Doctor Munjuluri Narasimha Rao
-
కృతవర్మ
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 26 మహాభారత యుద్ధం తరువాత కౌరవులవైపు యుద్ధం చేసినవాళ్లల్లో మిగిలినవాళ్లు ముగ్గురు; అశ్వత్థామా కృపాచార్యుడూ కృతవర్మాను. వీళ్లల్లో అశ్వత్థామా కృపాచార్యుడూ కౌరవులు కారు; కృతవర్మేమో యాదవుడు. యాదవు డంటే, శ్రీకృష్ణుడి వైపువాడు. ఇతను భోజ వంశంవాడు గనక భోజుడనీ అంటారు. ఇతని తండ్రి హృదీకుడు. హృదీకుడికి దేవబాహువూ శతధన్వుడూ పుట్టిన తరు వాత కృతవర్మ పుట్టాడు. కుంతి యాదవ స్త్రీ గనక యాదవులు పాండవులకు చుట్టాలు. యాదవుడయ్యుండీ కృతవర్మ మాత్సర్యం కొద్దీ, దుర్యోధనుడి వైపు యుద్ధం చేశాడు. శల్యుడూ పాండవుల వైపు పోరాడవలసినవాడే గానీ పొగడ్తలకూ మెరమెచ్చులకూ లొంగి, మదం కొద్దీ దుర్యోధనుడి కొమ్ముకాశాడు. ఈ మాత్సర్యానికి మూలం సత్యభామ. సత్యభామ సత్రాజిత్తు కూతురు. ఆమెను కృతవర్మకిచ్చి పెళ్లి చేస్తానని మొదట్లో సత్రాజిత్తు వాగ్దానం చేశాడు. కానీ పరి స్థితులు కలిసిరాక, ఆమెను శ్రీకృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు. కృతవర్మకు తలకొట్టినట్ట యింది. శిశుపాలుడు కూడా ఇలాగే తనకు భార్య కావలసిన రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడని గగ్గోలు పెట్టాడు. కృష్ణుడిని నానా తిట్లూ తిట్టాడు. దానికి అతను యుద్ధానికి చాలా ముందుగానే తన బతుకునే పోగొట్టుకున్నాడు. కృతవర్మ మాత్రం బయటపడకుండా పగతోనూ ద్వేషంతోనూ రగిలి పోతూ యుద్ధమప్పుడు కృష్ణుడికి వ్యతిరేకి అయిన దుర్యోధనుణ్ని బలపరచడానికి నడుము కట్టాడు. ధర్మా ధర్మాలను తూచకుండా కృష్ణుడితో విరోధం ఒక్కటే మిషగా పెట్టుకొని పాండ వులతో పోరాడడానికే సిద్ధమయ్యాడు. కృతవర్మ మాత్సర్యానికి మూలమైన సత్యభామ తండ్రి సత్రాజిత్తు. వృష్ణి వంశీ యుడైన నిమ్నుడి కొడుకు. ఇతను సూర్యు డికి భక్తుడూ సఖుడూను. సూర్యుడు సత్రాజిత్తుకు శ్యమంతకమణిని ఇచ్చాడు. అది మెడలో వేసుకొని సూర్యుడిలాగ వెలిగిపోయేవాడు సత్రాజిత్తు. ఒకసారి శ్రీకృష్ణుడు ఆ మణిని ఉగ్రసేన మహారాజుకు ఇస్తే బాగుంటుందని సూచించాడు. అంతటి బంగారాన్నిచ్చే మణి, ప్రజల్లో ఒకడి దగ్గర ఉండడం కన్నా రాజు దగ్గర ఉంటే, దాని లాభాన్ని రాజ్యం లోని ప్రజలందరూ పొందవచ్చునని కృష్ణుడి ఉద్దేశం. కానీ, డబ్బుమీద వ్యామోహం కొద్దీ సత్రాజిత్తు, కృష్ణుడి ప్రతిపాదనను కాదన్నాడు. ఓసారి, ఆ మణిని మెడలో వేసుకొని ఠీవిగా సత్రా జిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు వేటకెళ్లాడు. ఆ మణి ఎర్రగా మాంసమ్ముక్కలాగ ఉండ డంతో ఒక సింహం ప్రసేనజిత్తునీ అత నెక్కిన గుర్రాన్నీ చంపి, మణిని ఎత్తుకొని పోయింది. ఆ సింహాన్ని జాంబవంతుడనే భల్లూకం చంపి... మణిని గుహలో తన పిల్లల పిల్లలకు ఆటవస్తువుగా వేలాడ దీశాడు. అడిగినప్పుడు ఇవ్వలేదని శ్రీకృష్ణుడే ప్రసేనుణ్ని చంపి, మణిని తీసు కొనిపోయాడని సత్రాజిత్తు అపనిందను మోపాడు. ఆ నీలాపనిందను పోగొట్టుకో డానికి శ్రీకృష్ణుడు కొంతమందిని వెంట బెట్టుకొని అడవిలోకి వెళ్లాడు. చనిపోయి పడి ఉన్న గుర్రాన్నీ ప్రసేనజిత్తునీ సింహాన్నీ వరుసగా చూసుకుంటూ భల్లూక గుహ దగ్గరికి చేరాడు శ్రీకృష్ణుడు. గుహ లోపలికి పోయి మణిని తీసుకోబోతూంటే, జాంబ వంతుడు వచ్చి, శ్రీకృష్ణుడితో ఇరవై ఎని మిది రోజుల పాటు కుస్తీ పట్టాడు. చివరికి శ్రీకృష్ణుడిలో శ్రీరాముణ్ని చూసి, మణితో బాటు తన కూతురు జాంబవతిని కూడా ఇచ్చి పంపించాడు. బంగారం ఇచ్చే మణే ఇంత అనర్థాన్ని తెస్తుందని సత్రాజిత్తు అనుకోలేదు. ఈ కథ అంతా మనం వినా యకచవితి వ్రతం చేసేనాడు చదువు కొనేదే. దీని తరవాత జరిగిందే కృతవర్మకీ అతని అన్న శతధన్వుడికీ పైకి చూపించ లేని కోపాన్నీ మాత్సర్యాన్నీ తెచ్చిపెట్టింది. మాత్సర్యంలో అసూయా ఈర్ష్యా మాత్రమే గాక, పగా ద్వేషమూ వెర్రికోపమూ ఆవేశమూ మత్తుతో కూడిన ఉద్రేకమూ ఉన్నాయి. వీటన్నిటికీ ప్రతీకే కృతవర్మ. కృష్ణుడు మణిని తీసుకొని రాగానే సత్రాజిత్తు, కృష్ణుడి లాంటి అతిశక్తిమంతు డితో వైరం తెచ్చుకున్నానని నొచ్చుకుంటూ దానికి ఏవిధంగా పరిహారం చెల్లించాలా అని ఆలోచించాడు. అంతకుముందు తన కూతురు సత్యభామను నిమ్నుడి కొడుకు కృతవర్మకు ఇచ్చి పెళ్లిచేద్దామనుకొన్నాడు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని పక్కకు పెట్టి, ఆమెను కృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు. దీనితో కృతవర్మ గుండెల్లో కోపం ప్రజ్వరిల్లింది. అయితే, ఈ కోపాన్ని కృష్ణుడి ముందు అతను చూపించలేడు. దానికి కారణం శ్రీకృష్ణుడి శక్తి అమానుషమైనది కావడమే. అతనంటే వల్లమాలిన భయమే కృత వర్మకి. కానీ కోపమూ దిగమింగరానిదే. అంచేత, అది ద్వేషంగానూ పగగానూ అసూయగానూ మాత్సర్యంగానూ ఈర్ష్య గానూ మారింది. కావాలనుకొన్నదీ, రావాలనుకొన్నదీ పోయినా రాకపోయినా అహంకారం దెబ్బతింటుంది; అసంతృప్తి కలుగుతుంది. సత్యభామ తనకు గానీ తన కుటుంబంలో ఎవరికైనాగానీ భార్య కావల సినది, శ్రీకృష్ణుడి పరమైపోయిందని కృత వర్మకు ఒకటే కుతకుతా దిగులూను. అవి తీరేవి కావు గనక పగా కక్షా రూపాల్ని దాల్చాయి. పగా ఉద్రేకమూ ఎవరినైనా ధర్మాన్ని మరిచిపోయేలాగ చేస్తాయి. ఆత్మ వికాసానికి పనికివచ్చే పనుల్ని మరిచి పోయి, తాను పోగొట్టుకున్నది తనకు ఎలా రాగలదా అనే తీరిక లేని ఆలోచన లతో తన బతుకునే నరకం చేసుకుం టాడు, ఈ మాత్సర్యానికి గురి అయిన వాడు కృతవర్మ. ఆ మాత్సర్యాన్నే కవచంగా ధరించి, కృష్ణుడికి ఎదురుగా యుద్ధం చేద్దామని నిశ్చయించుకున్నాడు. లక్కింటిలో పాండవులు కాలిపోయా రన్న మాటను విని, శ్రీకృష్ణుడు, తనకు వాళ్లు పోలేదని తెలిసినప్పటికీ తెలియ నట్టుగా, భీష్ముడూ ధృతరాష్ట్రుడూ గాంధారీ మొదలైనవాళ్లతో కలిసి ‘అయ్యో, పాపం! అందరూ ఒక్కసారిగా పోవడం దురదృష్టకరం’ అని చెప్పి ధర్మోదకాల్ని ఇవ్వడానికి బలరాముడితో సహా హస్తినా పురానికి వెళ్లాడు. ఇదే అదను అని కృత వర్మా అక్రూరుడూ కలిసి శతధన్వుణ్ని ‘మనను మోసం చేసిన సత్రాజిత్తును అతని తమ్ముడి దారిపట్టేలాగ ఎందుకు చేయకూడద’ంటూ ప్రేరేపించారు. ఆ రాత్రి అతను ఆవేశంతో సత్రాజిత్తును చంపేసి, స్యమంతకమణిని తీసుకొచ్చి వచ్చాడు. సత్యభామ తన తండ్రిని చంపే శారని కృష్ణుడికి వర్తమానం పంపింది. బలరామకృష్ణులు హుటాహుటిన వచ్చి, శతధన్వుడి వెంటబడ్డారు. వాళ్లు వస్తున్నా రని తెలిసి స్యమంతకమణిని అక్రూరుడి దగ్గర వదిలి, శతధన్వుడు గుర్రం మీద పారిపోయాడు. కృష్ణుడు అతన్ని వెంబడించి చంపేశాడు. సత్యభామ దక్కకపోవడమూ తన అన్నను చంపడమూ కృతవర్మలో పగనీ అసూయనీ ఇబ్బడి ముబ్బడిగా చేశాయి. అతను, తనవాళ్లందరూ ధర్మరాజువైపు చేరినా, తాను మటుకు దుర్యోధనుడి పక్షాన పోరాడటానికి నిశ్చయించు కున్నాడు. ఈ నిశ్చయం వెనక ఉన్న కారణం కృష్ణుడంటే మాత్సర్యం తప్ప మరొకటి కాదు. పగకూ అసూయకూ వెర్రికోపానికీ మాత్సర్యానికీ కళ్లు పచ్చ బారి అన్నీ పచ్చగానే అవుపిస్తాయి; అసలైన రూపం వాటికి అవుపించదు. పాండవులంటే ప్రత్యేకమైన ద్వేషమేమీ లేదు కృతవర్మకు; తతిమ్మా యాదవులన్నా పగా లేదు. కృష్ణుణ్ని వ్యతి రేకించడమే ధ్యేయంగా అధర్మపక్షాన చేరాడు. జయద్రథుణ్ని రక్షించడం కోసం ద్రోణుడి వెనక నిలిచాడు. అర్జునుడు శకట వ్యూహంలో ముఖాన ఉన్న ద్రోణుడితో కొంతసేపు యుద్ధం చేసి, అనవసరంగా కాలహరణం జరుగుతోందని శ్రీకృష్ణుడు హెచ్చరించడంతో గురువుకు ప్రదక్షిణం చేస్తూ అతన్ని దాటి కృతవర్మను ఎదిరిం చాడు. ‘కృతవర్మ మీద దయ చూపించ వలసిన పనిలేదు; సంబంధీకుడని ఉపేక్షించకుండా వీణ్ని చంపెయ్యి’ అని కృష్ణుడు అర్జునుడితో అన్నాడు. అయినా అర్జునుడు సంబంధాన్ని దృష్టిలో పెట్టు కొని, కృతవర్మ దొరికినా చంపకుండా మూర్ఛపరిచి, ముందుకు వెళ్లిపోయాడు. సాత్యకి కూడా తన గురువు అర్జునుడిలాగే ద్రోణుణ్ని తప్పించుకొని పోతూ ఉంటే, కృతవర్మ అతన్ని నిలవరించాడు. సాత్యకి భోజుడి సారథి తల నరకడంతో అతని గుర్రాలు అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి. అప్పుడు తానే తన రథాశ్వాలను అదుపులో పెట్టుకుంటూ ఏ భయమూ లేకుండా తిరిగి ఎదిరించడానికి వచ్చే లోపులో సాత్యకి ముందుకు వెళ్లిపో యాడు. అప్పుడక్కడకు వచ్చిన భీమ సేనుణ్ని ఎదుర్కొన్నాడు కృతవర్మ. అతని పరాక్రమం ముందు పాండవులు ముందుకు సాగలేకపోయారు. భీముడి వింటినీ ధ్వజాన్నీ ముక్కలు చేసి అతన్ని కృతవర్మ రథం నుంచి కిందికి పడిపోయే లాగ చేశాడు. అప్పుడు ధర్మరాజూ మొదలైన మహారథులు