లోకంలో మనకున్న విలువ డబ్బుమీద, లేదా అంతస్థుల మీద లేదు గాని దేవుడు విలువపెట్టి మనలను కొన్నాడు గనుక మనం ఖచ్చితంగా విలువగలవారమే.
విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి (1 కొరింథీ 6:20). ప్రపంచ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే పూర్వదినాల్లో కొన్ని దేశాల్లో ట్రేడ్ సెంటర్స్‌లో మనుష్యులను అమ్మేవారు, కొనుక్కొనేవారు. ఆఫ్రికా దేశాలనుండి మనుష్యులను తీసుకెళ్ళి సంతలో పశువులను కొనేటట్లుగా మనుష్యులను తమ ఇష్టాయిష్టాలతో పట్టింపు లేకుండా కొనుక్కొనేవారు. అలా ధనంతో కొనబడిన వ్యక్తులు జీవితాంతం వారికి సేవ చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. యజమానుని మాటను జవ దాటకుండా పనిచేసేవారు. వారికి ఏ విషయంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండేవి కావు. చాలా పోరాటాల పిదప ఆ తర్వాతి కాలంలో వారికి విడుదల లభించింది.
ప్రభువైన యేసుక్రీస్తు కలువరి సిలువలో తన అమూల్యమైన రక్తం ద్వారా ప్రతి మనుష్యుని కొనుక్కోవాలని ఇష్టపడుతున్నాడు. పాప బానిసత్వం నుండి, సాతాను బంధకాల నుండి విడుదల పొందాలని ఎవరు ఆశపడతారో వారిని తన నిష్కళంకమైన రక్తంతో కడిగి పవిత్రపరిచి వారిని ధన్యజీవులనుగా చేస్తాడు. దానిని విమోచించబడడం అంటారు. వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనము విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషాన్ని నిష్కళంకమునగు గొర్రెపిల్లవంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా (1 పేతురు 1:18–19) అని పేతురు చెప్పిన మాటలో ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు దాగి ఉన్నాయి.
తన ఉచితమైన కృపద్వారా దేవుడు మనలను కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు. ఆయన స్వకీయ సంపాద్యం. రక్షింపబడక పూర్వం ఒక వ్యక్తి ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుడు. కాని క్రీస్తు మన కోసం వెల చెల్లించటం ద్వారా మనం ప్రయోజనకరమైన వారిగా తీర్చిదిద్దబడ్డాము. లోకంలో మనకున్న విలువ డబ్బుమీద, లేదా అంతస్థుల మీద లేదు గాని దేవుడు విలువపెట్టి మనలను కొన్నాడు గనుక మనం ఖచ్చితంగా విలువగలవారమే.
క్రీస్తు మనలను కొనుక్కున్నది మన జీవితాల ద్వారా ఆయనకు మహిమ రావాలని. మన దేహాల ద్వారా దేవుడు ఘనపరచబడవలెనని కోరుతున్నాడు. పాప పంకిలమైన లోకంలో క్రీస్తు ప్రతినిధులుగా బ్రతుకుచూ దేవుని రాజ్య విస్తరణలో వాడబడాలన్నది దైవ ప్రణాళిక. దేవుడు మనలను కొనుక్కున్నాడు గనుక మనమీద సంపూర్ణ అధికారం ఆయనదే. సిలువలో సంపూర్ణంగా వెలను చెల్లించాడు గనుక ఆయన కోసం మనం జీవించాలి. ఆయన పాలన నియంత పాలన వంటిది కాదు. ఆయన మనలను కొనుక్కొన్నప్పటికి మనమీద పెత్తనం చెలాయించడు. కృపామయుడైన దేవుడు ప్రేమ పూర్వకంగా ఆదేశిస్తాడు.
ఆయన ఆదేశాలకు లోబడడం మనకే ప్రయోజనం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలు మనకు మంచి భవిష్యత్తును అనుగ్రహించునట్లుగా, నిరీక్షణ కలుగచేయునట్లుగా సమాధానకరములైనవే గాని హానికరములు కావు. ప్రియస్నేహితా! పరిస్థితులను బట్టి ఎన్నడును కృంగిపోకు. మనుష్యులు నిన్ను తక్కువగా చూస్తున్నారని బాధపడకు. నీవు సర్వశక్తుడైన దేవుని చేతిలో చెక్కబడ్డావు. నిన్ను ఎట్టి పరిస్థితులలో చేజారనియ్యడు. అపవాది చేతికి మరలా అప్పగించడు. ధైర్యంగా ఉండు.
– డాక్టర్ జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment