Dr. munjuluri Narasimha Rao
-
భూరిశ్రవసుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 35 భూరిశ్రవసుడు అర్జునుణ్ని ఆడిపోసు కోవడం మొదలుపెట్టాడు; అస్త్ర ధర్మాన్నెరి గిన నువ్వు నీతో యుద్ధం చేయని నా కుడిచేతిని కొట్టెయ్యడం ఏ రకమైన ధర్మం? వాసుదేవుడి మాట విని నువ్వు ఈ నికృష్టమైన పని చేశావని తెలిసిపోతోంది. నువ్వు కృష్ణ సఖుడివి కాకపోతే ఈ పని చేసేవాడివి కావు’ అని అర్జునుణ్ని తప్పు బట్టడమే కాకుండా కృష్ణుణ్ని కూడా దూషించాడు. భూరిశ్రవసుడు భీష్ముడికి వరసకు మనవడవుతాడు. భూరిశ్రవసుడికి భూరి దక్షిణుడనీ యూపకేతువనీ యజ్ఞశీలుడనీ పేర్లు ఉన్నాయి. యజ్ఞంలో బలిపశువును కట్టే స్తంభాలను యూపస్తంభాలని అంటారు. ఆ యూపస్తంభాన్నే తన రథానికి ధ్వజంగా చేసుకున్నాడు ఈ కర్మప్రతీకుడు. యజ్ఞ కర్మల్లో ఎక్కువగా దక్షిణలిచ్చేవాడు గనక ఇతన్ని భూరి దక్షిణుడని కూడా అంటారు. భూరిశ్రవసుడి పుట్టుక వెనుక ఒక కథ ఉందని చెబుతారు. వసుదేవుడికి కాబోయే భార్య అయిన దేవకికి స్వయంవరం చేసి నప్పుడు, శిని అనే వృష్ణి వర్గంవాడు, ఆమెను తెచ్చి వసుదేవుడికిచ్చి పెళ్లిచేద్దా మని ఆవిణ్ని తీసుకొని వస్తున్నాడు. తోవలో ఆ పనికి సోమదత్తుడు అడు ్డపడ్డాడు. శినీ సోమదత్తుడూ పోట్లాడు కున్నారు. ఓడిపోయిన సోమదత్తుణ్ని శిని చంపకుండా తన్ని అవమానపరిచి విడిచిపెట్టాడు. ఆ అవమానం సోమదత్తుణ్ని పీడించింది. తన రాజ్యానికి తిరిగి పోకుండా, అతను అక్కణ్నించే తపస్సు చేయడానికి వనానికి వెళ్లిపోయాడు. అయితే, తపస్సుకు కావలసిన ఫలితం వచ్చేలోపులో శినీ చచ్చిపోయాడు, శిని కొడుకు సత్యకుడూ చచ్చిపోయాడు. అంచేత శిని మనవణ్ని ఓడించగలిగే కొడుకు తనకు కలగాలని వరం కోరుకున్నాడు సోమదత్తుడు. ఆ వరప్రసాదంగానే భూరిశ్రవసుడు పుట్టాడు. శిని మనవడే సత్యకుడికి కొడుకైన సాత్యకి. ఈ సాత్యకి అసలు పేరు యుయుధానుడు. బ్రహ్మచైతన్య యోగం కోసం యుద్ధం చేయడానికి బుద్ధిని ధారణ చేసినవాణ్నే యుయుధానుడని అంటారు. అంటే, యోగం కోసం పోరాడాలన్న శ్రద్ధా భక్తీ ఉన్నవాడన్నమాట. అంచేతనే ఈ సాత్యకిని శ్రద్ధకు ప్రతీకగా చెబుతారు. శినికో శిని కొడుకుకో పడవలసిన కర్మశిక్ష, శిని మనవడైన సాత్యకికి దిగివచ్చింది. కర్మఫలం తప్పకుండా వచ్చిపడడం వరప్రసాదంగా కథారూపేణా చెప్పుకొంటాం. సాత్యకి అర్జునుడికి శిష్యుడు. సాత్యకి విలువిద్య అంతా అర్జునుడి ప్రసాదం. అదీగాక సాత్యకి వరసకి, సత్యభామకు తమ్ముడుగా, శ్రీకృష్ణుడికి బావమరిది అవుతాడు. సైంధవుణ్ని సూర్యుడు అస్తమించేలోపుగా వధించాలనే ప్రతిజ్ఞను నెరవేర్చుకోడానికి, ద్రోణుణ్ని తప్పించుకొని, కౌరవ సేనా వ్యూహంలో చొరబడిన అర్జునుడికి సాయంగా ఉండమని ధర్మరాజు, భీముణ్నీ సాత్యకినీ పంపించాడు. సాత్యకి యుద్ధం చేస్తూ చాలామందినే సంహరిస్తూ ముందుకు వస్తున్నాడు. చాలా అలసిపోయిన స్థితిలో అతనికి తటాలున భూరిశ్రవసుడు ఎదురయ్యాడు. ‘చాలా కాలానికి నా కోరిక తీరబోతోంది. ఈ రోజున నువ్వు యుద్ధరంగం వదిలి పారిపోకుండా ఉంటే, నా చేతిలో చనిపోవడం నీకు తప్పదు. నా చేతిలో నువ్వు చనిపోయినప్పుడు, నిన్ను ఈ వ్యూహంలోకి పంపిన ధర్మరాజు నీలాంటి దుర్బలుణ్ని పంపినందుకు సిగ్గుపడతాడు. ‘రా, యుద్ధానికి సిద్ధపడు’ అని అంటూ సాత్యకిని కవ్వించాడు భూరిశ్రవసుడు. యుయుధానుడు నవ్వుతూ సమాధానం చెబుతూ, ‘నేను నీ మాటలకే భయపడిపోయే పిరికివాణ్ని కాను. నన్ను యుద్ధంలో నిరాయుధుణ్ని చేసినవాడే నన్ను గెలవగలుగుతాడు. అయినా, వట్టిగా బడబడలాడడం వల్ల లాభమేమిటి? నువ్వన్నది చేసి చూపించు చూద్దాం’ అంటూ ఆ సవాలును స్వీకరించాడు సాత్యకి. ఒక ఆడ ఏనుగు కోసం భీషణంగా కొట్టుకొనే రెండు ఏనుగుల్లాగ జయం కోసం పోరాడుతూ వాళ్లిద్దరూ ఒకళ్ల మీద మరొకళ్లు బాణవర్ష ధారలు కురిపించడం మొదలుపెట్టారు. విల్లులు విరగ్గొట్టుకొని రథాలను ధ్వంసం చేసుకొని, ఇక కత్తి యుద్ధానికి దిగారు. రకరకాలుగా ఖడ్గ యుద్ధం చేస్తూ ఒకరి డాలును మరొకరు విరగ్గొట్టి ఆమీద మల్లయుద్ధానికి ఉపక్ర మించారు. వాళ్లిద్దర్నీ కొంతదూరంలో ఉన్న కృష్ణార్జునులు చూస్తున్నారు. కృష్ణుడు ‘సాత్యకి బాగా అలసిపోయినప్పుడు ఈ భూరిదక్షిణుడు యుద్ధాన్ని కోరుకొంటూ ఎదురుపడ్డాడు. అంచేత వీళ్ల యుద్ధం సమయుద్ధంగా లేదు. యుయుధానుడు నేలమీద పడిపోయాడు చూడు! నీ శిష్యుణ్ని ఇప్పుడు నువ్వు కాపాడాలి’ అంటూ అర్జునుణ్ని పురిగొల్పాడు. సాత్యకి జుట్టు పట్టుకొని, కాలితో ఛాతీమీద తన్నుతూ భూరి శ్రవసుడు తన ఒర నుంచి ఖడ్గాన్ని తీశాడు. యుయుధా నుడి శిరస్సును కోద్దామని భూరిశ్రవసుడు ఉంకిస్తున్నాడు. కుమ్మరి చక్రం మీది కన్నంలో కర్రను పెట్టి కుమ్మరి చక్రాన్ని తిప్పినట్టు, సాత్యకి యూపకేతువు కత్తికి అందకుండా తిప్పుతూ ఉన్నాడు. ‘నువ్వు నీ శిష్యుణ్ని తక్షణమే కాపాడాలి’ అంటూ శ్రీకృష్ణుడు చెబుతూన్న మాటలను విని, అర్జునుడు గాండీవం మీద ఒక బాణాన్ని సంధించి, ఖడ్గంతో సహా భూరిశ్రవసుడి కుడిచేతిని కొట్టేశాడు. భూరిశ్రవసుడు అర్జునుణ్ని ఆడిపోసు కోవడం మొదలుపెట్టాడు; ‘మరొకడితో యుద్ధం చేస్తూన్నవాడి చేతిని కొట్టడం నీకు ఇంద్రుడు చెప్పాడో కిరాతుడైన రుద్రుడే చెప్పాడో సాక్షాత్తూ నీ గురువు ద్రోణుడే చెప్పాడో మొదటి గురువు కృపాచార్యుడే చెప్పాడో నాకు తెలియదు. అస్త్ర ధర్మాన్నెరి గిన నువ్వు నీతో యుద్ధం చేయని నా కుడిచేతిని కొట్టెయ్యడం ఏ రకమైన ధర్మం? వాసుదేవుడి మాట విని నువ్వు ఈ నికృష్టమైన పని చేశావని తెలిసిపోతోంది. నువ్వు కృష్ణ సఖుడివి కాకపోతే ఈ పని చేసేవాడివి కావు’ అని అర్జునుణ్ని తప్పు బట్టడమే కాకుండా కృష్ణుణ్ని కూడా దూషించాడు. ‘మాకోసం ప్రాణాలను ఒడ్డి యుద్ధం చేస్తూన్న యోద్ధను రక్షించడం నా ధర్మం. యుద్ధం చేసే వీరుడు కేవలం తననే రక్షించుకొంటూ కూర్చోకూడదు; తన పనుల్ని చేసి పెడుతూన్న వాళ్లను రక్షించడం కూడా రాజు కర్తవ్యమే. అలాగే వాళ్లు కూడా రాజును రక్షిస్తూ ఉండాలి. అయినా ఈ సంగ్రామం ఒక్కొక్కరూ ఒక్కొక్కరితో చేస్తున్నారని చెప్పడానికి కుదరదు. ఇదో సైన్య సాగరం. ఎవరెవర్ని దెబ్బతీస్తున్నారో చెప్పలేం. ఒక పక్షమూ వేరు పక్షమూ మధ్య జరుగుతూన్న యుద్ధమని చెప్పగలం తప్ప, ఒక ఫలానా యోద్ధా మరొక ఫలానా యోద్ధా మధ్య జరుగుతూన్న యుద్ధంగా దీన్ని చెప్పడం చెల్లదు. అదీగాక సాత్యకి అలసిపోయి ఉన్నాడు. అంచేతనే నీకు దొరికిపోయాడు. అటువంటి సమయంలో నాలాంటి బాధ్యత గల యోద్ధ అతన్ని కాపాడడంలో ఏ దోషమూ లేదు సరిగదా న్యాయమే ఉంది. అయినా మీరందరూ కలిసి అభిమన్యుణ్ని చంపలేదా? అప్పుడు ఈ నువ్వు చెప్పే న్యాయం ఎక్కడికి పోయింది?’ అంటూ దీటైన జవాబు చెప్పాడు అర్జునుడు. ఈ మాటలు విని, యూపకేతువు మారుమాటాడలేదు. అతను తన ఎడమచేత్తో బాణాలను కింద పరుచుకొని, ఆ శరాసనం మీద కూర్చొని ధ్యానమగ్నుడై ప్రాణాలను వదిలిపెట్టడానికి సంసిద్ధుడయ్యాడు. ‘నాకు ధర్మరాజూ భీముడూ నకుల సహ దేవులూ అంటే ఎంత ప్రేమో నువ్వన్నా అంతే ప్రేమ. నేనూ కృష్ణుడూ నువ్వు పుణ్యలోకాలకు పోవాలని ఆకాంక్షి స్తున్నాం’ అంటూ అర్జునుడు అనడంతో బాటు కృష్ణుడు కూడా ‘నాతో సమానంగా గరుడుడి మీద ఎక్కి సంచరించేవాడివి కా’ అంటూ దీవించాడు. ఇంతలో సాత్యకి లేచి, కృష్ణార్జునులు వద్దు వద్దు అని అంటూన్నా వినకుండా భూరిశ్రవసుడి శిరస్సును తన కత్తితో కోసేశాడు. దాన్ని తప్పుబట్టిన కౌరవులకు అర్జునుడన్నమాటే అప్పజెప్పాడు: ‘శస్త్రాలూ కత్తులూ ఏమీలేని విరథుడూ కవచ హీనుడూ అయిన అభిమన్యుణ్ని చంపడం ధర్మమైతే ఇదీ అంత ధర్మమే. నేను ఈ భూరిశ్రవుడి తల తీయడానికి నా ప్రతిజ్ఞే కారణం. ఎవరైతే నన్ను రణరంగంలో బతికుండ గానే కోపంతో కాలితో తంతాడో వాణ్ని, అతను ముని వ్రతుడైనా సరే, చంపుతా నని నా ప్రతిజ్ఞ. అది తీర్చుకోవడం సబబే గనక నేను ఈ పని చేశాను’ అని తన పనిని సమర్థించుకొన్నాడు సాత్యకి. కథాపరంగా చూస్తే, ఈ చంపడం ఒప్పా తప్పా అనే వాదాలు సహజంగానే పుడతాయి. కానీ శ్రద్ధను (సాత్యకిని) నాశనం చేద్దామని చూసే కర్మనీ కర్మ బంధాన్నీ (భూరిశ్రవసుణ్ని) మనో నిగ్రహంతో (అర్జునుడి ద్వారా) మట్టు బెట్టడం నూటికి నూరుపాళ్లూ ఒప్పే. అలాగే శ్రద్ధే సూటిగా కర్మబంధాన్ని కోసెయ్యడమూ బేషరతుగా ఒప్పే. ఇటువంటి సన్నివేశం ద్రోణవధ ఘట్టంలో కూడా ఉంది. ద్రోణుడు, కొడుకు చనిపోయాడని వినగానే, కుడిచేయి తెగిన భూరిశ్రవసుడి లాగ, అస్త్ర సన్యాసం చేసి, యోగధ్యానంలో కూర్చున్నాడు. అతన్ని చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్నుడు తటాలున అతని రథం ఎక్కి, ద్రోణుడి తలకాయను నిర్దాక్షిణ్యంగా కోసేశాడు. ఇదీ ఒప్పా తప్పా అనే మీమాంసకు తెరతీసింది. కానీ అలవాట్లను మప్పి నేర్పే వాసన అనే ఆచార్యుడి తలను ఆగమశక్తి తెగ్గోయడం అత్యంతమూ సబబే. అంచేతనే మనం ఈ భారతవ్యాసాల పరంపరలో అంతటా, మనుషుల వెనక ఉన్న భావాలనే గ్రహించాలని పదేపదే చెబుతూ వస్తున్నాం. - డా॥ముంజులూరి నరసింహారావు -
విరటుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 30 విరటుడు మత్స్యదేశానికి అధిపతి. పాండవులు పన్నెండేళ్ల వనవాసం పూర్తి చేసుకొని, ఎవరికీ తెలియకుండా గడప వలసిన పదమూడో ఏడాదిని మారు వేషాల్లోనూ మారుపేర్లతోనూ ఈ విరాట రాజు కొలువులో గడిపారు. భౌతికమైన కోరికలు అలవాట్లుగా స్థిరపడి, మనిషిని పూర్తిగా వశం చేసు కున్నప్పుడు, ఆ అలవాట్లనే దొంగరాజుల పాలన నుంచి తన శరీర రాజ్యాన్ని విడి పించడానికి, కనీసం పన్నెండేళ్లైనా వ్యవధి పడుతుంది సాధకుడికి. శారీరకమూ మాన సికమూ అయిన మార్పులకూ... మంచి అలవాట్లను అలవర్చుకుని, వాటిని దృఢంగా నిలుపుకోడానికీ అథమపక్షం ఒక పుష్కర సమయం కావాలి. పోయిన శరీర రాజ్యాన్ని తిరిగి పొందడానికి వివేక గుణబలగాలు, ఆ బలాన్ని సమాధి యోగానుభవంలో స్థిరమూ దృఢమూ చేసుకోవాలి. అలా వివేక బలాల్ని నిలుపు కొంటూ శరీరం గుండా, ఇంద్రియాల గుండా వాటిని రూఢీగా ప్రకాశింప జేయగలగాలి. అలా తమ సామర్థ్యాన్ని నిరూపించుకొన్న తరవాత, అవి శారీరక రాజ్యాన్ని తిరిగి తమ అధీనంలోకి తీసు కోవడానికి చేయవలసిన ఆధ్యాత్మిక యుద్ధానికి సిద్ధంగా ఉంటాయి. వన వాసాన్ని పాండవులు తమ ఆధ్యాత్మిక శక్తుల్ని దృఢపరుచుకోడానికి ఉపయో గించారు. పన్నెండేళ్లు వాళ్లు తమ తమ వివేక బలగాల్ని దిట్టపరుచుకొని, విరటుడి కొలువుకి పదమూడో ఏడాదిని అజ్ఞాతంగా గడపడానికి చేరుకున్నారు. ‘విరాట’ అనే మాటను ‘వి’, ‘రాజ్’ అనే రెండింటి అర్థాల్ని కలిపి రాబడతారు. ‘వి’ అనేది ఒక ఉపసర్గః. దానికి ‘విశేషంగానూ, వివిధంగానూ’ అనే అర్థాలున్నాయి. ‘రాజ్’ అంటే, పరిపాలించడమూ ప్రకాశించడమూ అనే అర్థాలు ఉన్నాయి. విశేషంగానూ వేరు తీరులోనూ పరిపాలించడమంటే, సామాన్యమైన మానుషచైతన్యంతో కాకుండా, సమాధి ధ్యానంలో అనుభవానికి వచ్చే దివ్య చైతన్యంతో పరిపాలించడమని అర్థం. అంచేతనే విరాటరాజు పరిపాలన మరోలా ఉంటుంది. కీచకుడనే సేనాపతి బావమరిది ద్వారానే అతని పాలన సాగుతూన్నట్టనిపిస్తుంది. త్రిగర్తరాజు సుశర్మని, సాల్వ దేశస్థుల్ని కీచకుడు తన బంధుసేనలతో ఆక్రమించి చాలాసార్లు సతాయించాడు. విరటుడి పరిపాలన ఇలా ఉండడం, ‘విరటుడు’ సమాధి తాలూకు తాత్కాలికమైన దివ్య యోగ స్థితులకు ప్రతీక అని చెప్పడానికి సరిపడుతుంది. సవికల్ప సమాధిలో సాధకుడు, విశేషంగా ఆత్మలో మునిగిపోయి, బయటి విషయాల్ని తెలియని స్థితిలో ఉంటాడు. విరాటరాజు కొలువులో మహారాజైన ధర్మరాజు తోటిరాజు దగ్గర సేవకుడిగా పనిచేయడానికి కంకుభట్టనే బ్రాహ్మ ణుడిగా మారువేషం వేసుకున్నాడు. ఆ రాజును సంతోషపెట్టడానికి అతనితో పాచికలాడుతూ ఉండేవాడు. భీముడు వలలుడనే వంటవాడిగా ఉంటూ, తన శారీరక బలాన్ని చూపిస్తూ మల్లయుద్ధాలు చేస్తూ రాజును సంతోషపెట్టేవాడు. ఊర్వశి ఇచ్చిన శాపాన్నే వరంగా మలచుకొని బృహన్నలై అర్జునుడు రాచకూతురు ఉత్తరకు నాట్యగాన పాఠాల్ని నేర్పుతూ కాలాన్ని నెట్టుకొచ్చాడు. నకుల సహ దేవులు గుర్రాల్నీ ఆవుల్నీ సాకుతూ పశువుల శాలల్లో గడిపారు. ఆ ఏడాది చివరికి వస్తూన్నప్పుడు కీచకుడి బెడద వచ్చిపడింది. విరాటరాజు కీచకుడికి ఎదురు పలకలేడన్న విషయం అప్పుడే మనకు బయటపడింది. సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని అమర్యాదగా వెంటాడుతూ సభకు వచ్చిన కీచకుణ్ని పల్లెత్తు మాటైనా అనలేకపోయాడు విరటుడు. పైగా, ‘మీ ఇద్దరిమధ్యా ఇంతకుముందు ఏ కీచులాటలు జరిగాయో నాకు తెలియవుగా’ అంటూ తప్పించుకోడానికే చూశాడు. కామం పెచ్చరిల్లినప్పుడు, దాన్ని బయట పడనీయకుండా అదుపులో ఉంచుతూ గుట్టుచప్పుడు గాకుండానే నాశనం చేయ డానికి ప్రాణక్రియల్ని ముమ్మరం చేయాలి. అదే విషయాన్ని భీముడనే ప్రాణ క్రియా శక్తి కీచకుడనే కామశక్తిని నాశనం చేసినట్టు కథారూపేణా చెబుతారు. ప్రతికూలమైన ఇంద్రియాల మొగ్గుదలలు నూరూ ఇంద్రియాల శక్తులు ఐదూ అదమలేని మనస్సు ఒకటీ వెరసి నూటారు. ఆ నూటారుగురే కీచకుడూ ఉపకీచకులూను. ఏడాది ఇక కొన్ని రోజుల్లో పూర్తి కాబోతూండగా దుర్యోధనుడికి కీచకవధ గురించి అనుమానం వేసింది. కానీ దాన్ని కర్ణుడూ దుశ్శాసనుడూ మాట్లాడిన తీరును బట్టి బలం లేకుండా చేశారు. ‘పాండవులు బాగా గుప్తమైన స్థానంలో దాక్కొనైనా ఉండవచ్చు; లేకపోతే, సముద్రానికి అవ తల ఒడ్డుకు వెళ్లైనా ఉంటారు. లేక వాళ్లను మహారణ్యంలో క్రూరమృగాలు గానీ కొండచిలువలు గానీ మింగేసి ఉండవచ్చు. అదీ కాకపోతే విషమాతి విషమ పరిస్థితుల్లో పడి పూర్తిగా నాశనమైపోయి ఉంటారు’ అంటూ దుర్యోధనుడి ముందు తన పాప భావాల పర్యవసానాన్ని ప్రకటించాడు దుశ్శాసనుడు. భీష్ముడు వాళ్లను వెదకాలంటే ఎలాగో కొన్ని లక్షణాల్ని సూచించాడు. ధర్మరాజు ఉన్నచోట గోవులు ఎక్కువగా ఉంటాయి; అవి దుర్బలంగా ఉండనే ఉండవు; మంచి రస వంతమైన పాలూ పెరుగూ నెయ్యీ అనే హోమద్రవ్యాలు పుష్కలంగా దొరుకు తాయి ఆ చోట. దృశ్యాలన్నీ ప్రసన్నంగా ఉంటాయి. అతనున్నచోట ప్రజలు సంప్రీతిమంతులై ఉంటారు. ఈ లక్షణాలన్నీ చారుల కథనాన్ని బట్టి మత్స్య దేశంలో అవుపించాయి. అది అదనుగా తీసుకొని, సభలో ఉన్న సుశర్మ కీచకుడి మీద తనకున్న కోపాన్ని తీర్చుకోడానికి వేళ దగ్గర పడిందని అనుకుంటూ, దుర్యోధనుణ్ని మత్స్యదేశం మీద దండెత్తడానికి పురి గొలిపాడు. ‘ఇప్పుడు కీచకుడు లేడు గనక, విరటుడు నిరాశ్రయుడు; దర్పం కాస్తా పూర్తిగా అణిగిపోయి ఉంటుంది; అప్పటి ఉత్సాహమూ ఉండవు. ఆ దేశంలో చాలా గోసముదాయముంది. ఆ పశుసంపదను మీరూ మేమూ కలిసి హరిద్దాం. మేము ఒకవైపు నుంచీ మీరు మరొకవైపు నుంచీ దాడిచేసి ఉక్కిరిబిక్కిరి చేస్తే వాళ్లను సులువుగానే వశపరచుకోవచ్చు’ అని దుర్యోధనుడి లోపల ఏర్పడుతూన్న ఉద్దేశానికి ఆజ్యం పోశాడు సుశర్మ. దానికి తోడు త్రిగర్తుడి మాటలకు కర్ణుడు ‘సై’ అన్నాడు. ‘అర్థమూ బలమూ పౌరుషమూ హీనమైపోయి మూడు వంతులు నష్టమై పోయి ఉన్న పాండవులతో మనకేం పని? విరాటరాజును ముట్టడించి అక్కడి గో సంపదను మన హస్తగతం చేసుకోవ డంలో నిమగ్నమవుదాం’ అని కర్ణుడు కూడా అనడంతో దుర్యోధనుడు మత్స్య దేశాన్ని ముట్టడించడానికి సైన్యాన్ని సిద్ధం చేశాడు. ముందు రోజు సుశర్మను దక్షిణం వైపు నుంచి ముట్టడించమని పురమా యించి, ఆ మీద భీష్మద్రోణకర్ణాదులతో కలిసి తాము ఉత్తరం వైపు నుంచి దాడి చెయ్యాలని పథకం వేశారు. ఈ ప్రణాళిక సిద్ధమయ్యేసరికి పద మూడో ఏడాది నిజానికి పూర్తైయింది. సుశర్మ దక్షిణ గోగ్రహణానికి తన సేనల్ని మత్స్యదేశం వైపుకు నడిపాడు. ఇది తెలియగానే విరటుడు యుద్ధానికి తన పెద్దకొడుకు శంఖుణ్నీ తమ్ముళ్లు శతానీక మదిరాక్షుల్నీ తీసుకొని వెళ్తూ, కంకుభట్టునీ వలులుణ్నీ దామగ్రంథినీ తంతిపాలుణ్నీ కూడా అనురూపమైన కవచాలు ధరించి యుద్ధం చెయ్యడానికి రమ్మనమని ఆహ్వా నించాడు. ఎప్పుడైనా సరే, తామున్న దేశానికి కష్టం వచ్చినప్పుడు, తాము కూడా యథాశక్తి సాయం చేయడం విధా యకంగా నమ్మినవాళ్లు గనక వెంటనే బయలుదేరారు. అయితే, ఆ యుద్ధంలో సుశర్మ విరటుణ్ని బందీగా పట్టుకొని తీసు కొనిపోతూ ఉంటే, యుధిష్ఠిరుడు భీముణ్ని పంపి విరటుణ్ని విడిపించేలా చేశాడు. సుశర్మను ఆ విధంగా ఓడించి, యుధిష్ఠిరుడి సలహా ప్రకారం చంప కుండానే వదిలేశారు. త్రిగర్తమంటే మూడు రథాలని అర్థం. మూడు రథాలూ మనిషికుండే మూడు శరీరాలు: స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఈ మూడింటి నుంచీ విడివడితేనే ఏ సాధకుడికైనా పూర్తి ముక్తి దొరుకుతుంది. వాటికి సాధకుడు లొంగిపోవడమే విరటుడు త్రిగర్తుడైన సుశర్మకు పట్టుబడడంలోని ఆంతర్యం. అయితే, భీముడనే ప్రాణాయామ శక్తి ఆ మూడు శరీరాల పట్టు నుంచీ సాధ కుణ్ని విడిపించగలుగుతుంది. విరటుడు ఆ నలుగురు పాండవుల పరాక్రమంతోనూ ముక్తుడు కావడంతో చాలా సంతోషిస్తూ వాళ్లను పదేపదే సమ్మానించాడు. ఆ రాత్రికి శిబిరంలోనే ఉంటూ రాజపట్ట ణానికి రాజుగారి విజయవార్తను దూతల ద్వారా చేరవేశారు. ప్రణాళిక ప్రకారం అటు విరటుడు త్రిగర్తుడితో యుద్ధానికి వెళ్లగానే, ఇటు దుర్యోధనుడు ఉత్తరం వైపు నుంచి మత్స్యదేశాన్ని ముట్టడించాడు. భీష్ముడూ ద్రోణుడూ కర్ణుడూ కృపుడూ అశ్వత్థామా శకునీ దుశ్శాసనుడూ వివింశతీ వికర్ణుడూ చిత్రసేనుడూ దుర్ముఖుడూ దుశ్శలుడూ వగైరా మహారథులు చాలా మందితో కౌరవులు ముమ్మరంగా దాడి చేశారు. ఆ సమయంలో రాజధానిలో ఉన్న వాడు ఉత్తరుడనే విరాటరాజు రెండో కొడుకు మాత్రమే. అతనికి సైరంధ్రి చెప్పగా బృహన్నలను సారథిగా చేసుకొని యుద్ధానికి బయలుదేరడానికి సాహసం చేశాడు. తీరా సముద్రంలా ఉన్న విశాల మైన కౌరవ సైన్యాన్ని చూసి బెంబేలుపడి పారిపోతూ ఉంటే, అతన్ని ఆపి, తానే రథికుడై బృహన్నల వాళ్లతో భీకరంగా పోరాడాడు. చివరికి సమ్మోహనాస్త్రంతో ఆ హేమాహేమీలనందర్నీ మూర్ఛలో మునిగి పోయేలాగ చేసి, గోసంపత్తిని వెనక్కి మళ్లించాడు అర్జునుడు. విరటుడు ఆ విజయం తన కొడుకుదే అని ఉబ్బిపోయాడు. ఆ సంతోషంలో కంకుభట్టుతో పందెం వేస్తూ పాచికలాటకు దిగాడు. తన కొడుకు గురించి చెబు తూంటే, ధర్మరాజు ‘బృహన్నల సారథిగా ఉంటే వాళ్లను గెలవడం ఏమంత గొప్పేమీ కాదు’ అని పదే పదే బృహన్నల గొప్ప తనమే చెబుతూ ఉంటే, భరించలేక విరటుడు ధర్మరాజు ముఖమ్మీదకు పాచికలను గట్టిగా విసిరాడు. ధర్మరాజుకు దెబ్బతగిలి ముక్కుల్లోంచి రక్తం కారబో తూంటే, దాన్ని చేతులతో ఆపుతూ పక్కనే ఉన్న సైరంధ్రి వైపు చూశాడు. ఆవిడ తటా లున ఒక గిన్నెపట్టి ఆ రక్తాన్ని నేలమీద పడకుండా చేసింది. ఆ రక్తమే గనక నేల మీద పడితే, రాష్ట్రంతో సహా విరటుడు నాశనమైపోయేవాడు. అప్పుడే ఉత్తరుడూ బృహన్నలా యుద్ధభూమి నుంచి తిరిగి వచ్చారు. ఉత్తరుడు వస్తూనే ‘ఎవరీ పాపాన్ని చేశారు?’ అంటూ ధర్మరాజువైపుకు వెళ్లాడు. ‘నేనే’ అని తండ్రి చెప్పగా ‘ఎంత తప్పు చేశారు! నిజానికి ఈ యుద్ధమంతా బృహన్నలే చేశాడు. అతనెవరో కాదు... సాక్షాత్తూ అర్జునుడు’ అంటూ నిజం చెప్పాడు. తన తప్పును సరిదిద్దు కోడానికి అర్జునుడికి తన కూతురునిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు విరటుడు. ‘శిష్యురాలు కూతురుతో సమానం. కోడలిగా చేసు కుంటాను. ఉత్తరను మా అబ్బాయి అభి మన్యుడికిచ్చి పెళ్లి చేయండి’ అని ఒడం బరిచాడు అర్జునుడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
కీచకుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 29 కీచకుడు విరాటరాజు భార్య సుధేష్ణకు తమ్ముడు. ఆ దేశంలో బావమరిది కీచకుడిదే పైచేయి. కీచకుడు సూత పుత్రుడు. ఇతను మొదట్లో విరాటరాజుకి రథసారథే. ఆ మీద తన బలప్రాబల్యం కొద్దీ సేనాపతేగాదు, పరోక్షంగా మత్స్య రాజ్యాన్ని ఏలేవాడిగా కూడా తనను తాను అనుకునేవాడు. విరాటరాజు కూడా అతని దుందుడుకుతనాన్ని గానీ విర్రవీగుణ్ని గానీ తప్పు పట్టేవాడు కాడు. ‘చీకయతే’ అనే క్రియారూపానికి సహించడం, ఓర్పుగా ఉండడం, అదు పులో ఉండడం, గెలవడం, ఓడించడం మొదలైన అర్థాలున్నాయి. దీన్ని తిరగేస్తే, అంటే, ‘క’కారానికున్న అకారాన్ని ‘చ’కారానికీ ‘చ’కారానికున్న ‘ఈ’కారాన్ని ‘క’కారానికీ బదిలీ చేసి, ఆ రెండక్షరాల్నీ తిరగేస్తే, ‘కీచయతే’ అనే రూపమేర్పడు తుంది. తిరగదిప్పడం వల్ల, సహించక పోవడమూ అదుపులో పెట్టుకోక పోవ డమూ గెలవలేకపోవడమూ ఓడిపోవ డమూ అనే విప రీతార్థాలు ఈ ‘కీచక’ శబ్దానికి సంక్రమిస్తాయి. అతడూ అటు వంటివాడే. ఆవేశం వస్తే అదుపులో ఉండదు; పైగా అతడు అమర్యాదకమైన కామావేశానికి పెట్టింది పేరు. దాన్ని ఓర్చుకోలేకనే ఇతను తన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. కీచకమంటే వెదురుబొంగని కూడా అర్థం ఉంది. వెదురు గడకి కణుపులు ఉంటాయి. అలాగ కణుపులతో ఉండేది మన శరీరంలోని వెన్నుదండం. వెన్ను దండం కింది భాగంలో ఉండే కుండలినీ శక్తిని లైంగిక నాడుల్నుంచి తప్పించి, పైకి తలతట్టుగా నడిపిస్తే మన చైతన్యం విస్త రించగలదు. కీచకుడు ప్రాణశక్తిని ఇంద్రి యాల ద్వారా అడ్డూ అదుపూ లేకుండా బయటికి పోనిస్తూ, ఇప్పటికే దిగజారి పోయి ఉన్న మానుష చైతన్యాన్ని ఇంకా నీచాతి నీచంగా చేస్తూ ప్రవర్తిస్తాడు. వనవాసం పన్నెండేళ్లూ గడిచిన మీదట, పదమూడో ఏడాదిని, అంటే, ఎవరికీ తెలియకుండా ఉండవలసిన అజ్ఞాతవాసాన్ని పాండవులు విరాటుడి కొలువులో గడిపారు. ధర్మరాజు కంకు భట్టుగా రాజుగారికి సహాయకుడు అయ్యాడు; భీముడు వలలుడై వంట ఇంటిని చక్కబెట్టేవాడు; అర్జునుడు ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఒక విధంగా వరంగా వాడుకుంటూ పేడిగా అయి బృహన్నల రూపంలో విరాటరాజు కూతురు ఉత్తరకి సంగీత నాట్యాలను నేర్పేవాడు; నకులుడు గ్రంథికుడనే పేరుతో గుర్రాల బాగోగుల్ని చూసేవాడు; సహదేవుడు తంతిపాలుడనే పేరుతో ఆలకొట్టాల మంచీ చెడుల్ని చూసే గోపాలుడయ్యాడు; ద్రౌపది కేశ శృంగా రాన్నీ శరీరాలకు పూసుకొనే లేపనాల్ని తయారుచేసే నేర్పరిగా మాలిని అనే పేరుతో సైరంధ్రిగా సుదేష్ణ దగ్గర చేరింది. అజ్ఞాతవాసం పూర్తి కావడానికి మరి కొన్ని రోజులే మిగిలిన తరుణంలో కీచకుడు విరాట నగరంలో ఊడి పడ్డాడు. ద్రౌపదిని చూశాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ద్రౌపదితో మాట కలిపాడు: ‘నా భార్యల నందర్నీ నీకోసం వదిలేస్తాను. నీకు దాసుణ్ణవుతాను’ అంటూ తన కోరికను బహిరంగపరిచాడు. ‘సూత పుత్రుడా! నా జాతి చాలా హీనమైంది. నాతో నీకు పొత్తు తగదు. అందులోనూ పరుడి భార్యను కోరుకోవడం కూడని పని. దానివల్ల నీకు అపకీర్తి రావడమే గాదు, భయం కూడా పట్టుకుంటుంది’ అని నచ్చజెప్పి తప్పించుకోబోయింది. కానీ కామార్తుడికి భయమెక్కడుంటుంది? ‘భూమ్మీద నాతో సమానుడైన సొగసరి గానీ మగసిరి గలవాడు గానీ లేడు. నా బలమూ అనితరమైనది. అయినా ఈ దాసీత్వం నీలాంటి మహా అందగత్తెకు తగదు. నాకు స్వామినివై అందరిమీదా అధికారాన్ని ప్రదర్శించదగినదానివి’ అంటూ వాగుతూన్న అతగాడితో ద్రౌపది ‘నన్ను ఐదుగురు భీమగంధర్వులు కాపా డుతూ ఉంటారు. వాళ్లు నా భర్తలు. నిన్ను చంపేస్తారు’ అంటుంది. అయినా ఆమెను వశం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతూ అక్క దగ్గరికి చేరాడు కీచకుడు: ‘నువ్వేదో ఒక ఉపాయాన్ని పన్ని సైరంధ్రిని నా దగ్గరికి పంపాలి. లేకపోతే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి’ అంటూ మొరపెట్టుకున్నాడు. సుదేష్ణ మెత్తబడి, ‘సరే, నీ దగ్గరికి సురను తెమ్మని పంపుతాను. అప్పుడు ఒప్పిం చుకో’ అని అనునయించి పంపింది. సుధేష్ణ సైరంధ్రిని కీచకుడి విడిదికి పోయి మదిరను తెమ్మంది. ‘నేను వెళ్లను. ఆ సిగ్గులేనివాడు సతాయిస్తాడు. ఎంత మందో సేవకులుండగా నన్నే ఎందుకని పంపించడం?’ అంది ద్రౌపది. తమ్ముడి ముచ్చటను తీర్చడానికి రాజీపడిన ఆ అక్క ‘నేను పంపించానంటే హింసించడు’ వెళ్లి రమ్మనమని బలవంతపెట్టింది. వెళ్లక తప్పలేదు ద్రౌపదికి. వెళ్తూ కర్మసాక్షి అయిన సూర్యుణ్ని ధ్యానించి, రక్షించ మంటూ మొరపెట్టుకుంది. అక్షయ పాత్ర నిచ్చి అడవిలో ఉన్నన్నాళ్లూ కాపాడిన సూర్యుడు, ఇప్పుడావిడ శీలాన్ని కాపాడ్డా నికి ఒక రాక్షసుణ్ని నియోగించాడు. భయపడుతూన్న లేడిలాగ వెళ్లింది. వెళ్లడమే తడవు కీచకుడు వెంటబడ్డాడు. ఆవిడ కుడిచేతిని పట్టుకున్నాడు. ఆవిడ చేతిని విదిలించేసరికి, పెచైరగు పట్టు కున్నాడు. అప్పుడావిడ రెండు చేతులతో ఒక తోపు తోసేసరికి, వేళ్లూడిన చెట్టులాగ కింద పడిపోయాడు. అదే అదనని ఆవిడ పరిగెత్తుకుంటూ రాజసభలోకి వచ్చింది, తనకు అండగా విరాటరాజూ ధర్మరాజూ ఉంటారనే గొప్ప ధైర్యంతో. కానీ అక్కడా చుక్కే ఎదురయ్యింది. కీచకుడు రాజంటే ఏ ఖాతరూ లేనివాడు గనక, సభలోకి దూసుకొని వస్తూ ద్రౌపది కేశపాశాన్ని దుశ్శాసనుడి మాదిరిగానే పట్టుకున్నాడు; రాజు ఎదురుగానే ఆవిణ్ని నేలమీద పడేసి కాలితో తన్నాడు. ఆ క్షణంలో సూర్యుడు పంపిన రాక్షసుడు కీచకుణ్ని పట్టుకొని గాలివేగంతో దూరంగా నెట్టాడు. దానితో కీచకుడు బోర్లా పడ్డాడు. ఇదంతా రాజూ ధర్మరాజూ కళ్లప్పగించి చూస్తూనే ఉన్నారు. అప్పుడక్కడికి వచ్చిన భీముడు పళ్లు కొరికాడు. ఉపద్రవం ముంచుకొని రాబోతోందని పసిగట్టిన ధర్మరాజు తన బొటనవేలితో భీముడి బొటనవేలిని నొక్కి, తమ అజ్ఞాతవాసాన్ని కాపాడుకోవాలని మౌనంగానే హెచ్చరించాడు. చెట్టునొక దాన్ని పీకి కీచకుడి పీచమడుద్దామని చూస్తున్న భీముడితో, ‘వలలుడా! ఎండిన వంట చెరకు కోసం చూస్తున్నావా? బయట చెట్ల నుంచి కొమ్మల్ని కోసుకో’ అంటూ ధర్మరాజు ‘ఇక్కడగాదు, బయట ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా వాడి పనిపట్టమ’ని సూచించాడు. ద్రౌపది లేచి, తన ఆకారాన్ని రక్షించు కుంటూ, కళ్లు చింతనిప్పుల్లాగ మండు తూండగా, ‘సిగ్గూ ఎగ్గూ లేని ఈ సూతుడు నన్ను ఇలాగ వేధిస్తూంటే, నా గంధర్వ పతులు అతి బలవంతులయ్యుండి కూడా రక్షించడానికి రావడం లేదు. రాజు కూడా కిమ్మనడం లేదు. అబలనైన నన్ను రక్షించ డానికి ముందుకు రావడం లేదు. కీచకు డెంత అధర్మపరుడో మత్స్యరాజూ అంత అధర్మపరుడిలాగే ఉన్నాడు’ అనేసరికి విరటుడు, ‘మీ ఇద్దరిమధ్యా ఇంతకు మునుపు ఏ తకరారు జరిగిందో తెలియ నప్పుడు నేనేం చేయగలను?’ అంటూ తప్పించుకోడానికే చూశాడు. అప్పుడు ధర్మరాజు కలగజేసుకుంటూ, ‘ఈ సమయం కోపకాలం కాదనుకొని నీ గంధర్వపతులు రావటం లేదేమో! నువ్వు అంతఃపురానికి వెళ్లిపో! నీకు విప్రియం చేసినవాడికి అప్రియం చేయడానికి నీ పతులు తరవాత వస్తారేమోలే’ అంటూ ఆవిణ్ని వెళ్లిపోయేలాగ చేశాడు. అంతఃపురంలోకి వెళ్లి సుధేష్టతో జరిగిన విషయాన్నంతనీ పూసగుచ్చినట్టు చెప్పింది ద్రౌపది. ఆవిడ తన దురుద్దేశాన్ని బయటపడనీయకుండా ‘వాడు చావును కోరుకుంటున్నాడేమో’ అని ఊరుకొంది. నిరాశతో అప్పటికి ఊరుకొని, రాత్రిపూట వంట ఇంట్లో నిద్రపోతూన్న భీమసేనుణ్ని ‘ఇంత జరిగినా నీకు కునుకు ఎలాగ పట్టింది’ అంటూ లేవదీసింది ద్రౌపది. ఇద్దరూ కీచకుడి చావుకి ఒక పథకాన్ని వేశారు. ‘ఈ దుఃఖాన్నీ శోకాన్నీ పక్కకు పెట్టి నువ్వు రేపు రాత్రికి వాడు నర్తన శాలకు రహస్యంగా వచ్చేలాగ చేశావంటే నేను వాడి భరతం పడతాను’ అని భీముడు పథకాన్ని టూకీగా చెప్పాడు. ‘‘నా గంధర్వపతులకు ఈ మన ప్రసంగం వల్ల అపవాదం వచ్చి పడు తుంది. అంచేత అతి రహస్యంగా రాత్రి పూట నర్తనశాలకు వచ్చావంటే నేను నీ అధీనమవుతాను’’ అని ద్రౌపది కీచకుణ్ని నమ్మించింది. వాడు సంకేత స్థలానికి వస్తున్నాడన్న సంగతి భీముడికి చేరవేసి, అతను రాత్రికి అక్కడికి వెళ్లి సిద్ధంగా ఉండేలా ఏర్పాటు చేసింది. ఎప్పుడు రాత్రి వస్తుందా అని ఉవ్విళ్లూరుతూ కీచకుడు భీముడి మృత్యుకౌగిట్లోకి వచ్చి చిక్కు కున్నాడు. ఏ అరుపులూ బొబ్బలూ విని పించకుండా కీచకుణ్ని మాంసమ్ముద్దలాగ నలిపేసి, గుట్టు చప్పుడు కాకుండా తన వంట ఇంటికి వెళ్లిపోయాడు. కీచకుడి సోదరులైన ఉపకీచకులు కీచకుణ్ని దహన సంస్కారం కోసం తీసు కొని వెళ్తూండగా, ఆ సన్నివేశాన్ని కళ్లారా చూద్దామని అక్కడికి వచ్చిన ద్రౌపదిని చూసి, ‘ఈవిడ వల్లనే మన అన్నయ్య నికృష్టమైన చావు చచ్చిపోయాడ’ని రెచ్చి పోయి, ఆవిణ్ని కీచకుణ్ని తీసుకొని వెళ్తూన్న బండమీద ఒక రాటకు కట్టి తీసుకుపోవడం మొదలుపెట్టారు. రాజు వాళ్ల బలం ఎరిగినవాడు గనక కిక్కురు మనకుండా ఉన్నాడు. ‘ఉపకీచకులు శ్మశా నానికి లాక్కుపోతున్నార’ంటూ ద్రౌపది గట్టిగా ఏడ్చింది. ఆ ఏడుపును విని, నిద్ర పోతూన్న భీముడు గభాలున లేచి ‘సైరంధ్రీ! నేను నీ మాట విన్నాను. ఈ సూతపుత్రుల భయం నీకేమీ లేదు’ అంటూ అభయాన్నిచ్చి, వేషం మార్చు కొని, రాజద్వారం గుండా వెళ్లకుండా, గోడ దూకి బయటనున్న ఒక చెట్టునెక్కి, వాళ్లు ఎటు వెళ్తున్నారో చూశాడు. చితి దగ్గరికి పోయి, ఆ దగ్గర్లో తాడిచెట్టులాగ బాగా పొడుగ్గా ఉన్న ఒక గుబురుచెట్టును ఊడబెరికి, భుజంమీద పెట్టుకొని భీముడు రావడాన్ని ఉపకీచకులు చూశారు. వాళ్ల పై ప్రాణాలు పైనే పోయాయి. ‘ బాబోయ్! ఆ గంధర్వుడు మళ్లీ వస్తున్నాడు’ అంటూ ఆమెను వదిలి నగరం వైపు పారిపోవడం మొదలు పెట్టారు. భీముడు యముడి మాదిరి మీదపడి ఆ నూటైదు మందినీ పశువుల్ని వేటాడి చంపినట్టు చంపేశాడు. ‘సైరంధ్రీ! నిన్ను కష్టపెట్టినవాళ్లెవరైనా ఇలాగే చచ్చిపోతారు. నువ్వే భయం లేకుండా నగరానికి నడు!’ అని ద్రౌపదికి చెప్పి, భీముడు మరో దోవ మీదుగా వంట ఇంటికి వెళ్లిపోయాడు. విరటుడి మాటగా సుదేష్ణాదేవి ‘సైరంధ్రీ! గంధర్వులు చేసిన పరాభవం నుంచి రాజుగారు బాగా భయపడు తున్నాడు. నువ్వేమో అతి అందగత్తెవి; మగాళ్లకు విషయ భోగమంటే చెప్పరానంత ఇష్టం; గంధర్వులా అతి కోపిష్ఠులు. అంచేత నువ్వు ఇక్కణ్నించి నీకు ఇష్టమైన చోటికి వెళ్లు’ అంటూ భయపడుతూనే అంది. ‘రాజుగారు మరొక్క పదమూడు రోజులు ఓపిక పడితే చాలు గంధర్వులు వచ్చి నన్ను తీసుకొని వెళ్తారు’ అంటూ ద్రౌపది సర్దిచెప్పింది. - డా॥ముంజులూరి నరసింహారావు -
తండ్రీ... వారిని క్షమించు!
క్రీస్తు మనకు అనుగ్రహించిన మహావాక్యం అతను సిలువ ఎక్కబోతూ, తనను అసూయకొద్దీ చంపజూసిన వాళ్ల గురించి అన్న వాక్యం: ‘తండ్రీ! వాళ్లను క్షమించు! ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియటం లేదు’ అని. చరిత్ర చాలా గడ్డు సమయంలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తమూ ఆధ్యాత్మికంగా పూర్తిగా కుంగిపోయి ఉన్నప్పుడు దాన్ని పునరుజ్జీవింప జేయడానికి క్రీస్తు జన్మించాడు. ఆ మహాత్ముడి సందేశం- ‘మీరందరూ భగవదంశలే’ గొప్ప సందేశం. సెయింట్ జాన్ ఆ క్రీస్తు వచనాన్ని విపులీకరించాడు: ‘ఎంతమంది అతన్ని (అంటే, యేసులోనూ సృష్టి మొత్తంలోనూ ప్రకటమైన కూటస్థ చైతన్యాన్ని) అర్థం చేసుకొని గ్రహించగలుగుతారో వాళ్లందరికీ భగవంతుడి పుత్రుడిలాగా కావడానికి కావలసిన శక్తినిచ్చాడు ఆయన’ (జాన్ 1-12) అని. ఇదో మహావాక్యం. గుండెలో నిర్మలత్వం ఉండి మనసా వాచా కర్మణా శ్రద్ధాభక్తుల్ని పూర్తిగా కనబరచగలిగితే చాలు ఆ మనిషి జాతి ఏదైనాసరే అతని చర్మం రంగు ఏదైనా సరే అతను భగవంతుణ్ణి తనలోకి పిలిచి పరిపూర్ణ తృప్తిని పొందగలుగుతారు. ‘అన్నిదేశాల ప్రజల్నీ (భగవంతుడు) ఒకే రక్తం ఉన్నవాళ్లుగా తయారు చేశాడు’ (అపొ.కా. 17-26) అనేదే క్రీస్తుకు ఉత్తేజాన్నిచ్చిన సంగతి. చర్మాల రంగుల్నిబట్టి మనుషుల్ని విభజించుకొని అసహ్యించుకోవడంగానీ ప్రేమించడం గానీ మనుషుల అజ్ఞానానికి పరాకాష్ఠగానే చెప్పాలి. రంగు చర్మానికే పరిమితం; అంతకన్నా లోతుకు అది వెళ్లదు. రంగును బట్టి ఎవరూ ఎవర్నీ వేరుచేయాల్సిన మూర్ఖత్వంగానీ రాగద్వేషాల్ని చూపించే వెర్రితనాన్ని గానీ బహిర్గతం చేయగూడదు. అదీగాక, నువ్వు ఎవర్ని ద్వేషిస్తావో ఏ జాతిని అసహ్యించుకుంటావో ఏ మతాన్ని ఏవగించుకుంటావో, తిరిగి ఆ జాతిలోనూ ఆ మతంలోనూ ఆ తీరులోనూ పుట్టవలసి వస్తుంది. అది తప్పనిసరి. ఎందుకంటే, చిట్టచివరికి మనకు అన్నిరకాల పక్షపాతాలూ పోయి, మనమందరమూ నిర్మలులమై, భగవంతుడి రెక్కలమాటున ఉండవలసినవాళ్లమే అని గుర్తు పెట్టుకోవాలి. క్రీస్తు మనకు అనుగ్రహించిన మహావాక్యం అతను సిలువ ఎక్కబోతూ, తనను అసూయకొద్దీ చంపజూసిన వాళ్ల గురించి అన్న వాక్యం: ‘తండ్రీ! వాళ్లను క్షమించు! ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియటం లేదు’ అని. తనను చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్లపట్ల మనకుండవలసిన భావమేమిటో ఏది ఎదుటివాళ్ల క్రూరహృదయాన్ని కూడా మెత్తబరిచి వాళ్లకే తప్పు జేశామన్న పశ్చాత్తాపాన్ని కలిగిస్తుందో ఈ మహావాక్యం చెబుతుంది. మనం చిన్నప్పుడు నీతిపద్యాల్లో ఈ గొప్ప క్షమాగుణం గురించే చదువుకున్నాం. అందుచేతనే యేసుక్రీస్తు మన స్వధర్మాన్ని, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టే నిర్వచించాడు: ‘మనుషులందరూ ఈ డబ్బూదస్కాలకోసమే వెంపర్లాడుతూ ఉంటారు. ఆ తండ్రికి ఇవి మీకు అవసరమని తెలుసు. ఏం తినాలి? ఏం తాగాలి? ఎలాగ ఈ శరీరాన్ని బట్టలతో చుట్టుబెట్టుకోవాలి? అనేవన్నీ అవసరమైన ఆలోచనలా అసలు? నేలను గడ్డి అనే పచ్చటిగుడ్డలతో భగవంతుడు కప్పుతూనే ఉన్నాడు. ఇవాళ ఉన్న ఆ గడ్డిని ఎండగానే కుంపట్లో వేస్తూనే ఉంటాం. నేలనే ఇంత పట్టించుకొన్నవాడు, మనిషిని మాత్రం ఎందకు పట్టించుకోడు? అంచేత వీటికన్నా మీరు దేవుని రాజ్యాన్ని ముందుగా కోరుకోండి. చేరడానికి ఉపక్రమించండి. అప్పుడు ఇవన్నీ మీకు (వాటికవే) వచ్చి చేరతాయి’ (మత్తయి 6-33). ‘డబ్బునీ దేవుణ్ణీ నువ్వు (ఒకేవేళ) సేవించలేవు’ (మత్తయి 6-24) అని ఎప్పుడూ గుర్తుపెట్టుకో! క్రీస్తు ప్రవచనం- ‘నిన్ను నువ్వెలాగ ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అలాగే ప్రేమించాలి’ అనేది గుర్తు పెట్టుకోవాలి. దాని అర్థం బహుదృశ్యరూపాల్లో ఎదురుగా అగుపిస్తున్న దేవుణ్ణి ప్రేమించమనే. క్రీస్తు చెప్పిన దానిని మనమంద రమూ నేర్చుకోవాలి. గాలిలో ఎగిరే పక్షులకు తిండిని పెట్టేవాడు మనకూ పెట్టకమానడన్న దృఢమైన విశ్వాసం ఉండాలి. ఆవగింజంతైనా విశ్వాసం లేకుండా, వట్టి కబుర్లు చెబితే క్రీస్తు సంతోషిస్తాడనుకోవడం మనను మనం మోసగించుకోవడమే. - డా॥ముంజులూరి నరసింహారావు -
జరాసంధుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 28 జరాసంధుడు రెండు సగాలుగా పుట్టిన రాజకుమారుడు. ఆ సగాలను ‘జరా’ అనే రాక్షసి సంధించగా అతను జరాసంధు డయ్యాడు. ‘జరా’ అంటే, ముసలితనం. అది మార్పులకు పరాకాష్ఠ. జరాసంధుడి తండ్రి మగధనేలిన బృహద్రథుడు. అతనికి ఇద్దరు భార్యలు. వాళ్లు కాశిరాజుకి పుట్టిన కవల కూతుళ్లు. ‘మిమ్మల్నిద్దర్నీ ఒకే తీరుగా ప్రేమిస్తాను’ అని బృహద్రథుడు భార్యలిద్దరికీ మాట ఇచ్చాడు. అయితే ఎన్ని మంగళ కార్యాలు, హోమాలు చేసినా అతనికి పిల్లలు పుట్టలేదు. ఒకసారి చండకౌశికుడనే ముని వీరి రాజ్యానికి వచ్చాడు. పుత్రుణ్ని ప్రసా దించమని రాజు ఆ మునిని ప్రార్థించాడు. ముని ధ్యానంలో కూర్చున్నాడు. కొంత సేపటికి, ఓ మామిడి పండు ముని ఒడిలోకి వచ్చి పడింది. దాన్ని మంత్రించి రాజు చేతికిచ్చాడు. అతడా పండును తీసుకువెళ్లి పెళ్లాల చేతిలో పెట్టాడు. భార్యల్ని సమానంగా చూస్తానన్న మాటను బట్టి వాళ్లు ఆ పండును రెండు సగాలు చేసి తిన్నారు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టలేదు; రెండు శరీర శకలాలు పుట్టాయి. అవి ముక్కలే అయినా బతికే ఉన్నాయి. తల్లులు తల్లడిల్లిపోయారు. దాదుల్ని పిలిచి బయట పడేసి రమ్మని పంపించారు. రోడ్ల కూడలిలో విసిరేసిన ఆ ముక్కల్ని ‘జరా’ అనే రాక్షసి తిందామనుకుని రెండిటినీ దగ్గరికి చేర్చింది. అప్పుడు ఆ రెండూ కలసి ఒక వీర కుమారుడిగా తయారయ్యాయి. ఆ రాక్షసి క్రూరమైనది కాదు. ఆ ఊళ్లో ఆవిడను గృహేశ్వరిగా చెప్పుకొనేవాళ్లు. ఆమె ఏమైనా తింటే, మంగళమవుతుందని ఆ ఊరివాళ్ల భావన. పిల్లవాడి కోసం అర్రులు చాచి చూస్తున్న రాజు కొడుకును చంపకూడదని అనుకుంది ఆ రాక్షసి. ఒక మానుష స్త్రీ రూపాన్ని దాల్చి, ఆ అబ్బాయిని రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్లింది. రాజు కృతజ్ఞతతో ఆ కుర్రాడికి ‘జరాసంధుడు’ అని పేరు పెట్టుకున్నాడు. జరాసంధుడు ఎంత బలసంపన్ను డైనా, ఎదురుపడిన అందరి తేజస్సునూ హరించేవాడైనా, ఏ శస్త్రాలతోనూ చావని హంసడింభకులనే వీరులు అతని సహా యకులైనా, కంసుడంతటి బలవంతుడు అల్లుడిగా ఆసరాగా ఉన్నా, శిశుపాలుడు సేనాపతిలాగ సాయంగా ఉన్నా కూడా కలపబడిన ఒంటిముక్కలతో ఏర్పడ్డాడు గనక అతడు భీముడి చేతిలో చచ్చిపోవలసి వచ్చింది. జరాసంధుడికి అస్తీ, ప్రాస్తీ అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వాళ్లను కంసుడికిచ్చి పెళ్లి చేశాడు. కంసుడు తన చెల్లెలు దేవకి కడుపున పుట్టే ఎనిమిదో సంతానం వల్ల చచ్చిపోతానన్న భయంతో ఆవిడకు పుట్టిన పిల్లలను వరసగా చంపడం మొదలు పెట్టినా, అతనికి సందిగ్ధత కలగడానికి ఏడోసారి గర్భాన్ని రోహిణికి బదలా యించడమూ, ఆ తర్వాత పుట్టిన కృష్ణుణ్ని యశోద పక్కలో పడుకోబెట్టి, అక్కడ పుట్టిన ఆడపిల్లను ఇక్కడకు తేవడమూ, ఆ అమ్మాయిని చంపబోతే గాలిలోకి ఎగిరి పోతూ ‘నిన్ను చంపేవాడు’ పుట్టేశాడని చెప్పడమూ కంసుడి భయాన్ని పెంచాయి. పుట్టిన పిల్లలనందర్నీ చంపమని పూతన, శకటాసురుడు, తృణావర్తుడు మొదలైన చాలామందినే పంపాడు. అతను పంపిన వాళ్లంతా కృష్ణుడి చేతిలో చచ్చిపోయారు. అక్రూరుణ్ని పంపించి, బలరామకృష్ణుల్ని ధనుర్యాగం చూడడమనే మిషను పెట్టి, ‘చావు’ను తన దగ్గరికే పిలిపించుకున్నాడు. వాళ్లు మథురకు వస్తూనే ఆ వింటిని విరగ్గొట్టారు. భూవలయానికే అలం కారమని పేరుపొందిన కువలయా పీడ మనే బలిష్ఠమైన ఏనుగును మీదకు ఉసి గొలిపితే, దంతాలూడబెరికి దాన్ని చంపేశారు; కండలు తిరిగిన మల్ల యోధులు చాణూర ముష్టికుల్ని ఉపయోగించి చంపుదామనుకుంటే, వాళ్లనూ చంపేశారు. ఆ మీద కృష్ణుడు, కంసుడు కుస్తీపట్లను చూడ్డానికి ఎక్కి కూర్చొన్న మంచె మీదకు లంఘించి... అతని జుట్టు పట్టుకొని కిందకు పడేసి తానూ అతని మీదకు ఉరికి చంపి నేలమీద ఈడ్చేశాడు. దాంతో అస్తి ప్రాప్తులిద్దరూ ఒకేసారి విధవలైపోయారు. తండ్రి దగ్గరికి చేరి, ‘మా భర్తను చంపిన వాణ్ని చంపి ప్రతీకారం తీర్చ’మని అతన్ని ప్రేరేపించారు. దాంతో జరాసంధుడికి కృష్ణుడితో వైరం ప్రారంభమైంది. తన గదను తొంభై తొమ్మిదిసార్లు తిప్పి తిప్పి తన ఊరు గిరివ్రజం నుంచి మథురవైపు విసిరితే, తొంభై తొమ్మిది యోజనాలు దూరంలో ఉన్న మథుర దగ్గర పడింది. ఆ ప్రదేశం ‘గదావసానం’గా ప్రసిద్ధికెక్కింది. జరాసంధుడు యుద్ధానికి వెళ్తే ఎదుటి వాళ్ల తేజస్సును హరించే శక్తి ఉన్నవాడు గనక చాలామంది రాజుల్ని అలవోకగానే జయించాడు. జయించడమే గాక, వాళ్లను రుద్రయజ్ఞంలో బలి ఇద్దామని ఇరవై వేల పైచిలుకు మంది రాజుల్ని తన నగరం గిరి వ్రజంలో ఖైదు చేసి ఉంచాడు. మథురలో ఉన్న కృష్ణుణ్ని కూడా అంత సులువుగానూ జయించాలని ఇరవై మూడు అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకొని దండెత్తాడు. బలరామ కృష్ణులు ఆ అక్షౌహిణీలనన్నిటినీ సంహ రించి, జరాసంధుణ్ణి మాత్రం చంపకుండా వదిలి పెట్టారు. దానికి కారణం ఉంది. అతగాడు మళ్లీ మళ్లీ అంతంత సైన్యాన్నీ తెచ్చుకొని వస్తాడు గనక, భూభారాన్ని కొంతలో కొంత మథుర సీమలోనే తగ్గించ వచ్చు అని. ఇలా అతను పదిహేడుసార్లు ప్రతి తూరీ ఇరవై మూడు అక్షౌహిణీలతో వచ్చి తాను ఒక్కడే తిరిగి వెళ్తూండేవాడు. పదిహేడో యుద్ధంలో హంసుడనే ఒక యోధుడు బలరాముడి చేతిలో చనిపోతే, తన సహ సేనాపతే పోయాడని డింభకుడు గూడా బాధతో యమునాప్రవాహంలోకి ఉరికి చచ్చిపోయాడు. డింభకుడు ఈ విధంగా ఒక అబద్ధపు చావు విని పోవడం చూసి, హంసుడు నిజంగానే ఆ యమున లోకి దుమికి ప్రాణాల్ని వదిలేశాడు. ఇలా ఏ శస్త్రానికీ చావని హంస డింభకులు ఒక్క సారిగా చచ్చిపోయి జరాసంధుడికి గొప్ప బాధనే మిగిల్చారు. పద్దెనిమిదోసారి, బలరామకృష్ణులు అతన్ని మోసగించ డానికి పరిగెత్తుతూ పారిపోతూన్నట్టు నటించి, ఎప్పుడూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండే ప్రవర్షణ పర్వతం మీదకు ఎక్కారు. జరాసంధుడు ఆ కొండ చుట్టూ ఎండు కట్టెలు పేర్పించి నిప్పంటించాడు. వాళ్లిద్దరూ కొండమీంచి ఉరికి బయటపడి వెళ్లిపోయారు. జరా సంధుడు మాత్రం బలరామకృష్ణులిద్దరూ ఆ మంటల్లో కాలిపోయారనే దిలాసాతో గిరివ్రజానికి తిరిగి వెళ్లిపోయాడు. మథురలో ఉంటే ఇలా అస్తమానూ జరాసంధుడు దండెత్తుతూనే ఉంటాడని, సముద్రంలో ఉన్న ద్వారకకు రాజధానిని మార్పించాడు శ్రీకృష్ణుడు. అక్కడికి దండెత్తి వెళ్లడం కష్టం గనక, జరాసంధుడి దాడులూ ఆగాయి. కానీ అతని కోపం మాత్రం చల్లారలేదు. ధర్మరాజు రాజ సూయయాగం చేయడానికి ఉపక్రమిస్తూ, శ్రీకృష్ణుడు తనకు మార్గదర్శకుడిగా ఉండా లని ప్రార్థిస్తూ వర్తమానం పంపాడు. ఆ వర్తమానం వచ్చేముందే, జరాసంధుడు చెరసాలలో పెట్టిన రాజుల నుంచి రహ స్యంగా ఒక దూత వచ్చి, వాళ్లను విడి పించి కాపాడాలని విన్నవించాడు. రెండు పనులూ ఒకేసారి ఎలా జరుగుతాయి? అప్పుడు ఉద్ధవుడు కృష్ణుడితో ‘ధర్మరాజు రాజసూయం చేయాలంటే, రాజులందర్నీ జయించాలి. ఆ దిగ్విజయానికి పెద్ద అడ్డు జరాసంధుడే. అంచేత అతన్ని మట్టు బెట్టడం అవసరం. అతను చావగానే చెర సాలలో ఉండే రాజులందరూ ముక్తులవు తారు. కనక జరాసంధుణ్ని చంపేందుకు పథకం వేస్తే రెండు పనుల్నీ ఒకేసారి సాధించవచ్చు’ అని సలహా ఇచ్చాడు. ఈ పనుల్ని ఒకేసారి చేయడానికి ముందు ధర్మరాజు దగ్గరికే వెళ్లాడు కృష్ణుడు. ధర్మరాజుతో జరాసంధుణ్ని చంపడం గురించి మంతనాలు చేశాడు: ‘జరా సంధుణ్ని రణంలో చంపడమన్నది సురా సురులందరూ కలసినా అయ్యే పని గాదు. అతన్ని బాహుయుద్ధంలోనే జయించాలి. నాలో నీతీ భీముడిలో బలమూ అర్జు నుడిలో మమ్మల్నిద్దర్నీ రక్షించగలిగే శక్తీ ఉన్నాయి. బలం గుడ్డిది; దానికి మాలో ఉన్న విచక్షణ అవసరం. అంచేత నామీద నమ్మకం ఉంచి భీమార్జునులిద్దర్నీ నా చేతిలో పెట్టావంటే, జరాసంధుణ్ని చంపి తిరిగి వస్తాను’ అన్నాడు. నయమూ జయమూ బలమూ కలసి విక్రమిస్తే సిద్ధి తథ్యమని యుధిష్ఠిరుడు ఆ ముగ్గుర్నీ గిరివ్రజానికి పంపించాడు. ముగ్గురూ మూడు అగ్నుల్లాగ తేజస్వంతులైన బ్రాహ్మ ణుల వేషాలు వేసుకొని బయలుదేరారు. విపులగిరీ వరాహగిరీ వృషభగిరీ ఋషిగిరీ చైత్యగిరీ అనే ఐదు గిరులు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటూ కలసి గిరివ్రజాన్ని చుట్టి రక్షిస్తున్నాయి. సూర్యచంద్రాగ్నుల్లాటి ఆ ముగ్గురూ ముఖద్వారాన్ని వదిలిపెట్టి, ఎత్తయిన చైత్యక పర్వతం మీదుగా గిరి వ్రజానికి చేరుకున్నారు. అక్కడ ఎద్దు రూపంలో వచ్చిన ఋషభుడనే రాక్షసుణ్ని జరాసంధుడి తండ్రి బృహద్రథుడు చంపి, ఆ రాక్షసుడి మాంసంతో మూడు భేరీలను మోగించినప్పుడు దివ్యపుష్ప వర్షం పడుతూ ఉండేది. ఆ మూడు భేరీలనూ ఈ ముగ్గురూ బద్దలుగొట్టి చైత్యశిఖరాన్ని తమ బాహుబలంతో విరగ్గొట్టి, గిరివ్రజంలోకి చొరబడ్డారు. జరాసంధుడి దగ్గరికి చేరారు. బ్రాహ్మణులకు పూజ చేయడం అతని వ్రతం. కృష్ణుడొక్కడే మాట్లాడుతూ ‘మా తోటి వాళ్లిద్దరూ అర్ధరాత్రి దాటితేనే గానీ మాట్లాడరు’ అని చెబితే, వాళ్లను యజ్ఞశాలలోనే ఉండమని, రాత్రి తిరిగి వస్తానని చెబుతూ జరాసంధుడు రాజభవనానికి వెళ్లిపోయాడు. బ్రాహ్మణులంటే ఎంతో గౌరవం గనకనే మాట ప్రకారం అర్ధరాత్రి తిరిగి వచ్చాడు. వాళ్లను నిశితంగా చూసి క్షత్రి యుల్లాగ ఉన్నారని పసిగట్టి నిలదీశాడు. కృష్ణుడు దానికి ‘మేము బ్రాహ్మణులం కాము. నేను కృష్ణుణ్ని. వీళ్లిద్దరూ మా మేన బావలైన భీమార్జునులు. మాతో యుద్ధం చెయ్యి. ఆ రాజులనందర్నీ విడిచి పెట్టు, లేదా యముడి దగ్గరికి పో!’ అన్నాడు. ‘నేను ఆ రాజులనందర్నీ దేవతా బలికోసం తెచ్చి ఎందుకు విడిచిపెట్టాలి? మన సేనలతో గానీ, మీలో ఒకడితో గానీ ఇద్దరితో గానీ ముగ్గురితోనూ గానీ నేను పోరాడతాను, రండి’ అని, కొడుకైన సహదేవుడికి పట్టంగట్టి, యుద్ధం చేయడానికి వచ్చాడు జరాసంధుడు. భీముడు జరాసంధుణ్ని పైకి లేవనెత్తి వేగంగా తిప్పడం మొదలుపెట్టాడు. తిప్పి తిప్పి మోకాళ్లతో వీపును విరిచి, శరీరాన్ని పిప్పిపిప్పిగా నలుపుతూ గర్జించాడు. ఒక చేత్తో జరాసంధుడి ఒక కాలు పట్టుకొని, రెండో కాలిమీద తన కాలు ఉంచి, అతన్ని రెండు ముక్కలుగా చీల్చేశాడు. అలా రెండు సగాలుగా పుట్టినవాణ్ని రెండు సగాలుగానే చేసి యమలోకానికి పంపాడు. తన ఎక్కువతనాన్ని నిలబెట్టు కోవడానికి అతిక్రూరంగా చేద్దామనుకొన్న రుద్రయజ్ఞం చెయ్యకుండానే చచ్చి పోయాడు తానే అందరికన్నా అధికుణ్నను కున్న జరాసంధుడు. శ్రీకృష్ణుడు అతని చెరసాలలో ఉన్న రాజులందర్నీ విడిపించి, వాళ్లందరిచేతా ధర్మరాజుకు కప్పం కట్టించాడు. ఆ విధంగా మహాభారత యుద్ధానికి అంకురం లాంటి రాజసూయ యాగాన్ని నిర్విఘ్నంగా నడిపించడానికి శ్రీకారం చుట్టాడు శ్రీకృష్ణుడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
శిశుపాలుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 27 శిశుపాలుడు, వసుదేవుడి చెల్లెలు శ్రుత శ్రవాదేవికీ చేదిదేశ రాజు దమఘోషుడికీ పుట్టాడు. అయితే ఇతను మూడు కళ్లతో, నాలుగు చేతులతో వికారంగా ఉండటం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. పుడు తూనే గాడిదలాగ అరవడం చూసి గాభరా పడి ఎక్కడైనా వదిలేద్దామనుకున్నారు. ఇంతలో ఆకాశం నుంచి ఒక మాట విని పించింది: ‘ఇతన్ని మీరు వదలవలసిన పనిలేదు. ఏ ఆయుధంతో ఇతని మృత్యువు సంభవిస్తుందో ఎవరి చేతిలో చచ్చిపోతాడో ఎప్పుడో విహితమై ఉంది. ఎవరు ఈ పిల్లవాణ్ని ఒళ్లోకి తీసుకుంటే, ఇతని అదనపు కన్ను నుదురులో అణిగి పోతుందో, ఇతని అదనపు చేతులు రాలి పోతాయో అతనే ఇతన్ని చంపుతాడు’ అని. ఈ విలక్షణమైన పిల్లవాణ్ని చూడ డానికి, ఇంటికి ఎవరెవరు వచ్చినా వాళ్ల చేతుల్లో ఆ తల్లి ఇతన్ని పెట్టేది. బలరామ కృష్ణులు వచ్చినప్పుడు కూడా వాళ్ల మేనత్త అదే పని చేసింది. కృష్ణుడు ఎత్తుకోగానే వాడి అదనపు కన్నూ చేతులూ పోయాయి. అది చూసి మేనత్త కంగారుపడింది. ‘మా అబ్బాయి చేసే నేరాల్నీ, అప రాధాల్నీ నువ్వు సహిం చాలి మేనల్లుడూ’ అంటూ కృష్ణుణ్ని ఆవిడ ప్రార్థించింది. ‘నేను మీ అబ్బాయి శతాప రాధాల్ని నీకోసం క్షమిస్తాను. ఆ మీదనే శిక్షిస్తాను’ అని కృష్ణుడు మాటిచ్చాడు. విష్ణుద్వారపాలకులైన జయవిజ యులు ద్వాపరయుగంలో మూడోసారి జన్మించారు. హిరణ్యకశిపు హిరణ్యాక్షుల గానూ రావణ కుంభకర్ణులగానూ పుట్టిన తరవాత ఇప్పుడు శిశుపాలదంత వక్త్రులుగా పుట్టారు. ఈ మూడు జన్మ ల్లోనూ సంరంభయోగాన్ని పాటించి, కృష్ణుడి చేతిలో వాళ్లు చచ్చిపోయారు. సంరంభమంటే, కామమూ క్రోధమూ లోభమూ ఉగ్రస్థాయిలో ఉండడం. ఈ మూడూ నరకద్వారాలని పెద్దలు చెబుతారు. ‘శిశుపాలుడ’నే మాటలో శిశువంటే ఎప్పుడూ నిద్రలో మునిగి ఉండేవాడని అర్థం. అటువంటి శిశు వులకు, అంటే అజ్ఞానమనే నిద్రలో మునిగిపోయినవాళ్లకూ, అజాగ్రత్తగా ప్రవ ర్తించేవాళ్లకూ, శిశువులు తల్లిదండ్రుల్ని వాళ్ల అల్లరితో అరగదీసినట్టు, ఇతరుల్ని బాధపెడుతూ కృశింపజేసేవాళ్లకూ పాలకుడు ఈ శిశుపాలుడు. రుక్మిణిని, ఆమె అన్న రుక్మి తన స్నేహితుడైన శిశు పాలుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. స్వయంవరం వట్టి లాంఛనమే అనుకున్నాడు శిశుపాలుడు. ఆమె తన భార్యేనని అతని ఊహ. కానీ రుక్మిణి కృష్ణుణ్ని ప్రేమించింది. పెళ్లికి ముందు గౌరీపూజకు తాను ఆలయానికి వచ్చినప్పుడు కృష్ణుణ్ని రమ్మనమనీ, తనను ఎత్తుకొని పొమ్మనమనీ రుక్మిణి కబురంపింది. కృష్ణుడు వచ్చి ఆమెను తీసుకొని వెళ్లాడు. శిశుపాలుడు రుక్మిణిని తన భార్యే అనుకున్నాడు. కానీ ఆమెను కృష్ణుడు పెళ్లి చేసుకొనేసరికి ఉక్రోషం పుట్టుకొచ్చింది. తిట్ల పురాణం మొదలు పెట్టాడు. అతనికి కృష్ణుణ్ని చూస్తే తాను తక్కువ అనే భావం పుట్టుకొచ్చేది గానీ, దాన్ని తాను అధికుడన్నట్టుగా వెళ్లగక్క డమే తిట్లదండకంగా వెలువడింది. శిశుపాలుడు తన అక్కసును వెళ్లగక్క డానికి ధర్మరాజు చేసిన రాజసూయ యాగాన్ని వేదికగా చేసుకున్నాడు. రాజ సూయ యాగంలో ఒక మహా పూజనీయు డికి ముందు పూజ జరగాలి. అతనెవరు అని యుధిష్ఠిరుడి మీమాంస. నారదుడూ భీష్ముడూ ఆ పూజకు అర్హుడు శ్రీకృష్ణుడని తేల్చారు. అది వినగానే శిశుపాలుడికి అరికాలిమంట నెత్తికెక్కింది. ‘ఇది తగని పని. ఆచార్యుడూ ఋత్విక్కూ సంబంధ మున్నవాడూ స్నాతకుడూ ప్రియ మిత్రుడూ రాజూ అనే ఆరుగుర్నీ అర్ఘ్యార్హు లుగా పెద్దలు చెబుతారు. వీళ్లల్లో ఏ కోవకీ కృష్ణుడు చెందడు. పాండవుల్లారా! మీరు స్వార్థానికి వశులై కృష్ణుణ్ని పూజిస్తున్నారు. ఈ భీష్ముడు బాగా ముసలివాడై పోయాడు. అంచేతనే అతనికి జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. అతని లోచూపు సన్నగిల్లిపోయింది. ఇంతమంది రాజులుండగా రాజ్యార్హతే లేనివాణ్ని మీరె లాగ పూజిస్తారు? యయాతి కున్న ఐదుగురు కొడుకుల్లోనూ యదువుకీ తుర్వ సుడికీ ద్రుహ్యుడికీ అనువుకీ సాక్షాత్తూ వాళ్ల తండ్రే రాజ్యార్హత లేకుండా చేశాడు. పూరుడు తన యౌవనాన్నిచ్చి యయాతి ముసలితనాన్ని తీసుకున్నాడు గనక పూరుడికే రాజ్యాధి కారాన్నిచ్చాడు యయాతి. అందుకనే యాదవులందరికీ రాజ్యార్హత లేదు. పోనీ కృష్ణుడు వయస్సుమీరిన పెద్దవాడం దామా? అదీ కాదు. అతని తండ్రి వసు దేవుడుండగా కృష్ణుడు పెద్దవాడెలాగ వుతాడు? పోనీ, ఇష్టుడని పూజిస్తామం టారా? మీ మామగారు ద్రుపదుడు అతని కన్నా ఇష్టుడూ సంబంధమున్నవాడూను. గురువు అని అంటారా? ద్రోణుడు మీకం దరికీ గురువు కదా! అతన్ని కాదని కృష్ణుడికి ఏవిధంగా అగ్రపూజనందిస్తారు? కృష్ణుణ్ని ఋత్విక్కని అందామంటే, వృద్ధుడైన కృష్ణద్వైపాయనుడుండగా అదీ వీలు పడదు. స్వచ్ఛంద మృత్యువున్న భీష్మ పితామహుడి కన్నా కృష్ణుడు ఏవిధంగా పురుషోత్తముడవుతాడు? దుర్యోధనుడూ కృపాచార్యుడూ భీష్మకుడూ రుక్మీ శ్రేష్ఠ ధనుర్ధరుడైన ఏకలవ్యుడూ శల్యుడూ పరశు రామ శిష్యుడైన కర్ణుడూ ఉండగా కృష్ణుణ్ని పూజిద్దామన్న ఆలోచన మీకెలాగ వచ్చిందో అసలు అంతు పట్టదు’ అంటూ ధ్వజమెత్తాడు శిశుపాలుడు. యుధిష్ఠిరుడు పిన్నికొడుకైన శిశు పాలుడికి నచ్చచెబుదామని ప్రయత్నిం చాడు. భీష్ముడు అది దండగ అని చెబుతూ శ్రీకృష్ణుడు ఎలాగ పూజార్హుడో వివరిం చాడు: ‘శ్రీకృష్ణుడు గుణాల్లో దొడ్డవాడు కనకనే వయోవృద్ధుల్ని కాదని అతన్ని పూజనీయుడిగా చెబుతున్నాం. బ్రాహ్మణు లందరిలోకల్లా జ్ఞానంలో మిన్న గనకనే అతన్ని అర్చనీయుడని చెబుతున్నాం. క్షత్రి యులందరిలోకల్లా బలాధికుడు గనకనే అతన్ని అర్ఘ్యార్హుడిగా చెబుతున్నాం. వైశ్యుల్లో ఎక్కువ ధనధాన్యాదులు కలవాడే గొప్పవాడు; శూద్రుల్లో జన్మకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పూజనీయతను నిరూ పిస్తారు. ధనధాన్యాలు అధికంగా ఉండడంలోనూ, జన్మకాలాన్ని బట్టీనూ శ్రీకృష్ణుడు పూజనీయుడే. వేదవేదాంగ జ్ఞానంలోనూ అతన్ని మించినవాడు మరొకడు లేడు. దానమూ దక్షతా శాస్త్ర జ్ఞానమూ శౌర్యమూ వినయమూ కీర్తీ బుద్ధీ సిరీ ధైర్యమూ తుష్టీ పుష్టీ మొదలైన సద్గుణాలన్నీ నిండుగా ఉన్నాయి. ఇంతటి వాడు గనకనే శ్రీకృష్ణుణ్ని అర్చనీయుడిగా ఎన్నుకున్నాం. అన్ని లోకాల్లోనూ పైనా కిందా పక్కల్లోనూ అన్నివైపులా విస్తరించి ఉన్న విశ్వానికి ముఖంలాంటివాడు శ్రీకృష్ణుడు. అతని చైతన్యం అంతటా వ్యాపించి ఉంది. అతను అణువణువునా ఉన్న చైతన్యం కనకనే అర్చనీయుడిగా చెబుతున్నాం. ఈ శిశుపాలుడు బాలుడు, బాలిశుడు; కృష్ణుణ్ని ద్వేషిస్తూ ఇలాగే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. శిశుపాలా! ఇది తగని పూజ అని నువ్వు అనుకుంటే, ఈ విషయంలో ఏం చెయ్యా లనుకుంటున్నావో అది చేసుకో!’ అని తెగేసి చెప్పాడు. అప్పుడు సహదేవుడు, శ్రీకృష్ణుడు పూజ్యమానుడనే మాటను సహించని రాజులుంటే వాళ్లందరి తలల మీదా నా పాదాన్ని ఉంచుతాను అని విసురుగా అన్నాడు. ఎవ్వరూ పెదవి మెదపలేదు. నారదుడు సహదేవుడి మాటల్ని బలపరుస్తూ ‘కృష్ణుణ్ని అర్చిం చని మనుషులు జీవించి ఉన్నా చచ్చిన వాళ్లకిందే జమ’ అని చెప్పాడు. ఆ మీద శ్రీకృష్ణుడికి అగ్రపూజ జరిగింది. అది సహించలేని శిశుపాలుడు తనను తానే సేనాపతిగా చేసుకొని, రాజులనందర్నీ కలుపుకొని పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. కృష్ణుడికి అగ్రపూజ చేయమని సలహానిచ్చిన భీష్ముణ్ని తెగడడం మొదలుపెట్టాడు. భూలింగశకుని అనే పక్షి హిమాల యంలోని ఒక భాగంలో ఉంటుంది. అది అందరితోనూ ఎప్పుడూ ‘సాహసం చేయ కండి’ అని చెబుతూండేది గానీ స్వయంగా అది, సింహం కోరల మధ్యనున్న మాంస మ్ముక్కల్ని తన ముక్కుతో తీసుకునే మూర్ఖసాహసం చేస్తూండేది. ఆ సింహమే తలుచుకుంటే ఆ పక్షిని కొరికేసేది. సింహం ఇచ్ఛ వలనే అది బతికిపోయింది. అలాగే భీష్ముడు కూడా అధర్మిష్ఠుడై ఏవో కబుర్లు చెబుతూ ఉంటాడు. భీష్ముడనే ఈ భూలింగ శకుని సింహమనే రాజులందరి ఇచ్ఛ వల్లనే బతికి ఉన్నాడు. వాళ్లే తలుచు కుంటే భీష్ముడికెప్పుడో నూకలు చెల్లిపోయి ఉండేవి. ఈవిధంగా దెప్పుతూన్న శిశు పాలుడితో ‘ఈ రాజుల ఇచ్ఛకొద్దీ నేను బతికి ఉన్నానని నువ్వు చెబుతున్నావు గానీ నేను వీళ్లను గడ్డిపరకతో కూడా సమానమనుకోను’ అని భీష్ముడన్నాడు. దానితో శిశుపాలుడి తరఫు రాజులందరికీ పుస్సు పుట్టుకొచ్చింది. భీష్ముడితో యుద్ధం చేద్దామని లేచారు. అప్పుడు భీష్ముడు ‘మీరు సాహసం చేయదలుచుకుంటే రండి. నన్ను దహించండి. కానీ నేను మాత్రం మీ నెత్తిమీద నా కాలు నుంచి అవమానపరుస్తాను. శ్రీకృష్ణుడు మా పూజ లందుకొని ఇక్కడ నిలుచుని ఉన్నాడు. ఎవరు చావదలుచుకున్నారో వాళ్లు అతన్ని యుద్ధానికి పిలవండి’ అంటూ అధిక్షేపిం చాడు. ఆ మాటను విని శిశుపాలుడు కృష్ణుడితో ‘ఈ రోజున పాండవులందరి తోనూ కలిపి నిన్ను చంపి, నా కోపాన్ని చల్లార్చుకుంటాను. ఈ పాండవులు ఇక్కడున్న రాజులనందర్నీ అవమానిస్తూ, రాజువు కాని నీకు అగ్రపూజ చేశారు. అందుకోసమనే వాళ్లు వధార్హులు’ అని బీరాలు పలికాడు. ‘నీ తప్పుల్నీ ఆగడాల్నీ మా అత్తయ్యకిచ్చిన మాటకోసం ఇంత దాకా సహించాను. ఇక నీ ఆట సాగదు’ అంటూ శిశుపాలుడి తలను నరికేశాడు కృష్ణుడు. అతను ఇంతకుముందు విష్ణు ద్వార పాలకుడే. అతని తేజస్సు పైకి లేచి నమస్కరిస్తూ కృష్ణుడిలో ప్రవేశించింది. మనలో ఉన్న న్యూనతా భావాన్ని, అధికులమనే భావాన్ని కూడా పోగొట్టు కొని, ఆత్మభావంతో అందరమూ సమాన మనే భావాన్ని పొందడమే ఈశ్వరత్వాన్ని అందుకోడమంటే. భగవంతుడికీ అతని ప్రతినిధులైన మహాత్ములకూ ఒకడంటే ఇష్టమూ మరొకడంటే ద్వేషమూ ఉండదు. పొగడ్త, తెగడ్త, సత్కారం, తిరస్కారం... అన్నీ శరీరానికే. శరీరాన్ని దొడ్డదనుకునే వాడు ‘నాదీ నేనూ’ అనే వేరు భావంతో ఉంటాడు. మహాత్ముడికి ఈ వేరుభావమూ శరీరం తానే అనుకునే దురభిమానమూ ఉండదు. ఈ శిశుపాలుడి లాంటి బాల బుద్ధులకు ఉన్నతమైన భావం కలగాలనే దృష్టితోనే మహాత్ములు దండిస్తారు, ద్వేషంతో కాదు. శత్రుత్వంతో గానీ మిత్రత్వంతో గానీ భయంతో గానీ స్నేహంతో గానీ కామంతో గానీ ఎలాగో అలాగ భగవంతుడి మీద మనస్సును లగ్నం చేయడమే కావాలి. శత్రుత్వాలూ మిత్రత్వాలూ మొదలైనవి మనకు వేరువేరు అనిపిస్తాయి గానీ అణువణు వునా చైతన్యంగా వ్యాపించినవాడికి ఈ భావాల్లో తేడాను చూడడు. అతనికన్నీ ఒకటే. ఏదోవిధంగా మనస్సును నిశ్చలంగా నిలపడమే ముఖ్యం. శిశుపాలుడు అత్యంతమైన ద్వేషంతో కూటస్థ చైతన్య రూపుడైన శ్రీకృష్ణుడి మీద మనస్సును లగ్నం చేశాడు గనకనే పరమగతిని పొందాడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
దుష్టచతుష్టయం
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 22 దుష్టచతుష్టయమంటే నలుగురు చెడ్డవాళ్లు: దుర్యోధనుడూ దుశ్శాసనుడూ శకునీ కర్ణుడూను. దుర్యోధనుడంటే చురుకైన కోరిక; దుశ్శాసనుడేమో పట్టరాని కోపం; శకుని అంటే అత్యంతమైన మోహం; కర్ణుడంటే ఏది తనకిష్టమో, ఏది తనకు సుఖకరమో దాన్నే చేద్దామనుకొనే లోభమున్నవాడు. కోరికా కక్కుర్తీ అనేవి మూడూ నరకానికి తెరిచిన ద్వారాలని చెబుతారు. మనిషిలో కిందికి దిగివచ్చిన చైతన్యాన్ని దివ్య చైతన్యంగా లేవనెత్తడానికి మూలాధారంలో ఉన్న కుండలినీశక్తిని మెదడులో ఉన్న సహస్రారానికి నడపాలి. ఆ పనికి కామమూ క్రోధమూ లోభమూ మోహమూ అనే నాలుగు దుష్టశక్తులూ పెద్ద ఆటంకాలు. దుర్యోధనుణ్ని కలి అనీ శకునిని ద్వాపరుడనీ చెబుతారు. కలి అంటే కలహానికి మారు పేరు; ద్వాపర మంటే అనిశ్చితీ సందేహమూను. పాచికలాట మొదలుపెడితే చాలు ఎవరి బతుకైనా సందేహంలో పడిపోతుంది. రాజసూయ యాగ సమయంలో వచ్చిన రత్నసంచయాన్ని చూసి దుర్యోధనుడు వెర్రెత్తిపోయాడు. ఆ డబ్బంతా తనదై పోవాలనుకున్నాడు. ఆ పవిత్రయాగ ధూమంతో సుగంధిలమైన ద్రౌపది జుట్టును పట్టుకొని కోపంతో సభలోకి ఈడ్చుకొని వచ్చాడు దుశ్శాసనుడు. చాలామందికి భార్య గనక ఆవిణ్ని వేశ్య అంటూ, సభలోకి ఏకవస్త్రగా వచ్చినా వివస్త్రగా వచ్చినా ఫరవాలేదంటూ కర్ణుడు వస్త్రాపహరణానికి బీజం వేశాడు. కలిరూపమైన క్రియాశీలకమైన కోరికతో యుద్ధం చేయడం చాలా కష్టం. లోకంలో అవుపించే విషయాల్ని తలచు కుంటూ ఉంటే, వాటితో మనకు తగులు బాటు కలుగుతుంది. మాట వరసకు, ఓ పువ్వును చూశామనుకోండి. బావుందని అనుకోడంతోబాటు, అది త్వరలోనే వసి వాడిపోతుందని తెలిసినా, లోభంతో దాన్ని కోసుకొని మన దగ్గర పెట్టుకుందా మన్న కోరిక పుడుతుంది. అక్కడ పువ్వుల్ని కోయకూడదన్న ఆంక్ష ఉందనుకోండి. అది ఆ కోరికకు గొడ్డలిపెట్టులాగ ఉంటుంది. కోరికకు అడ్డంకి రాగానే చిరాకు పుడు తుంది. చిరాకు రాగానే ఏం చేస్తున్నామో తెలియని మూఢత్వం కమ్ముకుంటుంది. ‘నా అంతటివాడి మాటను ఖాతరు చేయవా’ అంటూ జుట్టు పట్టుకుంటాడు. ఆ భ్రాంతి మోసంలో పడేసి, తానెవరో మరచిపోయేలాగ చేస్తుంది. ఆవిడ వదిన, తల్లిలాంటిది అనే మాట గుర్తుకురాదు. మరపురాగానే వివేకం బొత్తిగా అడుగంటుతుంది. బుద్ధి పోగానే మంచి ప్రవర్తన మాసిపోతుంది. వదిన అన్న మాట విస్మరించి బట్టల్ని ఊడదీయడానికి సిద్ధమైపోతాడు. అది నిండుసభ అనే మాట కూడా గుర్తు ఉండదు. ఈ దుష్టచతుష్టయం పుట్టించే గందరగోళంలో మనిషిలోని కుండలినీ ప్రాణశక్తి దుర్వినియోగానికి గురి అయి, కలహాన్నీ అశాంతినీ కలిగిస్తుంది. నిండు కొలువులో ద్రౌపది అనే మహారాణి తన శీలాన్ని కాపాడుకోవడం కోసం అటూ ఇటూ పరుగులు పెట్టింది. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడికి సరిపోయిన తండ్రి. దుర్యోధనుడు పైకే తన కుచ్చితాన్ని చూపిస్తాడు గానీ ధృత రాష్ట్రుడు లోపల అంత కుచ్చితంగానూ ఆలోచిస్తూ ఉంటాడు. పాండవుల ఉన్నతి చూసి, ధృతరాష్ట్రుడు అసూయపడుతూ ‘ఏం చేయాలి నేను?’ అంటూ కణికుడనే రాజనీతిజ్ఞుణ్ని పిలిచాడు. ‘అగ్నిహోత్రమూ యజ్ఞమూ చేస్తూ కాషాయబట్టల్ని కట్టుకొని జడలూ మృగచర్మమూ ధరించి ముందు అందరికీ విశ్వాసాన్ని కలగ జెయ్యాలి. ఆమీద తోడేలులాగ శత్రువుల మీదపడి నాశనం చేయాలి. శత్రువును ఈ విధంగా చంపలేకపోతే వాడున్న ఇంటికి నిప్పు పెట్టాలి’ అని పాఠం చెబుతూ ఒక గుంటనక్క కథను చెప్పాడు కణికుడు. స్వార్థపండితుడైన ఒక నక్క పులీ ఎలుకా తోడేలూ ముంగిసా అనే తన నేస్తాలతోబాటు ఒక అడవిలో ఉంది. ఒకరోజున అందరూ కలిసి లేళ్ల సర్దారును చూసి లొట్టలేశాయి. అయితే దాని వేగం ముందు వీళ్ల ప్రయత్నాలు ఎందుకూ కొరగాలేదు. అప్పుడు నక్క ఒక పథకాన్ని వేసింది. అది పడుకొన్నప్పుడు మన ఎలుక దాని పాదాల్ని కొరికినట్టయితే దాని వేగం తగ్గుతుంది. అప్పుడు పులి దాన్ని పట్టి చంపగలుగుతుంది. సరే అని అందరూ ఆ పన్నాగాన్ని అమలుపరిచారు. ‘మీరంతా స్నానాలు చేసి రండి. నేను ఈ మృగ దేహాన్ని కాపలా కాస్తూ ఉంటాను’ అని నక్క, వాళ్లందర్నీ పంపించింది. స్నానం చేసి మొదట పులి వచ్చింది. అయితే, నక్క ఏదో చింతలోపడ్డట్టు ముఖం పెట్టింది. ‘ఏమిటి సంగతి?’ అని పులి వాకబు చేస్తే, ‘ఎలక మీ గురించి అన్నమాటను విని నేను చింతలో పడ్డాను: నావల్లనే ఈ మృగం చచ్చింది. పులిరాజు బలం దీంట్లో ఎక్కడుంది? నా బాహుబలాన్ని ఆశ్ర యించుకొని అతను తన ఆకలిని తీర్చు కోనీ అంటూ ఈసడించుకుంటూ వెళ్లి పోయింద’ని నక్క చెప్పింది. ‘నా బలంతో సంపాయించుకొనే తింటానులే’ అంటూ పులి వెళ్లిపోయింది. ఇంతలో ఎలుక వచ్చింది. ‘ఎలుకా! ముంగిస ఏమందో తెలుసునా? నాకు ఈ మృగమాంసం గీంసం పడవు. నేను ఎలుకను తినడానికి ఇష్టపడతాను’ అని నక్క చెప్పడమే తడవు, అది తుర్రుమని పారిపోయింది. తరవాత తోడేలు వచ్చింది. దానితో, ‘పులి ఎందు కనో నువ్వంటే గుర్రుగా ఉంది. పెళ్లాన్ని తీసుకొని వస్తానని వెళ్లింది’ అని చెప్పే సరికి, అది ఠకీమని పారిపోయింది. చివరికి ముంగిస వచ్చింది. ‘నా సొంత బలంతో వాళ్లనందర్నీ జయించాను. నువ్వు కూడా నాతో యుద్ధం చేసి గెలిచి ఈ మాంసాన్ని తిను’ అనేసరికి అది తోక ముడుచుకొని పారిపోయింది. నక్కే ఆ మాంసమంతా కడుపునిండా ఆరగించింది. ఇలాగ తక్కువ చేసో బెదిరించో భయ పెట్టో బామాలో శత్రువును నిర్మూలించు కోవాలంటూ కణికుడు పాఠం చెప్పాడు. ఈ కణికనీతి ధృతరాష్ట్రుడికి బాగా ఒంటపట్టింది. ‘కానీ అలా చేస్తే బాగుం డదు; ఏదో ఒకటి చేయకపోతే నేను కుమిలిపోతున్నాను’ అంటూ ద్వైదీ భావంలో ఊగిసలాడడం మొదలు పెట్టాడు. సరిగ్గా అప్పుడే దుష్టచతుష్టయం పెద్ద పన్నాగాన్ని పన్నుతున్నారు. ఏదో విధంగా పాండవుల్ని దూరంగా పంపిం చకపోతే ‘నాకు రాజ్యం రానేరాదు. ప్రజ లందరూ ధర్మరాజునే రాజుగా కోరుకుం టున్నారు’ అని నాన్న లోపలి ఆలోచన అనే నిప్పుకు ఆజ్యం పోశాడు. ‘నాదీ అదే అభిప్రాయం. కానీ అది పాపపుటాలోచన అని నేను బయటపెట్టడం లేదు. భీష్ముడూ మొదలైన పెద్దలకు ఎలాగ నచ్చజెప్పాలి?’ అంటూ మనస్సులో మాట చెప్పాడు తండ్రి. ‘భీష్ముడు ఎప్పుడూ మధ్యస్థుడే; అశ్వత్థామ నా పక్షానే ఉంటాడు. కొడుకెక్క డుంటే ద్రోణుడు అక్కడే ఉంటాడు. కృపా చార్యుడేమో బావామేనల్లుళ్లు ఉన్నచోటే ఉంటాడు. ఒక్క విదురుడే ఎదురు. అతనొక్కడూ దీన్ని ఆపలేడు’ అని దుర్యో ధనుడు తాము నలుగురూ చేసిన లక్క ఇంటి ఆలోచనను బయటపెట్టాడు. ధృతరాష్ట్రుడు పాండవులతో వారణావత నగర రమ్యత్వం గురించి కొంతమంది చేత పదే పదే చెప్పించి, వాళ్లకు అక్కడికి వెళ్లాలనే కోరికను లేవదీశాడు. ఆ మీదట ‘మీరు వెళ్దామనుకుంటున్నారటగా! శుభం వెళ్లిరండి’ అని పాండవుల్ని వారణావతం పంపించాడు. కానీ ఆ ఒక్క విదురుడూ వీళ్ల పన్నాగాన్ని విఫలం చేసేశాడు. దుర్యోధనుడి కన్ను ధర్మరాజుకున్న ధన సంపదల మీద పడింది. అతగాడికి ఆ డబ్బంతా తనదిగా చేసేసుకోవాలన్న కోరిక ఉవ్వెత్తున లేచింది. దానికి తోడు మయసభలో తిరుగుతూ నేలను చూసి నీళ్లూ నీళ్లను చూసి నేలా అని భ్రాంతిపడ్డ అతన్ని చూసి, భీముడు కిసుక్కుమని నవ్వాడు. ఆ మీద ద్రౌపదితో సహా ఆడ వాళ్లందరూ గలగలా నవ్వారు. దుర్యో ధనుడికి ఒంటి నిండా తేళ్లూ జైలూ పాకినట్టయింది. ఇంటికొచ్చి, మనస్సులో గుచ్చుకొన్న ముల్లును తీయడానికి దార్లను వెదకడం మొదలుపెట్టాడు. శకుని మామ మోసానికి ప్రతిరూపం. అతని ఆయుధాలు పాచికలు. జూదపీఠమే రణరంగం. మోసమే అతని చతురంగ బలం. పాచికలాటే మాయాక్రీడ. అది చాలా రంజుగా ఉంటుంది. ఆ రంధిలో పడి మనిషి తన శరీర రాజ్యాన్ని, తన ఆత్మానందశక్తిని, మోసానికి ఒడిగడు తూన్న ఇంద్రియాల మాటల్లో పడి, పందెంగా ఒడ్డి పోగొట్టుకుంటాడు. తెలిసుండీ ధర్మరాజు, జూదం ఆటకు, సరదా జూదం అని చెప్పి పెదనాన్న పిలిస్తే వెళ్లాడు. దీనికి కారణం రాజసూయ యాగం తరవాత వచ్చే కలహానికీ నాశ నానికీ తాను కారణం కాకూడదనే. అతను రాజసూయంలోనూ దిగ్విజయంలోనూ వచ్చిన కప్పాల్నీ కట్నాల్నీ ఒడ్డి పోగొట్టు కున్నా, శకుని ‘నీకింకా నీ తమ్ముళ్లున్నారు గదా, నువ్వున్నావుగా, నీ భార్య ఉందిగా’ అని పురిగొలుపుతూ అమంగళప్పక్షిలాగే పనిచేశాడు. శకుని అంటే పక్షి అని అర్థం కూడా ఉంది. కొన్ని పక్షుల కూతలు నష్టాన్నీ హింసనీ కలిగిస్తాయి. తీతువుపిట్ట ఇటువంటిదే. శకుని అటువంటి అప శకునప్పక్షి. ధర్మరాజు జూదం మొదలు పెట్టక ముందు ‘జూదం ఒక రకంగా మోసమూ పాపమూను. దీనిలో క్షత్రి యుడికి తగిన పరాక్రమం చూపించడం ఉండదు; దీనికి ఒక నిశ్చితమైన నీతీ లేదు. ధర్మానికి అనుకూలమైన విజయం యుద్ధంలోనే దొరుకుతుంది. క్షత్రియులకు యుద్ధమే శ్రేష్ఠం, జూదం కాదు. కుటిల త్వమూ మోసమూ లేని సంగ్రామమే సత్పురుషుడు చేసే యుద్ధం. జూదగాళ్లకు మోసమన్నా, కపటత్వమన్నా వల్లమాలిన గౌరవం. మంచివాళ్లు జూదాన్ని పొగడరు. నువ్వు క్రూరుడిలాగ అనుచితమైన మార్గంలో మమ్మల్ని జయించాలని చూడకు’ అని అన్నాడు. శకుని దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు: ‘ఒక వేద విజ్ఞాని మరో వేద విద్వాంసుణ్ని ఓడించడానికి ఏదో మారుమూల విషయాన్ని ఉపయోగించి మోసంతోనే జయిస్తూ ఉంటాడు. తెలిసినవాడు తెలియనివాణ్ని ఓడిస్తే అది మోసం ఎలాగవుతుంది? పాచికలాట బాగా ఎరిగిన నాబోటిగాడు ఆ ఆటలో చెయ్యి తిరగనివాణ్ని ఓడించడం జరుగుతుంది. దాన్ని మోసమంటే, అస్త్రాల్ని వెయ్య గలిగినవాడు ఆ నేర్పులేని వాణ్ని జయిస్తే అదీ మోసమే అవుతుంది. బలవంతుడు బలహీనుణ్ని జయించడం ఒక రకమైన మోసమే గానీ దాన్నీ మోసమని అనరు. ఇది మోసం అనుకుంటే నువ్వు వెళ్లిపో వచ్చు’. ‘పిలిచిన తరవాత వెళ్లిపోవడం నా వ్రతానికి విరుద్ధం. నేను ఇక్కడ ఎవరితో ఆడాలి?’ అని యుధిష్ఠిరుడు అనగానే దానికి దుర్యోధనుడి జవాబే జరగ బోతూన్న మోసాన్ని ఎదురుగుండా చూపించింది: ‘నేను డబ్బు పెడతాను. నా తరఫున శకునిమామ ఆడతాడు’. ‘ఒకడి కోసం మరొకడు ఆడడం విషమం’ అని అంటూనే ధర్మరాజు జూదానికి దిగాడు. నలుగురు దుష్టులూ తమ రొట్టె విరిగి నేతిలో పడిందనే ఆనందించారు. వెనక సింహాసనం మీద కూర్చొన్న ధృతరాష్ట్రుడికీ అదే ఆనందం. - డా॥ముంజులూరి నరసింహారావు -
ఐదోవేదం మహాభారతం...
కొత్త శీర్షిక ప్రారంభం : మహాభారతం పాత్రలు వేరువేరుగా ఉన్న చెట్లన్నీ కలసి ‘వనం’ అనే సమష్టి రూపం తీసుకున్నట్టు వేరువేరుగా ఉన్న ప్రజలందరి మనసు సమష్టి రూపం తీసుకుని ‘దేశ మనస్సు’ అవుతుంది. ‘మహాభారతం’ భారతదేశపు మనసు.దీనికి అక్షరరూపం ఇచ్చి చిరాయువును పోసినవాడు వ్యాసుడు. భారతదేశం తన వికసించిన నాగరికతను వాఙ్మయంలో పొందుపరిచి భద్రం చేసింది. ‘వేదం’ భారతదేశపు అతి పురాతన వాఙ్మయం. అది ఒక్కటే అయినా రాబోయే రోజులలో ధారణకు సులువుగా ఉండాలని వ్యాసుడు దానిని నాలుగుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణవేదం అంటూ విభజించినా వేదంలోని పరమార్థం అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో ‘ఐదో వేదం’గా ప్రసిద్ధికెక్కిన మహాభారతాన్ని రాశాడు. మహాభారతాన్ని ‘ఇతిహాసం’అని అంటారు. ‘ఇతి’ అంటే ‘ఇలాగ’, ‘హ’ అంటే ‘ప్రసిద్ధంగా’, ‘ఆస’ అంటే ‘ఉంది’ అని అర్థం. అంటే ఈ మాటకు ‘ఇలా జరిగిందట’ అని అర్థం. భారతీయులు తమ చరిత్రను రాసుకోలేదన్న అపప్రథ ఒకటి ఉంది. అది నిజం కాదు. అసలు చరిత్ర అంటే మునపటివాళ్ల నడతతో కాపుదలనీ సంరక్షణనీ పొందడమని అర్థం. అదే ఇంగ్లిష్లో హిస్టరీ- హిజ్ స్టోరీ, అతగాడి కథ అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే, గ్రీకు భాషలో హిస్టోరియా అంటే అడగడం, ప్రశ్నించడం, విచారణ చేయడం అని అర్థాలు చెబుతారు. ఏ చరిత్రనైనా, చదివేవాడికి పనికొచ్చే విధంగా రాయాలి. అందుకే తమ చరిత్రను భారతీయులు పురాణాలుగా, ఇతిహాసాలుగా రాసుకున్నారు. మహాభారతం అలాంటి చారిత్రకమైన కథ. అయితే దాన్ని ఐదో వేదమని ఎందుకంటారు? వేదమంటే ‘జ్ఞానం’ అని అర్థం. ‘మహాభారతం’ మన సత్తా గురించిన జ్ఞానం. మనం ఉన్నా లేకపోయినా మన సత్తా, మన ఉనికీ ఎప్పటికీ ఉంటాయి. తరాలు ఎన్ని గడిచినా ఎప్పటికీ చెక్కుచెదరని మన అస్తిత్వం గురించిన జ్ఞానం మనకు ఆనందం కలిగిస్తుంది. మహాభారత చరిత్ర మన ఉనికి గురించి, అస్తిత్వం గురించి ఎరుక కలిగించి మనకు హాయినిస్తుంది. ‘ఉనికీ’ ‘ఎరుకా’ ‘హాయీ ’అనేవే వరసగా ‘సత్’, ‘చిత్’, ‘ఆనందాలు’. వేదార్థమంటే సచ్చిదానందాల కూడికే గనుక మహాభారత చరిత్ర కూడా ఆ సచ్చిదానందాన్నిచ్చేదై ఉండాలి. కథ కథగా సచ్చిదానందాన్ని ఎలాగ ఇస్తుంది? అంచేత ఆ కథలో ఏదో విలక్షణత ఉండి ఉండాలి. అప్పుడుగానీ మహాభారతం వేదంగా చెలామణీ కాలేదు. పాండవులకు బలమూ నేర్పూ ఎక్కువ. ఎక్కువ మందే ఐనా ధృతరాష్ట్రులకు శక్తీ నేర్పూ తక్కువ. అందుకోసం మోసం చేయాలనే కుట్ర జరిగింది. విషం పెట్టి మట్టుపెడదామని చూశారు. వీలుగాలేదు. ధృతరాష్ట్రుడనే రాజుకి వందమంది కొడుకులు. అతని తమ్ముడు పాండురాజుకి ఐదుగురు కొడుకులు. ఈ అన్నదమ్ముల కొడుకులందరూ జ్ఞాతులు. జ్ఞాతులంటే శత్రువులే. ఒకచోట ఇంతమందీ ఉండటం పడలేదు. తక్కువమందే అయినా పాండవులకు బలమూ నేర్పూ ఎక్కువ. ఎక్కువ మందే ఐనా ధృతరాష్ట్రులకు శక్తీ నేర్పూ తక్కువ. అందుకోసం మోసం చేయాలనే కుట్ర జరిగింది. విషం పెట్టి మట్టుపెడదామని చూశారు. వీలుగాలేదు. లక్క ఇంట్లో పెట్టి కాల్చేద్దామని చూశారు. అదీ అడ్డం తిరిగింది. ఇన్నీ విఫలం కావడంతో మోసపు జూదానికి దిగారు. జూదంలో శకుని మాయతో ఓడించి పన్నెండేళ్లు అరణ్యవాసానికి, ఆ పైన ఒక ఏడాది పాటు అజ్ఞాతవాసానికీ పంపించారు. పందెం ప్రకారం పదమూడేళ్లు కాగానే సజావుగా తిరిగి వచ్చినప్పటికీ రాజ్యాన్ని అప్పగించటానికి వాళ్లకు మనసొప్పలేదు. దానితో ఇక యుద్ధమే శరణ్యమైంది. అటూ ఇటూ చాలామందే చచ్చిపోయారు. ఈ కథను ఇలాగ ‘కట్టె, కొట్టె, తెచ్చె’ అనే తీరుగా చెబితే మనకేం లాభం వస్తుంది? అందుకనే వ్యాసమహర్షి కథను అలాగ పేలవంగా చెప్పలేదు. మధ్యలో మరెన్ని విషయాల్నో చెబుతూ ‘దీని ఉద్దేశాన్ని పట్టుకోండి, ఆకళించుకోండి’ అని పదేపదే చెప్పకుండానే చెప్పాడు. ఉద్దేశాన్ని ఆకళించుకోవాలంటే రచనలో వాడుతున్న ప్రతిమాటా ప్రతిపేరూ మనకు అర్థం కావాలి. ఇది దృష్టిలో పెట్టుకొనే వ్యాసుడు మహాభారతంలోని ప్రతిమాటనీ ప్రతిపేరునీ విడబరిచి నిర్వచిస్తూ ఉంటాడు. ఆ వరసలో ‘మహాభారతం’ అనే మాటను కూడా నిర్వచించకుండా వదిలిపెట్టలేదు. మహత్త్వమూ మహాభారమూ ఉన్నది గనక ఇది మహాభారతమైంది అని చెబుతాడాయన. భారం- అంటే సవాలక్ష శ్లోకాల వల్ల వచ్చిన గ్రంథభారం కాదు. ఆ సమయంలో మనుషుల భావాల్లో ఉండే క్రూరత్వమూ వాళ్ల చెడుప్రవర్తనా కూడా భారాలై, యుద్ధాల కిందా రోగాల కిందా దారిద్య్రం కిందా పూర్తిగా వినాశనం చేసే భూకంపాల కిందా అటువంటి ఘోరవిపత్తుల కిందా ఫలిస్తాయి. చరిత్రపరంగా మరోలాగ చెబుతారు. భరత పుత్రుల మహాజన్మమే మహాభారతం అని. ఇంతే అయితే వేదార్థం ఎక్కణ్నించి ఊడిపడుతుంది? వ్యాసుడు చెప్పిన నిర్వచన పద్ధతిని కొనసాగిస్తూ మనమూ దాన్ని నిర్వచించుకోడానికి ప్రయత్నం చేయాలి. ‘భా’ అంటే ప్రకాశమూ దీప్తీ కాంతీ అని అర్థం. ఆ మహాప్రకాశంలో రమింపజేసేదే ఈ మహాభారతం. కథను కథలాగే చదివినా విన్నా ప్రకాశంలో మునిగి దాని అసలు ఉద్దేశమేమిటో అర్థం కాదు. కథను రాసే పద్ధతిని పరిశీలిస్తూ ఉంటే ఎంతో కొంత వెలుగు అవుపిస్తుంది. ఈ మహాభారతాన్ని రాయడానికి వేదవ్యాసుడికి దాదాపుగా మూడు సంవత్సరాలు పట్టిందని చెబుతారు. చరిత్రే అయితే అది వట్టి కథే అయితే మూడేళ్లు పట్టవలసిన పనిలేదు. అదీగాక భారతాన్ని వ్యాసుడు గణపతి చేత రాయించాడని ప్రతీతి ఒకటి ఉంది. ఒప్పందం ప్రకారం వ్యాసుడు గణపతి చేతిగంటం ఆగకుండా ఉండేలాగ గడగడా చెబుతూ ఉండాలి. గణపతి కూడా రాసేదాన్ని అర్థం చేసుకోకుండా రాయకూడదు. అందుకోసం గణపతి అంతటి మహానుభావుడిక్కూడా ఠకీమని అర్థంకాని భోగట్టాలు ‘వ్యాసఘట్టాల’నే పేరన కొన్ని మహాభారతంలో ఉన్నాయి. ఈ కారణంగానే మహాభారత రచనకు మూడేళ్లు పట్టిందని చెప్పడం సబబే. ఆ మూడేళ్లూ వ్యాసుడు సర్వదా దాని గురించే ఆలోచిస్తూ ఆ కథలోనే మునిగి ఉంటూ ‘సతతోత్థితుడై’, అంటే ఎప్పుడూ ఆ కథా ఆలోచనలోనే మెలకువగా ఉంటూ దాన్ని పూర్తిచేశాడు. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ భరతర్షభ! యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్!! (మహాభారతం, ఆదిపర్వం 62-53) ధర్మమూ అర్థమూ కామమూ మోక్షమూ అనేవి నాలుగు పురుషార్థాలు. ధర్మమంటే సృష్టిని మొత్తమూ ధరించి ఉంచేది. ఆ ధర్మం కోసమే మనం సంపాదించే డబ్బంతా పనికి రావాలి. ఆ ధర్మం కోసమే మనం ఎప్పుడూ కోరుకోవాలి. ఆ ధర్మాన్ని అందుకొందామనే ఇక్కడున్న మాయ నుంచీ మోసం నుంచీ బయటపడాలని ఉబలాటపడుతూ ఉండాలి. ఆ విధంగా నాలుగు సూత్రాలుగా ఉన్నా ఇవన్నీ ఒకే- ధర్మం మాత్రమే. పరమాత్మకు రూపమంటూ ఒకటి ఉంటే అది ధర్మరూపమే. ఈ పురుషార్థాల విషయంలో మహాభారతంలో లేనిది మరెక్కడా అవుపించదు. అంటే, ఇక్కడ ధర్మం విశ్వరూపంలో అవుపిస్తుందన్నమాట. ఇంతదాకా మనకు చెప్పిన కథలూ మనకు చూపించిన సినిమాలూ మహాభారతాన్ని ఒక కథలాగే ఒక చరిత్రలాగే చెబుతూ ఉన్నాయి, చూపిస్తూ ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవడంలో ఏదో ఒక వెలితి ఉందన్నమాట. ఆదిపర్వం మొదటి అధ్యాయంలోనే దుర్యోధనుణ్నీ ధర్మరాజునీ వేరువేరు వృక్షాలుగా వర్ణించారు (ఆదిపర్వం 1-110, 111): దుర్యోధనుడు క్రోధమయమైన పెద్ద చెట్టయితే దాని కాండమే కర్ణుడు; దాని కొమ్మలే శకుని; దాన్నిండా ఉన్న పువ్వులూ పండ్లూ దుశ్శాసనుడు; బుద్ధిలేని గుడ్డి ధృతరాష్ట్రుడే దాని మూలం. ధర్మరాజేమో ధర్మమయమైన పెద్దచెట్టు; దాని కాండమే అర్జునుడు; దాని కొమ్మలే భీముడు; దాన్నిండా ఉన్న పువ్వులూ పండ్లూ నకుల సహదేవులు; కృష్ణుడూ వేదమూ బ్రహ్మాన్నెరిగిన బ్రాహ్మణులూ దాని మూలం. కథలోని పాత్రల్ని చెట్టులోని విడివిడి భాగాలుగా చూస్తూ పోతే కథ పూర్తి అర్థాన్ని పట్టుకోలేము. మరైతే,ఈ ఇతిహాసాన్ని ఎలాగ చదవాలి? ఎలాగ చదివి అర్థం చేసుకొంటే ఇది వేదార్థాన్ని మనముందు గుమ్మరిస్తుంది? వ్యాసుడి పద్ధతిలోనే మనం కథలోని పాత్రల్నీ కథలోని వేరువేరు ఘట్టాల్నీ విశ్లేషించి అర్థం చేసుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ వ్యాసాల ముఖ్యోద్దేశం. దీనికోసం మహాభారతంలోని ప్రముఖమైన పాత్రల్ని విడబరుచుకొని అర్థం చేసుకొందాం.