తిరువనంతపురం: అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు.. మహిళా ఎమ్మెల్యేపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో కేరళ అసెంబ్లీ అట్టుడుకి పోతోంది. సభకు క్షమాపణలు చెప్పి.. వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తూ కార్యకలాపాలకు అడ్డుతగులుతోంది ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్. అయినా ఎల్డీఎఫ్ కూటమి ప్రభుత్వం మాత్రం తగ్గట్లేదు.
కేరళ అసెంబ్లీని మహిళలను వేధించే కౌరవ సభగా మార్చొద్దంటూ వేడుకున్నారు ప్రతిపక్ష నేత ఎం సతీశన్. ప్రోగ్రెసివ్ స్టేట్‌గా చెప్పుకునే కేరళలో.. విధవత్వాన్ని ఆమె తలరాతగా నిర్ధారించే స్థితికి రావడం దురదృష్ణకరమని వ్యాఖ్యానించారాయన. గత వారం పోలీస్ శాఖ నిధుల విజ్ఞప్తుల విషయంలో అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా.. ఎమ్మెల్యే కేకే రేమాను రెచ్చగొట్టేలా సీపీఐ(ఎం) ఎమ్మెల్యే మణి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఒక గొప్పావిడ సీఎం పినరయి విజయ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఆమె తన భర్తను పొగొట్టుకుని విధవ అయ్యింది. అది ఆమె తలరాత. మేమేం దానికి బాధ్యులం కాదు’’ అంటూ ఎమ్మెల్యే మణి వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సభ ఒక్కసారిగా భగ్గుమంది. మణి వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం చేస్తూ సభ కార్యాకలాపాలను అడ్డుకున్నాయి ప్రతిపక్షాలు. ‘‘మణిని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని కోరాం. ఆపై సీఎం పినరయి విజయన్‌ను జోక్యం చేసుకోమని అడిగాం. ఈ రెండూ చేయలేదు. ఇది నియమసభ. దీన్నొక మహిళలను వేధించే దుర్యోధనులు, దుశ్వాసనులకు నెలవైన కౌరవ సభగా మార్చొద్దు’’ అంటూ ఎమ్మెల్యే సతీశన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మణి వ్యాఖ్యలను పరిశీలిస్తామని డిప్యూటీ స్పీకర్ చిట్టాయమ్ గోపకుమార్ హామీ ఇవ్వడంతో ప్రతిపక్షం కాస్త శాంతించింది. అయితే సోమవారం మహిళా కాంగ్రెస్ నిరసనల్లో భాగంగా.. మణి ముఖాన్ని చింపాజీ కటౌట్‌తో ప్రదర్శించి నిరసన వ్యక్తం చేసింది. కేరళ కాంగ్రెస్ ఈ చర్యను సమర్థించుకుంది.
ఇక తన భర్తను చంపినా.. ఇంకా పగతో రగిలిపోతూనే ఉన్నారంటూ ఎమ్మెల్యే రేమా సైతం మణి కామెంట్లపై మండిపడ్డారు. కొన్నేళ్ల కిందట.. సీపీఐ(ఎం) రెబల్ టీపీ చంద్రశేఖరన్‌ను పార్టీ వెలివేసింది. ఆ తర్వాత రెవల్యూషనరీ మార్కిస్ట్ పార్టీని(RMPI) స్థాపించారు. ఆయన 2012 మే 4వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. ఆ కేసులో సీపీఎం యాక్టివిస్టులను అరెస్ట్ చేసి శిక్షించారు. అప్పటి నుంచి పార్టీ బాధ్యతలను చూసుకుంటూ.. సీపీఐ(ఎం)పై, సీఎం విజయన్‌పైనా వీలుచిక్కినప్పుడల్లా విరుకుపడుతున్నారు కేకే రేమా. ప్రస్తుతం ఆమె వడకారా నియోజకవర్గపు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment