సీపీఐ సారథి ‘చాడ’
తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శిగా ఏకగీవ్ర ఎన్నిక
సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు
సవాళ్లను ఎదుర్కొంటూ పార్టీ బలోపేతానికి కృషి
‘న్యూస్‌లైన్’తో ఆనందం వ్యక్తం చేసిన వెంకటరెడ్డి
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తెలంగాణ రాష్ట్ర శాఖ సారథ్యం జిల్లాకే దక్కింది. నిన్నటివరకు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడుగా ఉన్న చాడ వెంకటరెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆ పార్టీ కార్యవర్గం శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన సమావేశాల్లో పార్టీ పగ్గాలు చాడకు అప్పగించడంతో జిల్లాలోని సీపీఐ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
కార్యకర్త నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు..
చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన చాడ వెంకటరెడ్డి 1975లో సీపీఐలో చేరారు. ఆ పార్టీ గ్రామశాఖ కార్యదర్శిగా ప్రస్థానం ప్రారంభించి.. నేడు రాష్ట్ర శాఖ నాయకత్వ బాధ్యతలను చేపట్టే స్థాయికి ఎదిగారు. 1982లో హుస్నాబాద్ తాలుకా కార్యద ర్శిగా, 1992లో జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2005లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా, జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. విశాలాంధ్ర విజ్ఞాన్ సమితి చైర్మన్‌గా, ప్రజానాట్యమండలి బాధ్యులుగా సైతం ఆయన పనిచేస్తున్నారు.
సర్పంచ్ నుంచి శాసనసభకు..
1981లో రేకొండ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన చాడ వెంకటరెడ్డి, 1991లో చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షుడిగా పదవిని చేపట్టారు. 1994లో ఇందుర్తి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 1995లో చిగురుమామిడి జెడ్పీటీసీగా గెలుపొందారు. 1999లో సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. తిరిగి 2004లో ఎన్నికల్లో ఇందుర్తి ఎమ్మెల్యే ఎన్నికై.. సీపీఐ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. శాసనసభ ద్వారా పలు కమిటీలకు సైతం ఆయన నేతృత్వం వహించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ పొత్తులో భాగంగా హుస్నాబాద్ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించడంతో చాడకు పోటీ చేసే అవకాశం దక్కలేదు.
పోరాటాలకు పెట్టింది పేరు..
నియోజకవర్గంలో ప్రజాసమస్యలు పరిష్కరించాలని, వరదకాల్వ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ 1999లో చాడ వెంకటరెడ్డి విసృతంగా పాదయాత్ర నిర్వహించారు. 2012లో జిల్లాలో ప్రజా సమస్యలపై 484 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. హుస్నాబాద్, చిగురుమామిడి మండలాల్లో లాకప్‌డెత్‌లకు వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటాలతోపాటు ప్రజాసమస్యలపై నిర్వహించే పోరాటా లు ఆయనను సీపీఐలో రాష్ట్రస్థాయి వరకు తీసుకు వెళ్లాయి.
పార్టీని బలోపేతం చేస్తా : చాడ
సీపీఐలో సామాన్య కార్యకర్తగా చేరిన నేను రాష్ట్ర కార్యదర్శి అవుతానని ఊహించలేదని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. తనలో ఉన్న పట్టుదలే ఇంతదాకా నడిపించిందన్నారు. పేదలు, బలహీనవర్గాల కోసం పని చేయడం ఇందుకు దోహదపడిందన్నారు. పార్టీలో అనేక ఒడిదుడుకులు ఎదురైనా వాటిని తట్టుకొని పార్టీని బలోపేతం చేసేందకు పని చేశానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ బాధ్యతలు అప్పగిచండం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం తన ముందున్న ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన వివరించారు.
సీపీఐ సంబరాలు
కరీంనగర్ : సీపీఐ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి ఎన్నికవడం పట్ల ఆ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో బాణసంచా పేల్చి స్వీట్లు పంచి వేడుక చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజాప్రతినిధిగా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన చాడ ఎన్నిక కావడం జిల్లా రాజకీయాలకు శుభపరిణామమని అన్నారు. కష్టించి పనిచేసే కార్యకర్తలకు పార్టీ సరైన గుర్తింపు ఇస్తుందనడానికి చాడ ఎన్నికే నిదర్శమన్నారు. సీపీఐ నగర కార్యదర్శి పైడిపల్లి రాజు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పంజాల శ్రీనివాస్, ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు కొయ్యడ చంద్రయ్య, సీహెచ్.రాజేశం, కాల్వ నర్సయ్యయాదవ్, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, బ్రాహ్మణపల్లి యుగేంధర్, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బూడిద సదాశివ, రమేశ్, భద్రాచలం శ్రీనివాస్, రోహిత్, సాయి, భూమయ్య, నగేశ్, రాజు పాల్గొన్నారు.