కృతవర్మ
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 26
మహాభారత యుద్ధం తరువాత కౌరవులవైపు యుద్ధం చేసినవాళ్లల్లో మిగిలినవాళ్లు ముగ్గురు; అశ్వత్థామా కృపాచార్యుడూ కృతవర్మాను. వీళ్లల్లో అశ్వత్థామా కృపాచార్యుడూ కౌరవులు కారు; కృతవర్మేమో యాదవుడు. యాదవు డంటే, శ్రీకృష్ణుడి వైపువాడు. ఇతను భోజ వంశంవాడు గనక భోజుడనీ అంటారు. ఇతని తండ్రి హృదీకుడు. హృదీకుడికి దేవబాహువూ శతధన్వుడూ పుట్టిన తరు వాత కృతవర్మ పుట్టాడు. కుంతి యాదవ స్త్రీ గనక యాదవులు పాండవులకు చుట్టాలు.
యాదవుడయ్యుండీ కృతవర్మ మాత్సర్యం కొద్దీ, దుర్యోధనుడి వైపు యుద్ధం చేశాడు. శల్యుడూ పాండవుల వైపు పోరాడవలసినవాడే గానీ పొగడ్తలకూ మెరమెచ్చులకూ లొంగి, మదం కొద్దీ దుర్యోధనుడి కొమ్ముకాశాడు. ఈ మాత్సర్యానికి మూలం సత్యభామ. సత్యభామ సత్రాజిత్తు కూతురు. ఆమెను కృతవర్మకిచ్చి పెళ్లి చేస్తానని మొదట్లో సత్రాజిత్తు వాగ్దానం చేశాడు. కానీ పరి స్థితులు కలిసిరాక, ఆమెను శ్రీకృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు. కృతవర్మకు తలకొట్టినట్ట యింది.
శిశుపాలుడు కూడా ఇలాగే తనకు భార్య కావలసిన రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడని గగ్గోలు పెట్టాడు. కృష్ణుడిని నానా తిట్లూ తిట్టాడు. దానికి అతను యుద్ధానికి చాలా ముందుగానే తన బతుకునే పోగొట్టుకున్నాడు. కృతవర్మ మాత్రం బయటపడకుండా పగతోనూ ద్వేషంతోనూ రగిలి పోతూ యుద్ధమప్పుడు కృష్ణుడికి వ్యతిరేకి అయిన దుర్యోధనుణ్ని బలపరచడానికి నడుము కట్టాడు. ధర్మా ధర్మాలను తూచకుండా కృష్ణుడితో విరోధం ఒక్కటే మిషగా పెట్టుకొని పాండ వులతో పోరాడడానికే సిద్ధమయ్యాడు.
కృతవర్మ మాత్సర్యానికి మూలమైన సత్యభామ తండ్రి సత్రాజిత్తు. వృష్ణి వంశీ యుడైన నిమ్నుడి కొడుకు. ఇతను సూర్యు డికి భక్తుడూ సఖుడూను. సూర్యుడు సత్రాజిత్తుకు శ్యమంతకమణిని ఇచ్చాడు. అది మెడలో వేసుకొని సూర్యుడిలాగ వెలిగిపోయేవాడు సత్రాజిత్తు. ఒకసారి శ్రీకృష్ణుడు ఆ మణిని ఉగ్రసేన మహారాజుకు ఇస్తే బాగుంటుందని సూచించాడు. అంతటి బంగారాన్నిచ్చే మణి, ప్రజల్లో ఒకడి దగ్గర ఉండడం కన్నా రాజు దగ్గర ఉంటే, దాని లాభాన్ని రాజ్యం లోని ప్రజలందరూ పొందవచ్చునని కృష్ణుడి ఉద్దేశం.
కానీ, డబ్బుమీద వ్యామోహం కొద్దీ సత్రాజిత్తు, కృష్ణుడి ప్రతిపాదనను కాదన్నాడు. ఓసారి, ఆ మణిని మెడలో వేసుకొని ఠీవిగా సత్రా జిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు వేటకెళ్లాడు. ఆ మణి ఎర్రగా మాంసమ్ముక్కలాగ ఉండ డంతో ఒక సింహం ప్రసేనజిత్తునీ అత నెక్కిన గుర్రాన్నీ చంపి, మణిని ఎత్తుకొని పోయింది. ఆ సింహాన్ని జాంబవంతుడనే భల్లూకం చంపి... మణిని గుహలో తన పిల్లల పిల్లలకు ఆటవస్తువుగా వేలాడ దీశాడు. అడిగినప్పుడు ఇవ్వలేదని శ్రీకృష్ణుడే ప్రసేనుణ్ని చంపి, మణిని తీసు కొనిపోయాడని సత్రాజిత్తు అపనిందను మోపాడు.
ఆ నీలాపనిందను పోగొట్టుకో డానికి శ్రీకృష్ణుడు కొంతమందిని వెంట బెట్టుకొని అడవిలోకి వెళ్లాడు. చనిపోయి పడి ఉన్న గుర్రాన్నీ ప్రసేనజిత్తునీ సింహాన్నీ వరుసగా చూసుకుంటూ భల్లూక గుహ దగ్గరికి చేరాడు శ్రీకృష్ణుడు. గుహ లోపలికి పోయి మణిని తీసుకోబోతూంటే, జాంబ వంతుడు వచ్చి, శ్రీకృష్ణుడితో ఇరవై ఎని మిది రోజుల పాటు కుస్తీ పట్టాడు. చివరికి శ్రీకృష్ణుడిలో శ్రీరాముణ్ని చూసి, మణితో బాటు తన కూతురు జాంబవతిని కూడా ఇచ్చి పంపించాడు. బంగారం ఇచ్చే మణే ఇంత అనర్థాన్ని తెస్తుందని సత్రాజిత్తు అనుకోలేదు.
ఈ కథ అంతా మనం వినా యకచవితి వ్రతం చేసేనాడు చదువు కొనేదే. దీని తరవాత జరిగిందే కృతవర్మకీ అతని అన్న శతధన్వుడికీ పైకి చూపించ లేని కోపాన్నీ మాత్సర్యాన్నీ తెచ్చిపెట్టింది. మాత్సర్యంలో అసూయా ఈర్ష్యా మాత్రమే గాక, పగా ద్వేషమూ వెర్రికోపమూ ఆవేశమూ మత్తుతో కూడిన ఉద్రేకమూ ఉన్నాయి. వీటన్నిటికీ ప్రతీకే కృతవర్మ.
కృష్ణుడు మణిని తీసుకొని రాగానే సత్రాజిత్తు, కృష్ణుడి లాంటి అతిశక్తిమంతు డితో వైరం తెచ్చుకున్నానని నొచ్చుకుంటూ దానికి ఏవిధంగా పరిహారం చెల్లించాలా అని ఆలోచించాడు. అంతకుముందు తన కూతురు సత్యభామను నిమ్నుడి కొడుకు కృతవర్మకు ఇచ్చి పెళ్లిచేద్దామనుకొన్నాడు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని పక్కకు పెట్టి, ఆమెను కృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు. దీనితో కృతవర్మ గుండెల్లో కోపం ప్రజ్వరిల్లింది.
అయితే, ఈ కోపాన్ని కృష్ణుడి ముందు అతను చూపించలేడు. దానికి కారణం శ్రీకృష్ణుడి శక్తి అమానుషమైనది కావడమే. అతనంటే వల్లమాలిన భయమే కృత వర్మకి. కానీ కోపమూ దిగమింగరానిదే. అంచేత, అది ద్వేషంగానూ పగగానూ అసూయగానూ మాత్సర్యంగానూ ఈర్ష్య గానూ మారింది. కావాలనుకొన్నదీ, రావాలనుకొన్నదీ పోయినా రాకపోయినా అహంకారం దెబ్బతింటుంది; అసంతృప్తి కలుగుతుంది. సత్యభామ తనకు గానీ తన కుటుంబంలో ఎవరికైనాగానీ భార్య కావల సినది, శ్రీకృష్ణుడి పరమైపోయిందని కృత వర్మకు ఒకటే కుతకుతా దిగులూను.
అవి తీరేవి కావు గనక పగా కక్షా రూపాల్ని దాల్చాయి. పగా ఉద్రేకమూ ఎవరినైనా ధర్మాన్ని మరిచిపోయేలాగ చేస్తాయి. ఆత్మ వికాసానికి పనికివచ్చే పనుల్ని మరిచి పోయి, తాను పోగొట్టుకున్నది తనకు ఎలా రాగలదా అనే తీరిక లేని ఆలోచన లతో తన బతుకునే నరకం చేసుకుం టాడు, ఈ మాత్సర్యానికి గురి అయిన వాడు కృతవర్మ. ఆ మాత్సర్యాన్నే కవచంగా ధరించి, కృష్ణుడికి ఎదురుగా యుద్ధం చేద్దామని నిశ్చయించుకున్నాడు.
లక్కింటిలో పాండవులు కాలిపోయా రన్న మాటను విని, శ్రీకృష్ణుడు, తనకు వాళ్లు పోలేదని తెలిసినప్పటికీ తెలియ నట్టుగా, భీష్ముడూ ధృతరాష్ట్రుడూ గాంధారీ మొదలైనవాళ్లతో కలిసి ‘అయ్యో, పాపం! అందరూ ఒక్కసారిగా పోవడం దురదృష్టకరం’ అని చెప్పి ధర్మోదకాల్ని ఇవ్వడానికి బలరాముడితో సహా హస్తినా పురానికి వెళ్లాడు. ఇదే అదను అని కృత వర్మా అక్రూరుడూ కలిసి శతధన్వుణ్ని ‘మనను మోసం చేసిన సత్రాజిత్తును అతని తమ్ముడి దారిపట్టేలాగ ఎందుకు చేయకూడద’ంటూ ప్రేరేపించారు.
ఆ రాత్రి అతను ఆవేశంతో సత్రాజిత్తును చంపేసి, స్యమంతకమణిని తీసుకొచ్చి వచ్చాడు. సత్యభామ తన తండ్రిని చంపే శారని కృష్ణుడికి వర్తమానం పంపింది. బలరామకృష్ణులు హుటాహుటిన వచ్చి, శతధన్వుడి వెంటబడ్డారు. వాళ్లు వస్తున్నా రని తెలిసి స్యమంతకమణిని అక్రూరుడి దగ్గర వదిలి, శతధన్వుడు గుర్రం మీద పారిపోయాడు. కృష్ణుడు అతన్ని వెంబడించి చంపేశాడు.
సత్యభామ దక్కకపోవడమూ తన అన్నను చంపడమూ కృతవర్మలో పగనీ అసూయనీ ఇబ్బడి ముబ్బడిగా చేశాయి. అతను, తనవాళ్లందరూ ధర్మరాజువైపు చేరినా, తాను మటుకు దుర్యోధనుడి పక్షాన పోరాడటానికి నిశ్చయించు కున్నాడు. ఈ నిశ్చయం వెనక ఉన్న కారణం కృష్ణుడంటే మాత్సర్యం తప్ప మరొకటి కాదు. పగకూ అసూయకూ వెర్రికోపానికీ మాత్సర్యానికీ కళ్లు పచ్చ బారి అన్నీ పచ్చగానే అవుపిస్తాయి; అసలైన రూపం వాటికి అవుపించదు.
పాండవులంటే ప్రత్యేకమైన ద్వేషమేమీ లేదు కృతవర్మకు; తతిమ్మా యాదవులన్నా పగా లేదు. కృష్ణుణ్ని వ్యతి రేకించడమే ధ్యేయంగా అధర్మపక్షాన చేరాడు. జయద్రథుణ్ని రక్షించడం కోసం ద్రోణుడి వెనక నిలిచాడు. అర్జునుడు శకట వ్యూహంలో ముఖాన ఉన్న ద్రోణుడితో కొంతసేపు యుద్ధం చేసి, అనవసరంగా కాలహరణం జరుగుతోందని శ్రీకృష్ణుడు హెచ్చరించడంతో గురువుకు ప్రదక్షిణం చేస్తూ అతన్ని దాటి కృతవర్మను ఎదిరిం చాడు.
‘కృతవర్మ మీద దయ చూపించ వలసిన పనిలేదు; సంబంధీకుడని ఉపేక్షించకుండా వీణ్ని చంపెయ్యి’ అని కృష్ణుడు అర్జునుడితో అన్నాడు. అయినా అర్జునుడు సంబంధాన్ని దృష్టిలో పెట్టు కొని, కృతవర్మ దొరికినా చంపకుండా మూర్ఛపరిచి, ముందుకు వెళ్లిపోయాడు. సాత్యకి కూడా తన గురువు అర్జునుడిలాగే ద్రోణుణ్ని తప్పించుకొని పోతూ ఉంటే, కృతవర్మ అతన్ని నిలవరించాడు. సాత్యకి భోజుడి సారథి తల నరకడంతో అతని గుర్రాలు అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి.
అప్పుడు తానే తన రథాశ్వాలను అదుపులో పెట్టుకుంటూ ఏ భయమూ లేకుండా తిరిగి ఎదిరించడానికి వచ్చే లోపులో సాత్యకి ముందుకు వెళ్లిపో యాడు. అప్పుడక్కడకు వచ్చిన భీమ సేనుణ్ని ఎదుర్కొన్నాడు కృతవర్మ. అతని పరాక్రమం ముందు పాండవులు ముందుకు సాగలేకపోయారు. భీముడి వింటినీ ధ్వజాన్నీ ముక్కలు చేసి అతన్ని కృతవర్మ రథం నుంచి కిందికి పడిపోయే లాగ చేశాడు. అప్పుడు ధర్మరాజూ మొదలైన మహారథులు భోజుణ్ని, అంటే, కృతవర్మను బాణాలతో పీడించడం మొదలుపెట్టారు.
ఇంతలో భీముడికి మెలకువ వచ్చి, భోజుడి వక్షస్సు మీద ఐదు బాణాలతో దాడిచేసి దెబ్బతీశాడు. పక్కనున్న శిఖండి కూడా విజృంభించాడు. కృతవర్మ శిఖండి వింటిని విరగ్గొట్టాడు. శిఖండి కోపంతో కత్తీ డాలూ తీసుకొని విరుచుకుపడ్డాడు. తన డాలును గిరగిరా తిప్పుతూ తనను కాపాడుకుంటూ తన కత్తిని భోజుడి రథం మీదకు విసిరాడు, అది కృతవర్మ ధనుస్సును ముక్కలు చేసింది. మరో విల్లు తీసుకొని అతను శిఖండిని ముప్పుతిప్పలు పెట్టాడు. అతను రథం మీద చతికిలపడిపోయాడు. ఇదంతా కృతవర్మ వీరోచిత పోరాటమే.
సౌప్తిక పర్వంలో కృతవర్మ కసాయి వాడుగా అవుపిస్తాడు. అప్పుడు అశ్వత్థామకు బాసటగా నిలిచిన ఇద్దరిలో కృతవర్మ ఒకడు; రెండోవాడు కృపాచార్యుడు. అశ్వత్థామ పాంచాలుర శిబిరంలోకి పోయి, నిద్రపోతూన్న ధృష్టద్యుమ్నుణ్నీ శిఖండినీ ద్రౌపదేయుల్నీ ఊచకోత కోస్తూ ఉంటే, తతిమ్మావాళ్లు కంగారుతో కాందిశీకులై అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉంటే, శిబిర ద్వారంలో కసాయివాళ్లలాగ నిలుచున్న కృతవర్మా కృపాచార్యుడూ వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేశారు.
శిబిరం నుంచి వచ్చిన ఒక్క క్షత్రియుడూ వీళ్ల చేతుల్లోంచి తప్పించుకోలేదు. అశ్వత్థామకు ఇంకా ప్రీతిని కలిగిద్దామని వాళ్లున్న దిక్కును మినహాయించి తతిమ్మా మూడు దిక్కుల్లోనూ నిప్పంటించారు ఈ ప్రబుద్ధులిద్దరూను.
తాము చేసిన ఈ ‘గొప్ప’ కార్యాన్ని చెప్పడానికి సగం ప్రాణంతో గిలగిలా కొట్టుకొంటూన్న దుర్యోధనుడి దగ్గరికి వెళ్లారు ఈ ముగ్గురూను.
యుద్ధం తరవాత పాండవుల వైపు ఏడుగురూ ధార్తరాష్ట్రుల వైపు ముగ్గురూ మిగిలారు: పాండవులైదుగురూ శ్రీకృష్ణుడూ సాత్యకీ వెరసి ఏడుగురు; కృపుడూ కృతవర్మా అశ్వత్థామా వెరసి ముగ్గురు ఇటువైపు. ‘అశ్వత్థామా! నువ్వు ఈ కృపకృత వర్మలతో కలిసి చేసిన ఈ కార్యం భీష్ముడు గానీ మీ తండ్రిగానీ కర్ణుడుగానీ చేయ లేదు’ అని సంతోషిస్తూ దుర్యోధనుడు తుదిశ్వాస విడిచాడు. కృష్ణుడికి వ్యతి రేకంగా యుద్ధం చేసి కృతవర్మ సాధించింది ఇంతే. తరవాత మౌసల పర్వంలో యాదవులందరితో బాటూ కృతవర్మా పోయాడు.
- డా॥ముంజులూరి నరసింహారావు