Gospel of Christ
-
ఆయన ప్రణాళిక అమోఘం
దేవుని సహవాసంలో ఉచితంగా లభ్యమయ్యే బలాన్ని పొందుకోవడమే మనకు అసలైన ఆశీర్వాదం! బలము తెచ్చుకొని వెళ్ళుము... నిన్ను పంపిన వాడను నేనే (న్యాయా 6:14). కష్టించి పనిచేసిన తరువాత చేతికొచ్చిన ప్రతిఫలం కళ్ళముందే ఎవరైనా తన్నుకుపోతే ఎంత బాధ ఉంటుందో కదా? చెమటోడ్చి సంపాదించిన వాటిని శత్రువులొచ్చి తీసుకుపోతే ఎంతటి వేదన గుండెలోతుల్లో ఉంటుందో కదా? చాలా సంవత్సరాల క్రితం గిద్యోను కాలంలో కూడా ఇశ్రాయేలీయులు అలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు. ఆ విపత్కర సమయంలో దేవుడు గిద్యోనుతో పలికిన మాటలు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చూడగలం. తన ప్రజలను రక్షించడానికి గిద్యోను మీద ఉంచబడిన బాధ్యత చాలా గొప్పది. అనాది నుండి దేవుడు తన ప్రజలను కొన్ని ప్రత్యేక ఉద్దేశ్యాల కోసం పిలుస్తూనే ఉన్నాడు. మహాశ్చర్య కార్యములను నెరవేర్చుటకు తన వారిని వినియోగించుకొంటూనే ఉన్నాడు. దేవుని పిలుపు వెనుక అద్భుతమైన పరమార్థం దాగి ఉంటుంది. కాలయాపన కోసమో, అనవసరంగానో దేవుడు ఎవ్వరిని పిలువలేదు... పిలువడు కూడా. ఆ కాలంలో మిద్యానీయుల భయంతో ఇశ్రాయేలీయులంతా కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకొరకు సిద్ధపరచుకొని వాటిలో నివసించేవారు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పంటను దోచుకొనేవారు. కష్టార్జితం ఇల్లు చేరేది కాదు. చాలాకాలం కష్టించి, శ్రమించి పండించిన పంట చేతికొచ్చే వేళ మిద్యానీయులు వచ్చి సమస్తాన్ని కొల్లగొట్టేవారు. కొన్ని కొన్నిసార్లు విత్తనములు విత్తిన తరువాత మిడతల దండంత విస్తారంగా వారిమీదకు వచ్చి పంటను పాడుచేసి గొర్రెలను, యెడ్లను, గాడిదలను, జీవనసాధనమైన వాటిని దొంగిలించి వారిని బహుగా బాధించేవారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు చేరుకున్న తరుణంలో దేవుడు గిద్యోను ద్వారా వారిని రక్షించడానికి సంకల్పించాడు. అవును! ఆయన దివ్యమైన ప్రణాళికలు ఎప్పుడూ అమోఘమైనవే. భయకంపిత వాతావరణంలో బతుకుతున్న గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మిద్యానీయులకు భయపడి గానుగ చాటున ఉండి కొద్దిపాటి గోధుమలను దుళ్ళగొట్టి పొట్టను పోషించుకోవాలని ఆశిస్తున్న వ్యక్తిని దేవుడు ప్రజలందరికి దీవెనకరంగా మార్చాడు. దేవుని ఉన్నతమైన పిలుపునకు తమను తాము సమర్పించుకున్న ప్రతి ఒక్కరూ దేవుని నామమును అత్యధికంగా మహిమపరిచారు. దేవుని కార్యముల కోసం పిలువబడడం, నియమించబడడం ఎంత ఆశీర్వాదమో కదా. దేవుని సహవాసంలో ఉచితంగా లభ్యమయ్యే బలాన్ని పొందుకోవడమే మనకు అసలైన ఆశీర్వాదం! – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
సువార్త: నీకున్న విలువ గొప్పది
లోకంలో మనకున్న విలువ డబ్బుమీద, లేదా అంతస్థుల మీద లేదు గాని దేవుడు విలువపెట్టి మనలను కొన్నాడు గనుక మనం ఖచ్చితంగా విలువగలవారమే. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి (1 కొరింథీ 6:20). ప్రపంచ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే పూర్వదినాల్లో కొన్ని దేశాల్లో ట్రేడ్ సెంటర్స్‌లో మనుష్యులను అమ్మేవారు, కొనుక్కొనేవారు. ఆఫ్రికా దేశాలనుండి మనుష్యులను తీసుకెళ్ళి సంతలో పశువులను కొనేటట్లుగా మనుష్యులను తమ ఇష్టాయిష్టాలతో పట్టింపు లేకుండా కొనుక్కొనేవారు. అలా ధనంతో కొనబడిన వ్యక్తులు జీవితాంతం వారికి సేవ చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. యజమానుని మాటను జవ దాటకుండా పనిచేసేవారు. వారికి ఏ విషయంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండేవి కావు. చాలా పోరాటాల పిదప ఆ తర్వాతి కాలంలో వారికి విడుదల లభించింది. ప్రభువైన యేసుక్రీస్తు కలువరి సిలువలో తన అమూల్యమైన రక్తం ద్వారా ప్రతి మనుష్యుని కొనుక్కోవాలని ఇష్టపడుతున్నాడు. పాప బానిసత్వం నుండి, సాతాను బంధకాల నుండి విడుదల పొందాలని ఎవరు ఆశపడతారో వారిని తన నిష్కళంకమైన రక్తంతో కడిగి పవిత్రపరిచి వారిని ధన్యజీవులనుగా చేస్తాడు. దానిని విమోచించబడడం అంటారు. వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనము విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషాన్ని నిష్కళంకమునగు గొర్రెపిల్లవంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా (1 పేతురు 1:18–19) అని పేతురు చెప్పిన మాటలో ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు దాగి ఉన్నాయి. తన ఉచితమైన కృపద్వారా దేవుడు మనలను కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు. ఆయన స్వకీయ సంపాద్యం. రక్షింపబడక పూర్వం ఒక వ్యక్తి ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుడు. కాని క్రీస్తు మన కోసం వెల చెల్లించటం ద్వారా మనం ప్రయోజనకరమైన వారిగా తీర్చిదిద్దబడ్డాము. లోకంలో మనకున్న విలువ డబ్బుమీద, లేదా అంతస్థుల మీద లేదు గాని దేవుడు విలువపెట్టి మనలను కొన్నాడు గనుక మనం ఖచ్చితంగా విలువగలవారమే. క్రీస్తు మనలను కొనుక్కున్నది మన జీవితాల ద్వారా ఆయనకు మహిమ రావాలని. మన దేహాల ద్వారా దేవుడు ఘనపరచబడవలెనని కోరుతున్నాడు. పాప పంకిలమైన లోకంలో క్రీస్తు ప్రతినిధులుగా బ్రతుకుచూ దేవుని రాజ్య విస్తరణలో వాడబడాలన్నది దైవ ప్రణాళిక. దేవుడు మనలను కొనుక్కున్నాడు గనుక మనమీద సంపూర్ణ అధికారం ఆయనదే. సిలువలో సంపూర్ణంగా వెలను చెల్లించాడు గనుక ఆయన కోసం మనం జీవించాలి. ఆయన పాలన నియంత పాలన వంటిది కాదు. ఆయన మనలను కొనుక్కొన్నప్పటికి మనమీద పెత్తనం చెలాయించడు. కృపామయుడైన దేవుడు ప్రేమ పూర్వకంగా ఆదేశిస్తాడు. ఆయన ఆదేశాలకు లోబడడం మనకే ప్రయోజనం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలు మనకు మంచి భవిష్యత్తును అనుగ్రహించునట్లుగా, నిరీక్షణ కలుగచేయునట్లుగా సమాధానకరములైనవే గాని హానికరములు కావు. ప్రియస్నేహితా! పరిస్థితులను బట్టి ఎన్నడును కృంగిపోకు. మనుష్యులు నిన్ను తక్కువగా చూస్తున్నారని బాధపడకు. నీవు సర్వశక్తుడైన దేవుని చేతిలో చెక్కబడ్డావు. నిన్ను ఎట్టి పరిస్థితులలో చేజారనియ్యడు. అపవాది చేతికి మరలా అప్పగించడు. ధైర్యంగా ఉండు. – డాక్టర్ జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు..
సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. మార్కు 1:30. ఒక వ్యక్తి పడి ఉంటే ఆనందించేవారు లోకంలో కొందరుంటారు. నిలబడినవారిని సయితం పడగొట్టాలని ప్రయత్నం చేసేవారూ లేకపోలేదు. అయితే ఎందుకు కొరగాని వారిని ఎన్నుకొని వారికి సముచిత ప్రోత్సాహాన్ని అందించి వారిని సమసమాజ నిర్మాణం కోసం వాడుకోగలిగిన మహనీయుడు నిత్య దేవుడు. ఇశ్రాయేలు దేశంలోని కపెర్నహూము అనేది చారిత్రాత్మక ప్రదేశం. దానికి యేసు పట్టణం అనే పేరు కూడా ఉంది. మొదటి శతాబ్దపు చరిత్ర ఆనవాళ్లు నేటికీ అక్కడ కనబడుతుంటాయి. సమాజ మందిరం నుండి యేసుప్రభువు సీమోను ఇంటికి వెళ్ళాడు. అడుగుపెట్టగానే ఆయన దృష్టి జ్వరంతో పyì ఉన్న పేతురు అత్తమీద పడింది. ఆ ఇంటిలో చాలామంది ఉన్నారు కానీ యేసుక్రీస్తు దయగలిగిన చూపు వ్యాధితో బాధపడిన వ్యక్తి మీదకు మరలింది. అవును! ఆయన దృష్టి ఎప్పుడూ అభాగ్యుల మీదనే. ఎక్కడ సమస్య ఉందో... ఎక్కడ కన్నీరు ఉందో... ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడికే క్రీస్తు పాదాలు నడిచాయి. ఆ సమస్యకు పరిష్కారమిచ్చుటకు ఆయన ప్రేమ అలాంటి స్థలాలకు ఆయనను నడిపించింది. మేలు చేయడానికి ముందు సీమోను పేతురు తన అత్త పరిస్థితిని ప్రభువుతో చెప్పుకున్నాడు. ఆయన ఓపికతో విన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించువాడు గదా! మనుష్యుల విన్నపాలు వినడంలో ఆయనకున్నంత ఓపిక ఈ విశ్వంలో ఎవ్వరికైనా ఉందా? మనుష్యుల హృదయాంతరంగాన్ని అర్థం చేసుకోవడంలో ఆయనకున్న ఓర్పు మరెవ్వరికైనా ఉందా? నా దేవుడు నా గోడు వింటాడు అనే నమ్మికతో ఆయన పాదాల దగ్గర మోకరిల్లిన వారిని తోసివేసిన సంఘటన ఒక్కటైనా ఉందా? జీవన సంఘర్షణలో శాంతిమార్గాన్ని వెదుక్కొంటూ క్రీస్తు వద్దకు వచ్చినవారు నిరాశతో వెనుదిరిగినవారు కనిపిస్తారా? తన అత్త దుస్థితినంతా వివరించిన పేతురు ద్వారా ఆ కుటుంబానికి మేలు జరిగింది. తీవ్ర జ్వరంతో పడి ఉన్న ఆమెను యేసుక్రీస్తు చేయిపట్టి లేవనెత్తి స్వస్థపరిచారు. వెంటనే ఆమె లేచి అక్కడున్నవారికి ఉపచారం చేయడం ప్రారంభించింది. ప్రియ మిత్రమా! ఎంతకాలం మౌనంగా విలపిస్తావు? తీవ్రమైన నిరుత్సాహంతో కుమిలిపోతావు? ఇప్పుడే మాట్లాడు... నిన్ను ప్రేమించు నీ దేవుడు నీ ప్రార్ధన వింటున్నాడు. నీ వేమి చెప్పాలనుకుంటావో చెప్పు! కరుణావాత్సల్యాలు నీపై కుమ్మరించు నీ ప్రభువు నిన్ను నిరుత్సాహపరచడు. ఎంతసేపు మాట్లాడాలనుకుంటావో మాట్లాడు...ఆయన విసుగు చెందడు. నీ భారం ఎంత ఆయనపై మోపినా ఆయన అలసిపోడు. నీకు మేలు చేయడంలో దేవుడు ఎప్పుడూ సంసిద్ధుడే! నీవు చెప్పే నీ కష్టాల చరితను మనుష్యులు ఒకసారి వింటారేమో! రెండుసార్లు వింటారేమో. ఆ తర్వాత వారికీ విసుగొస్తుంది గనుక ముఖం చాటేస్తారు. నీ దేవుడు అలాంటివాడు కాదు. ఎన్నిసార్లు ఆయన పాదసన్నిధికి వచ్చి ఆయన్ను తండ్రి అని పిలిచినా ఆయన ప్రసన్నమైన వదనంతో జవాబునిస్తాడు. నీ స్థితిని చక్కదిద్ది ఊహించలేని మేళ్లు నీ జీవితంలో చేస్తాడు. – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
చర్చి వెలిగే లైట్ హౌస్‌లాగా ఉండాలి
దేవుని అద్భుత సత్యాలతో కూడిన బైబిల్ ఇంట్లో ఉన్నా రోజుల తరబడి దాని జోలికి వెళ్లకుండా విశ్వాసి ఉంటున్నాడంటే, దేవుడంటే ‘ఆకలి’ మందగించిందని, ఆకలి లేక పౌష్టికాహార లోపం ఏర్పడి అతని జీవితం అన్ని రకాల అనర్థాలకూ కారణమైందని అర్థం. తాను స్థాపించిన కొరింథీ చర్చిలో అసూయలు, కలహాలు, విభేదాలు, విభజనలకు ‘ఆత్మీయపౌష్టికాహార సమస్యే’ కారణమని. ఆ చర్చికి రాసిన మొదటి లేఖలో పౌలు వాపోయాడు. ‘అప్పట్లో మీరు బలహీనులు కాబట్టి నేను మిమ్మల్ని పాలతో పోషించాను. కాని ఇంతగా ఎదిగిన తర్వాత కూడా మీరింకా పాలే తాగే స్థితిలోనే ఉన్నందువల్ల మరింత బలహీనులై, ‘నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కేఫా(పేతురు) వాడను, నేను క్రీస్తు వాడను’ అంటూ నాలుగు వర్గాలుగా చీలిపోయి శరీరసంబంధుల స్థాయికి దిగజారారు’ అని పౌలు బాధపడ్డాడు( 1:12, 3:1–9). అది కుటుంబమైనా, చర్చి అయినా, దేశమైనా ఆత్మీయ జ్ఞానం కొరవడితే ’అనైక్యత’ ప్రబలి, మానసిక శాంతి కరువై అన్ని అనర్ధాలకూ రాచబాట వేస్తుంది. పరలోకానందంతో వెలిగిపోవలసిన జీవితాలు,కుటుంబాలు, సమాజం, చర్చిల్లో అశాంతి నిండిన నరకపు చీకట్లు కమ్మడానికి దేవుడంటే ‘ఆకలి’మందగించి ఏర్పడిన ‘ఆత్మీయ పౌష్టికాహార లోపమే’ ప్రధాన కారణం. కొరింథీ పట్టణం గ్రీసులో ఏడు లక్షల మంది జనాభా కలిగిన గొప్ప వర్తకపు పట్టణం. కాని బోలెడు డబ్బున్న కొరింథీలో ప్రజలు మద్యం, జూదం, వ్యభిచారం వంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేసుకొని భ్రష్టులవుతున్నారు. అలాంటి కొరింథీలో పౌలు సువార్త ప్రకటించినప్పుడు మొదట బాగా వ్యతిరేకత ఎదురైంది. అయితే దేవుడు ’ఇక్కడ నాకు చాలా జనముంది, ధైర్యంగా మాట్లాడు’ అంటూ పౌలును బలపర్చగా, ప్రయాసపడి ఈ చర్చిని స్థాపించాడు (అపో.కా.18:5–11). ’ఈ పట్టణంలో నాకు చాలా జనముంది’ అని ఆరోజు ప్రభువంటే అక్కడొక గొప్పచర్చి అవుతుందనుకున్నాడు కాని, ’కొరింథీ పట్టణంలో భ్రష్టులైన చాలా మందికి నా అవసరం అంటే దేవుని అవసరం ఉంది, ‘కొరింథీ చర్చి’ నా ప్రతినిధులుగా వారిని సరిదిద్ది పరలోకపు ఆనందంతో నింపాలన్నదే నాటి దేవుని మాటల అంతరార్థమని పౌలుకు ఇప్పుడర్థమవుతోంది. భ్రష్టులైన వారికి వారికి వెలుగు చూపించి సరిదిద్దే లైట్ హౌస్ గా దేవుడు కొరింథీ చర్చిని నియమిస్తే, అసలు లైట్ హౌస్ లోనే చీకటి కమ్ముకున్న విషాదం కొరింథీ చర్చిది, ఈ నాటి మనందరిదీ కూడా!! గొప్ప దైవసేవకుడు, ‘సాల్వేషన్ ఆర్మీ’ సంస్థాపకుడు విలియం బూత్ ఒకసారి తన ఏడేళ్ల కొడుకు ఎడ్వర్డ్ బూత్ ను లండన్ లో ఒక బార్ కు తీసుకు వెళ్ళాడు. ‘జూదం, మద్యపానంతో నిండిన ఈ బార్ కు నన్నెందుకు తెచ్చావు నాన్నా?’ అని ఎడ్వర్డ్ అడిగితే ‘వీళ్లంతా దేవుని పిల్లలే. కాని దారి తప్పారు. వాళ్ళ జీవితాలు సరిదిద్దే గొప్ప సేవ నీవు చెయ్యాలని చెప్పడానికే ఇక్కడికి తెచ్చాను’ అన్నాడు విలియం బూత్. తండ్రిని మించిన తనయుడుగా ఎడ్వర్డ్ బూత్ ఆ తర్వాత చేసిన అద్భుతమైన సేవ ఫలితంగా లండన్‌లోని బార్లు, జూదం జరిగే కేంద్రాలు మూతపడ్డాయి. లోకానికి వెలుగు చూపించాల్సిన బాధ్యత చర్చిది. కాని చర్చిలోనే చీకటి నిండితే అది వెలగని లైట్ హౌస్ లాంటిదే!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
తండ్రీ... వారిని క్షమించు!
క్రీస్తు మనకు అనుగ్రహించిన మహావాక్యం అతను సిలువ ఎక్కబోతూ, తనను అసూయకొద్దీ చంపజూసిన వాళ్ల గురించి అన్న వాక్యం: ‘తండ్రీ! వాళ్లను క్షమించు! ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియటం లేదు’ అని. చరిత్ర చాలా గడ్డు సమయంలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తమూ ఆధ్యాత్మికంగా పూర్తిగా కుంగిపోయి ఉన్నప్పుడు దాన్ని పునరుజ్జీవింప జేయడానికి క్రీస్తు జన్మించాడు. ఆ మహాత్ముడి సందేశం- ‘మీరందరూ భగవదంశలే’ గొప్ప సందేశం. సెయింట్ జాన్ ఆ క్రీస్తు వచనాన్ని విపులీకరించాడు: ‘ఎంతమంది అతన్ని (అంటే, యేసులోనూ సృష్టి మొత్తంలోనూ ప్రకటమైన కూటస్థ చైతన్యాన్ని) అర్థం చేసుకొని గ్రహించగలుగుతారో వాళ్లందరికీ భగవంతుడి పుత్రుడిలాగా కావడానికి కావలసిన శక్తినిచ్చాడు ఆయన’ (జాన్ 1-12) అని. ఇదో మహావాక్యం. గుండెలో నిర్మలత్వం ఉండి మనసా వాచా కర్మణా శ్రద్ధాభక్తుల్ని పూర్తిగా కనబరచగలిగితే చాలు ఆ మనిషి జాతి ఏదైనాసరే అతని చర్మం రంగు ఏదైనా సరే అతను భగవంతుణ్ణి తనలోకి పిలిచి పరిపూర్ణ తృప్తిని పొందగలుగుతారు. ‘అన్నిదేశాల ప్రజల్నీ (భగవంతుడు) ఒకే రక్తం ఉన్నవాళ్లుగా తయారు చేశాడు’ (అపొ.కా. 17-26) అనేదే క్రీస్తుకు ఉత్తేజాన్నిచ్చిన సంగతి. చర్మాల రంగుల్నిబట్టి మనుషుల్ని విభజించుకొని అసహ్యించుకోవడంగానీ ప్రేమించడం గానీ మనుషుల అజ్ఞానానికి పరాకాష్ఠగానే చెప్పాలి. రంగు చర్మానికే పరిమితం; అంతకన్నా లోతుకు అది వెళ్లదు. రంగును బట్టి ఎవరూ ఎవర్నీ వేరుచేయాల్సిన మూర్ఖత్వంగానీ రాగద్వేషాల్ని చూపించే వెర్రితనాన్ని గానీ బహిర్గతం చేయగూడదు. అదీగాక, నువ్వు ఎవర్ని ద్వేషిస్తావో ఏ జాతిని అసహ్యించుకుంటావో ఏ మతాన్ని ఏవగించుకుంటావో, తిరిగి ఆ జాతిలోనూ ఆ మతంలోనూ ఆ తీరులోనూ పుట్టవలసి వస్తుంది. అది తప్పనిసరి. ఎందుకంటే, చిట్టచివరికి మనకు అన్నిరకాల పక్షపాతాలూ పోయి, మనమందరమూ నిర్మలులమై, భగవంతుడి రెక్కలమాటున ఉండవలసినవాళ్లమే అని గుర్తు పెట్టుకోవాలి. క్రీస్తు మనకు అనుగ్రహించిన మహావాక్యం అతను సిలువ ఎక్కబోతూ, తనను అసూయకొద్దీ చంపజూసిన వాళ్ల గురించి అన్న వాక్యం: ‘తండ్రీ! వాళ్లను క్షమించు! ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియటం లేదు’ అని. తనను చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్లపట్ల మనకుండవలసిన భావమేమిటో ఏది ఎదుటివాళ్ల క్రూరహృదయాన్ని కూడా మెత్తబరిచి వాళ్లకే తప్పు జేశామన్న పశ్చాత్తాపాన్ని కలిగిస్తుందో ఈ మహావాక్యం చెబుతుంది. మనం చిన్నప్పుడు నీతిపద్యాల్లో ఈ గొప్ప క్షమాగుణం గురించే చదువుకున్నాం. అందుచేతనే యేసుక్రీస్తు మన స్వధర్మాన్ని, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టే నిర్వచించాడు: ‘మనుషులందరూ ఈ డబ్బూదస్కాలకోసమే వెంపర్లాడుతూ ఉంటారు. ఆ తండ్రికి ఇవి మీకు అవసరమని తెలుసు. ఏం తినాలి? ఏం తాగాలి? ఎలాగ ఈ శరీరాన్ని బట్టలతో చుట్టుబెట్టుకోవాలి? అనేవన్నీ అవసరమైన ఆలోచనలా అసలు? నేలను గడ్డి అనే పచ్చటిగుడ్డలతో భగవంతుడు కప్పుతూనే ఉన్నాడు. ఇవాళ ఉన్న ఆ గడ్డిని ఎండగానే కుంపట్లో వేస్తూనే ఉంటాం. నేలనే ఇంత పట్టించుకొన్నవాడు, మనిషిని మాత్రం ఎందకు పట్టించుకోడు? అంచేత వీటికన్నా మీరు దేవుని రాజ్యాన్ని ముందుగా కోరుకోండి. చేరడానికి ఉపక్రమించండి. అప్పుడు ఇవన్నీ మీకు (వాటికవే) వచ్చి చేరతాయి’ (మత్తయి 6-33). ‘డబ్బునీ దేవుణ్ణీ నువ్వు (ఒకేవేళ) సేవించలేవు’ (మత్తయి 6-24) అని ఎప్పుడూ గుర్తుపెట్టుకో! క్రీస్తు ప్రవచనం- ‘నిన్ను నువ్వెలాగ ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అలాగే ప్రేమించాలి’ అనేది గుర్తు పెట్టుకోవాలి. దాని అర్థం బహుదృశ్యరూపాల్లో ఎదురుగా అగుపిస్తున్న దేవుణ్ణి ప్రేమించమనే. క్రీస్తు చెప్పిన దానిని మనమంద రమూ నేర్చుకోవాలి. గాలిలో ఎగిరే పక్షులకు తిండిని పెట్టేవాడు మనకూ పెట్టకమానడన్న దృఢమైన విశ్వాసం ఉండాలి. ఆవగింజంతైనా విశ్వాసం లేకుండా, వట్టి కబుర్లు చెబితే క్రీస్తు సంతోషిస్తాడనుకోవడం మనను మనం మోసగించుకోవడమే. - డా॥ముంజులూరి నరసింహారావు