
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. వచ్చే ఏడాది (2025) జనవరిలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈలోపు తన పాలకవర్గం కూర్పుపై ట్రంప్ సమాలోచనలు చేస్తున్నారు. కీలకమైన విదేశాంగ శాఖ కార్యదర్శి పదవికి తనకు సన్నిహితుడైన మార్కో రూబియో పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు కథనాలు వెల్లడవుతున్నాయి. అయితే..
ఇండో అమెరికన్ అయిన వివేక్ రామస్వామికి విదేశాంగ శాఖ కార్యదర్శి పదవిని ఇవ్వొచ్చనే గతంలో చర్చ నడిచింది. ఇప్పుడు మార్కో పేరు తెరపైకి వచ్చిన క్రమంలో.. వివేక్ రామస్వామికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? అనే చర్చ మొదలైంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం.. రిపబ్లిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం వివేక్ రామస్వామి పోటీకి నిలబడ్డారు. ఆదరణ అంతంత మాత్రంగానే రాడంతో పోటీ నుంచి వైదొలిగి.. ట్రంప్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. వివేక్ రామస్వామికి కేబినెట్‌లో కీలక పదవి ఖాయమనే చర్చ నడిచింది.
మరోవైపు.. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మార్కో రూబియో కీలకంగా వ్యవహించారు. రూబియో 2010 నుంచి సెనేట్‌లో పనిచేశారు. ఇక ఇండో అమెరికన్ అయిన నిక్కీ హేలీకి తన పాలకవర్గంలో చోటు ఇవ్వనంటూ ట్రంప్ బహిరంగంగానే ప్రకటించడం గమనార్హం. దీంతో వివేక్ రామస్వామి కూడా అలాంటి పరిస్థితే ఎదురు కావొచ్చనే విశ్లేషణలు నడుస్తున్నాయి.
ఎవరీ మార్కో రూబియో
రూబియో 2011 నుంచి సెనేటర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌పై సెనేట్ సెలెక్ట్ కమిటీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున జేడీ వాన్స్‌ను ట్రంప్ రన్నింగ్‌మేట్‌గా ప్రకటించకముందే రూబియో ఆ రేసులో ఉన్నారు.