భోజుణ్ని, అంటే, కృతవర్మను బాణాలతో పీడించడం మొదలుపెట్టారు. ఇంతలో భీముడికి మెలకువ వచ్చి, భోజుడి వక్షస్సు మీద ఐదు బాణాలతో దాడిచేసి దెబ్బతీశాడు. పక్కనున్న శిఖండి కూడా విజృంభించాడు. కృతవర్మ శిఖండి వింటిని విరగ్గొట్టాడు. శిఖండి కోపంతో కత్తీ డాలూ తీసుకొని విరుచుకుపడ్డాడు. తన డాలును గిరగిరా తిప్పుతూ తనను కాపాడుకుంటూ తన కత్తిని భోజుడి రథం మీదకు విసిరాడు, అది కృతవర్మ ధనుస్సును ముక్కలు చేసింది. మరో విల్లు తీసుకొని అతను శిఖండిని ముప్పుతిప్పలు పెట్టాడు. అతను రథం మీద చతికిలపడిపోయాడు. ఇదంతా కృతవర్మ వీరోచిత పోరాటమే. సౌప్తిక పర్వంలో కృతవర్మ కసాయి వాడుగా అవుపిస్తాడు. అప్పుడు అశ్వత్థామకు బాసటగా నిలిచిన ఇద్దరిలో కృతవర్మ ఒకడు; రెండోవాడు కృపాచార్యుడు. అశ్వత్థామ పాంచాలుర శిబిరంలోకి పోయి, నిద్రపోతూన్న ధృష్టద్యుమ్నుణ్నీ శిఖండినీ ద్రౌపదేయుల్నీ ఊచకోత కోస్తూ ఉంటే, తతిమ్మావాళ్లు కంగారుతో కాందిశీకులై అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉంటే, శిబిర ద్వారంలో కసాయివాళ్లలాగ నిలుచున్న కృతవర్మా కృపాచార్యుడూ వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. శిబిరం నుంచి వచ్చిన ఒక్క క్షత్రియుడూ వీళ్ల చేతుల్లోంచి తప్పించుకోలేదు. అశ్వత్థామకు ఇంకా ప్రీతిని కలిగిద్దామని వాళ్లున్న దిక్కును మినహాయించి తతిమ్మా మూడు దిక్కుల్లోనూ నిప్పంటించారు ఈ ప్రబుద్ధులిద్దరూను. తాము చేసిన ఈ ‘గొప్ప’ కార్యాన్ని చెప్పడానికి సగం ప్రాణంతో గిలగిలా కొట్టుకొంటూన్న దుర్యోధనుడి దగ్గరికి వెళ్లారు ఈ ముగ్గురూను. యుద్ధం తరవాత పాండవుల వైపు ఏడుగురూ ధార్తరాష్ట్రుల వైపు ముగ్గురూ మిగిలారు: పాండవులైదుగురూ శ్రీకృష్ణుడూ సాత్యకీ వెరసి ఏడుగురు; కృపుడూ కృతవర్మా అశ్వత్థామా వెరసి ముగ్గురు ఇటువైపు. ‘అశ్వత్థామా! నువ్వు ఈ కృపకృత వర్మలతో కలిసి చేసిన ఈ కార్యం భీష్ముడు గానీ మీ తండ్రిగానీ కర్ణుడుగానీ చేయ లేదు’ అని సంతోషిస్తూ దుర్యోధనుడు తుదిశ్వాస విడిచాడు. కృష్ణుడికి వ్యతి రేకంగా యుద్ధం చేసి కృతవర్మ సాధించింది ఇంతే. తరవాత మౌసల పర్వంలో యాదవులందరితో బాటూ కృతవర్మా పోయాడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
నకులసహదేవులు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 16 నకులసహదేవులు కవలపిల్లలు. అశ్వినీ దేవతల వల్ల మాద్రికి పుట్టినవాళ్లు. సూర్యుడికి సంజ్ఞాదేవి వల్ల పుట్టిన అశ్వినులు కూడా కవలలే. అశ్వినుల్ని దివిభువులనీ రాత్రిం బగళ్లనీ శ్వాసప్రశ్వాసలనీ చెబుతారు గనక వాళ్లు ద్వంద్వాలకు ప్రతినిధులు. వీళ్లిద్దరూ అందంగా ఉండడం వల్లనే వీళ్లవల్ల పుట్టిన నకులసహదేవులు కూడా చాలా అంద గాళ్లు. కవలపిల్లల్ని సంస్కృతంలో ‘యమౌ’ అని అంటారు. ‘యమౌ’ అంటే, యోగ భాషలో ‘యమ నియమాల’నే మొదటి రెండు యోగాంగాలూను. యమాలంటే హింసిం చకుండా ఉండడమూ దొంగతనానికి పాల్పడకపోవడమూ వీర్యాన్ని కాపాడు కుంటూ ఉండడమూ అబద్ధం చెప్పకుండా ఉండడమూ కావలసినదాని కన్నా ఎక్కువగా పోగు చేసుకోకపోవడమూ మొదలైనవి. నియమాలంటే, లోపలా బయటా శుచిగా ఉండడమూ ఉన్నదానితో సంతృప్తిపడుతూ అనవసరమైన వాటి కోసం వెంపర్లాడ కుండా ఉండడమూ కోరికల్ని విడిచిపెట్టి క్రమశిక్షణతో ఉండడమూ విశ్వమంతా విస్తరించి ఉన్న చైతన్యాన్ని అధ్యయనం చేస్తూ ఉండడమూ విశ్వాన్ని సృష్టించిన మహాచైతన్యానికి తన సర్వస్వాన్నీ సమర్పించే భావాన్ని పెంపొందించుకోవ డమూ మొదలైనవి. యమనియమాలను వినగానే వీటివల్లనే ఆరోగ్యం కలుగు తుందని తెలిసిపోతుంది. ఆరోగ్యం అందా నికి మూలం. అశ్వినులు ఈ ఆరోగ్యమనే అందాన్నిచ్చే వైద్యులు. వాళ్ల కొడుకుల అందం గూడా ఈ యమనియమాల ప్రభావం వల్లనే సిద్ధించింది. యమనియమాల్లాగే శమదమాలు కూడా కవలలే. దమమంటే బయటి పది ఇంద్రియాలనూ అదుపులో ఉంచుకో వడం; శమమంటే లోపలి ఇంద్రియమైన అంతఃకరణాన్ని అదుపులో పెట్టుకోవడం. అంతఃకరణమంటే మనస్సూ బుద్ధీ చిత్తమూ అహంకారమూ అనే నాలుగుగా మనం చెప్పుకొనే ఒకే ఇంద్రియం. యమనియమాలూ దమశమాలూ అనే కవల లక్షణాలకు సహదేవనకులులు ప్రతీకలు. ఆధ్యాత్మికతకు మూలమైన ఆధారాలు దమమూ యమమూను. అంచేతనే వీటిస్థానం మూలాధారం. ఇది సహదేవుడి స్థానం. దేవతలంటే సృష్టిలోని వస్తువుల్ని ప్రకాశింపజేసేవాళ్లు. ఆ పని చేసేవి మన ఇంద్రియాలు. అంచేత దేవత లంటే ఇంద్రియాలన్నమాట. ‘షహ- మర్షణే’, అంటే, సహించడమూ ఓర్చుకోవ డమూను. అంచేతనే, ఇంద్రియాల ఒత్తిళ్లను ఓర్చుకొనే శక్తే ‘సహదేవుడు’, అంటే, దమం. ఆధ్యాత్మికతకు అధిష్ఠా నాలు శమమూ నియమమూను. అంచే తనే వీటి స్థానం స్వాధిష్ఠానం. ఇది నకు లుడి స్థానం. ఇంద్రియ కులానికి బంధువు మనస్సు. మనస్సుకు అనుకూలంగా ఉండనివాడే - ‘న(అను)కూలుడు’, అతనే నకులుడు. మనస్సు అశాంతికి పెట్టింది పేరు. అందుకే నకులుడు శాంతికి, అంటే, శమానికి ప్రతీక. ధర్మరాజుతో సమానుడు. ప్రశాంతికి మారుపేరైన ధర్మరాజు, తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజసూయయాగం చేద్దామనుకొన్నాడు. ఆ యాగం చేయా లంటే రాజులందర్నీ జయించాలి. దాని కోసం అతని నలుగురు తమ్ముళ్లూ నాల్గు దిక్కులనూ జయించుకొని వచ్చారు. వాటిలో పడమర నకులుడి భాగమైంది; దక్షిణం సహదేవుడి భాగమైంది. పడమటి దిక్కంటే, వాసుదేవ కృష్ణుడి అధికారంలో ఉన్న దిక్కు. కృష్ణుడు పాండవుల మీది ప్రేమకొద్దీ నకులుడికి కానుకలు పంపాడు. అలాగే అటే ఉన్న మద్రదేశానికి అధిపతి అయిన శల్యుడు, మేనల్లుడి మీది ప్రేమ కొద్దీ తానే స్వయంగా నకులుడి వశంలోకి వచ్చాడు. సహదేవుడు దక్షిణదిక్కుకు పోతూ కిష్కింధ గుహకు వెళ్లాడు. అక్కడ ద్వివిదమైందవులతో యుద్ధం జరిగింది. నకుల సహదేవులకు మల్లేనే మైందద్వి విదులనే వానర రాజులిద్దరూ కూడా అశ్వినీపుత్రులే. వాళ్లు ఏడురోజులు యుద్ధం చేసి సహదేవుడి శౌర్యానికి సంతో షిస్తూ, ధర్మరాజుకోసం రత్నాలను కాను కలుగా ఇచ్చారు. ‘అవిఘ్నమస్తు కార్యాయ ధర్మరాజాయ ధీమతే’ అని దీవించి సహ దేవుణ్ని పంపారు. మాహిష్మతీనగర రాజు నీలుడికి అతని అల్లుడైన అగ్ని బాసటగా నిలిచాడు. అగ్ని తన సేనను కాల్చడాన్ని చూసి, సహదేవుడు అగ్నిని స్తుతి చేశాడు. రాజసూయయాగం చేద్దామనుకుంటూన్న ధర్మరాజుకు ‘యజ్ఞవిఘ్నమిమం కర్తుం నార్హస్త్వం హవ్యవాహన’ అని ప్రార్థించ గానే, సహదేవుణ్ని ఊరడిస్తూ అగ్ని తప్పు కొన్నాడు. అప్పుడు నీలుడు, అగ్ని ఆజ్ఞతో సహదేవుణ్ని సత్కరించి అతనికే విజయ మని ఘోషించాడు. దక్షిణ సముద్ర తీరానికి వచ్చి, విభీషణుడికి ధర్మరాజు యాగాన్ని గురించి కబురు పంపాడు. కబురందుకోగానే అతను రత్నాలనూ దివ్యమైన ఆభరణాల్నీ ఖరీదైన బట్టల్నీ ఉపాయనాలుగా పంపాడు. అలా నకుల సహదేవులిద్దరూ పశ్చిమ దక్షిణాలను జయించి ధర్మరాజు యాగానికి దోహదం చేశారు. రాజసూయంలో భీష్ముడు ధర్మ రాజుతో ఒకానొక అర్హుడికి అగ్రపూజ చేయాలని గుర్తుకు తెచ్చాడు. యుధిష్ఠి రుడు తాతగార్నే ఆ అగ్రపూజకు అర్హు డెవరో నిర్ణయించమని ప్రార్థించాడు. అప్పుడతను శ్రీకృష్ణుడే అర్హణీయతముడని నిర్ణయించాడు: ఏష హ్యేషాం సమస్తానాం తేజోబలపరాక్రమైః!/మధ్యే తపన్నివా భాతి జ్యోతిషామివ భాస్కరః!!/ అసూర్యమివ సూర్యేణ నిర్వాతమివ వాయునా!/ భాసితం హ్లాదితం చైవ కృష్ణేసేదం సదో హి నః!!’ (సభాపర్వం 36-28, 29): జ్యోతిర్మండలాల్లో సూర్యుడి మాదిరిగా అందరిలోకీ తేజస్సుతోనూ బలంతోనూ పరాక్రమంతోనూ ప్రకాశిస్తూన్నవాడు ఈ శ్రీకృష్ణుడే. సూర్యుడు లేక చీకటిలో అలమటిస్తూన్న లోకాన్ని సూర్యుడు తన వెలుగులతో ఎలాగ ముంచెత్తుతాడో అలా లోకాల నన్నిటినీ తేజశ్శక్తులతో నింపుతున్నాడు ఈ శ్రీకృష్ణుడు. గాలి లేనిచోట జీవం చచ్చి పోతుంది, ఉండనే ఉండదు. అటువంటి గాలి లేనిచోట గాలి సంచరించడం మొదలుపెడితే, ఎలాగ జీవాలన్నీ ఆనం దిస్తాయో అలాగ అందరినీ ఆహ్లాదంలో మునిగేలాగ చేస్తాడు ఈ శ్రీకృష్ణుడు. ఈవిధంగా శ్రీకృష్ణుణ్ని అగ్రపూజకు తగినవాడిగా ఘోషించగానే సహదేవుడు పూజాసామగ్రిని పట్టుకొని సభలోకి వచ్చాడు. సరిగ్గా అప్పుడే దానికి శ్రీకృష్ణుడి మేనత్తకొడుకు శిశుపాలుడు ఆక్షేపణ తెలుపుతూ అడ్డగించాడు: ‘ఆచార్యుడు గానీ ఋత్విక్కుగానీ సంబంధీకుడు గానీ శ్రుతిశాస్త్రస్నాతకుడు గానీ ప్రియమిత్రుడు గానీ ఒక మహారాజు గానీ అర్ఘ్యానికి అర్హులు. యాదవకులంలో పుట్టిన శ్రీకృష్ణుడికి రాజ్యార్హతే లేదు. పెద్దవాడం దామా దానికి అతని తండ్రి వసుదేవుడు న్నాడు. ప్రియమిత్రుడందామా దానికి ద్రుపదుడున్నాడు. అదీగాక ఋత్విక్కైన వ్యాసుడుండగా ఇతన్ని అర్హుడని ఎలాగన గలం? దుర్యోధనుడూ కృపాచార్యుడూ ద్రోణాచార్యుడూ భీష్మకుడూ రుక్మీ ఏక లవ్యుడూ శల్యుడూ అనే మహామహా పరాక్రమవంతులుండగా కృష్ణుణ్ని ఈ పూజకు ఎన్నుకోవడం సబబు కానేకాదు’ అంటూ ధ్వజమెత్తాడు. ధర్మరాజూ భీష్ముడూ ఎవరు చెప్పినా వినకుండా మొండిగా వితండంగా వాదిస్తూనే ఉన్నాడు. అప్పుడు సహదేవుడు నిండు సభలో అతిధైర్యంగా, అప్రమేయమైన పరాక్రమమున్న శ్రీకృష్ణుణ్ని పూజార్హుడిగా సహించలేనివాళ్లెవరున్నా వాళ్ల తలమీద ‘ఇదుగో నా పాదం పెడతాను’ అని భీకరంగా పలికాడు: ‘పూజ్యమానం మయా యో వః కృష్ణం న సహతే నృపాః!/సర్వేషాం బలినాం మూర్ధ్ని మయేదం నిహితం పదమ్!!’ (సభాపర్వం 39-2,3). అందరి మధ్యలో సహదేవుడు తన పాదాన్ని ఎత్తి చూపించగానే వాళ్లలో ఎవ్వరూ పెదవి మెదపలేదు. మూగ వాళ్లలా చతికిలపడి పోయారు. దీనికి కారణం యమనియ మాలు దృఢం కావడంతో సహదేవుడికి నైతిక ధైర్యం ప్రబలడమే. అప్పుడు సర్వ సంశయాల్నీ పోగొట్టే నారదుడు ఇలా ముక్తాయించాడు: ‘కృష్ణం కమలపత్రాక్షం నార్చయిష్యన్తి యే నరాః!/జీవన్మృతాస్తు తే జ్ఞేయా న సంభాష్యాః కదాచన!!’ (సభాపర్వం 39-9). కృష్ణపూజను చేయనివాడు బతి కుండీ చచ్చినవాడితో సమానం. అటు వంటివాడితో మాట్లాడటం కూడా అప రాధమే అని తేల్చి చెప్పాడు. భీముడూ నకులసహదేవులూ కలిసి శకునినీ అతని కొడుకు ఉలూకుణ్నీ ఎది రించిన సమయంలో సహదేవుణ్ని శకుని ఒక ఈటె వేసి రథంలో కూలిపోయే లాగ చేశాడు. అప్పుడు భీముడు చేసిన సింహ గర్జనకు శకుని సైనికులందరూ కాందిశీ కులై, అంటే, ఏ దిక్కుకు పోతున్నారో తెలియకుండా పారిపోయారు. ఇంతలో సహదేవుడు మెలకువ తెచ్చుకొని, శకుని విల్లును విరగ్గొట్టాడు. మరో విల్లు తీసు కొని శకుని నకులుణ్ని అరవై బాణాల తోనూ భీముణ్ని ఆరు బాణాలతోనూ కొట్టాడు. ఉలూకుడు కూడా భీముణ్ని ఏడు బాణాలతోనూ సహదేవుణ్ని డెబ్భై బాణాలతోనూ వేధిం చాడు. అప్పుడు అతికోపంతో సహదేవుడు ఒక భల్లాన్ని వేసి ఉలూకుడి తలను ఉత్తరించాడు. కొడుకు తన ఎదురు గుండానే నేలకొరగ డాన్ని సహించలేక, శకుని సహదేవుడి మీద విరుచుకుపడ్డాడు. సహదేవుడి విల్లును విరగ్గొట్టాడు. అంతటితో ఊరు కోక ఒక పెద్ద ఖడ్గాన్ని తీసి సహదేవుడి మీదకు విసిరాడు. దాన్ని మధ్యలోనే రెండు ముక్కలుగా చేశాడు సహదేవుడు. ‘ఎవడైనా క్షత్రియ ధర్మాన్ని అనుసరిస్తూ బాణాలు వేసి పౌరుషాన్ని చూపిస్తాడు గానీ, నీలాగ సభలో పాచికలతో పందెం వేస్తూ మోసంతో గెలిచి వెకిలిగా నవ్వుతూ వెక్కిరించడు. ఆ నీచకర్మకు ఫలాన్ని అనుభవించు’ అంటూ సహ దేవుడు శకుని వింటిని విరిచి, గుర్రాల్ని చంపి, ధ్వజాన్ని ముక్కలు చేసి, బాణ వర్షం కురిపించాడు. శకుని ప్రాసం వేయ బోతూంటే సహ దేవుడు ఆ ప్రాసంతో సహా అతని రెండు చేతుల్నీ మూడు భల్లాలతో నరికి, ఆ వెంటనే మరో భల్లంతో అతని తలను ఉత్తరించాడు. శకునిని చంపి, సహదేవుడు మోహాన్ని మోసాన్నీ అంతం చేశాడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
శ్రీకృష్ణుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 15 (గతవారం తరువాయి) శ్రీకృష్ణుడికి రెండువైపులవాళ్లూ ఒకటే. పాండవులకేమో అమ్మకు సాక్షాత్తూ మేనల్లుడు; దుర్యోధనాదులకేమో చిన్నమ్మకు మేనల్లుడు. అంతే తేడా. ‘సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యో స్తి న ప్రియః! యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషుచాప్యహమ్!!’’ (భగవద్గీత 9-29): అతనికి అందరూ సమానులే. ఒకడు పగవాడూ మరొకడు ప్రేమించ దగినవాడూ అంటూ లేరతనికి. భక్తితో సేవించేవాళ్ల దృష్టిలో తాను ఉంటాడు, అలాగే తన దృష్టిలోనూ వాళ్లుంటారు. కల్పవృక్షానికి పక్ష పాతం ఉండదు. దాని దగ్గర చేరిన వాళ్లకూ దూరంగా ఉన్నవాళ్లకూ మధ్య తేడా ఉండటంలో ఆశ్చర్యమేముంటుంది? కావలసినవాళ్లూ కొట్టుకోవలసివచ్చిందే అన్న బెంగ అతనికీ ఉంది. అందుకనే పాండవుల వైపున్నాడు గనక అక్కణ్నించి రాయబారానికి వెళ్లాడు. అప్పుడు దుర్యోధనుడు ‘మా ఇంట్లో వచ్చి ఉండు బావా’ అని పిలిచాడు. కానీ అతను దానికి ఇష్టపడలేదు. భక్తుడైన విదురుడింట్లో ఉన్నాడు. మర్నాడు సభలో వాళ్లు చేద్దామనుకొన్న ఘనకార్యం మనందరికీ తెలుసును: కృష్ణుణ్ని కట్టిపడేస్తే పనై పోతుందన్న దుర్భ్రమలో పడ్డాడు దుర్యోధనుడు. విశ్వమంతా అతని చైతన్యం నిండి ఉందని తెలియక, ఆ పని చెయ్యబోతే దుర్యోధనుడి కళ్లే చెదిరి పోయాయి. అయినా బుద్ధిరాలేదు. రాయబారమెప్పుడూ వైమనస్యాల్ని నివారించడానికే జరుగుతుంది. కానీ దూతనే బంధిద్దామని ప్రయత్నించడం క్షమించరాని నేరం. రావణుడు ఇలాగే దూత అయిన హనుమంతుణ్ని బంధించి భంగపడ్డాడు. జరగబోయే యుద్ధంలో భీమార్జునులు ఏ స్థాయిలో చెలరేగుతారో చెబితే ఏమన్నా మెత్తబడి లొంగుతాడేమో అనుకొన్నాడు కృష్ణుడు. కానీ దుర్యో ధనుడు మూర్ఖుడు. మూర్ఖుల మనస్సును రంజింపజేయడం అసంభవమే. కర్ణుడు దుర్యోధనుడితో జట్టుగట్టి చెడిపోయాడని, అతగాడి పుట్టు పూర్వోత్తరాలు చెప్పి, మంచిదారి పట్టిద్దా మనుకొని కర్ణుణ్ని తన రథమెక్కించుకొని కొంత చెప్పిచూశాడు. దుష్టచతుష్టయంలో ముఖ్యుడైన ఆ ‘అంగ’దేశం రాజు, శరీరంతో ఒకటై, రాజరికపు లోభంలో పడ్డవాడు ఏవిధంగా వింటాడు? ద్రోణుడు అతిగా విజృంభించి బాధపెడుతూ ఉంటే, యుధిష్ఠిరుడికి ‘అశ్వత్థామ పోయాడ’ని చెప్పమనడం అందరికీ సమానుడైన కృష్ణుడికెలాగ నప్పుతుందని అనుమానం వేస్తుంది. కానీ ధర్మం తెలిసుండీ కూడా తిండి పెట్టారన్న మోహం కొద్దీ అధర్మానికి కొమ్ముకాసేవాళ్లను ఉపాయాలతోనే నాశనం చేయాలి. ఈ ఉపాయం అటు అబద్ధంతో బయలుదేరి నిజంలో అంత మవుతుంది: ‘అశ్వతా మో హతః హతః కుంజరః’లో అబద్ధమైన ‘అశ్వత్థామ చచ్చి పోయాడు’ అన్నమాటను గట్టిగానూ నిజమైన ‘అశ్వత్థామ అనే ఏనుగు చచ్చి పోయింది’ అన్నమాటను నెమ్మదిగానూ అన్నాడు ధర్మరాజు. ద్రోణుడంటే మన పూర్వ సంస్కారాలు; అశ్వత్థామ ఇంకా బయటకురాని స్థితిలో ఆశయ రూపంలో, లోపల ఉండే కోరిక. ఈ లోపలి కోరికలే లేకపోతే సంస్కారాలు కృశించి పోతాయి. నిజానికి ఆశయాలు లేకపోవడం చాలా అరుదు. అదే జరిగితే, వాసనలు సన్నబడిపోయి ముక్తి అరచేతిలో ఉంటుంది. ఇదే పైన చెప్పిన అబద్ధ నిజాల కలగలుపు. కృష్ణుడు దిగివచ్చిందే అధర్మాన్ని అంతమొందించడానికి. అధర్మమంటే అయోగం. అయోగమంటే, ధర్మరూపుడైన భగవంతుడికి విముఖమై అతన్నుంచి విడిపోవడం. యోగాన్ని పునరుద్ధరించాలంటే, యోగాలు అవసరం. యోగాలంటే ఉపాయాలు. అందుకనే కృష్ణుణ్ని యోగేశ్వరేశ్వరుడని అంటారు: అందరికీ యోగాన్ని సాధించ డానికి యోగాలను తయారుచేసేవాడు ఇతను. ‘అసంయ తాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః! వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః!!’ (భగవద్గీత 6-36). అదుపులో ఉన్న మనస్సుతో ప్రయత్నం చేస్తే ఉపాయంతో యోగాన్ని, అంటే, ధర్మాన్ని సాధించ వచ్చు. అధర్మపరులైన జరాసంధుణ్నీ శిశుపాలుణ్నీ మహాయుద్ధానికి ముందే యమలోకానికి పంపడానికి కారణం, వాళ్లే గనక బతికి ఉంటే, కౌరవుల వైపుజేరి ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమనే. జరాసంధుడు ఇరవై వేల మంది రాజుల్ని తాను చేయబోయే భైరవయజ్ఞంలో బలి చెయ్యాలని జైల్లోపెట్టి ఉంచాడు. తమను ఆ చెర నుంచి విడిపించమని వాళ్లు మొర పెట్టుకొన్నారు; అదే సమయంలో ధర్మ రాజు రాజసూయ యాగానికి రావాలని కబురుపంపాడు. ఆ యాగం చేయాలంటే, రాజులనందర్నీ జయించాలి. ఆ రాజు లందరిలోనూ ఈ జరాసంధుడు అతి బలిష్ఠుడు. అతన్ని జయిస్తే రాజసూయం అయిపోయినట్టే. అందుకని ఈ యోగేశ్వ రుడు అర్జునుణ్నీ భీముణ్నీ తీసుకొని మారువేషాల్లో మగధకు వెళ్లాడు. అక్కడ భీముడితో జరాసంధుణ్ని నాశనం చేయిం చాడు. ఏకలవ్యుడి కుడి బొటనవేలు కనక ఉంటే, అతగాడూ అజేయుడే అవుతాడని ముందుగానే అర్జునుణ్నీ ద్రోణుణ్నీ నిమిత్తంగా చేసుకొని వాడి బొటనవేలును లేకుండా చూశాడు. కర్ణుడు తన కవచ కుండలాలకు బదులుగా ఇంద్రుణ్నించి పొందిన శక్తి నుంచి భక్తుడైన అర్జునుణ్ని రక్షించడం కూడా అయోగాన్ని శిక్షించ డానికే. ఘటోత్కచుడు పాండవ పక్షంవాడే అయినా బ్రాహ్మణద్వేషీ యజ్ఞద్వేషీను. అర్జునుణ్ని రక్షించడానికి ఘటోత్కచుణ్ని శిక్షించడానికీ కర్ణుడి శక్తిని ఘటోత్కచుడి మీద ప్రయోగింపజేశాడు కృష్ణుడు. ప్రతిరోజూ రాత్రి దుర్యోధనుడూ శకునీ దుశ్శాసనుడూ సంజయుడూ కూడా కర్ణుడికి ‘రేపు నువ్వు అర్జునుడిమీద శక్తివేసి యుద్ధాన్ని అంతంచెయ్యి’ అని చెబుతూనే వచ్చారు. అయినా సరే, పొద్దున్న రణ క్షేత్రంలోకి రాగానే అతన్ని మోహం కమ్మేది. ఎన్నెన్ని వరాలను కవచాలుగా ధరించినా హిరణ్యకశిపుడు కూడా చచ్చి పోయాడు; దేవతలందర్నీ గడగడలాడిం చిన రావణుడు మనుషుల చేతుల్లోనూ కోతుల చేతుల్లోనూ చావవలసివచ్చింది. ఈవిధంగా కర్ణుడు శక్తిని మరిచిపోవడం ఘటోత్కచుడు వచ్చేంతదాకా జరిగింది. అశ్వసేనుడు తక్షకుడి కొడుకు. ఆ రోజున ఖాండవ దహనంలో అశ్వసేనుణ్ని వాళ్లమ్మ నోట్లో పెట్టుకొని ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటే, అర్జునుడు ఆ తల్లి పాము తలను తెగేశాడు. అశ్వసేనుడు ఏదో విధంగా తప్పించుకొన్నాడు. అతను కర్ణుణ్ని చేరి, ‘నన్ను ప్రయోగించ’మని ప్రేరేపించాడు. సరిగ్గా ప్రయోగం చేసిన సమయంలో కృష్ణుడు అర్జున రథాన్ని రెండంగుళాలు కిందికి దిగేలాగ ఒక తొక్కు తొక్కాడు. సైంధవుణ్ని చంపడానికీ సూర్యుణ్ని మాటు చేయడమనే యోగాన్ని ఉపయోగించాడు కృష్ణుడు. మళ్లీ దీని తోనూ భక్తుడైన అర్జునుణ్ని కాపాడాడు. చివరికి తనవాళ్లే అయిన యాదవుల్ని కూడా మట్టుబెట్టడానికి శాపమనే యోగాన్ని ఉపయోగించాడు. మహాభారత యుద్ధంతో అధర్మమూ అయోగమూ నాశనమైపోయాయనుకోడానికి వీలులేదు. ఎందుకంటే, మహాశూరులైన యాదవులు రేప్పొద్దున మేకులై కూర్చొంటారు. తన కొడుకు సాంబుణ్నే ఈ శాపానికి పావుగా వాడాడు. కడుపుతో ఉన్న ఒక స్త్రీగా వేషం వేసి ఆటగా పిల్లలు, రుషుల దగ్గరికి పోయి, ‘ఇది మగపిల్లవాణ్ని కంటుందా ఆడపిల్లనా?’ అంటూ అడిగారు. ‘మీ వంశాన్ని అంతం చేసే ముసలం పుడుతుంది’ అని మునుల నోట ఆ శాపం వెలువడింది. ఆ శాపంలో తాను కూడా చనిపోవడాన్ని ఇమిడ్చేశాడు కృష్ణుడు. ఇదీ అతని సమానత్వం తాలూకు పరాకాష్ఠ. శ్రీకృష్ణుడికి వేలకు వేలమంది పెళ్లాలూ వాళ్లలో ఒక్కొక్కళ్లకూ పది పదేసి మంది పిల్లలూ అని వింటూ ఉంటాం. మహాచైతన్యానికి ఈ కుటుంబాలతోనూ పనిలేదు, మందీ మార్బలంతోగానీ గదలూ చక్రాలూ విల్లులూ బాణాలూ అనే ఆయుధాలతో గానీ పనిలేదు. లోకంలో పుట్టినప్పుడు ఇతరుల్లాగే కనిపించడానికే పెళ్లాలూ సంభోగాలూ పిల్లలూ అనే ఈ తతంగాలన్నీను. ఒక్క ఆకును నోట్లో వేసుకొని ముల్లోకాల్లో ఉన్నవాళ్లందరికీ తృప్తినిచ్చినవాడు, ఏదైనా అలవోకగానే చేస్తాడు, లీలగానే చేస్తాడు మరి. మనం అన్నీ మన మర్త్య దృష్టితో చూడ్డం వల్లనే, అందరూ మనలాగే ఉండాలని అనుకోడం వల్లనే, కొందరు మనకన్నా వేరుగా ఉండ వచ్చుననే ఊహ లేకపోవడం వల్లనే ఇన్ని అనుమానాలు మన కడుపునిండా ఉండి ఉబ్బరిస్తూ ఉంటాయి. మనుషుల్లోనే చాలామంది మనకన్నా గొప్పగానూ విశిష్టంగానూ అవుపిస్తూ ఉంటారు. అటు వంటప్పుడు శ్రీకృష్ణుడిలాంటి మహాను భావులు అత్యంత విశిష్టంగా ఉండటంలో అద్భుతమేముంటుంది? అతన్ని అస్కలిత బ్రహ్మచారి అని అంటారు కూడాను. అతన్ని ఏ పనులూ అంటవు. ‘న మాం కర్మాణి లిమ్సన్తి న మే కర్మఫలే స్పృహా’ (భగవద్గీత 4-14): అతనికి కర్మల ఫలాలమీద కోరిక ఉండదు. అటువంటి పనులను చేసేది మనలాంటి వాళ్లకు పాఠం చెప్పడానికే. ఎలాగ పనిని చేస్తే అది మనను తన ఫలంతో నిర్బంధ పెట్టకుండా ఉంటుందో ఆ వైనాన్ని చెప్ప డానికే అటువంటివాళ్లు పుడతారు, పనుల్ని చేస్తారు. మనలాగే పనుల్ని చేస్తున్నా వాటిని మనకన్నా చాలా వేరుగా చేస్తారు వాళ్లు. ఈ తేడా తెలియకనే కృష్ణుడి గురించి నోటికొచ్చినట్టల్లా చెప్పుకొంటూ ఉంటాం. అందుకనే అర్జునుడు తాను చేసిన పొరపాట్లను వల్లిస్తూ బాధపడ్డాడు: ‘సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి! అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి!! యచ్చాపహాసార్థమసత్కృతో సి విహారశయ్యాసనభోజనేషు! ఏకోథ వాప్య చ్యుత తత్సమక్షం తత్ క్షామయే త్వామ హమప్రమేయమ్!!’ (భగవద్గీత 11-41, 42): అర్జునుడు బావగా అతన్ని హేళన చేసేవాడు. యాదవుడా అని సంబోధించే వాడు. ఒంటరిగా ఉన్నప్పుడే కాదు, నలు గురిలోనూ కూడా ఇదే తరహాలో అగౌరవ పరిచేవాడు. శ్రీకృష్ణుడి కూటస్థ చైతన్య ప్రభావాన్ని కనుక్కొన్న తరవాత చాలా బాధపడ్డాడు. మనమూ అంతే. అతని మహా చైతన్యాన్ని తెలుసుకోలేని దుఃస్థితిలో ఉన్నంతసేపూ అర్జునుడిలాగే అతన్ని హీన పరుస్తూనే మాట్లాడుతూ ఉంటాం. ఈ విషయంలో శిశుపాలుడి కన్నా మనమేమీ తీసిపోం. తత్త్వాన్ని తెలుసుకోడానికి అందుకనే ప్రయత్నం చేయాలి. - - - డా॥ముంజులూరి నరసింహారావు -
అర్జునుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 13 అర్జునుడు కుంతి సంతానంలో మూడో వాడు. ‘అరజ్జు’ అంటే జైలని ఒక అర్థం. రజ్జువంటే తాడు. అంచేత ‘అ-రజ్జు’ అని విడదీస్తే, బంధనం లేనివాడన్న అర్థం వస్తుంది. ఎవడైనా ఈ శరీరమనే జైల్లో ఉన్నవాడే. ఆ బంధనాన్ని వదిలించు కోవాలంటే అదుపు కావాలి. శరీరమనే జైల్లో ఉంటూ కూడా నిగ్రహంతో బంధనానికి లోబడకుండా ఉండగలిగే సాధకుడు అర్జునుడు. వేయించిన (ఋజి-భర్జనే) విత్తనాలు మొలకెత్తవు. ‘ఋజ’ అనే ధాతువులో ముందు ముందుకు నడవడమూ మంచి స్థానాన్నే సంపాయించడమూ దాగి ఉన్నాయి. వీటిలోని ‘ఋ’కారం ‘ఆర్’గా మారి అర్జునుడనే మాట పుట్టింది. అదుపుతోనూ తపస్సుతోనూ మునపటి కర్మలనే విత్తుల్ని వేయించి, శాశ్వతమైన ఆత్మపదాన్ని ఆర్జించాలన్న పట్టుదలతో ఎడతెరిపి లేకుండా ప్రయత్నించే సాధకుడే అర్జునుడు. అర్జునుడికి ‘సవ్యసాచి’ అని పేరొకటి ఉంది. సవ్యమంటే కుడీ ఎడమా అని రెండర్థాలూ ఉన్నాయి; ‘సాచి’ అంటే అడ్డంగా అని అర్థం. రెండు చేతులతోనూ గాండీవాన్ని అడ్డంగా లాగి బాణాల్ని వేయగలిగిన సామర్థ్యమున్నవాడు గనకనే అతనికి సవ్యసాచి అనే పేరు వచ్చింది. ఇతనికి ‘ధనంజ యుడ’నే మరో పేరుంది. ‘ధనం’ అంటే డబ్బని అర్థం. యుద్ధంలో ఓడిపోయినవాళ్ల ధనం జయించినవాళ్ల సొంతం అవుతుంది గనక, ‘ధనం’ అనే మాటకు యుద్ధమనే అర్థం వచ్చింది. యుద్ధంలో ఎప్పుడూ జయాన్నే వరించే విజయుడిగాను, జయించినవాళ్ల సొమ్మును తన బొక్కసంలోకి చేర్చుకొన్నవాడిగాను అర్జునుడు ధనంజయుడు. ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేయడానికి ముందు ‘ఉత్తర’ దిక్కులో ఉన్న రాజుల్ని జయించి అర్జునుడు ధనంజయుడయ్యాడు. ధనంజయుడంటే అగ్ని అనే అర్థం కూడా ఉంది. యుద్ధంలో జయాన్నిచ్చేది మనిషి లోపల ఉండే ఉత్సాహమూ పరాక్రమమూ ధైర్యమూ పట్టుదలా అనే వేడి. యుద్ధాలు బయటివి మాత్రమే కావు. లోపల కూడా జరుగుతూ ఉంటాయి. లోపల పుట్టే భావావేశాల వల్లనే ఏ యుద్ధాలైనా పుడతాయి. రెండు రకాల పోరుల్లోనూ వేడీ కాకా అవసరం. అందుకనే ‘ధనాన్ని’ జయించేవాడు అగ్ని అయ్యాడు. ఈ అగ్నికి బొడ్డు వెనక ఉండే మణిపూర చక్రం ఆస్థానం. ఈ చక్రం కూడా రెండు దిక్కులకీ పోడానికి వీలునిచ్చే చక్రం. ఇంద్రియాల మీద అదుపులేని సాధకుడు ఈ చక్రం నుంచి కింది చక్రాలైన స్వాధిష్ఠాన మూలాధారాలవైపు జారిపోతాడు; ఇంద్రియాల మీద చెప్పుకోదగ్గ అదుపును సాధించినవాడు అనాహతమూ విశుద్ధమూ మొదలైన పైచక్రాల వైపు కొనసాగుతాడు. ఇదీ సవ్యసాచిత్యం లాంటిదే.అర్జునుణ్ని ‘నరుడ’ని పిలవడం కద్దు. నాట్యం చేసేవాడి మాదిరిగా ఒంట్లోని అవయవాల్ని బాగా కదుపుతూ పనుల్ని చేసే మనిషిని నరుడని అంటారు. పనుల్ని చేస్తూ ఉంటే, వాటివల్ల వచ్చే ఫలితాల వల్ల అవి బంధాన్ని కలగజేస్తాయి. అంచేత ఎవడైతే పనుల్ని బంధనానికి లోను గాకుండా చేస్తూ ఉంటాడో అతగాడే నిజమైన ‘నరుడ’ని పెద్దలు చెబుతారు. నరుడంటే నాయకుడని (నౄ-నయే) చెబుతారు కూడాను. ఏ నరుడైనా నేతగా కావాలంటే, ఇతరుల కన్నా వేరుగా, వాళ్లకు ఒక నమూనాగా ఉండి, ముందుకు నడిపేవాడు కావాలి. అటువంటి నరుణ్ణే సాధకేంద్రుడని అంటారు. అటువంటి నరుణ్ణించే నారాయణుడు పుడతాడు. ‘నర’ శబ్దం వృద్ధిని చెంది ‘నార’ శబ్దమవుతుంది. పెరిగి పెంపొందడం, పనుల్ని నేర్పుగా బంధం అంటకుండా చేయడంతోనే అబ్బుతుంది. అప్పుడే అతను ‘నారాలకు’, ‘అయనుడు’, అంటే ‘దారి’ అయినవాడూ, దారి చూపించే వాడూ అవుతాడు. అంటే, ‘నారాయణు డ’వుతాడు. ఒకటే శక్తి రెండు కింద విడి నరుడూ నారాయణుడూ కింద అవుపిస్తారు. అర్జునుడు ద్రోణాచార్యుడి శిష్యుడై ఏకాగ్రతను బాగా ఒంటబట్టించు కొన్నాడు. అస్త్ర పరీక్షలో అర్జునుడి ఏకాగ్రత అర్థమైంది ద్రోణుడికి. చిటారు చెట్టుకొమ్మ మీద ఉన్న పక్షి తాలూకు తలను మాత్రమే చూస్తూ, దాని శరీరాన్ని గానీ చుట్టూ ఉన్న ఆకులూ రెమ్మలూ గానీ చూడకుండా తన బాణాన్ని వేసి, దాని తలను తెగ్గొట్టిన మేటి విలుకాడు అర్జునుడు. ఒకరోజున గంగలో స్నానానికి దిగిన ద్రోణుణ్ని ఒక మొసలి పట్టుకొంది. తతిమ్మా శిష్యులందరూ ఏం చేయాలో తెలియక, ఉన్న చోటనే నిశ్చేష్టులై నిలిచిపోతే, అర్జునుడు మాత్రం తన బాణాలతో ఆ మొసలిని ముక్కలు ముక్కలు చేశాడు. దానికి మెచ్చుకొని, అర్జునుడికి బ్రహ్మశిరో నామకమైన ఆటంబాంబులాంటి అస్త్రాన్ని ప్రయోగ సంహారాలతో సహా ఉపదే శించాడు ద్రోణుడు. అతను గురువుగారికి ద్రుపదుడి వల్ల జరిగిన అవమానానికి ప్రతీకారం చేసి అతని రాజ్యాన్ని ద్రోణుడి కైవసం చేశాడు. అటువంటి యోద్ధకు భార్యను కానుకగా ఇద్దామని, ద్రుపదుడు ద్రౌపదిని అగ్నిముఖంగా కూతురిగా పొందాడు. కిందనున్న నీళ్లలోకి చూస్తూ, పైనున్న చక్రయంత్రంలోని కన్నానికి పైనున్న చేపను ఐదు బాణాలతో కొట్టి ద్రౌపదిని గెలుచుకొన్నాడు. అర్జునుడు ఒక బ్రాహ్మణుడి గో ధనాన్ని కాపాడటం కోసం, యుధిష్ఠిరుడు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్న చోట్లో పెట్టిన ఆయుధాల కోసం వెళ్లవలసి వచ్చింది. అంచేత పెట్టుకొన్న నియమం ప్రకారం అతను వనవాసం చేయవలసి వచ్చింది. ప్రభాస తీర్థంలో శ్రీకృష్ణుణ్ని కలుసు కొన్నాడు. అక్కడ రైవతక పర్వతం మీద జరుగుతూన్న ఉత్సవంలో సుభద్రను చూసి మోహించాడు. శ్రీకృష్ణుడి అను మతితో ఆవిణ్ని ఎత్తుకుపోడంతో బల రాముడికి కోపం వచ్చింది. అప్పుడు కృష్ణుడు ‘అర్జునుడితో పోరి గెలవడం కష్టం. అతను మనను జయించి సుభద్రను తీసుకొనిపోతే మనకే మచ్చ. అంచేత అతన్ని ఊరడించి, వాళ్లను వెనక్కి తెచ్చి, మనమే పెళ్లి చేయడం మంచిది’ అని సలహా ఇచ్చాడు. అక్కడ సుభద్రకు అభిమన్యుడు పుట్టాడు. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేస్తూన్నప్పుడు, శివుడు కిరాత వేషంలో పరీక్షించడానికి వచ్చాడు. అదే సమయంలో మూకాసురుడు అర్జునుణ్ని చంపుదామని ఒక పందిలాగ వచ్చాడు. అర్జునుడు ఆ పందిమీద బాణం వేసినప్పుడే మాయాకిరాతుడు కూడా బాణం వేసి, గిరగిరా తిరుగుతూ చచ్చిపోయిన పందిని నాదంటే నాదని వాదులాడుకుంటూ ఇద్దరూ యుద్ధానికి దిగారు. అర్జునుడి అమ్ములపొది ఆశ్చర్యంగా ఖాళీ అయింది. ఇక కుస్తీకి దిగాడు. ఆ పోరులో శివుణ్ని మెప్పించి, పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఆమీద అక్కడికి వచ్చిన దిక్పాలకుల నుంచి కూడా అస్త్రాలను పొంది, ఇంద్రుడు పిలవగా స్వర్గానికి అతిథిగా వెళ్లాడు. సంగీతం నాట్యమూ కూడా నేర్చుకోమని ఇంద్రుడు పురమాయిస్తే, అర్జునుడు చిత్రసేనుడి దగ్గర నేర్చుకొన్నాడు. అక్కడికి ఊర్వశి వచ్చి అతన్ని కోరుకొంటే, ‘చంద్ర వంశానికి మాతృరూపివి నువ్వు. అంచేత ఇది తగద’ని కాదన్న అర్జునుణ్ని ‘నపుంసకుడివి కమ్మ’ని శపించింది. ‘ఈ శాపం నీకు అజ్ఞాతవాసవేళ పనికి వస్తుంద’ని ఇంద్రుడతణ్ని ఊరడించాడు. ఉత్తర గోగ్రహణానికి దుర్యోధనుడు భీష్ముడూ కర్ణుడూ మొదలైనవాళ్లతో వచ్చినప్పుడు, ఉత్తరుడికి సారథిగా బృహ న్నల రూపంలో ఉన్న అర్జునుడు వెళ్లాడు. అక్కడ కౌరవ సైన్యాన్ని చూసి బెంబేలెత్తిన ఉత్తరుణ్ని సారథిగా చేసుకొని, అర్జునుడే యుద్ధం చేసి ఆవుల్ని మళ్లించాడు. రాయాబారాలన్నీ విఫలమై, తీరా యుద్ధం ప్రారంభమయ్యే తరుణంలో అర్జునుణ్ని విషాదం చుట్టుముట్టింది: ‘నా శరీరంలోని ఇంద్రియాల్లాంటి ఈ నా చుట్టాల్నీ సొంతవాళ్లనీ చంపి ఏం బావు కోవాలి?’ అనే పనికిరాని జాలి పుట్టు కొచ్చింది. శ్రీకృష్ణుణ్ని ‘నాకిప్పుడేమీ పాలుపోవడం లేదు. నాకు గురువువై మార్గాన్ని చూపించు’ అని వేడుకొన్నాడు. శ్రీకృష్ణుడప్పుడు కర్తవ్యాన్ని బోధించాడు: ‘ఇక్కడ ఈ లోకంలో లోపలా బయటా అన్నీ సంఘర్షణలే. వాటి నుంచి ఎవడూ పారిపోలేడు. ఈ కర్మలనన్నిటినీ నిమిత్త మాత్రంగా చెయ్యాలి తప్ప, వాటి ఫలితాల ఆస్తి మీద మనకెవ్వరికీ హక్కు లేదు. పరమేశ్వరుణ్నే శరణు కోరుకొని, ఫలితాలన్నీ అతనివేనన్న వివేకంతో, అతని చేతిలో ఒక సాధనంగా మాత్రమే పనిచెయ్యాలి. ఇక్కడ ఎవ్వరూ ఎవ్వర్నీ చంపడం లేదు, చావడం లేదు కూడాను. మార్పులకు గురి అయ్యే శరీరాలు మార్పుల్ని పొందితే మనం ఏడవవలసిన పనిలేదు. అంతటా వ్యాపించి ఉన్న మనలో ఎవరికీ చావులేదు. భగవంతుణ్నే గుండెలో పెట్టుకొని తొణుకూ బెణుకూ లేకుండా ఈ జగన్నాటకాన్ని వినోదంగా చూస్తూ ఉండాలి. అతనూ నేనూ ఒకటేనన్న భావాన్ని రూఢి చేసుకొని, జీవితంలో సంఘర్షణలన్నీ నవ్వుతూనే ఎదుర్కోవాలి. అప్పుడే నీ మోహం పోతుంది’. ఈ ఉద్బోధను విని, గురువు చెప్పినట్టుగానే చేస్తూ అర్జునుడు యుద్ధంలో విజృంభించాడు. ఒకరోజున కర్ణుణ్నింకా చంపలేదన్న కోపంతో ధర్మరాజు అర్జునుడితో, ‘నీ గాండీవాన్ని ఎవరికైనా ఇచ్చెయ్’ అంటూ అవమానపరుస్తూ అన్నాడు. అలాగ అన్నవాణ్ని చంపుతానని అర్జునుడి వ్రతం. అయితే ధర్మరాజును చంపితే తాను బతకలేడు. ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలో చెప్పమని శ్రీకృష్ణుణ్ని అడిగాడు అర్జునుడు. ‘పెద్దవాణ్ని తిట్టడం అతన్ని చంపడంతో సమానం. తనను తాను పొగుడుకోవడం చావడంతో సమానం. ఈ రెండు పనులూ చేసి నీ ప్రతిజ్ఞను తీర్చు కో’మంటూ అతను సలహా ఇచ్చాడు. ఆ తరువాత యుద్ధభూమికి వెళ్లి కర్ణుణ్ని సంహరించాడు అర్జునుడు. మొత్తం మీద భారతమంతటా అర్జునుడి సాధకరూపం ఉట్టిపడుతూ వచ్చింది. ఏకాగ్రతతో తపస్సు చేశాడు. కానీ మధ్యమధ్యలో ఈర్ష్యా కామమూ కోపమూ ఏమీ చేయలేని దీనత్వమూ విషాదమూ కూడా అతనిలో చోటు చేసుకున్నాయి. చివరికి పెద్ద పెద్ద హేమాహేమీలను గెలిచి ప్రతిజ్ఞలు తీర్చుకొన్నాడు. అన్నిరకాల యుద్ధాల్లోనూ గెలిచాడు. దేవతలక్కూడా లొంగని కాలకేయుల్నీ నివాతకవచులనే రాక్షసుల్నీ సంహరించాడు. నరత్వం నుంచి నారాయణ గురుత్వంతోనూ సఖిత్వంతోనూ పెంపొందుతూ నారాయణుడితో ఒకటయ్యాడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
భీమసేనుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 12 భీమసేనుడు పాండవుల్లో మధ్యవాడు. భీముడంటే భయంకరుడు; ‘సేనుడ’ంటే ప్రభువుతో కూడినవాడు. శారీరక బలం దృష్ట్యా ఇతను పదివేల ఏనుగుల బలమున్నవాడు: వాయునందనుడిగా పాండవ మధ్యముడైన భీముడు పసివాడిగా ఉన్నప్పుడు కుంతి ఒడిలోంచి జారి, ఒక రాతిమీద పడ్డాడు. ఆ రాయి వక్కలై పోయింది గానీ ఇతని శరీరం మాత్రం చెక్కుచెదరలేదు. తోడేలు పొట్టలాటి పొట్ట ఉన్న భీమసేనుడు తోడేలు తిన్నట్టే ఎక్కువగా తింటాడు. అలాగే హరాయించుకొంటాడు కూడాను. అందుకే ఇతనికి వృకోదరుడనే పేరు కూడా ఉంది. తల్లి కుంతీదేవి రోజూ వండిన దాంట్లో సగం ఇతనికే కేటాయించేది; తతిమ్మా సగం తతిమ్మా నలుగురికీ తనకూ ఉపయోగించేది. భీముణ్ని చూస్తే, దుర్యోధనుడికీ అతని కన్నా, అతన్ని కన్న ధృతరాష్ట్రుడికీ ఇద్దరికీ గుండెల్లో గుబులే. చిన్నప్పుడు పరుగుపందేల్లోనూ తిండి తినడంలోనూ ఒకళ్లొకళ్ల మీద ఇసుకా దుమ్మూ విసురుకోవడంలోనూ భీముడు, దుర్యోధనాదులనందర్నీ మించిపోయి వాళ్లను ఏడిపించేవాడు. పండ్లను కోసుకోడానికి చెట్టుపైకి కౌరవులు ఎక్కినప్పుడు, వాళ్లతో సహా ఆ చెట్టును ఊపి ఊపి పండ్లతో సహా వాళ్లను కూడా కిందపడేసేవాడు. ఇదంతా అతను పిల్లతనం కొద్దీ చేసేవాడు గానీ ద్రోహబుద్ధితో మాత్రంగాదు. దుర్యోధనుడు మాత్రం ఇతని బలాన్ని చూసి అసూయపడుతూ, మోసంతో పట్టి చంపేద్దామని దుష్టబుద్ధిని చూపించేవాడు. ఒకరోజున, గుండెలో కత్తులు నూరుతూ, పైకి మాత్రం తియతియ్యగా మాట్టాడుతూ, అతి ప్రేమతో సొంత అన్నదమ్ముడిలాగ ‘తిను తిన’మంటూ విషంతో కలిపిన తినుబండారాల్ని భీముడికి కడుపునిండా తినిపించాడు. తరవాత ప్రమాణ కోటిఘాట్లో నీళ్లలో ఆడుకొని, అక్కడి గట్టుమీదున్న విడిదిగదిలో విషం మత్తు బాగా ఎక్కడంతో నిద్రపోయాడు భీముడు. చచ్చినట్టు పడున్న అతన్ని దుర్యోధనుడు లతలతోనూ తాళ్లతోనూ కట్టి ఎత్తుమీంచి గంగలో విసిరేసి వెళ్లిపోయాడు. పీడ విరగడైందనుకొన్నాడు గానీ అతను నాగలోకానికి పోయి, అక్కడ వాళ్లిచ్చిన సిద్ధరసాన్ని తాగి, పదివేల ఏనుగుల బలంతో తిరిగివచ్చాడు. వారణావతంలోని లక్కింట్లో విదురుడు పంపిన పనివాడి చేత చడీ చప్పుడూ గాకుండా సొరంగాన్నొకదాన్ని తవ్వించుకొన్నారు పాండవులు. ఒక ఏడాది పాటు ఆనుపానుల్ని చూసుకుంటూ చివరికి భీముడు, పురోచనుడున్న గదినీ ఆ చుట్టూరాను అంటించి, తల్లినీ నకుల సహదేవుల్నీ ఎత్తుకొని, యుధిష్ఠిరుడూ అర్జునుడూ వెనక నడుస్తూండగా ఆ సొరంగం గుండా త్వరత్వరగా బయటికి నడిచి ఎవరికీ తెలియకుండా అడవిలోకి తీసుకొనిపోయాడు. ఇది పాండవుల తొలి అజ్ఞాతవాసం. లక్కింట్లో పాండవులు చనిపోయారనే అబద్ధాన్ని కొనసాగించడానికీ దుర్యోధనుడు వీళ్లకోసం వెదికి చంపించడానికి ప్రయత్నించ కుండా ఉండడానికీ ఈ అజ్ఞాతవాసం పనికి వచ్చింది. తప్పించుకొని వచ్చి అడవిలో వాళ్లందరూ అలసిపోయి పడుకుంటే, భీముడొక్కడూ నిద్రపోకుండా వాళ్లకు కాపలా కాస్తూ నిలుచున్నాడు. భీముడు వారిని కళ్లల్లో వత్తులేసుకొని కాపాడుతూ ఉండగా, వాళ్లందర్నీ చంపి తీసుకొని రమ్మనమని హిడింబుడు పంపగా హిడింబి అక్కడికి వచ్చింది. అయితే హిడింబి భీముడి కండలు చూసి మోహంలో పడింది. అన్నమాట మరిచిపోయింది. చెల్లెలింకా రాలేదని చిరాకుపడుతూ హిడింబుడు రానే వచ్చాడు. అన్నదమ్ముళ్లకీ అమ్మకీ నిద్రాభంగం గాకూడదని, వాణ్ని దూరంగా తీసుకొనిపోయి నలిపి ముద్దచేశాడు భీముడు. హిడింబి కుంతితో మాట్లాడి భీముణ్ని పెళ్లిచేసుకొంది. పిల్లాడు పుట్టేదాకా భీముడు పగటిపూట ఆవిడతో ఉంటూ రాత్రిపూట అన్నదమ్ములతో ఉంటూ గడిపాడు. కుంతికి మొట్టమొదటి మనవడు హిడింబికి పుట్టిన ఘటోత్కచుడు. ‘ఎప్పుడు పనిపడితే అప్పుడు నేను వచ్చి సాయం చేస్తాను’ అని చెప్పి అతను తల్లితో సహా వెళ్లిపోయాడు. ఏకచక్రపురంలో పాండవులు చేరిన బ్రాహ్మణుడి ఇంట్లో వచ్చిన సంకటాన్ని భీముడే తీర్చాడు. బకాసురుడికి తీసుకెళ్లే బండెడాహారాన్నీ తానే తిని, ఆ రాక్షసుణ్ని మట్టిబెడ్డలాగ నలిపేశాడు భీముడు. రాజసూయయాగం చేయడానికి దిక్కులన్నీ జయించాలి. భీముడు తూర్పువైపు రాజుల్ని జయించుకొని వచ్చాడు. దానికి ముందు, జరాసంధుణ్ని సంహరించడం అవసరమని శ్రీకృష్ణుడూ అర్జునుడూ భీముడూ యాచకుల వేషంలో జరాసంధుడి దగ్గరికి వెళ్లారు. అక్కడ భీముడు జరాసంధుణ్ని గదాయుద్ధంతోనూ చివరికి కుస్తీతోనూ చంపాడు. మయసభలో నేలనుకొని నీళ్లలో చతికిలబడ్డ దుర్యోధనుణ్ని చూసి భీముడు నవ్వేసరికి దుర్యోధనుడి గుండె మండిపోయింది. శకుని పాచికల బలాన్ని చూసుకొని, తండ్రి ధృతరాష్ట్రుణ్ని ఒప్పించి, పాండవుల్ని జూదమాడడానికి పిలిపించాడు. తొలిజూదంలో అందరూ దాసులైపోయారు. భీముడు, తమను ఓడినందుక్కాదు గానీ ద్రౌపదిని పణంగా పెట్టడాన్ని చూసి అన్నగార్ని తప్పుపట్టాడు. ఆ కోపంతో సహదేవుడితో ‘తమ్ముడూ! నిప్పు పట్టుకొనిరా! ఈ ధర్మరాజు చేతుల్ని కాల్చేస్తాను’ అంటూ మండిపడ్డాడు. కొప్పుపట్టుకొని ద్రౌపదిని దుశ్శాసనుడు జూదసభలోకి ఈడ్చుకొని రావడాన్ని చూసి భీముడు ‘ఈ పాపిష్ఠి దుశ్శాసనుడి రొమ్మును బలవంతంగా చీల్చి వాడి వేడి వేడి రక్తాన్ని తాగుతాను’ అంటూ కోపంతో ఊగిపోయాడు. భీముడి భయంకరమైన ఈ మాటలు విన్నతరవాత కూడా కర్ణుడు ఉసిగొల్పడంతో, ద్రౌపదిని ఉద్దేశిస్తూ దుర్యోధనుడు తన ఎడమ తొడను చూపించాడు. అది చూసి భీముడు అతికోపంతో సభలో అందరిమధ్యా ‘వీడి సిగ్గూ ఎగ్గూ లేని ఈ తొడను మహాయుద్ధంలో గదతో పగలగొడతాను’ అని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. రెండోసారి జూదంలో వనవాసానికి వెళ్లవలసివచ్చినప్పుడు, తన మహాబాహువుల బలానికి దీటుగా పరాక్రమాన్ని చూపిస్తానన్నట్టుగా భీముడు తన విశాల బాహువుల్ని చూసుకుంటూ ముందుకు నడిచాడు. కామ్యకవనంలో చొరబడుతూనే దుర్యోధనుడి మీద ఉన్న కోపాన్ని మొత్తమూ కిర్మీరుడనే రాక్షసుణ్ని చంపడంలో చూపించాడు. కిర్మీరుడు బకాసురుడి సోదరుడూ హిడింబుడి నేస్తమూను. అర్జునుడు అస్త్రాలను సంపాయించడానికి వెళ్లినప్పుడు, ద్రౌపదితో సహా ఆ నలుగురు పాండవులూ లోమశమహర్షి బృందంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లారు. హిమాలయాలకు వెళ్లి, అక్కడ గంధమాదన పర్వతం మీద భీముడితో ద్రౌపది విహరిస్తూన్నప్పుడు, సౌగంధిక పుష్పం ఒకటి గాలికి ఎగిరి వచ్చింది. దాన్ని చూసి ద్రౌపది ముచ్చటపడింది. భీముడు ఆ ముచ్చటను తీర్చడానికి ఆ పువ్వుల కోసం వెదుక్కుంటూ ముందుకు వెళ్లాడు. పొగరుగా భీముడు ఈ దారిని వెళ్తే, దేవతలు శాపం పెట్టవచ్చునని, స్వర్గానికి వెళ్లేదారికి అడ్డంగా హనుమ పడుకొన్నాడు. భీముడు హనుమంతుడి దగ్గరకు వచ్చాడు. ‘దారికి అడ్డం తొలగవయ్యా ముసలాయనా’ అన్నాడు. ‘నేను ముసలివాణ్ని గదా. నువ్వే ఈ తోకను పక్కకు పెట్టి వెళ్లు’. అన్నాడు ఆంజనేయుడు. అంతేగదా అని ఎడమచేత్తో తీయబోయాడు. చేతగాలేదు. రెండు చేతులూ ఉపయోగించాడు. శాయశక్తులా ప్రయత్నించాడు. హతాశుడయ్యాడు. దానితో అతని గర్వం కాస్తా దిగింది. అప్పుడు హనుమంతుడు తనను తాను పరిచయం చేసుకొన్నాడు. తమ్ముడడిగితే, తన రూపాన్ని చూపించి, ‘అదుగో అటువైపు ఉంది సౌగంధిక పుష్పాలున్న నది. ఏం గొడవ చేయకుండా తీసుకొని వెళ్లు’ అని సలహా చెప్పి వెళ్లిపోయాడు. భీముడు అక్కడి రక్షకులను తరిమికొట్టి పువ్వుల్ని తీసుకొని వెనక్కు బయలు దేరాడు. అక్కణ్నించి ద్వైతవనానికి వచ్చాడు. ద్వైతవనంలో ఉన్నప్పుడే పాండవుల్ని అవమాన పరుద్దామని దుర్యోధనుడు సేనలతో సహా అక్కడికి వచ్చాడు. అక్కడ గంధర్వులతో గిల్లికజ్జా పెట్టుకొని వాళ్ల చేతిలో ఓడిపోయాడు. ధర్మరాజు ఆజ్ఞమేరకు భీముడూ అర్జునుడూ వెళ్లి అతన్ని విడిపించారు. అక్కణ్నించి కామ్యకవనం వచ్చిన తరవాత ఓ రోజు ద్రౌపదిని, దుశ్శల భర్త జయద్రథుడు అపహరించబోగా భీమార్జునులు వాడి వెంటబడి బంధించి తెచ్చారు. విరాటనగరంలో అజ్ఞాతవాసం చేసేటప్పుడు భీముడు వలలుడనే వంటవాడయ్యాడు. సైరంధ్రి అయిన ద్రౌపది, రాజుగారి బావమరిది కీచకుడి కంటబడింది. ఆ కాముకుడు ఆమె వెంటపడగా, రాత్రిపూట నాట్యశాలకు రమ్మనమని కీచకుడికి ద్రౌపదిచే చెప్పించి, అతను అక్కడికి రాగానే, రహస్యంగా అక్కడికి చేరిన భీముడు అతగాణ్ని మల్లయుద్ధంలో నుగ్గునుగ్గు చేశాడు. ఆ మీద కీచకుడి శవంతో సహా ద్రౌపదిని శ్మశానానికి తీసుకొని వెళ్తూన్నప్పుడు కీచకుడి తమ్ముళ్లనందర్నీ మూకుమ్మడిని చంపేశాడు భీముడు. అర్జునుడు సంశప్తకులతో యుద్ధానికి దూరంగా వెళ్లినప్పుడు, అభిమన్యుడు ద్రోణుడు వేసిన పద్మవ్యూహంలో ప్రవేశించాడు. అభిమన్యుడికి సాయంగా వెళ్లడానికి ప్రయత్నించిన పాండవుల్ని సైంధవుడు శివుడి వరం వల్ల అడ్డుకోగా ఒంటరిగా ఉన్న అభిమన్యుణ్ని ఆరుగురు ఒక్కసారిగా ముట్టడించి చంపేశారు. ఆ కారణంగానే సైంధవుణ్ని మర్నాటి సాయంత్రం లోపులో చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. యుధిష్ఠిరుడు భీముణ్ని వాళ్లకు సాయంగా వెళ్లమన్నాడు. భీముణ్ని ద్రోణుడు అడ్డుకొన్నాడు. భీముడు ద్రోణుడు వేసే బాణాల వానను ఓర్చుకుంటూ అతని రథాన్ని విసిరిపారేశాడు. మళ్లీ ఇంకో రథమెక్కి వస్తే దాన్నీ అలాగే ఎత్తి విసిరేశాడు. ఇలా ఎనిమిది రథాల్ని విసిరి పారేసి అదను దొరికినప్పుడల్లా విరోధులను చంపుతూ దుశ్శాసనుణ్ని పట్టుకొని వాడి వక్షస్సును చీల్చి కసిగా రక్తాన్ని తాగాడు. చివర్లో దుర్యోధనుడు భయపడి మడుగులో దాక్కొన్నాడు. పాండవులు అవమానపరుస్తూ మాట్లాడటంతో బయటికి వచ్చి భీముడితో గదాయుద్ధం చేశాడు. తన ప్రతిజ్ఞ ప్రకారం భీముడు అతని తొడను విరగ్గొట్టి పడగొట్టాడు. భీష్ముడన్నా భీముడన్నా భయంకరుడనే అర్థం. కానీ వీళ్లు పెట్టే భయంలో తేడా ఉంది. భీష్ముడు అంపశయ్య మీద పడుకొన్నాడు; భీముడు తన అతిపరాక్రమంతో ధార్తరాష్ట్రులందర్నీ నేలకొరిగేలాగ చేశాడు. -డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
ధృతరాష్ట్రుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 5 రాష్ట్రమంటే ప్రాంతమూ దేశమూ అనే అర్థాలే వాడుకలో ఉన్నాయి. అయితే, దీనికి ఉపద్రవమూ ఉత్పాతమూ ఎప్పుడొస్తుందో తెలియకుండా మీదికి విరుచుకొనిపడే విపరీతమైన కష్టమూ అనే అర్థం కూడా ఉంది. అటువంటి ఉపద్రవాన్ని ధరించి పోషించేవాడు మన ధృతరాష్ట్రుడు. అతను రాష్ట్రాన్ని తన పట్టులో ఉంచుకొని పోషించాలని చూస్తూ ఉండేవాడు. కానీ అతను పుట్టుగుడ్డి. పుట్టుగుడ్డివాడు రాజ్యాన్ని ఏవిధంగా పరిపాలించగలడు? దాన్ని తన పట్టులో ఎలాగ ఉంచుకోగలడు? ‘చక్షుర్వై సత్యం’ అని అంటారు: కంటితో చూసినదే సత్యం. కళ్లులేని కబోదికి, ఇక సత్యమనేది ఏవిధంగా అవుపిస్తుంది? అందుకనే పెద్దవాడైనా సరే, ఇతన్ని కాదని, అంబాలిక కొడుకైన పాండురాజునే రాజుగా చేశారు. పాండురాజు విలువిద్యలో మేటిగాడు; ధృతరాష్ట్రుడేమో పదివేల ఏనుగుల బలమున్నవాడు; విదురుడు, యముడి అవతారం గనక, మహాధర్మిష్ఠుడు. పాండురాజు పెళ్లైన ఒక మాసానికే దిగ్విజయానికి వెళ్లి, రాజ్యాన్ని బాగా పెంపొందించాడు; సుస్థిరంగా కూడా చేశాడు. అయినా, ఇలాగ గుడ్డితనం ‘సాకు’తో తన పెద్దరికాన్ని పక్కుకు పెట్టారని, పైకి గంభీరంగా ఉన్నా, ధృతరాష్ట్రుడికి మొదటి నుంచీ లోపల పీకుడే. తనకు కళ్లు లేకపోతే లేకపోనీ, భార్యకైనా ఉంటే ఒక పక్షంగా బాగానే ఉండేది. కానీ, గాంధారి తనను పుట్టుగుడ్డి అయిన ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లిచేస్తారని వినగానే మగాడిలో తప్పుల్ని చూడకూడదన్న కృతనిశ్చయంతో ఆమె తన నిక్షేపమైన కళ్లకు బట్టను పట్టీగా కట్టుకొంది. మొగుడు పుడుతూనే గుడ్డివాడైతే, పెళ్లాం తెచ్చిపెట్టుకొన్న గుడ్డితనం కలదైంది. ఈ రెండు గుడ్డితనాలూ కలిసి కన్న వందమంది పిల్లలూ మరోరకం గుడ్డివాళ్లయ్యారు. వాళ్లల్లో పెద్దవాడికి అసూయ అనే గుడ్డితనం. రెండోవాడికి మన్నూమిన్నూ కానని కావరమనే గుడ్డితనం. పెద్దాడు దుర్యోధనుడు పుడుతూనే గాడిదల ఓండ్రింపు లాంటి కర్ణకఠోరమైన ధ్వనిచేశాడు; అప్పుడు దిక్కులు కాలిపోతాయా అన్నట్టు వడగాలులు వీచాయి. ఇదంతా చూసి ధృతరాష్ట్రుడు ‘యుధిష్ఠరుడు మన కులంలో పెద్దబ్బాయి. అంచేత అతనికి రాజ్యం దక్కుతుంది. సరే. ఇదుగో ఈ దుర్యోధనుడు తరువాత పుట్టాడు. వీడు నా పెద్దకొడుకు గదా! వీడు కూడా రాజవుతాడా కాడా?’ అని భీష్ముడూ విదురుడూ మొదలైనవాళ్లను అడిగాడు. ఆ మాట అడగ్గానే క్రూరజంతువులు గర్జించాయి; నక్కలు అమంగళంగా ఊళలు వేశాయి. అప్పుడు విదురుడు ‘చూస్తున్నావుగా అన్నయ్యా ఈ అపశకునాలు! వీడు కులాంతకుడవుతాడు. వీణ్ని విడిచిపెడితే శాంతిగా ఉంటుంది రాజ్యం. వీణ్ని రక్షిస్తే మాత్రం చాలా ఉపద్రవమే వచ్చిపడుతుంది. ఈ ఒక్కణ్నీ వదిలిపెట్టి, కులానికే గాదు, జగత్తుకి కూడా క్షేమాన్ని కలిగించు. కులం మంచికోసం ఒకణ్ని (దుర్మార్గుణ్ని) విడిచిపెట్టాలి; గ్రామం మంచికోసం కులజంజాటాన్ని వదలాలి; జనపదం హితంకోసం గ్రామమనే సంకుచితత్వాన్ని విడిచిపెట్టాలి; విస్తారమైన సుఖం కోసం భూమి అనే ఇంతపాటి పరిధిని విడిచిపెట్టాలి’ అన్నాడు. పుత్రుడి మీది మోహం కొద్దీ విదురుడు చెప్పిన మంచి మాటల్ని పెడచెవిని పెట్టాడు ధృతరాష్ట్రుడు. పాండురాజు జింకల రూపంలో ఉన్న మునిదంపతుల్ని బాణం వేసి చంపడంతో శాపగ్రస్తుడై కామక్రీడకు దూరంగా ఉండవలసిన దగ్గర్నుంచీ వనంలోనే తపస్సు చేసుకొంటూ ఉండేవాడు. అప్పణ్నించీ రాజ్యాన్ని ధృతరాష్ట్రుడే పరిపాలిస్తున్నాడు. దూర్వాసుడు కుంతికిచ్చిన వరం సాయంతో కుంతికీ మాద్రికీ యుధిష్ఠరుడూ భీముడూ అర్జునుడూ నకులుడూ సహదేవుడూ పుట్టారు. ఓ రోజున మాద్రితోబాటు వనంలోకి షికారుకు వెళ్లిన పాండురాజుకు పట్టరాని కామం ఆవహించింది. వద్దన్నా వినకుండా మాద్రిని కావలించుకోబోయాడు. అంతే, అతను చనిపోయాడు. ‘నా వల్లనే పోయాడు గనక, నేనూ ఆయనతో బాటే వెళ్లిపోతాను’ అని మాద్రి అతని చితిలోనే కాలిపోయింది. కుంతినీ చిన్నపిల్లల్ని ఐదుగుర్నీ వెంటబెట్టుకొని, వనంలోని రుషులు హస్తినాపురానికి వచ్చి, జరిగింది చెప్పి, వాళ్లను విడిచిపెట్టి వెళ్లారు. కుర్రాళ్లు పెద్దవాళ్లవుతున్నారు. చదువులూ సంస్కారాలూ ఆయుధ విద్యలూ అబ్బాయి. అన్నిట్లోనూ పాండవులదే పైచేయిగా ఉండేది. ధర్మరాజు పెద్దవాడు గనక అతన్ని యువరాజుగా చేశాడు ధృతరాష్ట్రుడు. పౌరులందరూ ధృతరాష్ట్రుణ్ని, భీష్ముణ్ని కూడా కాదని, ధర్మరాజునే రాజుగా కోరుకోడాన్ని చూసి దుర్యోధనుడు విలవిల్లాడిపోయాడు. ‘ఈ రాజ్యం పాండురాజుది గనక, అతని పిల్లలకే చెందుతుంది. ఇక మేమూ మా పిల్లలూ రాజ్యానికెప్పుడూ దూరంగా ఉండవలసిందేనా? ఎప్పుడూ ఇతరులు వేసే కూడు తినవలసినవాళ్లమేనా? నీకే గనక మొదట రాజ్యం వచ్చి ఉంటే, మాకీ దుర్దశ ఉండేది కాదు’ అని తండ్రి ఎదుట తన బాధ వెళ్లగక్కాడు. పాండవుల్ని వారణావతమనే ఊరుకి పంపించడానికి ప్రయత్నం చేసి, ప్రజలందరూ తన అధీనంలోకి వచ్చిన తరవాత, తిరిగి వాళ్లు వచ్చేలాగ చేద్దామని ఒక ప్రణాళికను తయారుచేశాడు. అంతకుముందు కణికుడనే మంత్రి, శత్రువులు బలవంతులైతే ఉపాయంతో వాళ్లను బలహీనులుగా జేసి చంపాలనీనూ త్వరగా మట్టుబెట్టాలంటే వాళ్ల ఇంటిని తగలబెట్టాలనీనూ ధృతరాష్ట్రుడికి ఉపదేశించాడు. దీనితోనే లక్కింటి పథకానికి బీజం పడింది. నమ్మకస్తులైన మంత్రుల చేత వారణావతం ‘ఏం అందమైన నగరమండీ!’ అని పాండవుల ముందు పొగిడించాడు ధృతరాష్ట్రుడు. వాళ్లు వెళ్లడానికి సుముఖంగా ఉన్నారన్నప్పుడు ‘మీరు వారణావతం వెళ్దామనుకొంటున్నారుగా! శుభం. వెళ్లిరండి’ అని అడక్కుండానే పచ్చజెండా ఊపేశాడు. ధర్మరాజుకు ధృతరాష్ట్రుడి మనస్సు తెలియకపోలేదు కానీ పెద్దవాడి మాటకు ఎదురు ఎలాగ చెప్పగలడు? వారణావతానికి పాండవులు వెళ్తూంటే, నిర్భయులైన కొంతమంది ‘రాజు పాండవుల్నీ తన పుత్రుల్నీ సమంగా చూడటం లేదు. ధర్మాన్ని పట్టించుకోవడం లేదు. ఇంత అధర్మాన్ని భీష్ముడెలాగ ఒప్పుకొంటున్నాడో’ అని బాహాటంగానే అన్నప్పటికీ ధృతరాష్ట్రుడికి చీమకుట్టినట్టుగా కూడా లేదు. లక్క ఇంటిలో కాలిపోయారని తెలిసినప్పుడు మొసలి కన్నీళ్లు కార్చి స్నానాలు కూడా చేశాడు ధృతరాష్ట్రుడు. ద్రౌపదితో వివాహమైన తరవాత, ఇక ఈ తగాదాల్లేకుండా అర్ధరాజ్యమిచ్చేస్తానని చెప్పి పాండవుల్ని ఖాండవ ప్రస్థానికి పంపాడు. భీముడూ అర్జునుడూ నకులుడూ సహదేవుడూ నాలుగు దిక్కుల్నీ జయించుకొని వచ్చి ధర్మరాజు రాజసూయయాగం చేయడానికి అనువు కల్పించారు. అక్కడికి వెళ్లిన దుర్యోధనుడికి ధర్మరాజుకున్న సిరిని చూసి కన్నుకుట్టింది. తిండి సయించడం మానేసింది; కృశించుకొనిపోయాడు. ‘ఏమిటిలా నీరసించుకొనిపోతున్నావు?’ అని అడిగాడు తండ్రి. ‘పాండవులసిరి అంతా నన్నుజేరితేనే నాకు కంటినిండా నిద్రపడుతుంది నాన్నా! శకుని మామయ్య వాళ్లతో కపట జూదమాడి ఆ సిరిని నాకు అప్పగిస్తానంటున్నాడు. నువ్వు ఊ అంటే చాలు!’ అని పెద్ద పుత్రరత్నం గునిశాడు. ‘వాళ్ల ధనమూ నీదేగదరా! బాహువుల్లాటి వాళ్లను తెగ్గొట్టుకోకు. ద్వేషాన్ని పెట్టుకోకు’ అని నెత్తీనోరూ మొత్తుకొని చెప్పినా వినలేదు. ‘సరే, విదురుడితో మాట్లాడి నిశ్చయిద్దాంలే’ అనగానే... ‘అయినట్టే! విదురుడు బాబాయి దీన్ని పడనివ్వడు. అప్పుడింక నాకు చావే శరణ్యం’ అన్నాడు. ఎంత పుత్రమోహం ఉన్నా, విదురుణ్ని అడక్కుండా ఒక్కపనీ చేయలేడు ధృతరాష్ట్రుడు. ‘జూదం వల్ల కొడుకుల మధ్య భేదం రాకుండా చూడు అన్నయ్యా!’ అన్న విదురుడికి ‘అహ, ఇది వట్టి సుహృద్ద్యూతం మాత్రమే. అయినా నేనూ ద్రోణుడూ భీష్ముడూ నువ్వూ ఉండగా అన్యాయం ఎందుకు జరుగుతుంది?’ అని సన్నాయి నొక్కులు నొక్కుతూ పాండవుల్ని పిలిపించాడు. జూదం జరుగుతుంటే మాటిమాటికీ ‘ఇప్పుడేం గెలిచారు, ఇప్పుడేం గెలిచారు?’ అని అడుగుతూనే ఉన్నాడు. తన గుడ్డిముఖంలో తాండవిస్తూన్న ఆనందాన్నిదాచుకోలేకపోయాడు. కోడలికి అవమానం జరిగిపోయిన తరవాతనే, పెద్దలందరూ ఏమీ అనకుండా ఉండటం కోసం, ఆమెకు వరాలనిచ్చి పాండవుల దాస్యాన్ని తీర్చాడు. ‘ఇంతా సాధించిన తరవాత ముసిలోడు అంతా పాడుచేసేశాడు’ అని దుశ్శాసనుడు మెటికలు విరిచాడు. మళ్లీ జూదానికి పిలిపించమని దుర్యోధనుడు మంకుపట్టు పట్టాడు. అప్పుడు తల్లి గాంధారి కూడా ‘నీ అదుపులో వాడు ఉండనంటే, కులానికి చిచ్చులాంటివాణ్ని వదిలిపెట్టెయ్’ అని చెప్పింది. ‘కులం అంతమైపోతే పోనీ నేను మాత్రం దుర్యోధనుణ్ని ఆపలేను’ అని ధృతరాష్ట్రుడు చేతులెత్తేశాడు. ‘పద్నాలుగో ఏడాది తిరిగివచ్చినప్పుడు, వాళ్ల రాజ్యం వాళ్లకు ఇవ్వకపోతే భీమార్జునులు నిశ్శేషంగా అందర్నీ చంపేస్తారు. అందుకని అహితం చేస్తూన్న నీ కొడుకును విడిచిపెట్టు’ అని విదురుడు అనేసరికి కోపాన్ని పట్టలేక ‘నిజమే, పాండవులూ నా పుత్రులే. కానీ, దుర్యోధనుడేమో నా శరీరం నుంచి పుట్టాడు. నా దేహాన్ని నేనెలాగ వదిలిపెట్టాలి? నీకెప్పుడూ పాండవులంటేనే ఇష్టం. నీ ఇష్టమొచ్చిన చోటికి వెళ్లవచ్చు’ అని ధృతరాష్ట్రుడు నోరుజారాడు. విదురుడు వెళ్లిన మీదట, తాను చేసిన తప్పు స్పృహకు వచ్చి, వెంటనే సారథి సంజయుణ్ని పంపి, అతన్ని తిరిగి వచ్చేలా చేసుకొన్నాడు. యుద్ధం వచ్చి పడబోతోందన్న దగ్గర్నుంచీ నిద్ర కరువైపోయింది. విదురుడూ సనత్సుజాతుడూ ఎంతమంది చెప్పినా ఊరట కలగలేదు. సంజయుడు యుద్ధ విషయాలను చెబుతూంటే కుమిలి కుమిలిపోయాడు. శ్రీకృష్ణుడు చెప్పిన గీతను విన్నా కోపం ఏమాత్రమూ తగ్గలేదు. వందమంది పిల్లల్నీ చంపినవాడు భీముడు గనక అతన్ని తన కౌగిలిలో చంపేద్దామని అనుకొన్నాడు. శ్రీకృష్ణుడు ఇనుప విగ్రహాన్ని ధృతరాష్ట్ర కౌగిలిలోకి పంపాడు. మొదటినుంచి చివరిదాకా ధృతరాష్ట్రుడిది ఒకటే తీరు: పుత్రమోహంతో అజాగ్రత్తగా వ్యవహరించడం. ‘అజాగ్రత్తే మృత్యువు’ అని ఎంతమంది చెప్పినా తెలుసుకోలేక పోయాడు. మనిషి మనస్సు కూడా ఇలాగే అజాగ్రత్తగా ప్రవర్తిస్తూ శరీర రాష్ట్రానికి ‘రాష్ట్రాన్ని’ అంటే ఉపద్రవాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
సత్యవతీ శాంతనులు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 3 గంగాదేవి విడిచిపెట్టి వెళ్లిపోయిన తరువాత శాంతనుడు ముప్పై ఆరేళ్ల పాటు పెళ్లి గురించే ఆలోచించకుండా అడవుల్లో ఉన్నట్టుగా ఉంటూ రాజ్యాన్ని పాలించేవాడు. గంగాదేవి తానుకన్న ఎనిమిదో వసువును ముందు శాంతనుడి వద్దే ఉంచి వెళ్లినప్పటికీ, ఇంటిపట్టున ఉండి పిల్లవాణ్ని పట్టించుకోవడం లేదని ఆ తర్వాత వచ్చి తిరిగి తనతో తీసుకొని వెళ్లిపోయింది. తండ్రిపోలికలు బాగా ఉన్న ఆ గంగాదత్తుడి పేరు దేవవ్రతుడు. వ్రతమంటే దీక్షగా పనిచేయడం. దేవవ్రతుడంటే ఏ పనినైనా దేవుడి పనిగానే దీక్షగా చేసేవాడని అర్థం. ఒకరోజున శాంతనుడు ఒక క్రూరమైన పశువును వేటాడుతూ గంగ ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డున నడుస్తూండగా అతనికి ఆ నదిలో నీళ్లు తగ్గినట్టుగా అనిపించాయి. ఈ దేవనది మునుపటిలాగా కాకుండా ఇలా బక్కచిక్కినట్టు ఉండటానికి కారణమేమిటబ్బా అని చోద్యంగా చూశాడు. అక్కడ ఒక అందమైన కుర్రాడు దివ్యాస్త్రాలను వేస్తూ గంగనీటికి అడ్డుకట్ట వేస్తున్నాడు. ఆ పిల్లవాడు తన పోలికలతోనే ఉన్నా, తన కొడుకేనని అతను గుర్తుపట్టలేకపోయాడు. ఆ కుర్రాడూ తండ్రిని చూసి, ఎవడో కొత్తవాడని అనుకొంటూ, అతన్ని మాయలో పడేసి, తానూ మాయమైపోయాడు. కనిపిస్తూనే అంతర్థానమైన పిల్లవాడిలో తన పోలికలే ఉన్నాయని తలచుకొంటూ ఉన్న శాంతనుడికి ‘అతను మూడొంతులు నా కొడుకే అయ్యుంటా’డనే అనుమానం వేసింది. తక్షణమే గంగను తలుచుకొన్నాడు. గంగాదేవి ఆ పిల్లవాణ్ని చేతబట్టుకొని ఎదురుగుండా వచ్చింది. ‘నేను నీవల్ల కన్న ఎనిమిదో కొడుకే ఈ సర్వాస్త్రవేత్త. ఇక వీణ్ని నువ్వు తీసుకో. వశిష్ఠుణ్నించి వేదాలూ పరశురాముణ్నించి ధనుర్విద్యా క్షుణ్ణంగా నేర్చుకొన్నాడు ఈ మన అబ్బాయి’ అంటూ ఆ అబ్బాయిని తండ్రికి అప్పగించి గంగాదేవి తిరిగి వెళ్లిపోయింది. ఆ వీరపుత్రుణ్ని చూసుకొంటూ ఇట్టే నాలుగేళ్లు గిర్రున గడచిపోయాయి. ఒకరోజున యమునానది పక్కనున్న వనంలోకి వెళ్లాడు శాంతనుడు. అక్కడ అతనికి ‘ఇదీ’ అని చెప్పడానికి వీలులేని ఒక సువాసన గాలితెర మీదుగా వచ్చింది. ఆ సుగంధం ఎక్కణ్నించి వస్తోందా అని దాని దిక్కుగా ముందుకు నడిచాడు అతను. ఎదురుగా అక్కడ దేవకన్యలాగా ఉన్న ఒక బెస్తపిల్లని చూశాడు. ‘ఎవరిదానివి? ఎవత్తెవి? ఏం చేద్దామని ఇక్కడున్నావు?’ అంటూ వరసగా ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘నేను బెస్తలదొర దాశరాజు కూతుర్ని. నాన్నగారి ఆజ్ఞ మేరకు యమునానది మీద పడవను నడుపుతూ ఉంటాను’ అని ఆమె జవాబు చెప్పింది. శాంతనుడు ఆమె రూపానికీ సుగంధమోడుతూన్న ఆమె శరీరానికీ ముగ్ధుడై ఆమెను పెళ్లిచేసుకొందామని అనుకొన్నాడు. అనుకోవడమే తడవు, ఆమె తండ్రి దగ్గరికిపోయి ఆ మాటనే చెప్పాడు. ‘ఆడపిల్ల పుట్టగానే ఎవరికో ఒకరికి ఇవ్వవలసినదే అవుతుంది. అందులోనూ మీరేమో సాక్షాత్తూ రాజుగారు. ఇక నాకు కావలసినదేముంటుంది? అయితే, నాకో కోరిక ఉంది. ఆ వరం ఇస్తే, నేను మీకు మా అమ్మాయినిస్తాను’ అన్న దాశరాజు మాటను విని, ‘అది ఇవ్వగలిగినదైతే తప్పకుండా ఇస్తాను; ఇవ్వరానిదైతే మాత్రం ఏమైనా ఇవ్వను’ అని రాజు దృఢంగానే అన్నాడు. ‘నా కూతురికి పుట్టినవాడే మీ రాజ్యానికి యువరాజు కావాలి; మరెవ్వడూ కాకూడదు’ అన్నమాటను విని శాంతనుడు మనసు చిన్నబుచ్చుకొని, ముఖం ముడుచుకొని మారుమాట మాటాడకుండా హస్తినాపురానికి వెళ్లిపోయాడు. ఆ అమ్మాయినే తలచుకొంటూ లోలోపల కుములుతూ ఉండటం చూసి, నాన్న దగ్గరికి చేరాడు దేవవ్రతుడు. అసలు కారణమేమిటా అని గుచ్చి గుచ్చి అడిగాడు. ‘అవునురా అబ్బాయీ నాకు కొంత చింతగానే ఉంది. నువ్వొక్కడివే ఈ వంశానికి మొలకవు. ఆ నువ్వేమో ఎప్పుడూ అస్త్ర శస్త్రాలతో క్రీడిస్తూ యుద్ధాలు చేస్తూ ఉంటావు. నీకేమైనా విపత్తు వస్తే, ఈ కులం ఏంగాను? అవును, నువ్వు ఒక్కడివే వందమంది పుత్రులపెట్టు అన్నమాట నిజమే. అయితే, నేను వృథాగా పెళ్లిచేసుకొందామని అనుకోవటం లేదు. మన వంశం ఎక్కడ లోపిస్తుందోనని మాత్రమే రెండోపెళ్లి చేసుకొందామని అనుకొంటున్నాను. ఒక్క పుత్రుడే ఉండటం అపుత్రత్వంతో సమానమే’ అని ముక్తాయించాడు శాంతనుడు. కానీ అసలు మాట మాత్రం బయటపెట్టలేదు. ఆలోచనాపరుడైన దేవవ్రతుడు తండ్రిగారికి బాగా కావలసిన మంత్రి దగ్గరికి వెళ్లి అసలు విషయాన్ని వాకబు చేశాడు. అతను యోజనగంధి అయిన సత్యవతిని గురించీ ఆమె తండ్రి పెట్టిన షరతు గురించీ చెప్పాడు. ఆమీద కొంతమంది కులపెద్దల్నీ సామంతుల్నీ తీసుకొని దాశరాజు దగ్గరికి వెళ్లాడు దేవవ్రతుడు. వెళ్లి, ‘ఈవిడకు పుట్టినవాడే రాజవుతాడు’ అని రాజులందరి ముందూ దాశరాజుకు మాటిచ్చాడు. ‘నువ్వన్నది బాగుంది కానీ నీ కొడుకులు దీనికి అడ్డం రావచ్చు గదా’ అని మరో మెలిక పెట్టాడు దాశరాజు. దానికి బదులుగా ‘నేను ఈ రోజు నుంచీ బ్రహ్మచారిగానే ఉంటాను’ అని భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు. అప్పణ్నించే దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. సత్యవతిని రథం ఎక్కించుకొని తీసుకొనిపోయి శాంతనుడికి అప్పగించాడు. కొడుకుతో సహా వచ్చిన సత్యవతిని చూడగానే శాంతనుడికి నోటమాట రాలేదు. సంతోషమూ వేసింది, బాధా కలిగింది. ‘నీ ఇష్టం ఉంటేనే గాని నిన్ను మరణం తాకలేదు’ అని కొడుక్కి వరం ఇచ్చాడు. సత్యవతీ శాంతనుల దాంపత్యం ఫలించి మొదట చిత్రాంగదుడనే కొడుకు పుట్టాడు. ఆమీద విచిత్రవీర్యుడనే మరో కొడుకు కూడా పుట్టాడు. రెండోవాడు ఇంకా పసివాడుగా ఉన్నప్పుడే శాంతన మహారాజు చనిపోయాడు. సత్యవతికీ ఆమె తండ్రికీ ఇచ్చిన మాట ప్రకారమే చిత్రాంగదుణ్ణి రాజుగా చేశాడు భీష్ముడు. ఆ చిత్రాంగదుడు మనుషుల్లో తనకు సరిజోడైనవాడు లేడని విర్రవీగేవాడు. ఒక్క మనుషుల్నే కాదు, దేవతల్నీ అసురుల్నీ కూడా ఎదిరించడం మొదలెట్టాడు. దాన్ని సహించలేకపోయాడు అదే పేరున్న ఒక గంధర్వుడు. గంధర్వులు మాయల్లో మేటివాళ్లు కదా! చిత్రాంగద మహారాజును చిత్రాంగదుడనే గంధర్వుడు చంపేశాడు. అయితే ఆ యుద్ధం మాత్రం నిండా మూడేళ్లు కొనసాగింది. మళ్లీ సత్యవతితో మాట్లాడి చిన్నవాడైన విచిత్రవీర్యుణ్ని రాజుగా చేసి, తానే అతనిపేర అన్ని కార్యాలూ నిర్వహించేవాడు భీష్ముడు. దేవవ్రతుడు అచ్చూ మచ్చూ శాంతనుణ్ణే పోలి ఉండేవాడు. అంటే, శాంతను చైతన్యం దేవవ్రతుడిలో ప్రతిబింబమైందన్నమాట. ఈ ప్రతిబింబితమైన చైతన్యం అద్దంలోని బొమ్మలాగా ‘అనిపించే’ చైతన్యం మాత్రమే. అనిపించడాన్ని ‘ఆభాస’ అని అంటారు. తన ఆభాసవిద్యాబాణాలతో అడ్డుకట్ట కట్టి, మహాగంగాప్రవాహమనే జ్ఞానమయమైన తల్లి ప్రకృతిని అతను సన్నగిల్లి పోయేలాగ చేశాడు. దీనివల్ల రెండు రకాల పరిస్థితులు తారసిల్లవచ్చు: ఒకటి, సాపేక్షకతను పుట్టించే ప్రకృతే లేకుండాపోయే పరిస్థితి. రెండోది, ఆభాస చైతన్యానికి ఏ రకంగానూ ప్రభావితం కాని మరో ప్రకృతి ఎదురుగావడం. మొదటి పరిస్థితేమో సృష్టినే ఆపుజేస్తుంది. సృష్టితో తాను ‘చాలా’గా అవుదామనుకొన్న భగవంతుడి కోరిక దీనితో తీరకుండానే ఉండిపోతుంది. అతని కోరిక తీరాలీ అంటే, రెండోది జరగాలి. రెండోదే సృష్టిని ముందుకు నడిపించగలదు. సరిగ్గా అదే సమయంలో నల్లగా ఉండే యమునానది దగ్గర సత్యవత్తుగా తోచే పదార్థమైన మలిన ప్రకృతి ఎదురుపడి, శాంతను చైతన్యాన్ని మోహంలోకి దించింది. ఆభాసచైతన్యం తాలూకు ప్రభావం లేకుండా ఉండటమే, దేవవ్రతుడు భీష్ముడిగా మారి, రాజ్యాధికారాన్ని విడిచిపెట్టి, పెళ్లి చేసుకోనని ఒట్టుపెట్టుకోవడం. సృష్టి అనే చలనచిత్ర రంగానికి సిద్ధంచేసే చిత్రాంగదత్వమే సృష్టికి అంకురం లాంటి ‘మహత్తత్త్వం’. చిత్రం అంటే చూపును ఆకట్టుకొనేది. చూపును ఆకట్టుకొనే చిత్రరంగాన్ని ప్రదానం చేసేదే మహత్తరమైన చిత్రాంగదత్వం. మొదట్లో ప్రకృతికున్న మూడు గుణాలూ, అంటే, జ్ఞానసుఖంతో కలిపే సత్త్వమూ, కర్మలతో సంగాన్ని కల్పించే రజస్సూ, అలసభావాన్నీ నిద్ర ముంపునీ కలగజేసే తమస్సూ అనే మూడూ సరిసమానంగా ఉండటంతో ఏ తేడానూ అవుపించేది కాదు. తేడా ఉంటేనే ఇంతకుముందు పరిస్థితితో ఇప్పటి పరిస్థితిని పోల్చే సాపేక్షత ఏర్పడుతుంది. అదే సృష్టికి నాంది కాగలదు. ఈ గుణాలు కలగలిసి ఎక్కువ తక్కువలు గావడమే సాపేక్షకతకు అంకురం. గుణాల మిశ్రమాన్నే ‘కాలశక్తి’ అంటారు. కాలమంటే గుణాల్లో మార్పును తీసుకొనివచ్చే భావం. చిత్రాంగదుడు చిత్రాంగదుడి చేతిలో మూడేళ్లపాటు పోరాడి చనిపోయాడంటే, ప్రకృతి మూడుగుణాల సమానత్వమూ నశించి క్షోభ కలగడమే. గుణాల కలగలుపునే మహాతత్త్వమనీ చిత్తమనీ అంటారు. ఆ చిత్తం మీద మహాచైతన్య ప్రకాశం పడి ‘నేను వేరుగా ఉన్నాన’ నే విచిత్రమైన వీర్యం ప్రకటితమవుతుంది. ఇదే దివ్యమైన అహంకారం. అహంకార రూపమే అయిన ఆభాస చైతన్యం ఈ దివ్యమైన అహంకారం కోసం అన్ని పనుల్నీ చేస్తూ ఉంటుంది. భీష్ముడు విచిత్రవీర్యుణ్ని సింహాసనమెక్కించి తానే రాజ్యభారాన్నీ పాలనాభారాన్నీ మోయడమంటే ఇదే. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు 9000765972