తండ్రీ... వారిని క్షమించు!
క్రీస్తు మనకు అనుగ్రహించిన మహావాక్యం అతను సిలువ ఎక్కబోతూ, తనను అసూయకొద్దీ చంపజూసిన వాళ్ల గురించి అన్న వాక్యం: ‘తండ్రీ! వాళ్లను క్షమించు! ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియటం లేదు’ అని.
చరిత్ర చాలా గడ్డు సమయంలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తమూ ఆధ్యాత్మికంగా పూర్తిగా కుంగిపోయి ఉన్నప్పుడు దాన్ని పునరుజ్జీవింప జేయడానికి క్రీస్తు జన్మించాడు. ఆ మహాత్ముడి సందేశం- ‘మీరందరూ భగవదంశలే’ గొప్ప సందేశం. సెయింట్ జాన్ ఆ క్రీస్తు వచనాన్ని విపులీకరించాడు: ‘ఎంతమంది అతన్ని (అంటే, యేసులోనూ సృష్టి మొత్తంలోనూ ప్రకటమైన కూటస్థ చైతన్యాన్ని) అర్థం చేసుకొని గ్రహించగలుగుతారో వాళ్లందరికీ భగవంతుడి పుత్రుడిలాగా కావడానికి కావలసిన శక్తినిచ్చాడు ఆయన’ (జాన్ 1-12) అని.
ఇదో మహావాక్యం. గుండెలో నిర్మలత్వం ఉండి మనసా వాచా కర్మణా శ్రద్ధాభక్తుల్ని పూర్తిగా కనబరచగలిగితే చాలు ఆ మనిషి జాతి ఏదైనాసరే అతని చర్మం రంగు ఏదైనా సరే అతను భగవంతుణ్ణి తనలోకి పిలిచి పరిపూర్ణ తృప్తిని పొందగలుగుతారు. ‘అన్నిదేశాల ప్రజల్నీ (భగవంతుడు) ఒకే రక్తం ఉన్నవాళ్లుగా తయారు చేశాడు’ (అపొ.కా. 17-26) అనేదే క్రీస్తుకు ఉత్తేజాన్నిచ్చిన సంగతి. చర్మాల రంగుల్నిబట్టి మనుషుల్ని విభజించుకొని అసహ్యించుకోవడంగానీ ప్రేమించడం గానీ మనుషుల అజ్ఞానానికి పరాకాష్ఠగానే చెప్పాలి.
రంగు చర్మానికే పరిమితం; అంతకన్నా లోతుకు అది వెళ్లదు. రంగును బట్టి ఎవరూ ఎవర్నీ వేరుచేయాల్సిన మూర్ఖత్వంగానీ రాగద్వేషాల్ని చూపించే వెర్రితనాన్ని గానీ బహిర్గతం చేయగూడదు. అదీగాక, నువ్వు ఎవర్ని ద్వేషిస్తావో ఏ జాతిని అసహ్యించుకుంటావో ఏ మతాన్ని ఏవగించుకుంటావో, తిరిగి ఆ జాతిలోనూ ఆ మతంలోనూ ఆ తీరులోనూ పుట్టవలసి వస్తుంది. అది తప్పనిసరి. ఎందుకంటే, చిట్టచివరికి మనకు అన్నిరకాల పక్షపాతాలూ పోయి, మనమందరమూ నిర్మలులమై, భగవంతుడి రెక్కలమాటున ఉండవలసినవాళ్లమే అని గుర్తు పెట్టుకోవాలి.
క్రీస్తు మనకు అనుగ్రహించిన మహావాక్యం అతను సిలువ ఎక్కబోతూ, తనను అసూయకొద్దీ చంపజూసిన వాళ్ల గురించి అన్న వాక్యం: ‘తండ్రీ! వాళ్లను క్షమించు! ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియటం లేదు’ అని. తనను చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్లపట్ల మనకుండవలసిన భావమేమిటో ఏది ఎదుటివాళ్ల క్రూరహృదయాన్ని కూడా మెత్తబరిచి వాళ్లకే తప్పు జేశామన్న పశ్చాత్తాపాన్ని కలిగిస్తుందో ఈ మహావాక్యం చెబుతుంది.
మనం చిన్నప్పుడు నీతిపద్యాల్లో ఈ గొప్ప క్షమాగుణం గురించే చదువుకున్నాం. అందుచేతనే యేసుక్రీస్తు మన స్వధర్మాన్ని, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టే నిర్వచించాడు: ‘మనుషులందరూ ఈ డబ్బూదస్కాలకోసమే వెంపర్లాడుతూ ఉంటారు. ఆ తండ్రికి ఇవి మీకు అవసరమని తెలుసు. ఏం తినాలి? ఏం తాగాలి? ఎలాగ ఈ శరీరాన్ని బట్టలతో చుట్టుబెట్టుకోవాలి? అనేవన్నీ అవసరమైన ఆలోచనలా అసలు? నేలను గడ్డి అనే పచ్చటిగుడ్డలతో భగవంతుడు కప్పుతూనే ఉన్నాడు.
ఇవాళ ఉన్న ఆ గడ్డిని ఎండగానే కుంపట్లో వేస్తూనే ఉంటాం. నేలనే ఇంత పట్టించుకొన్నవాడు, మనిషిని మాత్రం ఎందకు పట్టించుకోడు? అంచేత వీటికన్నా మీరు దేవుని రాజ్యాన్ని ముందుగా కోరుకోండి. చేరడానికి ఉపక్రమించండి. అప్పుడు ఇవన్నీ మీకు (వాటికవే) వచ్చి చేరతాయి’ (మత్తయి 6-33). ‘డబ్బునీ దేవుణ్ణీ నువ్వు (ఒకేవేళ) సేవించలేవు’ (మత్తయి 6-24) అని ఎప్పుడూ గుర్తుపెట్టుకో!
క్రీస్తు ప్రవచనం- ‘నిన్ను నువ్వెలాగ ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అలాగే ప్రేమించాలి’ అనేది గుర్తు పెట్టుకోవాలి. దాని అర్థం బహుదృశ్యరూపాల్లో ఎదురుగా అగుపిస్తున్న దేవుణ్ణి ప్రేమించమనే. క్రీస్తు చెప్పిన దానిని మనమంద రమూ నేర్చుకోవాలి. గాలిలో ఎగిరే పక్షులకు తిండిని పెట్టేవాడు మనకూ పెట్టకమానడన్న దృఢమైన విశ్వాసం ఉండాలి. ఆవగింజంతైనా విశ్వాసం లేకుండా, వట్టి కబుర్లు చెబితే క్రీస్తు సంతోషిస్తాడనుకోవడం మనను మనం మోసగించుకోవడమే.
- డా॥ముంజులూరి నరసింహారావు