వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ
విశాఖ రూరల్: విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ నాయకుడు జాన్ వెస్లీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని అందులో పేర్కొంది. పార్టీ ఆవిర్భావం నుంచి వెస్లీ ఉంటూ విధేయతతో పని చేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఈ సందర్భంగా వెస్లీ కృతజ్ఞతలు తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశయాల మేరకు, నిత్యం ప్రజా సమస్యలపై జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాల్లో సుశిక్షుతుడైన సైనికుడిలా పనిచేస్తూ ముందుకు వెళతానని ఆయన తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న రోజుల్లో జరిగే అన్ని ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు.