పేదల స్థలాలపై రామోజీ కన్ను | CPM State Executive Member John Wesley Criticized Ramoji Rao | Sakshi
Sakshi News home page

రామోజీ మీ టూరిజానికి ఆ భూములే కావాలా?: సీపీఎం

Published Thu, Nov 24 2022 3:36 AM | Last Updated on Thu, Nov 24 2022 3:07 PM

CPM State Executive Member John Wesley Criticized Ramoji Rao - Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్‌: పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై రామోజీరావు కన్ను పడిందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్‌వెస్లీ ధ్వజమెత్తారు. 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చొరవతో ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి గ్రామం సర్వే నెంబర్లు 189, 203లో (రామోజీ ఫిల్మ్‌సిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు) రాయపోల్, నాగన్‌పల్లి, పోల్కంపల్లి, ముకునూర్‌ గ్రామాలకు చెందిన 576 మందికి రామోజీ ఫిల్మ్‌ సిటీ పరిధిలోన ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే నేటికీ లబ్ధిదారులను ఆ స్థలాల్లోకి వెళ్లకుండా, నిర్మాణాలు చేపట్టకుండా రామోజీ అడ్డుకుంటున్నారని జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన లబ్ధిదారులతో కలిసి నాగన్‌పల్లి నుంచి కేటాయించిన భూముల ప్రాంతం వరకు పాదయాత్ర చేపట్టారు. ఎర్ర జెండాలు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ ఆయా భూముల వద్దకు చేరుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లబ్ధిదారులను ఉద్దేశించి జాన్‌వెస్లీ మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసి ఆ భూములను టూరిజం పేరుతో రామోజీ సంస్థ దక్కించుకోవాలని చూస్తోందని ఆగహ్రం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఇప్పటికే రెవెన్యూ అధికారులకు రామోజీరావు దరఖాస్తు చేసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఫిల్మ్‌ సిటీ పరిధిలోని 180 ఎకరాల ప్రభుత్వ భూమిలో 12 ఎకరాలను ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తే ఇప్పటికీ లబ్ధిదారులను భూముల్లోకి వెళ్లకుండా, నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఫిల్మ్‌ సిటీ పరిధిలో ఇంకా 160 ఎకరాలకి పైగా ప్రభుత్వ మిగులు భూమి ఉందనీ, ఇళ్ల పట్టాలు పంపిణీ చేయని వారికి ఇక్కడే స్థలాలు ఇవ్వాలని జాన్‌ వెస్లీ డిమాండ్‌ చేశారు. భూములు పేదలకు దక్కకుండా కోర్టులో కేసులు వేసి రామోజీ అడ్డుపడుతున్నారని, అయితే లబ్ధిదారుల కోసం పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా రామోజీపై లోకాయుక్తలో సుమాటోగా  కేసులు నమోదయ్యాయని చెప్పారు. పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. 

రామోజీపై చర్యలు తీసుకోకుంటే ఈ నెల 28న కలెక్టరేట్‌ ముట్టడి .. 
ప్రభుత్వం స్పందించి రామోజీపై చర్యలు తీసుకోవాలనీ లేకుంటే ఈ నెల 28వ తేదీన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ముట్టడిస్తామని జాన్‌ వెస్లీ హెచ్చరించారు. అప్పటికీ స్పందించకుంటే ప్రజలను సమీకరించి ఇళ్ల స్థలాల్లో గుడిసెలు వేయిస్తామన్నారు. అక్కడే వంటా వార్పు కార్యక్రమాలతో ఇళ్ల స్థలాలను ఆక్రమిస్తామని ఆయన తేల్చిచెప్పారు. 

మొదటి భూకబ్జా దారుడు రామోజీనే... 
జిల్లాలో ప్రభుత్వ భూములను మొట్ట మొదటి సారిగా కాజేసింది రామోజీ రావేనని రంగారెడ్డి జిల్లా సీపీఎం కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌ ఆరోపించారు. íఫిల్మ్‌ సిటీలో ఉన్న రోడ్లు, చెరువులు, కుంటలను కబ్జా చేశారని నిందించారు. పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రెవెన్యూ యంత్రాంగం అండదండలతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. రామోజీరావుపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 

భారీగా మోహరించిన పోలీసు బలగాలు.. 
సీపీఎం పోరు పాదయాత్ర సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. టియర్‌గ్యాస్‌ వాహనాలను కూడా సిద్ధంగా పెట్టారు. అయితే ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల యాదయ్య, సామేలు, జగదీష్, జిల్లా నాయకులు కందుకూరి జగన్, సీహెచ్‌ జంగయ్య, అలంపల్లి నర్సింహ, ఏర్పుల నర్సింహ, శ్యాం సుందర్, వెంకటేష్, బుగ్గరాములు, జగన్‌లతో పాటు ఆయా గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రామోజీ ఫిల్మ్‌సిటీని ముట్టడిస్తాం: సీపీఎం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement