poor people lands
-
పేదల స్థలాలపై రామోజీ కన్ను
ఇబ్రహీంపట్నం రూరల్: పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై రామోజీరావు కన్ను పడిందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్‌వెస్లీ ధ్వజమెత్తారు. 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతో ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి గ్రామం సర్వే నెంబర్లు 189, 203లో (రామోజీ ఫిల్మ్‌సిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు) రాయపోల్, నాగన్‌పల్లి, పోల్కంపల్లి, ముకునూర్ గ్రామాలకు చెందిన 576 మందికి రామోజీ ఫిల్మ్ సిటీ పరిధిలోన ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే నేటికీ లబ్ధిదారులను ఆ స్థలాల్లోకి వెళ్లకుండా, నిర్మాణాలు చేపట్టకుండా రామోజీ అడ్డుకుంటున్నారని జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన లబ్ధిదారులతో కలిసి నాగన్‌పల్లి నుంచి కేటాయించిన భూముల ప్రాంతం వరకు పాదయాత్ర చేపట్టారు. ఎర్ర జెండాలు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ ఆయా భూముల వద్దకు చేరుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లబ్ధిదారులను ఉద్దేశించి జాన్‌వెస్లీ మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసి ఆ భూములను టూరిజం పేరుతో రామోజీ సంస్థ దక్కించుకోవాలని చూస్తోందని ఆగహ్రం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఇప్పటికే రెవెన్యూ అధికారులకు రామోజీరావు దరఖాస్తు చేసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఫిల్మ్ సిటీ పరిధిలోని 180 ఎకరాల ప్రభుత్వ భూమిలో 12 ఎకరాలను ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తే ఇప్పటికీ లబ్ధిదారులను భూముల్లోకి వెళ్లకుండా, నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఫిల్మ్ సిటీ పరిధిలో ఇంకా 160 ఎకరాలకి పైగా ప్రభుత్వ మిగులు భూమి ఉందనీ, ఇళ్ల పట్టాలు పంపిణీ చేయని వారికి ఇక్కడే స్థలాలు ఇవ్వాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. భూములు పేదలకు దక్కకుండా కోర్టులో కేసులు వేసి రామోజీ అడ్డుపడుతున్నారని, అయితే లబ్ధిదారుల కోసం పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా రామోజీపై లోకాయుక్తలో సుమాటోగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రామోజీపై చర్యలు తీసుకోకుంటే ఈ నెల 28న కలెక్టరేట్ ముట్టడి .. ప్రభుత్వం స్పందించి రామోజీపై చర్యలు తీసుకోవాలనీ లేకుంటే ఈ నెల 28వ తేదీన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని జాన్ వెస్లీ హెచ్చరించారు. అప్పటికీ స్పందించకుంటే ప్రజలను సమీకరించి ఇళ్ల స్థలాల్లో గుడిసెలు వేయిస్తామన్నారు. అక్కడే వంటా వార్పు కార్యక్రమాలతో ఇళ్ల స్థలాలను ఆక్రమిస్తామని ఆయన తేల్చిచెప్పారు. మొదటి భూకబ్జా దారుడు రామోజీనే... జిల్లాలో ప్రభుత్వ భూములను మొట్ట మొదటి సారిగా కాజేసింది రామోజీ రావేనని రంగారెడ్డి జిల్లా సీపీఎం కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ ఆరోపించారు. íఫిల్మ్ సిటీలో ఉన్న రోడ్లు, చెరువులు, కుంటలను కబ్జా చేశారని నిందించారు. పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రెవెన్యూ యంత్రాంగం అండదండలతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. రామోజీరావుపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు.. సీపీఎం పోరు పాదయాత్ర సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. టియర్‌గ్యాస్ వాహనాలను కూడా సిద్ధంగా పెట్టారు. అయితే ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల యాదయ్య, సామేలు, జగదీష్, జిల్లా నాయకులు కందుకూరి జగన్, సీహెచ్ జంగయ్య, అలంపల్లి నర్సింహ, ఏర్పుల నర్సింహ, శ్యాం సుందర్, వెంకటేష్, బుగ్గరాములు, జగన్‌లతో పాటు ఆయా గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: రామోజీ ఫిల్మ్‌సిటీని ముట్టడిస్తాం: సీపీఎం -
బీజేపీ నాయకుల విమర్శలు దారుణం
కావలి: ప్రైవేట్ వ్యక్తుల భూములను కావలికి చెందిన బీజేపీ నాయకురాలు వరలక్ష్మమ్మ పేదలకు అమ్మేసిందని, ఆ భూముల యజమానుల ఫిర్యాదు మేకు అధికారులు చర్యలు తీసుకుంటుంటే అధికార పార్టీ అన్యాయం చేస్తుందని భారతీయ జనతా పార్టీ నాయకుడు కందుకూరి వెంకట సత్యనారాయణ తమను విమర్శించడం దారుణమని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కావలిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీజేపీ నాయకుడు కందుకూరి వెంకట సత్యనారాయణ తనకు ఫోన్ చేసి కావలి సబ్ కలెక్టర్ కొందరు రౌడీలను తీసుకొచ్చి పట్టణంలోని 16వ వార్డు బాలకృష్ణారెడ్డి నగర్లో పేదల ఇళ్లను జేసీబీలతో కూల్చేస్తున్నారని చెప్పారన్నారు. తాను అప్పడే మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశానికి హాజరుకావడానికి బయలుదేరుతున్నానన్నారు. అయినప్పటికీ సబ్ కలెక్టర్‌తో మాట్లాడుదామని కార్యాలయానికి రావాలని కందుకూరి వెంకట సత్యనారాయణను సూచించానని ఎమ్మెల్యే వెల్లడించారు. సరే అని సత్యనారాయణ చెప్పడంతో తాను సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఆయన కోసం ఎదురు చూశానన్నారు. ఆయన రాలేదని తానే ఆయనకు ఫోన్ చేసి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నానని, ఎప్పుడు వస్తారని సత్యనారాయణను అడిగాననని ఎమ్మెల్యే వివరించారు. తాను ఇళ్లు కూల్చేసే చోట ఉన్నానని ఆయన చెప్పడంతో, తాను అక్కడ్నుంచి బయలుదేరి మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నానన్నారు. కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నానని ఎమ్మెల్యే చెప్పారు. కాగా తాను ఈ వివాద వ్యవహరాన్ని ఆరా తీయగా, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన ఇంటి స్థలాలను బీజేపీ నాయకురాలు వరలక్షమ్మ పేదలకు అక్రమంగా అమ్మేసి సొమ్ము చేసుకుందని ఆరోపించారు. అందులో ఇతరులు ఇళ్లు నిర్మించుకోగా, స్థల యజమానులు చేసిన ఫిర్యాదు మేరకు సబ్ కలెక్టర్, డీఎస్పీలు విచారించి చర్యలు తీసుకున్నట్లు తెలిసిందన్నారు. జరిగిన వాస్తవం ఇది అయితే తమ పార్టీ వారు పేదల ఇళ్లును కూల్చేశారంటూ బీజేపీ నాయకుడు కందుకూరి వెంకట సత్యనారాయణ ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఆక్రమణలను ప్రోత్సహించవద్దని, సంపూర్ణంగా అరికట్టాలనే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢమైన నిర్ణయంతో ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాము కూడా కావలిలో ఆక్రమణలను ప్రోత్సహించే వారిని సహకరించబోమన్నారు. చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు చెబుతామన్నారు. బాలకృష్ణారెడ్డి నగర్లో పేదల వద్ద సొమ్ము వసూలు చేసిన బీజేపీ నాయకురాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇల్లు లేని పేదలు ఉంటే వారందరికీ తాము ఇంటి స్థలాలు, ఇళ్లు ప్రభుత్వం ద్వారా మంజూరయ్యేలా చేస్తామన్నారు. పేదలకు న్యాయం చేస్తామే కాని, అట్లాగని ప్రైవేట్ వ్యక్తుల స్థలాలను ఆక్రమించుకుంటామని, పేదలు వద్ద వసూళ్లకు పాల్పడుతామని అంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. -
పేదల భూములు లాక్కోవడం హేయం
మా పొట్టకొట్టకుండ్రి సారూ.. పశ్చిమరంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ శంకర్పల్లి: నిరుపేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం లాక్కొవడం హేయమైన చర్య అని పశ్చిమరంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం మోకిల గ్రామంలోని సర్వే నెంబర్ 96, 197లో పేదలకు కేటాయించిన లావణి పట్టా భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటోందని మోకిల గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్‌కు ఫిర్యాదు చేశారు. కోదండరామ్ ఆదేశాల మేరకు పశ్చిమరంగారెడ్డి జిల్లా జేఏసీ బృందం గురువారం మోకిల గ్రామాన్ని సందర్శించింది వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని మూడు నెలల క్రితం ఎకరం రూ.2 కోట్ల చొప్పున ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుందని, ఒక్కరూపాయి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. తమకు 1975 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ 96, సర్వే నెంబర్ 197లో సుమారు 700 ఎకరాలు లావణి భూమి కేటాయించి సర్టిఫికెట్లు కూడా జారీ చేసిందన్నారు. నాటి నుంచి నేటివరకు తామే ఆ భూమిని సాగుచేసుకుంటున్నామని, ఇప్పుడు ప్రభుత్వం అందులోని 27 ఎకరాలు వేలం వేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మిందని రైతులు వాపోయారు. మరికొంత భూమి అమ్మెందుకు ప్రణాళిక తయారు చేస్తోందని విడతల వారిగా కొంతమందికి నోటీసులు జారీచేస్తోందని వారు ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలోనే సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నామని, తమ పొట్టకొట్టవద్దని రైతులు వేడుకుంటున్నారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ నిరుపేదలకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి పీఓటీ కింద ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తాము ఎన్నో సంవత్సరాలుగా కబ్జాలో, ఖారీజు ఖాతలో ఉన్నట్లు కంప్యూటర్ రికార్డులో నమోదు ఉందని, ఉన్నట్లుండి ప్రస్తుతం కంప్యూటర్లో వారి పేర్లు తీసేసి లావణి పట్టా, ఖారీజ్ ఖాత నిల్‌గా చూపిస్తోందని అన్నారు. అక్కడి నుంచి నేరుగా పంటపొలాలను జేఏసీ నాయకులు పరిశీలించి చైర్మన్ కోదండరామ్‌కు ఫోన్లో సమాచారం అందించారు. రైతులకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. త్వరలో తాను గ్రామానికి వస్తానని రైతులకు అన్యాయం జరగకుండా వారితో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేద్దామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ జేఏసీ చైర్మన్ కె.నర్సింలు, కన్వీనర్ రామరావుజోషి, మోకిల సర్పంచ్ అనందం, వైస్‌ఎంపీపీ శశిధర్‌రెడ్డి, నాయకులు మారుతి వై.దాసు, అడివయ్య, ఖాదర్‌పాష, సిహెచ్.యాదయ్య, రాజునాయక్, పాపాయ్య, గోపాల్, నర్సింలు, చోక్లనాయక్, యేషయ్య, ఎండీ.జానీ, పాండు, శ్రీశైలం, సదానందం, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయుడు ఆశీర్వాదం ఉన్నారు. -
పేదల భూములు లాక్కునే ఎత్తుగడ
నిషేధిత సర్వేనంబర్లపై సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులతో ఆరా బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం : పేదల భూములు లాక్కుని, వ్యాపారం చేసేందుకే ప్రభుత్వం పట్టా భూములను నిషేధిత సర్వే (08) జాబితాలోకి చేర్చిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అధికారులతో నిషేధిత సర్వే నంబర్ల వివరాలు ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా తమ హక్కు/అనుభవంలో ఉండి పూర్వపు పట్టాలు ఉన్న భూములు, స్థలాలు, ఇళ్లను నిషేధిత జాబితాలోకి చేర్చి వేలాది మంది పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ప్రజల నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించడకుండా కోర్టు ఉత్తర్వులనూ బేఖాతరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. నియోజకవర్గంలోని ధర్మవరం మండలం, ధర్మవరం పట్టణం, తాడిమర్రి, బత్తలపల్లి మండలాల్లో మొత్తం 1, 06,300 ఎకరాలను నిషేధిత జాబితాలోకి చేర్చడం బాధాకరమన్నారు. ఒక్క ధర్మవరం మండలం,పట్టణంలో మాత్రమే 55,151 ఎకరాలను, తాడిమర్రి మండలంలో 22,033, బత్తలపల్లి మండలంలో 28,048 ఎకరాలను నిషేధిత సర్వే జాబితాలోకి చేర్చారన్నారు. నియోజకవర్గంలోనే ఇంత భూమిని అసైన్డ్ జాబితాలోకి చేరిస్తే జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల భూమిని నిషేధిత జాబితాలోకి చేర్చి ఉంటారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే బాధితులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం ఉధృతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటిబాబు, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు చిన్నతిమ్మన్న, బీరే ఎర్రిస్వామి, చందమూరి నారాయణరెడ్డి, నాయకులు నర్శింహారెడ్డి, గోరకాటి పురుషోత్తంరెడ్డి, వడ్డేబాలాజీ, తొండమాల రవి, సాయి, చింతాయల్లయ్య తదితరులు పాల్గొన్నారు.