వాషింగ్టన్: అమెరికా వీసాల కోసం భారతీయులు దీర్ఘకాలం వేచి ఉండే పరిస్థితులకు కరోనా మహమ్మారియే కారణమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ నిందించారు. కొద్ది నెలల్లోనే సమస్యను పరిష్కరిస్తామని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు హామీ ఇచ్చారు. వాషింగ్టన్‌లో మంగళవారం బ్లింకెన్‌తో జై శంకర్ భేటీ అయ్యారు. వీసా అపాయింట్‌మెంట్ల కోసం రెండేళ్లకు పైగా ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నట్టు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
కరోనా సంక్షోభంతో 2020 మార్చి నుంచి కొద్ది నెలల పాటు వీసా ప్రక్రియ నిలిపివేయడంతో వేచి చూసే సమయం పెరిగిపోయిందని, వీసాల త్వరితగతి మంజూరు కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని బ్లింకెన్ స్పష్టం చేశారు. ‘‘కరోనా కారణంగా మా దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని తగ్గించాం. ఇప్పుడు మళ్లీ సిబ్బందిని పెంచడానికి ఒక ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడతాం. మరి కొద్ది నెలల్లోనే వీసాల జారీ వేగవంతం అవుతుంది’’ అని బ్లింకెన్ స్పష్టం చేశారు. వీసా ప్రక్రియ వేగవంతం చేయడం ఇరుదేశాలకూ ప్రయోజనకరమని జైశంకర్ అన్నారు. వీసాల జారీలో అడ్డంకుల్ని అధిగమించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment