పాండురాజు | panduraj story | Sakshi
Sakshi News home page

పాండురాజు

Published Sun, Jul 5 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

పాండురాజు

పాండురాజు

ఐదోవేదం: మహాభారత పాత్రలు - 7
అంబాలిక వ్యాసుడి విరూపాన్ని చూసి బెదిరిపోయి పాలిపోయినట్టయింది గనకనే పాలిపోయిన తెల్లని ఒంటితో పుట్టిన కొడుక్కి ‘పాండు’ (అంటే, తెల్లవాడు) అని పేరుపెట్టారు. రెండోవాడైనా, అన్న ధృతరాష్ట్రుడి గుడ్డితనం కారణంగా పాండుడే రాజయ్యాడు. క్షాత్ర విద్యలన్నీ క్షుణ్ణంగా నేర్చుకొన్నాడు. స్వయంవరంలో కుంతిని పెళ్లి చేసుకొన్నాడు. భీష్ముడు మద్రరాజైన శల్యుడి దగ్గరికి వెళ్లి, అతని చెల్లెలు మాద్రిని తెచ్చి, పాండుకి రెండో భార్యగా చేశాడు. ఒక నెలపాటు ఉన్నాడో లేదో పాండురాజు దిగ్విజయానికి వెళ్లాడు.

తిరిగి వచ్చిన తరువాత భార్యలిద్దరితోనూ వనవిహారం చేస్తూ ఉండేవాడు. ఓ రోజున వేటతమకంలో కామక్రీడలో ఉన్న జింకల్ని బాణాలతో కొట్టాడు. అవి నేలకొరిగాయి. రామాయణంలో కువకువలాడుతూ కామమోహితాలై ఉన్న క్రౌంచపక్షుల జంటలో ఒకదాన్ని వేటగాడు కొట్టినట్టుగా ఇక్కడ కూడా కామమోహితాలై ఉన్న జింకల మీద పాండురాజు ప్రహారం చేశాడు. ఆ జింకలు నిజానికి మృగాలు కావు; మృగ రూపంలో ఉన్న మునిదంపతులు. కిందముడనే ఆ ముని మహాతపస్సంపన్నుడు గనక మానుష రూపంలో భార్యతో సంభోగించడానికి కొద్దిగా సిగ్గువేసింది.

అందుకనే మృగరూపాన్ని ధరించారు దంపతులిద్దరూను. జంతువులు మైథున క్రియలో ఉన్నప్పుడు ఎంతటి క్రూరుడైన వేటగాడైనా చంపడానికి తటపటాయిస్తాడు. కానీ బుద్ధిమంతుడే అయినా పాండురాజు ప్రారబ్ధానికి లోబడి ప్రాణాంతకమైన బాణాల్ని వేశాడు. కిందముడు చనిపోతూ ‘నువ్వు కూడా స్త్రీ సుఖానికి ఉపక్రమిస్తే చచ్చిపోతావు’ అని శపించాడు. పాండురాజుకి వైరాగ్యం పుట్టుకొచ్చింది. సన్యాసిగా ఉందామని పెళ్లాలను రాజధానికి వెళ్లిపోమన్నాడు. కానీ వాళ్లు కూడా అతనితో పాటే ఉంటామనడంతో వానప్రస్థుడిగా ఆ వనంలోనే తపస్సూ ధ్యానమూ చేసుకొంటూ ఉండిపోయాడు.

ఆభరణాలనూ ఖరీదైన బట్టల్నీ అక్కడున్న బ్రాహ్మణులకు ఇచ్చేశాడు. ‘పాండురాజు వానప్రస్థాశ్రమం తీసుకొన్నాడ’న్న వార్తనూ, రాజధనాన్నీ... హస్తినాపురానికి చేరవేయమని సేవకులందర్నీ పంపించేశాడు. ఆ తర్వాత ఆ వనం నుంచి గంధ మాదన పర్వతం మీదుగా శతశృంగ పర్వతానికి చేరుకొని అక్కడి తాపసులతో కలసి తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. కొంతకాలంలోనే తపస్సు తీవ్రంగా చేసి బ్రహ్మర్షులతో సమానుడయ్యాడు.
 
ఓసారి అక్కడి మహర్షులందరూ బ్రహ్మలోకంలో జరగబోతూన్న దేవ రుషి పితృ మహాత్ముల సభను చూడడానికి బయలుదేరారు. ‘నేనూ వస్తాన’ంటూ పాండురాజు కుంతీమాద్రులతో సహా కొండల ఎగుడుదిగుడు దారుల మీదుగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొంతదూరం వెళ్లిన తరువాత ‘ఇక ఈ పైన గాలీ, సిద్ధులైన మహర్షులూ మాత్రమే వెళ్లగలరు. ఈ కోమలులు ఈ దారుల్లోని బాధల్ని సహించలేరు. అందుచేత మీరు ఇక పైన రాకండి’ అని మహర్షులన్నారు.
 
‘అవును, సంతానం లేనివాళ్లకు స్వర్గద్వారం తెరచి ఉండదు. ప్రతి మనిషికీ నాలుగు రుణాలుంటాయి. పూర్వీకుల విజ్ఞానమూ సంస్కారాలే ఇప్పటి మనిషికి వెలుగును చూపిస్తూ ఉంటాయి. కనుక, ఆ పూర్వీకుల, అంటే, పితృదేవతల రుణం తీర్చుకోవాలి. వాళ్ల వర్ధంతుల నాడు వాళ్లు మనకిచ్చిన సంస్కారాలను నెమరు వేసుకోవాలి; సంతానాన్ని పొంది, ఆ సంస్కారాల్ని కింది తరాలవాళ్లకు చేరవేస్తూ సంప్రదాయ పరంపరను అవిచ్ఛిన్నంగా సాగేలాగ చూడాలి.

దేవతలనుంచి ఆ వికాసాన్ని పుణికిపుచ్చుకోవడానికి అంతస్సులో ప్రాణయజ్ఞం ద్వారా లోపలున్న దివ్యశక్తులకు ప్రాణశక్తితో సంతర్పణ చేస్తూ ఉండాలి. అదే దేవతల రుణాన్ని తీర్చుకొనే తీరు. రుషులు మనను ఉద్ధరించి వికసింపజేసే శాస్త్రాలనూ మంత్రాలనూ ప్రసాదించారు. వాటిని స్వాధ్యాయం ద్వారానూ, అంటే, వినడమూ తలపోయడమూ తదేకంగా అదే ధ్యాసలో ఉండటం ద్వారానూ, తపస్సు ద్వారానూ అనుభవంలోకి తెచ్చుకోవడమే రుషిరుణం తీర్చుకోవడమంటే.

తోటి మనుషుల ఆర్తినీ ఆకలినీ తీర్చడమే మనకు వర్తమాన కాలంలోని మనుషుల రుణం తీర్చుకోవడానికి మార్గం. ఈ నాలుగింటిలోనూ ప్రాణయజ్ఞమూ తపస్సూ ప్రజాపాలనా అనేవాటితో నాకు మూడు రుణాలు తీరాయి గానీ, సంతానం ద్వారా పూర్వీకుల సంస్కారాల్ని విస్తరింపజేసే రుణం మాత్రం తీరలేదు. ఏవిధంగానైతే మా నాన్నగారి క్షేత్రరూపమైన మా అమ్మకు వ్యాసమహర్షి ద్వారా నేను పుట్టానో, అదేవిధంగా నా ఈ కుంతీమాద్రిరూప క్షేత్రాల్లో ఉత్తమ పురుషుల ద్వారా సంతానం కలిగే అవకాశముందేమో గదా అనిపిస్తూ ఉంటుంది’ అని పాండురాజంటే దానికి జవాబుగా ఆ రుషులు ‘నీకు దేవతలతో సాటి అయిన సంతానం కలుగుతుంది. సంతానం లేదు లేదు అని విలపించడం గాదు నువ్వు చేయవలసినది, ఏదైతే నీకు కలగాలో దాన్ని ఫలింపజేయడానికి గాఢమైన ప్రయత్నం చేయాలి’ అని చెప్పి వాళ్లు ముందుకు సాగిపోయారు.
 
పాండురాజు ఇక ఆ ప్రయత్నానికి శ్రీకారం చుట్టడానికి కుంతితో ఏకాంతంలో ఆ విషయాన్ని కదిపాడు: ‘ఏ మహానుభావుడి ద్వారానైనా నాకు సంతానం కలిగేలాగ నువ్వు చేయాలి కుంతీ!’ అని చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థించాడు. అప్పుడు కుంతి తనకు కుంతిభోజుడింట్లో ఉన్నప్పుడు దూర్వాస మహర్షి ఇచ్చిన వరం వల్ల ఏ దేవతనైనా పిలవగల శక్తి అబ్బిందని చెప్పింది. ‘అలా అయితే, ఆయా దేవతల ద్వారా పుత్రుల్ని పొందవచ్చు గదా’ అని పాండురాజు అందుకొన్నాడు.

‘అంచేత, ఈ రోజునే ఆ ప్రయత్నాన్ని చెయ్యి కుంతీ! ముందస్తుగా ధర్మదేవతను పిలు. ధర్ముడి వల్ల కలిగే పుత్రుడి  మనస్సు ఎప్పుడూ అధర్మం దిక్కుగా వంగదు. అతను కురువంశీయుల్లో కల్లా గొప్ప ధర్మాత్ముడవుతాడు’.
 
కుంతి ధర్ముణ్ని సంతానం కోసమని ఆహ్వానించింది. మంత్ర బలంతో యోగ మూర్తి రూపంలో ధర్ముడు వచ్చి కుంతికి పుత్రుణ్ని ప్రసాదించాడు. ఆకాశవాణి అతనికి యుధిష్ఠిరుడని పేరుపెట్టింది. ఆ మీద పాండురాజు ‘క్షత్రియులకు బలమే ముఖ్యం గనక నువ్వు మహాబలుడైన వాయుదేవుణ్ని ఆహ్వానించి అతి బలవంతుడైన పుత్రుణ్ని కను’ అని కుంతిని కోరాడు. వాయువు వల్ల ఆవిధంగా భీముడు పుట్టాడు. సరిగ్గా భీముడు పుట్టినరోజునే అక్కడ గాంధారికి దుర్యోధనుడు పుట్టాడు. గాంధారిలోంచి ఊడిపడిన మాంసపిండాన్ని విడదీసి రెండేళ్లు జాగర్తగా పెంచగా, దుర్యోధనుడూ దుశ్శాసనుడూ మొదలైన వందమంది కొడుకులూ దుస్సల అనే కుతురూ పుట్టారు. ఇక్కడ కుంతికి దివ్యశక్తుల వల్ల ఏడాది ఏడాదికీ వరుసగా పిల్లలు పుట్టారు.
 
ఆ మీద దేవతలకు రాజైన ఇంద్రుణ్ని తపస్సుతో సంతోషపెట్టి, మానుషుల్నీ అమానుషుల్నీ కూడా యుద్ధంలో ఎదిరించి నాశనం చేయగలిగే మహావీరుణ్ని పొందాలని పాండురాజు కోరుకొన్నాడు. ఇంద్రుడు ప్రసన్నుడయ్యాడు. కుంతి ఇంద్రుణ్ని పిలిచింది; అర్జునుడు పుట్టాడు; ఆకాశంలో దుందుభులు మోగాయి. పాండురాజుకు పుత్ర ప్రలోభం పెరిగిపోయింది. అయితే అది ధర్మవిరుద్ధం కాబట్టి కుంతి ఇక వద్దంటూ వారించింది.
 
సవతికి సంతానం కలగ్గానే మాద్రికి సంతాపం కలిగింది. మొగుడితో ‘నేను స్వయంగా సవతిని అడగలేను. మీరు కుంతికి చెప్పి ఆ మంత్రం ద్వారా నాక్కూడా పిల్లలు కలిగేలాగ చేస్తే నా సంతాపం తీరడమే గాక మీ క్కూడా హితం జరుగుతుంది’ అంది. కుంతి తన మంత్రాన్ని మాద్రి ద్వారా ఫలింపజేసింది. నకుల సహదేవులు పుట్టారు.

అందగాళ్లైన తన ఐదుగురు కొడుకుల్నీ చూసుకొంటూ ఆ పర్వతం మీద ప్రసన్నంగా నివసిస్తూ ఉన్నాడు పాండురాజు. ఓసారి వసంత రుతువులో వనమంతా పూలతో విరబూసి సర్వభూతాలకూ సమ్మోహనంగా తయారైంది. పిల్లల్ని చూసుకొంటూన్న కుంతి... పాండురాజు, మాద్రీ కలిసి వనంలో సంచారానికి వెళ్లడాన్ని గమనించలేదు. మాద్రిని చూస్తూ ఉంటే, పరిసరాల మహాత్మ్యం వల్ల, వనంలో దావాగ్ని పుట్టి పెరిగినట్టు, పాండురాజులో కామాగ్ని ఒక్కసారిగా భగ్గుమంది.

కిందముడు పెట్టిన శాపం గుర్తుకు రాలేదు.  మాద్రి ‘వద్దు వద్దు’ అంటున్నా వినకుండా, ఇక తన జీవితం అంతమైపోవాలన్నట్టుగా, మన్మథుడికి వశీభూతుడై బలవంతంగా ఆవిణ్ని వాటేసుకొన్నాడు. అంతే, అతను నిర్జీవుడైపోయాడు. మాద్రి, తన వల్లనే ఈ అఘాయిత్యం జరిగిందని, అతనితో పాటే చితిలో కాలిపోయింది. పిల్లలు తండ్రిలేని పిల్లలైపోయారు. అక్కడి రుషులు కుంతినీ పిల్లల్నీ హస్తినాపురానికి తీసుకువచ్చి ధృతరాష్ట్రుడికి అప్పగించారు.
 
పాండురాజు చనిపోగానే అతని ప్రభావం అంతటితో ముగిసిపోలేదు. అతనివల్లనే మహాభారత యుద్ధానికి బీజం కూడా పడింది. భూలోకానికి బయలుదేరుతూన్న నారదుణ్ని ఖాండవ ప్రస్థంలో ఉన్న యుధిష్ఠిరుడికి ఓ మాట చెప్పమని ప్రార్థించాడు: ‘నువ్వు నీ తమ్ముళ్ల సాయంతో రాజులందర్నీ జయించగల సమర్థుడివి. దిగ్విజయుడివై నువ్వు రాజసూయ యాగాన్ని చేశావంటే ఇక్కడ ఈ ఇంద్రసభలో మహదానందంగా చాలాకాలం ఉండగలుగుతాను’ అని. నారదుడు ఈ మాట చెబుతూ ‘ఈ యాగంలో చాలా విఘ్నాలు వచ్చే అవకాశం ఉంది.

అంతేగాదు. భూమ్మీద పెద్ద ప్రపంచ యుద్ధం జరిగి క్షత్రియులు చాలామంది నాశనమైపోతారు కూడాను. ఈ దృష్ట్యా నువ్వు ఆలోచించి ఏది క్షేమమో ఆ పనిని చెయ్యి. జాగర్తగా ఉంటూ తెలివీ బలమూ కృషీ శ్రమలతో పనుల్ని చేసే నాలుగు రకాల ప్రజల సంరక్షణమూ ఎలా జరుగుతుందో అలాగ చెయ్యి’ అని చెప్పి చక్కాపోయాడు. నాన్నగారికి స్వర్గ సౌఖ్యం కలకాలమూ ఉండేలాగ చేయడం కోసం యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేయటానికి పూనుకోవలసి వచ్చింది. అంటే, యుద్ధానికి తెరతీయవలసి వచ్చింది.                                   
- డాక్టర్ ముంజులూరి నరసింహారావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement