కీచకుడు | Keechakudu | Sakshi
Sakshi News home page

కీచకుడు

Published Sun, Dec 27 2015 3:00 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

కీచకుడు

కీచకుడు

ఐదోవేదం : మహాభారత పాత్రలు - 29
కీచకుడు విరాటరాజు భార్య సుధేష్ణకు తమ్ముడు. ఆ దేశంలో బావమరిది కీచకుడిదే పైచేయి. కీచకుడు సూత పుత్రుడు. ఇతను మొదట్లో విరాటరాజుకి రథసారథే. ఆ మీద తన బలప్రాబల్యం కొద్దీ సేనాపతేగాదు, పరోక్షంగా మత్స్య రాజ్యాన్ని ఏలేవాడిగా కూడా తనను తాను అనుకునేవాడు. విరాటరాజు కూడా అతని దుందుడుకుతనాన్ని గానీ విర్రవీగుణ్ని గానీ తప్పు పట్టేవాడు కాడు. ‘చీకయతే’ అనే క్రియారూపానికి సహించడం, ఓర్పుగా ఉండడం, అదు పులో ఉండడం, గెలవడం, ఓడించడం మొదలైన అర్థాలున్నాయి.

దీన్ని తిరగేస్తే, అంటే, ‘క’కారానికున్న అకారాన్ని ‘చ’కారానికీ ‘చ’కారానికున్న ‘ఈ’కారాన్ని ‘క’కారానికీ బదిలీ చేసి, ఆ రెండక్షరాల్నీ తిరగేస్తే, ‘కీచయతే’ అనే రూపమేర్పడు తుంది. తిరగదిప్పడం వల్ల, సహించక పోవడమూ అదుపులో పెట్టుకోక పోవ డమూ గెలవలేకపోవడమూ ఓడిపోవ డమూ అనే విప రీతార్థాలు ఈ ‘కీచక’ శబ్దానికి సంక్రమిస్తాయి.

అతడూ అటు వంటివాడే. ఆవేశం వస్తే అదుపులో ఉండదు; పైగా అతడు అమర్యాదకమైన కామావేశానికి పెట్టింది పేరు. దాన్ని ఓర్చుకోలేకనే ఇతను తన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. కీచకమంటే వెదురుబొంగని కూడా అర్థం ఉంది. వెదురు గడకి కణుపులు ఉంటాయి. అలాగ కణుపులతో ఉండేది మన శరీరంలోని వెన్నుదండం.

వెన్ను దండం కింది భాగంలో ఉండే కుండలినీ శక్తిని లైంగిక నాడుల్నుంచి తప్పించి, పైకి తలతట్టుగా నడిపిస్తే మన చైతన్యం విస్త రించగలదు. కీచకుడు ప్రాణశక్తిని ఇంద్రి యాల ద్వారా అడ్డూ అదుపూ లేకుండా బయటికి పోనిస్తూ, ఇప్పటికే దిగజారి పోయి ఉన్న మానుష చైతన్యాన్ని ఇంకా నీచాతి నీచంగా చేస్తూ ప్రవర్తిస్తాడు.
 వనవాసం పన్నెండేళ్లూ గడిచిన మీదట, పదమూడో ఏడాదిని, అంటే, ఎవరికీ తెలియకుండా ఉండవలసిన అజ్ఞాతవాసాన్ని పాండవులు విరాటుడి కొలువులో గడిపారు.

ధర్మరాజు కంకు భట్టుగా రాజుగారికి సహాయకుడు అయ్యాడు; భీముడు వలలుడై వంట ఇంటిని చక్కబెట్టేవాడు; అర్జునుడు ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఒక విధంగా వరంగా వాడుకుంటూ పేడిగా అయి బృహన్నల రూపంలో విరాటరాజు కూతురు ఉత్తరకి సంగీత నాట్యాలను నేర్పేవాడు; నకులుడు గ్రంథికుడనే పేరుతో గుర్రాల బాగోగుల్ని చూసేవాడు; సహదేవుడు తంతిపాలుడనే పేరుతో ఆలకొట్టాల మంచీ చెడుల్ని చూసే గోపాలుడయ్యాడు; ద్రౌపది కేశ శృంగా రాన్నీ శరీరాలకు పూసుకొనే లేపనాల్ని తయారుచేసే నేర్పరిగా మాలిని అనే పేరుతో సైరంధ్రిగా సుదేష్ణ దగ్గర చేరింది.
 
అజ్ఞాతవాసం పూర్తి కావడానికి మరి కొన్ని రోజులే మిగిలిన తరుణంలో కీచకుడు విరాట నగరంలో ఊడి పడ్డాడు. ద్రౌపదిని చూశాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ద్రౌపదితో మాట కలిపాడు: ‘నా భార్యల నందర్నీ నీకోసం వదిలేస్తాను. నీకు దాసుణ్ణవుతాను’ అంటూ తన కోరికను బహిరంగపరిచాడు. ‘సూత పుత్రుడా! నా జాతి చాలా హీనమైంది. నాతో నీకు పొత్తు తగదు. అందులోనూ పరుడి భార్యను కోరుకోవడం కూడని పని.

దానివల్ల నీకు అపకీర్తి రావడమే గాదు, భయం కూడా పట్టుకుంటుంది’ అని నచ్చజెప్పి తప్పించుకోబోయింది. కానీ కామార్తుడికి భయమెక్కడుంటుంది? ‘భూమ్మీద నాతో సమానుడైన సొగసరి గానీ మగసిరి గలవాడు గానీ లేడు. నా బలమూ అనితరమైనది. అయినా ఈ దాసీత్వం నీలాంటి మహా అందగత్తెకు తగదు. నాకు స్వామినివై అందరిమీదా అధికారాన్ని ప్రదర్శించదగినదానివి’ అంటూ వాగుతూన్న అతగాడితో ద్రౌపది ‘నన్ను ఐదుగురు భీమగంధర్వులు కాపా డుతూ ఉంటారు. వాళ్లు నా భర్తలు. నిన్ను చంపేస్తారు’ అంటుంది.

అయినా ఆమెను వశం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతూ అక్క దగ్గరికి చేరాడు కీచకుడు: ‘నువ్వేదో ఒక ఉపాయాన్ని పన్ని సైరంధ్రిని నా దగ్గరికి పంపాలి. లేకపోతే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి’ అంటూ మొరపెట్టుకున్నాడు. సుదేష్ణ మెత్తబడి, ‘సరే, నీ దగ్గరికి సురను తెమ్మని పంపుతాను. అప్పుడు ఒప్పిం చుకో’ అని అనునయించి పంపింది.
 సుధేష్ణ సైరంధ్రిని కీచకుడి విడిదికి పోయి మదిరను తెమ్మంది. ‘నేను వెళ్లను. ఆ

 సిగ్గులేనివాడు సతాయిస్తాడు. ఎంత మందో సేవకులుండగా నన్నే ఎందుకని పంపించడం?’ అంది ద్రౌపది. తమ్ముడి ముచ్చటను తీర్చడానికి రాజీపడిన ఆ అక్క ‘నేను పంపించానంటే హింసించడు’ వెళ్లి రమ్మనమని బలవంతపెట్టింది. వెళ్లక తప్పలేదు ద్రౌపదికి. వెళ్తూ కర్మసాక్షి అయిన సూర్యుణ్ని ధ్యానించి, రక్షించ మంటూ మొరపెట్టుకుంది. అక్షయ పాత్ర నిచ్చి అడవిలో ఉన్నన్నాళ్లూ కాపాడిన సూర్యుడు, ఇప్పుడావిడ శీలాన్ని కాపాడ్డా నికి ఒక రాక్షసుణ్ని నియోగించాడు.
 
భయపడుతూన్న లేడిలాగ వెళ్లింది. వెళ్లడమే తడవు కీచకుడు వెంటబడ్డాడు. ఆవిడ కుడిచేతిని పట్టుకున్నాడు. ఆవిడ చేతిని విదిలించేసరికి, పెచైరగు పట్టు కున్నాడు. అప్పుడావిడ రెండు చేతులతో ఒక తోపు తోసేసరికి, వేళ్లూడిన చెట్టులాగ కింద పడిపోయాడు. అదే అదనని ఆవిడ పరిగెత్తుకుంటూ రాజసభలోకి వచ్చింది, తనకు అండగా విరాటరాజూ ధర్మరాజూ ఉంటారనే గొప్ప ధైర్యంతో. కానీ అక్కడా చుక్కే ఎదురయ్యింది.

కీచకుడు రాజంటే ఏ ఖాతరూ లేనివాడు గనక, సభలోకి దూసుకొని వస్తూ ద్రౌపది కేశపాశాన్ని దుశ్శాసనుడి మాదిరిగానే పట్టుకున్నాడు; రాజు ఎదురుగానే ఆవిణ్ని నేలమీద పడేసి కాలితో తన్నాడు. ఆ క్షణంలో సూర్యుడు పంపిన రాక్షసుడు కీచకుణ్ని పట్టుకొని గాలివేగంతో దూరంగా నెట్టాడు. దానితో కీచకుడు బోర్లా పడ్డాడు. ఇదంతా రాజూ ధర్మరాజూ కళ్లప్పగించి చూస్తూనే ఉన్నారు. అప్పుడక్కడికి వచ్చిన భీముడు పళ్లు కొరికాడు. ఉపద్రవం ముంచుకొని రాబోతోందని పసిగట్టిన ధర్మరాజు తన బొటనవేలితో భీముడి బొటనవేలిని నొక్కి, తమ అజ్ఞాతవాసాన్ని కాపాడుకోవాలని మౌనంగానే హెచ్చరించాడు.

చెట్టునొక దాన్ని పీకి కీచకుడి పీచమడుద్దామని చూస్తున్న భీముడితో, ‘వలలుడా! ఎండిన వంట చెరకు కోసం చూస్తున్నావా? బయట చెట్ల నుంచి కొమ్మల్ని కోసుకో’ అంటూ ధర్మరాజు ‘ఇక్కడగాదు, బయట ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా వాడి పనిపట్టమ’ని సూచించాడు.
 
ద్రౌపది లేచి, తన ఆకారాన్ని రక్షించు కుంటూ, కళ్లు చింతనిప్పుల్లాగ మండు తూండగా, ‘సిగ్గూ ఎగ్గూ లేని ఈ సూతుడు నన్ను ఇలాగ వేధిస్తూంటే, నా గంధర్వ పతులు అతి బలవంతులయ్యుండి కూడా రక్షించడానికి రావడం లేదు. రాజు కూడా కిమ్మనడం లేదు. అబలనైన నన్ను రక్షించ డానికి ముందుకు రావడం లేదు. కీచకు డెంత అధర్మపరుడో మత్స్యరాజూ అంత అధర్మపరుడిలాగే ఉన్నాడు’ అనేసరికి విరటుడు, ‘మీ ఇద్దరిమధ్యా ఇంతకు మునుపు ఏ తకరారు జరిగిందో తెలియ నప్పుడు నేనేం చేయగలను?’ అంటూ తప్పించుకోడానికే చూశాడు.

అప్పుడు ధర్మరాజు కలగజేసుకుంటూ, ‘ఈ సమయం కోపకాలం కాదనుకొని నీ గంధర్వపతులు రావటం లేదేమో! నువ్వు అంతఃపురానికి వెళ్లిపో! నీకు విప్రియం చేసినవాడికి అప్రియం చేయడానికి నీ పతులు తరవాత వస్తారేమోలే’ అంటూ ఆవిణ్ని వెళ్లిపోయేలాగ చేశాడు.
 అంతఃపురంలోకి వెళ్లి సుధేష్టతో జరిగిన విషయాన్నంతనీ పూసగుచ్చినట్టు చెప్పింది ద్రౌపది.

ఆవిడ తన దురుద్దేశాన్ని బయటపడనీయకుండా ‘వాడు చావును కోరుకుంటున్నాడేమో’ అని ఊరుకొంది.  నిరాశతో అప్పటికి ఊరుకొని, రాత్రిపూట  వంట ఇంట్లో నిద్రపోతూన్న భీమసేనుణ్ని ‘ఇంత జరిగినా నీకు కునుకు ఎలాగ పట్టింది’ అంటూ లేవదీసింది ద్రౌపది. ఇద్దరూ కీచకుడి చావుకి ఒక పథకాన్ని వేశారు. ‘ఈ దుఃఖాన్నీ శోకాన్నీ పక్కకు పెట్టి నువ్వు రేపు రాత్రికి వాడు నర్తన శాలకు రహస్యంగా వచ్చేలాగ చేశావంటే నేను వాడి భరతం పడతాను’ అని భీముడు పథకాన్ని టూకీగా చెప్పాడు.
 
‘‘నా గంధర్వపతులకు ఈ మన ప్రసంగం వల్ల అపవాదం వచ్చి పడు తుంది. అంచేత అతి రహస్యంగా రాత్రి పూట నర్తనశాలకు వచ్చావంటే నేను నీ అధీనమవుతాను’’ అని ద్రౌపది కీచకుణ్ని నమ్మించింది. వాడు సంకేత స్థలానికి వస్తున్నాడన్న సంగతి భీముడికి చేరవేసి, అతను రాత్రికి అక్కడికి వెళ్లి సిద్ధంగా ఉండేలా ఏర్పాటు చేసింది. ఎప్పుడు రాత్రి వస్తుందా అని ఉవ్విళ్లూరుతూ కీచకుడు భీముడి మృత్యుకౌగిట్లోకి వచ్చి చిక్కు కున్నాడు. ఏ అరుపులూ బొబ్బలూ విని పించకుండా కీచకుణ్ని మాంసమ్ముద్దలాగ నలిపేసి, గుట్టు చప్పుడు కాకుండా తన వంట ఇంటికి వెళ్లిపోయాడు.
 
కీచకుడి సోదరులైన ఉపకీచకులు కీచకుణ్ని దహన సంస్కారం కోసం తీసు కొని వెళ్తూండగా, ఆ సన్నివేశాన్ని కళ్లారా చూద్దామని అక్కడికి వచ్చిన ద్రౌపదిని చూసి, ‘ఈవిడ వల్లనే మన అన్నయ్య నికృష్టమైన చావు చచ్చిపోయాడ’ని రెచ్చి పోయి, ఆవిణ్ని కీచకుణ్ని తీసుకొని వెళ్తూన్న బండమీద ఒక రాటకు కట్టి తీసుకుపోవడం మొదలుపెట్టారు. రాజు వాళ్ల బలం ఎరిగినవాడు గనక కిక్కురు మనకుండా ఉన్నాడు. ‘ఉపకీచకులు శ్మశా నానికి లాక్కుపోతున్నార’ంటూ ద్రౌపది గట్టిగా ఏడ్చింది. ఆ ఏడుపును విని, నిద్ర పోతూన్న భీముడు గభాలున లేచి ‘సైరంధ్రీ! నేను నీ మాట విన్నాను.

ఈ సూతపుత్రుల భయం నీకేమీ లేదు’ అంటూ అభయాన్నిచ్చి, వేషం మార్చు కొని, రాజద్వారం గుండా వెళ్లకుండా, గోడ దూకి బయటనున్న ఒక చెట్టునెక్కి, వాళ్లు ఎటు వెళ్తున్నారో చూశాడు. చితి దగ్గరికి పోయి, ఆ దగ్గర్లో తాడిచెట్టులాగ బాగా పొడుగ్గా ఉన్న ఒక గుబురుచెట్టును ఊడబెరికి, భుజంమీద పెట్టుకొని భీముడు రావడాన్ని ఉపకీచకులు చూశారు. వాళ్ల పై ప్రాణాలు పైనే పోయాయి. ‘

బాబోయ్! ఆ గంధర్వుడు మళ్లీ వస్తున్నాడు’ అంటూ ఆమెను వదిలి నగరం వైపు పారిపోవడం మొదలు పెట్టారు. భీముడు యముడి మాదిరి మీదపడి ఆ నూటైదు మందినీ పశువుల్ని వేటాడి చంపినట్టు చంపేశాడు. ‘సైరంధ్రీ! నిన్ను కష్టపెట్టినవాళ్లెవరైనా ఇలాగే చచ్చిపోతారు. నువ్వే భయం లేకుండా నగరానికి నడు!’ అని ద్రౌపదికి చెప్పి, భీముడు మరో దోవ మీదుగా వంట ఇంటికి వెళ్లిపోయాడు.
 
విరటుడి మాటగా సుదేష్ణాదేవి ‘సైరంధ్రీ! గంధర్వులు చేసిన పరాభవం నుంచి రాజుగారు బాగా భయపడు తున్నాడు. నువ్వేమో అతి అందగత్తెవి; మగాళ్లకు విషయ భోగమంటే చెప్పరానంత ఇష్టం; గంధర్వులా అతి కోపిష్ఠులు. అంచేత నువ్వు ఇక్కణ్నించి నీకు ఇష్టమైన చోటికి వెళ్లు’ అంటూ భయపడుతూనే అంది. ‘రాజుగారు మరొక్క పదమూడు రోజులు ఓపిక పడితే చాలు గంధర్వులు వచ్చి నన్ను తీసుకొని వెళ్తారు’ అంటూ ద్రౌపది సర్దిచెప్పింది.
- డా॥ముంజులూరి నరసింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement