వీటిలోని ‘ఋ’కారం ‘ఆర్’గా మారి అర్జునుడనే మాట పుట్టింది. అదుపుతోనూ తపస్సుతోనూ మునపటి కర్మలనే విత్తుల్ని వేయించి, శాశ్వతమైన ఆత్మపదాన్ని ఆర్జించాలన్న పట్టుదలతో ఎడతెరిపి లేకుండా ప్రయత్నించే సాధకుడే అర్జునుడు. అర్జునుడికి ‘సవ్యసాచి’ అని పేరొకటి ఉంది. సవ్యమంటే కుడీ ఎడమా అని రెండర్థాలూ ఉన్నాయి; ‘సాచి’ అంటే అడ్డంగా అని అర్థం. రెండు చేతులతోనూ గాండీవాన్ని అడ్డంగా లాగి బాణాల్ని వేయగలిగిన సామర్థ్యమున్నవాడు గనకనే అతనికి సవ్యసాచి అనే పేరు వచ్చింది. ఇతనికి ‘ధనంజ యుడ’నే మరో పేరుంది.
‘ధనం’ అంటే డబ్బని అర్థం. యుద్ధంలో ఓడిపోయినవాళ్ల ధనం జయించినవాళ్ల సొంతం అవుతుంది గనక, ‘ధనం’ అనే మాటకు యుద్ధమనే అర్థం వచ్చింది. యుద్ధంలో ఎప్పుడూ జయాన్నే వరించే విజయుడిగాను, జయించినవాళ్ల సొమ్మును తన బొక్కసంలోకి చేర్చుకొన్నవాడిగాను అర్జునుడు ధనంజయుడు. ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేయడానికి ముందు ‘ఉత్తర’ దిక్కులో ఉన్న రాజుల్ని జయించి అర్జునుడు ధనంజయుడయ్యాడు. ధనంజయుడంటే అగ్ని అనే అర్థం కూడా ఉంది. యుద్ధంలో జయాన్నిచ్చేది మనిషి లోపల ఉండే ఉత్సాహమూ పరాక్రమమూ ధైర్యమూ పట్టుదలా అనే వేడి. యుద్ధాలు బయటివి మాత్రమే కావు.
లోపల కూడా జరుగుతూ ఉంటాయి. లోపల పుట్టే భావావేశాల వల్లనే ఏ యుద్ధాలైనా పుడతాయి. రెండు రకాల పోరుల్లోనూ వేడీ కాకా అవసరం. అందుకనే ‘ధనాన్ని’ జయించేవాడు అగ్ని అయ్యాడు. ఈ అగ్నికి బొడ్డు వెనక ఉండే మణిపూర చక్రం ఆస్థానం. ఈ చక్రం కూడా రెండు దిక్కులకీ పోడానికి వీలునిచ్చే చక్రం. ఇంద్రియాల మీద అదుపులేని సాధకుడు ఈ చక్రం నుంచి కింది చక్రాలైన స్వాధిష్ఠాన మూలాధారాలవైపు జారిపోతాడు; ఇంద్రియాల మీద చెప్పుకోదగ్గ అదుపును సాధించినవాడు అనాహతమూ విశుద్ధమూ మొదలైన పైచక్రాల వైపు కొనసాగుతాడు.
ఇదీ సవ్యసాచిత్యం లాంటిదే.అర్జునుణ్ని ‘నరుడ’ని పిలవడం కద్దు. నాట్యం చేసేవాడి మాదిరిగా ఒంట్లోని అవయవాల్ని బాగా కదుపుతూ పనుల్ని చేసే మనిషిని నరుడని అంటారు. పనుల్ని చేస్తూ ఉంటే, వాటివల్ల వచ్చే ఫలితాల వల్ల అవి బంధాన్ని కలగజేస్తాయి. అంచేత ఎవడైతే పనుల్ని బంధనానికి లోను గాకుండా చేస్తూ ఉంటాడో అతగాడే నిజమైన ‘నరుడ’ని పెద్దలు చెబుతారు. నరుడంటే నాయకుడని (నౄ-నయే) చెబుతారు కూడాను.
ఏ నరుడైనా నేతగా కావాలంటే, ఇతరుల కన్నా వేరుగా, వాళ్లకు ఒక నమూనాగా ఉండి, ముందుకు నడిపేవాడు కావాలి. అటువంటి నరుణ్ణే సాధకేంద్రుడని అంటారు. అటువంటి నరుణ్ణించే నారాయణుడు పుడతాడు. ‘నర’ శబ్దం వృద్ధిని చెంది ‘నార’ శబ్దమవుతుంది. పెరిగి పెంపొందడం, పనుల్ని నేర్పుగా బంధం అంటకుండా చేయడంతోనే అబ్బుతుంది. అప్పుడే అతను ‘నారాలకు’, ‘అయనుడు’, అంటే ‘దారి’ అయినవాడూ, దారి చూపించే వాడూ అవుతాడు. అంటే, ‘నారాయణు డ’వుతాడు. ఒకటే శక్తి రెండు కింద విడి నరుడూ నారాయణుడూ కింద అవుపిస్తారు.
అర్జునుడు ద్రోణాచార్యుడి శిష్యుడై ఏకాగ్రతను బాగా ఒంటబట్టించు కొన్నాడు. అస్త్ర పరీక్షలో అర్జునుడి ఏకాగ్రత అర్థమైంది ద్రోణుడికి. చిటారు చెట్టుకొమ్మ మీద ఉన్న పక్షి తాలూకు తలను మాత్రమే చూస్తూ, దాని శరీరాన్ని గానీ చుట్టూ ఉన్న ఆకులూ రెమ్మలూ గానీ చూడకుండా తన బాణాన్ని వేసి, దాని తలను తెగ్గొట్టిన మేటి విలుకాడు అర్జునుడు. ఒకరోజున గంగలో స్నానానికి దిగిన ద్రోణుణ్ని ఒక మొసలి పట్టుకొంది. తతిమ్మా శిష్యులందరూ ఏం చేయాలో తెలియక, ఉన్న చోటనే నిశ్చేష్టులై నిలిచిపోతే, అర్జునుడు మాత్రం తన బాణాలతో ఆ మొసలిని ముక్కలు ముక్కలు చేశాడు.
దానికి మెచ్చుకొని, అర్జునుడికి బ్రహ్మశిరో నామకమైన ఆటంబాంబులాంటి అస్త్రాన్ని ప్రయోగ సంహారాలతో సహా ఉపదే శించాడు ద్రోణుడు. అతను గురువుగారికి ద్రుపదుడి వల్ల జరిగిన అవమానానికి ప్రతీకారం చేసి అతని రాజ్యాన్ని ద్రోణుడి కైవసం చేశాడు. అటువంటి యోద్ధకు భార్యను కానుకగా ఇద్దామని, ద్రుపదుడు ద్రౌపదిని అగ్నిముఖంగా కూతురిగా పొందాడు. కిందనున్న నీళ్లలోకి చూస్తూ, పైనున్న చక్రయంత్రంలోని కన్నానికి పైనున్న చేపను ఐదు బాణాలతో కొట్టి ద్రౌపదిని గెలుచుకొన్నాడు.
అర్జునుడు ఒక బ్రాహ్మణుడి గో ధనాన్ని కాపాడటం కోసం, యుధిష్ఠిరుడు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్న చోట్లో పెట్టిన ఆయుధాల కోసం వెళ్లవలసి వచ్చింది. అంచేత పెట్టుకొన్న నియమం ప్రకారం అతను వనవాసం చేయవలసి వచ్చింది. ప్రభాస తీర్థంలో శ్రీకృష్ణుణ్ని కలుసు కొన్నాడు. అక్కడ రైవతక పర్వతం మీద జరుగుతూన్న ఉత్సవంలో సుభద్రను చూసి మోహించాడు. శ్రీకృష్ణుడి అను మతితో ఆవిణ్ని ఎత్తుకుపోడంతో బల రాముడికి కోపం వచ్చింది. అప్పుడు కృష్ణుడు ‘అర్జునుడితో పోరి గెలవడం కష్టం. అతను మనను జయించి సుభద్రను తీసుకొనిపోతే మనకే మచ్చ. అంచేత అతన్ని ఊరడించి, వాళ్లను వెనక్కి తెచ్చి, మనమే పెళ్లి చేయడం మంచిది’ అని సలహా ఇచ్చాడు. అక్కడ సుభద్రకు అభిమన్యుడు పుట్టాడు.
అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేస్తూన్నప్పుడు, శివుడు కిరాత వేషంలో పరీక్షించడానికి వచ్చాడు. అదే సమయంలో మూకాసురుడు అర్జునుణ్ని చంపుదామని ఒక పందిలాగ వచ్చాడు. అర్జునుడు ఆ పందిమీద బాణం వేసినప్పుడే మాయాకిరాతుడు కూడా బాణం వేసి, గిరగిరా తిరుగుతూ చచ్చిపోయిన పందిని నాదంటే నాదని వాదులాడుకుంటూ ఇద్దరూ యుద్ధానికి దిగారు. అర్జునుడి అమ్ములపొది ఆశ్చర్యంగా ఖాళీ అయింది. ఇక కుస్తీకి దిగాడు.
ఆ పోరులో శివుణ్ని మెప్పించి, పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఆమీద అక్కడికి వచ్చిన దిక్పాలకుల నుంచి కూడా అస్త్రాలను పొంది, ఇంద్రుడు పిలవగా స్వర్గానికి అతిథిగా వెళ్లాడు. సంగీతం నాట్యమూ కూడా నేర్చుకోమని ఇంద్రుడు పురమాయిస్తే, అర్జునుడు చిత్రసేనుడి దగ్గర నేర్చుకొన్నాడు. అక్కడికి ఊర్వశి వచ్చి అతన్ని కోరుకొంటే, ‘చంద్ర వంశానికి మాతృరూపివి నువ్వు. అంచేత ఇది తగద’ని కాదన్న అర్జునుణ్ని ‘నపుంసకుడివి కమ్మ’ని శపించింది. ‘ఈ శాపం నీకు అజ్ఞాతవాసవేళ పనికి వస్తుంద’ని ఇంద్రుడతణ్ని ఊరడించాడు.
ఉత్తర గోగ్రహణానికి దుర్యోధనుడు భీష్ముడూ కర్ణుడూ మొదలైనవాళ్లతో వచ్చినప్పుడు, ఉత్తరుడికి సారథిగా బృహ న్నల రూపంలో ఉన్న అర్జునుడు వెళ్లాడు. అక్కడ కౌరవ సైన్యాన్ని చూసి బెంబేలెత్తిన ఉత్తరుణ్ని సారథిగా చేసుకొని, అర్జునుడే యుద్ధం చేసి ఆవుల్ని మళ్లించాడు. రాయాబారాలన్నీ విఫలమై, తీరా యుద్ధం ప్రారంభమయ్యే తరుణంలో అర్జునుణ్ని విషాదం చుట్టుముట్టింది: ‘నా శరీరంలోని ఇంద్రియాల్లాంటి ఈ నా చుట్టాల్నీ సొంతవాళ్లనీ చంపి ఏం బావు కోవాలి?’ అనే పనికిరాని జాలి పుట్టు కొచ్చింది. శ్రీకృష్ణుణ్ని ‘నాకిప్పుడేమీ పాలుపోవడం లేదు.
నాకు గురువువై మార్గాన్ని చూపించు’ అని వేడుకొన్నాడు. శ్రీకృష్ణుడప్పుడు కర్తవ్యాన్ని బోధించాడు: ‘ఇక్కడ ఈ లోకంలో లోపలా బయటా అన్నీ సంఘర్షణలే. వాటి నుంచి ఎవడూ పారిపోలేడు. ఈ కర్మలనన్నిటినీ నిమిత్త మాత్రంగా చెయ్యాలి తప్ప, వాటి ఫలితాల ఆస్తి మీద మనకెవ్వరికీ హక్కు లేదు. పరమేశ్వరుణ్నే శరణు కోరుకొని, ఫలితాలన్నీ అతనివేనన్న వివేకంతో, అతని చేతిలో ఒక సాధనంగా మాత్రమే పనిచెయ్యాలి.
ఇక్కడ ఎవ్వరూ ఎవ్వర్నీ చంపడం లేదు, చావడం లేదు కూడాను. మార్పులకు గురి అయ్యే శరీరాలు మార్పుల్ని పొందితే మనం ఏడవవలసిన పనిలేదు. అంతటా వ్యాపించి ఉన్న మనలో ఎవరికీ చావులేదు. భగవంతుణ్నే గుండెలో పెట్టుకొని తొణుకూ బెణుకూ లేకుండా ఈ జగన్నాటకాన్ని వినోదంగా చూస్తూ ఉండాలి. అతనూ నేనూ ఒకటేనన్న భావాన్ని రూఢి చేసుకొని, జీవితంలో సంఘర్షణలన్నీ నవ్వుతూనే ఎదుర్కోవాలి. అప్పుడే నీ మోహం పోతుంది’. ఈ ఉద్బోధను విని, గురువు చెప్పినట్టుగానే చేస్తూ అర్జునుడు యుద్ధంలో విజృంభించాడు.
ఒకరోజున కర్ణుణ్నింకా చంపలేదన్న కోపంతో ధర్మరాజు అర్జునుడితో, ‘నీ గాండీవాన్ని ఎవరికైనా ఇచ్చెయ్’ అంటూ అవమానపరుస్తూ అన్నాడు. అలాగ అన్నవాణ్ని చంపుతానని అర్జునుడి వ్రతం. అయితే ధర్మరాజును చంపితే తాను బతకలేడు. ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలో చెప్పమని శ్రీకృష్ణుణ్ని అడిగాడు అర్జునుడు. ‘పెద్దవాణ్ని తిట్టడం అతన్ని చంపడంతో సమానం. తనను తాను పొగుడుకోవడం చావడంతో సమానం.
ఈ రెండు పనులూ చేసి నీ ప్రతిజ్ఞను తీర్చు కో’మంటూ అతను సలహా ఇచ్చాడు. ఆ తరువాత యుద్ధభూమికి వెళ్లి కర్ణుణ్ని సంహరించాడు అర్జునుడు. మొత్తం మీద భారతమంతటా అర్జునుడి సాధకరూపం ఉట్టిపడుతూ వచ్చింది. ఏకాగ్రతతో తపస్సు చేశాడు. కానీ మధ్యమధ్యలో ఈర్ష్యా కామమూ కోపమూ ఏమీ చేయలేని దీనత్వమూ విషాదమూ కూడా అతనిలో చోటు చేసుకున్నాయి. చివరికి పెద్ద పెద్ద హేమాహేమీలను గెలిచి ప్రతిజ్ఞలు తీర్చుకొన్నాడు. అన్నిరకాల యుద్ధాల్లోనూ గెలిచాడు. దేవతలక్కూడా లొంగని కాలకేయుల్నీ నివాతకవచులనే రాక్షసుల్నీ సంహరించాడు. నరత్వం నుంచి నారాయణ గురుత్వంతోనూ సఖిత్వంతోనూ పెంపొందుతూ నారాయణుడితో ఒకటయ్యాడు.
- డా॥ముంజులూరి నరసింహారావు