జగమంత వెలుగులో క్రిస్మస్‌ | Dr John Wesly Devotional Article On Christmas | Sakshi
Sakshi News home page

జగమంత వెలుగులో క్రిస్మస్‌

Published Sun, Dec 19 2021 2:42 PM | Last Updated on Sun, Dec 19 2021 2:42 PM

Dr John Wesly Devotional Article On Christmas - Sakshi

ధైర్యం ముందుకు నడిపిస్తుంది.. నింగిలోని నక్షత్రం ఆ దారికి వెలుగు పడుతుంది.. నమ్మకం ఆ  నక్షత్రానికి వెలుగును అద్దుతుంది.. ఆ నమ్మకమే ఓ విశ్వాసమైంది ‘క్రీస్తు’గా! ఆ సందర్భమే వేడుకైంది ‘క్రిస్‌మస్‌’గా!! 

ఇటలీలోని జెనొవా నగరంలో 1451వ సంవత్సరంలో ఒక  బిడ్డ జన్మించాడు. పుట్టినప్పుడు బహుశా ఎవ్వరూ ఊహించి ఉండకపోవచ్చు ఆ బాలుడు ప్రపంచానికే దీవెనకరంగా మారతాడని. అతని పేరు క్రిస్టఫర్‌ కొలంబస్‌. ప్రపంచం మరువలేని సముద్ర అన్వేషకుడు. తన అన్వేషణలో భాగంగా తన బృందంతో కలసి ఆజోర్సా ద్వీపాలు దాటాడు. కనుచూపు మేరలో ఎక్కడా భూభాగం కనిపించడం లేదు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నీలిసముద్రంలో కష్టమని తోచిన నావికుడు అడిగాడు ఏం చేద్దాం అని. దానికి కొలంబస్‌ ఇచ్చిన సమాధానం ‘ముందుకే వెళ్దాం’.  కొలంబస్‌ మాట ప్రకారం నావికుడు నావను ముందుకు పోనిచ్చాడు.

కాసేపటికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు. ఈ రాత్రి సముద్రం మనలను కబళించజూస్తుంది. ఒక్కమాట చెప్పు, ఆశలన్నీ అడుగంటాక చేసేదేమీ ఉండదు. కొలంబస్‌ నోట నుంచి  వచ్చిన ఒకేఒక్క మాట ‘ముందుకే సాగుదాం’. సముద్రపు నీళ్ళను చీల్చుకుంటూ ముందుకు సాగుతున్న నావలో కొన్ని గంటల తర్వాత పనివాళ్ల తిరుగుబాటు ధోరణుల మధ్య వినిపించిన కేకలు ‘రేపు ఉదయం కూడా భూమి కనబడకపోతే ఏం చేద్దాం?’ ధీర కొలంబస్‌ది ఒకటే జవాబు అప్పుడు కూడా ముందుకు సాగిపోవడమే. వెనుతిరగని దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోయిన కొలంబస్‌కు విజయం లభించింది. ఓ అద్భుతమైన భూభాగాన్ని కనుగొని ప్రపంచాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించాడు. ఎన్ని అవరోధాలు ఎదురొచ్చినా ‘ముందుకే సాగిపో’ అనే నినాదం కచ్చితంగా విజయతీరాలకు నడిపిస్తుంది. 

సరిగ్గా రెండువేల సంవత్సరాల కిందట...
ఇలాంటి సంఘటనే ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు జరిగింది. ఇజ్రాయేలు దేశంలోని ఓ కుగ్రామమైన బేత్లెహేములో పశువుల తొట్టెలో యేసుక్రీస్తు జన్మించారు. వాస్తవానికి నజరేతు నుంచి యోసేపు, మరియలు జనసంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకొనుటకు బేత్లెహేమునకు వచ్చారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం మీకా అనే ప్రవక్త క్రీస్తు జన్మించే స్థలాన్ని గూర్చి ప్రవచించాడు. బేత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను (మీకా 5:2). ప్రజలను పాలించే నిజమైన పరిపాలకుడు బేత్లెహేములో జన్మిస్తాడని చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడునట్లు యోసేపు, మరియలు కష్ట పరిస్థితిలో ప్రయాణం చేసుకుంటూ బేత్లెహేము చేరుకున్నారు.

పరిశుద్ధ గ్రంథంలోని లూకా సువార్త రెండవ అధ్యాయం చదివితే ఎన్నో చారిత్రక అంశాలు వెలుగులోనికి వస్తాయి. ఆ అధ్యాయంలో ప్రస్తావించిన సీజర్‌ అగస్టస్, కురేనియు చరిత్రలో కనిపిస్తారు. ఈ మధ్యకాలంలో రస్సెల్‌ అనే పురాతత్వ శాస్త్రవేత్తకు లభించిన కొన్ని చర్మపు కాగితాలలో ఆ కాలంలో జరిగిన జనసంఖ్య వివరాలు బయటపడ్డాయి. పశువులతొట్టెలో యేసుక్రీస్తు జన్మించుట ద్వారా ఆయన అందరికీ అందుబాటులో ఉండే దేవుడు అని రుజువు చేయబడింది. ఆయన జన్మించిన తరువాత మొట్టమొదటగా ఆయన్ను దర్శించినవారు సామాన్యులైన గొర్రెల కాపరులు. క్రీస్తు ఎక్కడో అంతఃపురంలో పుట్టి ఉన్నట్లయితే సామాన్యులు ఆయన్ను చూడగలిగేవారు కాదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా యోసేపు, మరియలు బేత్లెహేమునకు రావడంలో ‘ముందుకే సాగిపో’ అనే ఆలోచన కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ప్రయాణ కష్టం, ఒంటరితనం వారిని ఆపలేకపోయాయి. దేవుని చిత్తమును నెరవేర్చడంలో వారికున్న సంసిద్ధత నేటి తరంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమే.

దివిలో దివ్యనక్షత్రం
ఎప్పటి నుండో నక్షత్రాలపై పరిశోధన చేస్తున్న కొందరు వ్యక్తులకు ఆకాశంలో ఓ విచిత్ర నక్షత్రం తారసపడింది. అది ఒక ప్రత్యేక నక్షత్రం అని వారు గుర్తించి దానిని వెంబడించడం ప్రారంభించారు. యాకోబులో నక్షత్రం ఉదయించును అనే ప్రవచనం ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది. దేవుడు సృష్టించిన విశాల వినీలాకాశంలో వింతగొలిపే అద్భుతాలు కోకొల్లలు. రాత్రివేళ ఆకాశంలో చక్కని చుక్కలు కనువిందు చేస్తాయి. మానవుని కన్ను ఆకాశంలో మూడువేల నక్షత్రాలను లెక్కపెట్టగలదట. అంతమాత్రాన ఆకాశంలో మూడు వేల నక్షత్రాలే ఉన్నాయనుకుంటే పొరపాటే. ఇటలీ శాస్త్రవేత్త గెలీలియో టెలిస్కోప్‌ కనిపెట్టిన తర్వాత అంతరిక్ష పరిశోధన కొత్త పుంతలు తొక్కింది. నక్షత్ర సముదాయాన్ని పాలపుంత అని పిలిస్తే ఒకొక్కొ పాలపుంతలో సుమారుగా పదివేల కోట్ల నక్షత్రాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అలాంటి విస్తుగొలిపే పాలపుంతలు కోట్లకొలది విశ్వంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అవన్నీ సర్వోన్నతుడైన దేవుని మహిమను చాటిచెబుతున్నాయి.

నక్షత్ర పరిశోధకులైన ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తును ఆరాధించుటకు బయలుదేరారు. సుదూర ప్రయాణానికి వారి కుటుంబాలను, ప్రాంతాలను విడిచి బయలుదేరినప్పుడు వారు చాలా సమస్యలు ఎదుర్కొని ఉండవచ్చు. ఇక్కడ కూడా ‘ముందుకే సాగిపో’ అనే నినాదం చాలా బాగా పనిచేసింది. బాలుడైన యేసును చూడాలని పట్టుదలతో వారు బయలుదేరారు. దేవుని ఆరాధించడమే మన లక్ష్యం, మన గమ్యం అంటూ వారు ప్రారంభించిన ప్రయాణం అభినందనీయం. ఆకాశంలో కనిపించిన వింత తార వారికి దారిచూపడం ప్రారంభించింది. పరిశుద్ధ గ్రంథంలో ఆ నక్షత్రానికి ‘ఆయన నక్షత్రం’ అని పేరు పెట్టబడింది. గగనంలో పుట్టిన ఆ తార గురించి ఎన్నో విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. సూపర్‌ నోవా, హేలీ తోకచుక్క, గ్రహాల కలయిక లాంటి వాదాలు చలామణిలో ఉన్నాయి. అన్నిటికన్నా ప్రాముఖ్య విషయం ఏమిటంటే ‘దేవుడు సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనదేదీ ఉండదు’ అని నమ్మే దేవుని బిడ్డలు ఇది కచ్చితంగా ఓ అద్భుతమే అని విశ్వసిస్తారు.

గగన వీధుల్లో మెరిసిన ఆ దివ్య నక్షత్రం జ్ఞానులకు దారి చూపింది. ఆ తారను అనుసరిస్తూ వెళ్ళిన జ్ఞానులలో ఒకరు భారతదేశానికి చెందిన వారని చరిత్ర చెబుతుంది. ఆ వ్యక్తి బంగారాన్ని కానుకగా యేసుక్రీస్తుకు ఇచ్చాడు. మిగతా ఇద్దరు జ్ఞానులు సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించారు. వారు కానుకలుగా ఇచ్చిన ఆ మూడు యేసుక్రీస్తు మూడు ప్రాముఖ్యమైన లక్షణాలను వివరిస్తున్నాయి. సువర్ణం ఆయన దైవత్వానికి, సాంబ్రాణి ఆయన ఆరాధనీయుడు అని బోళము ఆయన మనుషుల కొరకు అనుభవించే శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాయి. ‘వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి తల్లియైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి’– (మత్తయి 2:1011).

ఒకసారి ఒక తల్లి తన కుమారుని చేతిని పట్టుకొని సంధ్యవేళలో గ్రామంలో నడుస్తున్నారు. చల్లని పిల్లగాలులు చుట్టునున్న చెట్లనుండి వీస్తుండగా మట్టిరోడ్డుపై అడుగులు వేస్తున్నాడు ఆ కుమారుడు. ఆ గ్రామంలో చాలామంది ఇంటి మీద ఒక నక్షత్రం ఉండడం ఆ కుమారుడు గమనించి తల్లిని  ప్రతి ఇంటి మీద ఒక నక్షత్రం ఎందుకు ఉంది? దాని ప్రత్యేకత ఏమిటి? అని అడిగాడు. దానికి తల్లి ఈ గ్రామంలో అనేకమంది దేశ రక్షణ కొరకు యుద్ధానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయినారు. అలా దేశరక్షణలో తమ ప్రాణాలు కోల్పోయిన వీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఇంటి మీద నక్షత్రం పెట్టడం ఈ గ్రామంలోని వారికి అలవాటు.

కొంత దూరం వెళ్ళాక ఒక చర్చి మీద కూడా కాంతిమంతమైన ఒక నక్షత్రం కనబడింది. అమ్మా! చర్చిమీద డిసెంబరు నెలలో నక్షత్రం ఎందుకు పెడతారు అని ప్రశ్నించాడు. దానికి అ తల్లి ‘‘దేవుడు మనలను ప్రేమించి రెండువేల సంవత్సరాల క్రితం మనిషిగా ఈ లోకానికి ఏతెంచారు. మనుషులందరినీ రక్షించడానికి ఏమీ లేనివానిగా పుడమిపై జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఒక దివ్య నక్షత్రం వెలసింది.  దేవదేవుని దివ్య ప్రేమకు, త్యాగమునకు, ఆయన ఈ లోకానికి వచ్చారనుటకు గుర్తుగా ఆ నక్షత్రాన్ని పెట్టారు’ అని తల్లి సమాధానమిచ్చింది.

క్రీస్తు ఆరాధనే క్రిస్మస్‌
ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి తన ప్రాణం పెట్టి సర్వమానవాళిని రక్షించుటకు వచ్చారు. ఆయన సశరీరునిగా ఈ లోకానికి దిగివచ్చిన సంతస సందర్భాన్ని క్రిస్మస్‌గా జరుపుకుంటాము. క్రిస్మస్‌ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. క్రిస్మస్‌ పండుగ ఆచారాలకు సంబంధించిన పండుగ కాదు. ఇది ఆత్మీయతను పెంచే అనిర్వచనీయమైన అనుభవం. క్రీస్తును హృదయంలో కలిగియున్న ప్రతి ఒక్కరూ పరవశమొందే సమయం. ప్రపంచంలో అనేక పండుగలు కొన్ని ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, సంస్కృతులకు మాత్రమే పరిమితమై ఉంటాయి. క్రిస్మస్‌ విశ్వవ్యాప్తంగా సంతోషంగా జరుపుకునే పండుగ. క్రిస్మస్‌ ఒక మతానికి లేదా ఒక సమాజానికి సంబంధించినది కాదు. మానవులందరికీ శుభాన్ని కలుగజేసే పండుగ. ఎందుకంటే సర్వసృష్టిని తన నోటి మాటద్వారా కలుగజేసిన సర్వవ్యాపి, సర్వజ్ఞాని అయిన దేవదేవుడు శరీరధారిగా ఈలోకానికి అరుదెంచిన శుభఘడియ. క్రిస్మస్‌ సంతోషాల పండుగ, సమాధానమునిచ్చే పండుగ.

కుమారుడిగా అవతరించిన యేసు
ఈ లోకములో ప్రతి మనిషి జన్మించిన తరువాత అతని  వివరాలు, లక్షణాలు, ప్రవర్తన మొదలగు విషయాలు చెప్పగలరు. ఆ వ్యక్తి ఎదుగుతున్న కొలది అతని జీవినవిధానమును వివరించవచ్చును. యేసుక్రీస్తు ప్రభువు జన్మించడానికి ముందు కొన్ని వందల సంవత్సరాల ముందు అనేకమంది ప్రవక్తలు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రవచించారు. యేసుక్రీస్తు ప్రవక్తల ప్రవచన సారం. ఆయన జన్మించే స్థలం, ఎవరికి జన్మిస్తారు, ఆయన పరిచర్య విధానం ఎలా ఉండబోతోంది, ఆయన మరణించే విధానం, మహత్తరమైన ఆయన పునరుత్థానం గురించి ముందే ఉల్లేఖనాల్లో ప్రవచించబడ్డాయి. ఆయన జన్మించడానికి ఏడు వందల సంవత్సరాలకు ముందు ఝెషయా అనే దైవప్రవక్త ఇలా ప్రవచించాడు ‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను’–(ఝెషయా 9:6).

పరిశుద్ధుడైన దేవుడు సర్వలోకానికి కుమారుడుగా దిగివచ్చి నిత్యనరకాన్ని తప్పించుటకు తన్నుతాను రిక్తునిగా చేసుకుని రక్తమాంసాలు ధరించుకుని వచ్చాడు. ‘ఆయన భుజమున రాజ్యభారముండును’ అని ప్రవక్త ప్రవచించినట్లుగా తన ప్రజల భారం ఆయనే భరిస్తాడు. వారిని ప్రయాసల నుండి విడిపిస్తాడు. ఆ ప్రవచన నెరవేర్పుగా యేసు ‘ప్రయాసపడి భారం మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’ అని సమస్త మానవాళినీ ఆహ్వానించారు. ఒక నక్షత్రానికి అయిదు కోణాలు ఎలా ఉంటాయో ఝెషయా ప్రవచించినట్లుగా అయిదు గొప్ప విషయాలు ప్రభవైన యేసును గురించి చెప్పబడ్డాయి. యేసు ప్రభువును గురించి చెప్పబడిన ప్రతి మాట ఆయన జీవితంలో నెరవేర్చబడ్డాయి.

ఆయన ఆశ్చర్యకరుడు– ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యకరమైన కార్యాలను నెరవేర్చువాడని అర్థం. దేవుని ద్వారా చేయబడేవన్నీ ఆశ్చర్యమే. ఆయన కలుగచేసిన సృష్టి ఆశ్చర్యము. పరిశీలించి చూస్తే దేవుని మహత్తయిన సృష్టి, దాని నిర్వహణ మనుషులకు నేటికీ అంతబట్టని రహస్యమే. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ ఇలా అంటాడు. ‘ఇన్ని విస్తృత పరిశోధనల తరువాత మనిషి విశ్వం గురించి తెలుసుకొన్నది ఒక్క శాతం మాత్రమే’. మానవ జన్మ ఆశ్చర్యకరమైనది. ‘నేను పుట్టిన విధమును చూస్తే నాకు భయమును, ఆశ్చర్యమును కలుగుచున్నవ’ని దావీదు తన కీర్తనలో మానవ జన్మ విశిష్ఠతను వివరించాడు.

నీటిని ద్రాక్షారసంగా మార్చిన మహిమ
యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన కాలంలో అనేక ప్రాంతాలు సంచరిస్తూ ప్రజలకు అనిర్వచనీయమైన మేలు చేశారు. అనేకుల ఎదుట ఆశ్చర్యకార్యాలు జరిపించి ఆశ్చర్యకరుడు అని రుజువు చేయబడ్డారు. క్రీస్తు పరిచర్య ప్రారంభంలో గలిలయలోని కానా అనే ప్రాంతంలో జరుగుచున్న వివాహానికి యేసు ప్రభువు, ఆయన శిష్యులు, తల్లియైన మరియ ఆహ్వానించబడ్డారు. ఆ సమయంలో వివాహానికి వచ్చినవారందరికీ గౌరవప్రదముగాను, మర్యాదపూర్వకముగాను ద్రాక్షారసం ఇవ్వడం యూదుల ఆచారం. కొంతసేపటికి వారు సిద్ధపరచుకున్న ద్రాక్షారసం అడుగంటిపోయింది.

వివాహం జరుగుతున్న ఇంటివారి పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వారు ఎదుర్కొంటున్న కలవరం, ఆందోళన, అవమానం తాండవమాడుతున్న వేళ ఆశ్చర్యకరుడైన యేసు అద్భుతాన్ని జరిపించారు. అక్కడున్న పరిచారకులను పిలిచి ఆరుబానలను నీటితో అంచుటమట్టుకు నింపమని చెప్పారు. వారు ఆ విధంగా చేయగానే ఆ సాధారణ నీరు మధురమైన ద్రాక్షారసంగా మారిపోయింది. గలిలయలోని కానాలో యేసు ఈ సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి అని యోహాను తన సువార్తలో తెలియచేశాడు.

ఆ కానా విందులో యేసుప్రభువు చూపిన మహిమను ఆ యింటి వారి జీవితంలో ఎన్నడు మరచిపోలేరు. ఆరోజు ఆ యింటి వారి మీదకు వచ్చే అవమానం ఆయన వలన తొలగిపోయింది. ఆయన ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టే ఆ యింటివారు ధైర్యంగా ఉండగలిగారు. దేవున్ని మన జీవితంలోనికి ఆహ్వానిస్తే అవమానం తొలగిపోతుంది. ఊహించలేని గొప్ప ధైర్యం కలుగుతుంది. యేసుప్రభువు సాధారణమైన నీటిని విలువైన ద్రాక్షారసంగా మార్చాడు. విలువలేని వాటికి విలువనిచ్చేవాడు ప్రేమమయుడైన దేవుడు. మనుషులు లోకరీత్యా విలువైన వాటిని మాత్రమే పట్టించుకుంటారు. అటువంటి వారితో మాత్రమే స్నేహం చేస్తారు. యేసుప్రభువు దీనులను లక్ష్యపెడతాడు. ఆయన ఎదుట దీనులుగా సాగిలపడితే వారిని ఉన్నతమైన స్థానములో నిలవబెడతాడు. రుచి లేని నీటికి రుచిని కలుగజేశాడు. మధురమైన అనుభవాన్ని అందించాడు.

హృదయాలను వెలిగించే దైవం
చాలా సంవత్సరాల క్రితం ఒక పార్కులో ఒక అక్క తమ్ముడు కూర్చుని పరిశుద్ధగ్రంథాన్ని చదువుకుంటున్నారు. అటుగా పోతున్న ఒక నాస్తికుడు వారిని చూచి దగ్గరగా వచ్చి వారిని  ‘మీరెందుకు బైబిల్‌ చదువుతున్నారో నాకు అర్థం కావట్లేదు. బైబిల్‌ దైవగ్రంథం కాదు. అసలు దేవుడనే వాడే లేడు. ఈ సృష్టంతా దానికదే వచ్చింది. దేవున్ని మానవుడే తనకున్న భయాలలో సృష్టించుకున్నాడు. ఈ చెడ్డ పుస్తకం మీకు ఎన్నడు ప్రయోజనాన్ని చేకూర్చదు’ అని వ్యంగ్యంగా అన్నాడు. అతని మాటలు విన్న తర్వాత అక్క లేచి ఇలా అంది. ‘ఒకప్పుడు నా తమ్ముడు తాగుబోతుగా, తిరుగుబోతుగా జీవించేవాడు. జూదశాలలో తన సమయమంతా గడిపేవాడు. తల్లితండ్రులను లెక్కచేసేవాడు కాదు. ప్రేమ ఆప్యాయతలకు అతని జీవితంలో చోటు లేదు. క్రూరంగా ప్రవర్తించేవాడు. అలాంటి వ్యక్తిలో మార్పు వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఒకరోజు బైబిల్‌ చదవడం ద్వారా దేవుని గురించిన సత్యాన్ని అంగీకరించి యేసుక్రీస్తును తన హృదయంలోనికి ఆహ్వానించాడు.

వెలుగైన దేవుడు తన హృదయంలోనికి ఆహ్వానించినందు వలన చీకటంతా తొలగిపోయింది. జీవితం పావనమయింది. వినూత్నమైన మార్పులను అతని జీవితంలో మేం గమనించగలిగాము. ఒకప్పుడు ఎందుకూ పనికిరాకుండా తిరిగిన వ్యక్తి ఇప్పుడు కష్టించి పనిచేసి తన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇంటికి తీసుకొస్తున్నాడు. తల్లితండ్రులను ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. శాంతి సమాధానాలతో బ్రతుకుతున్నాడు. ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసుకుంటున్నాడు. నీవనుకుంటున్నట్టు ఈ గ్రంథం చెడ్డదైతే, భయంకరంగా చెడిపోయిన వ్యక్తిలో ఇంత మంచి మార్పును ఎలా తీసుకురాగలదు?’ హృదయాంతరంగంలో నుండి వచ్చిన వాస్తవమైన జీవితానుభవాలకు నిశ్చేష్టుడై తల దించుకొని వెళ్ళిపోయాడు ఆ నాస్తికుడు. మనుషుల హృదయాల్లో దేవుడు కలిగించు మార్పు చాలా ఉన్నతమైనది. టి.యస్‌ ఇలియట్‌ అనే కవి ఇలా రాశారు.. ‘నిరాశాపూరితమైన, శూన్యమైన ఈ భూమిలో నీళ్లు లేవు కేవలం బండరాయి తప్ప. మన ఆత్మ బీడుభూములలో తిరుగుతుంటుంది. యేసు అనే జీవజలపు ఊట ఆ హృదయాన్ని తాకేదాకా!’

ఉన్నత శిఖరాలకు నడిపేది దేవుని ఆలోచనే
ఆలోచన కర్త: ప్రతిదేశానికీ ఆలోచనకర్తలు ఉంటారు. ప్రభుత్వాలు సరిగా ప్రజలకు మేలు చేసే పరిపాలన అందించాలంటే వారికి ఎలాంటి సహాయం చేయాలి, బాగా ఎలా పరిపాలించాలి, విపత్తులు కలిగినపుడు ప్రజలకు ఎలాంటి సహాయం అందించాలి లాంటి ఆలోచనలు చెప్పే వ్యక్తులు ప్రత్యేకంగా ఉంటారు. నిజజీవితంలో కూడా అలోచన చెప్పే వ్యక్తులుండడం చాలా అవసరం. కొంతమంది ఎవరి ఆలోచన వినకుండా అన్నీ తమకే తెలుసు అనుకుంటారు. అలాంటివారు మొదట కష్టాలలో పడిపోయి తీరని నష్టాన్ని పొందుతారు. మంచివారి అలోచనలు చాలా అవసరం. పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ పెట్టుకోవాలన్న సామెత మనకందరికీ విదితమే.

లోకంలో మనుషుల ఆలోచనలు కొంతమట్టుకు మేలు చేయవచ్చును. అయితే దేవుని ఆలోచన మరింత శ్రేష్ఠమైనది. క్షేమకరమైనది. దేవుని ఆలోచన ప్రకారం నడిస్తే ఎప్పుడు తొట్రిల్లరు, ఓడిపోరు. ‘నీకు ఆలోచన చెప్పెదను నీవు నడువవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను’ అని ప్రభువు మాట్లాడుతున్నారు. పవిత్రమైన ఆలోచన పవిత్రకార్యాలు చేయడానికి దోహదపడుతుంది. కొంతమంది చెడిపోయిన వారి ఆలోచనలు విని వారి మాటల ప్రకారం నడిచి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. దేవుడు తన మాట ద్వారా నిత్యం మనలను నడిపించాలని కోరుతున్నాడు. ఆయన ఆలోచన ప్రకారం నడిస్తే మన జీవితాలు ధన్యకరమవుతాయి. 
జీవితంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసిన సమయంలో అనేకులు తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. సరియైన వ్యక్తుల నిర్ణయాలు కాకుండా పరిపక్వత లేనివారి నిర్ణయాలు తీసుకుంటారు. నీవు ఎటువెళ్ళాలో తెలియని సందిగ్ధంలో ఉన్నపుడు అందరి దగ్గరకు పరుగెడుతున్నావా? నీకు సరిగా ఆలోచన చెప్పి ఉన్నత స్థానమునకు ప్రభువు నడిపిస్తారు.

యేసు ప్రభువు జన్మించినపుడు జ్ఞానులు రాజైన హేరోదు దగ్గరకు వచ్చారు. ప్రవచనానుసారం యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగారు. హేరోదు రాజు శాస్త్రులను పిలిపించి క్రీస్తు పుట్టే స్థలాన్ని గురించి అడిగాడు. బేత్లెహేములో పుడతాడన్న కచ్చితమైన ప్రవచనాన్ని వారు చూపించారు. అప్పుడు హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి నక్షత్రం కనబడిన కాలాన్ని వారిచేత పరిష్కారంగా తెలిసికొని మీరు వెళ్ళి ఈ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానం తెమ్మని వారిని బేత్లెహేముకు పంపాడు.

ఇందులో హేరోదు దురుద్దేశాలు ఎన్నో కనబడుతున్నాయి. వాస్తవానికి హేరోదు భయంకరమైన క్రూరుడు. తన సింహాసనానికి అడ్డు వచ్చే ప్రతి ఒక్కరినీ హతమార్చాలనే దుర్బుద్ధి కలిగినవాడు. అలాంటి వాడు క్రీస్తును ఎందుకు ఆరాధిస్తాడు? ఆయన ఆధిపత్యానికి ఎందుకు ఒప్పుకుంటాడు? అయితే జ్ఞానులు రాజు మాటను బట్టి పోతుంటే, మళ్లీ దేవుని నక్షత్రం దారి చూపించింది. వారు క్రీస్తును కనుగొని ఆయన్ను ఆరాధించిన తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని దేవుని చేత బోధింపబడినవారై వారు మరొక మార్గంలో తమ దేశానికి తిరిగి వెళ్లారు. వారు హేరోదు మాట, ఆలోచన అనుసరించి నడిచినట్లయితే వారు చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేవారేమో! దేవుని ఆలోచన వారిని క్షేమంగా తమ దేశానికి నడిపించింది. దేవుని నడిపింపు ఎప్పుడూ జీవన రాగాన్ని శ్రుతి తప్పనీయదు. ఆత్మలోని పాటను ఆగిపోనియదు. భ్రాంతులెన్నో చెలరేగి దారికానక కప్పేసినప్పుడు దేవుని ఆలోచన కాంతిపుంజమై ఉన్నత శిఖారాలకు నడిపిస్తుంది.

బలహీనులను బలపరచే దేవుడు
బలవంతుడైన దేవుడు: సకలాశీర్వాదములకు కర్తయైన దేవుడు బలహీనులకు బలాన్నిచ్చువాడు. ఈ బలం శారీరక బలం కాదు. దేవుడు అనగా పాపాన్ని జయించటానికి, పాపంలో ఉన్నవారిని విడిపించి వారిని పరిశుద్ధులుగా చేయడానికి బలవంతుడై ఉండాలి. ఈనాడు అనేకమంది పైకి చూడడానికి బలవంతులుగా ఉన్నారు కాని, వారి మనసు ఎంతో బలహీనంగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం సింహబలునిగా పేరుగాంచిన మైక్‌ టైసన్‌ బాక్సింగ్‌ రంగంలో ఎంతోమందిని ఓడించాడు. ఆయనతో పోరాడాలంటే భయపడుతుండేవారు. అనేక సంవత్సరాల పాటు బాక్సింగ్‌ రంగంలో తిరుగులేని విజేతగా నిలిచాడు. ఇంత బలవంతుడైన మైక్‌ టైసన్‌ మానసికంగా ఎంతో బలహీనుడు. శరీరవాంఛలను జయించలేక అనేక నేరాలకు పాల్పడి శిక్షలకు గురై తాను సంపాదించుకున్న డబ్బును, పేరును కోల్పోయిన బలహీనుడు. ప్రతి ఒక్కరూ బలవంతులుగా ఉండాలనేది దేవుని కోరిక. బలవంతుడైన దేవుడు బలహీనులను బలపరుస్తాడు. బలహీనతలు మూడు రకాలు: ఒకటి శారీరక బలహీనత.

తమ దేహాలను పట్టిపీడిస్తున్న రోగాలు, వ్యాధులు, బలహీనతలు వారిలోని సంతోషాన్ని హరించేస్తున్నాయి. ఎన్నో మందులు వాడి, వైద్యుల చుట్టూ తిరిగి తమకున్నదంతా ఖర్చు పెడుతున్నారు. బైబిలు గ్రంథంలో ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతుంది. ఆమె యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు, బాగుపడతానని అనుకుని ఆయన వద్దకు వచ్చి ఆయనను ముట్టగానే ఆమె వ్యాధి నయం అయింది. అన్ని సంవత్సరాల నుండి ఉన్న రోగం బాగుచేయబడింది. ‘నీవు విశ్వాసంతో ప్రభువు దగ్గరకు వస్తే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు.’ రెండవది మానసిక బలహీనత. కొంతమంది శారీరకంగా బలంగా ఉన్నట్లు కనబడినా వారి మనసు మాత్రం చాలా బలహీనంగా ఉంటుంది.

వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న సమస్యకు కృంగిపోయి వారి జీవితంలో నలిగిపోతుంటారు. పైకి కనబడినంత బలంగా వారు మానసికంగా ఉండలేరు. మానసికంగా కృంగిపోయినవారు మాటిమాటికీ మరణాన్ని గురించి తలచుకుంటారు. బైబిలు గ్రంథంలో ఏలీయా అనే ప్రవక్తను భక్తిహీనురాలైన యెజెబెలు అను రాణి బెదిరించినపుడు బదరీ వృక్షం కిందకు వెళ్ళి కృంగుదలతో తన ప్రాణాన్ని తీసుకోమని దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన వినలేదు కానీ ఏలీయాను బలపరచి మరింత దూరం ప్రయాణం చేసేందుకు శక్తిని అనుగ్రహించాడు. నీవు కూడా మానసికంగా బలహీనంగా ఉండి మరణాన్ని కోరుకుంటున్నావా? ‘దేవుని శక్తిని కోరుకో. దేవుడు మిమ్ములను బలపరచి మరింత ముందుకు నడిపిస్తాడు.’

మూడవది ఆత్మీయ బలహీనత. ఆత్మలో బలహీనత కలిగినవారు తరచుగా పాపంలో పడిపోతుంటారు. ఏదైతే చేయకూడదని అనుకుంటారో, నిర్ణయించుకుంటారో అదే పాపం మరలా మరలా చేస్తూ అపరాధభావంతో నింపబడుతుంటారు. పాపం మనిషికి ఎన్నడూ మనశ్శాంతినివ్వదు. పాపం ఎప్పుడూ ఆకర్షణీయంగాను, పాపం చేస్తున్నప్పుడు ఆనందంగాను, పాపం చేశాక అవేదనగాను ఉంటుంది. నీవు ఆత్మలో దేవుని శక్తిని కలిగియండకపోతే నీవు తీసుకునే నిర్ణయమును నీవే కొనసాగించలేవు. దయామయుడైన దేవుని వద్దకు వచ్చి ఎటువంటి బలహీనత నుండి విడుదల పొందాలనుకుంటున్నామో తెలియచేస్తే దేవుడు కచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. ఆపత్కాలంలో దేవుడే సహాయకుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. సర్వశక్తిమంతుడైన దేవుడు బలపరిస్తే ఎటువంటి బలహీనత అయినా దూరమవుతుంది. ‘ఆయన కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుకుంటారు. నిన్ను నీవు చూసుకున్నంత కాలము నీలోని బలహీనతలు మరింతగా నిన్ను బలహీనులుగా మారుస్తాయి. బలవంతుడైన దేవుని కొరకు, ఆయన కృప కొరకు నీవు సాగిలపడితే నీవు దేవునిలో బలవంతునిగా ఉంటావు.’ 

రక్షకుడైన దేవుడు నిత్యుడగు తండ్రి
సృష్టికర్తయైన దేవున్ని తండ్రి అని పిలవచ్చా? అనే సందేహం చాలామందిలో ఉంది. అలా పిలవడానికి మనం అర్హులమేనా? క్రీస్తు మార్గంలో దేవున్ని తండ్రి అని పిలిచేందుకు అర్హత ఇవ్వబడింది. ఆయన సర్వసృష్టిని కలుగజేసిన ఆదిసంభూతుడయిన తనయందు విశ్వాసముంచుట వలన ఉచితంగా దేవుని పిల్లలమయ్యే అధికారం ఇవ్వబడింది. ప్రార్థన నేర్పిస్తూ ‘పరలోకమందున్న మా తండ్రి’ అని సంబోధించమని క్రీస్తు తన శిష్యులకు తెలియచేశారు.

రక్షకుడైన దేవుడు నిత్యుడగు తండ్రి. ఆయన ఎన్నడూ నిన్ను విడువడు. ఎడబాయడు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా దేవుని కృప మనలను విడిచిపోదు. కొంతమంది ఈ లోకములో శారీరక తండ్రిని కోల్పోయి నిరాశలో జీవిస్తుంటారు. లోక తండ్రులు మనలను పట్టించుకోకపోయినా పరలోకపు తండ్రి నిత్యం మనలను పట్టించుకుంటాడు. ఆయన నిత్యం మనతో నిలిచియుండు దేవుడు. ఎవరైనా పిల్లలు తమ తండ్రిని ఏదైనా అడిగితే కచ్చితంగా ఇస్తారు. వారి స్థోమతకు, సామర్థ్యానికి మించి పిల్లలకు ఇవ్వాలని చాలా ప్రయాసపడుతుంటారు. పరలోకపు తండ్రికి తన పిల్లలంటే ఎంతో ప్రేమ కదా. అడిగిన వాటికంటే, ఊహించుకునే వాటికంటే అత్యధికంగా అనుగ్రహిస్తాడు. క్రైస్తవ మార్గంలో దేవుడు ప్రజలతో కేవలం భక్తునితో ఉండే సంబంధం కాదు కానీ ఆయన తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నాడు.

తండ్రి కౌగిలిలో ఒదిగిపోయి దివ్యానుభవాలను మూటకట్టుకున్న ఓ వ్యక్తి ఇలా అంటాడు. ‘తుఫాను మబ్బులు చూట్టురా కమ్మితే గంభీర స్వరం మూగబోతే నమ్మండాయన్ని. ఆయన మీ తండ్రి గనుక మీ ప్రార్థనలన్నీ వింటున్నాడు. దు:ఖం శ్రమలు బాధ దగ్గరైనా అతి చేరువైన ఆత్మీయులు దూరమైనా స్తుతించండి ఆయనున్నాడు మనకి. దారి కష్టమైన బ్రతుకు నిష్ఠూరమైనా భయంతో మన కళ్లకి మసకలు కమ్మినా మన తండ్రి మన చెంతనున్నాడు గనుక చేతిలో చెయ్యి వెయ్యండి. దారులన్నీ మూసుకుపోయినా అందమంతా అణగారినా మనతో ఉంటాడు నమ్మి విశ్రమించండాయనలో.’

బైబిలు గ్రంథ చరిత్రలో సమాజంలో వెలివేయబడినవారు, అంటరానివారుగా పరిగణించబడినవారు ప్రభువు దగ్గరకు వచ్చి ఆదరణ పొందారు. కొందరైతే సమాజంలో సరైన గుర్తింపు లేక, కనీసం మనుషులుగా కూడా గుర్తించేవారు లేకుండా జీవిస్తుండేవారు. అలాంటి వారు క్రీస్తు వద్ద తండ్రి ప్రేమను, ఆప్యాయతను అనుభవించారు. కృంగుదలతో ప్రభువు దగ్గరకు వచ్చినపుడు వారిని ఎంతో కనికరంతో చూసి, వారి మీద జాలి పడి, వారిని ‘కుమారుడా, కుమారి’ అని పిలిచాడు క్రీస్తు. ఆయన ఎవరినీ తక్కువగా చూసేవాడు కాదు. భేదాలు మనుషులు కల్పిస్తారు  కానీ దేవునిలో ఏ భేదం లేదు. ఆయన వద్దకు విశ్వాసంతో వచ్చేవారందరినీ తన బిడ్డలుగా చేసుకుని, వారిని ఆదరించి తండ్రి వలె వారి యెడల బాధ్యతాయుతంగా ఉంటాడు. నేటి సమాజంలో అంటరానితనం, కుల వివక్ష, మత వివక్ష, జాతి వివక్షలు కనబడుతూనే ఉన్నాయి. పరువు హత్యలు కలతపెడుతూనే ఉన్నాయి. సమసమాజ నిర్మాణం జరగాలంటే మనుషులంతా దేవుని సృష్టే అని గమనించాలి. ‘నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుము’ అను దైవ వాక్కును మనుషులంతా గుండెలకు హత్తుకోవాలి.

మదర్‌ థెరిస్సా కలకత్తాలో ఆశ్రమాన్ని స్థాపించినప్పుడు అభాగ్యుల పట్ల, అణగారిన ప్రజానీకం పట్ల దేవుని ప్రేమను చూపించింది. దుర్భర స్థితిగతుల్లో, దయనీయమైన పరిస్థితుల్లో బతుకునీడుస్తున్న వారికి తల్లిగా ప్రేమను పంచింది. తన ప్రశ్నలతో మదర్‌ థెరిస్సాను ఉక్కిరిబిక్కిరి చేద్దామనుకున్న విలేఖరి కిటికీలో నుండి లోపల ఏం జరుగుతుందోనని తొంగి చూశాడు. లోపల జరుగుతున్న పరిస్థితిని చూసిన వెంటనే అతని కళ్లు చెమర్చాయి. ఒళ్లంతా కురుపులతో నిండిపోయి దుర్వాసన కొడుతున్న ఒక కుష్ఠురోగి చేసుకుంటున్న వాంతిని పాత్రలో పడుతోంది. అలాంటి వ్యక్తిని చేరదీయడం ఎవరివల్లా కాదని గుర్తించిన ఆ వ్యక్తి మదర్‌ను అడుగుతాడు.. ‘అలాంటి పనులు నీవెలా చేయగల్గుతున్నావు? నీకెప్పుడూ వారిమీద అసహ్యం వెయ్యదా?’ అని. చేతులు తుడుచుకుంటూ మదర్‌ థెరిస్సా ‘అభాగ్యులలో నేను నా దేవుని చూస్తాను. వారికి సేవ చేయడం నా దేవునికి సేవ చేయడంగానే భావిస్తా. నేను చేసేదల్లా దేవుని ప్రేమను ఆచరణలో చూపించగలగడమే’ అని సమాధానమిస్తుంది.

‘తండ్రి కుమారుల యెడల జాలిపడునట్లు ప్రభువు తన బిడ్డల యెడల జాలిపడతాడు’ అని కీర్తనకారుడు తన కీర్తనలో వ్రాశాడు. ఎవరి ప్రేమనూ నోచుకోక, జీవితంలో అయినవారందరినీ కోల్పోయి, ఒంటరిగా ఉన్నాను నన్నెవరు ఆదుకుంటారు, నా గురించి ఎవరూ పట్టించుకుంటారు అని అనుకుంటున్నవారిని ఆదరించి తండ్రి ప్రేమను చూపడానికి నిత్యుడగు తండ్రియైన దేవుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన నీ గురించి విచారించేవాడు. నీ గురించి నీవు కలిగియున్న ఆలోచనల కంటే మరింత శ్రేష్ఠమైన ఆలోచనలు ప్రభువుకున్నాయి. నిన్ను నిన్నుగా అంగీకరించి నీ స్థితిగతులను మార్చి తన నిత్య ప్రేమతో నిన్ను నడిపిస్తాడు.

అడవి ప్రాంతంలో నివసిస్తున్న ఓ తండ్రి కొడుకుల కథ అనేకులను కంటతడి పెట్టిస్తుంది. జీలుగకల్లుకు అలవాటు పడిన కొడుకు అన్ని విధాలుగా దారి తప్పిపోతాడు. అనేకసార్లు తండ్రి మందలించినా కొడుకులో ఇసుమంతైనా మార్పు రాలేదు. రానురాను జీవితం మరింత దారుణంగా మారిపోయింది. కల్లు తాగి మత్తులో ఆనందించాలనుకున్న కొడుకు చెట్టుమీద నుండి పడిపోతాడు. బలమైన గాయాల పాలై ఒంటరిగా అడవిలో విలవిల్లాడుతూన్న ఆ కొడుకును వెదుక్కుంటూ వెళ్తాడు అతని వృద్ధ తండ్రి . తీవ్ర గాయాలతో పడి ఉన్న కుమారుడిని అతి కష్టంమీద ఓ చిన్న హాస్పటల్‌కు తీసుకెళ్తాడు. ఉన్నపాటున రక్తం ఎక్కించకపోతే ప్రాణాలు దక్కకపోవచ్చు అని డాక్టర్‌ చెప్పిన మాటను తన పెద్ద కుమారునికి చెప్తాడు. నాకు భార్యా పిల్లల బాధ్యతలు చాలా ఉన్నాయి. రక్తం ఇవ్వడం నా వల్లకాదని ముఖం చాటేస్తాడు అన్న.  కొడుకు ప్రాణాలు నిలబెట్టడం కోసం తండ్రి తన రక్తాన్నే ఇచ్చి తన ప్రేమను, కొడుకు పట్ల తనకున్న బాధ్యతను నెరవేర్చుతాడు. నీరసించిపోయిన తండ్రి కొద్దిరోజుల తర్వాత  ప్రాణాలు కోల్పోతాడు.

క్రీస్తు సమాధానకర్త
అతడు బతికున్న రోజుల్లో అతన్ని మించిన ధనికుడు మరొకడు లేడు. ఎన్నో కంపెనీలు, చేతినిండా డబ్బు, పేరు ప్రఖ్యాతులు, పనివాళ్లు ఎందరో అతని చుట్టూ ఉన్నారు. న్యూయార్క్‌ నగరంలో అతని పేరు మీద ఒక వీధి ఉంది. సుప్రసిద్ధుడైన ఆ కుబేరుడు ఒకరోజు ఇలా అన్నాడు.. ‘నేను విపరీతంగా ధనాన్ని ఆర్జించాను. అవి నాకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు’ అని.  ఆ వ్యక్తి పేరు రాక్‌ఫెల్లర్‌. జీవితం మీద ఎన్నో విశిçష్ఠ పుస్తకాలు రచించిన ఎర్నెస్ట్‌ హెమింగ్‌వే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. కారణం జీవితంలో శాంతి సమాధానాలు లేక. ఈనాడు అనేకులు ధనం,  పలుకుబడి, హోదా, ఖ్యాతిని సంపాదిస్తున్నారు.

సమాజంలో వారికంటూ గుర్తింపు పొందుతున్నారు. వారికేంటి.. అదీ జీవితమంటే... అలా బ్రతకాలి... అని అనిపించుకున్నవారే నేడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేసుకుని తిరిగిరాని లోకాలకు వెళిపోతున్నారు. వారు ఆ విధంగా చనిపోవడానికి కారణం వారి హృదయంలో శాంతి సమాధానం లేకపోవడమే. లోకంలో మానవునికి ఎన్ని ఉన్నా హృదయం భారంతో ఉంటే ఏదో తెలియని వెలితి జీవితాన్ని వేధిస్తుంది. కుటుంబంలో, భార్యాభర్తలకు సమాధానం లేక అనేక కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి.

ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనుకొని నెత్తుటి ఏరులు పారించిన హిట్లర్‌ చివర్లో ఎలా మరణించాడో అందరికీ విదితమే. లోకంలో చాలమంది రాజులు, చక్రవర్తులు వచ్చారు. యుద్ధాలు చేసి, రక్తపుటేరులు పారించి, రాజ్యాలను కొల్లగొట్టి తమ స్థానాలను సుస్థిరం చేసుకోవాలనుకున్నారు. శత్రువును హతమార్చడమే ఈ లోక రాజుల ప్రథమ ఉద్దేశంగా ఉండేది. ప్రభువైన యేసు మాత్రం ఈ లోకానికి యుద్ధాలు చేయడానికి లేదా రక్తపుటేరులు పారించి తన రాజ్యాన్ని ఈ భూమి మీద నెలకొల్పడానికి రాలేదు. వాస్తవాన్ని పరిశీలిస్తే మనుషుల హృదయాలలో శాంతి, సమాధానమును ఇవ్వడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చారు.

‘నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి’ అని క్రీస్తు ప్రభువు సెలవిచ్చారు (యోహాను 14:27). సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద చితుక తొక్కించును అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ప్రభువు కలువరి సిలువలో చనిపోయి తిరిగిలేవడం ద్వారా అపవాదిని ఓడించాడు. సాతాను తలను ఆయన చితుక తొక్కినందున దేవుని ప్రజలకు క్రీస్తు ద్వారా విజయం లభిస్తుంది. ఐగుప్తు రాజులు తమకు శత్రువులుగా ఉన్నవారందరి చిత్రాలను పాదపీఠాల మీద చెక్కించుకుని వారి మంచాల కింద ఉంచేవారు. వారు నిద్రలేవగానే ఆ పాదపీఠం మీద ఉన్న తమ శత్రువుల రూపాలను కాళ్ళతో తొక్కుతూ విజయానందం పొందేవారు. 

అయితే సమాధానకర్తయగు దేవుడు కూడా మన శత్రువులను మన కాళ్ళ కింద చితక తొక్కిస్తాడు. శత్రువు అంటే మనకు నచ్చనివారు, పక్కింటివారు కాదు. నీవెదుర్కొంటున్న సంఘర్షణలు, ఆందోళనలు, దైవ విరుద్ధ ప్రేరేపణలు మొదలగు వాటిపై నీవు విజయం సాధించాలన్నది దేవుని ఉద్దేశం. ‘కడపట నశింపచేయు శత్రువు మరణం’ అని బైబిల్‌ సెలవిస్తుంది. మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం వలన మరణం మానవునికి సంప్రాప్తించింది. పాపం మానవుడిని దేవునికి దూరం చేస్తుంది. దేవుని మహిమను పొందలేనంత దూరస్థులుగా చేసింది. దేవునికి అసహ్యమైనది పాపం. అటువంటి పాపం మానవునిలో ప్రవేశించినపుడే మరణం మానవునికి శత్రువుగా మారింది. ఈ మరణాన్ని జయించి మన కాళ్ల కింద చితక తొక్కించుటకు ఆయన సిలువపై మరణించి తిరిగి లేచి మరణపు కోరలను విరిచివేశాడు. మరణమా! నీ ముల్లెక్కడ? మరణమా! నీ విజయమెక్కడా? అని విజయఢంకా మోగించాడు. ఎవరైతే యేసునందు విశ్వాసముంచుతారో వారు పాపం వలన వచ్చే మరణాన్ని దాటుకుని దేవుని సమాధానాన్ని పొంది దేవుని రాజ్యనివాసులుగా చేయబడుతున్నారు. విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా చేయబడుతున్నారు.  

దేని కొరకు చింతించక అన్నింటి కొరకు ప్రార్థించినపుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం హృదయానికి కావలి ఉంటుంది. హృదయాంతరంగం నుండి నీవు చేసే ప్రార్థన ఆయన విని నీకు తగిన సమయంలో సమాధానం అనుగ్రహిస్తారు. భర్త మరణశయ్యమీద ఉన్నప్పుడు అందరూ దూరమై పరిస్థితులు దుర్భరమైనప్పుడు క్రీస్తు సమాధానాన్ని గుండెల నిండా అనుభవించిన చార్లెస్‌ కౌమన్‌ కలం నుండి జాలువారిన మధురాక్షరాలు..

‘నా ప్రియుడు శ్వేత సింహాసనంపై కాంతిపుంజమై మహిమ మస్తక విలసన్నవ తేజుడై ఆశీనుడై విరాజిల్లే నిత్య పరలోకం, అక్కడే నా వైభవం అక్కడే నా జీవం... లౌకిక జీవనాన్ని మధురం చేస్తూ జీవిస్తే మేలు మరణిస్తే లాభమనిపిస్తూ క్షమా రక్షణలకు ఆయత్తమవుతూ తన రాచఠీవితో స్వర్గాన్ని సౌందర్యపరచి శక్తి శౌర్యాల వాత్సల్యమూర్తి సమాధానకర్తయైన నా దేవునికే చేరాలి నా వింత విన్నపాలు... అక్కడే నా మనస్సు... అక్కడే నా సిరిసంపదలు.’ కారుణ్యాది సకలసమన్వితుడైన దేవుడు మీకందరికీ శాంతి సంతోషాలు, ఆరోగ్యాయుష్షులు, సకల సంపదలు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాక్షి పాఠకులందరికీ క్రిస్మస్‌/నూతన సంవత్సర శుభాకాంక్షలు.


-డా. జాన్‌ వెస్లీ
ఆధ్యాత్మిక రచయిత, వక్త
క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్, రాజమండ్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement