Secretary of State
-
వివేక్ రామస్వామికి ట్రంప్ మొండి చెయ్యి?
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. వచ్చే ఏడాది (2025) జనవరిలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈలోపు తన పాలకవర్గం కూర్పుపై ట్రంప్ సమాలోచనలు చేస్తున్నారు. కీలకమైన విదేశాంగ శాఖ కార్యదర్శి పదవికి తనకు సన్నిహితుడైన మార్కో రూబియో పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు కథనాలు వెల్లడవుతున్నాయి. అయితే.. ఇండో అమెరికన్ అయిన వివేక్ రామస్వామికి విదేశాంగ శాఖ కార్యదర్శి పదవిని ఇవ్వొచ్చనే గతంలో చర్చ నడిచింది. ఇప్పుడు మార్కో పేరు తెరపైకి వచ్చిన క్రమంలో.. వివేక్ రామస్వామికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? అనే చర్చ మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం.. రిపబ్లిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం వివేక్ రామస్వామి పోటీకి నిలబడ్డారు. ఆదరణ అంతంత మాత్రంగానే రాడంతో పోటీ నుంచి వైదొలిగి.. ట్రంప్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. వివేక్ రామస్వామికి కేబినెట్లో కీలక పదవి ఖాయమనే చర్చ నడిచింది. మరోవైపు.. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మార్కో రూబియో కీలకంగా వ్యవహించారు. రూబియో 2010 నుంచి సెనేట్‌లో పనిచేశారు. ఇక ఇండో అమెరికన్ అయిన నిక్కీ హేలీకి తన పాలకవర్గంలో చోటు ఇవ్వనంటూ ట్రంప్ బహిరంగంగానే ప్రకటించడం గమనార్హం. దీంతో వివేక్ రామస్వామి కూడా అలాంటి పరిస్థితే ఎదురు కావొచ్చనే విశ్లేషణలు నడుస్తున్నాయి. ఎవరీ మార్కో రూబియో రూబియో 2011 నుంచి సెనేటర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌పై సెనేట్ సెలెక్ట్ కమిటీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున జేడీ వాన్స్‌ను ట్రంప్ రన్నింగ్మేట్గా ప్రకటించకముందే రూబియో ఆ రేసులో ఉన్నారు.చదవండి: వలసల నియంత్రణాధికారిగా టామ్ హొమన్ -
అయిదేళ్ల తర్వాత బీజింగ్‌కు బ్లింకెన్
బీజింగ్: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం ఉదయం చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకున్నారు. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌తో ఆయన భేటీ అయ్యారు. తైవాన్ అంశం, ఉక్రెయిన్ యుద్ధం తదితర కీలక అంశాలపై వారు చర్చలు జరిపారు. అనంతరం అధికార విందులో పాల్గొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్లింకెన్ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కూడా కలుస్తారని సమాచారం. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలో బ్లింకెన్ చేపట్టిన ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణ సంబంధాలపై ఇరుపక్షాలు ఆసక్తితో ఉన్నప్పటికీ, బ్లింకెన్ పర్యటనతో కీలక పరిణామాలకు అవకాశాలు తక్కువని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వ్యాఖ్యానించడం గమనార్హం. -
అమెరికా వీసాల వేగవంతానికి చర్యలు
వాషింగ్టన్: అమెరికా వీసాల కోసం భారతీయులు దీర్ఘకాలం వేచి ఉండే పరిస్థితులకు కరోనా మహమ్మారియే కారణమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ నిందించారు. కొద్ది నెలల్లోనే సమస్యను పరిష్కరిస్తామని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు హామీ ఇచ్చారు. వాషింగ్టన్లో మంగళవారం బ్లింకెన్‌తో జై శంకర్ భేటీ అయ్యారు. వీసా అపాయింట్మెంట్ల కోసం రెండేళ్లకు పైగా ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నట్టు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కరోనా సంక్షోభంతో 2020 మార్చి నుంచి కొద్ది నెలల పాటు వీసా ప్రక్రియ నిలిపివేయడంతో వేచి చూసే సమయం పెరిగిపోయిందని, వీసాల త్వరితగతి మంజూరు కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని బ్లింకెన్ స్పష్టం చేశారు. ‘‘కరోనా కారణంగా మా దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని తగ్గించాం. ఇప్పుడు మళ్లీ సిబ్బందిని పెంచడానికి ఒక ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడతాం. మరి కొద్ది నెలల్లోనే వీసాల జారీ వేగవంతం అవుతుంది’’ అని బ్లింకెన్ స్పష్టం చేశారు. వీసా ప్రక్రియ వేగవంతం చేయడం ఇరుదేశాలకూ ప్రయోజనకరమని జైశంకర్ అన్నారు. వీసాల జారీలో అడ్డంకుల్ని అధిగమించాలన్నారు. -
అమెరికా విదేశాంగ మంత్రిగా ఎన్నారై మహిళ!
వాషింగ్టన్: భారత-అమెరికన్ మహిళ నిక్కీ హేలీకి డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలో కీలక పదవి దక్కే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆమెకు ప్రాధాన్యమున్న మంత్రి పదవి(హై ప్రొఫైల్ పోస్ట్) కట్టబెట్టేందుకు ట్రంప్ సముఖంగా ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. హేలీ ఈరోజు ట్రంప్ తో భేటీ అవుతారని అధ్యక్ష అధికార బదలాయింపు బృందం ప్రతినిధి సీన్ స్పైసర్ తెలిపారు. ఆమెతో పాటు మాజీ మంత్రి హెన్సీ కిస్సింగర్, రిటైర్డ్ జనరల్ జాన్ కీనే, అడ్మిరల్ మైక్ రోజర్స్, కెన్ బ్లాక్ వెల్ కూడా ట్రంప్ ను కలవనున్నారని వెల్లడించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయనను ప్రతిరోజు ఎంతోమంది కలుస్తున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ట్రంప్ కు తమ విన్నపాలు విన్నవించుకుంటున్నారు. సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కొంతమంది వస్తున్నారు. 44 ఏళ్ల నిక్కీ హేలీ రెండో పర్యాయం దక్షిణ కరోలినా రాష్ట్రానికి రెండో పర్యాయం గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమెకు విదేశాంగ మంత్రి దక్కే అవకాశముందని ట్రంప్ సన్నిహితడొకరు వెల్లడించారు. మరో ఇండియన్-అమెరికన్ బాబీ జిందాల్ కూడా కేబినెట్ రేసులో ఉన్నారు. రెండో పర్యాయం లూసియానా గవర్నర్ గా పనిచేస్తున్న ఆయనను ఆరోగ్యశాఖ మంత్రిగా నియమించే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిక్కీ హేలీ, జిందాల్.. ట్రంప్ కేబినెట్లో స్థానం దక్కితే ఆ పదవి పొందిన తొలి భారతీయ అమెరికన్లు రికార్డులకెక్కుతారు. -
లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన జలగం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని ప్రముఖ వీరభద్రస్వామి దేవాలయాన్ని జలగం వెంకట్రావు సందర్శించుకున్నారు. అనంతరం ఆయన మాజీ మంత్రి గాజుల సోమశేఖర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆదివారం ఆయన లేపాక్షిలో వీరభద్రస్వామి దేవాలయాన్ని సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేస్తున్నారు. (లేపాక్షి) -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ
విశాఖ రూరల్: విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకుడు జాన్ వెస్లీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని అందులో పేర్కొంది. పార్టీ ఆవిర్భావం నుంచి వెస్లీ ఉంటూ విధేయతతో పని చేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి ఈ సందర్భంగా వెస్లీ కృతజ్ఞతలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశయాల మేరకు, నిత్యం ప్రజా సమస్యలపై జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటాల్లో సుశిక్షుతుడైన సైనికుడిలా పనిచేస్తూ ముందుకు వెళతానని ఆయన తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న రోజుల్లో జరిగే అన్ని ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు. -
పోలవరం పేరిట చిచ్చుపెట్టొద్దు: సీపీఐ
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పేరిట తెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టొద్దని సీపీఐ ఏపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూడడం ఏ మాత్రం సమంజసం కాదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఏటా రెండు మూడు వేల టీఎంసీల గోదావరి నదీజలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయని, వాటిని సద్వినియోగ పరిచే ప్రయత్నాన్ని అడ్డుకోవద్దని టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ద్వారా మాత్రమే వెనుకబడిన, కృష్ణా నది ఎగువ ప్రాంతాలకు నీరందించడానికి వీలవుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు సత్వర న్యాయం జరిపించాలని, భూమి కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని రామకృష్ణ కోరారు -
సీపీఐ సారథి ‘చాడ’
తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శిగా ఏకగీవ్ర ఎన్నిక సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు సవాళ్లను ఎదుర్కొంటూ పార్టీ బలోపేతానికి కృషి ‘న్యూస్‌లైన్’తో ఆనందం వ్యక్తం చేసిన వెంకటరెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తెలంగాణ రాష్ట్ర శాఖ సారథ్యం జిల్లాకే దక్కింది. నిన్నటివరకు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడుగా ఉన్న చాడ వెంకటరెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆ పార్టీ కార్యవర్గం శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన సమావేశాల్లో పార్టీ పగ్గాలు చాడకు అప్పగించడంతో జిల్లాలోని సీపీఐ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కార్యకర్త నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు.. చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన చాడ వెంకటరెడ్డి 1975లో సీపీఐలో చేరారు. ఆ పార్టీ గ్రామశాఖ కార్యదర్శిగా ప్రస్థానం ప్రారంభించి.. నేడు రాష్ట్ర శాఖ నాయకత్వ బాధ్యతలను చేపట్టే స్థాయికి ఎదిగారు. 1982లో హుస్నాబాద్ తాలుకా కార్యద ర్శిగా, 1992లో జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2005లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా, జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. విశాలాంధ్ర విజ్ఞాన్ సమితి చైర్మన్‌గా, ప్రజానాట్యమండలి బాధ్యులుగా సైతం ఆయన పనిచేస్తున్నారు. సర్పంచ్ నుంచి శాసనసభకు.. 1981లో రేకొండ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన చాడ వెంకటరెడ్డి, 1991లో చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షుడిగా పదవిని చేపట్టారు. 1994లో ఇందుర్తి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 1995లో చిగురుమామిడి జెడ్పీటీసీగా గెలుపొందారు. 1999లో సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. తిరిగి 2004లో ఎన్నికల్లో ఇందుర్తి ఎమ్మెల్యే ఎన్నికై.. సీపీఐ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. శాసనసభ ద్వారా పలు కమిటీలకు సైతం ఆయన నేతృత్వం వహించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ పొత్తులో భాగంగా హుస్నాబాద్ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించడంతో చాడకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. పోరాటాలకు పెట్టింది పేరు.. నియోజకవర్గంలో ప్రజాసమస్యలు పరిష్కరించాలని, వరదకాల్వ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ 1999లో చాడ వెంకటరెడ్డి విసృతంగా పాదయాత్ర నిర్వహించారు. 2012లో జిల్లాలో ప్రజా సమస్యలపై 484 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. హుస్నాబాద్, చిగురుమామిడి మండలాల్లో లాకప్‌డెత్‌లకు వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటాలతోపాటు ప్రజాసమస్యలపై నిర్వహించే పోరాటా లు ఆయనను సీపీఐలో రాష్ట్రస్థాయి వరకు తీసుకు వెళ్లాయి. పార్టీని బలోపేతం చేస్తా : చాడ సీపీఐలో సామాన్య కార్యకర్తగా చేరిన నేను రాష్ట్ర కార్యదర్శి అవుతానని ఊహించలేదని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. తనలో ఉన్న పట్టుదలే ఇంతదాకా నడిపించిందన్నారు. పేదలు, బలహీనవర్గాల కోసం పని చేయడం ఇందుకు దోహదపడిందన్నారు. పార్టీలో అనేక ఒడిదుడుకులు ఎదురైనా వాటిని తట్టుకొని పార్టీని బలోపేతం చేసేందకు పని చేశానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ బాధ్యతలు అప్పగిచండం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం తన ముందున్న ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన వివరించారు. సీపీఐ సంబరాలు కరీంనగర్ : సీపీఐ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి ఎన్నికవడం పట్ల ఆ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో బాణసంచా పేల్చి స్వీట్లు పంచి వేడుక చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజాప్రతినిధిగా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన చాడ ఎన్నిక కావడం జిల్లా రాజకీయాలకు శుభపరిణామమని అన్నారు. కష్టించి పనిచేసే కార్యకర్తలకు పార్టీ సరైన గుర్తింపు ఇస్తుందనడానికి చాడ ఎన్నికే నిదర్శమన్నారు. సీపీఐ నగర కార్యదర్శి పైడిపల్లి రాజు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పంజాల శ్రీనివాస్, ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు కొయ్యడ చంద్రయ్య, సీహెచ్.రాజేశం, కాల్వ నర్సయ్యయాదవ్, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, బ్రాహ్మణపల్లి యుగేంధర్, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బూడిద సదాశివ, రమేశ్, భద్రాచలం శ్రీనివాస్, రోహిత్, సాయి, భూమయ్య, నగేశ్, రాజు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ గ్రేటర్ ప్రధానకార్యదర్శిగా అనుముల
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శిగా అనుముల నర్సింహ్మారెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు, నగర అధ్యక్షులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ నియామక పత్రాన్ని మంగళవారం ఆయనకు అందించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని కుషాయిగూడకు చెందిన అనుముల పార్టీ రంగారెడ్డి జిల్లా యువజన విభాగంలోనూ, కాప్రా సర్కిల్ పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. కుషాయిగూడ బస్ డిపో కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. పార్టీ పటిష్టత కోసం అనుముల చేసిన కృషికి గుర్తింపుగా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ప్రధానకార్యదర్శిగా నియమించినట్టుగా ఎమ్మెల్యే కె.తారక రామారావు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు బాల్క సుమన్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భేతి సుభాష్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ నాయకులు మురళీ పంతులు, కనకరాజు పాల్గొన్నారు.