John Wesley
-
భయం నుండి విడుదల
కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును (సామె 1:33). మానవుని పట్టి పీడుస్తున్న అనేక భయాల్లో ఒకటి ‘భవిష్యత్తును గూర్చిన భయం’. తనకు వచ్చే రోగాల్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, గత జీవితాన్ని గురించి భయపడేది కేవలం పది శాతమైతే మిగతా తొంభైశాతం భయం భవిష్యత్తులో ఏం జరగబోతుంది... అనే దానిపై ఆధారపడి ఉంటుందని మానసిక శాస్త్రవేత్తల వివరణ. భవిష్యత్తును గూర్చి తెలీదు గనుక దాని గురించి భయపడడం సహజం. అయితే కొందరు ప్రతి చిన్నదానికి భయపడి తమ చుట్టూ ఉన్నవారిని భయపెడుతుంటారు. దినదినం మానవుడు భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నాడన్నది వాస్తవ దూరం కాదు. భయంతో మనిషి తన జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాడు. ఆనందమయం చేసుకోలేకపోతున్నాడు. భయం మనిషిలో ఉన్న స్వాభావిక ధైర్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. భయం వలన మానవుడు తాను చేయాలనుకున్న పనులు చేయలేడు. అనేక మంచికార్యాలను నిలువరించే శక్తి భయానికి మాత్రమే ఉంది. భవిష్యత్తు చాలా అందమైనది. సర్వశక్తుడైన క్రీస్తులో అది సురక్షితమైనది. భవిష్యత్తు మీద ఉన్న ఆశలను నిర్వీర్యం చేసేది నీలో ఉన్న భయమే. జీవితంలో కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని నిర్దిష్ట పరిధుల్లో భయం ఉండడం సహజమే కానీ కొంతమంది భయకారణం లేని చోట కూడా విపరీతంగా భయపడుతూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణాల్లో ఒకటి మనిషిలో ఉన్న భయాన్ని పోగొట్టుట. రాత్రివేళ తమ మందను కాచుకొంటున్న గొర్రెల కాపరులకు ఇయ్యబడిన వాగ్దానం భయపడకుడి. వారికున్న భయం బహుశా ఇంకెంత కాలం ఈ గొర్రెలను మేపుతూ ఉండాలి? వాటిని ప్రజల పా పపరిహారార్థమై దేవాలయానికి తరలించాలి? దూత చెప్పిన వర్తమానం వారి కోసం రక్షకుడు వచ్చాడు. ఆయన సర్వలోక పా పా న్ని మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని వాక్యమైన బైబిల్లో అనేకచోట్ల భయపడకుడి అనే వాగ్దానం స్పష్టంగా కనిపిస్తుంది. మనిషి గుండెల్లో గూడు కట్టుకుపోయిన భయాన్ని రూపుమాపడానికే దేవుడు ఈ లోకానికి అరుదెంచాడు. ఆయన ధైర్యవంతుడు గనుకనే ఆయనలో ఉన్న ధైర్యాన్ని ఉచితంగా మనకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే ‘దేవుడు నాకు వెలుగును రక్షణయునై యున్నాడు నేను ఎవరికి భయపడుదును’ అని దావీదు వలే నువ్వు కూడా చెప్పగలవు (కీర్తన 27:1). శత్రువులతో తరుమబడినప్పుడు తల దాచుకోవడానికి కూడా అవకాశం లేని సందర్భాల్లో దేవునియందు విశ్వాసముంచి తనలో ఉన్న ప్రతి భయాన్ని జయించిన దావీదు ధన్యజీవిగా మారాడు. నీవు దేవునియందు నమ్మికయుంచి ధైర్యంతో ముందుకు సాగిపో మిత్రమా! – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
పేదల స్థలాలపై రామోజీ కన్ను
ఇబ్రహీంపట్నం రూరల్: పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై రామోజీరావు కన్ను పడిందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్‌వెస్లీ ధ్వజమెత్తారు. 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతో ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి గ్రామం సర్వే నెంబర్లు 189, 203లో (రామోజీ ఫిల్మ్‌సిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు) రాయపోల్, నాగన్‌పల్లి, పోల్కంపల్లి, ముకునూర్ గ్రామాలకు చెందిన 576 మందికి రామోజీ ఫిల్మ్ సిటీ పరిధిలోన ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే నేటికీ లబ్ధిదారులను ఆ స్థలాల్లోకి వెళ్లకుండా, నిర్మాణాలు చేపట్టకుండా రామోజీ అడ్డుకుంటున్నారని జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన లబ్ధిదారులతో కలిసి నాగన్‌పల్లి నుంచి కేటాయించిన భూముల ప్రాంతం వరకు పాదయాత్ర చేపట్టారు. ఎర్ర జెండాలు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ ఆయా భూముల వద్దకు చేరుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లబ్ధిదారులను ఉద్దేశించి జాన్‌వెస్లీ మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసి ఆ భూములను టూరిజం పేరుతో రామోజీ సంస్థ దక్కించుకోవాలని చూస్తోందని ఆగహ్రం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఇప్పటికే రెవెన్యూ అధికారులకు రామోజీరావు దరఖాస్తు చేసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఫిల్మ్ సిటీ పరిధిలోని 180 ఎకరాల ప్రభుత్వ భూమిలో 12 ఎకరాలను ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తే ఇప్పటికీ లబ్ధిదారులను భూముల్లోకి వెళ్లకుండా, నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఫిల్మ్ సిటీ పరిధిలో ఇంకా 160 ఎకరాలకి పైగా ప్రభుత్వ మిగులు భూమి ఉందనీ, ఇళ్ల పట్టాలు పంపిణీ చేయని వారికి ఇక్కడే స్థలాలు ఇవ్వాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. భూములు పేదలకు దక్కకుండా కోర్టులో కేసులు వేసి రామోజీ అడ్డుపడుతున్నారని, అయితే లబ్ధిదారుల కోసం పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా రామోజీపై లోకాయుక్తలో సుమాటోగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రామోజీపై చర్యలు తీసుకోకుంటే ఈ నెల 28న కలెక్టరేట్ ముట్టడి .. ప్రభుత్వం స్పందించి రామోజీపై చర్యలు తీసుకోవాలనీ లేకుంటే ఈ నెల 28వ తేదీన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని జాన్ వెస్లీ హెచ్చరించారు. అప్పటికీ స్పందించకుంటే ప్రజలను సమీకరించి ఇళ్ల స్థలాల్లో గుడిసెలు వేయిస్తామన్నారు. అక్కడే వంటా వార్పు కార్యక్రమాలతో ఇళ్ల స్థలాలను ఆక్రమిస్తామని ఆయన తేల్చిచెప్పారు. మొదటి భూకబ్జా దారుడు రామోజీనే... జిల్లాలో ప్రభుత్వ భూములను మొట్ట మొదటి సారిగా కాజేసింది రామోజీ రావేనని రంగారెడ్డి జిల్లా సీపీఎం కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ ఆరోపించారు. íఫిల్మ్ సిటీలో ఉన్న రోడ్లు, చెరువులు, కుంటలను కబ్జా చేశారని నిందించారు. పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రెవెన్యూ యంత్రాంగం అండదండలతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. రామోజీరావుపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు.. సీపీఎం పోరు పాదయాత్ర సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. టియర్‌గ్యాస్ వాహనాలను కూడా సిద్ధంగా పెట్టారు. అయితే ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల యాదయ్య, సామేలు, జగదీష్, జిల్లా నాయకులు కందుకూరి జగన్, సీహెచ్ జంగయ్య, అలంపల్లి నర్సింహ, ఏర్పుల నర్సింహ, శ్యాం సుందర్, వెంకటేష్, బుగ్గరాములు, జగన్‌లతో పాటు ఆయా గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: రామోజీ ఫిల్మ్‌సిటీని ముట్టడిస్తాం: సీపీఎం -
ఆయన ప్రణాళిక అమోఘం
దేవుని సహవాసంలో ఉచితంగా లభ్యమయ్యే బలాన్ని పొందుకోవడమే మనకు అసలైన ఆశీర్వాదం! బలము తెచ్చుకొని వెళ్ళుము... నిన్ను పంపిన వాడను నేనే (న్యాయా 6:14). కష్టించి పనిచేసిన తరువాత చేతికొచ్చిన ప్రతిఫలం కళ్ళముందే ఎవరైనా తన్నుకుపోతే ఎంత బాధ ఉంటుందో కదా? చెమటోడ్చి సంపాదించిన వాటిని శత్రువులొచ్చి తీసుకుపోతే ఎంతటి వేదన గుండెలోతుల్లో ఉంటుందో కదా? చాలా సంవత్సరాల క్రితం గిద్యోను కాలంలో కూడా ఇశ్రాయేలీయులు అలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు. ఆ విపత్కర సమయంలో దేవుడు గిద్యోనుతో పలికిన మాటలు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చూడగలం. తన ప్రజలను రక్షించడానికి గిద్యోను మీద ఉంచబడిన బాధ్యత చాలా గొప్పది. అనాది నుండి దేవుడు తన ప్రజలను కొన్ని ప్రత్యేక ఉద్దేశ్యాల కోసం పిలుస్తూనే ఉన్నాడు. మహాశ్చర్య కార్యములను నెరవేర్చుటకు తన వారిని వినియోగించుకొంటూనే ఉన్నాడు. దేవుని పిలుపు వెనుక అద్భుతమైన పరమార్థం దాగి ఉంటుంది. కాలయాపన కోసమో, అనవసరంగానో దేవుడు ఎవ్వరిని పిలువలేదు... పిలువడు కూడా. ఆ కాలంలో మిద్యానీయుల భయంతో ఇశ్రాయేలీయులంతా కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకొరకు సిద్ధపరచుకొని వాటిలో నివసించేవారు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పంటను దోచుకొనేవారు. కష్టార్జితం ఇల్లు చేరేది కాదు. చాలాకాలం కష్టించి, శ్రమించి పండించిన పంట చేతికొచ్చే వేళ మిద్యానీయులు వచ్చి సమస్తాన్ని కొల్లగొట్టేవారు. కొన్ని కొన్నిసార్లు విత్తనములు విత్తిన తరువాత మిడతల దండంత విస్తారంగా వారిమీదకు వచ్చి పంటను పాడుచేసి గొర్రెలను, యెడ్లను, గాడిదలను, జీవనసాధనమైన వాటిని దొంగిలించి వారిని బహుగా బాధించేవారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు చేరుకున్న తరుణంలో దేవుడు గిద్యోను ద్వారా వారిని రక్షించడానికి సంకల్పించాడు. అవును! ఆయన దివ్యమైన ప్రణాళికలు ఎప్పుడూ అమోఘమైనవే. భయకంపిత వాతావరణంలో బతుకుతున్న గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మిద్యానీయులకు భయపడి గానుగ చాటున ఉండి కొద్దిపాటి గోధుమలను దుళ్ళగొట్టి పొట్టను పోషించుకోవాలని ఆశిస్తున్న వ్యక్తిని దేవుడు ప్రజలందరికి దీవెనకరంగా మార్చాడు. దేవుని ఉన్నతమైన పిలుపునకు తమను తాము సమర్పించుకున్న ప్రతి ఒక్కరూ దేవుని నామమును అత్యధికంగా మహిమపరిచారు. దేవుని కార్యముల కోసం పిలువబడడం, నియమించబడడం ఎంత ఆశీర్వాదమో కదా. దేవుని సహవాసంలో ఉచితంగా లభ్యమయ్యే బలాన్ని పొందుకోవడమే మనకు అసలైన ఆశీర్వాదం! – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
సువార్త: నీకున్న విలువ గొప్పది
లోకంలో మనకున్న విలువ డబ్బుమీద, లేదా అంతస్థుల మీద లేదు గాని దేవుడు విలువపెట్టి మనలను కొన్నాడు గనుక మనం ఖచ్చితంగా విలువగలవారమే. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి (1 కొరింథీ 6:20). ప్రపంచ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే పూర్వదినాల్లో కొన్ని దేశాల్లో ట్రేడ్ సెంటర్స్‌లో మనుష్యులను అమ్మేవారు, కొనుక్కొనేవారు. ఆఫ్రికా దేశాలనుండి మనుష్యులను తీసుకెళ్ళి సంతలో పశువులను కొనేటట్లుగా మనుష్యులను తమ ఇష్టాయిష్టాలతో పట్టింపు లేకుండా కొనుక్కొనేవారు. అలా ధనంతో కొనబడిన వ్యక్తులు జీవితాంతం వారికి సేవ చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. యజమానుని మాటను జవ దాటకుండా పనిచేసేవారు. వారికి ఏ విషయంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండేవి కావు. చాలా పోరాటాల పిదప ఆ తర్వాతి కాలంలో వారికి విడుదల లభించింది. ప్రభువైన యేసుక్రీస్తు కలువరి సిలువలో తన అమూల్యమైన రక్తం ద్వారా ప్రతి మనుష్యుని కొనుక్కోవాలని ఇష్టపడుతున్నాడు. పాప బానిసత్వం నుండి, సాతాను బంధకాల నుండి విడుదల పొందాలని ఎవరు ఆశపడతారో వారిని తన నిష్కళంకమైన రక్తంతో కడిగి పవిత్రపరిచి వారిని ధన్యజీవులనుగా చేస్తాడు. దానిని విమోచించబడడం అంటారు. వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనము విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషాన్ని నిష్కళంకమునగు గొర్రెపిల్లవంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా (1 పేతురు 1:18–19) అని పేతురు చెప్పిన మాటలో ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు దాగి ఉన్నాయి. తన ఉచితమైన కృపద్వారా దేవుడు మనలను కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు. ఆయన స్వకీయ సంపాద్యం. రక్షింపబడక పూర్వం ఒక వ్యక్తి ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుడు. కాని క్రీస్తు మన కోసం వెల చెల్లించటం ద్వారా మనం ప్రయోజనకరమైన వారిగా తీర్చిదిద్దబడ్డాము. లోకంలో మనకున్న విలువ డబ్బుమీద, లేదా అంతస్థుల మీద లేదు గాని దేవుడు విలువపెట్టి మనలను కొన్నాడు గనుక మనం ఖచ్చితంగా విలువగలవారమే. క్రీస్తు మనలను కొనుక్కున్నది మన జీవితాల ద్వారా ఆయనకు మహిమ రావాలని. మన దేహాల ద్వారా దేవుడు ఘనపరచబడవలెనని కోరుతున్నాడు. పాప పంకిలమైన లోకంలో క్రీస్తు ప్రతినిధులుగా బ్రతుకుచూ దేవుని రాజ్య విస్తరణలో వాడబడాలన్నది దైవ ప్రణాళిక. దేవుడు మనలను కొనుక్కున్నాడు గనుక మనమీద సంపూర్ణ అధికారం ఆయనదే. సిలువలో సంపూర్ణంగా వెలను చెల్లించాడు గనుక ఆయన కోసం మనం జీవించాలి. ఆయన పాలన నియంత పాలన వంటిది కాదు. ఆయన మనలను కొనుక్కొన్నప్పటికి మనమీద పెత్తనం చెలాయించడు. కృపామయుడైన దేవుడు ప్రేమ పూర్వకంగా ఆదేశిస్తాడు. ఆయన ఆదేశాలకు లోబడడం మనకే ప్రయోజనం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలు మనకు మంచి భవిష్యత్తును అనుగ్రహించునట్లుగా, నిరీక్షణ కలుగచేయునట్లుగా సమాధానకరములైనవే గాని హానికరములు కావు. ప్రియస్నేహితా! పరిస్థితులను బట్టి ఎన్నడును కృంగిపోకు. మనుష్యులు నిన్ను తక్కువగా చూస్తున్నారని బాధపడకు. నీవు సర్వశక్తుడైన దేవుని చేతిలో చెక్కబడ్డావు. నిన్ను ఎట్టి పరిస్థితులలో చేజారనియ్యడు. అపవాది చేతికి మరలా అప్పగించడు. ధైర్యంగా ఉండు. – డాక్టర్ జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
Easter Special: లోకానికే మహోదయం క్రీస్తు పునరుత్థానం
యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తినీ తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జీవితం నుండి కొన్ని అమూల్య పాఠాలను ‘సాక్షి’ పాఠకులకు అందిస్తున్నాం. తన జీవితకాలమంతా భౌతికంగా అంధురాలైనప్పటికీ క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని అయన ప్రేమతత్వాన్ని తాను రచించిన ఎనిమిదివేల పాటలతో తెలియచేసి క్రైస్తవ ప్రపంచంలో విశిష్టమైన ఖ్యాతిని ఆర్జించిన ఫ్యానీ క్రాస్బీ క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఇలా వ్రాసింది. ‘క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన విశిష్ఠ బలము ద్వారా మరణాన్ని జయించాడు. రాయి పొర్లింపబడింది, సమాధి ఆయన్ను శాశ్వతంగా బంధించలేకపోయింది. జగమంతా ఆనందంతో నిండిపోయింది. క్రీస్తు స్నేహితులారా! మీరు కన్నీళ్లు విడచుట మానండి. ఎందుకంటే ఆయన మహిమగల రాజు.’ ఈ మాటలను తన హృదయాంతరంగములో నుండి రాయడం ద్వారా తాను భౌతికంగానే అంధురాలు గాని ఆధ్యాత్మికంగా కాదు అని ఋజువుచేసింది క్రాస్బీ. యేసుక్రీస్తు జీవితం ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకు వచ్చింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. పువ్వు నుంచి పరిమళాన్ని, తేనె నుంచి మాధుర్యాన్ని, చంద్రుని నుంచి చల్లదనాన్ని, మీగడ నుంచి కమ్మదనాన్ని, అమ్మ నుంచి అనుబంధాన్ని వేరుచేయలేనట్టుగానే క్రీస్తు నుంచి ప్రేమను, కరుణ పూరితమైన మనస్సును వేరుచేయలేము. ఆయన పుట్టింది బెత్లేహేము అనే చిన్న పల్లెటూరులోనైతే ఆయన పెరిగింది ఒక వడ్లవాని ఇంటిలో. పేరుకు మాత్రం తండ్రి అని పిలువబడిన యేసేపుకి అన్ని విషయాలలో సహాయం చేశాడు. యేసు భూమ్మీద జీవించిన కాలంలో స్నేహం చేసింది పామరులతో, గొర్రెల కాపరులతో, చేపలు పట్టే జాలరులతో. మనిషి సమస్యలను, పేదరికాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి యేసుక్రీస్తు. అందుకేనేమో! వారందరి హృదయాల్లో రారాజుగా కొలువుంటున్నాడు. కాంతికి వేగాన్ని నియమించిన దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత దూరమైనా కాలిబాటతోనే ప్రయాణించాడు. ఇవన్నీ ఆయన కారుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలు. నక్కలకు బొరియలున్నాయి, పక్షులకు గూళ్లున్నాయి, కాని తలవాల్చుకొనుటకు మనుష్య కుమారునికి చోటు లేదని చెప్పడం ద్వారా ప్రజల కోసం తానెంత కరుణామయుడిగా మారిపోయాడో తెలియచెప్పాడు. ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు దివ్య మహిమతో నిండిన ఆ మహాఘనుడు శరీరధారిగా తగ్గించుకొని వచ్చినప్పుడు కుష్ఠు వ్యాధిగ్రస్తులను కౌగలించుకున్నాడు. రోగ పీడితులను పరామర్శించి తన దివ్యస్పర్శతో స్వస్థపరచాడు. పాపంలో పట్టుబడి భయంతో సభ్య సమాజంలో తలదించుకొన్న వ్యభిచారిని సయితం అమ్మా! అని పిలిచిన పరిశుద్ధుడు క్రీస్తు. చులకనగా వ్యవహరించిన వారిని కూడా తన ప్రేమతో తన్మయుల్ని చేసిన కరుణామయుడు. సీయస్ లూయీ అనే సుప్రసిద్ధ సువార్తికుడు ఒకసారి ఇలా అంటాడు. యేసు ఈ లోకానికి వచ్చి తానెవరో లోకానికి తెలియచేశాడు. ‘నేను లోకానికి వెలుగును, జీవాహారము నేనే, మార్గము సత్యమును జీవమును నేనే’ చెప్పడంలో మనిషి మనసులో ఉన్న ప్రశ్నలకు జవాబులనిచ్చాడు. క్రీస్తు ఆవిధంగా పలికాడంటే ఆయన అబద్ధికుడైనా లేదా మతిస్థిమితం లేనివాడైనా లేదా రక్షకుడైనా అయ్యుండాలి. యేసుక్రీస్తు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఆయన మతిస్థిమితం లేనివాడు కాదు. అదే వాస్తవమైతే ఆయన ఇన్ని విశిష్ఠ బోధలు చేసి ఉండేవాడు కాదు. అనేకులను స్వస్థపరచేవాడు కాదు. ఆయన రక్షకుడు గనుకనే సిలువలో మనిషి పాపముల నిమిత్తం మరణించి మూడవ రోజున తిరిగి లేచారు. యేసుక్రీస్తు మానవాళిని తమ పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. యేసు జన్మ చాలా ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది, జీవన విధానం మరింత శ్రేష్ఠమైనది, విలక్షణమైనది. మరణ విధానం కూడా సాటిలేనిది. మూడవ రోజున జరిగిన ఆయన పునరుత్థానం అద్భుతమైనది. గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. మానవ జీవితాలకు పట్టిన పాపాంధకారాన్ని తొలగించి జీవపు వెలుగునందించాడు క్రీస్తు ప్రభువు. జీవచ్ఛవాలుగా పడివున్న ఎందరికో స్ఫూర్తినిచ్చి ఉన్నత శిఖరాలపై నిలబెట్టాడు. వాస్తవానికి క్రీస్తు మరణం, పునరుత్థానం సంభవించిన సమయంలో జరిగిన సంఘటనలు మనకు ఎన్నో విశిష్ఠమైన పాఠాలు నేర్పిస్తాయి. ‘నజరేయుడైన యేసు’ పాపులను రక్షించుటకు సిలువపై ప్రాణమర్పించారు. రోమన్ సైనికులు, యూదా మతపెద్దలు నిర్దాక్షిణ్యంగా యేసుక్రీస్తుకు సిలువ వేశారు. న్యాయస్థానాల చుట్టూ తిప్పారు. అన్యాయపు తీర్పు తీర్చారు. భయంకరమైన కొరడాలతో విపరీతంగా కొట్టి పైశాచికానందాన్ని పొందారు. యెరూషలేము వీధుల్లో సిలువను మోయించి, గొల్గతాపై మేకులు కొట్టి, సిలువలో వేలాడదీసి, పక్కలో బల్లెపు పోటు పొడిచి చిత్రహింసలకు గురి చేశారు. ప్రేమ, సమాధానములకు కర్తయైన దేవుడు వాటినన్నిటినీ ప్రేమతో సహించి, భరించి సిలువలో మరణించాడు. దేవుని లేఖనాలు యేసుక్రీస్తు సిలువపై మరణించాయని ధ్రువీకరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు దేశంలోని కైసరయ అనే ప్రాంతంలో తవ్వకాలు జరిపారు పురాతత్వ శాస్త్రవేత్తలు. ఆ తవ్వకాలలో వారికి పిలాతు రాతి పలక లభించింది. విస్తృత పరిశోధనల తదుపరి యేసుక్రీస్తు ప్రభువునకు తీర్పు తీర్చిన రోమన్ గవర్నర్ పిలాతు అని బైబిల్లో అతని గూర్చి వ్రాయబడిన విషయాలు వాస్తవాలని గుర్తించారు. యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందురోజు కొన్ని సంఘటనలు జరిగారు. గెత్సేమనె తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. నేటికి యెరూషలేములో గెత్సేమనే తోట ఉంది. దానిలోని కొన్ని ఒలీవ చెట్లు యేసుక్రీస్తు కాలానికి సంబంధించినవే. అక్కడ ఆయన ప్రార్థించిన రాయి కూడా ఉంది. దానిమీద ఓ గొప్ప దేవాలయం నిర్మించబడింది. ఇశ్రాయేలు దేశాన్ని సందర్శించే వారందరూ కచ్చితంగా వాటిని చూస్తారు. ఆ తోటలో శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను. అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తపు బిందువులుగా మారెను. యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తినీ తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఆ తదుపరి ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. ఈనాటికీ యెరూషలేమునకు వెళితే అక్కడ వయా డొలొరిసా అనే మార్గాన్ని చూస్తాము. ఆ మార్గంలో పద్నాలుగు స్టేషన్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డారో చరిత్రను తెలుసుకోవచ్చు. సిలువ మరణ శిక్ష మొదటిగా ఫోనీషియన్లు అమలు పరచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ శిక్ష విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు, నేరస్థులకు ఈ శిక్ష విధించే వారు. యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్లు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. భారభరితమైన ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి యొక్క పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. ఇశ్రాయేలు దేశంలో లభించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా ఇనుముతో చేయబడిన మేకులు సుమారు 7 అంగుళాల పొడవు ఉంటాయి. సుమారు 1 నుండి 2 సెంటిమీటర్ల మందం ఉండేవి. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ట్యురిన్ వస్త్రపు పరిశోధనల ఆధారంగా మేకులను మణికట్టులో కొట్టేవారని తేలింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇశ్రాయేలు మ్యూజియంలో మొదటి శతాబ్దానికి చెందిన ఒక వ్యక్తి పాదము, ఆ పాదములో దించబడిన మేకు కనబడుతుంది. దానిని బట్టి ఆ కాలంలో సిలువ విధించబడే సమయంలో ఏవిధంగా మేకులు కొట్టేవారో అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువును సిలువపై ఉంచి చేతులలో కాళ్లల్లోను కఠినమైన మేకులను దించారు. తీవ్రమైన వేదన యేసు భరించాడు. మేకులతో సిలువకు దిగగొట్టిన తరువాత సుమారు ఆరు గంటలు యేసుక్రీస్తు సిలువపై వేలాడారు. ఏడు మాటలు పలికిన తరువాత పెద్దకేక వేసి తన ప్రాణమర్పించారు. అయితే విశ్రాంతి దినమున దేహములు సిలువ మీద ఉండకూడదు. కాబట్టి కాళ్లు విరుగ గొట్టడానికి సైనికులు సిద్ధపడ్డారు. వారు వచ్చి యేసుతో పాటు సిలువ వేయబడిన నేరస్థుల కాళ్ళు విరుగగొట్టారు. అయితే యేసు అంతకు ముందే మృతినొందుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు. ‘సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కలో పొడిచెను. వెంటనే రక్తమును, నీళ్లును కారెను’ అని బైబిల్లో వ్రాయబడింది. యేసుక్రీస్తు మరణించిన కొద్దిసేపటికి ఆయన దేహములో పొడవబడిన ఈటె వలన రక్తము, నీళ్లు బయటకు వచ్చాయి. రోమన్లు వాడే బల్లెము లేక ఈటె పొడవు సుమారు 1.8 మీటర్లు. ఆయన దేహములో కుడి పక్కన పొడవబడిన బల్లెపు పోటు వలన రక్తము, నీళ్లు బయటకు వచ్చాయి. ఇక్కడ బల్లెపు కొన లోతుగా గుచ్చుకొనుట ద్వారా గుండె వరకు చేరి అక్కడ ఉన్న కుడి కర్ణిక, కుడి జఠరిక నుంచి రక్తం బయటకు వచ్చింది. ఆ తదుపరి నీళ్లు అనగా దేహములో ఉన్న శ్లేష్మరసము, గుండె చుట్టూ ఉన్న పొర చీల్చబడుటను బట్టి వచ్చిన ద్రవము. వాస్తవాన్ని పరిశీలిస్తే ‘యేసు గొప్ప శబ్దముతో కేకవేసి..’ అనే మాట లూకా సువార్త 23:46లో చూడగలము. ఒక వ్యక్తి చనిపోయే ముందు పెద్దకేక ఏ పరిస్థితుల్లో వేస్తాడు? ఈ విషయంపై తలపండిన వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. సిలువ వేయబడడానికి ముందు సాయంత్రం నుంచి తీవ్రవేదన అనుభవించారు. న్యాయస్థానాల యొద్దకు త్రిప్పడం వలన శరీరం బాగా అలసిపోయింది. కొరడా దెబ్బల ద్వారా చాలా రక్తము పోయింది. తలపై ముళ్లకిరీటం, భారభరితమైన సిలువ మోయడం, చేతుల్లో కాళ్లలో మేకులు కొట్టడం ద్వారా దాదాపుగా చాలా రక్తం యేసుక్రీస్తు దేహంనుంచి బయటకు పోయింది. శరీరం రక్తము, ద్రవములు కోల్పోవుట వలన గుండె రక్తప్రసరణ చేయలేని పరిస్థితి, శ్వాసావరోధము, తీవ్రమైన గుండె వైఫల్యం. వైద్య శాస్త్ర ప్రకారం సిలువపై యేసుక్రీస్తు పెద్ద కేకవేసి చనిపోవడానికి కారణములు ఇవే. ఈ విషయంపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి అనేక పుస్తకాలను కూడా వెలువరించారు. వాటిలో మెడికల్ అండ్ కార్డియోలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్యాషన్ అండ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్, ఎ డాక్టర్ ఎట్ కల్వరి, ద లీగల్ అండ్ మెడికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ట్రయల్ అండ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్’ ప్రాముఖ్యమైనవి. ‘దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను’ అని అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి పత్రిక వ్రాస్తూ తెలియచేశాడు. క్రీస్తు సిలువలో మరణించుట ద్వారా ప్రేమ ఋజువు చేయబడింది. ప్రేమంటే తీసుకోవడం కాదు, ప్రేమంటే ఇవ్వడం అని క్రీస్తు తన ఆచరణతో మానవాళికి తెలియచేశారు. పరిశుద్ధుడైన దేవుడు మానవాళిని పాపబంధకముల నుండి, పాపశిక్ష నుండి విడుదల చేయుటకు తన్నుతానే బలిగా అప్పగించుకున్నాడు. గుడ్‌ఫ్రైడే కేవలం యేసుక్రీస్తు మరణదినం కాదు. మానవుడు పరిశుద్ధతను పొందుకొని నూతనంగా జన్మించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రోజు. సిలువలో యేసుప్రభువు పలికిన సప్తస్వరాలు శిథిలమైపోయిన మానవుని జీవితాన్ని అద్భుతమైన నవకాంతులమయమైన నిర్మాణముగా మార్చివేశాయి. ప్రపంచానికి ఆయన అందించిన వెలలేని ప్రేమ, శత్రువుని కూడా కరిగించగలిగిన ఆయన క్షమాపణ, ఎంతటి దీనులనైనా అక్కున చేర్చుకోగలిగిన ఆదరణ, ఆప్యాయత, చెక్కు చెదరనవని ఆ సిలువలో ఆయన ప్రకటించిన నిత్యజీవము చిరస్థాయిగా నిలిచేదని ఋజువు చేశాయి. దేవుని ప్రేమను రుచిచూచిన ఒక దైవజనుడు ఇలా అంటాడు. ‘అంతులేని పాపము జలరాసుల్లో నన్ను దింపగా సిలువ రక్తము నాకై కార్చితివో, క్రయధనం నాకై చెల్లించితివో! కమ్మనైన నీదు ప్రేమ నాదు కట్లు తెంపెను. నీవు పొందిన గాయము నాకు స్వస్థత నిచ్చెను. ఏమిచ్చి ఋణం తీర్తునయ్యా యేసయ్యా! నా జీవితం అంకితం నీకే.’ అప్పటికే ఆయన చెప్పినట్లు తిరిగి లేస్తాడేమోనని ఆనాటి యూదులు, రోమన్ సైనికులు అనేక కథనాలు రచించుకుని సిద్ధంగా ఉన్నారు. కాని ఆ కథలేవీ సత్యం ముందు నిలబడలేదు. ఆయనను సిలువ మరణం ద్వారా చంపేశామని జబ్బలు కొట్టుకునే యూదులకు, రోమన్లకు మింగుడుపడని వార్త ‘ఆయన సజీవుడై పునరుత్థానుడుగా లేచెను.’ యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి పేరు బైబిల్లో లేదు గాని చరిత్రలో అతని పేరు చూడగలము. ఆ వ్యక్తి పేరు లాజినస్. పిలాతు ఆజ్ఞను శిరసావహించడంలో ప్రథముడు. అతని సమక్షములోనే యేసు మేకులు కొట్టబడ్డాయి. ముళ్లకిరీటం ధరించబడింది. సిలువ ప్రక్రియంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని తన భర్తకు వర్తమానం పంపిన పిలాతు భార్య క్లౌదియ ప్రొక్యులా లాజినస్‌ను కలుసుకుంది ఇలా అడిగింది సిలువలో మరణించిన ‘క్రీస్తుపై నీ అభిప్రాయం ఏమిటి?’. ఆ ప్రశ్నలకు లాజినస్ ఇచ్చిన సమాధానమిది–‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు వచ్చిన చీకటి, సమాధులలో నుండి మనుష్యులు లేవడం, దేవాలయపు తెర పైనుండి క్రిందకు చినగడం చూస్తుంటే తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణపు మెడలు వంచి సజీవుడై బయటకు వస్తాడు. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి బయలుదేరుతాడు. ఈసారి ఆయన్ను ఏ రోమన్ చక్రవర్తి, శతాధిపతి గాని, సైనికుడు గాని, యూదా మత పెద్దలైన శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’ అని బదులిచ్చాడు. క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసు లేఖనాల ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. నా విమోచకుడు సజీవుడు అని యోబు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా పలికాడు. దావీదు కీర్తనలలో కూడా క్రీస్తు పునరుత్థానమును గూర్చి ప్రవచనాలు ఉన్నాయి. ‘నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు’ (కీర్తన 16:10) అనే ప్రవచనం క్రీస్తుకు ముందు వెయ్యిసంవత్సరాల క్రితమే చెప్పబడింది. యెషయా అనే ప్రవక్త క్రీస్తును గూర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. అవన్నీ క్రీస్తుకు ముందు ఏడువందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి. వాటిలో క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూడగలము. అతడు తన్నుతానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యేసుక్రీస్తు పునురుత్థానానికి ఎన్నో ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయి. క్రీస్తు పునరుత్థానానికి ఆయన శిష్యులే ప్రధాన సాక్షులు. ‘శిష్యులు భ్రమలో ఉన్నారు. అందుకే వారు ఎవరిని చూసినా యేసులాగే కనిపించారు అని తలచేవారు’ అని కొందరు వాదిస్తారు. నిజంగా వారికున్నది భ్రమ అయితే అది కొంతకాలమే ఉంటుంది. క్రీస్తు శిష్యులలో చాలామంది హతసాక్షులయ్యారు. తాము నమ్మిన ప్రభువు కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఒక అబద్ధం కోసం అంతమంది ప్రాణాలర్పించరు కదా! ఉదాహరణకు క్రీస్తు శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. క్రీస్తు సువార్త మొదటి శతాబ్దంలోనే భారతదేశంలోనికి వచ్చింది. యేసు శిష్యుడైన తోమా ఆయన తిరిగి లేచాడంటే మొదట నమ్మలేదు. నీవు అవిశ్వాసి కాక విశ్వాసివై యుండు అని ప్రభువు చెప్పిన మాటకు సానుకూలంగా స్పందించి ‘నా దేవా నా ప్రభువా’ అని పలికాడు. అప్పటి నుండి తోమా క్రీస్తు సాక్షిగా జీవిస్తూ అనేకులను సత్యంవైపు నడిపించాడు. తోమా భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే వచ్చి యేసుక్రీస్తు సువార్తను అనేకులకు అందించాడు. అనేక సంఘాలను మరియు దేవాలయాలను కట్టి చివరకు బల్లెము ద్వారా పొడవబడి చనిపోయాడు. యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలు సందర్శించి అనేక వివరాలు సేకరించిన తదుపరి ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలు అన్నింటిని బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశాడు. దాని పేరు ‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగి లేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణీలోకి తీసుకొచ్చినా, అవేవీ వాస్తవం ముందు నిలబడలేదు. అరిమతయియ యోసేపు, నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువనుండి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను ఇంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. తనకోసం తొలిపించుకున్న సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ఇచ్చిన సమాధానం ‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గూర్చి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిస్తూ మరణపు ముల్లును విరచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు. పునః అనగా తిరిగి, ఉత్థానము అనగా లేపబడుట. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికి ఫారోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. సూర్యదేవుని కుమారులమని చాటించుకున్న ఫారోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బబులోను రాజైన నెబుకద్నెజరు మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికీ అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి ఉంది. రోవ్‌ులో జూలియస్ సీజర్ సమాధి మూయబడి ఉంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదని ఋజువుచేయబడింది. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది. అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధిచేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్ల తరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యలమీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనీవినీ ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది. క్రీస్తు పునరుత్థానం మనిషికి నిజమైన శాంతిని సమాధానాన్ని ప్రసాదించింది. డబ్బు, పలుకుబడి, ఆస్తి ఐశ్వర్యాలు ఎన్నున్నా ఈ రోజుల్లో మనిషికి ఆనందం, శాంతి కరువైపోతోంది. శాంతిగా బతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా బయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే. నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది. యేసుక్రీస్తు అలసిపోయిన ప్రజలను చూచి ఇలా అన్నాడు. ‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’. ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును అనుభవిస్తు ఆనందంతో పరవశులౌతున్నారు. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమ్మును విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతనోత్తేజంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు. జర్మనీ దేశంలో క్రీ.శ 1483లో జన్మించిన మార్టిన్ లూథర్ గురించి తెలియని వారుండరు. యవ్వనకాలంలోనే స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో నింపబడినవాడు. సంకుచితత్వానికి దర్పణాలుగా మారిపోయిన స్వార్థజీవులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించాడు. తాను జీవించిన కాలంలో అధికారం మూర్ఖుల చేతుల్లో ఉందని గుర్తించాడు. సగటు మనిషి అన్ని విషయాల్లో బానిసగానే ఉన్నాడన్న విషయాన్ని గుర్తించాడు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. మనిషి చేసే కార్యాల వలన రక్షణ రాదుగాని విశ్వాసం ద్వారానే సాధ్యమని నిరూపించాలనుకున్నాడు. రాత్రింబగళ్ళు విశేషంగా ప్రయాసపడ్డాడు. ఆనాటి మతాధికారులకు ఎదురు తిరగడమంటే మరణాన్ని కోరుకోవడమే. ఒకరోజు మార్టిన్ లూథర్ నిరాశ నిస్పృహతో నీరుగారిపోయాడు. ఇంటిలో ఓ బల్లపై ముఖాన్ని వాల్చి ఏడుస్తున్నాడు. భయరహిత వాతావరణం సృష్టించుకొని ముందుకు సాగడం కష్టం అనిపించింది. దుఃఖిస్తున్న తన భర్తను చూచిన కేథరిన్ గబగబా లోపలికి వెళ్ళి నల్లబట్టలు వేసుకొని లూథర్ ముందు నిలబడింది. జర్మనీ దేశంలో ఏదైనా దుర్వార్తను తెలియచేసే సందర్భంలో నల్లబట్టలు ధరిస్తారు. ‘నేను ఇప్పటికే దుఃఖములో ఉన్నాను. నీవు తీసుకొచ్చిన మరొక దుర్వార్త ఏమిటని ప్రశ్నించాడు’. ‘యేసుక్రీస్తు చచ్చిపోయాడు’ అని జవాబిచ్చింది కేథరిన్. నీవు చెప్పేది వాస్తవమే గానీ క్రీస్తు మరణించి తిరిగి లేచాడు గదా! లూథర్ కొంచెం స్వరం పెంచి అన్నాడు. కేథరిన్ లూథర్ భుజం మీద చెయ్యి వేసి ‘క్రీస్తు మరణాన్ని జయించి లేచాడని నమ్మే ప్రతి ఒక్కడూ ఏవిషయానికీ బెదిరిపోడు, చింతించడు. తుది శ్వాస వరకు నాభర్తలో ధైర్య సాహసాలను, దేవునిపై అచంచల విశ్వాసాన్ని మాత్రమే నేను చూడాలనుకొంటున్నాను’ అని కేథరిన్ మాట్లాడుతుండగానే లూథర్‌లో ఉన్న భయం పటాపంచలయ్యింది. అప్రతిహతంగా ముందుకు సాగిపోయి ఉత్తమ వ్యక్తిగా ఎదిగాడు. తాను అనుకున్న వాటిని దైవిక బలంతో, దృఢ విశ్వాసంతో సాధించగలిగాడు. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికాడు. సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికీ పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్లు తెరుచుకొనేలా చేసింది. మానవునికి ముగింపు లేదని ఒక అపూర్వమైన అనిర్వచనీయమైన నిత్యత్వమనేది వుందని గొంతు చించుకొని చాటి చెప్పింది. దుఃఖముతో, నిరాశతో, నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశా కిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడయ్యి పోయింది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో కోట్లమంది సమైక్యంగా పోరాడినను మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యసనాలు, దౌర్భాగ్యమైన శారీరక కోరికలు, పాపపు ఇచ్ఛలు, విచ్చలవిడి పాపకార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని, పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తిచేత మాత్రమే సాధ్యం. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు కులమతాలకు అతీతమైనవి. ఇది మానవ హృదయాలకు సంబంధించినది తప్ప ఈ భౌతికానుభవాలకు చెందినది కాదని యేసుక్రీస్తును రక్షకునిగా రుచి చూచిన వారందరికీ యిట్టే అవగతమవుతుంది. లోక వినాశనానికి మూలకారకుడైన అపవాది క్రియలను లయపరచుటకే యేసు క్రీస్తు ప్రత్యక్షమాయెనని సత్యగ్రంథమైన బైబిల్ గ్రంథం స్పష్టపరచింది. సాక్షి పాఠకులకు ఈస్టర్ శుభాకాంక్షలు. డా. జాన్‌వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు..
సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. మార్కు 1:30. ఒక వ్యక్తి పడి ఉంటే ఆనందించేవారు లోకంలో కొందరుంటారు. నిలబడినవారిని సయితం పడగొట్టాలని ప్రయత్నం చేసేవారూ లేకపోలేదు. అయితే ఎందుకు కొరగాని వారిని ఎన్నుకొని వారికి సముచిత ప్రోత్సాహాన్ని అందించి వారిని సమసమాజ నిర్మాణం కోసం వాడుకోగలిగిన మహనీయుడు నిత్య దేవుడు. ఇశ్రాయేలు దేశంలోని కపెర్నహూము అనేది చారిత్రాత్మక ప్రదేశం. దానికి యేసు పట్టణం అనే పేరు కూడా ఉంది. మొదటి శతాబ్దపు చరిత్ర ఆనవాళ్లు నేటికీ అక్కడ కనబడుతుంటాయి. సమాజ మందిరం నుండి యేసుప్రభువు సీమోను ఇంటికి వెళ్ళాడు. అడుగుపెట్టగానే ఆయన దృష్టి జ్వరంతో పyì ఉన్న పేతురు అత్తమీద పడింది. ఆ ఇంటిలో చాలామంది ఉన్నారు కానీ యేసుక్రీస్తు దయగలిగిన చూపు వ్యాధితో బాధపడిన వ్యక్తి మీదకు మరలింది. అవును! ఆయన దృష్టి ఎప్పుడూ అభాగ్యుల మీదనే. ఎక్కడ సమస్య ఉందో... ఎక్కడ కన్నీరు ఉందో... ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడికే క్రీస్తు పాదాలు నడిచాయి. ఆ సమస్యకు పరిష్కారమిచ్చుటకు ఆయన ప్రేమ అలాంటి స్థలాలకు ఆయనను నడిపించింది. మేలు చేయడానికి ముందు సీమోను పేతురు తన అత్త పరిస్థితిని ప్రభువుతో చెప్పుకున్నాడు. ఆయన ఓపికతో విన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించువాడు గదా! మనుష్యుల విన్నపాలు వినడంలో ఆయనకున్నంత ఓపిక ఈ విశ్వంలో ఎవ్వరికైనా ఉందా? మనుష్యుల హృదయాంతరంగాన్ని అర్థం చేసుకోవడంలో ఆయనకున్న ఓర్పు మరెవ్వరికైనా ఉందా? నా దేవుడు నా గోడు వింటాడు అనే నమ్మికతో ఆయన పాదాల దగ్గర మోకరిల్లిన వారిని తోసివేసిన సంఘటన ఒక్కటైనా ఉందా? జీవన సంఘర్షణలో శాంతిమార్గాన్ని వెదుక్కొంటూ క్రీస్తు వద్దకు వచ్చినవారు నిరాశతో వెనుదిరిగినవారు కనిపిస్తారా? తన అత్త దుస్థితినంతా వివరించిన పేతురు ద్వారా ఆ కుటుంబానికి మేలు జరిగింది. తీవ్ర జ్వరంతో పడి ఉన్న ఆమెను యేసుక్రీస్తు చేయిపట్టి లేవనెత్తి స్వస్థపరిచారు. వెంటనే ఆమె లేచి అక్కడున్నవారికి ఉపచారం చేయడం ప్రారంభించింది. ప్రియ మిత్రమా! ఎంతకాలం మౌనంగా విలపిస్తావు? తీవ్రమైన నిరుత్సాహంతో కుమిలిపోతావు? ఇప్పుడే మాట్లాడు... నిన్ను ప్రేమించు నీ దేవుడు నీ ప్రార్ధన వింటున్నాడు. నీ వేమి చెప్పాలనుకుంటావో చెప్పు! కరుణావాత్సల్యాలు నీపై కుమ్మరించు నీ ప్రభువు నిన్ను నిరుత్సాహపరచడు. ఎంతసేపు మాట్లాడాలనుకుంటావో మాట్లాడు...ఆయన విసుగు చెందడు. నీ భారం ఎంత ఆయనపై మోపినా ఆయన అలసిపోడు. నీకు మేలు చేయడంలో దేవుడు ఎప్పుడూ సంసిద్ధుడే! నీవు చెప్పే నీ కష్టాల చరితను మనుష్యులు ఒకసారి వింటారేమో! రెండుసార్లు వింటారేమో. ఆ తర్వాత వారికీ విసుగొస్తుంది గనుక ముఖం చాటేస్తారు. నీ దేవుడు అలాంటివాడు కాదు. ఎన్నిసార్లు ఆయన పాదసన్నిధికి వచ్చి ఆయన్ను తండ్రి అని పిలిచినా ఆయన ప్రసన్నమైన వదనంతో జవాబునిస్తాడు. నీ స్థితిని చక్కదిద్ది ఊహించలేని మేళ్లు నీ జీవితంలో చేస్తాడు. – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
జగమంత వెలుగులో క్రిస్మస్
ధైర్యం ముందుకు నడిపిస్తుంది.. నింగిలోని నక్షత్రం ఆ దారికి వెలుగు పడుతుంది.. నమ్మకం ఆ నక్షత్రానికి వెలుగును అద్దుతుంది.. ఆ నమ్మకమే ఓ విశ్వాసమైంది ‘క్రీస్తు’గా! ఆ సందర్భమే వేడుకైంది ‘క్రిస్మస్’గా!! ఇటలీలోని జెనొవా నగరంలో 1451వ సంవత్సరంలో ఒక బిడ్డ జన్మించాడు. పుట్టినప్పుడు బహుశా ఎవ్వరూ ఊహించి ఉండకపోవచ్చు ఆ బాలుడు ప్రపంచానికే దీవెనకరంగా మారతాడని. అతని పేరు క్రిస్టఫర్ కొలంబస్. ప్రపంచం మరువలేని సముద్ర అన్వేషకుడు. తన అన్వేషణలో భాగంగా తన బృందంతో కలసి ఆజోర్సా ద్వీపాలు దాటాడు. కనుచూపు మేరలో ఎక్కడా భూభాగం కనిపించడం లేదు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నీలిసముద్రంలో కష్టమని తోచిన నావికుడు అడిగాడు ఏం చేద్దాం అని. దానికి కొలంబస్ ఇచ్చిన సమాధానం ‘ముందుకే వెళ్దాం’. కొలంబస్ మాట ప్రకారం నావికుడు నావను ముందుకు పోనిచ్చాడు. కాసేపటికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు. ఈ రాత్రి సముద్రం మనలను కబళించజూస్తుంది. ఒక్కమాట చెప్పు, ఆశలన్నీ అడుగంటాక చేసేదేమీ ఉండదు. కొలంబస్ నోట నుంచి వచ్చిన ఒకేఒక్క మాట ‘ముందుకే సాగుదాం’. సముద్రపు నీళ్ళను చీల్చుకుంటూ ముందుకు సాగుతున్న నావలో కొన్ని గంటల తర్వాత పనివాళ్ల తిరుగుబాటు ధోరణుల మధ్య వినిపించిన కేకలు ‘రేపు ఉదయం కూడా భూమి కనబడకపోతే ఏం చేద్దాం?’ ధీర కొలంబస్ది ఒకటే జవాబు అప్పుడు కూడా ముందుకు సాగిపోవడమే. వెనుతిరగని దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోయిన కొలంబస్కు విజయం లభించింది. ఓ అద్భుతమైన భూభాగాన్ని కనుగొని ప్రపంచాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించాడు. ఎన్ని అవరోధాలు ఎదురొచ్చినా ‘ముందుకే సాగిపో’ అనే నినాదం కచ్చితంగా విజయతీరాలకు నడిపిస్తుంది. సరిగ్గా రెండువేల సంవత్సరాల కిందట... ఇలాంటి సంఘటనే ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు జరిగింది. ఇజ్రాయేలు దేశంలోని ఓ కుగ్రామమైన బేత్లెహేములో పశువుల తొట్టెలో యేసుక్రీస్తు జన్మించారు. వాస్తవానికి నజరేతు నుంచి యోసేపు, మరియలు జనసంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకొనుటకు బేత్లెహేమునకు వచ్చారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం మీకా అనే ప్రవక్త క్రీస్తు జన్మించే స్థలాన్ని గూర్చి ప్రవచించాడు. బేత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను (మీకా 5:2). ప్రజలను పాలించే నిజమైన పరిపాలకుడు బేత్లెహేములో జన్మిస్తాడని చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడునట్లు యోసేపు, మరియలు కష్ట పరిస్థితిలో ప్రయాణం చేసుకుంటూ బేత్లెహేము చేరుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలోని లూకా సువార్త రెండవ అధ్యాయం చదివితే ఎన్నో చారిత్రక అంశాలు వెలుగులోనికి వస్తాయి. ఆ అధ్యాయంలో ప్రస్తావించిన సీజర్ అగస్టస్, కురేనియు చరిత్రలో కనిపిస్తారు. ఈ మధ్యకాలంలో రస్సెల్ అనే పురాతత్వ శాస్త్రవేత్తకు లభించిన కొన్ని చర్మపు కాగితాలలో ఆ కాలంలో జరిగిన జనసంఖ్య వివరాలు బయటపడ్డాయి. పశువులతొట్టెలో యేసుక్రీస్తు జన్మించుట ద్వారా ఆయన అందరికీ అందుబాటులో ఉండే దేవుడు అని రుజువు చేయబడింది. ఆయన జన్మించిన తరువాత మొట్టమొదటగా ఆయన్ను దర్శించినవారు సామాన్యులైన గొర్రెల కాపరులు. క్రీస్తు ఎక్కడో అంతఃపురంలో పుట్టి ఉన్నట్లయితే సామాన్యులు ఆయన్ను చూడగలిగేవారు కాదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా యోసేపు, మరియలు బేత్లెహేమునకు రావడంలో ‘ముందుకే సాగిపో’ అనే ఆలోచన కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ప్రయాణ కష్టం, ఒంటరితనం వారిని ఆపలేకపోయాయి. దేవుని చిత్తమును నెరవేర్చడంలో వారికున్న సంసిద్ధత నేటి తరంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమే. దివిలో దివ్యనక్షత్రం ఎప్పటి నుండో నక్షత్రాలపై పరిశోధన చేస్తున్న కొందరు వ్యక్తులకు ఆకాశంలో ఓ విచిత్ర నక్షత్రం తారసపడింది. అది ఒక ప్రత్యేక నక్షత్రం అని వారు గుర్తించి దానిని వెంబడించడం ప్రారంభించారు. యాకోబులో నక్షత్రం ఉదయించును అనే ప్రవచనం ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది. దేవుడు సృష్టించిన విశాల వినీలాకాశంలో వింతగొలిపే అద్భుతాలు కోకొల్లలు. రాత్రివేళ ఆకాశంలో చక్కని చుక్కలు కనువిందు చేస్తాయి. మానవుని కన్ను ఆకాశంలో మూడువేల నక్షత్రాలను లెక్కపెట్టగలదట. అంతమాత్రాన ఆకాశంలో మూడు వేల నక్షత్రాలే ఉన్నాయనుకుంటే పొరపాటే. ఇటలీ శాస్త్రవేత్త గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత అంతరిక్ష పరిశోధన కొత్త పుంతలు తొక్కింది. నక్షత్ర సముదాయాన్ని పాలపుంత అని పిలిస్తే ఒకొక్కొ పాలపుంతలో సుమారుగా పదివేల కోట్ల నక్షత్రాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అలాంటి విస్తుగొలిపే పాలపుంతలు కోట్లకొలది విశ్వంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అవన్నీ సర్వోన్నతుడైన దేవుని మహిమను చాటిచెబుతున్నాయి. నక్షత్ర పరిశోధకులైన ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తును ఆరాధించుటకు బయలుదేరారు. సుదూర ప్రయాణానికి వారి కుటుంబాలను, ప్రాంతాలను విడిచి బయలుదేరినప్పుడు వారు చాలా సమస్యలు ఎదుర్కొని ఉండవచ్చు. ఇక్కడ కూడా ‘ముందుకే సాగిపో’ అనే నినాదం చాలా బాగా పనిచేసింది. బాలుడైన యేసును చూడాలని పట్టుదలతో వారు బయలుదేరారు. దేవుని ఆరాధించడమే మన లక్ష్యం, మన గమ్యం అంటూ వారు ప్రారంభించిన ప్రయాణం అభినందనీయం. ఆకాశంలో కనిపించిన వింత తార వారికి దారిచూపడం ప్రారంభించింది. పరిశుద్ధ గ్రంథంలో ఆ నక్షత్రానికి ‘ఆయన నక్షత్రం’ అని పేరు పెట్టబడింది. గగనంలో పుట్టిన ఆ తార గురించి ఎన్నో విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. సూపర్ నోవా, హేలీ తోకచుక్క, గ్రహాల కలయిక లాంటి వాదాలు చలామణిలో ఉన్నాయి. అన్నిటికన్నా ప్రాముఖ్య విషయం ఏమిటంటే ‘దేవుడు సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనదేదీ ఉండదు’ అని నమ్మే దేవుని బిడ్డలు ఇది కచ్చితంగా ఓ అద్భుతమే అని విశ్వసిస్తారు. గగన వీధుల్లో మెరిసిన ఆ దివ్య నక్షత్రం జ్ఞానులకు దారి చూపింది. ఆ తారను అనుసరిస్తూ వెళ్ళిన జ్ఞానులలో ఒకరు భారతదేశానికి చెందిన వారని చరిత్ర చెబుతుంది. ఆ వ్యక్తి బంగారాన్ని కానుకగా యేసుక్రీస్తుకు ఇచ్చాడు. మిగతా ఇద్దరు జ్ఞానులు సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించారు. వారు కానుకలుగా ఇచ్చిన ఆ మూడు యేసుక్రీస్తు మూడు ప్రాముఖ్యమైన లక్షణాలను వివరిస్తున్నాయి. సువర్ణం ఆయన దైవత్వానికి, సాంబ్రాణి ఆయన ఆరాధనీయుడు అని బోళము ఆయన మనుషుల కొరకు అనుభవించే శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాయి. ‘వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి తల్లియైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి’– (మత్తయి 2:1011). ఒకసారి ఒక తల్లి తన కుమారుని చేతిని పట్టుకొని సంధ్యవేళలో గ్రామంలో నడుస్తున్నారు. చల్లని పిల్లగాలులు చుట్టునున్న చెట్లనుండి వీస్తుండగా మట్టిరోడ్డుపై అడుగులు వేస్తున్నాడు ఆ కుమారుడు. ఆ గ్రామంలో చాలామంది ఇంటి మీద ఒక నక్షత్రం ఉండడం ఆ కుమారుడు గమనించి తల్లిని ప్రతి ఇంటి మీద ఒక నక్షత్రం ఎందుకు ఉంది? దాని ప్రత్యేకత ఏమిటి? అని అడిగాడు. దానికి తల్లి ఈ గ్రామంలో అనేకమంది దేశ రక్షణ కొరకు యుద్ధానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయినారు. అలా దేశరక్షణలో తమ ప్రాణాలు కోల్పోయిన వీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఇంటి మీద నక్షత్రం పెట్టడం ఈ గ్రామంలోని వారికి అలవాటు. కొంత దూరం వెళ్ళాక ఒక చర్చి మీద కూడా కాంతిమంతమైన ఒక నక్షత్రం కనబడింది. అమ్మా! చర్చిమీద డిసెంబరు నెలలో నక్షత్రం ఎందుకు పెడతారు అని ప్రశ్నించాడు. దానికి అ తల్లి ‘‘దేవుడు మనలను ప్రేమించి రెండువేల సంవత్సరాల క్రితం మనిషిగా ఈ లోకానికి ఏతెంచారు. మనుషులందరినీ రక్షించడానికి ఏమీ లేనివానిగా పుడమిపై జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఒక దివ్య నక్షత్రం వెలసింది. దేవదేవుని దివ్య ప్రేమకు, త్యాగమునకు, ఆయన ఈ లోకానికి వచ్చారనుటకు గుర్తుగా ఆ నక్షత్రాన్ని పెట్టారు’ అని తల్లి సమాధానమిచ్చింది. క్రీస్తు ఆరాధనే క్రిస్మస్ ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి తన ప్రాణం పెట్టి సర్వమానవాళిని రక్షించుటకు వచ్చారు. ఆయన సశరీరునిగా ఈ లోకానికి దిగివచ్చిన సంతస సందర్భాన్ని క్రిస్మస్‌గా జరుపుకుంటాము. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. క్రిస్మస్ పండుగ ఆచారాలకు సంబంధించిన పండుగ కాదు. ఇది ఆత్మీయతను పెంచే అనిర్వచనీయమైన అనుభవం. క్రీస్తును హృదయంలో కలిగియున్న ప్రతి ఒక్కరూ పరవశమొందే సమయం. ప్రపంచంలో అనేక పండుగలు కొన్ని ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, సంస్కృతులకు మాత్రమే పరిమితమై ఉంటాయి. క్రిస్మస్ విశ్వవ్యాప్తంగా సంతోషంగా జరుపుకునే పండుగ. క్రిస్మస్ ఒక మతానికి లేదా ఒక సమాజానికి సంబంధించినది కాదు. మానవులందరికీ శుభాన్ని కలుగజేసే పండుగ. ఎందుకంటే సర్వసృష్టిని తన నోటి మాటద్వారా కలుగజేసిన సర్వవ్యాపి, సర్వజ్ఞాని అయిన దేవదేవుడు శరీరధారిగా ఈలోకానికి అరుదెంచిన శుభఘడియ. క్రిస్మస్ సంతోషాల పండుగ, సమాధానమునిచ్చే పండుగ. కుమారుడిగా అవతరించిన యేసు ఈ లోకములో ప్రతి మనిషి జన్మించిన తరువాత అతని వివరాలు, లక్షణాలు, ప్రవర్తన మొదలగు విషయాలు చెప్పగలరు. ఆ వ్యక్తి ఎదుగుతున్న కొలది అతని జీవినవిధానమును వివరించవచ్చును. యేసుక్రీస్తు ప్రభువు జన్మించడానికి ముందు కొన్ని వందల సంవత్సరాల ముందు అనేకమంది ప్రవక్తలు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రవచించారు. యేసుక్రీస్తు ప్రవక్తల ప్రవచన సారం. ఆయన జన్మించే స్థలం, ఎవరికి జన్మిస్తారు, ఆయన పరిచర్య విధానం ఎలా ఉండబోతోంది, ఆయన మరణించే విధానం, మహత్తరమైన ఆయన పునరుత్థానం గురించి ముందే ఉల్లేఖనాల్లో ప్రవచించబడ్డాయి. ఆయన జన్మించడానికి ఏడు వందల సంవత్సరాలకు ముందు ఝెషయా అనే దైవప్రవక్త ఇలా ప్రవచించాడు ‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను’–(ఝెషయా 9:6). పరిశుద్ధుడైన దేవుడు సర్వలోకానికి కుమారుడుగా దిగివచ్చి నిత్యనరకాన్ని తప్పించుటకు తన్నుతాను రిక్తునిగా చేసుకుని రక్తమాంసాలు ధరించుకుని వచ్చాడు. ‘ఆయన భుజమున రాజ్యభారముండును’ అని ప్రవక్త ప్రవచించినట్లుగా తన ప్రజల భారం ఆయనే భరిస్తాడు. వారిని ప్రయాసల నుండి విడిపిస్తాడు. ఆ ప్రవచన నెరవేర్పుగా యేసు ‘ప్రయాసపడి భారం మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’ అని సమస్త మానవాళినీ ఆహ్వానించారు. ఒక నక్షత్రానికి అయిదు కోణాలు ఎలా ఉంటాయో ఝెషయా ప్రవచించినట్లుగా అయిదు గొప్ప విషయాలు ప్రభవైన యేసును గురించి చెప్పబడ్డాయి. యేసు ప్రభువును గురించి చెప్పబడిన ప్రతి మాట ఆయన జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఆయన ఆశ్చర్యకరుడు– ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యకరమైన కార్యాలను నెరవేర్చువాడని అర్థం. దేవుని ద్వారా చేయబడేవన్నీ ఆశ్చర్యమే. ఆయన కలుగచేసిన సృష్టి ఆశ్చర్యము. పరిశీలించి చూస్తే దేవుని మహత్తయిన సృష్టి, దాని నిర్వహణ మనుషులకు నేటికీ అంతబట్టని రహస్యమే. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇలా అంటాడు. ‘ఇన్ని విస్తృత పరిశోధనల తరువాత మనిషి విశ్వం గురించి తెలుసుకొన్నది ఒక్క శాతం మాత్రమే’. మానవ జన్మ ఆశ్చర్యకరమైనది. ‘నేను పుట్టిన విధమును చూస్తే నాకు భయమును, ఆశ్చర్యమును కలుగుచున్నవ’ని దావీదు తన కీర్తనలో మానవ జన్మ విశిష్ఠతను వివరించాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన మహిమ యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన కాలంలో అనేక ప్రాంతాలు సంచరిస్తూ ప్రజలకు అనిర్వచనీయమైన మేలు చేశారు. అనేకుల ఎదుట ఆశ్చర్యకార్యాలు జరిపించి ఆశ్చర్యకరుడు అని రుజువు చేయబడ్డారు. క్రీస్తు పరిచర్య ప్రారంభంలో గలిలయలోని కానా అనే ప్రాంతంలో జరుగుచున్న వివాహానికి యేసు ప్రభువు, ఆయన శిష్యులు, తల్లియైన మరియ ఆహ్వానించబడ్డారు. ఆ సమయంలో వివాహానికి వచ్చినవారందరికీ గౌరవప్రదముగాను, మర్యాదపూర్వకముగాను ద్రాక్షారసం ఇవ్వడం యూదుల ఆచారం. కొంతసేపటికి వారు సిద్ధపరచుకున్న ద్రాక్షారసం అడుగంటిపోయింది. వివాహం జరుగుతున్న ఇంటివారి పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వారు ఎదుర్కొంటున్న కలవరం, ఆందోళన, అవమానం తాండవమాడుతున్న వేళ ఆశ్చర్యకరుడైన యేసు అద్భుతాన్ని జరిపించారు. అక్కడున్న పరిచారకులను పిలిచి ఆరుబానలను నీటితో అంచుటమట్టుకు నింపమని చెప్పారు. వారు ఆ విధంగా చేయగానే ఆ సాధారణ నీరు మధురమైన ద్రాక్షారసంగా మారిపోయింది. గలిలయలోని కానాలో యేసు ఈ సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి అని యోహాను తన సువార్తలో తెలియచేశాడు. ఆ కానా విందులో యేసుప్రభువు చూపిన మహిమను ఆ యింటి వారి జీవితంలో ఎన్నడు మరచిపోలేరు. ఆరోజు ఆ యింటి వారి మీదకు వచ్చే అవమానం ఆయన వలన తొలగిపోయింది. ఆయన ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టే ఆ యింటివారు ధైర్యంగా ఉండగలిగారు. దేవున్ని మన జీవితంలోనికి ఆహ్వానిస్తే అవమానం తొలగిపోతుంది. ఊహించలేని గొప్ప ధైర్యం కలుగుతుంది. యేసుప్రభువు సాధారణమైన నీటిని విలువైన ద్రాక్షారసంగా మార్చాడు. విలువలేని వాటికి విలువనిచ్చేవాడు ప్రేమమయుడైన దేవుడు. మనుషులు లోకరీత్యా విలువైన వాటిని మాత్రమే పట్టించుకుంటారు. అటువంటి వారితో మాత్రమే స్నేహం చేస్తారు. యేసుప్రభువు దీనులను లక్ష్యపెడతాడు. ఆయన ఎదుట దీనులుగా సాగిలపడితే వారిని ఉన్నతమైన స్థానములో నిలవబెడతాడు. రుచి లేని నీటికి రుచిని కలుగజేశాడు. మధురమైన అనుభవాన్ని అందించాడు. హృదయాలను వెలిగించే దైవం చాలా సంవత్సరాల క్రితం ఒక పార్కులో ఒక అక్క తమ్ముడు కూర్చుని పరిశుద్ధగ్రంథాన్ని చదువుకుంటున్నారు. అటుగా పోతున్న ఒక నాస్తికుడు వారిని చూచి దగ్గరగా వచ్చి వారిని ‘మీరెందుకు బైబిల్ చదువుతున్నారో నాకు అర్థం కావట్లేదు. బైబిల్ దైవగ్రంథం కాదు. అసలు దేవుడనే వాడే లేడు. ఈ సృష్టంతా దానికదే వచ్చింది. దేవున్ని మానవుడే తనకున్న భయాలలో సృష్టించుకున్నాడు. ఈ చెడ్డ పుస్తకం మీకు ఎన్నడు ప్రయోజనాన్ని చేకూర్చదు’ అని వ్యంగ్యంగా అన్నాడు. అతని మాటలు విన్న తర్వాత అక్క లేచి ఇలా అంది. ‘ఒకప్పుడు నా తమ్ముడు తాగుబోతుగా, తిరుగుబోతుగా జీవించేవాడు. జూదశాలలో తన సమయమంతా గడిపేవాడు. తల్లితండ్రులను లెక్కచేసేవాడు కాదు. ప్రేమ ఆప్యాయతలకు అతని జీవితంలో చోటు లేదు. క్రూరంగా ప్రవర్తించేవాడు. అలాంటి వ్యక్తిలో మార్పు వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఒకరోజు బైబిల్ చదవడం ద్వారా దేవుని గురించిన సత్యాన్ని అంగీకరించి యేసుక్రీస్తును తన హృదయంలోనికి ఆహ్వానించాడు. వెలుగైన దేవుడు తన హృదయంలోనికి ఆహ్వానించినందు వలన చీకటంతా తొలగిపోయింది. జీవితం పావనమయింది. వినూత్నమైన మార్పులను అతని జీవితంలో మేం గమనించగలిగాము. ఒకప్పుడు ఎందుకూ పనికిరాకుండా తిరిగిన వ్యక్తి ఇప్పుడు కష్టించి పనిచేసి తన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇంటికి తీసుకొస్తున్నాడు. తల్లితండ్రులను ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. శాంతి సమాధానాలతో బ్రతుకుతున్నాడు. ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసుకుంటున్నాడు. నీవనుకుంటున్నట్టు ఈ గ్రంథం చెడ్డదైతే, భయంకరంగా చెడిపోయిన వ్యక్తిలో ఇంత మంచి మార్పును ఎలా తీసుకురాగలదు?’ హృదయాంతరంగంలో నుండి వచ్చిన వాస్తవమైన జీవితానుభవాలకు నిశ్చేష్టుడై తల దించుకొని వెళ్ళిపోయాడు ఆ నాస్తికుడు. మనుషుల హృదయాల్లో దేవుడు కలిగించు మార్పు చాలా ఉన్నతమైనది. టి.యస్ ఇలియట్ అనే కవి ఇలా రాశారు.. ‘నిరాశాపూరితమైన, శూన్యమైన ఈ భూమిలో నీళ్లు లేవు కేవలం బండరాయి తప్ప. మన ఆత్మ బీడుభూములలో తిరుగుతుంటుంది. యేసు అనే జీవజలపు ఊట ఆ హృదయాన్ని తాకేదాకా!’ ఉన్నత శిఖరాలకు నడిపేది దేవుని ఆలోచనే ఆలోచన కర్త: ప్రతిదేశానికీ ఆలోచనకర్తలు ఉంటారు. ప్రభుత్వాలు సరిగా ప్రజలకు మేలు చేసే పరిపాలన అందించాలంటే వారికి ఎలాంటి సహాయం చేయాలి, బాగా ఎలా పరిపాలించాలి, విపత్తులు కలిగినపుడు ప్రజలకు ఎలాంటి సహాయం అందించాలి లాంటి ఆలోచనలు చెప్పే వ్యక్తులు ప్రత్యేకంగా ఉంటారు. నిజజీవితంలో కూడా అలోచన చెప్పే వ్యక్తులుండడం చాలా అవసరం. కొంతమంది ఎవరి ఆలోచన వినకుండా అన్నీ తమకే తెలుసు అనుకుంటారు. అలాంటివారు మొదట కష్టాలలో పడిపోయి తీరని నష్టాన్ని పొందుతారు. మంచివారి అలోచనలు చాలా అవసరం. పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ పెట్టుకోవాలన్న సామెత మనకందరికీ విదితమే. లోకంలో మనుషుల ఆలోచనలు కొంతమట్టుకు మేలు చేయవచ్చును. అయితే దేవుని ఆలోచన మరింత శ్రేష్ఠమైనది. క్షేమకరమైనది. దేవుని ఆలోచన ప్రకారం నడిస్తే ఎప్పుడు తొట్రిల్లరు, ఓడిపోరు. ‘నీకు ఆలోచన చెప్పెదను నీవు నడువవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను’ అని ప్రభువు మాట్లాడుతున్నారు. పవిత్రమైన ఆలోచన పవిత్రకార్యాలు చేయడానికి దోహదపడుతుంది. కొంతమంది చెడిపోయిన వారి ఆలోచనలు విని వారి మాటల ప్రకారం నడిచి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. దేవుడు తన మాట ద్వారా నిత్యం మనలను నడిపించాలని కోరుతున్నాడు. ఆయన ఆలోచన ప్రకారం నడిస్తే మన జీవితాలు ధన్యకరమవుతాయి. జీవితంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసిన సమయంలో అనేకులు తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. సరియైన వ్యక్తుల నిర్ణయాలు కాకుండా పరిపక్వత లేనివారి నిర్ణయాలు తీసుకుంటారు. నీవు ఎటువెళ్ళాలో తెలియని సందిగ్ధంలో ఉన్నపుడు అందరి దగ్గరకు పరుగెడుతున్నావా? నీకు సరిగా ఆలోచన చెప్పి ఉన్నత స్థానమునకు ప్రభువు నడిపిస్తారు. యేసు ప్రభువు జన్మించినపుడు జ్ఞానులు రాజైన హేరోదు దగ్గరకు వచ్చారు. ప్రవచనానుసారం యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగారు. హేరోదు రాజు శాస్త్రులను పిలిపించి క్రీస్తు పుట్టే స్థలాన్ని గురించి అడిగాడు. బేత్లెహేములో పుడతాడన్న కచ్చితమైన ప్రవచనాన్ని వారు చూపించారు. అప్పుడు హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి నక్షత్రం కనబడిన కాలాన్ని వారిచేత పరిష్కారంగా తెలిసికొని మీరు వెళ్ళి ఈ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానం తెమ్మని వారిని బేత్లెహేముకు పంపాడు. ఇందులో హేరోదు దురుద్దేశాలు ఎన్నో కనబడుతున్నాయి. వాస్తవానికి హేరోదు భయంకరమైన క్రూరుడు. తన సింహాసనానికి అడ్డు వచ్చే ప్రతి ఒక్కరినీ హతమార్చాలనే దుర్బుద్ధి కలిగినవాడు. అలాంటి వాడు క్రీస్తును ఎందుకు ఆరాధిస్తాడు? ఆయన ఆధిపత్యానికి ఎందుకు ఒప్పుకుంటాడు? అయితే జ్ఞానులు రాజు మాటను బట్టి పోతుంటే, మళ్లీ దేవుని నక్షత్రం దారి చూపించింది. వారు క్రీస్తును కనుగొని ఆయన్ను ఆరాధించిన తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని దేవుని చేత బోధింపబడినవారై వారు మరొక మార్గంలో తమ దేశానికి తిరిగి వెళ్లారు. వారు హేరోదు మాట, ఆలోచన అనుసరించి నడిచినట్లయితే వారు చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేవారేమో! దేవుని ఆలోచన వారిని క్షేమంగా తమ దేశానికి నడిపించింది. దేవుని నడిపింపు ఎప్పుడూ జీవన రాగాన్ని శ్రుతి తప్పనీయదు. ఆత్మలోని పాటను ఆగిపోనియదు. భ్రాంతులెన్నో చెలరేగి దారికానక కప్పేసినప్పుడు దేవుని ఆలోచన కాంతిపుంజమై ఉన్నత శిఖారాలకు నడిపిస్తుంది. బలహీనులను బలపరచే దేవుడు బలవంతుడైన దేవుడు: సకలాశీర్వాదములకు కర్తయైన దేవుడు బలహీనులకు బలాన్నిచ్చువాడు. ఈ బలం శారీరక బలం కాదు. దేవుడు అనగా పాపాన్ని జయించటానికి, పాపంలో ఉన్నవారిని విడిపించి వారిని పరిశుద్ధులుగా చేయడానికి బలవంతుడై ఉండాలి. ఈనాడు అనేకమంది పైకి చూడడానికి బలవంతులుగా ఉన్నారు కాని, వారి మనసు ఎంతో బలహీనంగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం సింహబలునిగా పేరుగాంచిన మైక్ టైసన్ బాక్సింగ్ రంగంలో ఎంతోమందిని ఓడించాడు. ఆయనతో పోరాడాలంటే భయపడుతుండేవారు. అనేక సంవత్సరాల పాటు బాక్సింగ్ రంగంలో తిరుగులేని విజేతగా నిలిచాడు. ఇంత బలవంతుడైన మైక్ టైసన్ మానసికంగా ఎంతో బలహీనుడు. శరీరవాంఛలను జయించలేక అనేక నేరాలకు పాల్పడి శిక్షలకు గురై తాను సంపాదించుకున్న డబ్బును, పేరును కోల్పోయిన బలహీనుడు. ప్రతి ఒక్కరూ బలవంతులుగా ఉండాలనేది దేవుని కోరిక. బలవంతుడైన దేవుడు బలహీనులను బలపరుస్తాడు. బలహీనతలు మూడు రకాలు: ఒకటి శారీరక బలహీనత. తమ దేహాలను పట్టిపీడిస్తున్న రోగాలు, వ్యాధులు, బలహీనతలు వారిలోని సంతోషాన్ని హరించేస్తున్నాయి. ఎన్నో మందులు వాడి, వైద్యుల చుట్టూ తిరిగి తమకున్నదంతా ఖర్చు పెడుతున్నారు. బైబిలు గ్రంథంలో ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతుంది. ఆమె యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు, బాగుపడతానని అనుకుని ఆయన వద్దకు వచ్చి ఆయనను ముట్టగానే ఆమె వ్యాధి నయం అయింది. అన్ని సంవత్సరాల నుండి ఉన్న రోగం బాగుచేయబడింది. ‘నీవు విశ్వాసంతో ప్రభువు దగ్గరకు వస్తే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు.’ రెండవది మానసిక బలహీనత. కొంతమంది శారీరకంగా బలంగా ఉన్నట్లు కనబడినా వారి మనసు మాత్రం చాలా బలహీనంగా ఉంటుంది. వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న సమస్యకు కృంగిపోయి వారి జీవితంలో నలిగిపోతుంటారు. పైకి కనబడినంత బలంగా వారు మానసికంగా ఉండలేరు. మానసికంగా కృంగిపోయినవారు మాటిమాటికీ మరణాన్ని గురించి తలచుకుంటారు. బైబిలు గ్రంథంలో ఏలీయా అనే ప్రవక్తను భక్తిహీనురాలైన యెజెబెలు అను రాణి బెదిరించినపుడు బదరీ వృక్షం కిందకు వెళ్ళి కృంగుదలతో తన ప్రాణాన్ని తీసుకోమని దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన వినలేదు కానీ ఏలీయాను బలపరచి మరింత దూరం ప్రయాణం చేసేందుకు శక్తిని అనుగ్రహించాడు. నీవు కూడా మానసికంగా బలహీనంగా ఉండి మరణాన్ని కోరుకుంటున్నావా? ‘దేవుని శక్తిని కోరుకో. దేవుడు మిమ్ములను బలపరచి మరింత ముందుకు నడిపిస్తాడు.’ మూడవది ఆత్మీయ బలహీనత. ఆత్మలో బలహీనత కలిగినవారు తరచుగా పాపంలో పడిపోతుంటారు. ఏదైతే చేయకూడదని అనుకుంటారో, నిర్ణయించుకుంటారో అదే పాపం మరలా మరలా చేస్తూ అపరాధభావంతో నింపబడుతుంటారు. పాపం మనిషికి ఎన్నడూ మనశ్శాంతినివ్వదు. పాపం ఎప్పుడూ ఆకర్షణీయంగాను, పాపం చేస్తున్నప్పుడు ఆనందంగాను, పాపం చేశాక అవేదనగాను ఉంటుంది. నీవు ఆత్మలో దేవుని శక్తిని కలిగియండకపోతే నీవు తీసుకునే నిర్ణయమును నీవే కొనసాగించలేవు. దయామయుడైన దేవుని వద్దకు వచ్చి ఎటువంటి బలహీనత నుండి విడుదల పొందాలనుకుంటున్నామో తెలియచేస్తే దేవుడు కచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. ఆపత్కాలంలో దేవుడే సహాయకుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. సర్వశక్తిమంతుడైన దేవుడు బలపరిస్తే ఎటువంటి బలహీనత అయినా దూరమవుతుంది. ‘ఆయన కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుకుంటారు. నిన్ను నీవు చూసుకున్నంత కాలము నీలోని బలహీనతలు మరింతగా నిన్ను బలహీనులుగా మారుస్తాయి. బలవంతుడైన దేవుని కొరకు, ఆయన కృప కొరకు నీవు సాగిలపడితే నీవు దేవునిలో బలవంతునిగా ఉంటావు.’ రక్షకుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సృష్టికర్తయైన దేవున్ని తండ్రి అని పిలవచ్చా? అనే సందేహం చాలామందిలో ఉంది. అలా పిలవడానికి మనం అర్హులమేనా? క్రీస్తు మార్గంలో దేవున్ని తండ్రి అని పిలిచేందుకు అర్హత ఇవ్వబడింది. ఆయన సర్వసృష్టిని కలుగజేసిన ఆదిసంభూతుడయిన తనయందు విశ్వాసముంచుట వలన ఉచితంగా దేవుని పిల్లలమయ్యే అధికారం ఇవ్వబడింది. ప్రార్థన నేర్పిస్తూ ‘పరలోకమందున్న మా తండ్రి’ అని సంబోధించమని క్రీస్తు తన శిష్యులకు తెలియచేశారు. రక్షకుడైన దేవుడు నిత్యుడగు తండ్రి. ఆయన ఎన్నడూ నిన్ను విడువడు. ఎడబాయడు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా దేవుని కృప మనలను విడిచిపోదు. కొంతమంది ఈ లోకములో శారీరక తండ్రిని కోల్పోయి నిరాశలో జీవిస్తుంటారు. లోక తండ్రులు మనలను పట్టించుకోకపోయినా పరలోకపు తండ్రి నిత్యం మనలను పట్టించుకుంటాడు. ఆయన నిత్యం మనతో నిలిచియుండు దేవుడు. ఎవరైనా పిల్లలు తమ తండ్రిని ఏదైనా అడిగితే కచ్చితంగా ఇస్తారు. వారి స్థోమతకు, సామర్థ్యానికి మించి పిల్లలకు ఇవ్వాలని చాలా ప్రయాసపడుతుంటారు. పరలోకపు తండ్రికి తన పిల్లలంటే ఎంతో ప్రేమ కదా. అడిగిన వాటికంటే, ఊహించుకునే వాటికంటే అత్యధికంగా అనుగ్రహిస్తాడు. క్రైస్తవ మార్గంలో దేవుడు ప్రజలతో కేవలం భక్తునితో ఉండే సంబంధం కాదు కానీ ఆయన తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నాడు. తండ్రి కౌగిలిలో ఒదిగిపోయి దివ్యానుభవాలను మూటకట్టుకున్న ఓ వ్యక్తి ఇలా అంటాడు. ‘తుఫాను మబ్బులు చూట్టురా కమ్మితే గంభీర స్వరం మూగబోతే నమ్మండాయన్ని. ఆయన మీ తండ్రి గనుక మీ ప్రార్థనలన్నీ వింటున్నాడు. దు:ఖం శ్రమలు బాధ దగ్గరైనా అతి చేరువైన ఆత్మీయులు దూరమైనా స్తుతించండి ఆయనున్నాడు మనకి. దారి కష్టమైన బ్రతుకు నిష్ఠూరమైనా భయంతో మన కళ్లకి మసకలు కమ్మినా మన తండ్రి మన చెంతనున్నాడు గనుక చేతిలో చెయ్యి వెయ్యండి. దారులన్నీ మూసుకుపోయినా అందమంతా అణగారినా మనతో ఉంటాడు నమ్మి విశ్రమించండాయనలో.’ బైబిలు గ్రంథ చరిత్రలో సమాజంలో వెలివేయబడినవారు, అంటరానివారుగా పరిగణించబడినవారు ప్రభువు దగ్గరకు వచ్చి ఆదరణ పొందారు. కొందరైతే సమాజంలో సరైన గుర్తింపు లేక, కనీసం మనుషులుగా కూడా గుర్తించేవారు లేకుండా జీవిస్తుండేవారు. అలాంటి వారు క్రీస్తు వద్ద తండ్రి ప్రేమను, ఆప్యాయతను అనుభవించారు. కృంగుదలతో ప్రభువు దగ్గరకు వచ్చినపుడు వారిని ఎంతో కనికరంతో చూసి, వారి మీద జాలి పడి, వారిని ‘కుమారుడా, కుమారి’ అని పిలిచాడు క్రీస్తు. ఆయన ఎవరినీ తక్కువగా చూసేవాడు కాదు. భేదాలు మనుషులు కల్పిస్తారు కానీ దేవునిలో ఏ భేదం లేదు. ఆయన వద్దకు విశ్వాసంతో వచ్చేవారందరినీ తన బిడ్డలుగా చేసుకుని, వారిని ఆదరించి తండ్రి వలె వారి యెడల బాధ్యతాయుతంగా ఉంటాడు. నేటి సమాజంలో అంటరానితనం, కుల వివక్ష, మత వివక్ష, జాతి వివక్షలు కనబడుతూనే ఉన్నాయి. పరువు హత్యలు కలతపెడుతూనే ఉన్నాయి. సమసమాజ నిర్మాణం జరగాలంటే మనుషులంతా దేవుని సృష్టే అని గమనించాలి. ‘నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుము’ అను దైవ వాక్కును మనుషులంతా గుండెలకు హత్తుకోవాలి. మదర్ థెరిస్సా కలకత్తాలో ఆశ్రమాన్ని స్థాపించినప్పుడు అభాగ్యుల పట్ల, అణగారిన ప్రజానీకం పట్ల దేవుని ప్రేమను చూపించింది. దుర్భర స్థితిగతుల్లో, దయనీయమైన పరిస్థితుల్లో బతుకునీడుస్తున్న వారికి తల్లిగా ప్రేమను పంచింది. తన ప్రశ్నలతో మదర్ థెరిస్సాను ఉక్కిరిబిక్కిరి చేద్దామనుకున్న విలేఖరి కిటికీలో నుండి లోపల ఏం జరుగుతుందోనని తొంగి చూశాడు. లోపల జరుగుతున్న పరిస్థితిని చూసిన వెంటనే అతని కళ్లు చెమర్చాయి. ఒళ్లంతా కురుపులతో నిండిపోయి దుర్వాసన కొడుతున్న ఒక కుష్ఠురోగి చేసుకుంటున్న వాంతిని పాత్రలో పడుతోంది. అలాంటి వ్యక్తిని చేరదీయడం ఎవరివల్లా కాదని గుర్తించిన ఆ వ్యక్తి మదర్‌ను అడుగుతాడు.. ‘అలాంటి పనులు నీవెలా చేయగల్గుతున్నావు? నీకెప్పుడూ వారిమీద అసహ్యం వెయ్యదా?’ అని. చేతులు తుడుచుకుంటూ మదర్ థెరిస్సా ‘అభాగ్యులలో నేను నా దేవుని చూస్తాను. వారికి సేవ చేయడం నా దేవునికి సేవ చేయడంగానే భావిస్తా. నేను చేసేదల్లా దేవుని ప్రేమను ఆచరణలో చూపించగలగడమే’ అని సమాధానమిస్తుంది. ‘తండ్రి కుమారుల యెడల జాలిపడునట్లు ప్రభువు తన బిడ్డల యెడల జాలిపడతాడు’ అని కీర్తనకారుడు తన కీర్తనలో వ్రాశాడు. ఎవరి ప్రేమనూ నోచుకోక, జీవితంలో అయినవారందరినీ కోల్పోయి, ఒంటరిగా ఉన్నాను నన్నెవరు ఆదుకుంటారు, నా గురించి ఎవరూ పట్టించుకుంటారు అని అనుకుంటున్నవారిని ఆదరించి తండ్రి ప్రేమను చూపడానికి నిత్యుడగు తండ్రియైన దేవుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన నీ గురించి విచారించేవాడు. నీ గురించి నీవు కలిగియున్న ఆలోచనల కంటే మరింత శ్రేష్ఠమైన ఆలోచనలు ప్రభువుకున్నాయి. నిన్ను నిన్నుగా అంగీకరించి నీ స్థితిగతులను మార్చి తన నిత్య ప్రేమతో నిన్ను నడిపిస్తాడు. అడవి ప్రాంతంలో నివసిస్తున్న ఓ తండ్రి కొడుకుల కథ అనేకులను కంటతడి పెట్టిస్తుంది. జీలుగకల్లుకు అలవాటు పడిన కొడుకు అన్ని విధాలుగా దారి తప్పిపోతాడు. అనేకసార్లు తండ్రి మందలించినా కొడుకులో ఇసుమంతైనా మార్పు రాలేదు. రానురాను జీవితం మరింత దారుణంగా మారిపోయింది. కల్లు తాగి మత్తులో ఆనందించాలనుకున్న కొడుకు చెట్టుమీద నుండి పడిపోతాడు. బలమైన గాయాల పాలై ఒంటరిగా అడవిలో విలవిల్లాడుతూన్న ఆ కొడుకును వెదుక్కుంటూ వెళ్తాడు అతని వృద్ధ తండ్రి . తీవ్ర గాయాలతో పడి ఉన్న కుమారుడిని అతి కష్టంమీద ఓ చిన్న హాస్పటల్‌కు తీసుకెళ్తాడు. ఉన్నపాటున రక్తం ఎక్కించకపోతే ప్రాణాలు దక్కకపోవచ్చు అని డాక్టర్ చెప్పిన మాటను తన పెద్ద కుమారునికి చెప్తాడు. నాకు భార్యా పిల్లల బాధ్యతలు చాలా ఉన్నాయి. రక్తం ఇవ్వడం నా వల్లకాదని ముఖం చాటేస్తాడు అన్న. కొడుకు ప్రాణాలు నిలబెట్టడం కోసం తండ్రి తన రక్తాన్నే ఇచ్చి తన ప్రేమను, కొడుకు పట్ల తనకున్న బాధ్యతను నెరవేర్చుతాడు. నీరసించిపోయిన తండ్రి కొద్దిరోజుల తర్వాత ప్రాణాలు కోల్పోతాడు. క్రీస్తు సమాధానకర్త అతడు బతికున్న రోజుల్లో అతన్ని మించిన ధనికుడు మరొకడు లేడు. ఎన్నో కంపెనీలు, చేతినిండా డబ్బు, పేరు ప్రఖ్యాతులు, పనివాళ్లు ఎందరో అతని చుట్టూ ఉన్నారు. న్యూయార్క్ నగరంలో అతని పేరు మీద ఒక వీధి ఉంది. సుప్రసిద్ధుడైన ఆ కుబేరుడు ఒకరోజు ఇలా అన్నాడు.. ‘నేను విపరీతంగా ధనాన్ని ఆర్జించాను. అవి నాకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు’ అని. ఆ వ్యక్తి పేరు రాక్ఫెల్లర్. జీవితం మీద ఎన్నో విశిçష్ఠ పుస్తకాలు రచించిన ఎర్నెస్ట్ హెమింగ్వే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. కారణం జీవితంలో శాంతి సమాధానాలు లేక. ఈనాడు అనేకులు ధనం, పలుకుబడి, హోదా, ఖ్యాతిని సంపాదిస్తున్నారు. సమాజంలో వారికంటూ గుర్తింపు పొందుతున్నారు. వారికేంటి.. అదీ జీవితమంటే... అలా బ్రతకాలి... అని అనిపించుకున్నవారే నేడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేసుకుని తిరిగిరాని లోకాలకు వెళిపోతున్నారు. వారు ఆ విధంగా చనిపోవడానికి కారణం వారి హృదయంలో శాంతి సమాధానం లేకపోవడమే. లోకంలో మానవునికి ఎన్ని ఉన్నా హృదయం భారంతో ఉంటే ఏదో తెలియని వెలితి జీవితాన్ని వేధిస్తుంది. కుటుంబంలో, భార్యాభర్తలకు సమాధానం లేక అనేక కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనుకొని నెత్తుటి ఏరులు పారించిన హిట్లర్ చివర్లో ఎలా మరణించాడో అందరికీ విదితమే. లోకంలో చాలమంది రాజులు, చక్రవర్తులు వచ్చారు. యుద్ధాలు చేసి, రక్తపుటేరులు పారించి, రాజ్యాలను కొల్లగొట్టి తమ స్థానాలను సుస్థిరం చేసుకోవాలనుకున్నారు. శత్రువును హతమార్చడమే ఈ లోక రాజుల ప్రథమ ఉద్దేశంగా ఉండేది. ప్రభువైన యేసు మాత్రం ఈ లోకానికి యుద్ధాలు చేయడానికి లేదా రక్తపుటేరులు పారించి తన రాజ్యాన్ని ఈ భూమి మీద నెలకొల్పడానికి రాలేదు. వాస్తవాన్ని పరిశీలిస్తే మనుషుల హృదయాలలో శాంతి, సమాధానమును ఇవ్వడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ‘నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి’ అని క్రీస్తు ప్రభువు సెలవిచ్చారు (యోహాను 14:27). సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద చితుక తొక్కించును అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ప్రభువు కలువరి సిలువలో చనిపోయి తిరిగిలేవడం ద్వారా అపవాదిని ఓడించాడు. సాతాను తలను ఆయన చితుక తొక్కినందున దేవుని ప్రజలకు క్రీస్తు ద్వారా విజయం లభిస్తుంది. ఐగుప్తు రాజులు తమకు శత్రువులుగా ఉన్నవారందరి చిత్రాలను పాదపీఠాల మీద చెక్కించుకుని వారి మంచాల కింద ఉంచేవారు. వారు నిద్రలేవగానే ఆ పాదపీఠం మీద ఉన్న తమ శత్రువుల రూపాలను కాళ్ళతో తొక్కుతూ విజయానందం పొందేవారు. అయితే సమాధానకర్తయగు దేవుడు కూడా మన శత్రువులను మన కాళ్ళ కింద చితక తొక్కిస్తాడు. శత్రువు అంటే మనకు నచ్చనివారు, పక్కింటివారు కాదు. నీవెదుర్కొంటున్న సంఘర్షణలు, ఆందోళనలు, దైవ విరుద్ధ ప్రేరేపణలు మొదలగు వాటిపై నీవు విజయం సాధించాలన్నది దేవుని ఉద్దేశం. ‘కడపట నశింపచేయు శత్రువు మరణం’ అని బైబిల్ సెలవిస్తుంది. మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం వలన మరణం మానవునికి సంప్రాప్తించింది. పాపం మానవుడిని దేవునికి దూరం చేస్తుంది. దేవుని మహిమను పొందలేనంత దూరస్థులుగా చేసింది. దేవునికి అసహ్యమైనది పాపం. అటువంటి పాపం మానవునిలో ప్రవేశించినపుడే మరణం మానవునికి శత్రువుగా మారింది. ఈ మరణాన్ని జయించి మన కాళ్ల కింద చితక తొక్కించుటకు ఆయన సిలువపై మరణించి తిరిగి లేచి మరణపు కోరలను విరిచివేశాడు. మరణమా! నీ ముల్లెక్కడ? మరణమా! నీ విజయమెక్కడా? అని విజయఢంకా మోగించాడు. ఎవరైతే యేసునందు విశ్వాసముంచుతారో వారు పాపం వలన వచ్చే మరణాన్ని దాటుకుని దేవుని సమాధానాన్ని పొంది దేవుని రాజ్యనివాసులుగా చేయబడుతున్నారు. విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా చేయబడుతున్నారు. దేని కొరకు చింతించక అన్నింటి కొరకు ప్రార్థించినపుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం హృదయానికి కావలి ఉంటుంది. హృదయాంతరంగం నుండి నీవు చేసే ప్రార్థన ఆయన విని నీకు తగిన సమయంలో సమాధానం అనుగ్రహిస్తారు. భర్త మరణశయ్యమీద ఉన్నప్పుడు అందరూ దూరమై పరిస్థితులు దుర్భరమైనప్పుడు క్రీస్తు సమాధానాన్ని గుండెల నిండా అనుభవించిన చార్లెస్ కౌమన్ కలం నుండి జాలువారిన మధురాక్షరాలు.. ‘నా ప్రియుడు శ్వేత సింహాసనంపై కాంతిపుంజమై మహిమ మస్తక విలసన్నవ తేజుడై ఆశీనుడై విరాజిల్లే నిత్య పరలోకం, అక్కడే నా వైభవం అక్కడే నా జీవం... లౌకిక జీవనాన్ని మధురం చేస్తూ జీవిస్తే మేలు మరణిస్తే లాభమనిపిస్తూ క్షమా రక్షణలకు ఆయత్తమవుతూ తన రాచఠీవితో స్వర్గాన్ని సౌందర్యపరచి శక్తి శౌర్యాల వాత్సల్యమూర్తి సమాధానకర్తయైన నా దేవునికే చేరాలి నా వింత విన్నపాలు... అక్కడే నా మనస్సు... అక్కడే నా సిరిసంపదలు.’ కారుణ్యాది సకలసమన్వితుడైన దేవుడు మీకందరికీ శాంతి సంతోషాలు, ఆరోగ్యాయుష్షులు, సకల సంపదలు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాక్షి పాఠకులందరికీ క్రిస్మస్/నూతన సంవత్సర శుభాకాంక్షలు. -డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
పత్తి ధర పైపైకి.. క్వింటాలుకు రూ.8,421
గజ్వేల్: రాష్ట్రంలో పత్తికి మంచి ధర లభిస్తోంది. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో క్వింటాలుకు గరిష్టంగా రూ.8,421 పలికింది. ఈ–నామ్ (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) ద్వారా 109 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరగ్గా.. ఇందులో గరిష్టంగా రూ.8,421, మోడల్ ధరగా రూ.8,263, కనిష్టంగా రూ.8,200 పలికిందని మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ, సూపర్వైజర్ మహిపాల్ తెలిపారు. అతివృష్టి కారణంగా దిగుబడులు పడిపోయి తీవ్రమైన నష్టాల్లో ఉన్న రైతులకు ఈ పరిణామం కొంత ఊరటనిస్తోందని వారు అన్నారు. -
హృదయమనే పలక మీద దేవుడుంటే..?
నీ హృదయమను పలకమీద వాటిని రాసికొనుము. సామెతలు 7:3. ఈ సువిశాల ప్రపంచంలో మానవుడు దేవుని రూపంలో, పోలికలో సృషించబడ్డాడు. ప్రతి మనిషికి హృదయం ఉంది. అయితే ఆ హృదయాన్ని ఎలా నిర్వచించగలము? దానిని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం ఎలా? పరిశుద్ధ గ్రంథంలో మానవ హృదయాన్ని గురించి అనేక వచనాలు ఉన్నాయి. సామెతల గ్రంథకర్త సొలొమోను మనిషి హృదయాన్ని పలకతో పోల్చి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను వివరించాడు. పలక తెలియనివారెవ్వరు? పూర్వదినాల్లో ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ కాలం భద్రపరచాలనుకున్నప్పుడు వాటిని రాతి పలకల మీద రాసేవారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు జరుపుతున్న తవ్వకాలలో చాలా రాతి పలకలు బయటపడుతున్నాయి. వాటిమీద రాసిన విషయాలను బట్టి ఆయా కాలాల చరిత్రను, ఆ కాలంలో జరిగిన సంగతులను అర్థం చేసుకొంటున్నారు. బైబిల్ రాతలను, చరిత్రను సమర్థించే చాలా పలకలు నేటికీ ఉన్నాయి. విన్న విషయాల కన్నా చేతితో రాయబడినవి ఎక్కువ కాలం గుర్తుంటాయన్నది పెద్దల మాట. మానవ హృదయం కూడా ఒక పలకే. అనునిత్యం వాటిమీద ఏం రాసుకొంటున్నాము అనేది మన భవిష్యత్తును శాసిస్తాయి. హృదయం నిండియున్న వాటిని బట్టి నోరు మాట్లాడుతుంది అని బైబిల్ సెలవిస్తుంది (లూకా 6:45). కొందరు తమకు హాని చేసినవారి వివరాలు హృదయమనే పలక రాసుకొని ఎప్పటికైనా వారికి ప్రతీకారం చేయాలని కనిపెడతారు. కొందరు యవ్వనస్థులు తాము ప్రేమించే వారిని వారి హృదయాల్లో చెక్కుకుంటారు. అనుక్షణం వారి కోసం జీవిస్తారు, తపిస్తారు. రోజులో ఎక్కువ సమయం వారి గురించే ఆలోచిస్తారు. ఒక్క విషయం స్పష్టంగా ఆలోచించాలి. హృదయమనే పలక మీద ఎవ్వరిని చెక్కుకుంటే, వేటిని రాసుకొంటే వారే జీవితాన్ని శాసిస్తారు. మన ఆలోచనలను, తలంపులను, అలవాట్లను పురికొల్పుతారు. ఇప్పటికిప్పుడు నీ హృదయమనే పలకను పరిశీలిస్తే తీస్తే ఎవరెవరి పేర్లు, జీవితాలు బయటకు వస్తాయి? నిన్ను సృష్టించిన దేవుడు నీ హృదయంలో ఉండాలని ఆశిస్తున్నాడు. తన కోసం తాను కట్టుకున్న ఇల్లు అది. దానిని మినహాయించి నీవు దేవునికి ఏం ఇచ్చినా ఆయన సంతృప్తి చెందడు. రకరకాల రాతలు రాయబడిన నీ హృదయమనే పలకను ఒక్కసారి తుడిచేయి! యేసుక్రీస్తు అనే సుమధుర సుందర నామాన్ని లిఖించు. అద్భుతాలు చూస్తావు. ‘‘మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో రాయబడిన క్రీస్తు పత్రిక మీరు’’ అని పౌలు దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని తెలియచేశాడు. రక్షింపబడిన నీవు దేవుని పత్రికవు. అనుక్షణం ప్రజల చేత చదువబడుచున్నావు. లోకం నిన్ను అడుగుడుగునా గమనిస్తుంది. నీ హృదయమనే పలక మీద క్రీస్తుకు చోటుంటే ఆయన వాక్యానికి చోటున్నట్లే. దేవుని వాక్యంతో హృదయాన్ని సంపూర్తిగా నింపుకుంటే శక్తిగల దేవుని మాటలనే నీవు వల్లిస్తావు. నిన్ను గమనించినవారంతా నీ హృదయమనే పలక మీద రాయబడిన క్రీస్తును, మహోన్నతమైన ఆయన ప్రేమను గమనిస్తారు. – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు
నా రక్షణకు మహిమకు ఆధారం దేవుడే (కీర్తన 62:7). తన జీవిత అనుభవాల నుండి దావీదు ఎన్నో కీర్తనలను రచించాడు. ఆ కీర్తనలు ప్రతి విశ్వాసి జీవితానికి ఎక్కడో ఒకచోట సంబంధం కలిగి ఉంటాయి. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు దేవుణ్ణే ఆధారంగా భావిస్తూ సాగిపోయే వ్యక్తి ఖచ్చితంగా ధన్యజీవియే. జీవితయాత్రలో నిశ్చలమైన అనుభవాలతో ముందుకు సాగిపోవాలనే ప్రగాఢమైన కోరిక ప్రతి ఒక్కరికి తప్పక ఉంటుంది. దేవుని కృప ద్వారా అన్ని విషయాల్లో పైకి ఎదుగుతున్న వానికి శత్రువుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. నిలబడినవానిని కిందకు తోయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు కొందరు. ఒరుగుతున్న గోడను కంచెను ఒకడు చాలా సునాయాసంగా పడగొట్టునట్లు నిల్చున్న వారిని పడగొట్టడానికి అనేకులు ముందుకొస్తారు. లోకసంబంధమైన వారి ఆలోచనలు ఎప్పుడూ ఎదుటివారి అభివృద్ధిని ఓర్వలేనివిగా ఉంటాయి. అటువంటి సందర్భాలలో విశ్వాసి స్పందన ఎలా ఉండాలన్న విషయాన్ని భక్తుడు నేర్పిస్తున్నాడు. మనలను సృష్టించిన దేవుని వలన మనకు రక్షణ, నిరీక్షణ, మహిమ కలుగుతున్నాయి. ఆయనను మించిన ఆశ్రయదుర్గం మనిషికి ఉండదు. మనిషి మహిమకరమైన జీవితాన్ని జీవించాలంటే మహిమాన్వితుడైన యేసుక్రీస్తును హృదయం లోనికి ఆహ్వానించాలి. ఏదెను తోటలో ఆదాము హవ్వలు కోల్పోయిన మహిమను మనుష్యజాతికి మరలా ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. పాపం చేయుట ద్వారా మానవుడు దేవుని మహిమను యధేచ్చగా కోల్పోతున్నాడు. అందరునూ పాపం చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు (రోమా 3:23). పాపం వలన మనిషిలో భయం, ఆందోళన, కలవరం వంటివి రాజ్యమేలుతున్నాయి. ఆధ్యాత్మిక పతనం నుండి బయట పడాలంటే మానవుడు దేవుని మహిమతో మరలా నింపబడాలి. కోల్పోయిన మహిమను వెతుక్కునే ప్రక్రియలో మనిషి ఎన్నో భక్తికార్యాలు నిరంతరాయంగా చేస్తున్నాడు. దేవుని మహిమను కలిగి ఉన్నాననే నిశ్చయత నీకుందా? నీవు చేస్తున్న అవిధేయమైన కార్యాల ద్వారా నీవు కోల్పోతున్న వాటిలో చాలా ప్రాముఖ్యమైనది దేవుని మహిమ అని గుర్తించు. నీవు దేవునికి దూరమవటం ద్వారా సాతాను శక్తులు నీమీద విపరీతంగా దాడి చేస్తున్నాయి. నిన్ను నిలువుగా కుంగదీస్తున్నాయి. దురవస్థలోనికి నిన్ను నెట్టేస్తున్నాయి. ఇప్పుడే దేవుని ప్రశస్త సన్నిధిలో వేడుకో! చీకటిని వెనుకకు నెట్టి దేవుని ప్రకాశమయ సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. లోకరక్షణార్థమై యేసుక్రీస్తు కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి అనిర్వచనీయమైన తన మహిమను ప్రతి ఒక్కరికి బహుమానంగా ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఊహించలేని వెలుగుతో, తన దివ్య మహిమతో నిన్ను నింపగలిగే ఆయన ప్రేమగల దేవుడని సిలువ మరణం ద్వారా రుజువు చేయబడింది. సర్వశక్తుని దివ్య మహిమ మనిషికి అన్ని విషయాల్లో విజయాన్నిస్తుంది. నిత్యజీవానికి మనిషిని నడిపిస్తుంది. ఆమేన్!! – డా.జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
నిన్ను నిలిపే దేవుడు ఉన్నాడు!
ఎత్తయిన స్థలములమీద ఆయన నన్ను నిలుపుతున్నాడు (కీర్తన 18:33). నిత్య జీవితంలో అనుదినం మనలో ప్రతి ఒక్కరం ఏదో పనిలో నిమగ్నమై ఉంటాము. అహర్నిశలు పని చేయడం కొందరికి ఆనందం, మరికొందరికి బాధ్యత. ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా చేసేస్తాం. ఇష్టం కాకపోతే సునాయాసం గా చేయగల పనులను కూడా వాయిదాలు వేస్తుంటాం. మనకు మనస్కరించని పనులకు ఏవేవో సాకులు చెబుతూ వాటిని పక్కనపెడుతుంటాం. సకల చరాచర సృష్టిని తన మహత్తయిన మాట ద్వారా సృష్టించిన దేవుడు కూడా తన సంకల్పాలను నెరవేర్చడానికి పనిచేస్తూనే ఉన్నాడు, ఉంటాడు కూడ. ఆయనకు పనిచేయడం ఇష్టం. బలీయమైన తన నిర్ణయాల నుండి ఎవ్వరూ ఆయన్ను పక్కకు తీసుకెళ్ళలేరు. తనను నమ్మినవారి యెడల తన ఉద్దేశాలను నెరవేర్చడం దేవునికి మహా ఇష్టం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు (యిర్మీ 29:11) వ్యతిరేక శక్తులు, ప్రతిబంధకాలు ఆయన్ను ఇసుమంతైనా నిలువరించలేవు. విశ్వాసంలో బలిష్టులను ఉన్నతస్థలాల్లో నిలబెట్టడం దేవునికున్న మహాశయం. చరిత్రలో ఎన్నో ఉదాహరణలు మనలో స్ఫూర్తిని రగిలిస్తాయి. పెంటకుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తి వారిని తన ప్రతినిధులుగా ప్రపంచానికి పరిచయం చేయడం దేవుని అలవాటు. బెత్లేహేము పొలాల్లో గొర్రెలు కాసుకుంటున్న దావీదును ఇశ్రాయేలు రాజ్యానికి తిరుగులేని రాజుగా నిలబెట్టాడు. ఇప్పుడు పదుల సంఖ్యలో గొర్రెలను కాస్తుంటే... భవిష్యత్తులో వందల సంఖ్యలో కాచే అవకాశం ఉండచ్చు అని అందరూ అనుకొని ఉండవచ్చు. మానవ అంచనాలను పటాపంచలు చేసే శక్తి దేవునిది. ఊహలకు అందని మేళ్లు చేసే మహాఘనుడు మన దేవుడు. గొర్రెలు కాసుకొనే దావీదును ఇశ్రాయేలు రాజ్యాన్ని నలభై సంవత్సరాలు అద్భుతరీతిలో పాలించగలిగే రాజుగా నిలబెట్టాడు. రాజ్యాన్ని అప్పగించిన దేవుడు దావీదు ద్వారా ఎన్నో ప్రజోపకరమైన గొప్ప కార్యాలను నెరవేర్చాడు. ఎందరినో నిలబెట్టిన దేవుడు నిన్నెందుకు నిలువబెట్టడు? విశ్వచరిత్రలో కృంగిపోయినవారిని లేవనెత్తిన దేవుడు నిన్నెందుకు లేవనెత్తడు? నిరాశా నిస్పృహలో కూరుకొని ఏడుస్తున్నావా? పట్టించుకొనే వారెవరు లేరని దుఃఖిస్తున్నావా? పడిపోయిన మనిషిని నిలబెట్టడమే దేవుని పరిచర్య. ఎందుకంటే దేవుడు అందరిని అమితంగా ప్రేమిస్తున్నాడు. పాపమనే అగాథ స్థలములలో చిక్కుకుపోయిన మానవునికి తన కరుణ హస్తాన్ని అందించి వారిని ఉన్నత స్థలాలలో నిలబెట్టి తన ఔన్నత్యాన్ని ఋజువుపరచాలనే యేసుక్రీస్తు ఈ భువికేతించారు. నీవైపు తన చేతులు చాపి అన్ని విషయాల్లో నిన్ను నిలబెట్టాలని ఆశిస్తున్న దేవునికి నీ చేతిని విశ్వాసం తో అందిస్తే చాలు. ఉన్నతమైన అనుభవాలతో, ఆశయాలతో, ఆశీర్వాదాలతో నిన్ను నిలిపి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. ఆమేన్! – డా.జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
మానవుడై అవతరించిన రోజు
అత్యంత భక్తిశ్రద్ధలతో పారవశ్యంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్. ప్రపంచంలోని క్రైస్తవులంతా మనస్ఫూర్తిగా సంతోషంతో జరుపుకునే సంబరం. వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి పుడమిని పులకింపచేసిన సమయం. కరోనా విలయతాండవం సృష్టించిన ఈ సంవత్సరంలో జరుపుకుంటున్న క్రిస్మస్ మరింత ధైర్యాన్ని, ఉత్సాహాన్ని అనుగ్రహిస్తుంది. క్రిస్మస్ మనకేం తెచ్చింది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నం కావచ్చు. యేసు జననం జగతికి ఏమిచ్చింది అని ఒకసారి పరిశీలిస్తే నిస్సందేహంగా మనకు అపురూపమైన కానుకలను అందించింది. కానుకలు అందరూ నగదు రూపంలోనో, వస్తు రూపంలోనో ఇచ్చి పుచ్చుకుంటుంటారు. కానీ దేవాధిదేవుడు జగతిని, జనులను రక్షించుటకై పాపమెరుగని పరమపావన మూర్తియైన తానే బహుమతిగా ఈ లోకానికి వచ్చాడు. ఆదియందు వాక్యముండెను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనేది క్రీస్తును గూర్చిన నిర్వచనం. వాక్కు అంటే పలుకు. వాక్కు అనేది శక్తిగల మాటల సముదాయం. పెల్లుబికే ఆ మాటల సముదాయం భావాన్ని మోసుకొస్తుంది. వాక్కు శాశ్వతం, అనంతం, జీవదాయకం, సృష్టి కారకం. వాక్కులో అపారమైన జ్ఞానముంది. అదే వెలుగు, అదే వికాసం, విజ్ఞానం మరియు సమస్తం. బ్రహ్మాండమైన ఆ వాక్కే శరీరంతో లోకానికి వచ్చాడు. ఆయనే లోకరక్షకుడు క్రీస్తు. ఒక దైవజనుడు ఇలా అంటాడు. ఓ మనిషీ! ఏమి భాగ్యం నీది? ఉన్నతుడైన దేవుడు నీ ఎముకలో ఎముకగా, మాంసంలో మాంసంగా, మానవుడుగా, నీలా జన్మించాడు. యేసుక్రీస్తు అంటే ప్రేమ మరియు శాంతి. ఆ ప్రేమే ప్రాణం పోసుకుని ఆ పరలోకం నుండి మన కోసం ఇలకు దిగివచ్చింది. మనిషిగా జన్మించి మానవతకు క్రొత్త మార్గాన్ని చూపింది. అవధులు లేని ప్రేమగా, అంతములేని కరుణగా, అపురూపమైన వాత్సల్యముగా రూపుదాల్చి మనకోసం మన విమోచన కోసం పాప బంధకములనుండి విడిపించుట కోసం శ్రమలననుభవించింది. అమ్మలాలనను, తండ్రి బాధ్యతను, స్నేహితుని తోడును మనకు అందించింది. నిజమైన నిస్వార్థమైన ప్రేమను మనకు రూచి చూపించింది. ఈ లోకంలోని అగమ్య గోచరమైన బ్రతుకులకు కాంతిని పంచే వెలుగే క్రిస్మస్. బాధలలో వేదనతో నలిగిపోయిన జీవితాలకు, కష్టాలతో కన్నీళ్ళతో కృంగిపోయిన హృదయాలకు ఓదార్పునిచ్చేదే క్రిస్మస్. ఇబ్బందుల నుండి ఇరుకుల నుండి విడిపించి శాంతి నిచ్చేదే క్రిస్మస్. సమస్త మానవాళికీ శ్రావ్యమైన గళంతో శాంతి సందేశాన్నిచ్చేదే క్రిస్మస్. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి కంటికి వెలుగును, కాళ్ళకు మంచి మార్గాన్ని, నోటికి మంచి మాటను, హృదయానికి శాంతిని, మనిషికి మానవత్వాన్ని జగతికి రక్షణను తెచ్చింది క్రిస్మస్. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. ఆ ఆరాధన హృదయాంతరంగాల నుండి పెల్లుబకాలి. జగతి పరమార్థాన్ని గ్రహించి బతకాలన్నా, నిజమైన ఆనందాన్ని మదిలోకి ఒంపుకోవాలన్నా ఘనుడైన క్రీస్తును ఆరాధించాలి. యోగ్యుడైన వానికి, అర్హత గలిగిన వ్యక్తికి ఆరాధనను అర్పించాలి. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, ఆదిసంభూతుడు, అత్యున్నతుడు, ఆరాధనకు యోగ్యుడూ మన క్రీస్తే. యేసు జన్మించినప్పుడు ఓ అద్భుత సంఘటన జరిగింది. తూర్పు దేశపు జ్ఞానులు సుదూర ప్రయాణం చేసుకొంటూ మొదట ఝెరూషలేముకు ఆ తదుపరి దానికి దగ్గరలోనే ఉన్న బేత్లేహేముకు వెళ్ళారు. వాళ్ళు నక్షత్ర పయనాన్ని అంచనా వేయగల సామర్థ్యం గలవారు. ఆధ్యాత్మిక చింతన పరిపుష్టిగా ఉంది. ఎన్నో ఏండ్ల నుండి రక్షకుని ఆగమనం కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్న వారిలో వీరు కూడా ఉన్నారు. వారి ప్రాంతాలను, కుటుంబాలను, పనిపాటలకు కాసేపు ప్రక్కనపెట్టి దేవుణ్ణి చూడడానికి ప్రయాణం కట్టారు. అది అంత సులువైన ప్రయాణం కాకపోయినా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ప్రయాణం చేసి ఆఖరుకు చేరాల్సిన స్థానానికి చేరారు. మనసులు పులకించిపోయాయి. దైవదర్శనాన్ని పొందిన ఆ నేత్రాలు పావనమయ్యాయి. ధారలుగా కారుతున్న ఆనందబాష్పాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. పాలబుగ్గల పసివాడు తల్లిఒడిలో పరవశించినట్టు ఆ జ్ఞానులు పరవశించిపోయారు. పసిబాలుడైన క్రీస్తును తదేకంగా చూస్తూ ఆయన పాదాలమీద పడి మనస్ఫూర్తిగా ఆరాధించారు. మనిషికి అంతకన్నా ఇంకేం కావాలి. విశాల విశ్వంలో అంతకన్నా మధురానుభూతి ఇంకేముంటుంది. రక్షకునికివ్వాలనుకున్న బహుమానాలను వారి పెట్టెలు తెరిచి ఆయన ముందు పరిచారు. ఒకాయన శుద్ధ సువర్ణాన్ని ఇచ్చాడు. మరొకడు అద్భుత సువాసన వెదజల్లే సాంబ్రాణిని, మరొక జ్ఞాని బోళమును ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయారు. క్రీస్తు పాదాల దగ్గర పెట్టబడిన ఆ కానుకలు క్రీస్తులోని మూడు ప్రాముఖ్య లక్షణాలను తెలుపుతున్నాయి. బంగారం పరిశుద్ధతకు, సాంబ్రాణి ఆరాధనకు, బోళము స్వస్థపరిచే గుణానికి సాదృశ్యం. మనిషి దేవుని ఆరాధించుటకు ప్రధాన కారణం ఆయనలో ఉన్న పరిశుద్ధతే. సమస్తమును నిర్వహించే దేవుడే అపవిత్రుడైతే పరిశుద్ధంగా బ్రతకడానికి మనిషికి ఆధారం ఎక్కడుంటుంది? మనిషి పూజలందుకొనే దేవుడు కచ్చితంగా పవిత్రుడే. నాలో పాపమున్నదని మీలో ఎవ్వరైనా స్ధాపించగలరా అని క్రీస్తు ప్రశ్నించాడు. జ్ఞానులు తెచ్చిన రెండవ కానుక సాంబ్రాణి. సువాసనను వెదజల్లుతూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సువాసనభరితం చేయగల సాంబ్రాణి క్రీస్తు ఆరాధనీయుడని తెలుపుతుంది. బోళములో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. క్రీస్తు మనలను స్వస్థపరచువాడు అనే సందేశాన్ని మూడవ కానుక తెలుపుతుంది. ప్రతియేటా క్రిస్మస్ను క్రైస్తవులంతా ఒకరోజు ప్రపంచవ్యాప్తంగా పండుగగా జరుపుకొంటునప్పటికీ క్రీస్తు ప్రేమతత్త్వంలో తేలియాడే నిజక్రైస్తవునికి ప్రతిరోజూ పండుగే. ప్రతిరోజూ క్రిస్మస్సే. తేజస్సులో అమరుడైనప్పటికీ మనుజాళిని ప్రేమించి ప్రతి ఒక్కరికీ దగ్గరగా వచ్చిన క్రీస్తును ఆరాధించడానికి ఏ ఒక్కరోజు చాలదు. ఆదిమ«ధ్యాంత రహితుడైన ఆ దివ్యమూర్తిని ఆరాధించడానికి జీవితకాలం సరిపోదు. దేవుడు చేసిన సృష్టి వైభవాన్ని తెలుసుకొనే ప్రక్రియలో ఎన్నో పరిశోధనలు కొన్ని శతాబ్దాల క్రిందటే ప్రారంభించబడ్డాయి. అయితే 1969లో ఓ అపూర్వ సంఘటన చోటుచేసుకుంది. ‘నాసా’కు చెందిన ముగ్గురు వ్యోమగాములు ఎంతో శ్రమించి ఎట్టకేలకు ‘అపోలో–11’ అనే రాకెట్ మీద ప్రయాణం చేసి చంద్రుని మీద కాలుమోపారు. మానవుడు సాధించిన ఓ గొప్ప కార్యంగా అది అభివర్ణించబడింది. అప్పటినుండి ఇప్పటి వరకు మరికొంతమంది చంద్రగ్రహంపై కాలుమోపి తమ పరిశోధనలను కొనసాగిస్తున్నారు. వారిలో జేమ్స్ ఇర్విన్ ఒకరు. చంద్రునిపై కాలు మోపిన తరువాత తనకు లభించిన విశిష్టమైన గౌరవాన్ని స్వీకరిస్తూ ప్రపంచం నివ్వెరపోయే విషయాన్ని ఇర్విన్ తెలియచేశాడు. ‘‘అశాశ్వతుడైన మానవుడు చంద్రుని మీద కాలుమోపడం కన్నా శాశ్వతుడైన దేవుడు మనిషిని ప్రేమించి ఈ భూమ్మీద కాలుమోపడం గొప్ప’’. అపుడు సృష్టికర్తయైన దేవుడు సృష్టిగా మారడం అన్ని అద్భుతాల కన్నా ఎంతో గొప్పది. పరమాత్ముడైన ప్రభువును ఆరాధించడానికి బలులు, అర్పణలు అవసరం లేదు. మంచి సమయాల కోసం వేచిచూడాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా మనస్సు తెరిచి ఆయన నామాన్ని స్మరించుకొంటూ భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే చాలు. జీవితం ధన్యమౌతుంది. ఒకసారి ఆధ్యాత్మిక చింతనతో నిండిన ఒక్క వ్యక్తి దేవుణ్ణి ‘నీవు ఎక్కడుంటావు’ అని అడిగాడట. దానికి దేవుడిచ్చిన జవాబు ‘నేను కట్టుకున్న ఆలయంలో ఉంటాను’. అదెక్కడుంది? ‘నీ హృదయమే నేను కట్టిన ఆలయం’. అపుడు దేవుడు మనిషి హృదయంలో నివసించాలనుకుంటున్నాడు. ఆయనకు హృదయంలో చోటివ్వడమే మానవ జీవిత పరమార్థం. నిండైన నీ హృదయంతో, మెండైన విశ్వాసంతో ఆయనను ఆరాధిస్తే చాలు. క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా మనుష్యులకు గుండెలనిండా ధైర్యాన్నిచ్చింది. కరోనా రక్కసి సమయంలో ప్రతి ఒక్కరమూ వ్యాక్సిన్ గూర్చిన శుభవార్త కోసం ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నాం. ఒక ప్రమాదం నుండి బయటపడడం ఎలా అనే వార్త మనిషికి ధైర్యానిస్తుంది. భయపడకుడి ప్రజలందరికీ కలుగబోవు సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అని దూత భయంతో వణికిపోతున్న గొర్రెల కాపరులకు తెలిపింది. వారు కేవలం భౌతిక సంబంధమైన చీకటిలో మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగానూ, మానసికంగానూ చీకటిలో ఉన్నారు. వారికి శుభవార్త అందింది. దేవుడు ఎప్పుడూ మనిషికి మేలు చేయువాడు. ఆయన స్వాభావికంగా మంచివాడు. మనుషులు మంచివారుగా నటిస్తారు. దేవునికి ఆ అవసరం ఉండదు. ఆయన ప్రతి ఒక్కరికీ మంచి చెయ్యాలనే ఆశిస్తున్నాడు. క్రీస్తు అంటే ధైర్యం. ఆయన ఆపదలో అండగా నిలిచే కొండ. అన్ని వేళల్లో ఆదుకునే రక్షణ దుర్గం. చెక్కుచెదరని ధీరత్వం. క్రీస్తు నీతో వుంటే నిశ్చింత, క్రీస్తు నీతో వుంటే దిగ్విజయం. క్రిస్మస్ జగతిలో జనులకందరికీ ధైర్యాన్నిచ్చింది. ఏ ఆటంకాన్నైనా.. అడ్డంకులనైనా అధిగమించే శక్తి నిచ్చింది. అడ్డుగోడలను పగలగొట్టే గుండెబలాన్నిచ్చింది. ముఖ్యంగా ఈ లోకంలో శత్రువు పన్నే కుయుక్తులను, కుతంత్రాలను ఛేదించే దుర్భేద్యమైన కోట గోడలను మన చుట్టూ నిర్మించింది. ఏ దుష్టశక్తులూ మనలను చుట్టుముట్టి అధైర్యపెట్టకుండా రక్షణ వలయాన్ని కవచాన్ని మనకు ఏర్పరిచింది. బైబిల్లో ఒక వాగ్దానం ఉంది. నీ ఎడమపక్కన వేయిమంది పడినను నీ కుడిపక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అశేష ప్రజావాహినికి ఊతమందించే అద్భుత వాగ్దానమది. క్రీస్తు, క్రిస్మస్ గుండెకు కలిగించే ధైర్యం ఇంత గొప్పగానూ. శ్రేష్ఠముగానూ వుంటుంది అనేది నిర్వివాదంశము. క్రీస్తును మనస్ఫూర్తిగా ఆరాధించగలిగితే ప్రతి ప్రతికూల పరిస్థితినీ జయించగలిగే శక్తిని, గుండెధైర్యాన్ని, బలాన్ని మనలో నింపుతాడు. నమ్ముట నీ వశమైతే సమస్తమునూ సాధ్యమే అని సెలవిచ్చిన ఆ దేవాధిదేవుడు స్వయంగా తానే గుండెచెదరిన వారిని బాగు చేయుటకు, దీనులను విడిపించుటకు, ఈ లోకానికి దిగివచ్చాడు, ధైర్యాన్ని మనకు ఇచ్చాడు. కొంతమంది జీవితాలను పరిశీలిస్తే వారు చేయగలిగినవాటిని సైతం చేయలేకపోవడానికున్న కారణాలలో భయం ఒకటి. స్వేఛ్చా స్వాతంత్యాల్రతో జీవించాల్సిన మానవుడు భయం గుప్పిట్లో బతుకుతున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత టీవీ వ్యాఖ్యాత ల్యారీ కింగ్‌ను ఒకామె ఇంటర్వ్యూ చేస్తుంది. అప్పటికే ఆయన అనేకమందిని తన వాగ్ధాటితో ఆకర్షించుకున్నాడు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వారిని ఇంటర్వ్యూ చేశాడు. తాను అడగాలనుకున్న ఏ ప్రశ్ననైనా ధైర్యంతో అడిగేవాడు. సాహసోపేతమైన తన వృత్తిలో పాతిక సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక ప్రశ్న తన ముంగిట నిలువబడింది. ‘నీవు దేనికైనా భయపడతావా?’– ‘అవును. భయపడతాను!’– ‘దేనికి? మరణానికి!! నేను చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. ప్రతి రాత్రి ఇదే భయంతో గడుపుతాను’ అని అతడిచ్చిన జవాబుకు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయానికి భయపడుతూనే ఉంటారు. వెంటాడుతున్న గతానికి, ఎదుర్కొనబోయే భవిష్యత్తును గూర్చి, వర్తమానంలో జరుగుచున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, జీవితంలో చెలరేగే తుఫానులను బట్టి భయపడుచున్న మనిషికి చెక్కుచెదరని ధైర్యానివ్వడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ధైర్యంగా ఉంటే ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉండగలడనేది బైబిల్ సుబోధ. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. ఇది అక్షరాలా నిజం! జనులందరికీ అవగతమయిన సత్యం! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం. అనుభవించే కొలది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం. అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకాని, ముగింపులేనిది. ఎన్నటికీ ముగియనిదీ, నిన్ను వీడనిది. ప్రస్తుతకాలంలో అశాశ్వతమైన ఆనందాలకోసం వెంపర్లాడుతూ, మనుషులు లోకంలోని బురదను, మురికిని అంటించుకొంటున్నారు దానిని వదిలించుకోలేక, విడిపించుకోలేక, కడుక్కోలేక సతమతమవుతున్నారు. రక్షించే నాథుడు ఎవరా? కాపాడే కరుణామయుడు ఉన్నారా? అని అలమటిస్తూ నిజమైన ఆనందం కోసం వెదకుచున్నారు. నేటి కాలంలో ప్రాముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు, వింతైన పోకడలకు బానిసలవుతున్నారు. వాటి వెనుకనున్న కారణాలు విశ్లేషిస్తే.. ‘ఒత్తిడి అధిగమించాలని కొందరు, కిక్ కోసం కొందరు, ఫ్రెండ్సు కోసం కొందరు, మానసిక ఉల్లాసం కోసం మరికొందరు చెడు అలవాట్లకు చేరువవుతున్నారు. ప్రభుత్వాలకు, పోలీసులకు పెనుసవాళ్ళను మిగుల్చుతున్న డ్రగ్స్ మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. ఏదో సొంతం చేసుకోవాలన్న తపనతో ఉన్నవి కూడా కోల్పోతూ ఆఖరకు తీవ్ర నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సెలబ్రెటీలు అని గుర్తింపు పొందినవారు కూడా ఈ విషయంలో అతీతులేమీకాదు. చాలా సంవత్సరాల క్రితం రస్సెల్ అనే ఒక సంగీత కళాకారుడు ఒక ప్రాంతంలో కచేరీ నిర్వహించాడు. వందల డాలర్లు వెచ్చించి అతడు వాయించే సంగీత సమ్మేళనాన్ని ఆస్వాదించడానికి సంగీత ప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ రాత్రి అతడు వాయించిన సంగీతం అనేకమందిని ఉర్రూతలూగించింది. ఆ సంగీత విభావరిలో అతడు ఒక పాటను ఆలపించాడు. ‘విచారం వలన ఒరిగేదేమిటి? దుఃఖం వలన వచ్చే ప్రయోజనమేమిటి? విచారాన్ని దుఃఖాన్ని సమాధి చేసి ఆనందంగా బతికేయి’ అనేది ఆ పాట సారాంశం. అర్ధరాత్రివరకూ కొనసాగిన ఆ సంగీత విభావరి ముగిశాక అందరూ తమ ఇళ్ళకు చేరుకున్నారు. మరుసటి ఉదయం వార్తాపత్రికలలో మొదటి పేజీలో ముద్రితమైన ఓ చేదువార్త అనేకులను ఆశ్చర్యపరిచింది. గతరాత్రంతా తన సంగీతంతో ప్రజలను ఉర్రూతలూగించిన రస్సెల్ ఆత్మహత్మ చేసుకున్నాడు. దుఃఖాన్ని సమాధి చేయండి అని పిలుపిచ్చిన వ్యక్తి తానెందుకు ఆ పని చేయలేకపోయాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలింది. నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు. కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ఆ జన్మ ధన్యం, ఆ పుట్టుక సఫలం. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. నిత్యనూతనమైన జీవాన్ని అందులో నింపింది. సర్వకాల సర్వావస్థలయందునూ తొణికిసలాడే సంతోషాన్ని నిండుగా నింపింది. ఓ మంచి ఉద్యోగం, చుట్టూ ఇరవై మంది స్నేహితులు, రోజుకు రెండు సినిమాలు షికార్లతో బిజీబిజీగా ఉంటూ జీవితాన్నంతా ఆనందమయం చేసుకోవాలనుకున్న ఓ యువకుడు విజయవాడలో ఉండేవాడు. జీవితాన్నంతా పరిపూర్ణంగా ఆస్వాదించాలన్న లక్ష్యంతో ఏది చేయడానికైనా సిద్ధపడ్డాడు. ప్రతి రాత్రి రెండు దాటాకా ఇంటికి వెళ్ళడం, మానసిక ప్రశాంతత కోసం తనకు తోచినవన్నీ చేసేయడం. ఎందులో వెదకినా ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలన్న తపన, నేనేదో మిస్సవుతున్నానన్న భావన తనను కృంగదీయడం ప్రారంభించాయి. మానసిక ఉల్లాసం కోసం తప్పుడు మార్గాల్లో తిరిగి జీవితం మీద నిరాసక్తతను పెంచుకొని ఒకరోజు ప్రకాశం బ్యారేజ్ మీద నుండి నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ రోజుల్లో విజయవాడలో అక్కడే ఆత్మహత్యలు ఎక్కువగా జరిగేవి. ఇదే చివరిరోజు అని నిర్ణయించుకొని ఒక సాయంకాలం చావును ఎదుర్కోవడానికి వడివడిగా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుకు సంబంధించిన శుభవార్త ఆయనకు అందింది. ‘ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా! నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాటను కలిగియున్న పత్రిక అందింది. ఆ ఒక్కమాట తన జీవితాన్ని మార్చింది. ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం, ఎక్కడా దొరకని సంతృప్తి దేవునిలో దొరికింది. అదే అఖరిరోజుగా చేసుకోవాలనుకున్న ఆయన గతించిన నాలుగు దశాబ్దాల నుండి దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆయనే మా తండ్రిగారైన విజయకుమార్‌గారు. ప్రపంచ కుబేరుడైన రాక్ఫెల్లర్ ఒక సందర్భంలో ఇలా అంటాడు. ‘నేను కోట్లు కూడబెట్టాను. అవి నాకు సంతోషాన్ని ఇవ్వట్లేదు’. ప్రపంచ వ్యాపారవేత్తలో అగ్రగణ్యుడుగా, జీవితంలో ఇతనికంటూ లోటు ఏమీ లేదనిపించుకున్న ఓ కుబేరుడు ఇలాంటి వ్యాఖ్య చేయడం ఆశ్చర్యమైనప్పటికీ, అది వాస్తవం. ‘నువ్వు వర్షంలో ఎందుకు ఏడుస్తున్నావు’ అని అడిగితే ‘ప్రపంచం నా నవ్వునే చూడాలి గాని నేను కూడా అందరి వలే ఏడుస్తున్నాని తెలియకూడదు’ అని జవాబిచ్చిన హాస్యనటుడు చార్లీ చాప్లిన్ గూర్చి తెలియనివారెవరు. ‘నా కళ్ళలోనుండి కారే కన్నీళ్ళు నేను చేసే కామెడీని నిర్వీర్యం చేస్తాయ’ని చెప్పి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. నిజమైన ఆనందం బయటనుండి రాదు. భౌతిక వనరులు ఆనందాన్ని మోసుకురాలేవు. అది స్వచ్ఛమైన హృదయంలో నుండే రావాలి. అటువంటి ఆనందం అందరికీ ప్రయోజనాన్ని చేకూర్చుతుంది. క్రిస్మస్ జీవితానికి పరమార్థాన్ని ఇచ్చింది. జీవితానికి అర్థాన్ని, పరమారాధనను అన్వేషించాల్సిన బాధ్యత మనకు వుంది. ఏదో పుట్టాము. కాలాన్ని ఇష్టం వచ్చినట్లు గడిపేసి చనిపోదాం అనుకోవడం కాదు, జీవితమంటే. జీవితానికి వున్న అర్థాన్ని మొదట మనం కనుగోనాలి. పరమార్థాన్ని గ్రహించాలి. జీవితం ఎంత విలువైనదో దాని ఆవశ్యకత ఎమిటో తెలుసుకొని మెలగాలి. నువ్వెందుకు బతుకుతున్నావు? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఉండాలి. ఒక తత్త్వవేత్త తనకు తెలిసిన వ్యక్తులందరికీ ఒక ప్రశ్నతో కూడిన ఉత్తరం వ్రాశాడు. తన స్నేహితులలో చాలామంది ఆస్తిపరులు, మరికొందరు విస్తారమైన జ్ఞానాన్ని ఆర్జించినవారు, మరికొందరు సమాజంలో అధికారాన్ని, పలుకుబడిని కలిగియున్నవారు. ఉత్తరాలను అందుకొన్నవారు తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చారు. వారిలో ఎక్కువ శాతం మంది ‘మేం ఎందుకు ఈ భూమ్మీద బతుకుచున్నామో మాకు ఇంకా అర్థం కాలేదు’ అని, ‘దాని గురించిన ఆలోచన చేయాల్సిన తీరిక మాకు లేదు’ అని, ‘నీకు తెలిస్తే మాకు కూడా చెప్పొచ్చుగా’ అని రకరకాలుగా జవాబులు పంపించారు. విచారించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో చాలామందికి తామెందుకు బతుకుతున్నాం అనే ప్రశ్నకు జవాబు తెలియకుండా బతికేస్తున్నారు. మనిషి ఎందుకు జీవిస్తున్నాడు? మానవ జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే మనిషిని కలుగచేసిన దేవుని దగ్గరకు రావాలి. ఒక వస్తువును తయారు చేసిన వ్యక్తి మాత్రమే దానిని తయారు చేయడంలో అతని ఉద్దేశాన్ని కచ్చితంగా చెప్పగలడు. ఈ విశ్వంలో మానవ జన్మ చాలా ప్రత్యేకమైనది. సృష్టికర్త మనలను సృజించినపుడు ఆయన స్వరూపములో మనలను సృజించాడు అని బైబిల్ తెలియచేస్తుంది. ఆయన రూపంలో ఉన్న మనం ఆయన లోకానికి వారధులం. దేవుని సంకల్పాలను నెరవేర్చుటకై నియమించబడిన దేవుని ప్రతినిధులం. యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకానికి ఏతెంచి ఓ అద్భుతమైన జీవితాన్ని జీవించి ప్రతి ఒక్కరికీ అన్ని విషయాలలో మాదిరి ఉంచారు. పశువులతొట్టెలో పవళించి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నానన్న సందేశాన్ని లోకానికి ఇచ్చారు. జగతిలో నిండివున్న అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చారు. దారీ తెన్నూ కనబడక దిశనిర్దేశం లేని జనులకు మార్గమయ్యారు. ఆయనే మార్గముగా, సత్యముగా, జీవముగా జగతిలో అవతరించారు. అగమ్యగోచరమైన బతుకులలో నడి సంద్రాన చిక్కి అల్లాడుతున్న జీవితాలలో నావను నడిపే నావికుడిగా భువిలో జన్మించారు. మనందరి జీవితాలకు ఒక గొప్ప పరమార్థాన్ని కలిగించారు. ‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు’ అనే జీవన సత్యాన్ని కేవలం బోధించుట మాత్రమే కాకుండా, క్రియల్లో ఋజువుచేసి ప్రపంచాన్ని ప్రేమమయం చేశాడు యేసుక్రీస్తు. ఓ పరమార్థంతో బతికేవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఏ విషయంలోనూ నిరుత్సాహం చెందడు. క్రిస్మస్ రక్షణ మార్గాన్ని ప్రబోధించింది. ఏ భేదమూ లేదు. అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించుచున్న మహిమను పొందలేకపోవుచున్నారని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ఒక నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఎలా రక్షణ కావాలో, కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ ఎంత అవసరమో, ఒక గనిలో చిక్కుకుపోయి మరణానికి చేరువవుతున్న వారికి రక్షణ ఎంత అవసరమో పాపంలో జీవిస్తూ శాశ్వత మరణానికి చేరువవుతున్న మనిషికి ఆత్మరక్షణ అంతకన్నా ఎక్కువ అవసరం. యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్ధం. ఆయన ప్రపంచాన్ని పాపము నుంచి విడిపించడానికి వచ్చి తన రక్తమును సిలువలో చిందించి విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహిస్తున్నారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు (లూకా 2:11). మానవాళిని రక్షించి, తన దివ్యకాంతులతో ప్రతిఒక్కరినీ నింపి నిత్యజీవనానికి వారసులుగా చేయాలన్నదే దేవుని ఆకాంక్ష. రక్షకుని ఆగమనంతో ఎన్నో ఏళ్లుగా చూస్తున్న మానవుని ఎదురుచూపులు ఫలించాయి. ఒక పిల్లవాడు తండ్రి ఫోటో చూస్తూ, మనసు నిండా గొప్ప ఆశతో ‘మా నాన్న ఆ ఫోటోలోనుండి బయటకు వస్తే బాగుండును’ అని అనుకున్నాడు. సరిగ్గా ఇలాగే మానవులంతా ఆశించారు. ఆశిస్తున్నారు కూడా. కుల మత భాషా వర్గ విభేదాల్లేకుండా మనుష్యులంతా దేవుణ్ణి మరింత సన్నిహితం చేసుకోవాలని తపించారు. ఆయన ఎలా ఉంటాడో చూసి, ఆయనతో ముచ్చటించాలని ఆశపడ్డారు. సరిగ్గా రెండువేల సంవత్సరాల క్రితం దేవుడే మనిషిగా దిగివచ్చాడు. నింగి నేల ఏకమయ్యాయి. ఈ భూమికి నడిబొడ్డున ఉన్న బేత్లేహేము అనే కుగ్రామంలో రక్షకుడు వెలిశాడు. దేవుడు మానవ శరీరం ధరించుకొని వచ్చాడు. వాస్తవ రూపం దాల్చి మనిషికి గోచరుడయ్యాడు. ఎక్కడో రాజభవనంలో పుట్టియుంటే అందరికీ అందుబాటులో ఉండేవాడు కాడు గనుకనే పశువుల తొట్టెలో జన్మించాడు. అతి సామాన్యులైన గొర్రెల కాపరులు మొదట వెళ్ళి రక్షకుని చూశారు. భక్తి పారవశ్యంతో నింపబడి గుండెల నిండా నిరీక్షణతో ముందుకు సాగిపోయారు. క్రీస్తు్త ప్రబోధించిన రక్షణ మార్గం ఈ లోకానికీ ఆ పరలోకానికీ చెందినది. మనుష్యుల జీవిత స్వరూపాన్ని దేవుని మార్గంలోకి ఆ పరలోకానికీ చెందినది. మనుష్యుల జీవిత స్వరూపాన్ని దేవుని మార్గంలోకి మరలించే రక్షణ మార్గమిది నీకు నీవుగా జీవించే జీవితంలో నీ కోసం నువ్వు వెదికే రక్షణను క్రిస్మస్ నీకు అందించింది. శాపాలనుండి పాపాలనుండి విడుదలను పొందే రక్షణ మార్గన్ని క్రిస్మస్ ప్రబోధించింది. చీకటి దారుల్లోకి మరలి భ్రష్టత్వంచెందే మనుష్యులను నిజమైన రక్షణ మార్గంలోనికి తరలి రమ్మని క్రిస్మస్ ప్రబోధించింది. క్రీస్తుతో సహవాసం కలిగి వుండటం, ఆయనకు హృదయాన్ని అర్పించడం ఆ అద్వితీయుని ఆరాధించడం, అయన మార్గంలో నడవడం, ఆయన బోధలను ప్రచురం చేయడం, ఆయన కోసం జీవించడమే మనం చేయవలసిన పని. ఈ సంవత్సరం కరోనా వైరస్ ప్రపంచంలో విషాదాన్ని నింపింది. ఎటుచూసినా ఏం జరుగబోతుందన్న భయంతో మనుష్యులు గతించిన కొన్ని నెలల నుండి బతుకును వెళ్ళదీస్తున్నారు. మనిషి ప్రాణం కన్నా గొప్పది ఏదీ లేదని ఋజువైంది. మన ఉద్యోగాలు, ప్రయాణాలు, విహారాలు, వ్యాపారాలు ఏవీ మన బతుకుల కన్నా గొప్పవి కావని తేలిపోయింది. కొన్ని కొన్ని సందర్భాలలో మనిషి నిశ్చేష్టుడుగా నిలువబడడం తప్ప మరేమీ చేయలేడనే సత్యం బహిర్గతమయ్యింది. చాలామంది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి. తమ వారిని కోల్పోయి విలపిస్తున్న వారు అనేకులున్నారు. జీవితం చాలా భారంగా మారినందువలన ప్రతిరోజూ దుఃఖంతో బతకాల్సిన పరిస్థితిలో చాలామంది జీవిస్తున్నారు. అయితే ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరికీ పరిస్థితులను ఎదుర్కొనగలిగే ధైర్యమును ప్రసాదించాలని, దేవుని వెలుగు ప్రతి ఒక్కరి హృదయంలో ప్రకాశించుట ద్వారా వెలుగులో ప్రజలంతా నడవాలని కోరుకుంటూ, సమసమాజ నిర్మాణంలో మనమంతా పాలిభాగస్తులమై సాగిపోవాలని ఆశిస్తున్నాను. సాక్షి పాఠకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
‘టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది’
సాక్షి, విశాఖపట్టణం : ఉనికి కోసం టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జాన్ వెస్లీ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ప్రజల్లో వస్తున్న స్పందన చూసి టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రజాదారణ కోల్పోయామనే భావనతోనే వైఎస్సార్సీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అధికార వ్యవస్థను దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. అయిదేళ్లలో అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన ఘనత చంద్రబాబుదేనని, గత ఎన్నికల్లో ప్రజల్లు ఓట్లతో గడ్డిపెట్టిన టీడీపీకి బుద్ది రాలేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని, ఇప్పటికైనా టీడీపీ నాయకులు దిగజారుడు ఆరోపణలు మానుకొని సంక్షేమ పాలనలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలని జాన్ వెస్లీ స్పష్టం చేశారు. -
పక్కదారి పట్టించడానికే ఆ నిబంధనలు: వెస్లీ
విశాఖపట్నం: నిరుద్యోగులను పక్కదారి పట్టించడానికే నిరుద్యోగ భృతిలో నిబంధనలు పెట్టారని చంద్రబాబుని ఉద్దేశిస్తూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జాన్ వెస్లీ విమర్శించారు. జాన్ వెస్లీ విలేకరులతో మాట్లాడుతూ..యువనేస్తం కేవలం ప్రభుత్వ ప్రచార ఆర్భాటమే తప్ప మరొకటి కాదన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ప్రారంభించి నాలుగున్నరేళ్లు అయినా నేటికీ ఒక్క అభ్యర్థి సివిల్స్‌కు గానీ, గ్రూప్ వన్‌కు గానీ ఎంపిక కాలేదని తెలిపారు. మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావులు బీసీ కార్పొరేషన్‌ను నోడల్ ఏజెన్సీగా నడిపారని విమర్శించారు. గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో దాడులు జరిగి అనేక అక్రమాలు బయటపడి ప్రభుత్వానికి నివేదిక అందినా నేటికీ ఆ వివరాలను చంద్రబాబు బయటపెట్టలేదని విమర్శించారు. కిడారి, సోమల హత్య కేసులో మాజీ ఎంపీటీసీ రాజారావు ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ సమావేశంలో అరకు సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ, రిటైర్డ్ ఎస్పీ ప్రేమ్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
దళితులపై దాడులు పెరిగాయి: కేవీపీఎస్
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాకే దళితులపై దాడులు పెరిగాయని పలువురు వక్తలు విమర్శించారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి(కెవిపిఎస్) ఆధ్వర్యంలో గుజరాత్‌లోని దళితులపై దాడులను ఖండిస్తు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మాజీ కార్యదర్శి జాన్‌వెస్లీ, టిపిఎస్‌కె కన్వీనర్ జి.రాములు, బిసి సబ్ ప్లాన్ సాధన సమితి కన్వీనర్ కిల్లే గోపాల్, డీబీఎస్ అధ్యక్షులు శంకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.వారు మాట్లాడుతూ బీజేపీ ఒక నాడు ముస్లీం మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని అధికారంలోకి వచ్చిందని, నేడు దళితులను లక్ష్యంగా చేసుకొని బ్రాహ్మణీయ అధిపత్యాన్ని సాధించి హిందూ రాజ్యంగా మార్చటానికి కుట్ర చేస్తుందని వారు విమర్శించారు. గుజరాత్‌లోని ఊనలో గోరక్షక సమితి వారు నలుగురు దళితులపై విచక్షణ రహితంగా దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం సిగ్గు చేటు అని వారు అన్నారు. గుజరాత్ దళితులు చేస్తున్న ఆందోళనకు తాము కూడ మద్దతు ఇస్తున్నామని వారు చెప్పారు. వారికి మద్దతుగా పెద్ద ఎత్తున త్వరలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు జి.నాగయ్య, రాములు, ఆర్.శ్రీరాం నాయక్, సత్తార్, ఎం.డి.అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ సీఎం పీఏకి గాయాలు
మహబూబ్‌నగర్ : తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ...పీఏ జాన్ వెస్లీ సోమవారం ఉదయం ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారును మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ వద్ద ఓ లారీ ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. జాన్ వెస్లీకి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. కాగా ఆయన హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ
విశాఖ రూరల్: విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకుడు జాన్ వెస్లీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని అందులో పేర్కొంది. పార్టీ ఆవిర్భావం నుంచి వెస్లీ ఉంటూ విధేయతతో పని చేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి ఈ సందర్భంగా వెస్లీ కృతజ్ఞతలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశయాల మేరకు, నిత్యం ప్రజా సమస్యలపై జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటాల్లో సుశిక్షుతుడైన సైనికుడిలా పనిచేస్తూ ముందుకు వెళతానని ఆయన తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న రోజుల్లో జరిగే అన్ని ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు.