మానవుడై అవతరించిన రోజు | Christmas 2020 Special Story Of Jesus Christ By Doctor John Wesley | Sakshi
Sakshi News home page

మానవుడై అవతరించిన రోజు

Published Sun, Dec 20 2020 10:42 AM | Last Updated on Sun, Dec 20 2020 11:03 AM

Christmas 2020 Special Story Of Jesus Christ By Doctor John Wesley - Sakshi

అత్యంత భక్తిశ్రద్ధలతో పారవశ్యంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్‌. ప్రపంచంలోని క్రైస్తవులంతా మనస్ఫూర్తిగా సంతోషంతో జరుపుకునే సంబరం. వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి పుడమిని పులకింపచేసిన సమయం. కరోనా విలయతాండవం సృష్టించిన ఈ సంవత్సరంలో జరుపుకుంటున్న క్రిస్మస్‌ మరింత ధైర్యాన్ని, ఉత్సాహాన్ని అనుగ్రహిస్తుంది.

క్రిస్మస్‌ మనకేం తెచ్చింది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నం కావచ్చు. యేసు జననం జగతికి ఏమిచ్చింది అని ఒకసారి పరిశీలిస్తే నిస్సందేహంగా మనకు అపురూపమైన కానుకలను అందించింది. కానుకలు అందరూ నగదు రూపంలోనో, వస్తు రూపంలోనో ఇచ్చి పుచ్చుకుంటుంటారు. కానీ దేవాధిదేవుడు జగతిని, జనులను రక్షించుటకై పాపమెరుగని పరమపావన మూర్తియైన తానే బహుమతిగా ఈ లోకానికి వచ్చాడు. 

ఆదియందు వాక్యముండెను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనేది క్రీస్తును గూర్చిన నిర్వచనం. వాక్కు అంటే పలుకు. వాక్కు అనేది శక్తిగల మాటల సముదాయం. పెల్లుబికే ఆ మాటల సముదాయం భావాన్ని మోసుకొస్తుంది. వాక్కు శాశ్వతం, అనంతం, జీవదాయకం, సృష్టి కారకం. వాక్కులో అపారమైన జ్ఞానముంది. అదే వెలుగు, అదే వికాసం, విజ్ఞానం మరియు సమస్తం. బ్రహ్మాండమైన ఆ వాక్కే శరీరంతో లోకానికి వచ్చాడు. ఆయనే లోకరక్షకుడు క్రీస్తు. ఒక దైవజనుడు ఇలా అంటాడు. ఓ మనిషీ! ఏమి భాగ్యం నీది? ఉన్నతుడైన దేవుడు నీ ఎముకలో ఎముకగా, మాంసంలో మాంసంగా, మానవుడుగా, నీలా జన్మించాడు. యేసుక్రీస్తు అంటే ప్రేమ మరియు శాంతి.

ఆ ప్రేమే ప్రాణం పోసుకుని ఆ పరలోకం నుండి మన కోసం ఇలకు దిగివచ్చింది. మనిషిగా జన్మించి మానవతకు క్రొత్త మార్గాన్ని చూపింది. అవధులు లేని ప్రేమగా, అంతములేని కరుణగా, అపురూపమైన వాత్సల్యముగా రూపుదాల్చి మనకోసం మన విమోచన కోసం పాప బంధకములనుండి విడిపించుట కోసం శ్రమలననుభవించింది. అమ్మలాలనను, తండ్రి బాధ్యతను, స్నేహితుని తోడును మనకు అందించింది. నిజమైన నిస్వార్థమైన ప్రేమను మనకు రూచి చూపించింది. ఈ లోకంలోని అగమ్య గోచరమైన బ్రతుకులకు కాంతిని పంచే వెలుగే క్రిస్మస్‌. బాధలలో వేదనతో నలిగిపోయిన జీవితాలకు, కష్టాలతో కన్నీళ్ళతో కృంగిపోయిన హృదయాలకు ఓదార్పునిచ్చేదే క్రిస్మస్‌.

ఇబ్బందుల నుండి ఇరుకుల నుండి విడిపించి శాంతి నిచ్చేదే క్రిస్మస్‌. సమస్త మానవాళికీ శ్రావ్యమైన గళంతో శాంతి సందేశాన్నిచ్చేదే క్రిస్మస్‌. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి కంటికి వెలుగును, కాళ్ళకు మంచి మార్గాన్ని, నోటికి మంచి మాటను, హృదయానికి శాంతిని, మనిషికి మానవత్వాన్ని జగతికి రక్షణను తెచ్చింది క్రిస్మస్‌.

క్రిస్మస్‌ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. ఆ ఆరాధన హృదయాంతరంగాల నుండి పెల్లుబకాలి. జగతి పరమార్థాన్ని గ్రహించి బతకాలన్నా, నిజమైన ఆనందాన్ని మదిలోకి ఒంపుకోవాలన్నా ఘనుడైన క్రీస్తును ఆరాధించాలి. యోగ్యుడైన వానికి, అర్హత గలిగిన వ్యక్తికి ఆరాధనను అర్పించాలి. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, ఆదిసంభూతుడు, అత్యున్నతుడు, ఆరాధనకు యోగ్యుడూ మన క్రీస్తే. యేసు జన్మించినప్పుడు ఓ అద్భుత సంఘటన జరిగింది. తూర్పు దేశపు జ్ఞానులు సుదూర ప్రయాణం చేసుకొంటూ మొదట ఝెరూషలేముకు ఆ తదుపరి దానికి దగ్గరలోనే ఉన్న బేత్లేహేముకు వెళ్ళారు. వాళ్ళు నక్షత్ర పయనాన్ని అంచనా వేయగల సామర్థ్యం గలవారు. ఆధ్యాత్మిక చింతన పరిపుష్టిగా ఉంది.

ఎన్నో ఏండ్ల నుండి రక్షకుని ఆగమనం కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్న వారిలో వీరు కూడా ఉన్నారు. వారి ప్రాంతాలను, కుటుంబాలను, పనిపాటలకు కాసేపు ప్రక్కనపెట్టి దేవుణ్ణి చూడడానికి ప్రయాణం కట్టారు. అది అంత సులువైన ప్రయాణం కాకపోయినా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ప్రయాణం చేసి ఆఖరుకు చేరాల్సిన స్థానానికి చేరారు. మనసులు పులకించిపోయాయి. దైవదర్శనాన్ని పొందిన ఆ నేత్రాలు పావనమయ్యాయి. ధారలుగా కారుతున్న ఆనందబాష్పాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. పాలబుగ్గల పసివాడు తల్లిఒడిలో పరవశించినట్టు ఆ జ్ఞానులు పరవశించిపోయారు. పసిబాలుడైన క్రీస్తును తదేకంగా చూస్తూ ఆయన పాదాలమీద పడి మనస్ఫూర్తిగా ఆరాధించారు. మనిషికి అంతకన్నా ఇంకేం కావాలి. విశాల విశ్వంలో అంతకన్నా మధురానుభూతి ఇంకేముంటుంది. 

రక్షకునికివ్వాలనుకున్న బహుమానాలను వారి పెట్టెలు తెరిచి ఆయన ముందు పరిచారు. ఒకాయన శుద్ధ సువర్ణాన్ని ఇచ్చాడు. మరొకడు అద్భుత సువాసన వెదజల్లే సాంబ్రాణిని, మరొక జ్ఞాని బోళమును ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయారు. క్రీస్తు పాదాల దగ్గర పెట్టబడిన ఆ కానుకలు క్రీస్తులోని మూడు ప్రాముఖ్య లక్షణాలను తెలుపుతున్నాయి. బంగారం పరిశుద్ధతకు, సాంబ్రాణి ఆరాధనకు, బోళము స్వస్థపరిచే గుణానికి సాదృశ్యం. మనిషి దేవుని ఆరాధించుటకు ప్రధాన కారణం ఆయనలో ఉన్న పరిశుద్ధతే. సమస్తమును నిర్వహించే దేవుడే అపవిత్రుడైతే పరిశుద్ధంగా బ్రతకడానికి మనిషికి ఆధారం ఎక్కడుంటుంది? మనిషి పూజలందుకొనే దేవుడు కచ్చితంగా పవిత్రుడే. నాలో పాపమున్నదని మీలో ఎవ్వరైనా స్ధాపించగలరా అని క్రీస్తు ప్రశ్నించాడు. జ్ఞానులు తెచ్చిన రెండవ కానుక సాంబ్రాణి. సువాసనను వెదజల్లుతూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సువాసనభరితం చేయగల సాంబ్రాణి క్రీస్తు ఆరాధనీయుడని తెలుపుతుంది. బోళములో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. క్రీస్తు మనలను స్వస్థపరచువాడు అనే సందేశాన్ని మూడవ కానుక తెలుపుతుంది. 

ప్రతియేటా క్రిస్మస్‌ను క్రైస్తవులంతా ఒకరోజు ప్రపంచవ్యాప్తంగా పండుగగా జరుపుకొంటునప్పటికీ క్రీస్తు ప్రేమతత్త్వంలో తేలియాడే నిజక్రైస్తవునికి ప్రతిరోజూ పండుగే. ప్రతిరోజూ క్రిస్మస్సే. తేజస్సులో అమరుడైనప్పటికీ మనుజాళిని ప్రేమించి ప్రతి ఒక్కరికీ దగ్గరగా వచ్చిన క్రీస్తును ఆరాధించడానికి ఏ ఒక్కరోజు చాలదు. ఆదిమ«ధ్యాంత రహితుడైన ఆ దివ్యమూర్తిని ఆరాధించడానికి జీవితకాలం సరిపోదు.

దేవుడు చేసిన సృష్టి వైభవాన్ని తెలుసుకొనే ప్రక్రియలో ఎన్నో పరిశోధనలు కొన్ని శతాబ్దాల క్రిందటే ప్రారంభించబడ్డాయి. అయితే 1969లో ఓ అపూర్వ సంఘటన చోటుచేసుకుంది. ‘నాసా’కు చెందిన ముగ్గురు వ్యోమగాములు ఎంతో శ్రమించి ఎట్టకేలకు ‘అపోలో–11’ అనే రాకెట్‌ మీద ప్రయాణం చేసి చంద్రుని మీద కాలుమోపారు. మానవుడు సాధించిన ఓ గొప్ప కార్యంగా అది అభివర్ణించబడింది. అప్పటినుండి ఇప్పటి వరకు మరికొంతమంది చంద్రగ్రహంపై కాలుమోపి తమ పరిశోధనలను కొనసాగిస్తున్నారు. వారిలో జేమ్స్‌ ఇర్విన్‌ ఒకరు. చంద్రునిపై కాలు మోపిన తరువాత తనకు లభించిన విశిష్టమైన గౌరవాన్ని స్వీకరిస్తూ ప్రపంచం నివ్వెరపోయే విషయాన్ని ఇర్విన్‌ తెలియచేశాడు. ‘‘అశాశ్వతుడైన మానవుడు చంద్రుని మీద కాలుమోపడం కన్నా శాశ్వతుడైన దేవుడు మనిషిని ప్రేమించి ఈ భూమ్మీద కాలుమోపడం గొప్ప’’. అపుడు సృష్టికర్తయైన దేవుడు సృష్టిగా మారడం అన్ని అద్భుతాల కన్నా ఎంతో గొప్పది.  

పరమాత్ముడైన ప్రభువును ఆరాధించడానికి బలులు, అర్పణలు అవసరం లేదు. మంచి సమయాల కోసం వేచిచూడాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా మనస్సు తెరిచి ఆయన నామాన్ని స్మరించుకొంటూ భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే చాలు. జీవితం ధన్యమౌతుంది. ఒకసారి ఆధ్యాత్మిక చింతనతో నిండిన ఒక్క వ్యక్తి దేవుణ్ణి ‘నీవు ఎక్కడుంటావు’ అని అడిగాడట. దానికి దేవుడిచ్చిన జవాబు ‘నేను కట్టుకున్న ఆలయంలో ఉంటాను’. అదెక్కడుంది? ‘నీ హృదయమే నేను కట్టిన ఆలయం’. అపుడు దేవుడు మనిషి హృదయంలో నివసించాలనుకుంటున్నాడు. ఆయనకు హృదయంలో చోటివ్వడమే మానవ జీవిత పరమార్థం. నిండైన నీ హృదయంతో, మెండైన విశ్వాసంతో ఆయనను ఆరాధిస్తే చాలు.

క్రిస్మస్‌ పండుగ ప్రపంచవ్యాప్తంగా మనుష్యులకు గుండెలనిండా ధైర్యాన్నిచ్చింది. కరోనా రక్కసి సమయంలో ప్రతి ఒక్కరమూ వ్యాక్సిన్‌ గూర్చిన శుభవార్త కోసం ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నాం. ఒక ప్రమాదం నుండి బయటపడడం ఎలా అనే వార్త మనిషికి ధైర్యానిస్తుంది. భయపడకుడి ప్రజలందరికీ కలుగబోవు సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అని దూత భయంతో వణికిపోతున్న గొర్రెల కాపరులకు తెలిపింది. వారు కేవలం భౌతిక సంబంధమైన చీకటిలో మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగానూ, మానసికంగానూ చీకటిలో ఉన్నారు. వారికి శుభవార్త అందింది. దేవుడు ఎప్పుడూ మనిషికి మేలు చేయువాడు. ఆయన స్వాభావికంగా మంచివాడు. మనుషులు మంచివారుగా నటిస్తారు. దేవునికి ఆ అవసరం ఉండదు. ఆయన ప్రతి ఒక్కరికీ మంచి చెయ్యాలనే ఆశిస్తున్నాడు. క్రీస్తు అంటే ధైర్యం. ఆయన ఆపదలో అండగా నిలిచే కొండ. అన్ని వేళల్లో ఆదుకునే రక్షణ దుర్గం. చెక్కుచెదరని ధీరత్వం. క్రీస్తు నీతో వుంటే నిశ్చింత, క్రీస్తు నీతో వుంటే దిగ్విజయం. 

క్రిస్మస్‌ జగతిలో జనులకందరికీ ధైర్యాన్నిచ్చింది. ఏ ఆటంకాన్నైనా.. అడ్డంకులనైనా అధిగమించే శక్తి నిచ్చింది. అడ్డుగోడలను పగలగొట్టే గుండెబలాన్నిచ్చింది. ముఖ్యంగా ఈ లోకంలో శత్రువు పన్నే కుయుక్తులను, కుతంత్రాలను ఛేదించే దుర్భేద్యమైన కోట గోడలను మన చుట్టూ నిర్మించింది. ఏ దుష్టశక్తులూ మనలను చుట్టుముట్టి అధైర్యపెట్టకుండా రక్షణ వలయాన్ని కవచాన్ని మనకు ఏర్పరిచింది. బైబిల్‌లో ఒక వాగ్దానం ఉంది. నీ ఎడమపక్కన వేయిమంది పడినను నీ కుడిపక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అశేష ప్రజావాహినికి ఊతమందించే అద్భుత వాగ్దానమది. క్రీస్తు, క్రిస్మస్‌ గుండెకు కలిగించే ధైర్యం ఇంత గొప్పగానూ. శ్రేష్ఠముగానూ వుంటుంది అనేది నిర్వివాదంశము.

క్రీస్తును మనస్ఫూర్తిగా ఆరాధించగలిగితే ప్రతి ప్రతికూల పరిస్థితినీ జయించగలిగే శక్తిని, గుండెధైర్యాన్ని, బలాన్ని మనలో నింపుతాడు. నమ్ముట నీ వశమైతే సమస్తమునూ సాధ్యమే అని సెలవిచ్చిన ఆ దేవాధిదేవుడు స్వయంగా తానే గుండెచెదరిన వారిని బాగు చేయుటకు, దీనులను విడిపించుటకు, ఈ లోకానికి దిగివచ్చాడు, ధైర్యాన్ని మనకు ఇచ్చాడు. కొంతమంది జీవితాలను పరిశీలిస్తే వారు చేయగలిగినవాటిని సైతం చేయలేకపోవడానికున్న కారణాలలో భయం ఒకటి. స్వేఛ్చా స్వాతంత్యాల్రతో జీవించాల్సిన మానవుడు భయం గుప్పిట్లో బతుకుతున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత టీవీ వ్యాఖ్యాత ల్యారీ కింగ్‌ను ఒకామె ఇంటర్వ్యూ చేస్తుంది. అప్పటికే ఆయన అనేకమందిని తన వాగ్ధాటితో ఆకర్షించుకున్నాడు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వారిని ఇంటర్వ్యూ చేశాడు.

తాను అడగాలనుకున్న ఏ ప్రశ్ననైనా ధైర్యంతో అడిగేవాడు. సాహసోపేతమైన తన వృత్తిలో పాతిక సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక ప్రశ్న తన ముంగిట నిలువబడింది. ‘నీవు దేనికైనా భయపడతావా?’– ‘అవును. భయపడతాను!’– ‘దేనికి? మరణానికి!! నేను చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. ప్రతి రాత్రి ఇదే భయంతో గడుపుతాను’ అని అతడిచ్చిన జవాబుకు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయానికి భయపడుతూనే ఉంటారు. వెంటాడుతున్న గతానికి, ఎదుర్కొనబోయే భవిష్యత్తును గూర్చి, వర్తమానంలో జరుగుచున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, జీవితంలో చెలరేగే తుఫానులను బట్టి భయపడుచున్న మనిషికి చెక్కుచెదరని ధైర్యానివ్వడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ధైర్యంగా ఉంటే ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉండగలడనేది బైబిల్‌ సుబోధ. 

క్రిస్మస్‌ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. ఇది అక్షరాలా నిజం! జనులందరికీ అవగతమయిన సత్యం! క్రిస్మస్‌ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం. అనుభవించే కొలది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం. అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్‌ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకాని, ముగింపులేనిది. ఎన్నటికీ ముగియనిదీ, నిన్ను వీడనిది. ప్రస్తుతకాలంలో అశాశ్వతమైన ఆనందాలకోసం వెంపర్లాడుతూ, మనుషులు లోకంలోని బురదను, మురికిని అంటించుకొంటున్నారు దానిని వదిలించుకోలేక, విడిపించుకోలేక, కడుక్కోలేక సతమతమవుతున్నారు. రక్షించే నాథుడు ఎవరా? కాపాడే కరుణామయుడు ఉన్నారా? అని అలమటిస్తూ నిజమైన ఆనందం కోసం వెదకుచున్నారు. నేటి కాలంలో ప్రాముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు, వింతైన పోకడలకు బానిసలవుతున్నారు. వాటి వెనుకనున్న కారణాలు విశ్లేషిస్తే.. ‘ఒత్తిడి అధిగమించాలని కొందరు, కిక్‌ కోసం కొందరు, ఫ్రెండ్సు కోసం కొందరు, మానసిక ఉల్లాసం కోసం మరికొందరు చెడు అలవాట్లకు చేరువవుతున్నారు. ప్రభుత్వాలకు, పోలీసులకు పెనుసవాళ్ళను మిగుల్చుతున్న డ్రగ్స్‌ మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. ఏదో సొంతం చేసుకోవాలన్న తపనతో ఉన్నవి కూడా కోల్పోతూ ఆఖరకు తీవ్ర నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సెలబ్రెటీలు అని గుర్తింపు పొందినవారు కూడా ఈ విషయంలో అతీతులేమీకాదు. 

చాలా సంవత్సరాల క్రితం రస్సెల్‌ అనే ఒక సంగీత కళాకారుడు ఒక ప్రాంతంలో కచేరీ నిర్వహించాడు. వందల డాలర్లు వెచ్చించి అతడు వాయించే సంగీత సమ్మేళనాన్ని ఆస్వాదించడానికి సంగీత ప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ రాత్రి అతడు వాయించిన సంగీతం అనేకమందిని ఉర్రూతలూగించింది. ఆ సంగీత విభావరిలో అతడు ఒక పాటను ఆలపించాడు. ‘విచారం వలన ఒరిగేదేమిటి? దుఃఖం వలన వచ్చే ప్రయోజనమేమిటి? విచారాన్ని దుఃఖాన్ని సమాధి చేసి ఆనందంగా బతికేయి’ అనేది ఆ పాట సారాంశం. అర్ధరాత్రివరకూ కొనసాగిన ఆ సంగీత విభావరి ముగిశాక అందరూ తమ ఇళ్ళకు చేరుకున్నారు. మరుసటి ఉదయం వార్తాపత్రికలలో మొదటి పేజీలో ముద్రితమైన ఓ చేదువార్త అనేకులను ఆశ్చర్యపరిచింది. గతరాత్రంతా తన సంగీతంతో ప్రజలను ఉర్రూతలూగించిన రస్సెల్‌ ఆత్మహత్మ చేసుకున్నాడు. దుఃఖాన్ని సమాధి చేయండి అని పిలుపిచ్చిన వ్యక్తి తానెందుకు ఆ పని చేయలేకపోయాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలింది. 

నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు. కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ఆ జన్మ ధన్యం, ఆ పుట్టుక సఫలం. క్రిస్మస్‌ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. నిత్యనూతనమైన జీవాన్ని అందులో నింపింది. సర్వకాల సర్వావస్థలయందునూ తొణికిసలాడే సంతోషాన్ని నిండుగా నింపింది.

ఓ మంచి ఉద్యోగం, చుట్టూ ఇరవై మంది స్నేహితులు, రోజుకు రెండు సినిమాలు షికార్లతో బిజీబిజీగా ఉంటూ జీవితాన్నంతా ఆనందమయం చేసుకోవాలనుకున్న ఓ యువకుడు విజయవాడలో ఉండేవాడు. జీవితాన్నంతా పరిపూర్ణంగా ఆస్వాదించాలన్న లక్ష్యంతో ఏది చేయడానికైనా సిద్ధపడ్డాడు. ప్రతి రాత్రి రెండు దాటాకా ఇంటికి వెళ్ళడం, మానసిక ప్రశాంతత కోసం తనకు తోచినవన్నీ చేసేయడం. ఎందులో వెదకినా ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలన్న తపన, నేనేదో మిస్సవుతున్నానన్న భావన తనను కృంగదీయడం ప్రారంభించాయి. మానసిక ఉల్లాసం కోసం తప్పుడు మార్గాల్లో తిరిగి జీవితం మీద నిరాసక్తతను పెంచుకొని ఒకరోజు ప్రకాశం బ్యారేజ్‌ మీద నుండి నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ రోజుల్లో విజయవాడలో అక్కడే ఆత్మహత్యలు ఎక్కువగా జరిగేవి.

ఇదే చివరిరోజు అని నిర్ణయించుకొని ఒక సాయంకాలం చావును ఎదుర్కోవడానికి వడివడిగా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుకు సంబంధించిన శుభవార్త ఆయనకు అందింది. ‘ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా! నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాటను కలిగియున్న పత్రిక అందింది. ఆ ఒక్కమాట తన జీవితాన్ని మార్చింది. ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం, ఎక్కడా దొరకని సంతృప్తి దేవునిలో దొరికింది. అదే అఖరిరోజుగా చేసుకోవాలనుకున్న ఆయన గతించిన నాలుగు దశాబ్దాల నుండి దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆయనే మా తండ్రిగారైన విజయకుమార్‌గారు.

ప్రపంచ కుబేరుడైన రాక్‌ఫెల్లర్‌ ఒక సందర్భంలో ఇలా అంటాడు. ‘నేను కోట్లు కూడబెట్టాను. అవి నాకు సంతోషాన్ని ఇవ్వట్లేదు’. ప్రపంచ వ్యాపారవేత్తలో అగ్రగణ్యుడుగా, జీవితంలో ఇతనికంటూ లోటు ఏమీ లేదనిపించుకున్న ఓ కుబేరుడు ఇలాంటి వ్యాఖ్య చేయడం ఆశ్చర్యమైనప్పటికీ, అది వాస్తవం.  ‘నువ్వు వర్షంలో ఎందుకు ఏడుస్తున్నావు’ అని అడిగితే ‘ప్రపంచం నా నవ్వునే చూడాలి గాని నేను కూడా అందరి వలే ఏడుస్తున్నాని తెలియకూడదు’ అని జవాబిచ్చిన హాస్యనటుడు చార్లీ చాప్లిన్‌ గూర్చి తెలియనివారెవరు. ‘నా కళ్ళలోనుండి కారే కన్నీళ్ళు నేను చేసే కామెడీని నిర్వీర్యం చేస్తాయ’ని చెప్పి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. నిజమైన ఆనందం బయటనుండి రాదు. భౌతిక వనరులు ఆనందాన్ని మోసుకురాలేవు. అది స్వచ్ఛమైన హృదయంలో నుండే రావాలి. అటువంటి ఆనందం అందరికీ ప్రయోజనాన్ని చేకూర్చుతుంది. 

క్రిస్మస్‌ జీవితానికి పరమార్థాన్ని ఇచ్చింది. జీవితానికి అర్థాన్ని, పరమారాధనను అన్వేషించాల్సిన బాధ్యత మనకు వుంది. ఏదో పుట్టాము. కాలాన్ని ఇష్టం వచ్చినట్లు గడిపేసి చనిపోదాం అనుకోవడం కాదు, జీవితమంటే. జీవితానికి వున్న అర్థాన్ని మొదట మనం కనుగోనాలి. పరమార్థాన్ని గ్రహించాలి. జీవితం ఎంత విలువైనదో దాని ఆవశ్యకత ఎమిటో తెలుసుకొని మెలగాలి. నువ్వెందుకు బతుకుతున్నావు? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఉండాలి. ఒక తత్త్వవేత్త తనకు తెలిసిన వ్యక్తులందరికీ ఒక ప్రశ్నతో కూడిన ఉత్తరం వ్రాశాడు. తన స్నేహితులలో చాలామంది ఆస్తిపరులు, మరికొందరు విస్తారమైన జ్ఞానాన్ని ఆర్జించినవారు, మరికొందరు సమాజంలో అధికారాన్ని, పలుకుబడిని కలిగియున్నవారు.

ఉత్తరాలను అందుకొన్నవారు తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చారు. వారిలో ఎక్కువ శాతం మంది ‘మేం ఎందుకు ఈ భూమ్మీద బతుకుచున్నామో మాకు ఇంకా అర్థం కాలేదు’ అని, ‘దాని గురించిన ఆలోచన చేయాల్సిన తీరిక మాకు లేదు’ అని, ‘నీకు తెలిస్తే మాకు కూడా చెప్పొచ్చుగా’ అని రకరకాలుగా జవాబులు పంపించారు. విచారించాల్సిన విషయం ఏంటంటే  ఈ ప్రపంచంలో చాలామందికి తామెందుకు బతుకుతున్నాం అనే ప్రశ్నకు జవాబు తెలియకుండా బతికేస్తున్నారు. 

మనిషి ఎందుకు జీవిస్తున్నాడు? మానవ జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే మనిషిని కలుగచేసిన దేవుని దగ్గరకు రావాలి. ఒక వస్తువును తయారు చేసిన వ్యక్తి మాత్రమే దానిని తయారు చేయడంలో అతని ఉద్దేశాన్ని కచ్చితంగా చెప్పగలడు. ఈ విశ్వంలో మానవ జన్మ చాలా ప్రత్యేకమైనది. సృష్టికర్త మనలను సృజించినపుడు ఆయన స్వరూపములో మనలను సృజించాడు అని బైబిల్‌ తెలియచేస్తుంది. ఆయన రూపంలో ఉన్న మనం ఆయన లోకానికి వారధులం. దేవుని సంకల్పాలను నెరవేర్చుటకై నియమించబడిన దేవుని ప్రతినిధులం. యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకానికి ఏతెంచి ఓ అద్భుతమైన జీవితాన్ని జీవించి ప్రతి ఒక్కరికీ అన్ని విషయాలలో మాదిరి ఉంచారు. పశువులతొట్టెలో పవళించి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నానన్న సందేశాన్ని లోకానికి ఇచ్చారు. జగతిలో నిండివున్న అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చారు. దారీ తెన్నూ కనబడక దిశనిర్దేశం లేని జనులకు మార్గమయ్యారు.  ఆయనే మార్గముగా, సత్యముగా, జీవముగా జగతిలో అవతరించారు. అగమ్యగోచరమైన బతుకులలో నడి సంద్రాన చిక్కి అల్లాడుతున్న జీవితాలలో నావను నడిపే నావికుడిగా భువిలో జన్మించారు. మనందరి జీవితాలకు ఒక గొప్ప పరమార్థాన్ని కలిగించారు. ‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు’ అనే జీవన సత్యాన్ని కేవలం బోధించుట మాత్రమే కాకుండా, క్రియల్లో ఋజువుచేసి ప్రపంచాన్ని ప్రేమమయం చేశాడు యేసుక్రీస్తు. ఓ పరమార్థంతో బతికేవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఏ విషయంలోనూ నిరుత్సాహం చెందడు.

క్రిస్మస్‌ రక్షణ మార్గాన్ని ప్రబోధించింది. ఏ భేదమూ లేదు. అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించుచున్న మహిమను పొందలేకపోవుచున్నారని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ఒక నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఎలా రక్షణ కావాలో, కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ ఎంత అవసరమో, ఒక గనిలో చిక్కుకుపోయి మరణానికి చేరువవుతున్న వారికి రక్షణ ఎంత అవసరమో పాపంలో జీవిస్తూ శాశ్వత మరణానికి చేరువవుతున్న మనిషికి ఆత్మరక్షణ అంతకన్నా ఎక్కువ అవసరం. యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్ధం. ఆయన ప్రపంచాన్ని పాపము నుంచి విడిపించడానికి వచ్చి తన రక్తమును సిలువలో చిందించి విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహిస్తున్నారు. 

దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు (లూకా 2:11). మానవాళిని రక్షించి, తన దివ్యకాంతులతో ప్రతిఒక్కరినీ నింపి నిత్యజీవనానికి వారసులుగా చేయాలన్నదే దేవుని ఆకాంక్ష. రక్షకుని ఆగమనంతో ఎన్నో ఏళ్లుగా చూస్తున్న మానవుని ఎదురుచూపులు ఫలించాయి. ఒక పిల్లవాడు తండ్రి ఫోటో చూస్తూ, మనసు నిండా గొప్ప ఆశతో ‘మా నాన్న ఆ ఫోటోలోనుండి బయటకు వస్తే బాగుండును’ అని అనుకున్నాడు. సరిగ్గా ఇలాగే మానవులంతా ఆశించారు. ఆశిస్తున్నారు కూడా. కుల మత భాషా వర్గ విభేదాల్లేకుండా మనుష్యులంతా దేవుణ్ణి మరింత సన్నిహితం చేసుకోవాలని తపించారు. ఆయన ఎలా ఉంటాడో చూసి, ఆయనతో ముచ్చటించాలని ఆశపడ్డారు. సరిగ్గా రెండువేల సంవత్సరాల క్రితం దేవుడే మనిషిగా దిగివచ్చాడు. నింగి నేల ఏకమయ్యాయి. ఈ భూమికి నడిబొడ్డున ఉన్న బేత్లేహేము అనే కుగ్రామంలో రక్షకుడు వెలిశాడు. దేవుడు మానవ శరీరం ధరించుకొని వచ్చాడు. వాస్తవ రూపం దాల్చి మనిషికి గోచరుడయ్యాడు. ఎక్కడో రాజభవనంలో పుట్టియుంటే అందరికీ అందుబాటులో ఉండేవాడు కాడు గనుకనే పశువుల తొట్టెలో జన్మించాడు. అతి సామాన్యులైన గొర్రెల కాపరులు మొదట వెళ్ళి రక్షకుని చూశారు. భక్తి పారవశ్యంతో నింపబడి గుండెల నిండా నిరీక్షణతో ముందుకు సాగిపోయారు. 

క్రీస్తు్త ప్రబోధించిన రక్షణ మార్గం ఈ లోకానికీ ఆ పరలోకానికీ చెందినది. మనుష్యుల జీవిత స్వరూపాన్ని దేవుని మార్గంలోకి ఆ పరలోకానికీ చెందినది. మనుష్యుల జీవిత స్వరూపాన్ని దేవుని మార్గంలోకి మరలించే రక్షణ మార్గమిది నీకు నీవుగా జీవించే జీవితంలో నీ కోసం నువ్వు వెదికే రక్షణను క్రిస్మస్‌ నీకు అందించింది. శాపాలనుండి పాపాలనుండి విడుదలను పొందే రక్షణ మార్గన్ని క్రిస్మస్‌ ప్రబోధించింది. చీకటి దారుల్లోకి మరలి భ్రష్టత్వంచెందే మనుష్యులను నిజమైన రక్షణ మార్గంలోనికి తరలి రమ్మని క్రిస్మస్‌ ప్రబోధించింది. క్రీస్తుతో సహవాసం కలిగి వుండటం, ఆయనకు హృదయాన్ని అర్పించడం ఆ అద్వితీయుని ఆరాధించడం, అయన మార్గంలో నడవడం, ఆయన బోధలను ప్రచురం చేయడం, ఆయన కోసం జీవించడమే మనం చేయవలసిన పని. 

ఈ సంవత్సరం కరోనా వైరస్‌ ప్రపంచంలో విషాదాన్ని నింపింది. ఎటుచూసినా ఏం జరుగబోతుందన్న భయంతో మనుష్యులు గతించిన కొన్ని నెలల నుండి బతుకును వెళ్ళదీస్తున్నారు. మనిషి ప్రాణం కన్నా గొప్పది ఏదీ లేదని ఋజువైంది. మన ఉద్యోగాలు, ప్రయాణాలు, విహారాలు, వ్యాపారాలు ఏవీ మన బతుకుల కన్నా గొప్పవి కావని తేలిపోయింది. కొన్ని కొన్ని సందర్భాలలో మనిషి నిశ్చేష్టుడుగా నిలువబడడం తప్ప మరేమీ చేయలేడనే సత్యం బహిర్గతమయ్యింది. చాలామంది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి. తమ వారిని కోల్పోయి విలపిస్తున్న వారు అనేకులున్నారు. జీవితం చాలా భారంగా మారినందువలన ప్రతిరోజూ దుఃఖంతో బతకాల్సిన పరిస్థితిలో చాలామంది జీవిస్తున్నారు. 

అయితే ఈ క్రిస్మస్‌ ప్రతి ఒక్కరికీ పరిస్థితులను ఎదుర్కొనగలిగే ధైర్యమును ప్రసాదించాలని, దేవుని వెలుగు ప్రతి ఒక్కరి హృదయంలో ప్రకాశించుట ద్వారా వెలుగులో ప్రజలంతా నడవాలని కోరుకుంటూ, సమసమాజ నిర్మాణంలో మనమంతా పాలిభాగస్తులమై సాగిపోవాలని ఆశిస్తున్నాను. 
సాక్షి పాఠకులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు.
డా. జాన్‌ వెస్లీ
ఆధ్యాత్మిక రచయిత, వక్త
క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్, రాజమండ్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement