తెలంగాణ సీఎం మాటల మాంత్రికుడిగా మారి కరువు నివారణ చర్యలు తీసుకోవటంలో నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితులపై సుప్రీంకోర్టు కేంద్రానికి అక్షింతలు వేసినా ఇప్పటికీ స్పందన కరువైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కరువు సాయం అందలేదని చెప్పారు. బీజేపీ నాయకులు నిధులు తెప్పించటంలో విఫలమయ్యారని ఆరోపించారు. తెలంగాణ సీఎం మాటల మాంత్రికుడిగా మారి కరువు నివారణ చర్యలు తీసుకోవటంలో నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. జిల్లాకు కనీసం రూ.100 కోట్లు కేటాయించి, వలసలను నివారించాలని కోరారు.
కాగా నగరంలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్దుం భవన్‌లో సోమవారం అంబలి కేంద్రం ప్రారంభమైంది. అనాథలు, చిన్నారులు, వృద్ధ అన్నార్తుల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్రాన్ని ప్రారంభించిన చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఇలాంటి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో ఈనెల 25వ తేదీ నుంచి తెరవనున్నట్లు ఆయన వెల్లడించారు.