పేదల భూములు లాక్కునే ఎత్తుగడ
పేదల భూములు లాక్కునే ఎత్తుగడ
Published Tue, Jul 19 2016 9:59 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
నిషేధిత సర్వేనంబర్లపై సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులతో ఆరా
బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
ధర్మవరం : పేదల భూములు లాక్కుని, వ్యాపారం చేసేందుకే ప్రభుత్వం పట్టా భూములను నిషేధిత సర్వే (08) జాబితాలోకి చేర్చిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అధికారులతో నిషేధిత సర్వే నంబర్ల వివరాలు ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా తమ హక్కు/అనుభవంలో ఉండి పూర్వపు పట్టాలు ఉన్న భూములు, స్థలాలు, ఇళ్లను నిషేధిత జాబితాలోకి చేర్చి వేలాది మంది పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ప్రజల నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించడకుండా కోర్టు ఉత్తర్వులనూ బేఖాతరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. నియోజకవర్గంలోని ధర్మవరం మండలం, ధర్మవరం పట్టణం, తాడిమర్రి, బత్తలపల్లి మండలాల్లో మొత్తం 1, 06,300 ఎకరాలను నిషేధిత జాబితాలోకి చేర్చడం బాధాకరమన్నారు. ఒక్క ధర్మవరం మండలం,పట్టణంలో మాత్రమే 55,151 ఎకరాలను, తాడిమర్రి మండలంలో 22,033, బత్తలపల్లి మండలంలో 28,048 ఎకరాలను నిషేధిత సర్వే జాబితాలోకి చేర్చారన్నారు. నియోజకవర్గంలోనే ఇంత భూమిని అసైన్డ్ జాబితాలోకి చేరిస్తే జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల భూమిని నిషేధిత జాబితాలోకి చేర్చి ఉంటారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే బాధితులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. బాధితుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం ఉధృతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటిబాబు, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు చిన్నతిమ్మన్న, బీరే ఎర్రిస్వామి, చందమూరి నారాయణరెడ్డి, నాయకులు నర్శింహారెడ్డి, గోరకాటి పురుషోత్తంరెడ్డి, వడ్డేబాలాజీ, తొండమాల రవి, సాయి, చింతాయల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement