దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు | John Wesley Devotional Essay On Jesus Christ | Sakshi
Sakshi News home page

దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు

Published Sun, Jul 18 2021 7:32 AM | Last Updated on Sun, Jul 18 2021 7:32 AM

John Wesley Devotional Essay On Jesus Christ - Sakshi

నా రక్షణకు మహిమకు ఆధారం దేవుడే (కీర్తన 62:7). తన జీవిత అనుభవాల నుండి దావీదు ఎన్నో కీర్తనలను రచించాడు. ఆ కీర్తనలు ప్రతి విశ్వాసి జీవితానికి ఎక్కడో ఒకచోట సంబంధం కలిగి ఉంటాయి. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు దేవుణ్ణే ఆధారంగా భావిస్తూ సాగిపోయే వ్యక్తి ఖచ్చితంగా ధన్యజీవియే. జీవితయాత్రలో నిశ్చలమైన అనుభవాలతో ముందుకు సాగిపోవాలనే ప్రగాఢమైన కోరిక ప్రతి ఒక్కరికి తప్పక ఉంటుంది. దేవుని కృప ద్వారా అన్ని విషయాల్లో పైకి ఎదుగుతున్న వానికి శత్రువుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది.

నిలబడినవానిని కిందకు తోయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు కొందరు. ఒరుగుతున్న గోడను కంచెను ఒకడు చాలా సునాయాసంగా పడగొట్టునట్లు నిల్చున్న వారిని పడగొట్టడానికి అనేకులు ముందుకొస్తారు. లోకసంబంధమైన వారి ఆలోచనలు ఎప్పుడూ ఎదుటివారి అభివృద్ధిని ఓర్వలేనివిగా ఉంటాయి. అటువంటి సందర్భాలలో విశ్వాసి స్పందన ఎలా ఉండాలన్న విషయాన్ని భక్తుడు నేర్పిస్తున్నాడు.

మనలను సృష్టించిన దేవుని వలన మనకు రక్షణ, నిరీక్షణ, మహిమ కలుగుతున్నాయి. ఆయనను మించిన ఆశ్రయదుర్గం మనిషికి ఉండదు. మనిషి మహిమకరమైన జీవితాన్ని జీవించాలంటే మహిమాన్వితుడైన యేసుక్రీస్తును హృదయం లోనికి ఆహ్వానించాలి.  ఏదెను తోటలో ఆదాము హవ్వలు కోల్పోయిన మహిమను మనుష్యజాతికి మరలా ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. పాపం చేయుట ద్వారా మానవుడు దేవుని మహిమను యధేచ్చగా కోల్పోతున్నాడు. అందరునూ పాపం చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు (రోమా 3:23). పాపం వలన మనిషిలో భయం, ఆందోళన, కలవరం వంటివి రాజ్యమేలుతున్నాయి. ఆధ్యాత్మిక పతనం నుండి బయట పడాలంటే మానవుడు దేవుని మహిమతో మరలా నింపబడాలి.

కోల్పోయిన మహిమను వెతుక్కునే ప్రక్రియలో మనిషి ఎన్నో భక్తికార్యాలు నిరంతరాయంగా చేస్తున్నాడు. దేవుని మహిమను కలిగి ఉన్నాననే నిశ్చయత నీకుందా? నీవు చేస్తున్న అవిధేయమైన కార్యాల ద్వారా నీవు కోల్పోతున్న వాటిలో చాలా ప్రాముఖ్యమైనది దేవుని మహిమ అని గుర్తించు. నీవు దేవునికి దూరమవటం ద్వారా సాతాను శక్తులు నీమీద విపరీతంగా దాడి చేస్తున్నాయి. నిన్ను నిలువుగా కుంగదీస్తున్నాయి. దురవస్థలోనికి నిన్ను నెట్టేస్తున్నాయి. ఇప్పుడే దేవుని ప్రశస్త సన్నిధిలో వేడుకో! చీకటిని వెనుకకు నెట్టి దేవుని ప్రకాశమయ సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు.

లోకరక్షణార్థమై యేసుక్రీస్తు కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి అనిర్వచనీయమైన తన మహిమను ప్రతి ఒక్కరికి బహుమానంగా ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఊహించలేని వెలుగుతో, తన దివ్య మహిమతో నిన్ను నింపగలిగే ఆయన ప్రేమగల దేవుడని సిలువ మరణం ద్వారా రుజువు చేయబడింది. సర్వశక్తుని దివ్య మహిమ మనిషికి అన్ని విషయాల్లో విజయాన్నిస్తుంది. నిత్యజీవానికి మనిషిని నడిపిస్తుంది. ఆమేన్‌!!
– డా.జాన్‌ వెస్లీ, క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement